ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి - మీ చిన్నప్పుడు ఆడుకున్న ఆటలూ, తిన్న చిరుతిళ్లూ, పొలంలో పండిన పంటలూ, అమ్మ చేసిన వంటకాలూ...! రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరకలు, గోధుమలు,వరి...ఇలా చాలా వుండేవి. ఇప్పుడు మనకు చివరి రెండే చిరపరిచితంగా మిగిలిపోయాయి. ఇప్పుడు పాతికేళ్లలోపున్న వారికి మిగతావి అసలు తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. అందువల్ల వెన్న వేసుకున్న సజ్జరొట్టె, పెరుగుతో కలిసిన కొర్ర అన్నం గురించి వివరించి ప్రయోజనం ఉండదు.
దేనినైతే కోల్పోతామో అప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఆ సందర్భంలోనే దాని గురించిన చర్చ మొదలవుతుంది. సరిగ్గా అటువంటి జాబితాలోకి వస్తుంది 'జీవ వైవిధ్యం' (బయోడైవర్సిటి). నేడు ప్రపంచవ్యాప్తంగా విలువైనదీ, విస్తృతంగా అవసరమైనదీ ఈ జీవ వైవిధ్యమే! మనిషి ఈ భూగోళం మీదకు రాక ముందు నుంచీ ప్రాణి ప్రపంచం ఉంది. అంటే వృక్ష ప్రపంచం, జంతు ప్రపంచం! ఇది నేడు కొత్తగా తయారవలేదు. ఏమైనా అయి ఉంటే నాశనమై ఉంటుంది తప్ప, మెరుగయింది లేదు. నిజానికి ఈ వృక్ష సంబంధమైన, జంతు సంబంధమైన ప్రపంచం లేకపోతే మనిషి ఉనికే కాదు, మనిషిరాక (పరిణామం) కూడా సాధ్యమై ఉండేది కాదు. ఈ జీవ ప్రపంచం బతికి బట్ట కట్టడానికి అసలు కారణం - అక్కడ సహజంగా ఉండే నేల, నీరు, శీతోష్ణస్థితి వగైరాల సముదాయం, తత్ఫలితంగా తయారైన సానుకూల వాతావరణం! ఇది లేకపోతే జీవ ప్రపంచం మనుగడ కష్టంగా ఉండేది. లేదా క్రమంగా అంతరించిపోయేది. ఈ విషయం గమనిస్తే జీవవైవిధ్యం ఎంత విలువైనదో బోధపడుతుంది. అంతేకాదు ప్రాంతాలను బట్టి ఒకే రకం జీవులలో కొన్ని తేడాలు ఉంటాయి. అంతేకాదు ఒకే ప్రాంతంలో ఉండే ఒకే రకం జీవులలో తేడాలుంటాయి. ఒక్కసారి ఒకే సీజన్లో లభించే మామిడి పళ్ల రకాల గురించి గుర్తుకు తెచ్చుకోండి. ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతపు శీతోష్ణస్థితితో పాటు ఇతర సహజవనరులు, సంప్రదాయాల కారణంగా విలసిల్లే జీవుల వైవిధ్యమే జీవ వైవిధ్యం. ఈ విచ్ఛిన్నమైన వృక్ష, జంతు వైవిధ్యం ఆధారంగానే ప్రపంచంలోని మానవ మనుగడకు మూలమైన వ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి. తద్వారా మానవ నాగరికతా, అభివృద్ధీ సాధ్యమైంది. విస్తృతంగా, విలక్షణంగా విలసిల్లే ప్రకృతి కారణంగానే మనిషి సాగుదల, పెరుగుదల సాధ్యమైంది. అయితే ఈ ప్రకృతి సంపదను జాగ్రత్తగానో, అజాగ్రత్తగానో వినియోగించుకుంటున్నాం. కానీ ఎంతో కాలం మనం దాని గురించి పట్టించుకోలేదు.
