'పక్రృతి, జీవవైవిధ్య పరిరక్షణ' మన సంస్కృతి, ఆచారాల్లో భాగంగా పురాతన కాలం నుండీ కొనసాగుతోంది. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, ఖనిజాల సేకరణ పేరుతో జరిగిన, జరుగుతున్న ప్రకృతి విధ్వంసం, పెద్దపెద్ద ప్రాజెక్టుల నిర్మాణం, పునరుత్పత్తి శక్తికి మించి అడవుల వినియోగం జీవవైవిధ్య విధ్వంసానికి దారితీస్తుంది. ముఖ్యంగా వలసకాలంలో, ప్రపంచీకరణలో ఈ విధ్వంసం ఎన్నోరెట్లు పెరిగింది.
పరిరక్షించే పద్ధతులు..
జీవవైవిధ్యం.. జాతుల పరిరక్షణ.. ప్రధానంగా రెండు పద్ధతుల్లో కొనసాగుతోంది. వివిధ జాతుల నివాస స్థలంలోనే పరిరక్షించడం (ఇన్‌సిటు కన్జర్వేషన్‌్) మొదటి పద్ధతి. సహజ నివాస స్థలాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేయడం రెండో పద్ధతి.
జాతీయ పార్కులు, జీవరక్షిత కేంద్రాలు, ప్రకృతి వనరుల రక్షణ కేంద్రాలు, రక్షిత అడవులు, భద్రతనిచ్చే నివేశిత స్థలాలు నివాస స్థలంలోనే పరిరక్షించే (మొదటి) పద్ధతి కిందకు వస్తాయి. దీనిలో భాగంగా 1936లో '(జిమ్) కార్బెట్ జాతీయ పార్కు' ఏర్పాటు చేయబడింది. ఇటువంటి కేంద్రాలలో ఎటువంటి మానవ కార్యక్రమాలనూ అనుమతించరు. అయితే, రక్షిత ప్రాంతాల్లో మాత్రం కొన్ని పరిమితమైన కార్యక్రమాలను అనుమతిస్తారు. జీవ రక్షిత కేంద్రాలలో వన్యప్రాణులకు రక్షణ కల్పిస్తారు. అయితే, ఈ ప్రాంతాల్లో స్థానిక ప్రజలు ఉండవచ్చు. ఇలా మన దేశంలో ఏడు జాతీయ జీవ రక్షిత కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇదేవిధంగా వన్యప్రాణులను సంరక్షించేందుకు ప్రత్యేక అటవీ రక్షిత కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో (జాయింట్ ఫారెస్ట్ మేనేజిమెంట్ స్కీం) పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. వీటిలో పర్యావరణ, ఆర్థిక కార్యక్రమాల్ని సమన్వయంతో కొనసాగిస్తారు. మన దేశంలో దాదాపు 4.2 శాతం భూభాగంలో స్థానిక జీవ పరిరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్దేశించబడింది. దీనిలో 85 జాతీయ పార్కులు, 448 వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
జంతు ప్రదర్శనశాలలు, వృక్ష సంరక్షిత కేంద్రాలు (బొటానికల్ గార్డెన్స్), అటవీ సంస్థలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ద్వారా నిర్వహించడం 'వేరే ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ కేంద్రాల ఏర్పాటు' (రెండో) పద్ధతి కిందకు వస్తాయి. వీటిలో సాధ్యమైనన్ని పంటలు, జంతువులు, పక్షులు, చేపల రకాలను సేకరించి, స్వేచ్ఛగా పెరుగుతూ జీవించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే లక్ష్యంతో జాతీయ, వృక్ష జన్యు వనరుల బ్యూరో (నేషనలన్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్ రీసోర్సెస్), జంతు జన్యు వనరుల జాతీయ బ్యూరో (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జనటిక్ రీసోర్సెస్) తదితర సంస్థలు మన దేశంలో ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో లక్షలాది జాతుల జన్యువులు భద్రపరచ బడ్డాయి. ఇతర ప్రాంతాల నుండి తెచ్చి, పునరుత్పత్తి చేసి పూర్తిగా అంతరించిన నివాస స్థలాల్లో విడుదల చేసి, మళ్లీ పెరిగేలా దోహదపడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ విధంగా ప్రత్యేక మొసలి జాతి (గంగానదిలోని ఘర్‌వాల్ రకం) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో విడుదల చేయబడినాయి. విత్తన బ్యాంకులు, వృక్ష, ఫల సంరక్షిత (బొటానికల్, హార్టికల్చరల్ రిక్రియేషన్) తోటలు కూడా ఇలా వృక్షజాతుల్ని పరిరక్షించడానికి ఉపయోగపడుతున్నాయి. స్థానిక పరిరక్షణా కార్యక్రమాలకు తోడు బయట పరిరక్షణా కార్యక్రమాలు అదనంగా తోడ్పడుతున్నాయి.
