వారఫలాలు విరుద్ధ ధోరణులు.. (1)
-
విశ్వాసాలు.. వాస్తవాలు...
''ఎందుకురా? ఏం మంచి జరిగింది?'' అడిగాను నేను.
''ఈ పేపరు చూడరా!'' అంటూ ఆ రోజు ఆంధ్రజ్యోతి పత్రికను నాకిచ్చాడు.
''ఏముంది ఇందులో విశేషం?'' అడిగాను ఆ పేపరు ఎందుకిచ్చాడో అర్థంకాక.
''ఇందులోనా వారఫలం చూడు. ''నాది ధనుస్సు రాశి. ఏముందో చూడు.'' ఈ వారం చాలా విధాల మనశ్శాంతి ఇస్తుంది'' అని ఉంది. అందుకే నాకు ఎంతో ఆనందంగా ఉందిరా?'' అన్నాడు.
నేను నవ్వుతూ, నా చేతిలోని ఆ రోజు ''ఆంధ్రప్రభ'' ఇచ్చి ధనుస్సు రాశి ఫలాలు చదవమని చెప్పా. ఇలా ఉంది. ''ఈ వారం మీకు తీవ్ర ఆందోళన కలుగుతుంది.'' అంతే! వాడి మొహం వాడిపోయింది! చాలా బాధపడసాగాడు. వాణ్ణి ఓదారుస్తూ ఇలా అన్నాను. ''ఒరేరు! సత్యం! బాధపడకురా! ఈ వారఫలాలన్నీ ట్రాష్‌రా! పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఏది నమ్మకు. కావాలంటే నీకో ఉదాహరణ ఇస్తాను. నీ ధనుస్సు రాశి వాళ్లలోనే ఓ యువకుణ్ణి, ముసలివాణ్ణి, పసిపిల్లవాణ్ణి కలిపి మంచి మండుటెండలో నిలబెట్టు. ఐదునిముషాలలో పసిపిల్లవాడు, మరో నాలుగైదు నిముషాలలో ముసలివాడు వడదెబ్బకు కింద పడిపోతారు. యువకుడు మరికొన్ని గంటలయినా అలానే ఉండగలడు. సూర్యుని యొక్క వేడిమి ఒక్కటే. కాని ఫలితం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటున్నప్పుడు ఆ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల చలనాల యొక్క ఫలితం మాత్రం ఒకే రకంగా ఉంటుందా? అసలు సూర్యుని చుట్టూ భూమి వంటి గ్రహాలు తిరుగుతున్నాయనే విషయమే తెలియక, ఇంకా భూకేంద్రక సిద్ధాంతాన్నే నమ్మి లెక్కలు వేసే జ్యోతిష్యుల మాటలు నమ్మడం ఎంత వరకు సబబు? దీనికి రుజువు ఈ రెండు పత్రికలలోని మిగిలిన రాశుల వార ఫలాలను పట్టికలో పరిశీలిద్దాం'' అని చెప్పాను. ఇలా పరిశీలనలో కొన్ని ముఖ్యమైన ఫలితాలు పట్టికలో చూడండి.
''ఇప్పుడు చెప్పు సత్యం! నీకేమనిపిస్తోంది. ఈ రాశిఫలాలన్నీ గ్రహగతులను లెక్కించి రాసినవా? ఏదో తోచినట్లు వ్రాసినవా??'' అని అడిగాను.
''కచ్చితంగా ఎవరికి తోచినట్లు వారు రాసినవే. పై ఇద్దరు జ్యోతిష్యులూ గ్రహగతులు గణించడం తెలిసినవారైతే, ఇద్దరికీ ఒకే రకమైన గ్రహగతులు తెలియాలిగదా? అప్పుడు ఒకేరకమైన ఫలితాలు రావాలిగదా?'' అన్నాడు సత్యం.
''జ్యోతిష్యులకు గ్రహాల చలనాలు తెలియవనే విషయం ఎప్పుడో క్రీ.శ. 7వ శతాబ్దంలోనే కల్హనుడనే మహాకవి చెప్పాడు'' అన్నాను.
