Share
విజ్ఞాన వీచిక డెస్క్
Wed, 18 Apr 2012, IST
విశ్వంలో మానవజాతిలాంటి జీవులు కలిగి వున్న ఒకేఒక గ్రహం
ధరిత్రి. దీనిపై జీవావిర్భావం దాదాపు 350 కోట్ల ఏళ్ల క్రితం జరిగింది.
ధరిత్రి ఇప్పటిస్థితికిి చేరడానికి దాదాపు 460 కోట్ల సంవత్సరాల కాలం
పట్టింది. విశ్వంలో మనలాంటి జీవాలు గల ఇతర గ్రహం మరేదైనా ఉందా అనే దిశలో
పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు.
ఇప్పటి ధరిత్రిని అస్థిరపరిచే ఎన్నోచర్యలు కొనసాగుతున్నాయి. ధరిత్రిలోని
అన్ని జీవాలను పలుమార్లు పూర్తిగా నాశనం చేయగల అణుబాంబులు అమెరికా, రష్యా
వంటి పలుదేశాల దగ్గరున్నాయి. వీటిని సమకూర్చుకోడానికి మరికొన్ని దేశాలు
తీవ్ర కృషి చేస్తున్నాయి. అమెరికా, దాని మిత్రదేశాలు తాము శత్రువులుగా
భావించిన ఇతర దేశాలపై ఈ బాంబుల్ని ఉపయోగించడానికి వెనుకాడబోమని
బెదిరిస్తున్నాయి కూడా. ప్రకృతివనరులను కొల్లగొట్టేందుకు ఏవో సాకులతో
యుద్ధాలు, ఆక్రమణలు, అక్రమాలు జరుగుతున్నాయి. పర్యావరణానికి ఇవి
కలిగిస్తున్న హాని అసలు అధ్యయనానికే నోచుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు
మానవుడు తన అవసరాలకూ, స్వార్థం కోసం వినియోగిస్తున్న ఎన్నో సాంకేతికాలు
వాతావరణాన్ని వేడెక్కిస్తూ, భూగోళాన్ని అస్థిరపరిచేవిగా ఉన్నాయి. ఇదే
జరిగితే మరే ఇతర గ్రహానికో పోయి, మనల్ని మనం రక్షించుకునే స్థితి కూడా
లేదు. ఇతర గ్రహాల్లో కనీసం మామూలు జీవాలుండగలవన్న ఆధారాలూ లభించడం లేదు.
అందువల్ల, మన పృథ్విని మనకోసం, మన భవిష్యత్తరాల కోసం సుస్థిరంగా కొనసాగేలా
కాపాడుకోవాలి. ఈ లక్ష్యంతోనే 2012 'ధరిత్రి దినోత్సవం' జరుగుతోంది. ఈ
సందర్భంగా 'ధరిత్రి-సుస్థిర భవిష్యత్తు' కోసం తీసుకుంటున్న, తీసుకోవాల్సిన
చర్యలను క్లుప్తంగా వివరించేందుకు చివరి భాగంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం
'విజ్ఞానవీచిక'.
ప్రకృతి వనరులు, ఇంధనోత్పత్తి, వినియోగ
నిర్ణయాల మీద పృథ్వి భవిష్యత్తు ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో
2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరనుందని అంచనా. వీరి అభివృద్ధి
అవసరాలను తీర్చడానికి ఇప్పటికన్నా ప్రకృతి వనరులను ఎక్కువగా
వినియోగించాల్సి వస్తుంది. ఇంధనాన్నీ అధికంగా ఉత్పత్తి చేయాల్సి వస్తుంది.
ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధితోనే గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల పెరుగుతూ,
భూగోళ వాతావరణం వేడెక్కడాన్ని, తద్వారా రాగల దుష్పరిణామాలను సంక్షిప్తంగా
గతవారం ఇచ్చిన మొదటిభాగంలో తెలుసుకున్నాం.
పృథ్వి
సుస్థిరభవిష్యత్తు కోసం గ్రీన్‌హౌస్‌వాయువుల విడుదలను పరిమితంచేస్తూ, భూగోళ
వాతావరణ క్షీణతను అరికట్టేందుకు ఇంతవరకూ చేపట్టిన కార్యక్రమాలు ఆశించినమేర
ఫలితాల్ని ఇవ్వలేదు. మరి ఈ పెరుగుతున్న జనాభా అవసరాల్ని తీరు స్తూ, భూగోళ
సుస్థిరతను ఎలా కాపాడుకోవాలి? అనేది నేడు మనముందున్న ప్రధాన సవాలు.
దీనికోసం హరిత సాంకేతికాలను, అభివృద్ధిని సాధించాలని ఓ బృహత్ ప్రణా ళికను
ఐక్యరాజ్యసమితి 2011లో 'ప్రపంచ ఆర్థిక, సామాజిక సర్వే' నివేదిక రూపంలో మన
ముందుంచింది. సుస్థిర పర్యావరణాభివృద్ధికి దోహదపడేలా, పర్యావరణానికి
ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేలా పునరుద్ధరణ కార్యక్రమాలను చేపడుతూ
ఇప్పటి, భవిష్యత్తు అవసరాలను తీర్చాలని ఈ నివేదిక సూచిస్తుంది. దీనికోసం
ఎప్పటిలాగా కాక, నూతనత్వంతో కూడిన సాంకేతికాలతో అభివృద్ధిని సాధించాలని
సూచించింది.
మూల సిద్ధాంతం..
ష తరిగిపోయే వనరులకు
బదులు, తరగని, పునర్వినియోగించుకోగల వనరుల ఆధారంగా జరిగే అభివృద్దే
సుస్థిరాభివృద్ధి. ఇదే ధరిత్రికి సుస్థిర భవిష్యత్తును చేకూరుస్తుంది.
* ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ హరితార్థికాభివృద్ధికి, సుస్థిర భవిష్యత్తుకు మూలాధారం.
* భూమి, నీరు వంటి మౌలిక వనరులను గరిష్ట సామర్థ్యంతో వినియోగించాలి. ఇప్పటి సామర్థ్యాన్ని పెంచాలి.
* చౌకైన, సమర్ధవంతమైన విద్యుత్. దూరదృష్టితో తరగని, పునర్వినియోగించు కోగల వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేలా ధరలను నిర్ణయించాలి.
* గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను కనీసస్థాయికి తగ్గించగల సాంకేతికాల వినియోగం.
* అడువుల సంరక్షణ, పునర్ పెంపకం, సుస్థిర యాజమాన్య పద్ధతులు, జీవవైవిధ్య సంరక్షణ.
* సమర్థవంతమైన ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు, వ్యక్తిగత రవాణాను నిరుత్సాహపరిచే విధానం.
* భాగస్వామ్యంగల గ్రామీణ ఇంధనం, సాగునీటి యాజమాన్యం, గ్రామీణాభివృద్ధి.
నష్టపరుస్తున్న శక్తులు..
* కార్పొరేట్ శక్తుల అమిత లాభాపేక్ష.
* సంపదను పోగుచేసుకోవాలనే సంస్కృతి - దీనికి మద్దతిస్తున్న కార్పొరేట్‌శక్తులు.
* హద్దూ అదుపూ లేని వినియోగ సంస్కృతి.
* ధనికుల జీవనశైలి.
* ప్రకృతి వనరులను కొల్లగొట్టే రాజకీయాలు, ఆక్రమణలు, అక్రమాలు.
* పర్యావరణాన్ని నష్టపర్చగల శాస్త్ర, సాంకేతికాల ఎంపిక.
ఆహారోత్పత్తి.. సాంకేతికాలు..