జన్యు బ్యాంకులు..
ఇది అత్యంత ఆధునిక పద్ధతి. పునరుత్పత్తి కాగల రూపంలో ప్రత్యేకంగా ఏర్పర్చిన జన్యు బ్యాంకుల్లో వివిధ జంతుజాలాల 'జన్యువులను' సేకరించి, నిల్వ వుంచుతారు. ముఖ్యంగా సేద్యమయ్యే వృక్ష జాతుల వైవిధ్యాన్ని (విత్తన రూపం) పరిరక్షించడానికి ఈ బ్యాంకులు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అంతరించే ప్రమాదంలో వున్న జంతువుల ఆడ, మగ జన్యు కణాల్ని కూడా నిల్వ వుంచడానికి ఈ బ్యాంకులు ఉపయోగపడు తున్నాయి. విత్తన బ్యాంకులు, 'కణజాల (టిష్యూ)' బ్యాంకులు, మొగ్గలు, ఇతర వృక్షభాగాల కణజాలాల్ని నిల్వ వుంచుతున్నారు. 'అతి శీతల' బ్యాంకుల్లో విత్తనం లేక అండాన్ని ద్రవ నత్రజనిలో -196 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ వుంచుతారు. అంతరించే ప్రమాదంగల జీవుల్ని పరిరక్షించడానికి ఇవి తోడ్పడతాయి. 'పుప్పొడి' బ్యాంకుల్లో నిల్వ వుంచిన పుప్పొడి నుండి అంతరించే ప్రమాదంగల మొక్కల్ని ప్రత్యేక సాంకేతికంతో పునరుద్ధరించవచ్చు.
క్షేత్రస్థాయి జన్యు బ్యాంకులు
జన్యువుల పరిరక్షణ కోసం క్షేత్రాల్లో వైవిధ్యభరితమైన మొక్కల్ని పెంచుతూ పరిరక్షించవచ్చు. తద్వార అన్ని మొక్కల లక్షణాలనూ, వైవిధ్యాల్ని గుర్తించి, రికార్డుల్లో నిక్షిప్తం చేయవచ్చు. అయితే, దీనికి ఎక్కువ భూమి, వనరులూ అవసరమవుతాయి. ఈ విధంగా కేంద్ర వరి పరిశోధనా సంస్థ కటక్‌లో 42 వేల వరి రకాల్ని దాచిపెట్టింది. ఇలా భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఇఆర్) మన దేశంలో దాదాపు అన్ని పంటల్లోని రకాల్ని సేకరించి, పరిరక్షిస్తుంది. ఫిలిఫైన్స్‌లోని మనీలా వద్దగల అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రంలో లక్షకు పైగా వరి రకాలు పరిరక్షింపబడు తున్నాయి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ.
అంతర్జాతీయ కృషి...