కల్హనుడు ఏం చెప్పాడు''? నవ్వుతూ అడిగాడు సత్యం. 'కల్హనుడు' తన రాజ తరంగిణి'' అనే గ్రంథంలో ఏమన్నాడంటే, ''జ్యోతిష్య పండితులారా! ఆకాశంలో గ్రహాల చలనాన్ని లెక్కించి, వాటి కారణంగా మానవుల జీవితాలలో సంభవించే శుభాశుభ ఫలితాలను చెప్పగలమని చెప్పుకుంటున్నారు. పిచ్చివాళ్లలారా! దుర్వ్యసనాల పాలైన మీ కుమారులు దొడ్డి దోవన ఎంత సొమ్ము తీసుకొనిపోతున్నారో, వారి చలనాన్నిగానీ, దానివలన మీకు సంభ వించబోయే దుష్ఫలితాన్నిగానీ తెలుసుకోలేని మీరు, ఆకాశంలోని గ్రహగతుల ఫలితాన్ని ఇతరులకు చెప్తామనడం ఎంతటి అమాయ కత్వం?' అన్నాడు. ఇదీ జ్యోతిష్య పండితుల విజ్ఞాన బండారం. ఇక చివరగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారంలోనున్న ఒక జోక్ చెబుతాను విను. ఒక పత్రికకు ఒక జ్యోతిష్యుడు వారఫలాలను ప్రతివారం శనివారం నాటికి పంపేవాడట. ఒక శనివారం సాయంత్రం అయినా ఆ పండితుడి నుంచి వారఫలాలు రాలేదట. దానికి కంగారుపడి ఆ పత్రిక ఎడిటర్, ఆ పండితుడికి ఫోన్ చేసి ''అయ్యా! ఎవరైనా మనిషిచేత ఒక గంట లోపల పంపండి'' అని అడిగాడు. దానికాయన ఏమన్నాడో తెలుసా? ''ఎడిటర్‌గారూ! కంగారు పడకండి. కిందటి వారం ప్రచురించిన వారఫలాలలో, మేషరాశివి మీనరాశికీ, వృషభరాశివి మకరరాశికీ ఇలా మార్చి ప్రచురించండి. పాఠకులు ఆ ఫలితాలే మేము గణించి చెప్పిన వనుకుంటారు. ఇదీ జ్యోతిష్యుల గణన బండారం'' అన్నాను.
''భలే చెప్పావురా. ఈ జ్యోతిష్యుల బండారం అర్థమయింది. ఇక వీళ్లను నమ్మనే నమ్మను. నవ్వుతూ అన్నాడు సత్యం.
కె.ఎల్.కాంతారావు,జన విజ్ఞాన వేదిక.
___________________________________________________________________
మహిమలా?.. మామూలు విషయాలా? (1)
'దానికి సమాధానం చెబుతానమ్మా' అంటూ నేను జాగ్రత్తగా దాచిపెట్టిన పేపర్ కటింగ్‌ల నుండి 18.1.2009 నాటి ప్రజాశక్తిలోని ఒక వ్యాసం తీసి ఆమెకు చూపుతూ 'ఈ వ్యాసంలోని ఫొటో చూడమ్మా. ఇదే ఆ పంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని సిద్ధాంతం అనే ఊళ్ళో జరిగింది. ఆ పంది ప్రదక్షిణలు చేసే సమయంలో ఎవరైనా పళ్ళూ, ప్రసాదాలూ పెట్టినా, వాటిని తినలేదటమ్మా' అన్నాను.
'అవును మామయ్యా! అది ఆ పందికి ఉన్న భక్తి వల్లే గదా?' అంది సౌజన్య.
'ఆ విషయమే వివరిస్తానమ్మా. ఆ పంది కొన్ని గంటలు అలా తిరిగి ఆఖరికి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే కొందరు వైద్యులు వచ్చి విజయవాడ ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి తరలించారు. ఆ వైద్యులు ఆ పందికి 'ఎన్‌సెఫిలో మెనింజైటిస్' (మెదడువాపు) అనే వ్యాధి వచ్చిందని నిర్ధారించారు. వారంరోజులు దానికి వైద్యం చేశారు. ఫలితంగా పందికి ఆ వ్యాధి తగ్గిపోయింది. ఇప్పుడు అది గుడి చుట్టూ తిరగటం మానేసింది. అరగంటకో స్నానం ఆపేసింది. మామూలుగా ఇప్పుడు బురదలో పొర్లుతోంది. వ్యాధితో ఉన్నప్పుడు ఆహారం సంగతి ఏమీ పట్టని పంది ఇప్పుడు ఏదిబడితే అది తింటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ పంది ఇతర పందుల్లాగే బతుకుతోంది. ఇదీ 'పంది భక్తి' అనే మహిమకు సంబంధించిన అసలు విషయం' అన్నాను నేను.