భూగోళం
నుండి విడుదలయ్యే మొత్తం గ్రీన్‌హౌస్ వాయువుల్లో దాదాపు 14 శాతం ఆధునిక
వ్యవసాయం వల్ల విడుదలవుతున్నాయి. ఎన్నో విస్తార ప్రాంతాల్లో భూ వినియోగం,
నీటి యాజమాన్యం హరిత ఆర్థికాభివృద్ధికి దోహదపడేవిగా లేవు. అడవుల
నరికివేతవల్ల దాదాపు మరో 17 శాతం గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవు తున్నాయి.
సుస్థిర వ్యవసాయోత్పత్తికి, అడవుల యాజమాన్యానికి, నేలకోత నివారణకు నీటి
కాలుష్య నియంత్రణకు హరిత సాంకేతికాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మెట్ట
ప్రాంతాల్లో, పరీవాహక ఆధారాభివృద్ధి (భూసార పరిరక్షణ, నీటి సంరక్షణ), నీటి
వినియోగాన్ని తగ్గిస్తూ, ఉత్పాదకతను పెంచుతూ సేద్య విస్తీర్ణాన్ని తగ్గించే
శ్రీవరి సేద్యం, సాగునీటి సామర్థ్యాన్ని పెంచే సాంకేతికాలు అందుబాటులో
ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఉపయోగించాలి.
పెట్టుబడులు..
అభివృద్ధి
చెందుతున్న దేశాల్లో కొత్త హరిత సాంకేతికాల అమలుకు పెద్ద ఎత్తున
పెట్టుబడులను అందించాలని ఐరాస 2011 సర్వే సూచిస్తుంది. దీనికోసం ప్రపంచ
స్థూల ఉత్పత్తిలో దాదాపు మూడు శాతం (2010లో 1.90 లక్షల కోట్ల డాలర్లు)
అవసరమని ఈ సర్వే అంచనా వేసింది. పేదరికాన్ని అధిగమించడానికి, నేల, నీటి
వనరుల క్షీణతను నిలువరించడానికి, ఆహారోత్పత్తిని పెంచుతూ ఆకలిని
నిర్మూలించడానికి; వాతావరణమార్పుల్ని నిలువరించడానికి, రాగల ప్రకృతి
వైపరీత్యాలను నివారించడానికి ఈ నిధులు అవసరం. ఈ నిధుల్లో కనీసం సగం
అభివృద్ధి చెందిన దేశాలు స్థానిక వనరుల నుండే సేకరించాలని ఈ నివేదిక
సూచించింది. ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పొదుపు మొత్తాలను, ఇతర
ఆదాయాల్ని స్థానికంగా కాకుండా అంతర్జాతీయ నిధుల రూపంలో ఉంచుతున్నాయి.
ఐచ్ఛికంగా వీటిని ఆయా దేశాల్లోనే ఉంచితే హరిత ఆర్థికాభివృద్ధికి
తోడ్పడగలవని ఈ సర్వే సూచిస్తుంది.
కోపెన్‌హాగన్ ఒప్పందంలో
2010-12 మధ్యకాలంలో వార్షికంగా మూడు వేల కోట్ల డాలర్లను, ఆ తర్వాత 2020
వరకూ 10 వేల కోట్ల డాలర్లను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ లక్ష్యం
కోసం అందించాలనే నిర్ణయం సరైనదని సర్వే తెలిపింది. కానీ, ప్రపంచ పర్యావరణ
పరిరక్షణకు, వాతావరణ మార్పుల నియంత్రణకు ఏర్పర్చిన ట్రస్టు నిధుల నుండి
ఏడాదికి కేవలం రెండువేల కోట్ల డాలర్లు అందాయి. అభివృద్ధి చెందుతున్న
దేశాలలో హరితాభివృద్ధికి వార్షికంగా లక్ష డాలర్లు అవసరమవుతుందని సర్వే
అంచనా. దీనిలో ఎక్కువ భాగం అంతర్గతంగానే ఆయా దేశాలు సేకరించాల్సి
ఉన్నప్పటికీ, ఆరంభంలో హరిత సాంకేతికాల మార్పును వేగం చేసేందుకు విదేశీ
సహాయం తోడ్పడుతుందని సర్వే సూచించింది.
