అపురూప వ్యక్తి గురజాడ
గురజాడ ద్రష్ట. కొన్ని వందల సంవత్సరాల ముందుచూపుతో తెలుగు సాహిత్యాన్ని తీర్చిదిద్దారు. ఇది అందరూ అంగీకరించే మాటే. ఆంగ్లభాషతో మంచి పరిచయముండడంతో 'కోకు' అనే ఆంగ్ల గేయంతో తమ పదహారో ఏటనే రచనా వ్యాసాంగానికి శ్రీకారంచుట్టారు. 'సారంగధర' ఆంగ్ల కావ్యంలో 'రీజ్ అండ్ రయత్' పత్రికా సంపాదకులు, బెంగాల్‌లోని శంభు చంద్ర ముఖర్జీతో పరిచయమైంది. ఆయన పుణ్యమాని గురజాడ ఎన్నో విషయాల్ని తెలుసుకోవడంతోబాటు ఆయన సలహాతోనే తెలుగు సాహిత్యంవైపు దృష్టి మళ్లించారు గురజాడ.
తెలుగు భాష నాటక రచనకు పనికిరాదన్న అపవాదుని పోగొట్టడానికి, తనకి అండగానున్న విజయనగర రాజు ఆనంద గజపతి రాజు 'ఆడపిల్లల అమ్మకం' పట్ల చెందుతున్న ఆవేదనను చల్లార్చడానికి, మొట్టమొదటగా మాట్లాడుకునే భాషలో 'కన్యాశుల్కం'ని రచించారు. ఇది మన దేశంలోని వ్యావహారిక భాషలో రాసిన మొదటి రచన. అంటే దేశ సాహితీ చరిత్రలో గురజాడ స్థాయి మనకర్థమవుతోంది. ఈయన కన్యాశుల్కం రాసిన ఆరేళ్లకు బెంగాలీ వ్యావహారిక భాషలో మొదటి రచన 'ఘరె -భైరె'ని రవీంద్రనాథ్‌ఠాగూర్ రాశారు.
'జి.వి అప్పారావు' అంటే 'గ్రామ్యవాది అప్పారావు అని పరిహసిస్తే భరించారు. ఛందోబద్ధ కవిత్వం రాయలేక మాట్లాడుకునే భాషలో రాస్తున్నాడంటే ఆ అపవాదుని తిప్పికొట్టడానికి 'సుభద్ర' అనే నిర్వచన కావ్యాన్ని శతకాన్ని రాశారు.
సాంఘిక భాషలో కాబట్టి మాట్లాడుకునే భాషలో రాయగలిగావు. చారిత్రక నాటకాన్ని ఆ భాషలో రాయగలవా? అంటే 'బిల్హణీయం' నాటకాన్ని రాశారు.
వ్యావహారిక భాషోద్యమాన్ని ఉద్యమ స్థాయిలోకి తీసుకువెళ్లడానికి మాట్లాడుకునే భాషలో కథ, కవిత్వం, దేశభక్తి గేయం ఒక సంవత్సరంలో రాశారు.
నీరసం, ఉబ్బసంతోపాటు 'గృహిణి' రక్త విరేచనాలతో కూడా బాధపడుతున్నారు గురజాడ. కానీ వ్యావహారిక భాషలో విద్యా బోధన జరగకుండా కొందరు గ్రాంధిక వాదులు అడ్డుతగిలారు. వాళ్లని వ్యతిరేకిస్తూ తమ అసమ్మతిని సబ్‌కమిటీకి తెలియజేయడానికి కొంత గడువుంది. ఆ గడువు లోపల తన 'మినిట్ ఆఫ్ డిసెంట్‌ని పూర్తి చేసి, సబ్‌మిట్ చేయడానికి అనారోగ్యం ఎంతమాత్రం అడ్డుకాలేదు.
చుట్టూ పుస్తకాలు, కాగితాలు పెట్టుకుని అర ఠావు కాగితాల మీద తాటికాయల్లాంటి అక్షరాల్ని రాయలేక రాస్తూ దాన్ని అందజేశారట.
గురజాడ తన పనిని తాను చేసుకుంటూ పోవడంలో ఎప్పుడూ అనారోగ్యాన్ని లెక్కచేయలేదు. ఎంత బిజీగా ఉన్నా చేయాల్సిన పనుల్ని ఆయన మానలేదు. సాహిత్యం, భాషల విషయంలోనే కాదు ఈ రెండు విషయాల్లో కూడా ఆయన ఆదర్శంగా నిలిచారు. వీటితోపాటు ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది.
కన్యాశుల్కంలో మధురవాణిని ప్రవేశపెడుతూనే 'మొగవాడికయినా ఆడదానికయినా నీతి ఉండాలి'' అనిపిస్తారు. మధురవాణికి కూడా ఓ తల్లి ఉంది. ఆమె మధురవాణికి హితోపదేశం చేస్తుంది. 'చెడని వాడిని చెడగొట్టకూడదు. మంచివారి ఎడల మంచిగాను చెడ్డవారి ఎడల చెడ్డగానూ ఉండమని' ఆ ఉపదేశ సారాంశం.
