పరీక్షలంటే అందరికీ గాభరా. పరీక్ష తేదీ ముంచుకొస్తున్న కొద్దీ పిల్లలు మరింత కంగారు పడతారు. తల్లిదండ్రులు మరీనూ. వారికి కంటిమీద కునుకుండదు. పిల్లల్ని ప్రశాంతంగా ఉండనీయరు. పరీక్ష రోజుకు కౌంట్‌డౌన్ చేస్తూ ప్రతీక్షణం పరీక్షల గురించే మాట్లాడతారు. పరీక్షలు తప్ప మరో మాటెత్తితే 'చదువుపై శ్రద్ధ లేద'ంటూ కసురుకుంటుంటారు. కానీ ఇది తప్పు...... పరీక్షలు దగ్గరకొస్తున్న కొద్దీ పరీక్షల గురించి పిల్లల దగ్గర ఎక్కువగా మాట్లాడకూడదు.
విద్యార్థులకు సరయిన సూచనలు, సలహాల నిస్తూ తల్లిదండ్రులు 'మార్గదర్శకత్వం' నెరపాలి. పరీక్షలను సలక్షణంగా రాయడానికి విద్యార్థులకూ, వారికి సహకరించే పెద్దలకూ అవసరమైన సూచనలను విద్యావేత్త చుక్కా రామయ్య గారు అందజేస్తున్నారు. వీటిననుసరించి ప్రిపరేషన్‌ను కొనసాగించి, పరీక్షలు రాస్తే మంచి మార్కులతో పాసై భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దుకోగలరు.
సహజ ప్రతిభ ప్రదర్శించాలి..
ఎలా చదవాలి? ఏం రాయాలి? అనే టెన్షన్ పిల్లలదయితే...
ఎక్కువ మార్కులు, ర్యాంకులు తెచ్చుకుని తమ పిల్లలు బాగా ముందుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇది సహజం. అతిగా భయపడటం, టెన్షన్ పడటం అసహజం. అయితే... భయంతో టెన్షన్ పడుతూ పని చేస్తే 'అయ్యే' పని కాస్తా గందరగోళంలో పడుతుంది. కాబట్టి నింపాదిగా పని చేసుకోవాలి. సబ్జెక్టుపై స్పష్టమైన అవగాహన పెంచుకుంటూ చదివితే విద్యార్థులకు చదువు ఒంటబడుతుంది. కొందరు ఈపాటికే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసి ఉంటారు. కొనసాగిస్తున్నవారు ఈ పద్ధతిలో ప్రిపరేషన్ సాగిస్తే పరీక్షా కాలాన్ని సునాయాసంగా గట్టెక్కగలుగుతారు.
వాస్తవానికి పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు పరీక్ష రాసే విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగానే వ్యవహరించాలి. దీనివల్ల విద్యార్థి ప్రతిభ ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే లేదా తగ్గించే ఏ పనీ పేరెంట్ చేయకూడదు. పరీక్షల సమయంలో పిల్లలు ప్రశాంతంగా తమ సహజ ప్రతిభను ప్రదర్శించేటట్లు ప్రోత్సహించాలే తప్ప 'భయానక వాతావరణం' సృష్టించరాదు. పరీక్షల విషయంలో అనుభవం లేని పిల్లలకు పెద్దలు తగిన విధంగా మద్దతునిచ్చి'ప్లాన్' చేసి పెట్టాలి. వారికి సన్నిహితంగా ఉంటూ వారి అవసరాలు గుర్తించాలి. అందుకు తగినట్లుగా మానసిక ధైర్యం ఇవ్వాలి.
పరీక్షల ముందు...
