Friday, 20 April 2012

గున్నమామిడి కొమ్మమీద...


చెట్టుకు పండిన మామిడిపండు రుచి ఎన్నడైనా చూశారా?! ఆ... ఆ... వెంటనే చిన్నతనానికి పరుగెత్తేశారు కదా! దాని రుచి మహత్మ్యం అలాంటిది మరి! వేసవికాలం వస్తుందనగానే మరుమల్లెలకై అతివలు ఎదురుచూడటం సహజం. కానీ, ఆడామగా, పిల్లాపెద్దా తేడాలేకుండా ఆబాలగోపాలం ఒక్కటై ఎదురుచూసేది మాత్రం మామిడిపళ్లకోసమే! అందులో రసాలు ఇష్టపడేది కొందరైతే, బంగినపల్లి రుచించేది మరికొందరికి. ఇవికాక తోతాపురితో మురబ్బా తయారీకి సిద్ధపడిపోయేవారి ఇంకొందరు. ఎవరి ఇష్టాలు ఏమైతేనేం, ఎవరినీ నిరాశపరచకుండా ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరిచే సుగుణం మామిడికి ఉంది. కాబట్టే మామిడి ఫలాల్లో రారాణి(ఏం, రారాజే ఎందుకనాలి? 'ఆమె' పేజీ కదా! మనం వెరైటీగా రారాణి అని పిలిచేద్దాం!)గా కీర్తించబడుతోంది. దేశ విదేశాల్లో మామిడి ఖ్యాతి మారుమ్రోగిపోతోంది.
కేవలం పళ్లు మాత్రమే కాదు, వాటికి ధీటుగా పచ్చిమామిడికీ అంతే పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. వాటిలో పిల్లలు ప్రీతిగా తినే కొబ్బరిమామిడి, పప్పు, కూరలు, చట్నీలలోకి వాడే పుల్లమామిడి, ఆవకాయకోసం మరిన్ని రకాలు... ఇక ఈ చిట్టాకు అంతూదరీ ఉండదు. మరి ఈ మామిడి కేవలం రుచికి మాత్రమే రాణీనా, ఈ మామిడి మన ఆరోగ్యానికేమైనా చేసేదేమైనా ఉందా అని ప్రశ్నిస్తే లభించే సమాధానాలు కోకొల్లలు. మరి అవేంటో ఓసారి పరికిద్దామా?!
* మామిడిలో జీర్ణశక్తికి తోడ్పడే అంశాలున్నాయి. ఇందులోని ఫైబర్‌ అందుకు బాగా ఉపయోగపడుతుంది.
* మామిడి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటిలో ఉండే పెక్టిన్‌, విటమిన్‌ సి ఈ పనిని నిర్వర్తిస్తాయి.
* ఇందులోని విటమిన్‌ డి శరీరసామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
* మామిడిలో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సుగుణాలు దాగున్నాయి.
* ముఖంపై మొటిమలు ఉన్నట్లయితే మామిడి చెక్కతో రుద్ది తరువాత కడిగేసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
* మామిడిలో ఐరన్‌ చాలా ఎక్కువ. ఇది మహిళలకు చాలా అవసరం. రక్తహీనతతో బాధపడే వారు మామిడిపళ్లు అధికంగా తింటే ఆ సమస్యనుండి బయటపడ్డట్లే! ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మేలుచేస్తుంది. మెనోపాజ్‌లో ఉన్న మహిళలు వారి రుగ్మతలను దీనిద్వారా అధిగమించొచ్చు.
* మామిడిలో యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి కేన్సర్‌ను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా, గుండెజబ్బులను దరికి చేరనీయవు.
అన్నట్లు మామిడిపళ్లు రంగు బాగున్నాయని కొనడం మాత్రమే కాదు, అవి పండిన వాసన వస్తున్నాయా లేదా అని గమనించి కొనాలి. ఎందుకంటే కార్బైడ్‌వేసి పండబెడుతున్న పళ్లే నేడు అధికంగా మార్కెట్లో లభిస్తున్నాయి. అవి తింటే మామిడివల్ల ఒనగూడే లాభాలు పోయి, ఆరోగ్యం పాడవుతుంది. అందుకే జాగ్రత్త వహించాలి!
మరి మామిడిలోని సుగుణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తతెలుసుకున్నాంగా! ఇక ఈ వేసవిని ముద్దపప్పు, కొత్తావకాయతో ఎంతగా ఎంజారుచేస్తామో... అంతే గొప్పగా మ్యాంగో మిల్క్‌షేక్‌, మ్యాంగో ఫ్రూట్‌సలాడ్‌లతో వేసవి తాపాన్ని ఇట్టే జయించేద్దాం! మరింకెందుకు ఆలస్యం, లెట్స్‌ బీట్‌ ది హీట్‌ విత్‌ జ్యూసీ, టేస్టీ మ్యాంగోస్‌!!

No comments:

Post a Comment