-
ఎందుకని? - ఇందుకని!
- ఎ.భారతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జగన్నాయకపుర, తూర్పుగోదావరి జిల్లా
మనిషి సకలజీవుల్లోకెల్లా అత్యున్నతంగా పరిణ మించిన జీవి. పంచేంద్రియాలన్నీ బాగా అభివృద్ధి చెంది ఉండడం వల్ల ప్రకృతి గురించిన పరిజ్ఞానం, తదనుగుణంగా ప్రకృతి చేసే అడ్డంకుల్ని అధిగమించగల నేర్పు, కూర్పు మనిషికే ఎక్కువ. మనుషులు సూర్యుని వెలుతురు ఉన్నప్పుడు (పగలు) తమ జీవన కార్యకలాపాలు చేసుకునే క్రమంలోనే ఆహార సముపార్జన, వినిమయం వంటి ప్రధాన విషయాలు పగలే పూర్తిచేసుకుంటాడు. తిరిగి మరుసటిరోజుకు అదే ఉత్సాహంతో తయారుకావాలంటే తగిన విశ్రాంతి కావాలి కాబట్టి సూర్యుని వెలుతురు లేనపుడు (రాత్రుళ్లు) నిద్రపోతాడు. కాబట్టి మనిషి నిశాచరి (nocturnal) కాదు. చుట్టుపక్కల కాంతి అంతగాలేని రాత్రిళ్లు సంచారం చేయవలసిన అవసరంగానీ, తనక్కావలసిన వస్తువుల్ని, ఆహారపదార్థాల్ని, జీవుల్ని అంత చిమ్మచీకట్లో, గుడ్డి వెలుగులో పరికించి చూడాల్సిన అగత్యంగానీ మనిషికి లేదు. అందువల్ల కంటి నిర్మాణం దేహ నిర్మాణం (anatomically) లో అంతర్భా గంగానే సాధారణ పగటి వెలుగుకు అను వుగా తీర్చిదిద్దుకుంది. రంగుల్ని అన్ని జంతు వులకంటే బాగా చూడగలగడం, సుమారు 1800 కోణ విస్తారంలో ముందున్న దృశ్య చట్రాన్ని (visual frame) ద్విదృశ్య త్రిమితీయ దృష్టి (binocular stereoscopic vision) సామర్థ్యంతో పరికించ గలగడం కేవలం మనిషికే వీలైంది. కానీ పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, కుక్కలు, గబ్బిలాలు, గుడ్లగూబలు, కొన్నిరకాల చతుష్పాద క్షీరదాలు (tetrapodic mammals) నిశాచరులు. పగలు అవి అంతో యింతో విశ్రాంతి తీసుకుని రాత్రిళ్లు సంచరి స్తాయి. కాబట్టి, వాటి కంటి నిర్మాణం అతి తక్కువ వెలుగును కూడా చూసేలా రూపు దిద్దుకుంది. పిల్లికి మనిషిలాగే చాలా విషయాల్లో కంటి నిర్మాణంలో సామీప్యత ఉంది. కనురెప్పలు ఇద్దరికీ ఉన్నాయి. అయితే పిల్లికి అదనంగా మరో పాక్షిక పారదర్శక (semi transparent) కంటిరెప్ప ఉంటుంది. ఇరువురికీ కంటిపాప (pupil) ఉంది. అయితే మనిషి కన్నులోని కంటిపాప కెమెరాలోని ఐరిస్ (iris) లాగా ఎల్లప్పు డూ వృత్తాకారంలోనే పెద్దగా చిన్నగా వ్యాకోచ, సంకోచాలు (అక్కడున్న ప్రత్యేక కండ రాల అమరిక ద్వారా) చేయగలదు. మనకు ఇప్పుడు ప్రభుత్వం వారు ఇస్తున్న ఆధార్ కార్డ్స్‌లో కంటి ఫొటో తీయడం అంటే ప్రధానంగా ఈ కంటిపాప చుట్టూ ఉన్న ఐరిస్ కండర పొందికలోని గజిబిజి కండరపోగుల విన్యాసాన్ని (fabric of muscle fibres) ఫొటో తీయడమే. చేతిలోని వేలిముద్రల కన్నా విశిష్టమైనవి ఈ ఐరిస్ కండ రపోగుల విన్యాసం. ఏ ఇద్దరి మనుషులకూ ఇది ఒకే తీరుగా ఉండదు. అయితే పిల్లికి ఈ కంటిపాప గుండ్రంగా ఎక్కువ, తక్కువ సందుయిచ్చే వ్యాకోచ సంకోచాలు చేయ దు. కేవలం నిలువుగా గోధుమగింజలాగా లేదా బాదంపప్పు రూపంలో సన్నగా లేదా విస్తారంగా మారుతుంటుంది. మనిషిలాగే పిల్లికి