కేంద్రీకరించాల్సిన చిన్నకమతాల సేద్యం..
అభివృద్ధి
చెందుతున్న దేశాల్లో చిన్నకమతాలపై కేంద్రీకరించి, సుస్థిర
వ్యవసాయాభివృద్ధి సాధించాలని 1996లో జరిగిన 'ప్రపంచ ఆహార ఉన్నతస్థాయి
సమావేశం' సూచించింది. ఈ దేశాల్లో ఇప్పటికీ ఆహారం స్థానికంగా ఉత్పత్తయి,
వినియోగింపబడుతున్నందువల్ల ఆహారోత్పత్తి వ్యవస్థ మొత్తం చిన్నకమతాల సేద్యం
మీదనే ఆధారపడి ఉంది. అందువల్ల, హరితాభివృద్ధిలో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని
2011 ఐరాస సర్వే పునరుద్ఘాటించింది. కొత్తగా వస్తున్న సాంకేతికాల్ని చిన్న
కమతాలు వినియోగించుకోలేకపోతున్నాయని పేర్కొంది. అందువల్ల, ఈ కమతాలకు
అవసరమైన మద్దతు వ్యవస్థను, మౌలిక సౌకర్యాలను సమకూర్చాలని ఈ సర్వే
తెలిపిింది. ముఖ్యంగా సుస్థిర సాగునీటి వ్యవస్థ, విద్య, శిక్షణ, భూమి,
రుణసౌకర్యాల అందుబాటు, భరించగలిగే ధరలకు ఉత్పాదకాల అందుబాటు, మార్కెట్
మద్దతు అవసరమని ఇది తేల్చి చెప్పింది.
తిరోగమనంలో మన దేశం..
హరిత
ఆర్థికాభివృద్ధికి తిరోగమన దిశలో దేశాభివృద్ధి కొనసాగుతుంది. భూగోళం
వేడెక్కడాన్ని, వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతున్నాం కానీ, వీటిని
నిలువరించేందుకు పై పై చర్యలకే పరిమితమవుతున్నాం. అంతు లేని వినియోగ
సంస్కృతి ప్రోత్సహించబడుతోంది.
అంతర్జాతీయ ఉత్పత్తిలో
భాగస్వామ్యం వలన రవాణా అవసరాలు పెరిగి, ఇంధన వాడకం పెరుగుతుంది. ప్రజా
రవాణా రోడ్డు సౌకర్యాలను తగ్గిస్తూ, వ్యక్తిగత, ప్రయివేటు వాహనాల
వినియోగాన్ని పెంచే అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది.
దీనివల్ల ఇంధన వాడకం పెరుగుతుంది. పునరుత్పత్తి కాగల ఇంధనం, ఉచితంగా,
అపరిమితంగా లభించే సౌరశక్తి ఆధారిత ఇంధనం కాకుండా అతి ఖర్చు, రిస్క్‌తో
కూడిన అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణం పెద్దఎత్తున చేపడు తుంది. ఇదే సమయంలో
అవసరానికి మించి పెద్దఎత్తున బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం
ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబడుతుంది. ఇవేవీ హరిత సాంకేతికాలు కావు,
హరితార్థికాభివృద్ధికి తోడ్పడేవీ కావు.
సుస్థిర
వ్యవసాయోత్పత్తికి దోహదపడే సాంకేతికాలు (సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ,
కలుపు నియంత్రణ) అందుబాటులో ఉన్నప్పటికీ, వీటిని పక్కన పెట్టి, భారీ
యంత్రాలు, అధిక రసాయనాల వినియోగంతో కూడిన వ్యవసా యరంగ కార్పొరేటీకరణను
ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వాతావరణమార్పుల దుష్ప్రభావాలకు తట్టుకునే
సుస్థిర వ్యవసాయ పరిశోధనలకు ఒక జాతీయ సంస్థ ఏర్పాటైంది. అందుబాటులో ఉన్న
సాంప్రదాయ హరిత విజ్ఞానాన్ని పక్కకు పెట్టి, కొత్త పరిశోధనలను చేపట్టే
ఔచిత్యాన్ని సమర్థించలేం.
