ఆదిమ మానవుడికి, పాతకాలం ప్రజలకు సైన్సు తెలీదు కాబట్టి వాళ్లు నమ్మిన వాటిల్లో చాలామటుకు నేటి సైన్సు సూత్రాలకు విరుద్ధంగా ఉన్నట్టు ఋజువైంది కాబట్టి, అలాంటివన్నీ మూఢనమ్మకాలనుకొంటే, మూఢ నమ్మకాలే ముందు ఆ తర్వాతే సైన్సు అనుకోవడానికి ఆస్కారముంది. లేదా మనిషికే తెలివితేటలు, పరిశీలించే గుణం, ప్రశ్నించేతత్వం ఉన్నాయి కాబట్టి, ఏ ఆధారమూ లేకుండా ఏ నమ్మకాన్నీ ఏర్పర్చుకోడు కాబట్టి సైన్సు (విజ్ఞానం లేదా జ్ఞానం) ముందు, ఆ తర్వాతే మూఢనమ్మకాలని కూడా భావించే అవకాశమూ ఉంది. నిజానికి ఈ రెండు వాదనలూ సరికావు. ఇందులో ఏదో ఒక వాదమే కరెక్టు అనుకుంటే అదే పెద్ద మూఢనమ్మకం అవుతుంది. ఈ ప్రశ్న 'విత్తు ముందా, చెట్టు ముందా' అన్న మీమాంసకు చెందింది కాదు. ఆ విషయంలో విత్తే ముందు అని తేల్చుకున్నాం. అలాగే 'గుడ్డు ముందా, పక్షి ముందా' అన్న ప్రశ్న కోవలో కూడా ఈ ప్రశ్న చేరదు. ఎందుకంటే పక్షి కన్నా గుడ్డే ముందని తెల్సుకున్నాం.
కానీ 'విజ్ఞానశాస్త్రం ముందా? లేక మూఢనమ్మకాలు ముందా?' అన్న ప్రశ్నలో మీమాంస అటోయిటో తేలేదికాదు. మానవ చరిత్రలో నేటివరకూ ఈ రెండు విషయాలు దాదాపు సమాంతరంగా నడిచాయి. నేటికీ నడుస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు నా తలలో మెదడున్నట్టు నేను విశ్వసిస్తున్నాను. దాన్ని ఋజువు చేసుకోవడానికి నేను తలను బద్దలు కొట్టుకొని మెదడు ఉందా, లేదా అని మొండివాదన చేయను. తలలు పగిలి చనిపోయిన వారి తలల్లో మెదడు ఉన్నట్టు, శవాలను వైద్యకళాశాలల్లో శస్త్ర పరీక్ష (dissection) చేసేపుడు ఆ మనుషుల తలల్లో మెదడు ఉన్నట్టు నేను చూశాను. కాబట్టి నా తలలో కూడా మెదడు ఉన్నట్టు నేను నమ్ముతున్నాను. ఇది శాస్త్ర పరిజ్ఞానం.
బిగ్‌బ్యాంగ్‌కు ముందర విశ్వం లేనేలేదని వాదించే వారున్నారు. ఏ ఆధారం లేకుండా ఏర్పర్చుకొనే అభిప్రాయాలను నమ్మకాలు లేదా విశ్వాసాలు అంటాం. సరైన శాస్త్రీయ ఆధారం ప్రాతిపదికన ఏర్పర్చుకొనే నమ్మకాలను, విశ్వాసాలను శాస్త్ర పరిజ్ఞానం (scientific knowledge) అంటాం. రుజువైన శాస్త్ర పరిజ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాల్ని మాత్రమే మూఢనమ్మకాలు అనాలి. ఒక నమ్మకాన్ని మూఢనమ్మకమని తేల్చేందుకు ఋజువు లేనంతవరకూ దాన్ని నమ్మకంగానే గౌరవించాలి. బిగ్‌బ్యాంగ్‌కు ముందర కూడా విశ్వం మరో గుణంలో ఉందని భావించే వారూ ఉన్నారు. ఇందులో ఎవరిదీ మూఢనమ్మకం కాదు. ఉదాహరణకు 16వ శతాబ్దంలో గెలీలియో ప్రయోగం ద్వారా ఋజువు చేయనంతవరకూ ఓ పెద్ద రాయిని, ఓ చిన్న రాయిని కొంత ఎత్తు నుంచి ఒకేసారి వదిలితే పెద్దరాయే ముందు పడుతుందనేది అప్పటి ప్రజల్లో ఉన్న నమ్మకం.
