హిందూ మహాసముద్రంలో ఈ నెల 11న వచ్చిన భూకంపం 'భారత-ఆస్ట్రేలియా టెక్టానిక్ పళ్లెం' అంతర్భాగంగా రిక్టర్ స్కేల్‌పై 8.6 తీవ్రతతో వచ్చింది. దీని కేంద్రం ఇండోనేషియాలో 'బందా ఆసెV్‌ా' పట్టణానికి నైరుతి దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో 23 కిలోమీటర్ల లోతులో సముద్రగర్భంలో ఉంది. ఈ భూకంపం సుమారు 3 నిమిషాలు కొనసాగింది. దీని ప్రకంపనలు హిందూ మహాసముద్రం ద్వారా వ్యాప్తిచెంది ఎంతో దూరంలో ఉన్న మలేసియా, మాల్దీవులు, ఇండియా వంటి దేశాలకూ విస్తరించాయి. ఫలితంగా, సునామీ హెచ్చరికలు 25 దేశాల్లో (హిందూ మహాసముద్రం చుట్టూ వ్యాపించి ఉన్న దేశాలు) ఇవ్వబడ్డాయి. ఇండోనేషియా, థాయిలాండ్‌లలో భయంతో ఎంతోమంది తమ ఇళ్లను వదిలిపెట్టి బయటికి వెళ్లారు.
భారతదేశంలో తూర్పుతీర ప్రాంతాలైన చెన్నయి, కొచ్చి, భువనేశ్వర్, కొల్‌కతాల్లో ఈ ప్రకంపనలు కనిపించాయి. కొల్‌కతాలో మెట్రోరైల్ సర్వీసుల్ని నిలిపివేశారు. ఎత్తయిన భవనాల నుండి ప్రజల్ని ఖాళీ చేయించారు. దీని తర్వాత 111 చిన్న భూకంపాలు వచ్చాయి. ఇవి రిక్టర్‌స్కేల్‌పై 4 నుండి 6.2 తీవ్రతతో నమోదయ్యాయి. దీనివల్ల చిన్నపాటి సునామీ నికోబార్ దీవుల్లో వచ్చింది. ఫలితంగా, తీరప్రాంతంలో 50 సెం.మీ. ఎత్తులో సముద్రపు అలలు లేచాయి. ఇండోనేషియాలో ఈ అలలు 80 సెం.మీ. వరకూ లేచాయి. మొత్తంమీద, భయపడినంత నష్టం మాత్రం ఎక్కడా కలగలేదు. పెద్దగా సునామీ అలలు ఏర్పడకపోవడానికి, నష్టం కలగకపోవడానికి కారణం వచ్చిన భూకంపం 'ఇండో-ఆస్ట్రేలియన్ టెక్టానిక్ పళ్లెం'లో అంతర్భాగంగా వచ్చిందని, ఆ తర్వాత ఇది 'జారి-ఎదుర్కొనే (స్లిప్-స్ట్రైక్)' రకంగా మారిందని అమెరికన్ భూగర్భ పరిశోధనా సంస్థ తెలిపింది. ఇలా మారడం చాలా అరుదైన సంఘటనగా ఈ సంస్థ తెలిపింది. దీనివల్ల భూకంప తీవ్రత అధికంగా ఉన్నా, పెద్దఎత్తున సముద్రపునీరు స్థానభ్రంశం చెందలేదు. దీంతో ఇది పెద్ద సునామీగా ఏర్పడడానికి దారితీయలేదని ఈ సంస్థ పేర్కొంది. అయితే, 2006 నుండి ఇదే ప్రాంతంలో ఇటువంటి భూకంపాలు మూడుసార్లు వచ్చాయి. ఇది కూడా అంత నష్టం కలిగించలేదు. 2004 సునామీ అనుభవాలను గమనంలో ఉంచుకుంటే, సముద్రగర్భంలో కలిగే భూకంపనలన్నీ భారీ సునామీ ఏర్పడడానికి దారితీయవని ఇప్పటి భూకంపం నిర్ద్వందంగా తెలుపుతోంది.
భూకంపాలు.. రకాలు..
ప్రపంచం మొత్తం దాదాపు 12 టెక్టానిక్ పళ్లాలతో నిర్మితమైంది. ఈ టెక్టానిక్ పళ్లాలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండకుండా కదులుతూ ఉంటాయి. ఈ పళ్లా లు ఎల్లప్పుడూ ఒకవిధమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాయి. ఈ ఒత్తిడి ఫలితంగా టెక్టానిక్ పళ్లాలు ఎప్పుడూ కదుల్తూ ఉంటాయి. ఈ కదలికలన్నీ ఒకే దిశలో ఉండవు. ఎదురెదురుగా కొనసాగవచ్చు. లేక అంతర్భాగంలో కూడా ఏర్పడి కొనసాగవచ్చు. ఆ సమయంలో అధికంగా ఉన్న శక్తి ప్రకంపనలను కలిగిస్తూ వెలికి వస్తుంది.
