Tuesday, 31 March 2015

డార్వి ‘నిజం’పై దాడి
Posted on: Tue 31 Mar 22:28:42.319414 2015

                మీడియా ద్వారా, ఆధునిక సమాచార ప్రసార సాధనాల ద్వారా మూఢనమ్మకాలను, మతఛాందసత్వాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి కదా! వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి?
- ఎం. జగన్మోహనరెడ్డి, వరంగల్‌
                 మీరన్నట్టు మారిన పాలకవర్గాల నైజం ఆధారంగా, ఆ వర్గాల కనుసన్నలలో పరోక్షంగా మత రాజకీయాల్ని ప్రబలం చేయడానికి అన్ని కోణాల్లోంచి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ముఖాముఖి మనుషుల మధ్య సంబంధాలు లేకున్నా గ్రూప్‌ మెయిల్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మిథ్యా ప్రపంచంలో అంతర్జాలంలో పరస్పరం సంభాషించుకొంటున్నారు. పరస్పరం ప్రభావితులవుతున్నారు. ఉదాహరణకు, ఈ మధ్య నాకు కొన్ని ఆహ్వానాలు అందుతున్నాయి. 'ఫలానా సంఘంలో చేరండి!' అని. ఇలాంటి ఆహ్వానాలు వేలాదిమందికి అంది ఉంటాయి. చాలామంది వారి ఉచ్చుల్లో పడి ఉంటారు. ఇది ఆందోళనకరం. వారికి సంస్కారం ఎంత ఉందో మనకు తెలీదుగానీ, అభ్యుదయ భావాలున్న మనకు ఉన్న సంస్కారం రీత్యా వారి పేర్లు చెప్పకుండా, వారు ఆహ్వానించిన సంస్థలు లేదా సంఘాల పేర్లు చెప్పకుండా మా మధ్య ఇ-మెయిల్‌ ద్వారా జరిగిన సంభాషణల్ని టూకీగా చెబుతాను.
తాజా ఇ-మెయిల్‌ సంవాదం:
నాకొక ఆహ్వానం :Third International Conference on ‘Science and Scientists-2015’ (http://scsiscs.org/conference)
తృతీయ అంతర్జాతీయ సదస్సు : అంశం: శాస్త్రము - శాస్త్రజ్ఞులు - 2015
నినాదం : “The scientist is able to explain science but… is science able to explain the scientist?” (''శాస్త్రజ్ఞుడు శాస్త్రమంటే ఏమిటో వివరించగలుగుతున్నాడు. మరి శాస్త్రము శాస్త్రజ్ఞుణ్ని గురించి వివరించగలదా?'')
నా అభిప్రాయం: ఇక్కడ శాస్త్రాన్ని తక్కువ చేసి 'శాస్త్రజ్ఞుడు' అనే వ్యక్తిని లేదా 'ప్రాణి'ని అధికం చేసేందుకే ఈ నినాదం. ఇదే మెయిల్‌లో డార్విన్‌ మీద దాడి ప్రత్యక్షంగా ఉంది. శాస్త్రవేత్తలనబడే కొందరి వ్యాఖ్యానాల్ని, వ్యాఖ్యల్ని (quotations) మాత్రమే తీసుకొని డార్విన్‌ పరిణామ వాదాన్ని తిరస్కరించే విధంగా ప్రయత్నాలు జరిగాయి. కొన్ని వ్యాఖ్యలు (తెలుగులో అనువదించాను) ఇక్కడ చూడండి.
