Wednesday, 18 April 2012

ఉపవాసానికీ..ఉత్తరదిశకీ లంకె ఉందా..?


  • అశాస్త్రీయ ఆచారాలు 4
డాక్టర్‌ వెంగనూర్‌ బాలకృష్ణన్‌ అనే ఆయన రచించిన 'తాళపత్రం' అనే గ్రంథంలో అనేక చిత్ర విచిత్ర అంశాలు ప్రస్తావించబడ్డాయి. దీనిని చదివితే ఆచారాల వెనుకనున్న శాస్త్రీయతను వివరించే పేరుమీద 'బట్టతలకీ మోకాలికీ ముడి వేయడం' అనే సామెత గుర్తుకొస్తోంది. ఉదాహరణకు ఆ గ్రంథం 158వ పేజీలో 'బుధవారం రోజు ఉపవాస దీక్షను పాటిస్తున్నవారు ఉత్తరం దిశగా ప్రయాణం చేయకూడదని చెప్పబడింది. వెనుకటి రోజుల్లో ప్రయాణాలు కాలి నడకనే ఉండేవి. ప్రయాణం చేయవలసిన వారు ఆహారం తీసుకోకుంటే ఆరోగ్యం దెబ్బతినదా? ప్రయాణంలో కూడా ఉత్తరదిశ ప్రయాణమే చేయకూడదట. దానికి కారణం దక్షణ ధృవం నుండి ఉత్తర ధృవానికి అయస్కాంతశక్తి వ్యాపించి ఉంటుందనీ, ఆ అయస్కాంత శక్తి వ్యాపించి, దీక్షలో ఉన్నవారిపై విరుద్ధ ప్రభావాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరదిశగా ప్రయాణించకూడదన్న నియమాన్ని పెట్టడం జరిగిందట. ఆ విరుద్ధ ప్రభావం బుధవారం నాడే ఎందుకు ఉంటుంది? మిగిలిన రోజుల్లో అయస్కాంతశక్తి మారిపోతుందా? విరుద్ధప్రభావం ఉపవాస దీక్షలో ఉన్న వారిమీదే ఎందుకు ఉంటుంది? మిగిలిన వారి మీద ఎందుకు ఉండదు? ఇదంతా అర్థంపర్థంలేని ఆచారాలకు శాస్త్రీయ కారణాలున్నాయనే పేరు మీద కొన్ని సైన్సుపదాలను వాడుకొనే ప్రయత్నంగా కనిపించడం లేదూ?! మూఢవిశ్వాసాలను శాస్త్రీయతకు ఆపాదించడంగా కనిపించడం లేదూ..?!
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment