-
అశాస్త్రీయ ఆచారాలు 2
'చాలాసేపైంది. వచ్చినవాళ్లనీ గమనించ కుండా ఏమిటంత దీక్షగా చదువుతున్నావ్?' అడిగాడు సుబ్బారావు.
'తాళపత్రం' అని ఒక పుస్తకం. దీంట్లో మన ఆచారాలకు సంబం ధించి అర్థంపర్థంలేని వివరణ ఇస్తున్నారు. నీకూ ఒకటి రెండు చెప్పమంటావా?'
'చెప్పు.'
'పళ్లు తోముకునేప్పుడు తూర్పు వైపుకుగానీ, ఈశాన్యం వైపుకుగానీ తిరిగి కడుక్కోవాలట. కారణం ఈ దిశలు కామదేవుడికి, మరియు వనస్పతికి చెందిన వట. రోజు ప్రారంభం ఈ దిశల్లో ఉంటే ఆయా దేవత ల కటాక్షం కలుగుతుందట!'
'మంచిదేగా!' అన్నాడు సుబ్బారావు యథాలాపంగా.
'నాదో చిన్నప్రశ్న. తూర్పు వైపు తిరిగి పళ్లు తోమేట ప్పుడు ఉమ్మేది ఏవైపుకు?' నవ్వుతూ అడిగాను.
సుబ్బారావుకు నా ప్రశ్న అర్థమైంది.
'తూర్పువైపు తిరిగి ఉమ్మితే సూర్యుడికి కోపం వస్తుందిగానీ మనకు కటాక్షం కలగదు గదా?' అన్నాడు నవ్వుతూ సుబ్బారావే.
'అలాగే ఈశాన్యంవైపు ఉమ్మినా ఆ దిక్కు దేవుడికి కోపం వస్తుంది గదా?' అడిగాను.
'అవునవును' అన్నాడు మరలా నవ్వుతూ.
'కాబట్టి, ఏ దిక్కు మొహంపెట్టి పళ్లు తోము కుంటే ఆదిక్కు దేవుడికి కోపం వస్తుంది'.
'మరేం చేయాలంటావు?'
'సుబ్బారావు! ప్రతి చిన్న దినచర్యకూ ఏవో కొన్ని గీతలు గీసి, ఆ గీతల మధ్యే నడవాల నడం దానికి వివరణగా ఏదో ఒక దేవుడికి కోపం వస్తుందని భయపెట్టడం, మనల్ని వారు గీచిన గీతల్లో బంధించే మోసపుచర్య. దాన్ని అర్థంచేసుకో. ఎటుతిరిగి పళ్లు తోము కున్నా, ఏవైపు ఎంగిలినీళ్లు పారబోసినా, ఎటుపక్కన గోళ్లు విసిరివేసినా, దానివల్ల మనకు కలిగే లాభనష్టాలకూ ఏ సంబంధం లేదు. అలాంటి సంబంధం నిరూపిం చబడలేదు. కాబట్టి అలాంటివి నమ్మనవసరం లేదు. ఆచరించ నవసరమూ లేదు..' అన్నాను.
'అవునవును' అన్నాడు సుబ్బారావు.
'వీళ్ళు ఇచ్చే అసంబద్ధ, అశాస్త్రీయ వివరణలకు ''సైన్సు అంగీ కరించింది'' అనే తోకను ఎక్కువగా జోడిస్తున్నారు. కావాలంటే ఈ విషయం పరిశీలించు.
'మన పూర్వులు గమ నించినదేమిటంటే అస్తమించే సూర్యుడు, ఉదయించే సూర్యుడంతటి శక్తి కలవాడు కాదని, ఈ వాస్తవాన్ని సాయంత్రం ఆకాశం సూర్యుని దిక్కు ఎర్రబడి ఉండటం ద్వారా నిరూపితపరచినారు. ఆధునిక శాస్త్రం సైతం ఈ విషయాన్ని అంగీ కరించింది' అని రాశారు.
'ఏ ఆధునిక సైన్సూ ఉదయిస్తున్న సూర్యుడి శక్తికీ, సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడి శక్తికీ, సైజుకీ, వెలుగుకీ తేడాలున్నాయని ఎక్కడా చెప్పలేదు. ఇలా రాయడం ఆధునిక సైన్సును వక్రీకరించడమే' అన్నాను.
'నీవన్నది నిజం నిజం' అన్నాడు సుబ్బారావు కవితా ధోరణిలో.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
No comments:
Post a Comment