ఎంతో అస్థిరత్వంతో కూడిన బిటి
సాంకేతికాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీన్ని హరిత సాంకేతికంగా
పరిగణించలేం. ఇది ఎన్నో పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణమని
తెలుస్తున్నప్పటికీ, కేవలం కంపెనీల సమాచారం ఆధారంగా బిటి సాంకేతికాన్ని
ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
దుష్ప్రభావాల్ని ఎదుర్కోడానికి మన కార్యక్రమం..
వాతావరణమార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కోడానికి 8 అంశాలపై ప్రత్యేక జాతీయ మిషన్లను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి..
*
జాతీయ సౌరశక్తి మిషన్: 20 వేల మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి
ఉద్దేశించింది. 2010-12లో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం.
* జాతీయ ఇంధన సామర్థ్యాన్ని పెంచే మిషన్: ఇది ప్రత్యేక వ్యవస్థాగత ఏర్పాట్ల కోసం ఉద్దేశించింది.
*
జాతీయ సుస్థిర నివాసాల మిషన్: సుస్థిర రవాణా, ఇంధన సామర్థ్యంగల ఇళ్ల
నిర్మాణం, పట్టణ ప్రాంతాల్లో సుస్థిర వ్యర్థ పదార్థాల యాజమాన్యాల కోసం ఇది
పనిచేస్తుంది.
* జాతీయ నీటి మిషన్: నీటి వనరుల సమన్వయ వినియోగ సామర్థ్యాన్ని కనీసం 20 శాతం పెంచే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.
* జాతీయ హిమాలయ జీవావరణ సుస్థిర మిషన్: హిమాలయ మంచు కరగడంపై వాతావరణ పర్యావరణ పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఇది ఉద్దేశించింది.
*
జాతీయ హరిత భారత మిషన్ : అదనంగా 10 మిలియన్ హెక్టార్ల నిరుపయోగ
భూముల్ని, సామూహిక భూముల్ని, క్షీణించిన అటవీభూముల్ని అభివృద్ధి చేసే
లక్ష్యంతో ఇది ఏర్పాటైంది.
* జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ :
వాతావరణమార్పుల్ని తట్టుకుని, ఉత్పాదకతను పెంచేందుకు తోడ్పడే సాంకేతికాల
అభివృద్ధికి ఉద్దేశించినది. మొత్తం మీద వివిధ వ్యవసాయ, వాతావరణ మండలాల్లో
మౌలిక వనరులైన నీరు, భూమి తదితరాల వినియోగాన్ని మెరుగుపరిచి, జన్యు
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వరదల్ని, ఇతర ప్రకృతి వైపరీత్యాల్ని, చీడ,
పీడల్ని తట్టుకునేవిధంగా కొత్తరకాల్ని రూపొందించ డానికి దీని పరిశోధనలు
ఉద్దేశించబడ్డాయి.
* జాతీయ వ్యూహాత్మక వాతావరణమార్పుల విజ్ఞాన
మిషన్ : వాతావరణ మార్పుల వల్ల వస్తున్న సవాళ్లను గుర్తించి, సంబంధిత
విజ్ఞానాన్ని, స్పందించాల్సిన అవసరాన్ని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించింది.
అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కలిగించేలా కార్బన్ విడుదలను తగ్గించేందుకు అవసరమైన ఓ నిపుణుల గ్రూపు కూడా ఏర్పాటైంది.
మీకు తెలుసా?
* సుస్థిరాభివృద్ధి: ఇప్పటి వనరులను అస్థిరపర్చకుండా, నేడు, పెరుగుతున్న భవిష్యత్తరాల అభివృద్ధి అవసరాలను తీర్చుకొనడం.
