Tuesday, 13 March 2012

భూగోళం వేడెక్కడాన్ని నివారించలేమా?

భూగోళం వేడెక్కడాన్ని నివారించలేమా?

'మీ భూగోళానికి మీరు కావాలి! వాతావరణ మార్పులను సమైక్యంగా ఎదుర్కొందాం!' అనే సందేశంతో ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ 38వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంలో (జూన్‌5-2009) పిలుపునిచ్చింది. దీనర్థం ప్రపంచ పర్యావరణాన్ని పరిరక్షించడానికి, భూగోళం వేడెక్కకుండా ఉంచడానికి ఏ ఒక్కరికీ సాధ్యంకాదని, ఇది సమస్త ప్రజలకు సంబంధించిందని, ఈ బృహత్‌ కార్యంలో అందరూ పాలుపంచుకొని భూగోళాన్ని రక్షించాలని ఈ సందేశం తెలుపుతుంది. ఈ సందేశం వాస్తవరూపం దాల్చాలంటే ప్రపంచదేశాలలోని ప్రజలందరూ వ్యక్తిగతంగా, సామూహికంగా వారి వారి ప్రభుత్వాల ద్వారా నిర్ణయాలు తీసుకొని భూగోళం వేడెక్కకుండా నివారించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
అసలు భూగోళం ఎందుకు వేడెక్కుతుంది అనేది పలుసందర్భాల్లో తెలుసుకున్నాం. భూమి వేడెక్కడానికి ప్రధానకారణం పెరుగుతున్న బొగ్గు, పెట్రోలియం పదార్ధాల వాడకం, అడవుల నరికివేత. దీని దుష్ప్రభావాలు అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాల రూపంలో చూస్తున్నాం. అడవుల నరికివేత, గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల ధనికుల జీవనశైలి వల్ల పెరుగుతుండగా, పేదలు వీని దుష్ప్రభావాలకు ప్రధానంగా గురవుతున్నారు.
భూగోళం వేడెక్కెడానికి ప్రధానకారణం వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి, కార్బన్‌ డై ఆక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, ఓజోన్‌, ఫ్లోరో కార్బన్‌ వాయువులు. 18వ శతాబ్దంలో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం బొగ్గు, పెట్రోలియం పదార్థాల వాడకాన్ని బాగా పెంచాయి. ఇవి వేడిని, కార్బన్‌ డై ఆక్సైడ్‌, మీథేన్‌, గంథకం కలిగిన వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. ఫలితంగా వాతావరణం వేడెక్కుతుంది. ఈ వాయువుల విడుదల వల్ల 20వ శతాబ్దంలో భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత సరాసరి దాదాపు 0.75 + 0.18 డిగ్రీల సెంటిగ్రేడ్‌ పెరిగింది. ఇదేవిధంగా 21వ శతాబ్దంలో వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి ఉష్ణోగ్రత 1.1 నుండి 6.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకూ పెరగవచ్చని అంచనాలున్నాయి. ఇప్పటికే మన దేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 48-50 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల వరకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ పోతే మనలాంటి దేశాల ప్రజలు అసలు భూగోళం మీద బతికి బట్టకట్టగలరా? అనే ప్రశ్న తీవ్రంగా ముందుకు వస్తుంది. పెరుగుతున్న ఈ భూ ఉష్ణోగ్రతలు ధృవప్రాంతాల్లోనే మంచుగడ్డలను పెద్దఎత్తున కరిగిస్తున్నాయి. ఫలితంగా సముద్ర మట్టం పెరిగి తీరప్రాంతాలను ముంచుతుంది. మలావీ దేశం (ద్వీపకల్పం) దాదాపు మునిగిపోయే స్థితిలో ఉంది. అక్కడ ఐదులక్షల జనాభా నివసిస్తున్నారు. వీరిని ఎక్కడికి తరలించాలా అని ఆలోచిస్తున్నారు. సముద్ర నీటి మట్టం ఇలాగే పెరిగిపోతూ ఉంటే మన కొల్‌కతా లాంటి పట్టణాలు కూడా తీవ్ర ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల భూగోళం వేడెక్కకుండా నివారించాల్సిన అవసరం ఉంది.
సామూహిక చర్యలు
సామూహికంగా ప్రజలు తమ తమ ప్రభుత్వాలు బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తుల వాడకంపై నియంత్రణ వహిస్తూ, తిరిగి వాడగల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించే విధంగా ఒత్తిడి తీసుకోవాలి. ముఖ్యంగా పన్నుల ద్వారా, ఇతర ప్రోత్సాహకపద్ధతుల ద్వారా గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలపై పరిమితులు నియమించి, ఆచరించేలా అక్కడ పరిశ్రమలపై ఒత్తిడి తీసుకురావాలి. విద్యుదుత్పత్తి పరిశ్రమల నుండి విడుదలయ్యే కార్బన్‌డైఆక్సైడ్‌ వాతావరణంలోకి వెళ్లిపోకుండా సేకరించి, నిల్వ చేయాలి. ఈ వాయువును ఇతర పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. దీనికై ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలను అమలు చేయించాలి. జలవిద్యుత్‌, పవన విద్యుత్‌, సౌరశక్తి వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వచర్యలు ఉండాలి. ఇంధన వినియోగాన్ని తగ్గించి, గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించేందుకు సమిష్టి, నిరాడంబర జీవనశైలిని ప్రజల్లో ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. వ్యవసాయ, ఇతర వ్యర్థపదార్థాలతో తయారయ్యే ద్వితీయశ్రేణి జీవ ఇంధనాల ఉత్పత్తి, వాడక కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు ఉండాలి.
వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన చర్యలు
సమిష్టి ప్రయోజనం కోసం సమిష్టి సమాలోచన, వ్యక్తిగత కార్యక్రమాలు కూడా అవసరం.
భూగోళం వేడిని నియంత్రించే లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి మనిషి ఒక చెట్టును నాటాలని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటితే సంవత్సరంలోనే దాదాపు ఏడు బిలియన్‌ చెట్లు నాటినట్లు అవుతుంది. ఇవి పెరిగి, పెద్దవుతూ భూగోళ వేడిని తగ్గిస్తాయి.
నిత్యజీవితం పొదుపుగా, నిరాడంబరంగా ఉండే జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఇంధనాన్ని ఆదా చేసే చర్యలే. ఇవి ఖర్చును కూడా తగ్గించే పొదుపు చర్యలే.
మనకు అవసరం లేని, ఇతరులకు అవసరం గల ఎన్నో వస్తువులు మనవద్ద ఉంటాయి. ఇటువంటి వస్తువులను వృధాగా పారేయకుండా అవసరం ఉన్న వారికి నేరుగా గానీ, లేదా సేవా సంస్థల ద్వారా గానీ అందించాలి.
ఇంటివద్ద నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. వృధా చేయకూడదు. ఇంధనాన్ని ఆదా చేసేందుకు వేడినీటి కుళాయిల నుండి వేడి నష్టపోకుండా రక్షణకవచాన్ని ఏర్పాటుచేయాలి.
వాడి పడేసే వస్తువులకు బదులు (యూజ్‌ అండ్‌ త్రో) పలుమార్లు వాడుకోగలిగిన వస్తువులనే ఉపయోగించాలి.
పురుషులు వాడి పడేసే రేజర్లకు బదులు బ్లేడ్లను మార్చి వాడగల రేజర్లను మాత్రమే ఉపయోగించాలి. ఇదేవిధంగా పేపర్‌ టవల్స్‌కు బదులుగా గుడ్డతో చేసిన టవల్స్‌ను వాడాలి. ఉతికి తిరిగి వాడుకోవాలి.
ఇప్పుడు పలుపేపర్లు కొనేవాళ్లు పక్కవారితో పంచుకొని కొనేపేపర్ల సంఖ్యను తగ్గించాలి. వీలున్నచోటల్లా లైబ్రరీలో చదవడాన్ని అలవాటు చేసుకోవాలి.
అన్నమూ, ఇతర ఆహారపదార్థాలను తీసికెళ్లేటప్పుడు వాడి పారేసే డబ్బాలకు బదులు తిరిగి కడిగి వాడుకోగల స్టీలు ఇతర బాక్సులను వాడుకోవాలి.
ఇల్లు విడిచి వెళ్లే ముందు అన్ని స్విచ్‌లను ఆపేయాలి. ముఖ్యంగా ఛార్జి పెట్టే ప్లగ్గులను ఛార్జి చేయనప్పుడు తీసివేయాలి.
షాపుకు వెళ్లే ముందు ఏదైనా సంచిని తీసికెళ్లాలి. ప్లాస్టిక బ్యాగ్‌లను వాడకూడదు.
ప్రయాణానికి సాధ్యమైనంతవరకు పబ్లిక ట్రాన్స్‌పోర్టును వాడాలి. ముఖ్యంగా అతి తక్కువ శక్తితో రైళ్లు ప్రయాణీకులను చేరుస్తాయి. కార్లు వాడేవారు తోటివారితో పంచుకోవాలి. వీలున్నప్పుడల్లా దగ్గర దూరాలకు సైకిల్‌ మీద ప్రయాణం చేయవచ్చు. లేదా నడవవచ్చు. ప్రభుత్వం కూడా పబ్లిక ట్రాన్స్‌పోర్టు చౌకగా, సమర్ధవంతంగా, తరచుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
ట్రాఫిక జామ్‌ల్లో ఇంజన్‌ను ఆపేయాలి.
వాహనాలను నడిపేటప్పుడు ఇంధన సామర్థ్యం అత్యధికంగా ఉండేలా నడపాలి.
ఆఫీసుల్లో, ఇతరత్రా పేపర్‌ను రెండువైపులా వాడాలి. పొదుపుగా వాడాలి. చిన్న చిన్న మెసేజ్‌లు పంపడానికి, లేదా చిత్తు పనికి అవసరంలేని ఒకవైపు వాడిన పేపర్లను ఉపయోగించుకోవాలి.
ఇంధనాన్ని పొదుపుగా వాడే పరికరాలనే వాడాలి. ఉదాహరణకు మామూలు బల్బులకు బదులు విద్యుత్‌ను పొదుపు చేసే సిఎఫ్‌ బల్బులను వాడవచ్చు. వీని ధర తగ్గేలా ప్రభుత్వం వీటి ఉత్పత్తిని ప్రోత్సహించాలి.
ఇంటివద్ద ఎయిర్‌ కండిషన్లు వాడితే, ఫ్యాన్లతో కలిపి కనీస సమయంలోనే ఎయిర్‌ కండిషన్లు వాడాలి.
వండేటప్పుడు ఇంధనం పొదుపయ్యేలా వండే పాత్ర, పొయ్యి అనుగుణంగా ఉండాలి.
లపర్యావరణాన్ని పరిరక్షించే ఉత్పత్తులనే వాడాలి.
- విజ్ఞానవీచిక డెస్క్‌

No comments:

Post a Comment