-
విశ్వాసాలు.. వాస్తవాలు...
ఈ పుస్తకానికి ముందుమాటలాంటి 'నామాట'లో గౌరు 'శాస్త్రంలోని సత్యాలను, వైజ్ఞానిక సూత్రాలను, సామాన్య ప్రజల వద్దకు వెళ్ళాలనే విధంగా, ముఖ్యంగా పంచభూతాల ప్రభావాన్ని మానవాళి ముంగిళ్ళలో (ఇంటి ముందు) ప్రతిష్టించాలన్న ఆలోచనలకు ప్రతి రూపమే ఈ 'వాస్తు నిర్మాణ వాస్తవాలు' పుస్తకం అని తెలిపారు. అలాగే, వారి సంస్థలో భాగస్వామియైన సుధాకర్ తేజ్ 'గృహ సంస్కర్త' అనే పేరు మీద రాసిన ముందు మాటలో గౌరు గ్రంథాలను కొన్నిటిని పేర్కొని 'వీటన్నిటిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని తెలిపాడు. 'శాస్త్రాన్ని అన్నివర్గాలవారికీ ఏ దాపరికం లేకుండా అందించాలని, వాస్తుశాస్త్రంలో ఉన్న నిజానిజాలను కొందరు కుహనా మేధావులకు నిరూపించాలనేది అది' అని వివరించారు.
ఈ రెండూ చదివిన తర్వాత ఈ గ్రంథంలో 35 ఇళ్ళ వాస్తు దోషాలూ, వాటి నివారణ కోసం గౌరు ఇచ్చిన ప్లానులు, ఆ ప్లానుల ప్రకారం ఇళ్ళల్లో మార్పులు చేసిన తర్వాత తగ్గిన సత్ఫలితాలు ఉంటాయని ఆశించాను. కానీ, విచిత్రంగా ఆ 35 ఇళ్ళ ల్లోనూ సవరించిన ప్లానులేగానీ దానికి సంబంధించి చేకూరిన ఫలితాల విషయం 31 ఇళ్ళకు చెప్పనేలేదు. ఫలితాలే చెప్ప కుండా నిజాలు నిరూపించారని ప్రకటించడం ఏ రకం వాదన?
ఇక మిగిలిన నాలుగిళ్లకు సంబంధించి, ఒక ఇంటికి వాస్తు దోషాలు పరిహరించిన తర్వాత ఆ ఇంటి యజమానురాలికి 'వాస్తు బలం వలన పార్టీ టికెట్ రావడమేకాక, ఆ ఎన్నికలలో విజయం సిద్ధించి మునిసిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికైనారట. కారణం 'వాస్తురీత్యా ఈ విధంగా ఉంటే గృహ యజమానికి రాజయోగ మ'ట. అదే వాస్తవమైతే, అలాంటి వాస్తుతో కూడిన ఇల్లు గౌరు నిర్మించుకొని, అందులో నివాసముంటే, వారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారు కదా? ఆ వాస్తుబలం వారికి బలమీయదా?
ఈ ప్రకారంగా 35కు గాను 31 ఇళ్ళకు, అంటే 88.5% ఇళ్ళకు అసలు ఫలితాలే చెప్పకపోవడం, మిగిలిన 1, 2 ఇళ్ళకు హేతు వాదానికి నిలవలేని ఫలితాలు చెప్పడం 'కుహనా హేతువాదుల' సమాధానాలని భావించాలా? దీని ఆధారంగా 'వాస్తు'ను 'శాస్త్రమ'నాలా?
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
No comments:
Post a Comment