'మరి ఒకసారి పేపర్లలో గణేశుని రూపంలో బొప్పాయి కాయ ఉందనీ, దానికి ప్రజలు పూజలు చేస్తున్నారనీ వచ్చింది. అది మహిమ కాదా?' సౌజన్య మరో ప్రశ్న సంధించింది. 'నీవు చెప్పిన బొప్పాయి గణేశుడు ఇదుగోనమ్మా' అంటూ 'ది హిందూ' పత్రికలోని గణేశుని రూపంలో ఉన్న బొప్పాయి కాయ బొమ్మను (చిత్రం-1) చూపించాను. దానికి సమాధానం కూడా ఇదుగోనమ్మా' అంటూ 'బాతు ఆకారంలో ఉన్న బొప్పాయి' బొమ్మను (చిత్రం-2) కూడా చూపించాను. 'ఇది చూడు. బంగాళ దుంపలో శిలువ గుర్తు (చిత్రం-3). ఇది ఒక హోటల్‌లో చిప్స్ తరుగుతుండగా కనిపించింది. దానికి ఆ హోటల్ యజమాని, కుటుంబ సమేతంగా ప్రార్థన చేశారట. ఈ ఫొటోలు చూడు. పాములాగా కనిపిస్తున్న మునగకాయ (చిత్రం-4). వ్యోమగామి లాగా కనిపిస్తున్న కారట్ (చిత్రం-5), 'హృదయ' ఆకారంలో కనిపిస్తున్న టమాటో (చిత్రం-6). ఇది చూడు పిట్టలాగా కనిపిస్తున్న చెట్టు కొమ్మ (చిత్రం-7).
వీటిలో భగవంతుడి రూపంలోనో, మత చిహ్నంగానో కనిపిస్తున్న ఆకారాలకు పూజలు, ప్రార్థనలు చేశారు. 'హృదయ' చిహ్నాన్ని యువత మాత్రమే దర్శించారు. మిగిలిన బొమ్మలను ఎవరూ పట్టించుకోలేదు. అసలు విషయమేమంటే చిత్రం-1 నుండి చిత్రం-6 వరకూ ఆ కాయలకు ఆయా రూపాలు రావడానికి కారణం మొక్కల్లోని 'ఉత్పరివర్తనాలే'. ఉత్పరివర్తనాల వల్ల మొక్కలే కాదు, జంతువుల పిల్లలూ, మానవ శిశువుల్లో కూడా వింత వింత ఆకారాలు కనిపించాయి.
ఇకపోతే, ఈ చివరి బొమ్మ (చిత్రం-7) కు ఈ రూపు రావడానికి కారణం చెట్ల కొమ్మ ఆ రూపంలోకి మారడమే. విచిత్రమేమంటే తెనాలిలో ఒక కొమ్మ విరిగి పోయి, దాని మూలం ఉబ్బెత్తుగా కనిపిస్తుంటే, దానిని హనుమంతుని మూతిగా భావించి, ఆ ఉబ్బెత్తు భాగానికి కుంకుమ పూసి, పూజలు చేయడం నేను స్వయంగా చూశాను. ఇవన్నీ ప్రకృతిలో సహజంగా సంభవించే మామూలు వింతలు, విశేషాలు. మహిమలు కావు. ఇదీ అసలు సంగతి!' అని వివరించాను.
(మరికొన్ని వచ్చే వారం)
________________________________________________________
మహిమలా?.. మామూలు విషయాలా? (2)
-
విశ్వాసాలు.. వాస్తవాలు...85
'మరి ఒక శివాలయంలోకి తాచుపాము వచ్చిందనీ, అది శివలింగం మీదకి పాకిందనీ, లింగం వెనుక చుట్టుకొని ఉందనీ ఒకసారి టి.వి. ఛానళ్ళలో చూపించారు. అది శివుడు మహిమకు చిహ్నం కాదా?' ప్రశ్నించింది సౌజన్య.
'పాము శివుణ్ణి చుట్టుకోవడానికీ, లింగం వెనుకకు చేరడానికీ కారణం పాముకు సహజంగా ఉండే భయమేనమ్మా! పాములు మనుషుల్ని చూసి పారిపోతాయి. వీలుంటే బాగా భయపడి, ఆత్మరక్షణలో మనుషుల్ని కాటేసి పారిపోతాయి. ఈ వార్త చూడమ్మా. 14-3-1998 'వార్త' పత్రికలో వచ్చింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరులో 'ప్రతినిత్యం భక్తితో శివుని పూజించే ప్రముఖ కవి పొత్తూరి వీరరాఘవ వరప్రసాదశర్మ మనుమడైన ఫణీంద్ర (5) శివాలయంలో ఆడుకొంటుండగా నాగుపాము కాటు వేయడంతో చనిపోయా డు.' ఇది వార్త. ఇది ఎలా సంభ వం? ఆ పిల్లవాడు ఆట మధ్య లో చూడకుండా ఆ పాముని తొక్కి ఉంటాడు. అది ఆ పిల్లవాడిని కాటేసి, పారిపోయి ఉంటుంది. శివలింగం వెనుకకో, అలమరాలోని పుస్తకాల మధ్యకో వెళ్లి దాక్కోవడం పాముకి ఎంత సహజగుణమో, తనను తొక్కిన పిల్లవాడిని కాటేయడం కూడా దానికి అంతే సహజగుణం. మొదటిదానిలో ఏ మహిమా లేదు. రెండవదానిలో వింతా లేదు. అవి ప్రకృతి సహజ విషయాలు' అని ముగించాను.