గత శతాబ్దంలోనే ఈ విషయాల పట్ల మనిషి దృష్టి మళ్లింది. అప్పుడే ఈ వృక్ష ప్రపంచం, జంతు ప్రపంచం ఎంత విస్తృతమైందీ, ఎంత విలక్షణమైనదీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం మొదలైంది. ఫలితంగా మంచి ఔషధాలు, మెరుగైన పంటలూ, పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల గురించి దృష్టి మళ్లింది. ఇది ప్రపంచ ప్రగతికి దారి తీసింది. అలాగే కాలుష్యకారకమైన విధానాలకు కారణమైంది.
ఈనేపథ్యాలో 'జీవ వైవిధ్యం' అనే అధ్యయనం ప్రారంభమవడమే కాక, ప్రభావవంతంగా పరిణమించింది. ఈ భూగోళం మీద 18 లక్షల రకాల తెలిసిన జీవులున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ 'తెలిసిన ప్రపంచం' నిజమైన ప్రపంచంతో పోలిస్తే చాలా స్వల్పమైనది. ప్రపంచంలో నలుమూలల నుండి నిరంతరం కొత్త మొక్క గురించో, కొత్త జంతువు గురించో సమాచారం వస్తూ వుంటుంది. ప్రపంచంలో అలా కొత్త ప్రాణి ప్రపంచం విస్తృతంగా ఉన్న దేశాలు పదిహేను అని ఒక అంచనా! ఈ పదిహేను దేశాల్లో భారతదేశం ఒకటి! బ్రెజిల్, మలేసియా, ఇండోనేసియా వంటి ఆగేయాసియా దేశాల్లో భారత దేశం కన్నా ఎక్కువ జీవ వైవిద్యం ఉంది.
ఈ భూగోళం మొత్తమ్మీద 15 నుండి 200 కోట్ల రకాల జీవరాసులున్నట్లు, అందులో కేవలం 18 లక్షల రకాల గురించే మనకు కొంత తెలిసినట్లు భావిస్తున్నారు. భూగోళాన్ని ఉత్తర, దక్షిణం అని రెండుగా విభజిస్తే ఉత్తరార్థగోళంలో ఎక్కువ జీవ వైవిధ్యం ఉంది. అభివృద్ధి అంటే సహజ వనరులను అమితంగా ఖర్చు చేయడం కూడా! అలాగే అభివృద్ధి అంటే సహజ వనరులను వినియోగించే సాంకేతిక విజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించడమే! అందువల్ల ధనిక దేశాల, అభివృద్ధి చెందిన దేశాల దృష్టి నేడు పేద దేశాల మీద కాదు. ఎక్కువ జీవ వైవిధ్యం ఉండే దేశాల మీద పడింది. ఈ దృష్టి ఆధారంగానే ప్రపంచ రాజకీయాలు సాగుతుంటాయి. రాజకీయ మిత్రత్వాలు, శతృత్వాలు తయారవుతుంటాయి కూడా! నైసర్గిక పరిస్థితులూ, శీతోష్ణస్థితులను బట్టి స్థానికమైన పరిస్థితులు రూపుదిద్దుకుంటాయి. వీటి ఆధారంగా అక్కడ పెరిగే మొక్కలు, ఆవాసముండే జంతువులు వృద్ధి చెందుతాయి. మన దేశాన్ని స్థూలంగా పది ప్రాంతాలుగా వర్గీకరించవచ్చు. లడక్ వంటి శీతల పర్వతప్రాంతాలు, కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, అసోం మొదలైన హిమాలయ పర్వత ప్రాంతాలు, లోయలు, హిమాలయ ప్రాంతపు నదులు ప్రవహించే పల్లపు ప్రాంతాలు, గంగా బ్రహ్మపుత్ర మైదానాలు, రాజస్థాన్ థార్ ఎడారి ప్రాంతాలు, తక్కువ వర్షపాతముండే దక్కన్ పీఠభూములు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, అండమాన్ నికోబార్ దీవులు, తీర ప్రాంతాల్లో వ్యాపించి ఉండే ఇసుక తిన్నెలు, అడవులు, తీర అడవులు గల ప్రాంతాలు ఈ వర్గీకరణలోకి వస్తాయి. ఇది కేవలం స్థూలమైన వర్గీకరణ మాత్రమే! సూక్ష్మంగా పరిశీలిస్తే మరెంతో వైవిధ్యం కనబడుతుంది. అక్కడ విలసిల్లే వైవిధ్యం వేరుగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజల ఆచారాలు, ఆలోచనలు, అలవాట్ల ఆధారంగా కూడా అక్కడ విలసిల్లే వృక్షజాలం, జంతు ప్రపంచం ప్రభావితమౌతుంది. వెరసి ఆ ప్రాంతానికే పరిమితమైన జీవ వైవిధ్యం రూపొందుతుంది. ఇది క్రమంగా ప్రత్యేకమైన, జన్యుపరమైన విశిష్టతగల జన్యుసంపదకు దారి తీస్తుంది. ఉదాహరణకు తిరుమల కొండల్లో ఉండే జీవ వైవిధ్యం గురించి తెలుసుకోవాలంటే అందులో కృషి చేసిన పరిశోధకులను పలకరించాలి!