కన్యాశుల్కం గిరీశం మాటలతో మొదలవుతుంది. ఆయన మాటలతోనే అంతమ వుతుంది. గిరీశం ఆధునిక సమాజానికి చిహ్నాం. అప్పారావు సమకాలీన సంఘాన్ని విమర్శచే యదల్చు కునేవారు కాబట్టే గిరీశం పాత్రని అంత విపులంగా చిత్రించారు.
తర్వాత గురజాడ నేనొక దోషాన్ని దుర్నడతను ఆకర్షవంతం చేశానా? అని తనని తాము ప్రశ్నించుకుని ఆత్మ విమర్శ చేసుకున్నారు. 1914లో గురజాడ, గిడుగుని ఆయన కుమారుడు సీతాపతిని విజయనగరంలో తమ ఇంటికి భోజనానికి పిలిచారు. అన్నం తింటూ సీతాపతి 'కన్యాశుల్కం రెండో ముద్రణ కన్నా మొదటి ముద్రణలోనే కళాశిల్పాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీ నాటకం కన్యాశుల్కమా? గిరీశమా? మొదటి ముద్రణలో గల మధురవాణి పాత్ర రెండో ముద్రణలో నాలుగువంతులు పెరిగింది. ఇట్లా పెంచడంలో మీ ఉద్దేశం యువకులకు ఉత్సాహం ఎక్కువగా కలిగించాలనా. మధురవాణి పాత్ర మిమ్మల్ని ముగ్ధుల్ని చేసిందా'' అని అడిగారట.
వెంటనే గురజాడ గిడుగు వారివైపు తిరిగి ''రామ్మూర్తీ సీతాపతి నన్ను తగిన చోటనే పట్టుకున్నాడు'' అంటూ సీతాపతివైపు తిరిగి ''మన రచనలను మనకొడుకులు విమర్శించడం ఎంత ఆనందకరం. అంతే శోచనీయం కూడా'' అని, తిరిగి సీతాపతి వైపు తిరిగి ''మధురవాణి పాత్రని ఎక్కువ చేయడంలో నాకో సదుద్దేశముంది. ఆమెలో సహజ సిద్ధంగా ఉన్న సద్గుణాలన్నీ చాలా కాలం నుంచి వస్తున్న పడుపు వృత్తి కులంలో పుట్టడం చేత మరుగునపడ్డాయి. సంఘసంస్కరణ సరైన మార్గంలో నడిస్తే ఆమె తన వృత్తికి స్వస్థి చెప్పడమే కాకుండా తానే తన కుల పడుచులకు నాయకురాలై వారందరి వివాహాల్ని యధావిధిగా జరిపించగలదని చూపించుటకు ఆమె పాత్రని పెంచి పోషించి నిరూపించడానికి ప్రయత్నించాను'' అన్నారట.
''పడుపు వృత్తి మాన్పించే ప్రయత్నం, చెప్పినంత సులువైనది కాదు. సాని మేళాలు చూడము, చూడకూడదన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. అందువల్ల ఈ దురాచారం అంతమొందదు సరికదా... ప్రోత్సహించలేము. నాట్య కళ దుష్ప్రాభావమవుతుందనే అభిప్రాయాన్ని వెల్లడించారు.
'నేనెంత హాస్య ప్రసన్నుడినో అంత గంభీరుడను భయంకరుడనుని కూడా'... అని ఓ సందర్భంలో ఆయన తమ గురించి తాము చెప్పుకున్నారు. అప్పట్లో రాజా కొలువులో ఆయన జీతం వంద రూపాయలు. రాజా వారికి రోజూ ఉదయం వార్తా పత్రికలు చదివి వినిపించినందుకు మరో పాతిక రూపాయలిచ్చేవారు.
గేయనాచార్యులు రచించిన రుగ్వేద వ్యాఖ్యను ఈస్టిండియా కంపెనీ సాయంతో ముద్రింపజేశారు. మాక్స్ ముల్లర్ : ఆనంద గజపతి రాజుగారికి ఆ గ్రంథాన్ని చదవా లనిపించింది. తెప్పించమని గురజ ాడను కోరారు.
గురజాడ మాక్స్ ముల్లర్ పండితుడికి రాశారు. ఆయన ప్రతులన్నీ అయిపోయాయి. ఒక్క కాపీ కూడా దొరకదని జవాబిచ్చారు. అంతమంచి గ్రంథం పునర్ముద్రితమైతే అందరికీ అందుబాటులో ఉంటుందని గురజాడ అభిలాష. అందుకని ఇలాంటి గ్రంథ పునర్ముద్రణకి ఆర్థిక సాయం చేస్తే రాజా వారి పేరు చిరస్థాయిగా ఉంటుందని - పునర్ముద్రణకు ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని రాజా వారికి సూచించారు.