టెక్టానిక్ పళ్లాల చివరి భాగాలు ఒకదానికొకటి ఒరుసుకోవడం (రాసుకోవడం) వల్ల సునామీ కలిగించగల భూకంపాలు ఏర్పడతాయి. ఎక్కడైతే ఈ పళ్లాల అంచులు రాసుకుంటాయో ఆ ప్రాంతంలో నీరు స్థానభ్రంశం చెందుతుంది. దీనివల్ల సునామీ ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు ఈ ప్రక్రియ తరచుగా జరుగుతుంది. ఈ రకం భూకంపాల వల్ల భారీ నష్టం జరుగుతుంది.
టెక్టానిక్ పళ్లాల అంతర్భాగంలో బలహీన ప్రాంతాలూ (ఫాల్ట్‌లైన్స్) ఉంటాయి. ఈ బలహీన ప్రాంతాల్లో కలిగే భూకంపం అధికపీడన ప్రాంతం వద్ద టెక్టానిక్‌పళ్లెంలో అంతర్గత భూకంపం మొదలవుతుంది. ఇది ఎప్పుడో ఒక్కసారి జరుగుతుంది. దీనివల్ల పెద్దగా నష్టం జరగదు.
అయితే 2001లో గుజరాత్‌లో ఇలాంటి భూకంపం వచ్చింది. దీని కేంద్రం కచ్ జిల్లాలోని భుజ్ ప్రాంతంలో ఉంది. ఈ భూకంపం వల్ల ఇక్కడ అపారనష్టం కలిగింది. దీనికి కారణం ఈ ప్రాంతపు కట్టడాల నిర్మాణం భూకంపనాన్ని తట్టుకునే విధంగా లేదని నిపుణులు నిర్ధారించారు. ఈ సమయంలో గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని 'భుజ్' గ్రామం పూర్తిగా ధ్వంసమైంది.
సునామీలు ఎలా ఏర్పడతాయి?
భూకంపాలు కలిగినప్పుడు, అగ్ని పర్వతాలు పేలినప్పుడు లేదా సముద్ర / సరస్సు గర్భంలో పేలుడు సంభవించినప్పుడు లేక పెద్ద పరిమాణంలో భూమి దొర్లి నప్పుడు (లాండ్ స్లిప్)-వీటి సమీపంలో ఉన్న నీరు పెద్దపరిమాణంలో స్థానభ్రంశం కలుగుతుంది. పెద్దఅలల రూపంలో ఈ నీరు ఎగిసిపడుతుంది. ఇలా వచ్చిన అలలు అదేచోట ఉండకుండా చుట్టూ ఉన్న నీటిలో ప్రకంపనలు సృష్టిస్తాయి. ఇలా సృష్టిం చిన అలలు తీరప్రాంతానికి వస్తాయి. తీరప్రాంతంలో మామూలు అలల్లా కాకుండా సునామీ అలల తరంగదైర్ఘ్యం చాలా పెద్దగా ఉంటుంది. సుమారు కొన్ని వందలమైళ్ల వరకూ విస్తరిస్తుంది. ఇలాంటి అల తీరాన్ని తాకగానే కొన్ని పదుల మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలోని భూమి తీవ్ర ఒత్తిడికి గురవుతుంది.
రిక్టర్ స్కేల్..
ఇది భూకంప శక్తిని కొలిచే సూచిక. ఇది ఒక లాగ్‌స్కేల్ (బేస్ 10). భూకంప శక్తి 4.0, 5.0 లను పోలిస్తే 5.0వ రకం భూకంపం 4.0వ రకం కన్నా 31.6 రెట్లు అధికశక్తిని కలిగి ఉంటుంది. 4.9 వరకూ శక్తిగల భూకంపాలు నష్టపర్చవు. అయితే, ఈ రకం భూకంపాలు కొంతమేర ప్రకంపనాల్ని సృష్టిస్తాయి. వీటిని గుర్తించవచ్చు. ఇవి తరచుగా వస్తుంటాయి. 5.0, ఆపైన ఉండే భూకంపాలే నష్టాన్ని కలిగిస్తాయి. 5.0-5.9వ రకం ఒక మోస్తరు శక్తి కల భూకంపాలు. ఈ కంపనాలు నిర్మాణం సరిగాలేని ఇళ్లకు నష్టం కలిగిస్తాయి. పటిష్టంగా నిర్మించిన ఇళ్లకు వీటితో అంత నష్టం కలగదు. 6.0-6.9 శక్తిగల భూకంపాల్ని శక్తివంతమైన భూకంపాలు అంటారు. ఈ భూకంపాలు 165 కిలోమీటర్ల వరకూ నష్టాన్ని కలిగించవచ్చు. 7.0-7.9 భూకంపాల్ని ప్రధానమైవిగా పేర్కొంటారు. 8.0-8.9 శక్తి గల భూకంపాలు కొన్ని వందల కిలోమీటర్ల వరకూ నష్టం కలిగించవచ్చు. వీటిని పెద్ద భూకంపాలు అంటారు. ఇవి సంవత్సరానికి ఒకటి లేక రెండు రావచ్చు. 9.0-9.9 శక్తి గల భూకంపాలు - ఇవి వేల కిలోమీటర్ల ప్రాంతంలో నష్టాన్ని కలిగిస్తాయి. సాధారణంగా పదేళ్లకోసారి వస్తాయి. 10.0-10.9 ఆపైన శక్తిగల భూకంపాల్ని భారీ భూకంపాలు అని వ్యవహరిస్తున్నారు. ఇవి సామాన్యంగా రావు. ఒకవేళ వస్తే విస్తృతమైన ప్రాంతాల్లో అతి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. ఇంతవరకూ 1960, మే 22న 'గ్రేట్ చిలియన్ ఎర్త్‌క్వేక్' సంభవించింది. దీని తీవ్రత 9.5గా రిక్టర్‌స్కేల్‌పై నమోదైంది.