పరీక్షలకు కనీసం వారం పదిరోజుల ముందునుంచీ పిల్లలకు తగిన నిద్ర ఉండేట్టు చూడాలి. అంతే తప్ప పరీక్ష రోజు దగ్గర పడుతున్న కొద్దీ నైటవుట్లు చేయించే ప్రయత్నం చేయకూడదు. సంవత్సరమంతా చదివినదే పరీక్షల్లో రాయగలుగుతారే తప్ప చివరి నాలుగైదు రోజుల్లో అదనంగా నేర్చుకునేదేమీ ఉండదు. వెనుకబడిన సబ్జెక్టు విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ సమయంలో హాఫ్‌ఇయర్లీ, ప్రీఫైనల్ పేపర్స్‌ను సమీక్షించి అందులోని లోపాలను సవరించే ప్రయత్నం చేయడం మంచిది. చిన్న చిన్న పొరపాట్ల కారణంగా వాటిలో మార్కులు తగ్గిన వాటిని గుర్తించి వాటిని సరిదిద్దుకునే విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలి. బాగా చదివినా, శ్రద్ధగా పరీక్షలు రాసినా చిన్న పొరపాట్ల కారణంగా ఎలా మార్కులు తగ్గినదీ వారికి విశదీకరిస్తూ ఆ పొరపాట్లు పబ్లిక్ పరీక్షల్లో చేయకుండా స్పృహ కలుగజేయాలి. పరీక్షా పత్రంలో జవాబులు స్పష్టంగా రాయడం అవసరం. పరీక్షకు వారం పదిరోజుల ముందు రాత మెరుగ్గా ఉండేందుకు సాధన చేయించాలి.
పరీక్ష రోజు...
పరీక్షలు అయిపోయే వరకూ పిల్లలు ప్రతి రోజూ రాత్రి వేళకు నిద్రకుపక్రమించేటట్లు చూడాలి. అలాగే త్వరగా నిద్రలేపాలి. పరీక్షకు సంబంధించినవన్నీ అమర్చుకునేటట్లు చూడాలి. చాలామంది పిల్లలు పరీక్ష రోజు ఉదయాన్నే సిలబస్ మొత్తాన్ని గబగబా తిరగేస్తూ అన్నీ గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. నిజానికి పరీక్ష రోజు మైండ్ బ్లాంక్‌గా ఉంటుంది. ఏదీ గుర్తుకు రాదు. అది బాగా ప్రిపేర్ అయ్యారనడానికి గుర్తు. పరీక్ష హాల్లోకి వెళితే అన్నీ గుర్తుకు వస్తాయి. అందుకని ముందు కంగారు పడరాదు. పిల్లలకు ఈ విషయం తెలీదు. అందుకని దీనిని పెద్దలే వారికి తెలియజెప్పాలి.
పరీక్ష హాల్లో...
పరీక్షల విషయంలో పిల్లలకు అనుభవం ఉండదు. అనుభవం ఉన్న పెద్దలు పిల్లలకు అన్ని విషయాలూ ఓపిగ్గా వివరించాలి. ప్రతీ పరీక్షకు అవసరమైనవి ఉంటాయి. ఉదాహరణకు మేథమేటిక్స్ పరీక్షకు జామెట్రీ బాక్స్ తదితర వస్తువులు తీసుకెళ్ళేట్లు చూడాలి. ఒకటికి రెండు పెన్సిల్స్, పెన్నులు ఇచ్చి పంపించాలి. ప్రశ్న పత్రం ఎలా చదవాలో ఎలా మొదలు పెట్టాలో ఏదైనా జవాబు గుర్తుకు రాకపోతే ఏం చేయాలో? ముందే వివరించాలి. ఇదే సమయంలో గత ఎగ్జామ్స్‌లో సాధించిన విజయాలు గుర్తుకు తెస్తూ ఈ పరీక్షా బాగా రాయగలరని ప్రోత్సహించాలి. ఒక పరీక్ష పూర్తయిన తరవాత దానిలో ఎన్ని మార్కులు వస్తాయో పిల్లలు ఇంటికి రాగానే చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. దాని వల్ల ఒక పరీక్ష బాగా రాయలేకపోతే దాని ప్రభావం మరో పరీక్షపై పడే అవకాశముంది. అందువల్ల పరీక్ష ప్రస్తావన పదే పదే చేయకపోవడం మంచిది. పరీక్షలనేవి చదువులో భాగమే తప్ప పరీక్షలే జీవిత లక్ష్యం కాదు. అనుభవజ్ఞులైన పెద్దలకు ఈ విషయం తెలియనిది కాదు. అయితే ఇదే పరిపూర్ణతను పిల్లల పరీక్షల విషయంలో ప్రదర్శించాలి. అంతే తప్ప ఆత్రుత ప్రదర్శించి పిల్లల ప్రతిభను తగ్గించవద్దు.
