Friday, 27 April 2012

విజయాలకు పొంగిపోవద్దు...అపజయాలకు కుంగిపోవద్దు


ప్రస్తుతమున్న పబ్లిసిటీ ప్రభంజనం, కార్పొరేట్‌ కాలేజీల వ్యాపార దృక్పథం, పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారినే 'విజేతలు'గా సృష్టిస్తున్నాయి, ఆకాశానికెత్తేస్తున్నాయి. ర్యాంకు సాధించడం ఒక విజయం మాత్రమే. అదే అంతిమ విజయం కాదు. విజేతలకు ఉత్సాహం, ఆనందం, భవిష్యత్‌ పట్ల ఆశావహ దృక్పథం ఏర్పడుతాయి. అదే సమయంలో విజయాలకు పొంగిపోవద్దు... అపజయాలకు కుంగిపోవడం క్షేమం కాదు. విజేతలకు ఆత్మనిగ్రహం లేకపోతే వారి కెరీర్‌కి వచ్చే ఇబ్బంది లేకపోయినా, వ్యక్తిత్వానికి నష్టం కలగవచ్చు. ఆ నష్టం వెంటనే జరగకపోయినా, భవిష్యత్‌లో జరగొచ్చు.
ఉన్నతమైన కెరీర్‌ను ఊహించుకోవడంలో తప్పు లేదు. కానీ దానికంటే ముందు ఉన్నతమైన వ్యక్తిత్వం అవసరం దాన్ని పెంపు చేసుకోవాలి. ఇది ఉంటే అన్నీ ఉన్నట్టే. కెరీర్‌ని, క్యారక్టర్‌తో మిళితం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ, అందుకోసం ఈ టెక్నిక్స్‌ని ఫాలోకండి.
1. ఒదిగి ఉండడం : మనసులో పుట్టే ఆలోచన మనిషిని మలుస్తుంది. మంచీ, చెడులు మన మనసులోనే పుడతాయి. 'ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలి' అనే ఆలోచనా బీజం మీ మనసులో ఉండి ఆ ఆలోచన మీ మనసులో కదలాడినంతకాలం, మీలో అహంకారం పెరగదు.
2. కలసిపోండి : 'వాడికి ర్యాంకు వచ్చాక, కళ్లు నెత్తికెక్కాయి' అనే మాటను కొందరిని ఉద్దేశించి అనడం మనం వినే ఉంటాం. కెరీర్‌కి సంబంధించిన మార్పు మన క్యారక్టర్‌ విషయంలోనూ మార్పు తీసుకురావడం బాధపడాల్సిన విషయమే తప్ప సంతోషపడాల్సిన విషయం కాదు. ముఖ్యంగా అలాంటి మార్పు మనకు బంధుమిత్రులను దూరం చేయకూడదు.అందుకే ర్యాంకు వచ్చాక 'ఇక తిరుగులేదు' అనే భావన రానీయకుండా, బంధుమిత్రులతో ఎప్పటిలాగే మాట్లాడండి.ఒక విధంగా మీరే మరింత విశాల హృదయంతో అందరినీ కలుపుకుపోతూ, భేషజాలు లేకుండా ప్రవర్తించండి.
3. విలువలు గురించి ఆలోచించండి : అభద్రతా భావం నుండి భద్రతా భావం వైపు పయనించే వేళ కొన్ని విలువల పట్ల మరింత నిబద్ధత కలిగి ఉండడం చాలా అవసరం. అది యువతకు ఉండే సహజ సిద్ధమైన ఆకర్షణలు కావచ్చు లేదా సామాజిక అంశాల విషయం కావచ్చు. మీరు బలహీనతలకు, వ్యామోహాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోండి. 'విజయం ఒక మత్తు' అంటారు అనుభవజ్ఞులు. ఆ మత్తులో మనం తప్పు చేయాలనుకోవడం సహజమే. దానికి వయసు కూడా ఎంకరేజ్‌ చేస్తుంది. కాని ఎలాంటి బలహీనతలూ, వ్యామోహాలు దరిచేరకుండా తనను తాను కాపాడుకున్న వారు మాత్రమే చివరి వరకూ విజేతగా నిలబడుతారు. నిజం చెప్పాలంటే అదే అతి గొప్ప విజయం.