నష్టం కలిగించిన 2004 సునామీ..
ఇది అత్యధిక ప్రాణ నష్టం కలిగించిన సునామీ. ఇది ఇండోనేషియా సుమత్రా ద్వీపకల్పంలో వచ్చింది. 9.0 తీవ్రతతో 2004, డిసెంబర్ 26న వచ్చింది. దీని ప్రభావం వల్ల దాదాపు 2.3 లక్షల మంది చనిపోయారు. దీనిలో 75 శాతం మంది ఇండోనేషియన్లు చనిపోయారు. మన దేశంలో 10 వేల మందికి పైగా మరణిం చారు. ముఖ్యంగా అండమాన్-నికోబార్ కేంద్రపాలిత ప్రాంతంలో అధికారికంగా 1310 మంది చనిపోయారు. 5600 మంది జాడ లేదు. అనధికారికంగా ఏడువేల మంది చనిపోయారు. నికోబార్ దీవుల్లో 25 శాతం మంది చనిపోవడమో, గాయపడటమో లేదా కనిపించకపోవడమో జరిగింది. చౌరా దీవుల్లో మూడోవంతు మంది పూర్తిగా చనిపోయారు. అయితే, నాన్‌కోరీ దీవుల సమూహాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వీటిల్లో నివసించే ఏడువేల మంది జాడ లేకుండా పోయారు. ట్వింకెట్ ద్వీపం రెండు భాగాలుగా విడిపోయింది. ఈ పెద్ద భూకంపం వచ్చిన తర్వాత 84 చిన్న భూ ప్రకంపనలు (5.0-7.0 తీవ్రతతో) జనవరి 1, 2005 వరకూ వచ్చాయి. అండమాన్-నికోబార్ దీవులకు దగ్గరలో 2004లో బారెన్ ద్వీపకల్పంలో చురుకైన అగ్నిపర్వతం (బారెన్-1) ఉంది. ఇది పోర్టుబ్లేయర్‌కు నైరుతి దిశలో 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూకంపం వచ్చిన తర్వాత డిసెంబర్ 30న ఈ అగ్నిపర్వతం నుండి విడుదలయ్యే లావా ఎక్కువైంది.
సునామీ అలలు రావడానికి, దుష్ప్రభావాలు కలగడానికి కొంత సమయం పడుతుంది. భూకంపన శక్తి, కేంద్ర దూరం మీద ఇవి ఆధారపడి ఉంటాయి. అందువల్ల 2004 సునామీ తర్వాత తీరప్రాంతంలో 'సునామీ హెచ్చరిక, రక్షణ కేంద్రాల్ని' ఏర్పాటు చేసుకున్నాం. ఇవి ఎంతోమంది ప్రాణాల్ని రక్షించేందుకు తోడ్పడతాయి.
మీకు తెలుసా..?
సునామీ: జపాన్ భాషలో 'సు (ట్సు)' అంటే ఓడరేవు. 'నామీ' అంటే అలలు. సునామీ అంటే 'ఓడరేవు అలలు' అన్నమాట. ఇవి మామూలు అలల కన్నా భిన్నమైనవి. మామూలు అలలు 3-4 అడుగుల ఎత్తు, కొన్ని మీటర్లు మాత్రమే తరంగదైర్ఘ్యం కలిగి ఉంటాయి. కానీ సునామీ అలల తరంగదైర్ఘ్యం కొన్ని కిలోమీటర్ల నుండి వందల కిలోమీటర్ల వరకూ ఉండవచ్చు. సముద్రంలో సునామీ వచ్చినప్పుడు కేవలం నీరు ఉబికినట్టుగానే కనిపిస్తుంది. దీన్ని గుర్తించలేకపోవచ్చు. కానీ, ఈ అల తీరానికి చేరేటప్పటికి పరిమిత సముద్రతీర విస్తీర్ణం వల్ల సునామీ అలల ఎత్తు పదుల మీటర్ల వరకూ పెరుగుతుంది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
No comments:
Post a Comment