Thursday, 1 March 2012

మధ్యాహ్నం ఎండ ఎందుకు మంచిది కాదు?


ఉదయాన్నే వచ్చిన ఎండలో నిల్చుంటే మంచిదేగానీ మధ్యాహ్నం ఎండ మంచిది కాదంటారు. ఎందువల్ల? - కె.ధనలక్ష్మి, శ్రీనగర్‌, కాకినాడ
సూర్యకాంతి చాలా శక్తివంతమైంది. దూరం విషయానికొస్తే దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడున్పప్పటికీ అక్కడ విడుదలయ్యే కాంతిశక్తి మన భూ వాతావరణం చేరే వరకు ఏ ఇబ్బందీ, అడ్డంకీ లేకుండా రావడం వల్ల తీవ్రమైన శక్తివంతంగా ఉంటుంది. భూమి గోళాకారం లో ఉండడం వల్ల భూమి వాతావరణం కూడా భూమిని కప్పిన దుప్పటిలా అది కూడా గోళాకారంగానే ఉంటుంది. తద్వారా చిత్రంలో చూపినట్లు ఉదయాన, సాయం త్రాన (AC) వాతావరణంలో సూర్యు ని కాంతి మధ్యాహ్నం BC) కన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. కాంతి వాతావరణంలో ప్రయాణించే క్రమంలో వాతావరణంలో ఉన్న గాలి అణువులు, దుమ్ము, ధూళి కణాలు సూర్యకాంతిలో కొంత భాగాన్ని చెల్లాచెదురుగా పక్కలకు విక్షేపణం (scattering) చేస్తాయి.

ఈ తతంగం ఎంత ఎక్కువ దూరం కాంతి గాలిలో వెళితే అంత హెచ్చుగా ఉంటుంది. ఎందుకంటే, ఎక్కువ దూరం అంటే ఎక్కువగా అణువులు కదా! ఇలా విక్షేపణం చెందే గుణం తక్కువ తరంగదైర్ఘ్యం (wavelength) ఉన్న నీలం, ఊదా, ఆకుపచ్చ రంగులకు ఎక్కువ. అందువల్ల సాయంత్రం, ఉదయం పూట సూర్యకాంతిలో అధికభాగం ఈ కోవకు చెందిన రంగులు విక్షేపణం చెందడం వల్ల మన వద్దకు (మన కంటికి) చేరే కాంతిలో ఎరుపు, నారింజ, రంగులే అధికంగా ఉంటాయి. అందువల్లే సూర్యాస్తమయం లోనూ, సూర్యోదయం సమయంలోనూ, సూర్యుడు పెద్దగాను, ఎరుపుగాను కనిపిస్తాడు. కానీ మధ్యాహ్నం సమయంలో సూర్యకాంతి భూమి వాతావరణంలో తక్కువ దూరమే ప్రయాణిస్తుంది. కాబట్టి దాదాపు మొత్తం కాంతి మనల్ని చేరుతుంది. ఎందుకంటే విక్షేపణం చెందించే గాలి మందం తక్కువ.

పైన చెప్పిన వివరణ ప్రకారం మన శరీరానికి ఉదయం సాయంత్రాలలో తక్కువ కాంతిశక్తి, మధ్యాహ్నం పూట ఎక్కువ కాంతిశక్తి చేరుతున్నట్టే కదా! కాబట్టి మధ్యాహ్నం ఎండ చాలా ప్రమాదం. ఒక్కొక్కసారి వడదెబ్బ (sun stroke) తగిలి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడగలదు. మధ్యాహ్నం సమయంలో గొడుగు సాయం తీసుకోవాలి. లేదా నీడ పట్టున పనిచేయాలి.

No comments:

Post a Comment