Monday, 23 April 2012

రాకెట్ గమనంపై ముందే లెక్కలు


  • - కొడవటిగంటి రోహిణీప్రసాద్
  • 21/04/2012
కుజుణ్ణి ఉత్త కళ్ళతో సాయంత్రాలు చూడగలం. టెలిస్కోప్ ఉన్నట్టయితే మరింత బాగా చూడవచ్చు. ఈ పద్ధతి ఎప్పుడు మొదలయిందో తెలుసా? 17వ శతాబ్దంలో గెలీలియో తయారుచేసిన టెలిస్కోప్ సహాయంతో రోదసీ పరిశీలన ఆధునిక పద్ధతిలో మొదలయింది. 1957 తరువాత సోవియట్ యూనియన్, అమెరికా, ఇండియా తదితర దేశాలు కృత్రిమ ఉపగ్రహాలనూ, రాకెట్లనూ ప్రయోగించి మనుషులను చంద్రుడి మీదికి దింపేంతటి దాకా వెళ్ళాయి. ప్రస్తుత కాలంలో చంద్రుడి మీదికి రోదసీ నావికులు వెళ్ళడం తగ్గినప్పటికీ అంతరిక్ష పరిశోధనలు మటుకు ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. భవిష్యత్తులో కుజుడి మీదికి మనుషులు వెళ్ళబోతారు కనక ఈ తొలిమెట్లు ఎటువంటివో తెలుసుకుందాం. గ్రహాలన్నీ తమ తమ కక్ష్యల్లో ఆగకుండా తిరుగుతూనే ఉంటాయి కనక వాటిమధ్య జరిగే ప్రయాణాలు ఏ హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళినట్టుగానో సాధ్యపడవు. ఇందులో మొదటి విషయమేమిటంటే గ్రహాల మధ్య తిరిగే రాకెట్లూ, అంతరిక్ష నౌకలూ తిన్నగా సరళరేఖ వెంబడి ప్రయాణాలు చెయ్యవు. అవి వెళ్ళే వృత్తాకార మార్గాలు చాలా పొడవైనవి. భూమి మీదినుంచి రాకెట్ బయలుదేరిన క్షణంలో ఒకచోట ఉన్న కుజుడు అది అక్కడికి చేరేసరికి మరొక స్థానానికి కదిలిపోవడం సహజం. అందుకని ఆ మార్గం ఎటువంటిదో, ప్రయాణానికి ఎంత సమయం పడుతుందో శాస్తవ్రేత్తలు లెక్కకట్టి ఆ క్షణానికి కుజ గ్రహం ఉండే చోటికి రాకెట్ కచ్చితంగా చేరేటట్టుగా చూస్తారు.
భూమి చుట్టూ కక్ష్య (1)లో తిరుగుతున్న ఉపగ్రహాన్ని సరైన సమయంలో (2) ఒక ఇంజన్‌ను ఉపయోగించి దీర్ఘ వృత్తాకార కక్ష్యద్వారా కుజుడి కక్ష్య (3)కు చేర్చవచ్చు. మన ఉపగ్రహం చేరే సమయానికి కుజు డు ఆ ప్రాంతానికి వచ్చేటట్టుగా చూసుకోవచ్చు. ఈ ప్రయాణానికి సుమారు 18 నెలలు పడుతుంది.

No comments:

Post a Comment