కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
-
అశాస్త్రీయ ఆచారాలు - 17
ఆంధ్రజ్యోతి దినపత్రిక 13.4.2012 నాటి సంచికలో ప్రచురింపబడిన 'నాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పరూ?' అనే శీర్షికతో వచ్చిన ఒక వ్యాసాన్ని చూపిం చాను. ఆ వ్యాస రచయిత ఎమ్.టెక్; ఎమ్.బి.ఏ. చదివాడు. వయస్సు 36. అతనికి 26వ ఏటి నుంచి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అయినా ఇంకా పెళ్ళికాలేదు. దానికి కారణం అతని మాటల్లోనే విందాం. 'నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది. అందరిలా బతకాలని ఉంది. అలా బతకటానికి అవసరమైన ఉద్యోగమూ ఉంది. దాచుకున్న డబ్బుంది. అయినా నాకు జాతకాల వల్ల పెళ్ళి కావడం లేదు.' అతని తండ్రి జాతకాలు చూస్తాడట. ఆయనకు తన పిల్లవాడికి సరిజోడీ జాతకంగల పిల్ల దొరకలేదట. అదీ అసలు విషయం. ఇలా జాతకాల పిచ్చివల్ల చదువూ, ఉద్యోగం ఉన్న ఎంతోమందికి పెళ్ళికావడం లేదు. ఇదంతా జ్యోతిష్యం అనే మూఢనమ్మకం వల్లనే గదా?
ఇక మూఢ నమ్మకాల వలన ప్రాణాలు పోగొట్టుకున్న అనేకమందికి సంబంధించిన వార్తలు ఇప్పుడు చెప్తాను. విను.
(1) గ్రామ దేవతకు తనయుడిని బలిచ్చిన తండ్రి (వార్త 23-11-1999)
కొడుకు వల్ల తమ కుటుంబానికి కీడు ఉందని నమ్మి, మూఢ విశ్వాసంతో కన్న కొడుకునే ఒక తండ్రి బలిచ్చాడట.
(2) మూఢనమ్మకానికి ఒకరి బలి (ఆంధ్రజ్యోతి 23-9-1994)
వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన వ్యక్తి కడుపునొప్పితో బాధపడు తుంటే, స్థానిక ఆర్.ఎమ్.పి. డాక్టరు భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చినా, రోగి బంధువులు రోగిని భద్రాచలం తీసుకెళ్ళకుండా తమ గ్రామానికి తరలించి భూతవైద్యం చేయించగా పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు.
(3) మంత్రగాడనే నెపంతో హత్య (ఈనాడు 1-7-1996)
చేతబడి చేసి కుటుంబసభ్యులను వేధిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని చంపి శవాన్ని పాతిపెట్టిన సంఘటన గార్ల మండలం పుల్లూరులో జరిగింది.
(4) అమ్మాజీ ముసుగులో కోట్లు శఠగోపం (ప్రజాశక్తి 6-6-2008)
మంత్రాలకు చింతకాయలు రాలతాయంటూ ఓ మహిళ అమ్మాజీ పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు దండుకుంది.
(5) గుప్త నిధుల కోసం భర్త హత్య (సాక్షి 29-5-2009) గుప్త నిధులపై ఆశతో ఓ ఇల్లాలు భర్తనే హత్య చేసింది.
(6) వివాహితను కొట్టి చంపిన భూతవైద్యుడు (ఈనాడు 28/2/2002)
ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన ఒక వివాహితను దయ్యం వదిలించే నెపంతో భూతవైద్యుడు, అతని అనుచరులు తీవ్రంగా కొట్టగా ఆమె మరణించింది.
(7) వాస్తుపేరిట లక్షలు ఖర్చు చేస్తున్న సింగరేణి (ఈనాడు 12-3-1998)
సింగరేణిలో ఇటీవలి కాలంలో వాస్తుపేరిట గదుల కిటికీలను, తలుపులను, అవసరమైతే విలువైన కట్టడాలను సైతం కూల్చివేసి లక్షల రూపాయలను దుబారా చేస్తున్నారని పత్రికా వార్త తెలియజేస్తోంది.
(8) 16.2.2007 నాటి ప్రజాశక్తిలోని ఈ వార్త..
ఓ 29 ఏళ్ళ యువతి ఇల్లు కొనాలనుకుంది. తన జాతకం తీసుకొని ఓ పండితుడనే మోసగాడి దగ్గరకు వెళ్ళింది. అతను 'మనమిద్దరం క్రితం జన్మలో భార్యా భర్తలం. నీవు ఆత్మహత్య చేసుకున్నావు. అందుకే ఇలా మనిద్దర్నీ ఆ దేవుడు కలిపాడు. నీ భర్తకు విడాకులిచ్చి నాతోరా!' అన్నాడు. నా మాట వినకపోతే, నీవు పూర్తిగా నాశనమౌతావు' అని భయపెట్టాడు. ఆమె అతని వల్ల గర్భవతి అయి అబార్షన్ చేయించుకుంది. ఇది ఎక్కడో పల్లెటూర్లో జరిగింది కాదు. వారిద్దరూ భారతీయులే. ఆమె తమిళ వనిత. లండన్‌లో జాబ్ చేస్తోంది. అతను లండన్‌లో ఒక గుడి పూజారి. ఈ సంఘటన లండన్‌లో జరిగింది.
కిషన్! బాగా చదువు, మంచి ఉద్యోగం ఉన్నా, మూఢనమ్మకాలతో ఎన్ని నష్టాలున్నాయో తెలుసు కున్నావు గదా? మూఢనమ్మకాలున్న వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇతరుల జీవితాలు నాశనం చేస్తాడు. లక్షలాది రూపాయల ధనం నాశనం చేసుకుంటాడు. ఇతరుల ధనం నాశనం చేస్తాడు. అందుకే మూఢనమ్మకాలకు సంబంధించి సైన్సు చెప్పే సమాధానాలను చదివి, అర్థంచేసుకుని, నీకూ, నీ సమాజానికీ మేలు చేకూరేట్లు నడుచుకోమని కోరాను. అర్థమైందా?' అని ముగించాను.
'అర్థమైంది అంకుల్!' అంటూ కిషన్ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
No comments:
Post a Comment