Wednesday, 28 March 2012

జన్యుమార్పిడి పంటలు ... సామాజక కోణం...


కంపెనీ, ప్రభుత్వ సమాచారం ప్రకారం బిటి పత్తి సాంకేతికం ఇటీవల ఫలవంతమైన సాంకేతికాల్లో ఒకటి. కాయ తొలుచు పురుగు నివారణకు ఏ మందులూ వాడాల్సిన పనిలేదని, అధిక దిగుబడి వస్తుందనే లక్ష్యంతో దీని సేద్యానికి 2002, మార్చి 26న అనుమతివ్వబడింది. దీంతో బిటి సాంకేతికానికి దశాబ్దకాల అనుభవం. అయినా, 2004-05 నాటికి పత్తిలో దీని విస్తీర్ణం 5.6 శాతం మాత్రమే. ఆ తర్వాత ఇది వేగంగా విస్తరించి, 2011-12 నాటికి 90 శాతానికి చేరింది. కానీ, ఇదే జన్యువులు కలిగిన బిటి వంగ సేద్యానికి ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా ఇది సురక్షితమని తేలేంతవరకూ అనుమతి నిరవధికంగా వాయిదాపడింది. దీంతో దాదాపు 20కి పైగా ఇతర ఆహార పంటల్లో ఈ సాంకేతికంతో రూపొందించిన కొత్తరకాల విడుదలకు అన్నీ సిద్ధమై ఆగిపోయాయి. కంపెనీ, ప్రభుత్వం చెప్తున్నట్లుగా బిటి పత్తి సఫలమైతే, అదే జన్యువుల్ని కలిగిన బిటి వంగ పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందనేది ఆలోచించా ల్సిన అంశం. పెరుగుతున్న ఆహార, ఇతర వ్యవసాయోత్పత్తుల అవసరాలని తీర్చుకోవాలంటే జన్యుమార్పిడి పంటలు మినహా మరో గత్యంతరం లేదని, అందువల్ల బిటి వంగను వ్యతిరేకిస్తున్న వారిని ఆధునిక సాంకేతిక వ్యతిరేకులుగా, అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తున్నారు. ఫలితంగా రైతులకు, దేశానికి ఎంతో నష్టం కలిగిస్తున్నారని ముద్ర వేస్తున్నారు. ఈ వ్యతిరేకతకు సాంకేతిక కారణాలకన్నా, ఇతర కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనీ దుష్ప్రచారమూ చేస్తున్నారు. ఈ లోపల ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం (2011-12) పత్తి రైతుల ఆత్మహత్యలు ఒకేసారి పెరిగి, కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జన్యుమార్పిడి పంటల సాంకేతికంలో ఇమిడి వున్న సామాజిక కోణాలను 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
గత పదేళ్లుగా వాణిజ్యస్థాయిలో సేద్యమవుతున్న జన్యు మార్పిడి పంట బిటి పత్తి. దీనిలో 'బాసిల్లస్‌ తురింజినిసిస్‌' అనే బ్యాక్టీరియాకు సంబంధించిన జన్యువులను ప్రవేశపెట్టారు. ఫలి తంగా పత్తిలో ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన విషపదార్థం నిరంతరం ఉత్పత్తై వేరు సహా మొక్క అన్నిభాగాలకు విస్తరి స్తుంది. కాయలో ఉన్న ఈ విషపదార్థం కాయతొలుచు పురుగు లను నియంత్రిస్తుంది. ఇది ఈ సాంకేతికంలో ఇమిడి ఉన్న సిద్ధాంతం. ఈ సాంకేతికాన్ని 'అంతర్గత బిటి విష ఉత్పత్తి (ఎం డోటాక్సిన్‌) సాంకేతికం' గా వ్యవహరిస్తున్నారు. ఈ విషపదార్థం ప్రధానంగా సీతాకోకచిలుకకు సంబంధించిన లార్వాలను చంపుతుంది, నియంత్రిస్తుంది. ఈ జన్యువులను ఇప్పటికే 35 పంటల్లో ప్రవేశపెట్టారు. వీటిలో ఆహారపంటలు ముఖ్యమైనవి.
బిటి సాంకేతిక ప్రభావం..
