వాసుదేవ ఆచార్య పార్లమెంటు సభ్యులు
జీవసాంకేతికాలు ఆధునికాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్నాయి. సాంప్రదాయ ప్రజననం (బ్రీడింగ్) తో రూపొందిన అధికదిగుబడి వంగడాలు, హైబ్రిడ్‌లు, ఇతర ఉత్పత్తి సాంకేతికాలు, స్వాతంత్య్రం తర్వాత 65 ఏళ్లలో వ్యవసాయోత్పత్తిని ఎన్నోరెట్లు పెంచాయి. కొత్త గా అందుబాటులోకి వచ్చిన టిష్యూ కల్చర్, జన్యు మార్పిడి సాంకేతికాలు మరిన్ని అవకాశాల్నిచ్చాయి. వీటి వినియోగం రాజకీయ నిర్ణయాలతో ఇమిడి వున్నాయి. కొత్త సాంకేతికాలు, ఉత్పత్తిని పెంచుతున్నప్పటికీ, ఎన్నో ఆరోగ్య, పర్యావరణ, సుస్థిరోత్పత్తి సమస్యలను సృష్టిస్తున్నాయి. గత పదేళ్లుగా విస్తారంగా సేద్యమవుతున్న బిటి పత్తి విరు ద్ధ, వైవిధ్య ధోరణు లను వెల్లడిస్తోంది. ఈ సమయంలోనే అంతర్గత విష (ఎండో టాక్సిన్) సాంకేతికాలతో రూపొందే ఆహా రాన్ని (బిటి వంగ) మనదేశంలో అనుమతించాలనే వత్తిళ్లూ పెరుగుతున్నాయి. ప్రజా వ్యతిరేకతతో దీని విడుదల నిలిచిపోయింది. ఇలా నిలిపేసిన మంత్రిని ఆ శాఖ నుండి తప్పించారు. బిటి వంగనే అనుమ తిస్తే, ఇలాంటివే మరో 15-20 పంటలు విడుదలకు ఎదురుచూస్తున్నాయి. ఇదే జరిగితే, రాబోయే పర్యా వరణ, ఆరోగ్య, అస్థిరసమస్యల్ని ఎదుర్కోడానికి మన వ్యవస్థ సిద్ధంగా ఉన్నదా? అనే ప్రశ్న ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్‌కమిటీ వాసుదేవ ఆచార్య అధ్యక్షతన ఈ సమస్యల్ని అన్నికోణా ల్లో అధ్యయనం చేసింది. విస్తృత సాక్ష్య సేకరణ తర్వాత జీవ సాంకేతికాలను మరింత సురక్షితంగా విని యోగించడానికి ఎన్నో విలువైన సూచనల్ని చేసింది. వీటిలో ముఖ్యాంశాల్ని ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
సాంప్రదాయ జీవసాంకేతికాలు (ప్రజననంతో) వ్యవసాయోత్పత్తిని ఎన్నో రెట్లు పెంచాయి. పశుపోషణ, చేపల పెంపకం, పాడి, పౌల్ట్రీరంగాలూ అభివృద్ధి చెందాయి. అందుబాటులోకొచ్చిన టిష్యూ కల్చర్ పండ్లతోటల ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడింది. వీటి ఉత్పత్తి పెరుగుదలలో వచ్చిన స్థబ్ధత, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో వుంచుకొని, ఆధునిక జీవ సాంకేతికాల వినియోగంపై దృష్టి మరల్చారు. వీటికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జన్యు మార్పు, మార్పిడి (రీకాంబి నెంట్ డిఎన్‌ఎ) సాంకేతికాలతో గతంలో సాధ్యపడని విధంగా సమస్యలకు కొత్త పరిష్కారం చూపిస్తూ, దిగుబడిని బాగా పెంచటానికి తోడ్పడగలదని ఆశిస్తున్నారు.