జీవవైవిధ్య సదస్సు (కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ) 1993 డిసెంబరులో ప్రారంభమైంది. ఇదేవిధంగా ఆహారం, వ్యవసాయం కోసం వృక్ష, జంతు వనరుల అంతర్జాతీయ ఒప్పందం 2004 నుండి ప్రారంభమైంది. ఈ రెండు సంస్థలూ ప్రపంచంలో దొరికే అన్ని జీవజాతుల పరిరక్షణా కార్యక్రమాలను సమన్వయపరు స్తున్నాయి. జన్యువును అందించిన దేశం యొక్క హక్కుల్ని పరిరక్షిస్తూనే ఇతర దేశాలకు అవసరమైనప్పుడు వారు కోరిన గుణగణాలు కలిగిన రకాల్ని అందించడానికి ఈ సంస్థలు తోడ్పడుతున్నాయి. పరస్పర అంగీకారంతో ఇది జరుగుతుంది. ఇలా సేకరించే దేశాలు తమ తమ చట్టాలకు లోబడి 'క్వారంటీన్' నిబంధనల్ని పాటిస్తున్నాయి.
ప్రాధాన్యత.. హాట్-కోల్డ్ స్పాట్స్..
ప్రపంచస్థాయిలో పరిరక్షించాల్సిన జీవజాతుల్ని ప్రాధాన్యతతో గుర్తించి, ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్ రెడ్ లిస్టును ప్రకటిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారం 'హాట్ స్పాట్స్'గా గుర్తించడానికి ఒకేచోట 1500లకు పైగా జాతులు ఉండాలి. ఈ జాతుల్లో 70 శాతం వైవిధ్యం తరిగిపోవాలి. జీవవైవిధ్యం గల ఈ హాట్ స్పాట్‌లను గుర్తించి, అంతరించే జాతుల్ని పరిరక్షించాలి. కానీ, వీటిని గుర్తించడం ఖర్చుతో కూడికున్న ప్రక్రియ. ఒకే ప్రాంతంలోని జీవవైవిధ్యాన్ని తెలపడాన్ని 'కోల్డ్ స్పాట్స్'గా గుర్తిస్తున్నారు. 'హాట్-కోల్డ్ స్పాట్'ల గుర్తింపు పరోక్షంగా జీవవైవిధ్య వ్యాప్తిలో కొన్నిచోట్ల కేంద్రీకరణ చూపుతుంది. ఉదాహరణకు కేవలం 25 హాట్ స్పాట్‌లు భూభాగంలో కేవలం 1.4 శాతం మాత్రమే ఆక్రమిస్తున్నాయి. వీటిలో అన్ని ఉన్నత వృక్ష జాతుల్లో 44 శాతం, వెన్నెముకగల నాలుగు గ్రూపుల్లో 35 శాతం జాతుల్ని గుర్తించారు. ఈ హాట్ స్పాట్‌లలో కేంద్రీకరించి, కొద్ది ఖర్చుతో ఎక్కువ జీవవైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు. ఈ కోల్డ్ స్పాట్‌లలో జీవవైవిధ్యం హాట్ స్పాట్‌ల కన్నా 10 రెట్లు వేగంగా అంతరిస్తుంది. ఒకవేళ హాట్ స్పాట్‌ల పరిరక్షణకే పరిమితమైతే స్టెఫీలు (ఒక విధమైన గడ్డిజాతి పెరిగే ప్రాంతం), సెరింగేటీ, అర్కెటిక్ లేదా టైగా ప్రాంతాలు జీవవైవిధ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
కమ్యూనిటీ విత్తన బ్యాంకు..