సౌజన్య అర్థమైందన్నట్టుగా నవ్వుతూ తల ఊపింది.
'అయితే మహిమలేమీ లేవంటావ్?' లోపలికి వస్తూనే ప్రశ్నించాడు సుబ్బారావు. అతని చేతిలో 'మహిమలా? మామూలు విషయాలా?' అన్న వ్యాసం ప్రచురించబడిన 'ప్రజాశక్తి' పత్రిక ఉంది.
'అవును గానీ నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చో. మాట్లాడుకుందాం' అన్నాను నేను.
సుబ్బారావు కూర్చున్నాడు. 'మరి ఆ మధ్యన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని శివాలయంలో శివలింగం ఒక్కసారిగా ఎత్తు పెరిగిందని పేపర్లలో వచ్చింది. ఇది శివుడి మహిమా? కాదా?' అని అడిగాడు.
నేను లోపలికి వెళ్లి ఒక ఫైల్ తెచ్చి అందులో నుండి ఒక పేపరు తీశాను. 'ఇదిగో సుబ్బారావ్! నువ్వు పేర్కొన్న శివలింగం. 17-12-2010 నాటి ఆంధ్రజ్యోతిలో ఆ శివలింగం గురించి వచ్చిన వార్త ఇదిగో. అలాగే టివీ9లో కూడా దీని గురించి ప్రసా రం చేశారు. వార్త ఏమిటంటే.. ఆ శివలింగం ఒక్క సారిగా ఒకటిన్నర అంగుళాలు పెరిగి, పక్కకు ఒరిగింది. పానువట్టానికి, లింగా కారానికి మధ్య ఖాళీ ఏర్పడి, శివలింగంపై పోసిన పాలు, పెరుగు, నీరు శివలింగం వెంబడి కిందికి వెళ్ళిపోయినాయి. ఈ పరిస్థితి మొగల్తూరు శివాలయంలోనే కాదు. గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాల్లోని అన్ని శివాలయాల్లోనూ, గోదావరి నీటిమట్టం పొంగినప్పుడల్లా ప్రతి ఏడూ వస్తుంటుంది.
దీనికి కారణాన్ని హిందూ మతనాయకులొకరు, ఒక టి.వి.ఛానల్ ప్రసారంలో ఇలా వివరించారు. దాని సారాంశమేమంటే గోదావరికి వరదలు వచ్చినా, కనీసం నీటిమట్టం పెరిగినా, దాని ఒడ్డున ఉన్న గ్రామాల్లో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. అప్పుడు పానువట్టం అడుగు నుండి నీరు ఉబికి లింగాకారాన్ని పైకి నెడుతుంది. ఇది ప్రకృతి సహజ విషయం. ఇందులో మహిమ ఏమీ లేదు' అన్నాను.
'నా సమాధానానికి సంతృప్తి చెందినట్లు తలూపాడు సుబ్బారావు.'
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక. (మరికొన్ని వచ్చేవారం)
________________________________________________________
మహిమలా?.. మామూలు విషయాలా? (3)
-
విశ్వాసాలు.. వాస్తవాలు...86
'సుబ్బారావ్! ఆ జ్యోతి కనిపించిన వీడియోని నీవూ చూశావు. ఆ జ్యోతి గుడి తలుపులన్నీ వేసిన తర్వాతనే సి.సి.కెమెరాలో కనిపించింది. అప్పుడు అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుకుగానీ, రోడ్డుమీద పోతున్న కారుపై, స్కూటర్‌పై, నడిచీ వెళుతున్న వారికిగానీ కనిపించలేదు. ఎందుకని?'
'వారు పాపాత్ములు కాబట్టి వారికి భగవంతుడు కనిపించడు కదా!' అన్నాడు సుబ్బారావ్.
