ఓ ఆదర్శ సైన్స్ టీచర్
ఆ మధ్యన ఓ సైన్స్ టీచర్ ని కలుసుకోవటం జరిగింది.
ఈయన తిరుపతి దగ్గర ఓ చిన్న ఊళ్ళో, ఓ తెలుగు మీడియం స్కూల్లో సైన్స్ టీచరు. (ఆయన పేరు గాని, ఆ ఊరి పేరు గాని గుర్తుపెట్టుకోని నా నిర్లక్ష్యానికి నన్ను నేనే చెడా మడా తిట్టుకున్నాను!) ఈయన ఆరో క్లాసు పిల్లలకి సైన్సు చెప్తూ ఉంటే "విశ్వం" అన్న అధ్యాయంలో పిల్లలకి కొంత సమస్యగా ఉందని గుర్తించాడు.
(www.kagayastudio.com/space/stars/l_01_galaxy.htm)
గెలాక్సీ అంటే అసలేమిటి? అందులో సూర్యుడి స్థానం ఏమిటి? సౌరమండలంలో మనిషి స్థానం ఏమిటి? అలాగే ఋతువులు ఎలా ఏర్పడతాయి? Equinoxes, solstices మొదలైన పదాలకి అర్థం ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? ఇవన్నీ ఏదో బట్టీ పట్టి పిల్లలు పరిక్షలు తెగ రాసేస్తారు గాను నిజంగా అవి పిల్లల ఉహలకి అందడంలేదని గుర్తించాడా ప్రతిభాశాలి.
ఏదో చెయ్యాలని అనుకున్నాడు. దానికి అనువైన బోధనా సామగ్రిని తయారుచెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అయితే అ సామగ్రి మరీ ఖరిదైనదిగా ఉండకూడదు. పిల్లలు కావాలంటే వాళ్ల అంతకి వాళ్లు ఇళ్ళలో ఈ పరికరాలని చేసుకునేవిగా ఉండాలి.
మొదటి పరికరం భూమి పరిభ్రమణాన్ని ప్రదర్శిస్తుంది. పేపర్ మాష్ పద్దతితో ఓ బంతిని తయారు చేశాడు. దానికి కావలసింది ఓ బెలూన్, కొంత జిగురు, ఓ న్యూస్ పేపరు. ఈ బంతి మిద ఇప్పుడు ప్రపంచ పటాన్ని అంటించి భూగోళం నమూనాని తయారుచెయ్యాలి. అయితే సమతలం మీద ఉండే పటాన్ని గోళం యొక్క వంపు తిరిగిన ఉపరితలం మీద అంటిస్తే మడతలు పడుతుంది. కనుక ముందు మ్యాపుని కోణాకారపు విభాగాలుగా కోయాలి. ఈ విభాగాలని వేరు వేరుగా బంతి మీద అంటించాలి. కర్తోగ్రాఫర్లకి (మ్యాపులు తయారుచేసే వారికీ) ఈ రహస్యం బాగా తెలుస్తుంది.
ఇప్పుడా బంతి "ధ్రువాల" వద్ద కన్నాలు పెట్టి ఓ అక్షాన్ని ఏర్పాటు చేశాడు. అక్షం చుట్టూ ఓ రబ్బర్ బ్యాండ్ చుట్టి, దాని అవతలి కొసని బంతి ఆధారానికి (base) కి చుట్టాడు.
అలా తయారైన భూగోళం నమూనాని అనేక సార్లు చుట్లు తిప్పి వదిలేస్తే , కీ ఇచ్చిన బొమ్మలా, మెల్లగా అది దాని అక్షం మీద పరిభ్రమిస్తుంది. ఇప్పుడు సూర్యుడి స్థానంలో ఓ టార్చిలైటు ని అమర్చాలి. పరిభ్రమిస్తున్న భూగోళం మీద కాంతి పడి రాత్రి, పగలు ఎలా మారుతాయో చూడొచ్చు. భూమి వాలుని బట్టి ఎక్కడ ఎండా కాలమో, ఎక్కడ సీతాకాలమో సులభంగా చెప్పొచ్చు. ఇక equinoxes, solstices వంటి ఇబ్బందికరమైన అంశాలని కూడా ఆ నమూనాలో స్పష్టంగా ప్రదర్శించవచ్చు.
సరే ఇక భూమి పరిభ్రమణం మాట అటుంచి, అలా ఓ సారి మన మిల్కి వే గెలాక్సీ వైపు వెళ్దాం. దీనికీ ఓ చక్కని పరికరాన్ని తాయారు చేశాడా అ అజ్ఞాత మేధావి.
ఓ కొబ్బరి కాయని రెండు చిప్పలుగా కోశాడు. లోపలి గుజ్జు అంతా దోలిచేసి ఎండబెట్టాడు. ఓ గెలాక్సీ చిత్రాన్ని నల్లని వృత్తాకారపు అట్ట మీద అంటించాడు. ఆ వృత్త కేంద్రంలోంచి ఓ నల్లని కడ్డీ ని దూర్చి, ఆ వృత్తం తో బాటు ఆ కడ్డీ ని ఇందాకటి కొబ్బరి చిప్ప గోళానికి అక్షంగా అమర్చాడు. ఇక్కడ కూడా రబ్బర్ బ్యాండ్ టెక్నాలజీనే వాడటం జరిగింది.
పై చిప్పలో రెండు కన్నాలు పెట్టాడు. ఒక కన్నం లోంచి పెన్ టార్చ్ తో లైటు వేస్తె అది గెలాక్సీ చిత్రం మిద పడుతుంది. రెండవ కన్నం వద్ద కన్ను పెట్టి లోంచి లోపల ఏం జరుగుతోందో చూడొచ్చు.
చీకటి నేపథ్యంలో కాంతి పడి మెరుస్తూ పరిభ్రమిస్తున్న అ గెలాక్సీ ని చూస్తుంటే ఉన్నట్లుండి ఓ లక్ష కాంతి సంవత్సరాలు (పాల పుంత వ్యాసం) దూరం లోంచి ముద్దొచ్చే మన పాలపుంతకి ఏకాంత ప్రేక్షకుడై నిలిచి చూస్తున్న కమ్మని అనుభూతి కలుగుతుంది.
ఈ విధంగా ప్రతిభతో, పరిజ్ఞానంతో, ప్రేరణతో బోధనా రంగంలో గొప్ప కృషి చేస్తున్న టీచర్లు లేకపోలేదు. కానీ వాళ్ళ సంఖ్య తక్కువే. "మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో నైనా మంచిసైన్సు టీచర్లు అరుదే," అంటాడు ప్రఖ్యాత science popularizer శ్రీ అరవింద్ గుప్త (www.arvindguptatoys.com).
అందుకే నేడు అందరికీ అందుబాటులో ఉండే ప్రసార, సమాచార మాధ్యమాలని వాడుకుంటూ, మేటి సైన్స్ టీచర్ ల సృజనాత్మకత కృషి ఫలితాలు నలుగురికీ అందేలా తగిన ఏర్పాట్లు చెయ్యాలి.
No comments:
Post a Comment