ఒత్తిడి
కొంతమంది పిల్లలు పరీక్షల ముందు ఒక విధమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. బాగా చదివే పిల్లలు కూడా అనవసరమైన అనుమానాలు పెంచుకుని పరీక్షల ముందు డల్‌గా అయిపోతారు. దీన్నే ' ప్రి ఎగ్జామ్ స్ట్రెస్' అనవచ్చు.
మంచిగా చదివే పిల్లలు కూడా ఎగ్జామ్స్ ముందు ఇలాంటి టెన్షన్‌కు గురవుతారని ఇటీవల ఒక సర్వేలో తేలింది. అనవసరమైన ఈ మానసిక ఒత్తిడి వల్ల విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశమున్నట్లు ఈ సర్వే తేల్చింది. పరీక్షలు ఎలా రాస్తామో? అనే అనవసరమైన ఆందోళన వల్ల సరిగా రాయకపోవటం కూడా జరగవచ్చు. అలా జరిగినప్పుడు ఆశాభంగాన్ని తట్టుకోలేని పిల్లలు కొంతమంది ఆత్మహత్యకు తలపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి.
పిల్లలు ఇలా ఒత్తిడికి గురవకుండా పెద్దవారు జాగ్రత్త పడవచ్చు. అసలు పిల్లల 'స్ట్రెస్'కు పెద్దలే కారణమవుతారు కొన్నిసార్లు. తమ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వారి గురించి అతిగా ఆలోచిస్తూ అస్తమానం పరీక్షల గురించే జ్ఞాపకం చేస్తూ తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకొని, ర్యాంకులు తెచ్చుకోవాలంటూ హెచ్చరిస్తూంటారు. ఇవి ఎక్కువైనప్పుడు సహజంగానే పిల్లల్లో ఆందోళన పెరుగుతుంది. అందుకని పిల్లలను ఇలాంటి ఒత్తిడికి గురి చేయకుండా పెద్దలు జాగ్రత్త వహించాలి. పిల్లలు బాగా చదువుకోవాలనీ, గుర్తింపు పొందాలనీ, వృద్ధి చెందాలనీ కోరుకోవడంలో తప్పులేదు. అదే పనిగా ఒత్తిడి చేయడం మాత్రం కచ్చితంగా తప్పేనని గుర్తుంచుకోవాలి.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.....
పరీక్షల సమయంలో అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. పిల్లలు తమ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. రిలాక్స్ కావడానికి, తినడానికి, నిద్రపోవడానికి సమయాలు కేటాయించాలి. తదనుగుణంగా ప్రిపరేషన్ టైమ్ టేబుల్ వేసుకుని అన్నీ సరిగా అమరేటట్లు చూడాలి. ప్రిపరేషన్ సమయంలో 'పాజిటివ్' ఆలోచనలు కలిగే వాతావరణాన్ని కల్పించాలి. చదువు విషయంలో వారికి ఇలాంటి భావాలే కలిగేటట్లు ప్రవర్తించాలి. వేళకు తిండి తినకపోయినా, రాత్రిళ్ళు నిద్రపోకపోయినా శారీరకంగానూ, మానసికంగానూ అలసి పోయి చదువుపై ఆసక్తి తగ్గుతుంది. శ్రద్ధ తగ్గాక చదివేది అర్థం కాదు. దానితో జవాబులను బట్టీ వేయాలని చూస్తారు. ఇక సమస్యలు ప్రారంభమవుతాయి. ఇది గమనించి వారికి తిండి, నిద్ర సక్రమంగా లభించేట్లు చూడాలి.