(1) నీల్స్‌భోర్‌ (Niels Bohr) ను ఉటంకిస్తూ:
''భౌతిక ప్రపంచంలో క్వాంటం సిద్ధాంతంతోనే విశ్వం ప్రారంభమయినట్లు ఋజువు చేసినట్లుగానే జీవ ప్రపంచం కూడా విశ్వంతోపాటే ఏర్పడింది. అలాకాకుండా మరోలా జీవాన్ని వివరించేందుకు ఆధారాలు లేవు. అసలు పరమాణువులు ఎందుకు స్వతహాగా స్థిరంగా ఉన్నాయో చెప్పడం ఎంత కష్టమో, జీవం అనే వాస్తవానికి భౌతిక రసాయినక చర్యలే ప్రాతిపదిక అని చెప్పడానికి అంతే కష్టం (నీల్స్‌భోర్‌,భౌతికశాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి విజేత)''
మరో వ్యాఖ్య ఆల్బెర్ట్‌ గ్యోర్గిని ఉటంకిస్తూ:
''అందరి జీవశాస్త్రవేత్తల్లానే నేనూ జీవాన్ని, జీవవ్యవస్థను

అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాను. అతిక్లిష్టమైన స్థాయి నుంచి అంచెలంచెలుగా లోలోపలికి వెళ్లి పరికించాను. కణజాలాలు, ఆ తర్వాత అణువులు, అణువుల తర్వాత పరమాణువులు, అటు పిమ్మట ఎలక్ట్రాన్లు, జీవి నుంచి ప్రారంభించి, నిర్జీవులయిన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లను చేరాను. ఎక్కడో నా పరిశీలనలో 'జీవం' మాత్రం కళ్ళు కప్పి పారిపోయింది. మళ్ళీకింది నుంచి పై
స్థాయికి వెళ్లితే 'జీవం' ఆనవాలు దొరుకుతుందేమో ఈ ముసలి ప్రాయంలో నేను పరీక్షించాలి. (ఆల్బెర్ట్‌ జెంట్‌ గ్యోర్గీ, వైద్యరంగపు నోబెల్‌ బహుమతి గ్రహీత).''‘science’   అనే ప్రముఖ పరిశోధనా వ్యాసాల పత్రికను ఉటంకిస్తూ మరో వ్యాఖ్యానం:
''1871లో చార్లెస్‌ డార్విన్‌ ఏమి చెప్పారు? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమ్మీద ఉండే వేడి వేడి నీలి సరస్సుల్లో జీవ రసాయనాలు ఉండేవనీ, అవే క్రమేపీ జీవాణువులుగా మారి తొలి జీవుల్ని ఏర్పర్చాయని. ఇది ఒక అద్భుత వర్ణచిత్రం. అందమైన స్వాప్నిక దృశ్యం. కానీ ప్రియమైన డార్విన్‌ మిత్రమా! నూతన ఖగోళ పరిశోధనల ప్రకారం నీవు ఊహించిన జీవజలం అంటూ ఏదీ లేదు. ఏ సముద్రంలోను, ఏ నదీ, సరస్సుల్లోనూ తొలి జీవ రసాయనాల కణద్రవ్యం  (primordial organic liquid in warm little pond) లేదు సుమా!'' (‘Science’ magazine)..
ఇంకా ఏయే వ్యాఖ్యానాలు ఉటంకించారో వాటికి నా వివరణ, సమాధానం ఏమిటో పై వారం తెలుపుతాను.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక. 

Courtesy with PRAJA SEKTHI DAILY 

Sunday, 29 March 2015

పిఎస్‌ఎల్‌వి విజయ పరంపర
Posted on: Sun 29 Mar 00:47:59.4828 2015
- ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌-1డి ఉపగ్రహ ప్రయోగం సక్సెస్‌
                 అది శ్రీహరి కోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌.... సమయం సాయంత్రం ఐదు గంటలు.. భానుడి భగభగలు ఇంకా చల్లారలేదు. మరో వైపు అర్ధాకారంలో చంద్రుడు నీలాకాశం తెరపై కనిపిస్తున్నాడు.... ఆకాశం నిర్మలంగా ఉంది... అందరి చూపూ భూమ్యాకాశాలను ఏకంచేసే వైపే ఉంది.... అంతా నిశ్శబ్ధం. నరాలు తెగే ఉత్కంఠ... 59.30 గంటల కౌంట్‌డౌన్‌ ముగిసింది. చివరి క్షణం ముగిసింది... కచ్చితంగా 5.19 నిమిషాలకు ఒక్కసారిగా పిఎస్‌ఎల్‌వి సి-27 రాకెట్‌ నింగిలోకి ఎగసింది. రెండో వేదిక నుంచి పచ్చని చెట్ల నడుమ నిప్పులు జిమ్ముతూ దూసుకెళ్లింది. 19.25 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అనుకున్న సమయానికి నిర్ణీత కక్ష్యలోకి చేరింది. 1,400 కిలోల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌-1డి ఉపగ్రహాన్ని జయప్రదంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో షార్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇస్రో ఛైర్మన్‌ ఎఎస్‌ కిరణ్‌ కుమార్‌ అందరికీ అభినందనలు తెలిపారు.