4. భవిష్యత్‌ను దర్శించండ్ణి ఒక విజయం కనుల ముందు మెరుపులు మెరిపిస్తుంది. ఆ మెరుపులనే చూస్తుంటే, పయనించాల్సిన మార్గాన్ని దర్శించలేం. మెరుపులనే చూస్తూ కాలం గడిపేశాక మనం సరైన మార్గంలో పయనించడం లేదనే అభిప్రాయం కలిగి అసంతృప్తి కూడా కలిగే అవకాశముంది. అందుకే మెరుపుల వెలుగులోనే మీ భవిష్యత్‌ను దర్శించండి. ఎవరికైతే తన మార్గం పట్ల స్పష్టత ఉంటుందో వారే అంతిమంగా విజయం సాధించగలుగుతారు.
మీరు ర్యాంకు సాధించి ఉంటే అదే అంతిమ 'విజయం' అన్న భ్రమలోపడి, ఆకాశంలో విహరించకండి. 'నంబర్‌వన్‌' ర్యాంకులు సాధించి కెరీర్‌పరంగా ముందుకు వెళ్తూ, ఆగిపోయి అయోమయంలో పడి, అసంతృప్తితో బతుకుతూ జీవితంలో పరాజితులుగా మారిన అనేకులు మన చుట్టూనే ఉన్నారు.
కాబట్టి విజయం తాలూకూ మత్తు వదిలి, వాస్తవంలో జీవించండి. ఇక ఈ పోటీ పరీక్షల్లో పరాజయం పొందినవారు తమ మానసిక ధోరణిని ఇలా మలచుకుంటే తప్పక ప్రయోజనం పొందగలుగుతారు.
1.అపజయం, విజయానికి తొలిమెట్ట్ణు విజయం అందనంత మాత్రాన 'అది మనకు అందనంత దూరంలో ఉంది' అని నిర్ణయించేసుకోకండి. 'అపజయం, విజయానికి పునాది'గా భావించి, రెట్టించిన ఉత్సాహంతో కష్టపడాలని అనుకోండి.
2. ముడుచుకుపోకండి 'అపజయం' అనేది క్షమించరాని నేరం అన్నట్టు ముడుచుకుపోవడం, అందరికీ దూరంగా ఉండడం, బంధుమిత్రుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం, చేయకండి. అపజయమనేది సాధారణమైన విషయం. అది నేరం కాదు. దానిని భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కాబట్టి అపరాధ భావనతో ముడుచుకుపోకండి. దాని వల్ల మీరు ఒంటరితనంగా ఫీలవుతూ తద్వారా అభద్రతా భావం, నిరుత్సాహం, కొని తెచ్చుకుని ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదముంది.
3.ఆత్మవిశ్వాసం పెంచుకోండి 'పరాజయం' నుండి బయటపడాలంటే, ఆత్మవిశ్వాసం అవసరం. మీలో ఆత్మవిశ్వాసం పెంచే వ్యక్తులను గుర్తించి వారితోనే ఎక్కువ సమయం గడపండి. ఆత్మవిశ్వాసం పెరగడం కోసం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం కోసం అది ఉపయోగపడుతుంది.
4. సమీక్ష అవసరం 'అపజయానికి అనేక కారణాలుంటాయి' అంటారు పెద్దలు. మీ అపజయానికి కారణమేంటో తెలుసుకోకపోతే మీరు ఎప్పటికీ విజయానికి ఆమడదూరంలోనే ఉంటారు. సరైన ప్లానింగ్‌ లేకపోవడం, సరిగా కష్టపడకపోవడం, మీ శక్తిసామర్థ్యాలు సరిపోకపోవడం మీ అపజయానికి కారణాలేమో గుర్తించండి. అలా ఆ తప్పును సరిదిద్దుకోండి.
ఒక నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్టే, ఒక ఫలితం విజేతలను, పరాజితులను సృష్టిస్తుంది. విజయం పొందినవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పరాజయం పొందినవారూ పోరాటానికి సిద్ధపడుతూ మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

No comments:

Post a Comment