Wednesday, 14 March 2012

పండుగలు... పర్యావరణం..!


పండుగలు సాంప్రదాయాలతో కూడుకున్నవైనా సరదాలను, సంతోషాల్ని పంచుకునేవి. వీటిని జరుపుకునే విధానం ఆయా పండుగల్ని బట్టి ఉంటాయి. ఆగస్టు - అక్టోబర్‌ మధ్య కాలం 'పండుగల కాలం'. శ్రీకృష్ణ జన్మాష్టమి, రంజాన్‌, వినాయకచవితి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు ఈ కాలంలోనే వస్తాయి. హోలి కూడా సరదాగా పిల్లలు రంగులు చల్లుకునే పండుగ. మార్చిలో వస్తుంది. ఈ పండుగల్లో సాంప్రదాయ పూజలతో పాటు, ప్రత్యేక పిండివంటలు, రంగులు చల్లుకోవడం, బాణసంచా కాల్చడం వంటివి చేస్తుంటాం. ఒక విధంగా పండుగల్ని జరుపుకోవడం అవసరమే. కనీసం ఆరోజుల్లోనైనా కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు కలుసుకొని, ఆనందంగా గడుపుతాం. కానీ, ఈ సందర్భాల్లో చేసుకునే కార్యక్రమాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. దీని దుష్ప్రభావాలతో నేడు మన భూమి వేడెక్కడం, వాతావరణంలో మార్పులు రావడం చూస్తున్నాం. వీటి ప్రభావం వల్ల అనేక దుష్ఫలితాలను అనుభవిస్తున్నాం. అందువల్ల పండుగల్ని సాధ్యమైనంత నిరాడంబరంగా, పర్యావరణానికి హాని కలిగించని రూపంలో జరుపుకోవడం ఒక సామాజిక బాధ్యత. వీటన్నింటినీ సంక్షిప్తంగా తెలుపుతూ ఈ వారం మీముందుకొచ్చింది 'విజ్ఞానవీచిక'.
పండుగలతో అన్నిరకాల వినిమయ వస్తువుల వాడకం పెరుగుతుంది. వీటి తయారీ సహజంగా ఏదో రూపంలో పర్యావరణంపై కాలుష్యాన్ని పెంచుతుంది. అందువల్ల, పండు గల్ని నిరాడంబరంగా, కాలుష్య రహితంగా జరుపుకోవడం ఒక సామాజిక కర్తవ్యంగా మనమందరం భావించాలి. ముఖ్యంగా భద్రతతో కూడిన భూగోళాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడానికి ఇది అవసరం.
హోలి, వినాయకచవితి, కొంతమేరకు దసరా పండుగల సందర్భంలో రంగుల వినియోగిస్తున్నాం. కృత్రిమ రంగులకు బదులు, సహజసిద్ధంగా ప్రకృతి నుండి లభించే రంగుల్నే వాడితే ఏదోమేర కాలుష్యాన్ని అరికట్టినట్లే.
ఇక దీపావళి... కొంతమేర దసరా పండు గల సందర్భంగా బాణాసంచా పేలుస్తారు. దీనివల్ల కలిగే కాలుష్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. విపరీతమైన వాయు, శబ్ధ కాలుష్యాలు ఏర్పడతాయి. వీటిని పూర్తిగా మానివేసి, దీపా లు వెలిగించి, ఆటలు, పాటలు వంటి సాంస్కృ తిక కార్యక్రమాలతో ఆనందంగా గడపవచ్చు. పిండివంటలు చేయకుండా ఏ పండుగా జరుపు కోం. ఈ పదార్థాల్లో కూడా రంగుల్ని వాడటం నేడు సర్వసాధారణమై పోయింది. దీన్ని మాను కోవాలి. ఈ రంగుల వల్ల అనేక అనారోగ్య సమ స్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పిండివంటల్ని రంగులు ఉపయోగించకుండా చేసుకోవడమే శ్రేయస్కరం. ఒకవేళ వేయాలను కున్నా సహజరంగుల్ని వాడటం మంచిది. ఇక వినాయకచవితి, దసరా సందర్భాల్లో వివిధ రంగులతో ఆకర్షణీయంగా గణేష్‌, దుర్గాదేవి విగ్రహాలు తయారుచేస్తారు. ఈ భారీ విగ్రహా లను నిమజ్జనం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ విగ్రహాలన్నీ దాదాపు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పిఓపి)తో తయారుచేస్తారు. కృత్రిమ రంగులతో తీర్చిదిద్దుతారు. వీటిని చెరువులు, ఇతర నీటి వనరుల్లో నిమజ్జనం చేసినప్పుడు అవి కాలుష్యమవుతున్నాయి.