ఈ సాంకేతికానికి స్వతహాగా అధిక దిగుబడి ఇచ్చే గుణం లేదు. 2002లో మొదట మహికో మోన్‌శాంటో కంపెనీకి చెంది న బిటి ఎంఇసిహెచ్‌-12, 162, 184 హైబ్రీడ్‌రకాలకు వాణిజ్యసేద్యానికి అనుమతిచ్చారు. ఈ రకాలు అప్పటికే సేద్యంలో ఉన్న హైబ్రీడ్‌లతో పోటీపడి, అధికదిగుబడిని ఇవ్వలేకపోయాయి. ఫలితంగా 2005లో వీటి అనుమతి రద్దు చేయబడింది. ఆ తర్వాత ఈ బిటి జన్యువులను అప్పటికే ప్రాచు ర్యం పొందిన బన్నీ, బ్రహ్మ వంటి హైబ్రీడ్‌లలో ప్రవేశపెట్టారు. దీని తర్వాత మాత్రమే ఈ సాంకేతికం ద్వారా రూపొందించిన కొత్త రకాలు అధిక దిగుబడిని తాత్కాలికంగానైనా ఇచ్చాయి. అంటే, బిటి హైబ్రీడ్‌ అధికదిగుబడి వచ్చిన సందర్భాలలో ఆయా హైబ్రీడ్‌ల అంతర్గత సామర్థ్యం వల్లనే కానీ, బిటి సాంకేతికం వల్ల కాదని నిర్ద్వందంగా నిరూపితమవుతుంది. ఇప్పుడు ఇలా 780 బిటి హైబ్రీడ్ల సేద్యానికి అనుమతి ఉంది. 2011-12 నాటికి సేద్యమవుతున్న మొత్తం 850 లక్షల ఎకరాల పత్తిలో 90 శాతం బిటి రకాలే సేద్యమవుతున్నాయి. వీటిలో కూడా ఒకే ఒక కంపెనీకి (మోన్‌శాంటో) చెందిన హైబ్రీడ్లు 85 శాతం మేర సేద్యమవుతున్నాయి.

బిటి సేద్యం తర్వాత పత్తి ఉత్పత్తి రెట్టింపుకు పైగా పెరిగింది. ఈ కాలంలో విస్తీర్ణం మూడున్నర రెట్లు పెరిగింది. మొత్తం హైబ్రీడ్‌ రకాలే వాడుతున్నారు. ఎరువుల వినియోగం పెరిగింది. సాగునీటి విస్తీర్ణమూ పెరిగింది. ఉత్పత్తి పెరుగు దలకు ఇవన్నీ కారణాలే. కానీ, మోన్‌శాంటో కంపెనీ మాత్రం పెరిగిన ఉత్పత్తంతా తన సాంకేతికం వల్లనేనని తప్పుడు ప్రచారం చేస్తోంది. రైతులకు రూ.31,500 కోట్లు అదనపు ఆదాయం వచ్చినట్లు ప్రచారం చేస్తోంది. రైతులకు ఇంత అదనపు ఆదాయం వస్తే వారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది? ఇటీవల పెరిగి, కొనసాగుతున్న పత్తి రైతుల ఆత్మహత్యలకు కంపెనీ ఏమీ జవాబు చెప్పడం లేదు. తప్పుడు ప్రచారాన్ని కంపెనీ తొలగించాలని అడ్వర్టయిజ్‌ మెంటల్‌ కౌన్సిల్‌ కూడా తీర్పు చెప్పింది.
వచ్చిన నేపథ్యం..
సంస్కరణలు, స్వేచ్ఛా వ్యాపారం నియంత్రణ చేయలేని లద్దె, పచ్చ పురుగుల వల్ల 1997లో పత్తి రైతులు వరంగల్‌- కరీంనగర్‌ జిల్లాల్లో బాగా నష్టపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ నేపథ్యంలో, పచ్చ పురుగుల్ని తట్టుకునే శక్తి ఉందంటూ బిటి పత్తి ప్రవేశపెట్టబడింది. అప్పట్లో సామాజిక కార్యకర్తలు, కొంతమంది శాస్త్రజ్ఞులు బిటి సాంకేతిక లోపాల్ని ఎత్తి చూపుతూ రాగల ప్రమాదాల్ని ముందే హెచ్చరించినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. మహికో బిటి హైబ్రీడ్‌లు విఫలమై, అప్పటికే ప్రాచుర్యం పొందిన బన్నీ, బ్రహ్మ వంటి హబ్రీడ్‌లలో బిటి జన్యువుల్ని పెట్టిన తర్వాత మాత్రమే ఇవి నిలదొక్కు కున్నాయి. ఇతర మెట్ట పైర్ల సంక్షోభ నేపథ్యంలో ధరలు కూడా ఇతర పంటల ధరలకన్నా ఆకర్షణీయంగా ఉండటంతో బిటి పత్తి సేద్యం వేగంగా విస్తరించింది.