జీవ వైవిధ్యంలోని సోయగాన్ని పరికించడం కళాత్మక పార్శ్వం కాగా, .... అందుకోవడం మేథోపార్శ్వం! అడవి లోపల, కిలకిలారావాలు ఆస్వాదించినప్పుడు జీవవైవిధ్యంలోని కళాత్మక మాధుర్యం అనుభవమవుతుంది. సాలెపురుగు ఎలా తన గూడు కడుతుందో, చేప ఎలా ఆహారం తీసుకుంటుందో గమనించినప్పుడు ప్రకృతిలో ఉండే నైపుణ్యం, నిగూఢత బోధపడతాయి.
నేచర్ ఈజ్ ది టీచర్!
- డా|| నాగసూరి వేణుగోపాల్
భారత్ బయో డైవర్సిటీ హాట్‌స్పాట్
మన దేశానికే పరిమితమైన అపురూప వృక్షసంపద, జంతు సంపద విశేషంగా ఉంది. భారత్‌లో 350 రకాల పాలిచ్చే జంతువులున్నాయి. మన దేశం ఈ విషయంలో ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో ఉంది. పక్షలు 12వందల రకాలు (ఇందులోనూ ఎనిమిదో స్థానం), సరీసృపాలు 453 రకాలు (ఐదోస్థానం), 45 వేల రకాల మొక్కలు (15వ స్థానం) ఉన్నాయి. మన దేశంలో సహజ సిద్ధంగా పెరిగే వృక్షజాలం, ఆవాసముండే జంతుజాలం జీవవైవిధ్యంలో చాలా కీలకపాత్ర వహిస్తాయి. అంతేకాదు మనం పండించే పంటల్లో కూడా ఎంతో వైవిధ్యం కనపడుతుంది. అలాగే మన పెంపుడు జంతువుల విషయంలో సైతం విశేషమైన వైవిధ్యం కనపడుతోందనే గుర్తింపు ఉంది. మనం సాకే జంతువుల రకాలు పెరిగినా, మనం పండించే పంటల రకాలు ఎక్కువైనా ఉత్పత్తుల్లో విశేషమైన వైవిధ్యం ఉంటుంది. ఫలితంగా మన ఆహారంలో విలక్షణమైన వైవిధ్యం సాధ్యమవుతుంది. అంతకు మించి పంటలలో వైవిధ్యం ఉన్నప్పుడు వంటలలో కూడా వైవిధ్యం తప్పదు.