దీన్ని నివారించాలంటే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలకు బదులు బంకమట్టి (క్లే) తో తయారు చేసిన విగ్రహాలను వాడాలి. బాధ్యత గుర్తించిన ఎంతోమంది పౌరులు ఇలాంటి విగ్రహాలను ఇపుడు వాడుతున్నారు కూడా. కానీ, కొంత మంది సాంప్రదాయంగా తయారు చేసే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల్నే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవి కలిగించే కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన బాధ్యతను గుర్తించాలి.
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ కాలుష్యం...
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ అంటే కాల్షియం సల్ఫేట్‌. ఒకసారి ఎండిన తర్వాత ఇదంత తేలికగా నీటిలో కరగదు. పూర్తిగా కరగడానికి కొన్ని నెలల నుండి సంవత్సరాల కాలం పడు తుంది. అంటే దీనిద్వారా కాలుష్యం నిరంతరం కొనసాగుతుంది. కానీ, బంకమట్టితో చేసిన విగ్రహాలు వెంటనే నీటిలో కరుగుతాయి.
రంగుల కాలుష్యం..
విగ్రహాలను తీర్చిదిద్దడానికి వాడే రంగుల లో పాదరసం, సీసం వంటి లోహా మూలకాలు ఉంటాయి. దీనితో పాటు ఆమ్లము, ఇతర సేంద్రియ పదార్థాలూ ఉంటాయి. నిమజ్జనం చేసినప్పుడు ఇవన్నీ నీటిలో కలిసి కాలుష్యాన్ని పెంచుతాయి.
నిమజ్జన ప్రభావం..
ఒక అధ్యయనం ప్రకారం నిమజ్జనం చేసిన తర్వాత నీటి ఆమ్లత్వం పెరుగుతుంది. కరిగిన లవణాలు నూరు శాతం పెరుగుతాయి. నీటిని చిలకడంతో పగలు నీటిలో కరిగిన ఆక్సిజన్‌ కొద్ది గా పెరిగినా రాత్రి తగ్గుతుందని నిపుణులు గమ నించారు. నిమజ్జనం తర్వాత ఇనుము లోహ పరమాణువులు పదిరెట్లు, రాగి 2-3 రెట్లు పెరుగుతాయనీ గుర్తించారు. విగ్రహాల నిమజ్జ నం సమయంలో పూజకుపయోగించిన పూలు, పండ్లు, కొబ్బరి, బట్టలు, సాంబ్రాణి వంటివి నీటిలో కలుపుతారు. ఇవన్నీ నీటి కాలుష్యాన్ని పెంచేవే. అందువల్ల వీటిని కలపడం మానే యాలి. అలంకరణ కోసం వాడే థర్మ్‌కోల్‌ నీటిలో చివకక కాలుష్యాన్ని పెంచుతుంది. అందువల్ల నిమజ్జన కాలుష్యాన్ని నివారించడానికి చివికే పదార్థాలనే వాడాలి. వినియోగించిన పూలను ఎండబెట్టి, అలంకరణకు లేదా పేపర్‌ తయారీకి లేదా ఇతరత్రా వాడవచ్చు.
పెయింట్ల తయారీలో..
పెయింట్ల తయారీలో వాడే పదార్థాలు పర్యావర ణానికి హాని కలిగిస్తూ ఆరోగ్యసమస్యలను తెస్తున్నాయి. పెయింట్ల తయారీలో ద్రావకం (సాల్వెంట్‌), రంగు కణా లను పట్టి ఉంచే జిగరు (బైండర్‌), ద్రావకం, జిగురులో కరగని ఘన (రూపంలో) కణాలు, ఇతర ప్రత్యేక పదార్థాలను వాడతారు. ఈ పదార్థాలన్నీ ఏదోమేర పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ ఆరోగ్యానికి హాని కలిగించేవే.
పెయింట్లలో ప్రధానంగా ఆవిరయ్యే సేంద్రియ పదార్థాలు అది వేసేటప్పుడే గాలిలో చేరి, కాలుష్యాన్ని, ఆరోగ్య సమస్యల్ని సృష్టిస్తాయి. ఆయిల్‌ పెయింట్ల తయారీలో కుసుమ నూనె లేదా పెట్రో లియం పదార్థాలను లేదా ఆల్కహాల్‌, తదితరాలను వాడతారు. పెయింట్‌ వేసేటప్పుడు, ఆ తర్వాత సూర్యరశ్మితో ఈ పదార్థాలు రసాయనిక మార్పులకు లోనై పొగలాంటి పదార్థాన్ని సృష్టిస్తున్నాయి. ఇది పెయింట్లలో 35-50 శాతం వరకూ ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ఆయిల్‌ పెయింట్లకు బదులుగా వాటర్‌ పెయింట్లను వాడతారు. ఇవి ఆయిల్‌ పెయింట్ల కన్నా చౌక. కానీ వాటర్‌ పెయింట్లలాగా అంతకాలం మనలేవు. వీటిలో ఆవిరయ్యే సేంద్రియ పదార్థాల విడుదల తక్కువగా ఉంటుంది. వీటిలో సేంద్రియ ద్రావణం చాలా తక్కువ మోతాదు (3-7 శాతం) లో ఉంటుంది.
పెయింట్ల నుండి విడుదలయ్యే సేంద్రియ వాయు వులు చికాకు (ఇరిటేషన్‌) ను కలిగిస్తాయి. కళ్లు, ముక్కు, గొంతు, చర్మాన్ని మండిస్తాయి. తలనొప్పి కలగవచ్చు. కళ్లు తిరగవచ్చు, వాంతులు అయ్యేటట్లు అనిపిస్తుంది. కానీ, ఈ లక్షణాలు కొద్దిసేపటి తర్వాత తగ్గిపోతాయి. లేదా ఈ ప్రభావానికి లోనైనవారు బయటకొస్తే మామూలవుతారు. కానీ, దీర్ఘకాలం ఈ ప్రభావానికి లోనైతే వారి మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిం టాయి. శ్వాస తీసుకోవడంలో కష్టమవుతుంది. ఆయిల్‌ పెయింట్లలో వాడే ఫార్మల్‌ డిహైడ్‌, బెంజిన్‌ రసాయ నాలు క్యాన్సర్‌ కారకాలు. నిరంతరం రంగులు వేసే వృత్తిలో ఉన్నవారు ఈ ప్రమాదాలకు ఎక్కువగా లోనవుతారు.
పెయింట్‌ ఎండే ప్రక్రియలో విడుదలైన సేంద్రీయ వాయువులు గాలిలోని నత్రజని (నైట్రిక్‌ ఆక్సైడ్‌), ఆక్సిజన్‌లతో కలిసిి 'ఓజోన్‌' అనే వాయువు ఏర్పడు తుంది. ఇది విషపదార్థం. ఇది కొంత మోతాదులో మన ఊపిరితిత్తుల కణాలపై కూడా తీవ్ర దుష్ప్రభావం కలిగిస్తాయి. పెయింట్లలో రంగుల కోసం వాడే ఘన కణాలలో సాధారణంగా కాడ్మియం లేదా టైటాయంతో కూడిన పదార్థాలు ఉంటాయి. ఇవి ఇలాంటి ఇతర పదార్థాలు కూడా పొందవచ్చు. ఇవీ విషపూరితమైనవి. ముఖ్యంగా పర్యావరణ సమస్యలను సృష్టించేవి. వీటి కాలుష్యం తగ్గించడానికి ఎక్రిలిక్‌ పెయింట్లను తయారు చేస్తున్నారు. ఇవి కొంత మేలు. ఉన్నంతలో తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఈ పెయింట్లలో ఆర్సినిక్‌, ఆర్సినిక్‌ డై సల్ఫైడ్‌, రాగి, కార్బన్‌ డై సల్ఫైడ్‌, ఫినాల్‌, ఫార్మల్‌ డి హైడ్‌ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి కూడా కాలుష్యాన్ని, ఆరోగ్యసమస్యల్ని సృష్టించేవే. ఇటీవల ప్రకృతి సిద్ధమైన రంగుల్ని తయారు చేస్తు న్నారు. అవి వాడటం మంచిది. అయితే ఇవి వాడుకలో ఎంత నాణ్యంగా ఉంటాయో చూడాల్సి ఉంది. ఏమైనా కాలుష్యాన్ని కలిగించవు కాబట్టి వాడటం ఆ మేరకు మేలు కలిగించినట్లే కదా!
సహజ రంగులు ఎలా?