                 ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరినట్లయింది. భారతదేశం నేవిగేషన్‌ వ్యవస్థలో మరో మైలురాయి దాటింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో శనివారం సాయంత్రం పిఎస్‌ఎల్‌వి సి-27 ప్రయోగం విజయవంతమైంది. భూమికి 284 కిలోమీటర్లలో దగ్గరగా, 20,650 కిలోమీటర్ల దూరంలో దీర్ఘ వృత్తాకార ఉప భూ బదిలీ కక్ష్యలోని 19.2 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టింది. ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన వెంటనే రెండు సౌర పలకాలు విచ్చుకున్నాయి. వెంటనే కర్నాటకలోని హసన్‌ కేంద్రానికి అవి అనుసంధానమయ్యాయి. ఈ ఉపగ్రహం పదేళ్లపాటు పని చేస్తుంది. నేవిగేషన్‌లో పూర్తిస్థాయిలో సేవలు పొందాలంటే మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంది. ప్రస్తుత ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌-1డితో నాలుగు విజయవంతమయ్యాయి. నింగిలోకి పంపిన ఉపగ్రహానికి రూ. 125 కోట్లు, రాకెట్‌కు రూ. 90 కోట్లు ఖర్చయింది.
ఇస్రో చేపట్టిన పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో ఇది 29వది. 28 విజయవంతమయ్యాయి. ఒకటి మాత్రమే విఫలమైంది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగంలో ఎక్స్‌ఎల్‌ స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించారు. ఈ రకంగా ఆరు ఎక్స్‌్‌ఎల్‌ స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించడంలో ఇది 8వ ప్రయోగం. పిఎస్‌ఎల్‌వి సి-11, చంద్రయాన్‌, పిఎస్‌ఎల్‌వి సి-17, జిశాట్‌-12, పిఎస్‌ఎల్‌వి సి-19, పిఎస్‌ఎల్‌వి స-ి22, పిఎస్‌ఎల్‌వి సి-25, పిఎస్‌ఎల్‌వి సి-24, 26 ప్రయోగాలు స్ట్రాఫాన్‌ మోటార్లతో జరిగాయి. ఇండియన్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టంలో మొత్తం ఏడు ప్రయోగాలు జరగాలి. ఇందుకోసం రూ. 1,400 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే మూడు ప్రయోగాలను విజయవంతంగా ఇస్రో చేపట్టింది. జూలై 2013, 2014 ఏప్రిల్‌, 2014 అక్టోబరు పిఎస్‌ఎల్‌వి సి-22, సి-24, 26 ద్వారా మూడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌ 1ఎ, 1బి. 1సి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 1డి నాలుగోది. మరో మూడింటిని ప్రయోగించాల్సి ఉంది. అవి విజయవంతమైతే నావిగేషన్‌ సిస్టంలో భారత్‌ సంపూర్ణ విజయం సాధిస్తుంది. భారతదేశానికి 1,500 కిలోమీటర్ల పరిధిలో నేవిగేషన్‌ సిస్టం సేవలందిస్తుంది. ఇప్పటి వరకూ విదేశీ సహకారం తీసుకుంటున్న భారత్‌కు ఇకపై ఆ అవసరం ఉండదు.