*
హరితార్థికాభివృద్ధి (సుస్థిరాభివృద్ధి): భవిష్యత్తరాల భద్రతను ఫణంగా
పెట్టకుండా భూ, జీవ పర్యావరణాల్ని పరిరక్షిస్తూ, పెరుగుతున్న అభివృద్ధి
అవసరాలను తీర్చుకోవడం.
* గ్రీన్ టెక్నాలజీస్: హరితాభివృద్ధికి దోహదపడే సాంకేతికాలు.
వాతావరణమార్పుల్ని తట్టుకొనే సాంకేతికాలు..
వాతావరణమార్పుల్ని
తట్టుకోడానికి ఇప్పటికే 165 సాంకేతికాలు వినియోగిస్తున్నట్లు '2011 ప్రపంచ
ఆర్థిక, సామాజిక ఐక్యరాజ్యసమితి సర్వే' నివేదిక తెలుపుతుంది. దీనిలో 42
సాంకేతికాలు (25.5 శాతం) వ్యవసాయం, సంబంధిత రంగాలలో వినియోగింపబడుతున్నాయి.
నీటి వనరుల వినియోగంలో 28 రకాల సాంకేతికాలు (17 శాతం)లో ఉన్నాయి.
తీరప్రాంతాల్లో 27 సాంకేతి కాలు (16.4 శాతం)లో ఉన్నాయి. మౌలిక రంగంలో 23
సాంకేతికాలు (13.9 శాతం)లో ఉన్నాయి. ఆరోగ్యం, వాతావరణం ముందు హెచ్చరికలు,
భూతల జీవావరణం వంటి రంగాలలో మిగతావి వినియోగించబడుతున్నాయి.
మొత్తం
సాంప్రదాయ సాంకేతికాల్లో 67 శాతం వాతావరణమార్పులను ఎదుర్కోడానికి
వినియోగపడుతున్నాయి. పారిశ్రామికవిప్లవం తర్వాత రూపొందించిన ఆధునిక
సాంకేతికాల్లో 57 శాతం సాంకేతికాలు వాతావరణ మార్పుల్ని ఎదుర్కోడానికి
దోహదపడుతున్నాయి. ఇక, ఇటీవల రూపొందించిన సాంకేతికాల్లో కేవలం 41 శాతం
వాతావరణమార్పుల్ని ఎదుర్కోడానికి దోహద పడుతున్నాయి. ఇవి ప్రధానంగా
వాతావరణాన్ని పసిగట్టడంలో, ముందస్తు హెచ్చరికలు జారీచేయడంలో
ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత ఆరోగ్యరంగంలో ఉన్నాయి.
వ్యవసాయరంగంలో
వినియోగిస్తున్న సాంకేతికాల్లో 47.6 శాతం సాంప్రదాయ సాంకేతికాలు, 31 శాతం
ఆధునిక సాంకేతికాలు, కేవలం 21 శాతం మాత్రమే ఇటీవల రూపొందించిన సాంకేతికాలు.
ఇంధన
రంగంలో వాతావరణమార్పుల్ని ఎదుర్కోడంలో 66.7 శాతం సాంప్రదాయ సాంకేతికాలు
ఉపయోగపడుతున్నాయి. 33.3 శాతం ఆధునిక సాంకేతికాలు. వాతావరణమార్పుల్ని
ఎదుర్కోడానికి ఉపయోగపడ్తున్నాయి. ఇటీవల కాలంలో ఏ కొత్త ఇంధన సాంకేతికం
దీనికి దోహదపడటం లేదు.
భూతల పర్యావరణ వ్యవస్థ సాంకేతికాల్లో 75
శాతం సాంప్రదాయ సాంకేతికాలు వాతావరణమార్పుల్ని ఎదుర్కోడానికి
దోహదపడుతున్నాయి. మిగతావి పారిశ్రామిక విప్లవకాలంలో రూపొందినవి. ఈ రంగంలో
దీనికోసం ఇటీవల ఏ కొత్త సాంకేతిక విజ్ఞానమూ రూపొందలేదు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.