చెట్టులోని వివిధ భాగాల నుండి రంగులు తయా రుచేసేందుకు చెట్టు భాగాన్ని 12 గంటల ముందు నానబెడితే రంగు బాగా వస్తుంది. నీటిలో ఉడికించి, రసాయన చర్య కలిగించే పద్ధతుల్లో తయారు చేస్తారు. రంగు శాతం ప్రకారం లీటరు నీటికి కావలసిన చెట్టు భాగాన్ని తూచి తీసుకోవాలి. గంటసేపు వంద డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద ఉడికించాలి. రంగు వడకట్టి పిప్పి తీసే యాలి లేదా 10గ్రా. సోడాను లీటరు నీటిలో కలపాలి. మరోపద్ధతిలో రంగుశాతం ప్రకారం లీటరు నీటికి కావల సిన చెట్టు భాగాన్ని తూచి తీసుకోవాలి. గంటసేపు 100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉడికించాలి. దీని నుండీ రంగు ను వడకట్టి, పిప్పి తీయాలి లేదా ముందు 5 మి.లీ. ఎసి టిక్‌ ఆమ్లాన్ని లీటరు నీటిలో కలపాలి. ఇంకో పద్ధతిలో రంగు శాతం ప్రకారం లీటరు నీటికి కావలసిన చెట్టు భాగాన్ని తూచి తీసుకోవాలి.గంటసేపు 100 డిగ్రీల సెల్సి యస్‌ వద్ద ఉడికించాలి. రంగు వడకట్టి, పిప్పి తీయాలి.
(ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమాచారం ఆధారంగా)
పిండివంటలు..రంగులు..
తినే పిండివంటల్ని ఆకర్షణీయంగా రూపొందించటానికి వివిధ రంగులను వాడుతున్నార. కృత్రిమ రంగుల దుష్ప్రభావాల నేపథ్యంలో ఆహార తయారీలో హాని కలిగించని అనుమతించిన రంగుల్నే వాడాలి. మన దేశంలో దురదృష్టంగా కొంతమంది అనుమతిలేని చౌక రంగుల్ని కూడా వాడుతున్నారు. మనం కొనేటప్పుడు ప్యాకెట్‌పై అనుమతించిన రంగుల్నే వాడుతున్నారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఎక్కువ భాగం సహజ ఆహార రంగుల్నే వాడుతున్నారు.
కేరామిల్‌ రంగు - ఇది మామూలు పంచదార నుంచి తయారుచేస్తారు. కోకోకోలా వంటి కూల్‌డ్రింక్స్‌లో, సౌందర్య క్రీముల్లో దీన్ని వాడతారు. క్లోరోఫిల్‌ - ఆకుపచ్చరంగు క్లోరెల్లా అనే అల్గే జాతికి చెందిన దాని నుండి తయారుచేస్తారు. కాకనీర్‌ - ఎర్రరంగు. ఇది ఒక పురుగు నుండి తయారుచేస్తారు. బెటానిన్‌ - బీట్‌రూట్‌ నుండి తయారుచేస్తారు. పసుపుకొమ్ముల నుంచి పసుపు రంగును తయారుచేస్తారు. సాఫ్రన్‌- ఇది చెట్ల నుండి తయారుచేస్తారు. బటర్‌ఫ్లై పీ - నీలం రంగు తయారుచేస్తారు.
ఆహారంలో వాడే రంగుల్ని చాలా శుద్ధి చేసి వాడతారు. ఒకోసారి రంగుల్ని ద్రవరూపంలో మార్చి ఉపయోగిస్తారు.
రంగు పదార్థాలు (డై) నీళ్ళలో కరుగుతాయి. నూనెలో కరగవు. వీటిని పౌడర్లుగా, గుళికలుగా, ద్రవపదార్థంగా తయారుచేస్తారు. ఇవి పానీయాల్లో, బేకరీ పదార్థాల్లో, మిఠాయిల్లో, పాల ఉత్పత్తుల్లో తదితరాల్లో ఈ రంగుల్ని వాడతారు. ఈ రంగు పదార్థాలను అతిగా వాడకూడదు. మోతాదు మేరకే వాడాలి.
గులాల్‌ రంగులు - రంగు పదార్థాన్ని (డై) మామూలు పదార్థంతో కలిపి తయారుచేస్తారు. దీన్ని నీటిలో కలిపినప్పుడు రంగు కరిగిపోతుంది. అదే నూనెలో కరగదు. ఔషధాల్లో కూడా 'గులాల్‌' లాంటి పదార్థాని వాడతారు. చమురుకు కూడా రంగుల్ని కలుపుతారు.
కొంతమంది కళాకారులు తమ చిత్రాలకు ఆహార రంగుల్నే వాడుతున్నారు.
కోల్‌డాంబరు (తారు)- ముడి చమురు నుంచి తయారైన ఈ తారు నుండి రంగుల్ని తయారుచేసేవారు. తారు నుంచి తయారుచేసిన రంగులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని గమనించారు. అందువల్ల, చాలా దేశాలు వీటి వాడకాన్ని నిషేధించాయి.