భారత్‌లో పటిష్టమైన  ఉపగ్రహ నేవిగేషన్‌ వ్యవస్థ
                 దేశ అవసరాల నిమిత్తం తయారుచేసిన నేవిగేషన్‌ ఉపగ్రహాలు అన్ని శీతోష్టస్థితుల్లోనూ 24 గంటలపాటు సేవలందిస్తాయి. ప్రస్తుత ఉపగ్రహం రెండు రకాల సేవలందిస్తుంది. సామాన్య ప్రజలకు ఎస్‌టిఎస్‌ నిర్దిష్ట స్థానం తెలుపుతుంది. దీని మొత్తం సాఫ్ట్‌వేర్‌ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. నావిగేషన్‌ వ్యవస్థను పటిష్టపరచడానికి కర్నాటకలోని బైలాలులో భూ వ్యవస్థ కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రం ఉపగ్రహాలకు మెదడు లాంటిది. వినియోగదారులకు సేవలందించడానికి, వ్యవస్థను సక్రమంగా నడపడానికి బైలాలు, హసన్‌, భోపాల్‌, దేశంలోని పలు రాష్ట్రాల్లో శాటిలైట్‌ నియంత్రణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12 మోనటరింగ్‌ కేంద్రాలు, ఒక నెట్‌వర్క్‌, ఒక కాల కేంద్రం, అంతరిక్ష దిక్సూచి కేంద్రం, ఒక ఉపగ్రహ నియంత్రణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఉపగ్రహం ఉపయోగాలు
                 ప్రస్తుత ఉపగ్రహం ద్వారా విస్తృత సేవలందుతాయి. భూమి, సముద్రం, ఆకాశ మార్గంలో వెళ్లే వాహనాల స్థితి, స్థానం, దిక్కులు ఎప్పటికప్పుడు అది తెలియజేస్తుంది. భూ మార్గంలో బస్సు, కారు, రైలు, ఇతర రవాణా వాహనాల్లో నేవిగేషన్‌ సిస్టం ఉంటే ఎప్పటికప్పుడు సమాచారం మన చేతుల్లో ఉన్నట్లే! సముద్ర మార్గంలో ఓడల గమనాన్ని పర్యవేక్షించొచ్చు. ఆకాశంలో విమానాల గమనాన్ని తెలుసుకోవచ్చు. ఆపద సమయంలో ఆదుకోవాడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
                 అలాగే వాహనదారునికి దృశ్య, శ్రవణ విధానంలో దిశానిర్దేశం చేస్తుంది. వాహనం ఎక్కడుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. భూ గోళం విషయాలను కనుగొంటుంది. ఇస్రో ఛైర్మన్‌ ఎఎస్‌ కిరణ్‌కుమార్‌ దగ్గరుండి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ఆయన ఆధ్వర్యాన తొలిసారి ప్రయోగం జరుగుతుం డడంతో ఎంతో ఉత్కంఠకు లోనయ్యారు. కార్యక్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, శాస్త్రవేత్తలు, చంద్రదత్తన్‌, కున్ని కృష్ణన్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.
Curtsey with PRAJA SEKTHI DAILY 
సోడా సోడా.. ఆంధ్రా సోడా!
Posted on: Sun 29 Mar 20:48:19.339931 2015
                   దాదాపు నలభై అయిదేళ్ళ క్రితం వచ్చిన 'లక్ష్మీ నివాసం' అనే సినిమాలో హాస్యనటుడు పద్మనాభం నాటకాల మీద విచ్చలవిడిగా ఖర్చుపెట్టేసి చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితికి వస్తాడు. అతనికి ఇష్టమైన మరో వ్యాపకం అస్తమానం సోడా తాగుతూ ఉండడం. చివరకు సోడాల బండి తిప్పుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆరుద్ర రాసిన 'సోడా...సోడా...ఆంధ్రా సోడా' పాట అతని మీద చిత్రీకరించారు. జనసామాన్యానికి గోళీసోడాగా బాగా పరిచయమైన సోడా మీద వచ్చిన ఆ పాట, సోడా పాపులారిటీ ఎలాంటిదో చెబుతుంది. ఇటీవల కూడా '' నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ...'' అని ఓ సినీ కవి ఆంధ్రుల అభిమాన సోడాను ఓ పాటలో జ్ఞాపకం చేశాడు. బహుళజాతి కంపెనీల ఉత్పత్తులతో సహా రకరకాల శీతలపానీయాలు మార్కెట్‌ను ముంచెత్తిన రోజుల్లో అందరికీ ఇష్టమైనదేకాక, చవకగా లభిస్తూ వచ్చిన పానీయం ఇది. ఎంతోమందికి ఉపాధి కల్పించిన గోళీసోడా ఇప్పుడు దాదాపు నిన్నటి జ్ఞాపకంగా మిగిలిపోబోతోంది. గోళీసోడా అంటే తెలియనివారే నేడు ఎక్కువ మంది.

