Tuesday, 3 April 2012

కయోజెనిక్స్





ఫ్రిజ్‌లో పెట్టిన కూరగాయలు త్వరగా పాడుగావు. చలికాలంలో పూలు, పండ్లు, వంటకాలు మామూలుగానే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. అందుకే కొందరు, చనిపోయిన మనుషులను, మరీ ఇష్టమయిన పెంపుడు జంతువులను చల్లబరిచి ఉంచి, తర్వాతెప్పుడో బతికించుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఈ పద్ధతి పేరు క్రయోనిక్స్. ఇది సైన్సు కాదుగాక కాదు!
క్రయోజెనిక్స్ అని మరొక మాట ఉంది. మరీ ఎక్కువ చల్లదనం గురించిన శాస్త్ర విశేషాలను ఈ రంగంలో చర్చిస్తారు. చాలా చల్లని ద్రవాలను వాడి, పదార్థాలను, పరిస్థితులను వాడి వైద్యం మొదలు రకరకాల రంగాలలో పరిశోధించడం క్రయోజెనిక్స్. మైనస్ 150 డిగ్రీల సెల్సియస్ చల్లదనాన్ని అబ్జల్యూట్ జీరో అంటారు. పదార్థం సిద్ధాంతపరంగా కూడా, అంతకంటే తక్కువ వేడిమి, (చల్లదనం)లో మనజాలదని పరిశోధకులు నిర్ణయించారు.
ఈ పరిస్థితులను టెంపరేచర్‌కు తెలుగులో వాడుతున్న ‘ఉష్ణోగ్రత’ మాటలతో వర్ణిస్తే అర్థం ఉండదు. ఇందులో ఉష్ణం లేదు. ఆ ఉష్ణంలో ఉగ్రత అసలే లేదు. భూమి మీద అన్నింటికన్నా చల్లని ప్రాంతం అంటార్కిటికా. అక్కడ అన్నింటికన్నా చల్లని పరిస్థితిగా నమోదయింది. 89.2 డిగ్రీల సెల్సియస్. అంటే -129 డిగ్రీల ఫారెట్‌హీట్. విశ్వంలో, వాతావరణంలో నైట్రోజన్, హీలియం కావలసినంత ఉన్నాయి. వాటి సహజ పరిస్థితిని మార్చి, ఒత్తిడికి గురిచేసి క్రయోజెనిక్ చల్లదనాన్ని పుట్టిస్తారు. సహజ వాతావరణంలో నైట్రోజన్ వాయువుగా ఉంటుంది. దాన్ని -196 డిగ్రీ సెల్సియస్‌కు చేరిస్తే ద్రవంగా మారుతుంది. ఆ ద్రవాన్ని వాక్యూమ్ టాంకులలోపెట్టి రవాణా చేస్తారు. వాడుకుంటారు.
ఒక వాయువును పట్టి ఇంతగా చల్లబరచడం ఎట్లా వీలవుతుందని అనుమానం రావచ్చు. ఒత్తిడి పెంచితే ఏ పదార్థమయినా వేడెక్కుతుంది. ఒత్తిడి త్వరగా తగ్గిస్తే, వాయువు కూడా ద్రవంగా మారుతుంది. గాలిలోనుంచి నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియాలను ద్రవాలుగా మార్చడానికి పద్ధతులున్నాయి. అలా మార్చిన పదార్థాల సాయంతో ఎన్నో పరిశోధనలు జరిగాయి.
అంతరిక్షంలోకి వెళ్ళే రాకెట్లలో క్రయోజెనిక్ ఇంధనాలు, వాటితో పనిచేయగల యంత్రాలు ఉంటాయి. ఎమ్‌ఆర్‌ఐ లాంటి వైద్య పరీక్షా యంత్రాలలో క్రయోజెనిక్స్‌ను వాడుకుంటారు. శుక్రం, ఇతర జీవ పదార్థాలను పాడుగాకుండా, చాలాకాలం పాటు నిలువుంచడానికి కూడా ఈ పద్ధతి వాడుకలో ఉంది. లోహాలను వేడి చేసి, వెంటనే ఒక్కసారిగా చాలాచల్లబరిస్తే, వాటి లక్షణాలు మారతాయని తెలుసు. చల్లదనంలో కంప్యూటర్లు మరింత వేగంగా పనిచేస్తాయని గమనించారు. స్క్విజ్ అనే పద్ధతిని వాడి మరీ వేగంగా పనిచేయగల కంప్యూటర్లను తయారుచేస్తున్నారు. బూరాలు, వయొలిన్‌లు, శాక్సోఫోన్ లాంటి వాయిద్యాలను క్రయోజెనిక్స్ పద్ధతిలో తయారుచేస్తే, నాణ్యత, మన్నిక బాగా ఉంటాయని ఈ మధ్యనే ప్రకటించారు. సైన్సు ఊహలకందని లోతులకు చేరింది. అందుకే సులభంగా అర్థంకాదు!

No comments:

Post a Comment