ప్రకృతి నుండి..
ఇవి సహజసిద్ధమైనవి. ఉత్పత్తి చేయడం తేలిక. హానికి కలిగించవు. ఆరోగ్యాన్ని కాపాడతాయి. రంగులు తయారుచేసే పద్ధతులలో పెద్ద రసాయన మార్పులు ఉండవు. కాబట్టి, వీటి నుండి వచ్చే నీటివలన కాలుష్యం ఉండదు. ఈ రంగులు భూమిలో కలిసిపోతాయి. కాబట్టి, వాతావరణ కాలుష్యం కూడా సమస్య కాదు. రంగుల తయారీలో వెలువడే 'పిప్పి' భూమికి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ రంగుల కలయిక ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రంగులు చెట్ల నుండి, కీటకాల నుండి, జంతువుల నుండి లభిస్తాయి. ఎక్కువగా చెట్ల ఆకులు, పూలు, బెరడు, వేళ్లు, కాయలు, తొక్కలు మొదలైన వాటి నుండి రంగుల్ని సేకరిస్తున్నారు. ఈ రంగుల్ని వాడటం కూడా చాలా తేలిక.
పిల్లల బొమ్మలకు, నీటిలో నిమజ్జనం చేసే వినాయకుడు, దుర్గాదేవి మొదలైన విగ్రహాలకు ఈ రంగులను వాడినట్లయితే ఏ రకమైన హాని జరగదు. నీటి కాలుష్యం కూడా ఉండదు.
ఈ పెయింట్లు తయారుచేయడానికి, చెట్ల భాగాల నుండి తీసిన రంగులను నీరు పోయేవరకూ మరిగించి గాలిలో ఆరనిచ్చినట్లయితే రంగు ముద్దలు తయారవు తాయి. పెయింటు వేసేటప్పుడు వాటిని అవసరమై నంత నీటిలో కలిపి పెయింట్‌ చేసుకోవచ్చు. పెయిం టింగ్‌ మెరవడానికి కొద్దిగా నూనె కూడా కలపవచ్చు. గట్టిగా పట్టుకోవడానికి జిగురు కూడా కలపవచ్చు.
రేల చెట్ల కాయ గుజ్జుతో గోధుమరంగు తయారు చేయవచ్చు. అలాగే గుంటకలగర ఆకులతో లేత ఆకుపచ్చ, మోదుగ పూలతో పసుపు, కాషాయ రంగులు తయారుచేసుకోవచ్చు. కుసుమ పూలతో పసుపు, దానిమ్మకాయ తొక్కతో బ్రౌన్‌ రంగును, బంతి పూలతో పసుపు ఆకుపచ్చ కలిసిన రంగును, మారేడు కాయలతో లేత ఆకుపచ్చ రంగును, వేప చెట్టు బెరడుతో ముదురు ఎరుపు రంగును తయారు చేయవచ్చు. నీలగిరి చెట్టు బెరడుతో గులాబి, బ్రౌన్‌ కలిసిన రంగును, నీలిరంగు చెట్లు మొదలుతో నీలి రంగును తయారుచేయవచ్చు. గోరింటాకుతో శరీర భాగాల మీద ఎర్ర డిజైన్లను అలంకరించుకోవడం మనకు సుపరిచితమే.
రంగులు...
మామూలు తెలుపు కిరణాలను స్ఫటికంలోకి పంపితే ఏడు రంగులుగా పరావర్తనం చెంది ఎరుపు, కాషాయం, పసుపు, ఆకుపచ్చ, నీలం, వంకాయరంగు, ఊదారంగులుగా విడిపోతుంది. కానీ, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్ని వివిధ పాళ్ళల్లో కలపి అన్ని రంగులూ తయారుచేయవచ్చు. ఎరుపు, ఆకుపచ్చ, లేతాకుపచ్చ వంటి రంగుల్ని ప్రాథమికమైనవని అంటారు. ఈ మూడు రంగుల్ని ఉపయోగించి, కంప్యూటర్‌ సాయంతో ఏ రంగునైనా తయారుచేయవచ్చు. తెలుపులో అన్ని రంగులూ కలిసి ఉంటాయి. మనం ఏదైనా ఒక రంగును చూస్తుంటే ఆ రంగు తప్ప మిగిలిన రంగులు అందులో కలిసిపోతాయి. నల్లరంగులో అన్ని రంగులూ పూర్తిగా విలీనమవుతాయి. ఏ రంగూ వెలువడదు. 

No comments:

Post a Comment