ఈ కొత్త సాంకేతికాలను పూర్తిగా అదుపులో వుంచి (కంటైన్‌మెంట్) వినియోగించినప్పుడు మంచి ఫలితాలనిచ్చాయి. ఉత్పాదకతను పెంచాయి. ఫర్మెంటేషన్‌లో, వ్యాక్సిన్ లు, ఎంజైమ్‌ల తయారీలో, వైద్య రంగంలో ఇవి మంచి ఫలితాల్నిచ్చాయి. కానీ, వ్యవసాయోత్పత్తిలో ఈ సాంకేతికాల్ని ఇదే విధంగా అదుపులో వుంచి వినియోగించడం సాధ్యంకాదు. ప్రధానంగా పర్యావరణ, సుస్థిరోత్పత్తి సమస్యలు, ఆరోగ్యసమస్యలు ముందుకొస్తున్నాయి. అందువల్ల, వ్యవసాయోత్పత్తిలో జన్యుమార్పు, మార్పిడి (జన్యు ఇంజనీరింగ్) పద్ధతులను ఎంతో జాగ్రత్తగా వినియోగించాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కమిటీ అంతిమంగా సూచించింది. కమిటీ సూచనలను వెంటనే అమలుచేయాలనీ సూచించింది. ఈ సూచనలకు అనుగుణంగా నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థలనూ అమలుచేయాలనీ పేర్కొంది. అంతవరకూ జన్యుమార్పిడి పంటల పరిశోధనలను కచ్ఛితంగా పూర్తి అదుపులో వుండే వాతావరణంలోనే కొనసాగించాలనీ, క్షేత్రస్థాయిలో బహిరంగ పరిశోధనలకు అనుమతించకూడదనీ సూచించింది.
నియంత్రణ వ్యవస్థ..
ఇప్పటి నియంత్రణ (రెగ్యులేటరీ) వ్యవస్థను ప్రధానంగా 'జన్యు మార్పిడి ఇంజ నీరింగ్ అంచనా కమిటీ (జి.ఇ.ఎ.సి)' నిర్వహిస్తుంది. గతంలో ఈ కమిటీని జన్యుమార్పిడి ఇంజనీరింగ్ ఆమోదకమిటీగా వ్యవహరించేవారు. బిటి వంగ అనుమతి సమయంలో తలెత్తిన సమస్యల్ని దృష్టిలో వుంచుకుని కేంద్రప్రభుత్వం ఈ మార్పును చేసింది. అయితే, ఈ కమిటీ పనివిధానంలో ఏ మార్పునూ చేయలేదు. ఈ కమిటీ పనిలో ఎన్నో లోపాలను పార్లమెంటరీకమిటీ గుర్తించింది. ఈ కమిటీ కేవలం ప్రభుత్వ కార్యనిర్వాహణ, నియమాలకు లోబడి ఏర్పర్చబడింది. నేరుగా, పార్లమెంటు పర్యవేక్షణలోకి రాదు. ఈ కమిటీ నిర్వర్తిస్తున్న అతి కీలక, ముఖ్య బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయాలని సూచించింది. ఇది సమర్థవంతంగా పనిచేయడానికి కావలసిన వనరులనూ సమకూర్చాలనీ పేర్కొంది. తద్వారా, పార్లమెంటు నిర్ణయాలకు లోబడి ఈ కమిటీ పనిచేసేలా నియమాల్ని, నిబంధనల్ని మార్చాలని స్టాండింగ్ కమిటీ సూచించింది.
నిరోధకశక్తి లేని విజ్ఞాన వినియోగం..
