కంపెనీ సెక్రటరీ కోర్సు చేసినవారికి కంపెనీల్లో, దేశ విదేశాల్లోని వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. స్వయంగా సంస్థలు ప్రారంభించుకోవచ్చు. యాక్ట్ 1956 ప్రకారం ఐదుకోట్లు టర్నోవర్‌గల ప్రతి కంపెనీలో పూర్తికాలం సెక్రటరీని నియమించుకోవాలి. వీరికి జీతాలు కూడా లక్షల్లో ఉంటాయి. కాబట్టి కంపెనీ సెక్రటరీ ఉద్యోగానికి డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు స్టాక్ ఎక్సేంజ్‌లు వివిధ సంస్థలూ, ట్రస్టులూ, అసోసియేషన్‌లూ, ఫెడరేషన్‌లూ, అథారిటీలూ, కమిషన్‌లూ కంపెనీ సెక్రటరీ అర్హతగల వారిని అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో నియమించుకుంటున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఈ హోదాగల పోస్టుకు ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
అర్హత పొందగానే ఉపాధి ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. పది లక్షల నుంచీ ఐదు కోట్లవరకు టర్నోవర్‌గల ప్రతికంపెనీ నేడు సెక్రటరీలను నియమించుకుంటోంది. కాబట్టి బోల్డన్ని అకాశాలుంటాయి. ట్రైబ్యునల్స్‌లల్లో, కంపెనీ లాబోర్డులల్లో, ట్రేడ్ ప్రాక్టీస్ కమిషన్‌లల్లో వీరికి అవకాశాలుంటాయి. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కంపెనీ సెక్రటరీ హోదాగల వారికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నంలో ఉంది.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్‌ఐ) డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేట్ ప్రొఫెషన్ ఆప్ కంపెనీ సెక్రటరీ చట్టం ద్వారా రూపొందించబడింది. ఐసిఎస్‌ఐ కంపెనీ సెక్రటరీషిప్ కోర్సులకు ప్రాధాన్యతనిస్తోంది. డిస్టెన్స్‌లో చదువుకునే అవకాశం కల్పిస్తోంది. అన్ని రకాల సబ్జెక్టులనూ అందిస్తోంది. కంపెనీ సెక్రటరీషిప్ వల్ల వృత్తిపరమైన నైపుణ్యాలూ, కార్పొరేట్ స్కిల్సూ అలవడుతాయి.
ప్రవేశం ఇలా...
ఆసక్తిగల విద్యార్థులు 10+2 తర్వాత ఇందులోకి ప్రవేశించవచ్చు. ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ లాంటి సిఎస్ కోర్సులు చేయొచ్చు. ఫౌండేషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశించే అభ్యర్థి 10+2 ఉంటే సరిపోతుంది. అదే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించే వారు తప్పనిసరి గ్రాడ్యుయేట్ అయ్యుండాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించే వారికి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఆఫ్ సిఎస్ అర్హత కలిగి ఉండాలి.
ప్రాక్టీస్... ట్రైనింగ్
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, ప్రొఫెషన్ ప్రోగ్రామ్స్‌లో పాసైన వారే కంపెనీ సెక్రటరీ పోస్టుకు అర్హత సాధించగలుగుతారు. ఈ రెండూ ప్రోగ్రాముల్లో ఏదోఒక అర్హత ఉన్నవారికి కంపెనీలు 16 నెలలపాటు జీతభత్యాలతో కూడిన శిక్షణ ఇస్తాయి. ఇది పూర్తి చేసుకున్న వారే సిఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
అడ్మిషన్స్...
ప్రతి సంవత్సరమూ ఈ కోర్సులో ప్రవేశం కోసం అవకాశం కల్పిస్తారు. జూన్, డిశంబర్ మాసాల్లో అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది. ఫౌండేషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి డిశంబర్ 31న ప్రకటన వెలువడుతుంది. అదే ఏడాది పరీక్ష ఉంటుంది. ఒకవేళ సెప్టెంబర్ 30 ప్రకటన వెలువడితే మరుసటి సంవత్సరం జూన్‌లో పరీక్ష ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలకోసం www.icsi.edu చూడొచ్చు.
ఇ- లెర్నింగ్ కోర్సులు
ఐసిఎస్‌ఐ ఇ- లర్నింగ్ కోర్సుల్ని అందిస్తోంది. ఇంట్లో కూర్చుని కూడా కంపెనీ సెక్రటరీ ఉద్యోగానికి కావలసిన అర్హత సంపాదించవచ్చు. కంపెనీ సెక్రటరీ ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఈ మూడింటికి సంబంధించిన సిఎస్ కోర్సులు ఇంటర్నెట్ ద్వారా చదువుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు http//elearning.icsi.edu క్లిక్ చేస్తే అన్ని సబ్జెక్టులూ చదువుకోవచ్చు.
No comments:
Post a Comment