'మరి అదే వ్యక్తులకు, ఇంకా అనేక లక్షల మందికి టి.వి. ఛానళ్ళలో చూపించినపుడు ఎందుకు ఆ జ్యోతి కనిపించింది?' వారు సడెన్‌గా పుణ్మాత్ములయ్యారా?' అడిగాను.
సుబ్బారావు ఒక్క నిముషం మౌనం వహించాడు. వెంటనే ఇలా ప్రశ్నించాడు.
'మరి హిందూపూర్‌లో బ్రహ్మంగారి కంట్లో నుండి నీరు కారడం, పుట్టపర్తిలో సత్యసాయిబాబా మైనపు విగ్రహం నుండి నూనె కారడం, కొన్నిచోట్ల బాబా పటాల నుండి విభూది రాలడం ఇవన్నీ మహిమలు కావా? వినాయక విగ్రహాలు పాలు తాగడం మహిమ కాదా?'
'సుబ్బారావు! నీ ప్రశ్నలన్నింటికీ శాస్త్రీయ సమాధానాలు ఇంతకు ముందే పత్రికలలో, ఛానళ్ళలో ఇవ్వబడింది. ఇవన్నీ మానవ కల్పితాలే. నీకు రుజువు కావాలంటే ఒక పనిచేయి. ఇంటికి వెళ్ళేటప్పుడు లాక్టిక్ ఆసిడ్‌ని ఏదైనా కెమికల్ షాపు నుండి కొనుక్కొని వెళ్ళు. ఆ యాసిడ్‌ని మీ ఇంట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్‌కి ఉన్న అద్దానికి పైభాగంలో రాత్రికి పూయి. తెల్లవారేటప్పటికి అద్దం మీద నుండి కిందకు విభూదిలాంటిది రాలి ఉంటుంది. ఎందుకని? లాక్టిక్‌యాసిడ్ గాలి తగిలితే కొన్ని గంటల్లో పొడిగా మారుతుంది. అది ఏ ఫొటోపైన రాసినా కొన్ని గంటల్లో దానిపై నుండి బూడిద రాలినట్లు అనిపిస్తుంది. అంతే. ముఖ్యమైన విషయమేమంటే సుబ్బారావ్! భగవంతుడి మహిమల పేరు మీద ప్రకృతిలో సామాన్యంగా జరిగే విషయాలో, రసాయనిక చర్యలో ప్రచారం చేస్తున్నారు గానీ, పేదల ఆకలి తీర్చినట్లుగా ప్రచారం చేయడం లేదు. ఉదాహరణకు పేద విద్యార్థుల హాస్టళ్ళలో పిల్లలకు అన్నం వండి పెట్టకుండా వాళ్ళ ఆకలి తీరిందనీ, ఇది భగవంతుడి మహిమ అనీ ఎవరైనా, ఎప్పుడైనా ఋజువు చేశారా? అందువలన మహిమలని ప్రచారం అయ్యేవన్నీ మాజిక్కులే. కావాలంటే ఈ ఫొటో చూడు. ఇది 13-4-2007 నాటి ఆంధ్రజ్యోతిలోనిది.
ఇందులో తలపాగా పెట్టుకున్న వ్యక్తి ప్రముఖ మెజీషియన్ పి.సి.సర్కార్ (జూనియర్). నీళ్ళమీద సైకిల్ తొక్కడం అనే అద్భుతం చేస్తున్న వ్యక్తి ఆయన కూతురు. పి.సి. సర్కార్ తన కూతురు చేస్తున్న పని మాజిక్ అనీ, ఇందులో ఎలాంటి మహిమా లేదనీ ప్రకటించారు. ఇదేపని ఎవరైనా సాధువు చేసి, ఇది మహిమ అంటే అమాయకులు నమ్మి అతని పాదాలకు మొక్కుతారు. కాబట్టి మహిమలనేవే లేవు. అన్నీ మాజిక్కులు లేక హస్తలాఘవాలే. అంటే మామూలు విషయాలే. దీనిని అర్థంచేసుకో' అన్నాను. అర్థంచేసుకున్నా అన్నట్లు సుబ్బారావు తలవూపాడు.
మర్నాడు పొద్దున్నే సుబ్బారావు నుండి ఫోను! 'లక్ష్మీకాంతం! మా ఇంట్లో అద్దం నుండి విభూది రాలుతోంది' అని పెద్దగా చెప్పి.. 'లాక్టిక్ యాసిడ్ మహిమ' అని చిన్నగా అన్నాడు.
నేను 'మంచిది.. సంతోషం' అన్నాను.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
No comments:
Post a Comment