యాంటిబయాటిక్ నిరోధకశక్తి లేని జన్యు సాంకేతిక విజ్ఞానాన్ని జన్యుమార్పిడి పరిశోధనలో వినియోగించాలని ఐరాసకు సంబంధించిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్యసంస్థల నిపుణుల కమిటీలు, అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్ర సాంకేతి కాభివృద్ధి అధ్యయనం సూచించాయి. జీర్ణకోశంలోవున్న బ్యాక్టీరియా, తదితర సూక్ష్మజీవులకు ఈ జన్యుమార్పిడి అవకాశాలు తక్కువుగా ఉన్నప్పటికీ, ఆరోగ్యభద్రత దృష్టిలో పెట్టుకొని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్టాండింగ్ కమిటీ సూచించింది. అయితే, ఇప్పటివరకు జన్యుమార్పిడి పంటల రూపకల్పనలో ఈ ప్రక్రియ అమలుచేయలేదు. అన్ని పంటల్లో కేవలం యాంటిబయాటిక్ నిరోధకశక్తిగల జన్యు ప్రక్రియల్నే వినియోగించారనీ కమిటీ గుర్తించింది. ఇది విధానపర నిర్ణయమని, జన్యుమార్పిడి పంటల రూపకల్పనలో నిరోధకశక్తి లేని జన్యు సాంకేతిక ప్రక్రియల్నే వాడాలనీ నిర్ణయిస్తే, ఇప్పుడున్న ఫలితాలన్నీ నిరుపయోగంగా మారతాయనీ స్టాండింగ్ కమిటీకి జన్యుమార్పిడి కమిటీ సూచించింది. అయితే, కొత్తగా రూపొందే జన్యుమార్పిడి పరిశోధనల్లో ఈ నూతన సాంకేతికాన్ని అమలుచేయవచ్చని కమిటీ చెప్పింది. దీనిపై పార్లమెంటరీకమిటీ తన తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తూ ఇలాంటి సూచనలు కంపెనీలకు అనుగుణంగానే ఉన్నాయేగానీ, ప్రజాప్రయోజనాల పరిరక్షణకు తోడ్పడవనీ, ఇది జన్యుమార్పిడి కమిటీ పనివిధానాన్ని తెలుపుతుందని విమర్శించింది. పర్యావరణం, ప్రజారోగ్యం, ఆహారభద్రతల విషయంలో పర్యవేక్షించాల్సిన సంఘం ఇలాంటి సూచనలు చేయడం తప్పని విమర్శించింది. అందువల్ల, ఇంత బాధ్యత కలిగిన అంశాలను కేవలం కమిటీకి వదలకూడదని, పార్లమెంటు పర్యవేక్షించాలని సూచించింది.
ఆరోగ్య సమస్యలు..
పశు దాణాలో బిటి పత్తిగింజల్ని వాడటంవల్ల పశువుల్లో ఎర్ర రక్తకణాలు పెరి గాయని, తెల్లరక్త కణాలు తగ్గాయని, కాలేయం, వృషణాల బరువు, కొవ్వుశాతం పెర గడాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యంపై బిటి ఉత్పత్తుల ప్రభావాన్ని క్షుణ్ణంగా అధ్యయ నం చేయించాలని కోరింది. గొర్రెపిల్లల్లో కూడా ఇలాగే మూత్రపిండాలు, క్లోమ గ్రంథి, గుండె, ఊపిరితిత్తులు బరువు బిటి పత్తిగింజల ఆహారంవల్ల పెరిగాయనీ కమిటీ గుర్తించింది. అందువల్ల, బిటి ఆహార ప్రభావాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించింది. ఏ కారణంతోనూ కేంద్ర ప్రభుత్వం ఈ అధ్యయనాన్ని ఆటంకపరచవద్దని కూడా కమిటీ స్పష్టంగా పేర్కొంది. కానీ, ప్రభుత్వం మాత్రం జన్యుమార్పిడి సాంకేతికం కొత్తదైనందున పర్యావరణం, జీవవైవిధ్యం, జీవరక్షణ, మానవ ఆరోగ్యం, జంతుజాలాల ఆరోగ్యంపై గల ప్రభావాల్ని ప్రయోగపూర్వకంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే బిటి ఉత్పత్తులకు అను మతిస్తున్నామని స్టాండింగ్ కమిటీకి చెప్పింది.దీర్ఘకాలం బిటి ఆహారాన్ని వినియోగిస్తూ ఆరోగ్యంపై దీని ప్రభావాలు అధ్యయనం చేయాలనీ కమిటీ సూచించింది. ఈ విషయంలో ఏ ప్రయత్నమూ లేదనీ కమిటీ విమర్శించింది.