చేజేతులా చంపేస్తున్నాం
రాయల్ టైగర్, ఒంగోలు పోట్లగిత్త, బట్టతల మేక... ఈ జాబితాలో చాలా ఉన్నాయి. ఇవి ఏమిటో తెల్సా? క్రమంగా అంతరించిపోతున్నవి. ఇవిపోతే ఏమి? అని ఎవరైనా భావించొచ్చు. గృహనిర్మాణాలు మారిపోయాయి. అంతా కాంక్రీటు భవనాలు కావడంతో ఇళ్లలో పిచ్చుకలు ఆవాసం లేకుండా చేశాం. ఎగిరే పిచ్చుకలు గమనించడం వల్ల ఊయలలో పడుకునే పాపకు వినోదంతో పాటు కంటికి, మెడకు మంచి వ్యాయామమని పరిశీలకులు చెబుతారు. అలాగే పొలాన్ని ఆశించే క్రిములను తినడం ద్వారా పిచ్చుకలు రైతుకు ఆదాయాన్ని కలిగిస్తాయి. పిచ్చుకలు కొంత ధాన్యం తిన్నా, అవి ఆదా చేసే ధాన్యంతో పోలిస్తే చాలా తక్కువ. ఇలా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. పక్షి అయినా, పాము అయినా! ఆధునిక పోకడలతో సాగే మానవుడు సహజ సిద్ధమైన మిత్రులను పోగొట్టుకుంటున్నాడు!
జీవ వైవిధ్యం ఎందుకు అంతరిస్తుంది?
సానుకూల పరిస్థితులు లేకపోతే ఏప్రాణి అయినా మనుగడ సాగించలేదు. ఏ ప్రాంతంలోనైనా ప్రత్యేకమైన మొక్కలు, వృక్షాలు, పక్షులు, జంతువులు ఉన్నాయంటే అక్కడ ఉండే పరిస్థితులు ఆధారంగా ఉంటాయి. డైనోసార్ల వంటివి ఎందుకు కనుమరుగయ్యాయంటే అవి బతకలేకపోవడం వల్లే! ప్రకృతి స్థిరంగా ఉన్న పరిస్థితుల్లో మనిషి జోక్యం చేసుకోకపోతే ప్రమాదం ముంచుకురాదు. మార్పు, నాగరికత, ప్రగతి, టెక్నాలజీ, అధిక జనాభా, పరిశ్రమలు... వంటి కారణాలతో మనిషి జోక్యం బాగా పెరుగుతోంది. ఫలితంగా స హజ పరిస్థితులను విశేషంగా ప్రభావితం చేస్తున్నాం. తద్వారా ఆ పరిస్థితులకు అలవాటు పడిన జీవరాశులు ఇబ్బందులకు గురవుతాయి. క్రమంగా అంతరిస్తాయి. అందువల్లనే ప్రకృతితో మనిషి సహజీవనం చేయాలి కానీ, ఎక్కువ జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ ఈ జోక్యం అనేది తక్కువ మోతాదులో ఉంటే ప్రకృతి తనకు తానే సర్దుబాటు చేసుకోగలదు.
సహజ వినాశనాలూ... కృత్రిమ వినాశనాలు
గత 50 కోట్ల సంవత్సరాల వ్యవధిలో ఐదుసార్లు గొప్ప వినాశనాలు సంభవించాయి. 448 మిలియన్ సంవత్సరాల క్రితం మొదటిదీ, 365 మిలియన్ సంవత్సరాల క్రితం రెండవదీ, 286 మిలియన్ సంవత్సరాల క్రితం మూడవదీ, నాల్గవది 210 మిలియన్ సంవత్సరాల క్రితం, ఐదవది 66 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగాయని ధృవపరిచింది. ప్రతిసారీ అనంతమైన స్థాయిలో ఈ భూమండలం మీద నష్టం జరిగింది. మొదటి నాలుగు వాతావరణంలో వచ్చిన పెను మార్పుల వల్ల ఏర్పడగా, ఐదవది మాత్రం గొప్ప ఉల్కాపాతం కారణంగా సంభవించింది. ఐదవ వినాశనంలో డైనోసార్లు అంతరించాయి. ఇక ఆరవ వినాశనం ఇప్పుడు నడుస్తోంది. అయితే దీనికి కారణం ప్రకృతి కాదు, కేవలం ఆధునిక మానవుడు!
No comments:
Post a Comment