అవాస్తవ ప్రచారం..
బిటి కొత్తగా ప్రవేశపెట్టినపుడు తన హైబ్రీడ్‌లను వాడితే కాయతొలుచు పురుగు నియంత్రణకు ఎటువంటి మందునూ వాడాల్సిన అవసరంలేదనీ, అధిక దిగుబడి వస్తుందనీ, ఖర్చు తక్కువవుతుందనీ ప్రచారం చేసింది. ఈ పదేళ్ల అనుభవంలో ఇవన్నీ అవాస్తవాలని ఋజువైనాయి. కొద్ది కాలంలోనే బోల్‌గార్డ్‌-1 కాయతొలుచు పురుగును తట్టుకొనే శక్తిని కోల్పోయింది. ఆ తర్వాత దీనిని కంపెనీ కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఇదే జన్యువులు కలిగిన బోల్‌గార్డ్‌-2 రకాన్ని విడుదల చేసింది. దీనిలో కూడా తట్టుకునే శక్తి వేగంగా వస్తుంది. పురుగు ఉధృతాన్ని గమనిస్తూ అవసరమనుకుంటే కాయతొలుచు పురుగు నియంత్రణకు మందుల్ని వాడాలని ఇపుడు కంపెనీయే సూచిస్తుంది. పిచికారీల (స్ప్రే) సంఖ్య మొదట తగ్గినా ఆ తర్వాత పెరిగాయి. ముఖ్యంగా రసం పీల్చు పురుగుల ఉధృతం పెరిగింది. వాటి ద్వారా వచ్చే తెగుళ్లూ ఎక్కువయ్యాయి. ఆకుముడత తెగులు బెడదగా మారింది. దీంతో పురుగుల మందు వినియోగం దాదాపు ముందు స్థాయికి పెరిగింది. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రకారం బిటి రకానికి 15 శాతం ఎరువుల్ని ఎక్కువగా వేయాలి. సాగునీటి అవసరమూ ఎక్కువే. బెట్టనూ ఏమాత్రం తట్టుకోలేదని రైతులు గ్రహించారు. మొదట దిగుబడి పెరిగినట్లు కనిపించినా ఆ తర్వాత దిగుబడి తగ్గిపోతూ ఉంది (వివరాలు వేరేచోట). అంతిమంగా, రైతులకు ఖర్చులూ పెరిగాయి. రిస్కూ పెరిగింది. తద్వారా కంపెనీ ప్రచారంలోని డొల్లతనం వెల్లడైంది.
ఆహారంలో..
వంగలో బిటి జన్యువుల్ని పెట్టారు. కోసే సమయంలో కాయలో బిటి విషం పురుగును చంపేస్థాయిలో ఉంటుంది. అదే కాయల్ని తిన్నప్పుడు విషం నేరుగా జీర్ణకోశంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం కాదని నిర్ద్వందంగా నిరూపించాల్సిన బాధ్యత కంపెనీదే. దీనికి అవసరమైన పరీక్షల్ని క్షుణ్ణంగా చేయకుండానే తనకున్న పలుకుబడితో బిటి వంగను వాణిజ్య సేద్యానికి అనుమతి పొందేందుకు యత్నించింది. దాదాపుగా సఫలమైంది. కానీ, ఇది ముందుగానే తెలుసుకొని మేల్కొన్న ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. రాష్ట్ర ప్రభు త్వాలూ వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో, ప్రజాభిప్రాయాన్ని సేకరించిన అప్పటి పర్యావరణ శాఖ కేంద్ర మంత్రి అవసరమైన పరీక్షలు పూర్తయ్యి, సురక్షితమని నిరూపించేవరకూ అనుమతిని నిరవధికంగా వాయిదా వేశారు. నేరుగా తినని బిటి పత్తి, తినే ఆహారం ఒకటే కాదని ప్రజలు గ్రహించారు. కానీ కంపెనీ, జనెటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రూవల్‌ కమిటీలు గుర్తించకపోవడం దేశ దౌర్భాగ్యం. ఈనాటికీ, శరీరంలో ప్రవేశించిన బిటి విషం ఎలాంటి ప్రభావాల్ని కలిగిస్తుందనేది నిర్దిష్టంగా నిరూపించే పరిశోధనలు చేయకుండానే బిటి వంగను వ్యతిరేకించిన వారంతా ఆధునిక సాంకేతిక వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. సంబంధిత కేంద్రమంత్రినీ వేరే శాఖకు మార్చి వేశారు. కారణాల్ని ఊహించడం కష్టం కాదు.