అంతేగానీ మూఢనమ్మకం కాదు. కానీ గెలీలియో ప్రయోగపూర్వకంగా పెద్దరాయి, చిన్నరాయి ఒకేసారి కిందపడతాయని ఋజువు చేశాక (16వ శతాబ్దంలో ఆ ప్రయోగానంతర చరిత్రకాలంలో) కూడా ఎవరైనా పెద్దరాయే ముందు పడుతుందని నమ్మితే అది మూఢనమ్మకం అవుతుంది. ఇనుమును, బొగ్గును, పాదరసాన్ని బంగారంగా మార్చవచ్చని రసవాదులు (Alchemists) విఫల ప్రయత్నాలు చేశారు. ఆనాడు మూలకాలు, సంయోగ పదార్థాలు, లవణాలు, పరమాణువులు, పరమాణు కేంద్రకం, చర్యలలో శక్తి ప్రమేయం తదితర విషయాలు తెలీవు. కాబట్టి, వారి ప్రయత్నాలను మూఢనమ్మకాలు అనకూడదు. కేవలం నమ్మకాలనే అనాలి. కానీ నేడు ఉడకబెట్టి, లేదా రోట్లో దంచి, లేదా ఎండలో ఆరబెట్టి ఇనుమును బంగారంగా మార్చడానికి ఎవరయినా ప్రయత్నిస్తే అది మూఢనమ్మకం అవుతుంది. ఎందుకంటే ఇనుము, బంగారం వేర్వేరు మూలకాలనీ (elements) వాటిని పరస్పర వినిమయం (mutually converted) గా చేయాలంటే కేంద్రక చర్యలే (Nuclear processes) శరణ్యం అనీ, ఆ చర్యలు సాధారణ పరిస్థితుల్లో వీలుకాదనీ ఋజువైంది. నేడు పదార్థాన్ని శూన్యం నుంచి సృష్టించలేమని ఋజువైంది. కానీ బాబాలు శివలింగాల్ని తీస్తారని నమ్మడం మూఢనమ్మకమే.
నక్షత్రరాశులు శరవేగంతో కదుల్తూ ఉన్నాయి. వాటి ప్రభావం బిడ్డల మీద ఆవగింజలో అరవై కోట్ల కోట్ల వంతు కూడా లేదని సైన్సు ఋజువు చేసింది. కానీ జ్యోతిశ్శాస్త్రాన్ని ఇంకా నమ్మేవాళ్ల నమ్మకం మూఢనమ్మకం. కాలానికి రంగు, రుచి, వాసన లేదు. అన్ని సెకన్లు ఒకేతీరుగా ఉన్నాయని ఋజువైంది. కానీ ఇది మంచికాలం, అది దుర్ముహూర్తం, ఇది వర్జ్యం, అది రాహూకాలం వంటి నమ్మకాలను మూఢనమ్మకాలుగా పరిగణించాలి. ఇలా ఋజువైన ఆయా సమకాలీన శాస్త్ర సూత్రాలకు విరుద్ధంగా ఏర్పర్చుకున్న నమ్మకాలను మూఢనమ్మకాలని అంటారు. ఒక నమ్మకాన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేయాలంటే అది ఎందుకు మూఢత్వమో తెలియజేసే ప్రాతిపదిక (yardstick or basis)ఉండాలి. సైన్సే ఓ గొప్ప ప్రాతిపదిక. అయితే ''నేటి సైన్సు సూత్రాలు రేపు మారవచ్చు కదా! ఇప్పుడు సైన్సు సూత్రాలకు విరుద్ధంగా నా నమ్మకం ఉన్నంత మాత్రాన నా నమ్మకాన్ని మూఢనమ్మకంగా ఎలా కొట్టి వేస్తారు మీరు?'' అని ఎవరైనా వాదించవచ్చు. అయినా సరే, ఆయా కాలాల్లో ప్రస్ఫుటమైన ప్రాయోగిక పద్ధతులతో మేళవించిన సైన్సుకు వ్యతిరేకంగా ఉన్న నమ్మకాలు ఆయా కాలాల్లో మూఢనమ్మకాలే అవుతాయి. 'అలా కాకుండా ఎవరి నమ్మకం వారిది' అని మూఢనమ్మకాల్ని ఆమోదిస్తే అది ప్రగతికి వ్యతిరేకం. సామాజిక గమనానికి అలాంటి స్వేచ్ఛా (మూఢ) నమ్మకాలు ప్రతిబంధకాలవుతాయి. మూఢనమ్మకాలను సమాజం నుంచి వేరు చేయాల్సిందే.
సైన్సును సాధించిందీ మానవుడే. మూఢనమ్మకాలూ మానవుడివే. జంతువులకు సైన్సు లేదు. మూఢనమ్మకాలూ లేవు. సైన్సును, నిజజీవితాన్ని మేళవింపు చేసుకోనంత వరకూ మూఢనమ్మకాలూ, సైన్సు సమాంతరంగా నడిచాయి. నడుస్తున్నాయి. ఒకటి ముందు, ఒకటి తరువాత అన్న ధోరణి లేదింతవరకు. అలా సమాంతరంగా, పరస్పర వైరుధ్యాలతో అవి నడిచేలా చేసే వ్యవస్థనే మనం దోపిడీవ్యవస్థ అంటున్నాం. కానీ, ప్రతి నమ్మకాన్నీ సైన్సు అనే అద్దంలో చూసుకొంటూ బేరీజు వేసుకొని ఎప్పటికపుడు నమ్మకాల చుట్టూ మూఢత్వం పేరుకోకుండా చూసుకొనే సమాజంలోనే నమ్మకాల స్థానంలో సైన్స్ ఉంటుంది. అదే సమసమాజం, వర్గరహిత సమాజం. సైన్సు వేరుగా, నమ్మకాలు వేరుగా ఉండవు. ఒకటి ముందు ఒకటి తర్వాత అన్న సమస్య కూడా తలెత్తదు.
No comments:
Post a Comment