ఆయన సలహామీదే గ్రంథ పునర్ముద్రణకు ఎంతవుతుందని మాక్స్ ముల్లర్‌కు రాశారు. ఆయన 'లక్ష రూపాయలు కావాలనిపిస్తుంది. ఈస్టిండియా కంపెనీ అందుకు ముందుకు రాలేదు. హిందూ దేశంలోని ఎందరో స్వతంత్ర రాజులనడిగీ లేదనిపించుకున్నాను. ఇప్పుడు ఈ సంస్థానాధీశుడు ఈ సహకారాన్ని అందించగలడా? అనే సందేహాన్ని ఉత్తరం ద్వారా వెల్లడించాడు.
గురజాడ ఈ ఉత్తరాన్ని రాజా ఆనందగజపతికి చూపించారు కావాలనే. రాజావారికి ఉక్రోషం వచ్చింది. మాక్స్ ముల్లర్‌కి వెంటనే లక్ష రూపాయలు పంపిణీ ఏర్పాటు చూడమని గురజాడకి చెప్పారు. అంతే! మాక్స్ ముల్లర్ ఆనంద గజపతి పేరుమీదే.. ఈయన రుగ్వేద వ్యాఖ్యని పునర్ముద్రించారు. అలా రాజావారు ఓ మంచి గ్రంథం రావడానికి కారణమయ్యారు.
'బాలెన్ టైన్' లఘు కౌముది ప్రచురణకూ రాజావారి దగ్గర నుంచి ఆర్థిక సాయం లభించేలా చూశారు.
లెక్చరర్‌గా ఉన్న గురజాడ రాజావారి ఆంతరంగిక కార్యదర్శి కావడం వల్లనే ఇలాంటి మంచి పనులు చేయగలిగారు. ఒకసారి రాజావారితో గుర్రపుస్వారీ చేస్తూ నెలగాడ కొండ ప్రాంతానికి వెళ్లినప్పుడు గుర్రంమీద నుంచి పడడంతో గురజాడ గొంతు దెబ్బతింది. సన్నగా రాసాగింది. అసలే అర్భకులైన ఆయన మరింత నీరసించారు, పాఠ్యాంశాలు చెప్పలేని స్థితి. అప్పుడు రాజా గురజాడని ఆస్థాన ఎపిగ్రఫిస్ట్‌గా నియమించారు. అందుకే 'కన్యాశుల్కం' మొదట ముద్రణ మీద ఆయన పేరు పక్కన 'ఎపిగ్రఫిస్ట్' అని ఉంటుంది. ఆ తర్వాత ఆంతరంగిక కార్యదర్శి అయ్యారు.
ఎంతో మంది గ్రంథ ప్రచురణకు రాజా దగ్గర నుంచి ఆర్థిక సాయం లభించేలా చూసిన గురజాడ తాము ఇబ్బందిపడైనా కన్యాశుల్కం ప్రచురణ చేశారుగాని రాజా ఆనంద గజపతి రాజు నుండి ఆర్థిక సాయం తీసుకోలేదు. కారణం ఆ నాటకాన్ని రాజుగారికి అంకితమిస్తుండడమే!ప్రతిరోజూ ఉదయం వార్తా పత్రికలను చదివి వినిపించే గురజాడ ఆరోజు హిందూ పత్రికలో ఓ మూల ప్రచురితమైన వార్తని రాజా వారికి ప్రత్యేకంగా చదివి వినిపించారు. ఆదిభట్ల నారాయణదాసుగారి హరికథను విని ముగ్ధుడై మైసూర్ మహారాజా సత్కరించారని వార్త చదివి ఊరుకోకుండా ఆయన విజయనగరం వారేనని, ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తే బాగుంటుందని ఆనంద గజపతికి రాజాకి సూచించారు. ఫలితంగా ఆయన విజయనగర ఆస్థాన విద్వాంసులయ్యారు. ఆనందగజపతి మరణానంతరం దాయాదుల దావా నుంచి రాజా కుటుంబీకుల ఆస్తిని కాపాడి ఇవాళ ఆ ఆస్తి వాళ్లకుండేలా కాపాడి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. దావా జరిగే రోజుల్లో గురజాడ జీతం వంద రూపాయలే! అయినా అవతలి వాళ్లు నలబై వేలు లంచమివ్వజూపితే 'గుప్పెడు అన్నాన్ని అరిగించుకోలేని ఈ అర్బకుడు ఇన్ని వేలేమి చేసుకోగలడు అని సున్నితంగా తిరస్కరించాడు. గురజాడ మరో భాషకు సంబంధించినవారుగా పుడితే అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించి ఉండేవారు. గిడుగు పుట్టిన రోజులను వ్యావహారిక భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గురజాడ జయంతిని ఆధునిక సాహిత్య దినోత్సవంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
No comments:
Post a Comment