కూడా కంటి కటకం (eye lens) ఉంది. మనిషిలాగే పిల్లికీ రెటీనా ఉంది. అయితే ఈ రెటీనాలో మనిషికున్నన్ని రాడ్లు, కోన్లు (rods and cones) ఉండవు. ఎదుట ఉన్న వస్తువు నుంచి పరావర్తనం చెందిన కాంతి తీవ్రత (light intensity) ను యిదమిద్ధంగా గుర్తించి, వస్తువులోని ఉపరితల రూపురేఖల్ని (topology), వెలుగునీడల్ని (visual contours) సరిగా అంచనా వేయడానికి రాడ్లు ఉపకరిస్తాయి. వస్తువుకున్న రంగుల్ని ఆరాతీయడానికి అద్భుతమైన ప్రకృతిలోని సకల రంగుల్ని ఆస్వాదించడానికి మనిషికి ఉపకరించేవి కోన్లు. ఇవి పిల్లుల్లో చాలా తక్కువ. అందుకే పిల్లికి రెండుమూడు రంగుల్ని మినహాయించి సప్తవర్ణాల్ని, వాటి సంశ్లేషణ (combination) ద్వారా సఫలమయ్యే వేలాది వర్ణవైవిధ్యాల్ని (colour combinations) పిల్లి చూడలేదు. రాత్రిళ్లు కాంతి చాలా తక్కువ కావడం వల్ల వస్తువు మీద పడే కాంతే తక్కువైతే, అది పరావర్తనం చెంది కంటికి చేరే కాంతి ఇంకా తక్కువ ఉంటుంది కదా! అందువల్లే చిమ్మచీకట్లో మనం (మనిషి) వస్తువుల్ని చూడలేము. కానీ పిల్లి చీకట్లోనే ఆహార సంపాదన, ఎలుకల వేట, దొంగతనంగా పాలు, పెరుగు తాగేయడం వంటి ఘనకార్యాలు చేయాలి కాబట్టి ఎలా? అందుకే ప్రకృతి సిద్ధంగా పిల్లి కంట్లో ఓ నిర్మాణం ఉంది. అది రెటీనా వెనుక ఓ అదనపు పొరలాగా, పుటాకార దర్పణం (concave mirror) లాగా రెటీనాకు వెనువెంటనే ఉంటుంది. దానిపేరు టేపిటమ్ ల్యూసిడమ్ (tapetum lucidum) . ఇది అద్దంలాగా కాంతిని పరావర్తనం చేయగలదు. అంటే మనకులా గానే చిమ్మచీకట్లో బాగా విప్పారిన కంటిపాప గుండా కాంతి కంటి కటకం మీద పడి అక్కడ్నుంచి ఆ కాంతి వక్రీభవనం (refraction) ద్వారా సంపుటీకరణం (collective) చెంది రెటీనా తెరపై కేంద్రీకరించుకుంటుంది (convergence) . అయితే ఆ కాంతి తీవ్రత అంత ఎక్కువగా అందకపోవడం వల్ల మనలాగే పిల్లికీ దృశ్యం ఏమీ కానరాని గడ్డు పరిస్థితి దాపురించే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడే మనకు లేనిది, పిల్లి వంటి నిశాచర జంతువులకున్నది అయిన టేపిటమ్ ల్యూసిడమ్ ఈ తోడ్పాటు నందిస్తుంది. రెటీనా మీద పడ్డ కాంతి చాలామటుకు దూసుకెళ్లి ఈ టేపిటమ్ ల్యూసిడమ్ పొరపై పడుతుంది. ఇది అద్దంలా ఉండడం వల్ల చాలా కాంతి తిరిగి రెటీనా మీద పడుతుంది. తద్వారా ఉన్నది తక్కువ కాంతే అయినా అది రెటీనాకు, టేపిటమ్ ల్యూసిడమ్‌కి మధ్య పదే పదే అంతర పరావర్తనం చెందడం వల్ల పిల్లికి వస్తువు దృశ్యం బాగానే కనిపిస్తుంది. పిల్లి కళ్ళు రాత్రిళ్లు మెరవడానికి కారణం ఈ టేపిటమ్ ల్యూసిడమ్ పొర అద్దంలాగా పనిచేయడమే. మనం టార్చిలైటు వేసినపుడు ఆ కాంతి ఈ పొరమీద పడి పరావర్తనం చెందడం వల్ల పిల్లికళ్లు మెరుస్తున్నట్లు అనిపిస్తుంది. ఎద్దులు తదితర జంతువుల విషయంలో కంటిపాప రాత్రుళ్లు బాగా విస్తరించు కోవడం వల్ల రెటీనానే అద్దంలాగా పనిచేసి, కాంతి పరావర్తనం చెంది మెరుస్తున్నట్లు కనిపిస్తుంది.
No comments:
Post a Comment