                         ఇటీవలివరకూ మండుటెండలో కాలినడకన వెళ్ళే వారు దాహం తీర్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చింది గోళీసోడాకే. తక్కువ ధరకే లభించే ఈ పసందైన పానీయం అనేక రంగుల్లో, రుచులలో దాహార్తిని తీర్చేది. కొన్ని దశాబ్దాలుగా గొంతుకలో హిమాలయం చల్లదనం నింపుతూ వచ్చిన ఈ గోళీసోడా గురించే కాని, దీని సృష్టికర్త గురించి తెలుసుకోవడం తక్కువ. సౌత్‌ఈస్ట్‌ లండన్‌కు చెందిన హీరమ్‌ కాడ్‌ అనే వ్యాపారి గోళీసోడాను 1872వ సంవత్సరంలో తయారు చేశాడు. ఆయన గోళీ సోడా పేటెంట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. మందమైన గాజుతో, మూత భాగంలో రబ్బరు వాషరును అమర్చి, మధ్య భాగంలో రెండువైపులా నొక్కినట్లు ఈ సీసాను రూపొందించారు. సోడా తయారు చేసేందుకు ఉపయోగించే యంత్రంలో ఒకేసారి మూడు సోడాలను సిద్ధం చేయవచ్చు. ఆ యంత్రానికి కార్బన్‌డయాక్సైడ్‌ సిలెండర్‌ అమర్చబడి ఉంటుంది. శుభ్రం చేసిన సీసాలలో మనం కోరుకునే ద్రవాన్ని, రుచికోసం ఉపయోగించే వాటిని కలిపి యంత్రంలో అమర్చుతారు. తర్వాత యంత్రానికి ఉండే పిడి(హేండిల్‌)ని ముందుకు వెనక్కి మూడు, నాలుగుసార్లు తిప్పుతారు. అలా తిప్పడంతో కార్బన్‌డయాక్సైడ్‌ ఒత్తిడికి గోళీ రబ్బరువాషరు దగ్గర స్థిరంగా బిగుసుకుపోతుంది. అంటే సోడాకు గోళీ ఒక మూతలా ఉపయోగపడుతుంది. అలా కార్బన్‌డయాక్సైడ్‌తో నిండిన సోడాను కొన్ని రోజలుపాటు నిలవ ఉంచవచ్చు. ఇది చాలా ప్రత్యేకమైన సాంకేతికతగా గుర్తింపుపొందింది.
బహుళ జాతి పానీయాల దెబ్బ
                         నేడు మార్కెట్‌లో రకరకాల శీతలపానీయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ గోళీసోడాను ఇష్టపడేవారు నేటికీ ఉన్నారు. మంగళూరు వంటి ప్రాంతాలలో వీటికి ఆదరణ తగ్గలేదు. దాహార్తిని తీర్చడానికి మంచి సాధనంగా ఇక్కడి ప్రజలు గోళీసోడాను భావిస్తారు. పిల్లలు, యువకులు సోడా లో ఉండే గోళీని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. సీసా లోపలకు గోళీ ఎలా వెళ్ళిందో తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. సీసా పగలకుండా గోళీని బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేసేవారు. కానీ వారి ప్రయత్నం వృధా అయ్యేది. గోళీసోడా దుకాణాల్లో మాత్రమే కాదు, వీధుల్లోనూ దొరికేది. చెక్కతో అరలు అరలుగా చేసిన తోపుడు బండిలో ఒక్కొక్క అరలో ఒక్కో సీసాను ఉంచి అమ్మేవారు. ఇప్పుడు ఆ దృశ్యం అదృశ్యమైందన్నా ఆశ్చర్యంలేదు.
సోడా కొట్టినవాడే వీరుడు!
                         గోళీని లోపలికి నొక్కి సోడా తాగాలి. నొక్కడానికి అంటే సోడా కొట్టడానికి అనువుగా ఒక చెక్క వస్తువును ఉపయోగిస్తారు. అయితే సోడా కొట్టడం అందరికీ చేతనయ్యేదికాదు. అందుకే అవలీలగా సోడా కొట్టేవాణ్ణి ఆశ్చర్యంగా చూసేవారు. వాళ్ళుకూడా 'వీరు'ల్లా పోజిచ్చేవారు. పరికరం వాడకుండా వేలితో నొక్కి సోడా కొట్టినవాడు ఇంకా పెద్ద 'వీరుడు!'. సోడా కొట్టినప్పుడు కార్బన్‌డైఆక్సైడ్‌ బయటకు వస్తూ వినసొంపైన శబ్దం వచ్చేది. పిల్లల్ని ఈ శబ్దం బాగా ఆకట్టుకునేది. కొత్తవారు సోడా తాగేటప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది. గోళీ అడ్డంపడి లోపలి నీరు రాకుండా చేస్తుంది. గోళీసోడా తాగేందుకు ఒక కిటుకు ఉంటుంది. సీసాలోపల గోళీ ఏటూ కదలకుండా ఉండేందుకు ఒక చోటు ఉంటుంది. అటువైపుగా తిప్పి తాగితే నీరు సులభంగా నోటికి అందుతుంది. అల్లంసోడా, ఆరెంజ్‌ సోడా, సుగంధీసోడా, చప్పని సోడా ఇలా గోళీసోడాలలో రకరకాలు అందుబాటులో ఉండేవి. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు భోజనం తర్వాత సోడా తాగడం వల్ల తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుందని చాలా మంది అనుకునేవారు.