మన రాష్ట్రంలో మెదక్ జిల్లాలో జహీరాబాద్ మండలంలో ప్యాలవరం గ్రామంలో 34 మంది మహిళా రైతులు కమ్యూనిటీ జన్యు (విత్తన) బ్యాంకులను నిర్వహిస్తున్నారు. బెట్టను తట్టుకోగల చిరుధాన్యాల (రాగి, కొర్రలు తదితర) పంటల్లో స్థానికంగా దొరికే రకాలను పరిరక్షిస్తున్నారు. వీరంతా 'మనుగడ సేద్యం' చేస్తున్నారు. వీరు పరిరక్షించే రకాలన్నీ బెట్ట పరిస్థితుల్ని తట్టుకోడానికి దోహదపడుతున్నాయి. పెరుగుదలకు అవసరమైన పోషకాల్ని అందించగలుగుతున్నాయి. ఇంత సంక్షోభ సమయంలో కూడా వీరు తమ పంటల వైవిధ్యాన్ని కాపాడుకొంటూ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొని, జీవించ గలుగుతున్నారు. వీరిలో ఆత్మహత్యలు లేవు. స్థానిక పరిస్థితులకు అనుగుణమైన జన్యుపర వైవిధ్య పరిరక్షణ అవసరాన్ని నిర్ధారించడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇలా మరెన్నో కమ్యూనిటీ జన్యు (విత్తన) బ్యాంకులు కావాలి.
ఇక్రిశాట్ కార్యక్రమాలు..
హైదరాబాద్‌లోని ఈ అంతర్జాతీయ సంస్థ జొన్న, సజ్జ, మంచి శనగ, కంది, వేరుశనగ, చిరుధాన్యాలు (రాగి, కొర్ర తదితరాలు) పంటలపై పరిశోధనల్ని కొనసాగిస్తోంది. ఈ పైర్లన్నింటిలో ప్రపంచంలో వున్న వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా అన్నిరకాల విత్తనాల్ని సేకరించి, పరిరక్షిస్తోంది. పునరుత్పత్తిని పరిరక్షించ డానికి విత్తనాల్ని నియంత్రిత ఉష్ణోగ్రత, తేమల వద్ద నిల్వ చేస్తోంది. దీనివల్ల పునరుత్పత్తి చేయవలసిన అవసరం తగ్గిపోతుంది. పునరుత్పత్తి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా, పునరుత్పత్తి సమయంలో ఒకోసారి జన్యుమార్పులు జరిగే ప్రమాదమూ వుంది. వీటికి తోడు వేరుశనగ, మంచిశనగల మూల రకాలు (వైల్డ్ వెరైటీస్) అవసరమైన పరిమాణంలో గింజల్ని ఇవ్వవు. వీటిని గ్రీన్‌హౌసుల్లో మామూలు చెట్లమాదిరి పెంచుతారు. అయితే, కంది, జొన్న, సజ్జ మూల రకాల్ని మామూలుగా క్షేత్ర జన్యు బ్యాంకుల్లో పెంచుతారు.
ఈ సంస్థ హైదరాబాద్‌లో మూడు స్థాయిల్లో జన్యు బ్యాంకుల్ని నిర్వహిస్తుంది. స్వల్పకాలంలో నిల్వ వుంచడానికి 18-20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో 30-40 శాతం తేమ వద్ద విత్తనాల్ని నిల్వ వుంచుతుంది. మధ్యకాలిక జన్యు బ్యాంకుల్లో 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో 20-30 శాతం తేమ వద్ద విత్తనాల్ని నిల్వ వుంచుతుంది. దీర్ఘకాలం జన్యువుల్ని -20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ వుంచుతుంది. దీనికి బాధ్యతగల అన్ని పంటల్లో ప్రపంచంలో దొరికే వేలరకాల్ని సేకరించి, నిల్వ చేస్తుంది. వీటన్నింటినీ ఇలా నిల్వ చేయడంవల్ల పరిరక్షిస్తుంది. వీటిలో అభిలషించే లక్షణాలు గల ఆడ, మగ రకాల్ని తీసుకుని ప్రజననం ద్వారా కొత్తరకాల్ని రూపొందిస్తారు. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అవసరమైన దేశాలకు ఉచితంగా విత్తనాల్ని అందిస్తారు. అయితే, ఇలా విత్తనాల్ని పొందే దేశాలు అంతర్జాతీయ నియమ, నిబంధనలకు లోబడి వినియోగించాలి.
No comments:
Post a Comment