కంటిన్యూగా మూడు, నాలుగు గంటలు చదివే కన్నా గంట చదివి 10 నిమిషాలు రిలాక్స్ అవడం మంచిది. దానివల్ల 'ఫ్రెష్‌నెస్' కలిగి చదివింది తొందరగా బోధపడుతుంది. అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తే 'ఫ్రెష్'గా పరీక్షలు రాయవచ్చు.
ఇలా చదవండి...
పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు చదువుకుంటూ వెళ్ళే కన్నా విషయంపై అవగాహన పెంచుకుంటూ చదివితే ఫలితముంటుంది. అంటే చదివే పాఠం గురించి ముందు స్థూలంగా అర్థం చేసుకోండి. అందులో ఏయే విషయాలను చెప్పారో తెలుసుకోవాలి. ఉదాహరణకు భూకంపాల గురించి ఒక పాఠం ఉందనుకుంటే దానిలో భూకంపం అంటే ఏమిటి? అవి ఎందుకు వస్తాయి? వాటిని ఎలా కొలుస్తారు? వంటి వివరాలుంటాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే భూమి గురించి కూడా కొన్ని వివరాలనిస్తారు. ఈ పాఠాన్ని చదివే ముందు ఈ విషయాలను సీక్వెన్స్‌లో పెట్టుకుంటే చదివింది కూడా 'ఈజీ'గా అర్థమవుతుంది. పరీక్షల్లో రాయడానికి వీలుగా ఉంటుంది. ఒకసారి విషయం అర్థమయితే అది వ్యాసరూప ప్రశ్న అయినా, ఆబ్జెక్టివ్ అయినా కూడా జవాబులు స్పష్టంగా రాయవచ్చు.
ఇలా చదవడం అయ్యాక... విషయం అర్థమయినాక ఓసారి పరీక్షా పత్రం మోడల్ పేపర్‌ను చూడండి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయి? జవాబులు ఏ విధంగా రాయాలి? అనేది తెలుసుకుని ఆ విధంగా అర్థమయిన సబ్జెక్టును స్థూలంగా 'ఎరేంజ్' చేసుకుంటే సబ్జెక్టుపై 'గ్రిప్' వస్తుంది. ఇదయ్యాక ఓసారి మీకై మీరే లేదా తల్లిదండ్రుల సహాయంతో ప్రశ్నలను రాసుకుని ఒక ప్రశ్నాపత్రాన్ని సొంతంగా తయారు చేసుకోండి. దానికి జవాబులు రాయడం 'ప్రాక్టీసు' చేయండి. చదవడం ఎంత ముఖ్యమో, రాయడం కూడా అంతే ముఖ్యం. ఇలా రాయడం వల్ల లోపాలు తెలుస్తాయి. రానిది ఉంటే మళ్ళీ చదువుకునే అవకాశముంటుంది. పరీక్ష హాల్లో కెళ్ళాక జవాబుల కోసం 'తడుముకు'నే అవసరముండదు. రాయడం కూడా ప్రిపరేషన్‌లో భాగమేనని గుర్తుంచుకోండి. సమయాన్ని బట్టి ఒకటి రెండు సార్లు రివిజన్ చేసుకుంటే ఎలాంటి కంగారు, భయం లేకుండా సాఫీగా పరీక్షలను రాయవచ్చు. అనుకున్న మార్కులు సంపాదించుకోవచ్చు.
- ఆల్ ది బెస్ట్...
No comments:
Post a Comment