నిలిచిపోయిన సీసాల తయారీ
                         మన రాష్ట్రంలో గోళీ సోడా సీసాలు తయారు చేసే కంపెనీలు కృష్ణా జిల్లా ఉయ్యూరులోనూ, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు సీసాల తయారీని నిలిపివేశాయి. ''కాలం మారిపోయింది. నేటి యువతకు గోళీసోడా రుచి తెలియదు. ఏటా వేసవి సమయంలో గోళీసోడాకు మంచి గిరాకీ ఉండేది. సీసాల తయారీ లాభదాయకంగా లేకపోవడంతో కొత్త సీసాలు రావడంలేదు. సోడా తాగేందుకు ప్రజలు పూర్తిగా ఆసక్తి చూపకపోవడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. ఇదే పరిస్థితి మరో రెండేళ్ళు కొనసాగితే ప్రజలకు ఈ అద్భుత పానీయం దూరమయినట్లే'' అంటూ ఇరవైయ్యేళ్ళుగా సోడాలు అమ్ముతున్న రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ పొందిన గోళీసోడాలు, అక్కడ కూడా వాటి ఉనికిని కోల్పోతున్నాయి. పెద్ద వయసువారు, ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు మినహా యువత వీటిని తాగేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు...
                         ''మా నాన్న గోళీసోడా అమ్మేవాడు. నేనూ అదే చేస్తున్నాను. అప్పట్లో గోళీసోడా మంచి వ్యాపార వ్యాపార వస్తువుగా ఉండేది. సినిమా థియేటర్లకు రోజుకు నాలుగుసార్లు తిరుగుతూ అందించేవాళ్ళం. సినిమా విరామ సమయంలో పోటీపడి సోడాలను తాగేవారు. దుకాణాలకు సోడాలను అందేంచేందుకు కూలీలను కూడా పెట్టుకునేవారు. దీన్నే జీవనోపాధిగా నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఉండేవి. ఇప్పుడూ ఇదే వ్యాపారం చేస్తున్నాను. కానీ అప్పుడంత గిరాకీలేదు. ఓ చిన్న పాన్‌షాప్‌ పెట్టుకున్నాను. సైకిల్‌పైన తీసుకెడుతూ చిన్నచిన్న దుకాణాలకు వెళ్ళి రోజుకు ఇరవై, ముప్పై సోడాలను అందిస్తున్నాను'' అంటూ పశ్చిమగోదావరికి చెందిన రహీం బాషా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. చాలా మంది వ్యాపారులు ఒక్క గోళీసోడాలపైనే ఆధారపడకుండా ఇతర పానీయాల అమ్మకాలు కూడా జరుపుతున్నారు.
నేటి కంపెనీలకు ఒరవడి
                         మనదేశంలో బంటా బాటిల్‌, కంచా బాటిల్‌, గోలీ బాటిల్‌, సోడా బాటిల్‌ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ప్రాచుర్యం పొందింది గోళీసోడా. సాధారణ నీటిలో కార్బన్‌డైయాక్సైడ్‌ను కలిపి తయారు చేసే ఈ పద్ధతినే పెద్దపెద్ద మల్టీనేషనల్‌ కంపెనీలు కూడా అనుసరిస్తున్నాయి. నేడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మిగతా పానీయాల్లో కార్బన్‌డైయాక్సైడ్‌ను నింపి గోళీకి బదులుగా ఇనుప, ప్లాస్టిక్‌ మూతలు వినియోగిస్తున్నారు. కార్బానిక్‌ యాసిడ్‌గాస్‌, సోడియం బైకార్బనేట్‌ సొల్యూషన్‌ వాయువులను వీటిలోనూ ఉపయోగిస్తారు. జనాభిమానం పొందుతూ చాలా కాలం ఒక వెలుగు వెలిగిన గోళీసోడా, '' గోళీసోడానా? అదేమిటి, ఎలా ఉంటుంది'' అని అడిగే దశకువచ్చింది. కాలం మహిమ!

Courtesy with PRAJA SEKTHI DAILY