ఇతర జన్యుమార్పిడి పంటలు...
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇప్పుడు 50కి పైగా పంటల్లో జన్యుమార్పిడి పరిశోధనలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. వీటన్నింటిలో విదేశీ, బహుళజాతి సంస్థలే కీలకం. జాతీయ పరిశోధనా సంస్థల పాత్ర నామమాత్రపు స్థాయికి దిగజారింది.
బిటి సాంకేతిక సామర్థ్యంపై విమర్శ వచ్చినప్పుడల్లా పెరుగుతున్న ఆహార, వ్యవసాయోత్పత్తుల అవసరాల్ని తీర్చుకోవడానికి 'జన్యు మార్పిడి సాంకేతికం' అనివార్యమని బిటి సమర్థకులు ప్రచారం చేస్తున్నారు. ఈ కొత్త సాంకేతికం బెట్ట పరిస్థితులనూ, చవిటి నేల పరిస్థితులనూ తట్టుకోవడానికి, పోషకలోపాల్ని సరిదిద్దడానికి, ముఖ్యంగా విటమిన్‌ ఎ సరఫరాకు, ఇతర పోషకాల్ని సమర్థవంతంగా అందించడానికి అవసరమని చెప్తుంటారు. అంతర్గత విష తయారీ సాంకేతికపై వీరు నేరుగా చర్చించరు. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల కన్నా లేక అసలు పురుగు మందుల్నే నేరుగా వాడని పురుగు నియంత్రణ పద్ధతులకన్నా అంతర్గత విష తయారీ సాంకేతికం (ఎండో టాక్సిన్‌ ప్రొడక్షన్‌) సమర్ధవంతమైందని, సుస్థిరమైందని నిరూపించే ఏ ప్రయోగాల ఫలితాల్నీ చూపించడం లేదు. ఏ కొత్త సాంకేతికాల్ని ప్రవేశపెట్టాలన్నా అప్పటికే వాడుకలో ఉన్న సాంకేతికం కన్నా కొత్తది మెరుగైనదని నిరూపించిన తర్వాతనే అంగీకరించాలి. ఇది సైన్స్‌ సూత్రం. దీన్ని పాటించకుండా కేవలం రాజకీయ, ఆర్థిక పలుకుబడితో జన్యు మార్పిడి సాంకేతికాల్ని రుద్దే ప్రయత్నం అభిలషణీయం కాదు.
గుత్తాధిపత్యం..
ప్రపంచీకరణ విధానాలు, భారత-అమెరికా వ్యవసాయ విజ్ఞాన చొరవ ఒప్పందం తర్వాత భారత వ్యవసాయ పరిశోధనల ఎజెండా మారిపోయింది. చిన్నకమతాల రైతుల అవసరాలకు బదులు కంపెనీల అవసరాలనే కేంద్ర బిందువుగా మార్చి, అమలు చేయబడుతుంది. విత్తన నియంత్రణ, సరఫరా బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుని, ప్రయివేటు కంపెనీలకు అప్పగించింది. దీని ఫలితమే కేవలం 3, 4 ఏళ్లల్లో మోన్‌శాంటో కంపెనీకి పత్తి ఉత్పత్తిపై గుత్తాధిపత్యం ఏర్పడింది. దీంతో విత్తన ధరలు, అందించే సాంకేతికం వంటి అన్ని విషయాలపై ఈ కంపెనీయే పెత్తనం చేస్తోంది. పైకి ఏమి చెప్పినప్పటికీ ప్రభుత్వ పాత్ర ప్రేక్షకస్థాయికి దిగజారింది. ఆహారధాన్యాల్లో ఈ గుత్తాధి పత్యం ఏర్పడితే రాబోయే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలు ఊహించడానికే భయంకరంగా ఉంటాయి. ఇవి బ్రిటిష్‌ వలసపాలనను పోలి ఉంటాయి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను, 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
సంక్షోభంలో పత్తిరైతు..