భారాలు, లాభాల పంపిణీ..
ఆధునిక జీవ సాంకేతిక ప్రక్రియలు ఖర్చుతో కూడినవనీ, అదే సమయంలో లాభాల్ని అందిస్తాయనీ కమిటీ గుర్తించింది. పర్యావరణవ్యవస్థ, సమాజంలో ఈ సాంకేతికాలను ఇమిడ్చినతీరు భారాలు, లాభాల పంపిణీని నిర్దేశిస్తాయని కమిటీ పేర్కొంది. వీటివల్ల, జీవవైవిధ్యం తగ్గిపోతుందనీ, సాంప్రదాయ ఆహారాన్ని దూరం చేస్తుందనీ గుర్తించింది. ఇవి అసమానతల్ని పెంచుతున్నాయనీ, పేదలు, ఉత్పత్తిదారులు భారాల్ని స్వీకరిస్తుండగా, కంపెనీలు, ముఖ్యంగా విత్తన కంపెనీలు, లాభాల్ని పొందుతున్నాయని స్టాండింగ్‌కమిటీ పేర్కొంది. బిటి పత్తి వల్ల ఉత్పత్తి పెరిగినప్పటికీ, రైతుల ఖర్చులు పెరిగాయని. వారి రిస్క్ పెరిగిందనీ, అదేమేర ఆదాయం పెరగలేదనీ కమిటీ గుర్తించింది. ఫలితంగా, స్థానిక వ్యవసాయ ఆర్థికవ్యవస్థ కొన్ని సంవత్సరాల్లోనే దెబ్బతిందనీ కమిటీ పేర్కొంది. అందువల్ల పరిశోధనలు, స్థానికంగా సమాజం ఆధ్వర్యంలో మాత్రమే కొనసాగాలనీ, సమాజంలో ఈ కొత్త సాంకేతికాలు ఇమడ్చబడాలనీ, పేదలకు లాభాలు అందేలా (ప్రభుత్వం) జోక్యం ఉండాలనీ కమిటీ సూచించింది.
లేబులింగ్..
జన్యుమార్పిడి ఉత్పత్తులను వినియోగించాలా? లేదా? అని పూర్తిపరిజ్ఞానంతో నిర్ణయించుకునే అవకాశం, హక్కు వినియోగదారునికి ఉండాలనీ, దీనికనుగుణంగా నిబంధనల్ని చేర్చాలనీ కమిటీ అభిప్రాయపడింది. చైనాలాంటి అతి పెద్ద దేశంలోనే జన్యుమార్పిడి పంటల ఉత్పత్తులను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ ఉన్నప్పుడు, మన దేశంలోనూ ఇది ఎందుకు సాధ్యం కాదనీ, బిటి ఉత్పత్తులను గుర్తించేలా స్పష్టమైన లేబులింగ్ ఉండాలనీ కమిటీ పేర్కొంది.
దేశ జన్యు వనరుల దుర్వినియోగం..
మహికో-మోన్‌శాంటో కంపెనీ సాధికారిక, జాతీయ, జీవవైవిధ్య సంస్థ అను మతిలేకుండానే స్థానిక వంగను బిటి వంగగా రూపొందించడానికి వినియోగించింది. ఇలా ఉల్లిపాయల వినియోగానికి ఇప్పుడు దరఖాస్తు చేసుకుంది. ఇలాంటి జన్యుపర దుర్వినియోగాన్ని తప్పక నిరోధించాలనీ కమిటీ ఎత్తి చూపింది.
ఎంత తేడా..?
ఆరోగ్య ప్రభావాల్లో బిటి పత్తి, బిటి వంగలలో ఎంతో తేడా వుంది. వంగను కోసే సమయానికి ఆ కాయల్లో బిటి విషం కాయతొలుచు పురుగును చంపగలిగే స్థాయిలో వుంటుంది. అది కోసిన వెంటనే తినడం వల్ల బిటి విషం నేరుగా మన జీర్ణకోశంలోకి ప్రవేశి స్తుంది. దానిలోని సూక్ష్మజీవులను ఈ విషం ప్రభావితం చేసే అవకాశాలు న్నాయి. కానీ, పత్తి అలాకాదు. దీని దూదిని సేకరించాక చాలాకాలం తర్వాత దుస్తులు తయారీలో ఉపయోగిస్తారు. గింజల్ని కూడా ఎంతోకాలం నిల్వ వుంచాక, నూనె తీసి వాడుతున్నారు. పత్తి గింజల చెక్కను పశువుల దాణాగా వాడతారు. అందువల్ల, ఈ పత్తి వల్ల ఆరోగ్య సమస్యలు ఆలస్యంగా వస్తాయి. కాబట్టి, బిటి వంగ హానికరంకాదనీ చేసే ప్రచారం పూర్తిగా తప్పు.
ఎందుకిలా..?
రైతులే తమ విత్తనాన్ని సొంతంగా సేకరించుకుని, వినియోగించుకోవడానికి అధిక దిగుబడి వంగడాలు ఉపయోగపడతాయి. వరిలాంటి పైర్లలో జరిగేది ఇదే. ఈ లక్ష్యంతో ధార్ వార్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, పూనాలోని పత్తి పరిశోధనా కేంద్రం, బికనీర్ నార్మాలో బిటి జన్యువును (క్రైవన్ ఏసి) పెట్టింది. ఈ జన్యువును ప్లాంట్ బయోటెక్నాలజీ జాతీయ పరిశోధనా కేంద్రం సరఫరా చేసింది. అయితే, విడుదల చేసే సమయంలో దీనిలోని బిటి జన్యువు మహికో మోన్‌శాంటో పేటెంట్‌ను పోలి వుందనీ ఫిర్యాదు రావడంతో దీని విడుదలను కేంద్ర వ్యవసాయ పరిశోధనా మండలి నిలిపివేసింది. ఇదే విధంగా ఎన్‌హెచ్‌హెచ్ 44లోనూ బిటి జన్యువు ప్రవేశపెట్టారు. చివరినిమిషంలో దీని విడుదలా ఆగిపోయింది. పరోక్షంగా ఇది మహికో, మోన్‌శాంటోకూ పత్తిలో గుత్తాధిపత్యం కొనసాగడానికి తోడ్పడింది. ఇలా ఎందుకైంది అనేదే ప్రశ్న. స్టాండింగ్ కమిటీ దీనిపై అత్యంత ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పరిశోధనా సంస్థల్లో జరిగిన, జరుగుతున్న పరిశోధనల ఆలస్యాన్నీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్ర వ్యవసాయ పరిశోధనా మండలి చర్య తీసుకోవాలని కోరింది. ఇది అమలవుతుందా? అమలైతే ఎంత కాలానికి? వేచి చూడాల్సిందే.
సాధికార జీవ సురక్షిత వ్యవస్థ
సాధికార జీవ సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు గురించి ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా ఆలోచిస్తుంది. కానీ, జీవవైవిధ్యం, పర్యావరణం, మానవుల, ఇతర జీవాల ఆరోగ్యం, తదితర నియంత్రణ అన్నీ జీవ సాంకేతిక విజ్ఞాన సాంకేతికంలో ముఖ్యమైనవి. వీటన్నింటినీ ఒకే పరిధిలోకి తీసుకొస్తూ పార్లమెంటు చట్టం ద్వారా సాధికార జీవ సురక్షిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా జన్యుమార్పిడి ఉత్పత్తుల వినియోగ ప్రోత్సాహం ప్రమాదకరమైందని కమిటీ అభిప్రాయపడింది. జీవ సాంకేతిక సురక్షణ విషయంలో భయాలున్నప్పటికీ, ఉత్పత్తిదారులపై ఏ బాధ్యతనూ ఉంచకపోవడాన్ని కమిటీ తప్పుపట్టింది. రైతుల, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేలా జవాబుదారీగా వుంటూ బాధ్యత తీసుకునే ఏర్పాటు ఉండాలని కమిటీ పేర్కొంది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
No comments:
Post a Comment