-
నాగసాకి బాంబుదాడి 67వ వార్షికోత్సవంలో జపాన్ అధికారుల ఆకాంక్ష
అణు ఇంధనం మీద అతి తక్కువగా ఆధారపడే పౌర సమాజాన్ని
సాధించాలని జపాన్ అధికారులు ఆకాంక్షించారు. జపాన్‌లోని నాగసాకి పట్టణం మీద
జరిగిన అణు బాంబు దాడి ప్రపంచంలో రెండో అతి పెద్ద విషాదంగా గుర్తింపు
పొందిన సంగతి తెలిసిందే. గురువారం ఆ విషాద ఘటనకు 67 ఏళ్ళు నిండాయి. రెండో
ప్రపంచ యుద్ధం ముగింపు దశకొచ్చిందని అంతా అనుకుంటున్న తరుణంలో జపాన్‌ను
లొంగదీసుకోవడమే లక్ష్యంగా అమెరికా వాయుసేన అణు బాంబులను వర్షించింది. 1945
ఆగస్టు తొమ్మిదో తేదీన జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అమెరికా వాయుసేన
విమానాలు అణు బాంబులతో విరుచుకుపడ్డాయి. దీనికి సరిగ్గా రెండు రోజుల ముందు
హిరోషిమా మీద ఇదే తరహా అణు బాంబు వర్షాన్ని అమెరికా కురిపించింది.
హిరోషిమాపై బాంబు దాడిలో లక్షా 40 వేల మంది, నాగసాకిపై బాంబు దాడిలో 70 వేల
మంది అమాయక జపనీయులు దుర్మరణం చెందారు. అణు బాంబు విధ్వంస విపత్తు నుంచి
వాస్తవానికి ఇంకా కోలుకోకమునుపే గత సంవత్సరం జపాన్‌లోని ఫుకుషిమ దాయిచి అణు
విద్యుత్కేంద్రం రేడియేషన్ ప్రమాదానికి జపనీయులు గురయ్యారు. 2011 మార్చి
11న సంభవించిన సునామీ, దాన్ని వెన్నంటిన భూకంపం దెబ్బకు జపాన్ కోస్తా
తీరంలోని ఫుకుషిమ దాయిచి అణు విద్యుత్కేంద్రం తీవ్రంగా దెబ్బతిని ప్రమాదకర
స్థాయిలో రేడియేషన్ వెదజల్లిన 'విషా'దం జపనీయుల ఆత్మస్థైరాన్ని మరింత
దెబ్బతీసింది. దీనిపై ఇటీవల జపాన్‌లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో
90 శాతం జపనీయులు 'అణు విద్యుత్ వద్దేవద్దు' అని గట్టిగా నినదిస్తున్నారని
ప్రభుత్వ నిర్వహణలో కొనసాగే ప్రజాభిప్రాయసేకరణ సమాచారాన్ని ఉటంకిస్తూ 'ది
అసాహి' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇంతలోనే అణు బాంబు దాడి ఘటన
జరిగిన ఆగస్టు తొమ్మిదో తేదీ రావడంతో మరోమారు అణు విద్యుత్ మీద వీలయింనంత
తక్కువగా ఆధారపడాలని, తద్వారా విపత్తులకు ఆస్కారం లేని పౌర సమాజాన్ని
స్థాపించాలనే ఆకాక్షను జపాన్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భాన్ని
పురస్కరించుకుని గురువారం 1945 నాటి బాంబు దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో
నిర్మించిన శాంతివనంలో జరిపిన సంస్మరణ సభకు సుమారు ఆరు వేల మంది జపనీయులు
హాజరయ్యారు. ఈ ఘోర విపత్తుకు కారణమైన అమెరికా, తొలిసారిగా ఈ ఏడాది జరిగిన
సంస్మరణ సభకు తమదేశ ప్రతినిధిగా రాయబారి జాన్ రోస్‌ను సాగనంపడం గమనార్హం.
గతేడాది ఫుకుషిమా దాయిచి విద్యుత్కేంద్రం విపత్తుకు గురైన పట్టణ మేయరు కూడా
ఇందులో పాల్గొన్నారు. ఏదాడిన్నర గడిచినా ఫుకుషిమా దాయిచి అణు
విద్యుత్కేంద్రం రేపిన భయాందోళనలకు జపనీయులు ఇంకా దూరం కాలేకపోతున్నారు.
ఇంకా వారిలో మృత్యు భీతి పురులు విప్పుతూనే ఉంది. ఈ సందర్భంగా నాగసాకి
మేయర్ తొమిహిసా తాయీ మాట్లాడుతూ అణు సాంకేతికత నుంచి జనించే ప్రమాదాలను
ఆహూతులతో పంచుకున్నారు. అణు ఇంధనానికి తావులేని పౌర సమాజ స్థాపనకు
నిర్ణయాత్మకంగా జపాన్ కృషి జరుపుతోందని తాయీ వెల్లడించారు. ఈ సందర్భాన్ని
పురస్కరించుకుని అణ్వాయుధాలపై సంపూర్ణ నిషేధానికి ప్రపంచమంతా కట్టుబడి
ఏకతాటిపై నడవాలని పునరుద్ఘాటించారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించే ఇంధన
పునర్నిర్మాణ రూపకల్పన జరుపనున్నట్లు జపాన్ ప్రధాని యోషిహికొ నోదా గతంలో
తను చేసిన వాగ్దానాన్ని స్మరించారు. కొద్ది వారాల్లోనే దీర్ఘకాల విధాన
వేదికను ప్రకటిస్తామన్నారు.
No comments:
Post a Comment