వేసవి తాపానికి (వేడి) గురైనప్పుడు శరీరం వేడెక్కుతుంది. ఈ వేడి నుండి రక్షించడానికి శరీరంలోని ద్రవం (నీరు), లవణాలు చెమట రూపంలో శరీరం పైభాగానికి వచ్చి ఆవిరవుతాయి. దీనితో శరీరం చల్లబడుతుంది. ఇది నిత్యం జరిగే శరీరధర్మ మార్పులు. కొన్ని పరిమితులకు లోబడి ఇలా చెమట ఏర్పడి, ఆవిరవడం మంచిది. నష్టమేమీ లేదు. కానీ, పరిమితి దాటినప్పుడు శరీరంలో ద్రవ సమతుల్యత కొనసాగించడానికి ఏదో ఒక ద్రవాన్ని (నీటిని) తీసుకోవాలనే సహజ కోరిక కలుగుతుంది. దీన్నే 'దప్పిక'గా వ్యవహరిస్తున్నాం. ఏదో ఒక ద్రవాన్ని (పానీయం) తీసుకొని దప్పికను తీర్చుకోలేకపోతే శరీరంలో ద్రవ సమతుల్యత బాగా దెబ్బతిని, నష్టపోయినప్పుడు 'నిర్జలీకరణ (డీహైడ్రేషన్)' కలుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో నీటిఆవిరితో పాటు శరీర జీవద్రవంలో (రక్తంలోని ప్లాస్మాలో) ఉన్న లవణాలు కూడా బయటకొచ్చి, నష్టపోవడం జరుగుతుంది. దీనివల్ల అలసి పోయినట్లుగా, శక్తిని కోల్పోయినట్లుగా భావిస్తాం. చల్లని వాతావరణం కావాలనిపిస్తుంది.
దప్పిక..
దప్పికను రెండురకాలుగా గుర్తించవచ్చు. జీవకణాల బహిర్గత దప్పిక ఒకటి. ఇది జీవకణాల మధ్య ఉన్న ద్రవంలో నీటి పరిమాణం తగ్గితే కలుగుతుంది. మంచినీరు తాగడం వల్ల దీన్ని అధిగమించవచ్చు. కణాంతర భాగంలో లవణాల గాఢత పెరగడం వల్ల కలిగే దప్పిక రెండవది. ద్రవ పరిమా ణం తగ్గినా లేక లవణ గాఢత పెరిగినా గుర్తించిగల నాఢ వ్యవస్థ మన శరీరంలో పనిచేస్తుంది. ఈ సంకేతాల్ని నాఢ వ్యవస్థ మెదడుకు పంపుతుంది. అక్కడ ఈ సంకేతాలు విశ్లే షించబడి, ద్రవాలను తీసుకుని (తాగి) దాహ కోరిక, సేదతీర్చు కోవాలనే ప్రతి సంకేతాలు రూపంలో శరీరానికి అందుతాయి.
నిర్జలీకరణ (డీహైడ్రేషన్)..
శరీరం నుండి అతిగా నీటిని, లవణాల్ని కోల్పోవడాన్ని నిర్జలీకరణగా భావిస్తాం. పై చర్మం, శరీర అంతరపొరలు (మ్యూకస్ మెంబ్రేన్) నిర్జలానికి గురైనప్పుడు చర్మం పొడిబారుతుంది. ఇది మూడు రకాలుగా కొనసాగుతుంది. సోడియం లవణం కోల్పోవడం వల్ల, లేదా నీటిని కోల్పోవడం వల్ల, లేదా రెంటినీ కోల్పోవడం వల్ల ఇలా పొడిబారవచ్చు. సహజంగా, నీటితో పాటు లవణాలు కూడా (ముఖ్యంగా సోడియం) ఎల్లప్పుడూ నష్టపోవడం జరుగుతుంది. రక్త ద్రవంలో (ప్లాస్మా) ఉన్న పరిమాణంలోనే వీటిని నష్టపోతాం. దీనివల్ల తలనొప్పి, వణుకు, శక్తిలేనట్లుగా భావనలు కలుగు తాయి. నిర్జలీకరణ వల్ల తల భారంగా అనిపిస్తుంది. కళ్లు మసకబారడం, రక్తపోటు తగ్గిపోవడం, కళ్లు తిరిగి పడిపోతున్న భావన కలగడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, స్పృహ కోల్పోవ డం, చివరకు చనిపోయే స్థితికీ వెళతారు. మామూలుగా రెండు శాతం కన్నా నీరు అధికంగా కోల్పోతే 'నిర్జలీకరణ' చిహ్నాలు కనిపిస్తాయి. ప్రారంభదశలో దప్పిక అవుతుంది. మూత్రం ఆగిపోతుంది. కళ్లల్లో నీళ్లు కూడా రావు. తలనొప్పి వస్తుంది. నోరు ఎండిపోయినట్లు అనిపిస్తుంది. కళ్లు తిరిగిన భావన కలుగుతుంది. ఒక మోస్తరుగా ఉన్నప్పుడు ఈ చిహ్నాలతో పాటు బద్ధకంగా కూడా అనిపిస్తుంది. బాగా నిద్రపోవాలనిపిస్తుంది. వణుకు రావచ్చు. ముఖ్యంగా కళ్లు పీక్కుపోయి, తిరిగినట్లు అనిపిస్తుంది. తీవ్రంగా ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఊపిరి కూడా వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. రక్తపోటు తగ్గిపోతుంది. శరీర ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. శరీరం నుండి 5-6 శాతం నీరు కోల్పోయినప్పుడు ప్రమాదస్థాయికి చేరతారు. వాంతులు లక్షణాలు కూడా కనిపిస్తాయి. 10-15 శాతం ద్రవాన్ని కోల్పోతే కండరాలు గట్టిపడి, చర్మం ఎండిపోయి, ముడతలు పడుతుంది. కనుచూపు శక్తిని కోల్పోతాం. మూత్రం బాధాకరంగా ఉంటుంది. 15 శాతం ద్రవాన్ని కోల్పోతే చనిపోతారు. యాభై సంవత్సరాల పైబడిన వారిలో దప్పిక తీర్చుకోవాలనే భావన తక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరిలో నిర్జలీకరణ ఎక్కువగా ఉంటుంది. అయినా, దప్పిక వల్ల ద్రవాన్ని తీసుకోవాలనే భావన వీరిలో కలుగదు. వేడి అధికంగా ఉన్నప్పుడు ముసలివాళ్లు ఎక్కువగా చనిపోవడానికి ఇదే కారణం. జీర్ణకోశంలో జబ్బులు రావడం వల్ల కూడా నిర్జలీకరణం జరగవచ్చు.
చికిత్స..
ప్రాథమిక స్థాయిలో నీరు తీసుకుంటే సరిపోతుంది. తీవ్రంగా ఉన్నపుడు నీటిలో ఉప్పు, పంచదార కలిపి తరచుగా తీసుకుని సేదతీరవచ్చు. మరీ తీవ్రంగా ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి. సెలైన్ (గ్లూకోజ్) ద్వారా ఉపశమనం పొందాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment