Wednesday, 11 April 2012

బాలల నేస్తం 1098 చైల్డ్‌లైన్‌


హాలో... ఇక్కడ ఒక బాలుడు ప్రమాదంలో ఉన్నారండీ...
హాలో... తమ బాలుడు తప్పిపోయాడండీ..
హాలో... ఇక్కడ ఒక అనాథ బాలుడు తిరుగుతున్నారండీ...
ఈ సమాచారం అందుకున్న గంటలోనే ఒక బృందం అక్కడకు వస్తుంది. బాలలకు అవసరమైన సహాయాన్ని, పునరావాసాన్ని కల్పిస్తోంది... అదే చైల్డ్‌లైన్‌. ఒక ఉచిత ఫోన్‌ కాల్‌తో ఇన్నిసేవలందిస్తున్న ఛైల్డ్‌లైన్‌ గురించి తెలసుకుందాం. ఆపదలో ఉన్న బాలబాలికల సమాచారాన్ని అందించే బాధ్యతను తీసుకుందాం.
ఛైల్డ్‌లైన్‌ అంటే...
బాలబాలికల హక్కులు పరిరక్షణ, వారి సంక్షేమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ చైల్డ్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వశాఖలు, స్వచ్చంధ సంస్థల సహకారంతో ఇది నడుస్తోంది. 1098 టోల్‌ఫ్రీ నెంబర్‌ను కేటాయించింది. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అనుమతి ఉన్న స్చచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఉంటుంది. బాలబాలికలు ఎక్కడైనా ప్రమాదానికి గురైన, తప్పిపోయిన, అనాథగా తిరుగుతున్నా, బాలకార్మికుడైనా, మానసిక వ్యాధితో బాదపడుతున్న, బాల్య వివాహాలు జరిగినా... ఇలాంటి సమాచారాన్ని ఈ నెంబరుకు తెలియజేయాలి. వెంటనే నియమించబడిన స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు, ఆయా సంఘటనలతో సంబంధమున్న ప్రభుత్వశాఖల అధికారులతో ఒక బృందం అక్కడకు వస్తుంది.
ఆ తర్వాత ఏం చేస్తారు..!
అనాథ బాలుడు అయితే వెంటనే ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న స్వచ్చంధ సంస్థలో పునరావాసం కల్పిస్తారు. మానిసిక సమస్యతో బాధపడుతున్న బాలుడు అయితే మనో వికాస కేంద్రాల్లో చేర్పిస్తారు. వీరికి విద్యనందిస్తారు. వైద్యం అవసరమైతే అందుకు తగిన చర్యలు తీసుకుంటారు. బాల్య వివాహం అయితే పెళ్లి జంటకు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనార్థాలను వివరిస్తారు. అప్పటికే వినకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తప్పిపోయిన బాలుడు గురించి చైల్డ్‌లైన్‌ వెబ్‌సైట్‌లో పెడతారు. ఆయా ప్రాంతాల్లో తమ సంస్థ ప్రతినిధుల ద్వారా వారిని వెతికే ప్రయత్నం చేయిస్తారు.
బాధ్యతలు నిర్వహించేదెవరు..!
ఈ బాధ్యతలన్నింటినీ నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులతో పాటు కొన్ని స్చచ్చంధ సంస్థలను ఎంపిక చేశారు. ఛైల్డ్‌లైన్‌ 1098ను జిల్లా కేంద్రంలోని బెజ్జిపురం యూత్‌ క్లబ్‌లో ఉంది. నోడల్‌ ఏజెన్సీగా బ్రెడ్స్‌ స్వచ్చంధ సంస్థను నియమించారు. బూర్జ మండలం పెద్దపేట, పాతపట్నం మండలం కేంద్రంలో ఆర్ట్స్‌ స్వచ్చంధ సంస్థ, పలాస, ఇచ్చాపురంలో గెస్ట్‌ స్వచ్చంధ సంస్థలను సబ్‌సెంటర్లుగా ఎంపిక చేశారు. వీరితో పాటు ఐసిడిఎస్‌, వైద్యాఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ తదితరశాఖల అనుసంధానంతో ఇవి పనిచేస్తాయి.
ఇప్పటి వరకూ చేసిన సాయం
గత ఏడాది అక్టోబర్‌లో జిల్లాలో అధికారికంగా ఛైల్డ్‌లైన్‌ ప్రారంభమయింది. 1020 ఫోన్‌కాల్స్‌ సమాచారం అందుకున్నారు. 15 మంది బాలబార్మికులను గుర్తించి, వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాలలో చేర్పించారు. తప్పిపోయిన ఏడుగురు చిన్నారులను బంధువులకు అప్పగించారు. 21 మంది యాచక బాలలకు పునరావాసం కల్పించారు. 23 మంది బడిమానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేరేలా చేశారు. ఆమదావలస, లావేరు మండలాల్లో మూడు బాల్యవివాహాలను నిలుపుదల చేశారు.
జిల్లా బాలల సంక్షేమ కమిటీ
బాలల సాధారణ కేసులను విచారించేందుకు బాలల సంక్షేమ జిల్లా కమిటీ(సిడబ్ల్యుసి) ఉంటుంది. కమిటీకి మెజిస్ట్రేట్‌ హోదా ఉంటుంది. వీరికి విచారించే అధికారం ఉంటుంది. ఇటీవల ఆమదావలస మండలం పంతులపేటలో బాల్యవివాహానికి సిద్ధపడిన తల్లిదండ్రును విచారించారు. 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసుకోవాలని తీర్పునిచ్చారు. దీనిని ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష రూపాయలను జరిమానా విధించే అధికారం కమిటీకి ఉంటుంది.

No comments:

Post a Comment