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి కేంద్ర పత్తి పరిశోధనా సంస్థల సమాచారం ఆధారంగా జనవరి 9, 2012న పత్తి వేసే అన్ని రాష్ట్రాలకూ రహస్య సలహాల్ని అందించినట్లు తెలుస్తుంది. వీటి ప్రకారం వివిధ సేద్య వాతావరణ ప్రాంతాల్లో మంచి స్థానిక సమగ్ర వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులను గుర్తించి, వారి అనుభవాలను ఇతర చిన్న రైతులకు అందించాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా బిటి పత్తి ఉత్పాదకత తగ్గుతూ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2011-12లో ఒకేసారి పత్తి రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగాయి. ఈ కాలంలో విత్తనం, సస్యరక్షణ మందులు, ఎరువుల ధరలు, సాగునీటి ఖర్చులు పెరిగాయని, అదే సమయంలో పత్తి ఉత్పత్తి తగ్గిందని ఈ సలహాల్లో పేర్కొనట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో..
బిటి పత్తి 2002-03లో ప్రవేశపెట్టిన తర్వాత విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ 2010- 11 నాటికి 44.6 లక్షల ఎకరాలకు చేరింది. ఈ మధ్య కాలంలో దూది ఉత్పత్తి ప్రభుత్వ లెక్కల ప్రకారం 19.75 లక్షల బేళ్ల నుండి 53.0 లక్షల బేళ్లకు పెరిగింది. సగటు ఎకరా దూది దిగుబడి 167 కిలోల నుండి 2006-07లో 252 కిలోలకు, 2007-08లో 276 కిలోలకు పెరిగింది. ఆ తర్వాత ఇది క్రమంగా తగ్గుతూ 2010-11 నాటికి 202 కిలోలకు పడిపోయింది. ఇది 2003-04 స్థాయికన్నా చాలా తక్కువ. ఇక 2011-12లో పత్తి 47 లక్షల ఎకరాల్లో సేద్యమైంది. ఉత్పత్తి, దిగుబడి పూర్తి అంచనాలు అందుబాటులో లేవు. వేసిన పైరులో 70 శాతం పైగా బెట్ట వల్ల 50 శాతం పైగా ఉత్పాదకతను కోల్పోయినట్లు ప్రాథమిక ప్రభుత్వ అంచనాలు తెలియజేస్తున్నాయి.
మీకు తెలుసా..?
* సాంప్రదాయ బ్రీడింగ్‌ (ప్రజననం) పద్ధతిలో ఒకే పంటలో అభిలషణీయమైన గుణగణాలు కలిగిన రెండు రకాల మధ్య సంక్రమణం సాధ్యమవుతుంది. తద్వారా కొత్త రకాల్ని రూపొందిస్తారు. భిన్న జాతుల మధ్య ఇలాంటి సంక్రమణం సాధ్యం కాదు. ఇలా వచ్చిన సంతాన గుణగణాలకు స్థిరమైన వేలాది జన్యువులు కలిగిన క్రోమోజోములు ఆధారం. ఇవి స్థిరత్వం కలిగి ఉంటాయి.
* జన్యుమార్పిడి రకాల్లో భిన్న జాతుల మధ్య గుర్తించిన కొన్ని జన్యువులను ఎంపిక చేసిన వేరే జాతిలో ప్రవేశపెట్టవచ్చు. తద్వారా వచ్చిన సంతానం తల్లిదండ్రుల గుణాలు కలిగి ఉంటాయి. అయితే, ఇవి కొన్ని జన్యువుల ఆధారంగానే ఉండడంతో వీటి స్థిరత్వం తక్కువ. ఉదా: బిటి పత్తిలో బ్యాక్టీరియాకు చెందిన క్రై1ఏసి లాంటి జన్యువులను పత్తిలో ప్రవేశపెట్టడం వల్ల వచ్చిన సంతానంలో బాక్టీరియాకు చెందిన విషపదార్థ తయారీ గుణం ఉంటుంది. కొత్తరకాల్ని రూపొందించడంలో ఈ పద్ధతి ఎక్కువ అవకాశాల్ని అందిస్తుంది. కానీ, అన్ని పరిమాణాల్నీ ముందే ఊహించలేం. సాంప్రదాయ బ్రీడింగ్‌ పద్ధతిలో రూపొందించిన సంతానంతో జన్యుమార్పిడి సంతానాన్ని నేరుగా పోల్చలేం. దేని ప్రత్యేకత దానిదే.
* పత్తి:-గింజలతో కూడినది. దీనిలో దూది బరువు కేవలం మూడోవంతు కాగా, మిగతాది గింజల బరువే.
* దూది:- గింజలు తీసివేసినది.
* బేలు:- 170 కిలోల దూది.

No comments:

Post a Comment