Friday, 13 April 2012

మళ్లీ వేసవి వచ్చేసింది


ఎండలు మండిపోతున్నాయి! నోటి తడారిపోతుంది. గొంతు దాహం దాహం అంటూ గోలచేస్తోంది. చెమట చిర్రెత్తిస్తోంది. ఎందుకంటే, వేసవి మళ్లీ విజృంభిస్తోంది. మరి ఈ బాధలకు దూరం కావాలంటే ఏం చేయాలి?! ఏం చేయాలంటే...
మంచినీరు ఎక్కువగా తాగాలి. వడదెబ్బ తగలకుండా, డీహైడ్రేషన్‌నుండి తప్పించుకోడానికి ఇదే సరైన మార్గం.
నీరు ఎక్కువగా ఉండే తాజా పుచ్చకాయ, ద్రాక్ష వంటి పళ్లు తింటే నిస్సత్తువ దగ్గరకే రాదు.
వేసవిలో చెమటబారిన పడిన జుట్టు సులువుగా చిట్లిపోయే అవకాశాలెక్కువ. జుట్టు పొడిబారకుండా కొబ్బరినూనె రాయాలి.
ఈకాలంలో పిల్లలకు సెలవులు. కనుక కొందరు స్విమ్మింగ్‌ నేర్పుతుంటారు. నీటిలోని క్లోరిన్‌ జట్టును ప్రభావితం చేస్తుంది. కనుక రక్షణ పద్ధతులు పాటించడం అవసరం.
ఈకాలంలో చర్మం ట్యాన్‌ అవడం సర్వసాధారణం. ఇందుకు అతినీలలోహిత కిరణాలు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కొందరికి చర్మం బొబ్బలెక్కడం, కమలడం, కొందరికి పేలుతుంది కూడా! వీలైనంత వరకూ ఎండలో తిరగకూడదు. తప్పనిసరిగా వెళ్లాలంటే సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. గొడుగు లేదా స్కార్ఫ్‌, క్యాప్‌ తప్పనిసరిగా వాడాలి.
ఎలోవేరా(కలబంద)రసం కమిలిన గాయాన్ని మాన్పుతుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కనుక రోజూ ముఖానికి, చేతులకు కొద్దిగా ఎలోవేరా రసం రాసుకుని ఆరాక కడుక్కోవాలి.
నూనెపదార్థాలకు వేసవిలో దూరంగా ఉండటమే బెటర్‌! నిజానికి ఏ సీజనైనా ఈ జాగ్రత్త మంచే చేస్తుంది.
నిమ్మరసం, మజ్జిగ, రాగిజావలాంటి ద్రవపదార్థాలు ఈకాలంలో నీరసాన్ని దరిచేరనీయవు. ముఖ్యంగా బయటకు వెళ్లే ముందు ఇవి తాగివెళ్తే నిస్సత్తువ రాదు.
పెరుగులో కొద్దిగా సెనగపిండి కలిపి మెడకు, చేతులకు, ముఖానికి రాసుకుని ఆరాక కడిగితే చర్మం తేటపడుతుంది. మృతకణాలన్నీ తొలగిపోతాయి.
శరీరం అసహనానికి గురికాకుండా తేలికపాటి దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే లేత రంగుల దుస్తులు ధరిస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
వేసవి సాయంత్రాలు కీరా లేక బంగాళాదుంప చక్రాలను కంటిపై ఉంచితే అలసట పోతుంది.
తాజా పోషకాహారం, కనీస జాగ్రత్తలు తీసుకుంటే చాలు... మరుమల్లెల సుగంధాలు, మామిడి పండ్ల మధుర రుచులూ, కొత్త ఆవకాయ తాలూకు కమ్మదనాలు ... వీటన్నింటినీ హాయి గా ఆస్వాదించొచ్చు. అప్పుడు మనకు వేసవి కాలం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో అస్సలు తెలీదు. అంతేనంటారా.?!

No comments:

Post a Comment