Friday, 4 April 2014

హుషార్‌

-  పిఎస్‌ఎల్‌వి విజయ పరంపర
-   ఇది రెండో నావిగేషన్‌ ఉపగ్రహం
ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి
          భారత్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తాను ఎంతగానో నమ్మే పిఎస్‌ఎల్‌ వి(పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) సి-24 విజయవంతమైంది. శుక్రవారం సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి-24 అనుకున్న లక్ష్యాన్ని చేదించి విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. 4-4-2014న పిఎస్‌ఎల్‌వి సి-24 సక్సెస్‌తో షార్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. కొత్త తెలుగు సంవత్సరాది అయిన జయనామ సంవత్సరంలో తొలిసారి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి-24 విజయవంతమైంది. పిఎస్‌ఎల్‌వి వరుస విజయ పరంపరలో ఇదొక మైలు రాయిగా నిలిచిపోతుందని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం సాయంత్రం 5.14 నిమిషాలు. సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో అంతా ఉత్కంఠ వాతావరణం. ఎంతో నమ్మకమైన పిఎస్‌ఎల్‌ వి రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1బి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 58 గంటల కౌంట్‌డౌన్‌ పూర్తి చేసుకుంది. మాస్టర్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి ప్రయోగానికి సన్నద్ధం చేస్తున్నారు. +8, +7, +6, +5, +4, +3. +2, +1, -1, 2, 3, 4, 5, 6 అనగానే షార్లోని మొదటి లాంచ్‌ ప్యాడ్‌ నుండి పిఎస్‌ఎల్‌వి సి-24 నిప్పులు చిమ్ముతూ బూడిద వర్ణంలో నింగికెగిసింది. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది, మీడియా హర్షధ్వానాల మధ్య నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల్లో ప్రయోగం జరిగింది. మొత్తం 19 నిమిషాల 28 సెకన్లలో రాకెట్‌ నుండి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం విడిపోయింది. ఇది తొలుత 283 కిలోమీటర్ల పెరిజి, 20,630 కిలోమీటర్ల అపోజి దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమధ్య రేఖకు 19.2 డిగ్రీ వాలులో కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. వాస్తవంగా 284 కిలోమీటర్ల పెరిజి, 20,652 అపోజిలో శాటిలైట్‌ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ఒక కిలోమీటర్‌ తక్కువ పెరిజి, 20 కిలోమీటర్ల తక్కువ అపోజిలో దీన్ని ప్రవేశపెట్టింది. 20 నిమిషాల 25 సెకన్లకు భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా 19 నిమిషాల 28 సెకన్లలో కక్ష్యలోకి చేరింది. నాలుగు దశల్లో ప్రయోగం సాగింది. మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ఘన ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనం ఉపయోగించారు.
  ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం బరువు 1,432 కిలోగ్రాములు, ఇందులో 818 కిలోగ్రాముల ద్రవ ఇంధనాన్ని నింపారు. దీన్ని ఐదుసార్లు మండించిన తరువాత ఈనెల 19వ తేదీ నాటికి 36 వేల కిలోమీటర్ల దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం భారతదేశం, దానిచుట్టూ 1,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో దిక్సూచిలా పనిచేస్తుంది. 1,660 వాల్టుల విద్యుత్‌ను తన రెండు సోలార్‌ రెక్కల నుండి ఉత్పత్తి చేసుకొని పనిచేస్తుంది. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత మాస్టర్‌ కంట్రోల్‌ స్పెసిలిటి హసన్‌ కేంద్రం నుండి ఐదుసార్లు కక్ష్య పొడిగించిన తరువాత ద్రవ ఇంధనం మండించడం ద్వారా దీర్ఘవృత్తాకార కక్ష్య 55 డిగ్రీల తూర్పుగా, భూమధ్యరేఖ స్థలానికి 31 డిగ్రీల వాలుతో వృత్తాకార కక్ష్యలోకి మార్చబడుతుంది. ఎన్‌ఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1ఎ ప్రయోగం అనంతరం ఏడు నెలల కాలంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1బి ఉపగ్రహాన్ని తయారు చేసి నేడు నింగిలోకి ప్రవేశపెట్టారు. ఇది భారత్‌ తయారు చేసిన రెండో నావిగేషన్‌ ఉపగ్రహం. అన్ని పరీక్షలూ పూర్తి చేసుకున్న తరువాత రెండు నెలల అనంతరం వినియోగదారులకు సేవలందిస్తుంది. ఇందులో ఎల్‌5బ్యాండ్‌, ఎస్‌ బ్యాండ్‌ ఉపగ్రహం పనిచేస్తుంది. ఇందులో అత్యంత కచ్చితంగా పనిచేసే రుబీడియం అను గడియారం కీలకమైంది. మొదట ఉపగ్రహం తరువాత ఈ ప్రయోగంలో ఆరు 6ఎక్స్‌ఎల్‌ స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించారు. ఇలా స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించిన ప్రయోగాల్లో ఇది ఆరోది. గతంలో పిఎస్‌ఎల్‌వి సి-11, చంద్రయాన్‌, పిఎస్‌ఎల్‌వి సి-17, జిశాట్‌-12, పిఎస్‌ఎల్‌వి సి-19, పిఎస్‌ఎల్‌వి సి-22 ప్రయోగాల్లో ఈ రకమైన మోటార్లను ఉపయోగించారు.
ఈ ప్రయోగ ఉపయోగం
పిఎస్‌ఎల్‌వి ద్వారా ఐఆర్‌ఎన్‌ఎన్‌ఎస్‌(ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌) ఉపగ్రహం భారత్‌ అవసరాల నిమిత్తం తయారు చేసింది. ఇప్పటికే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1ఎ నావిగేషన్‌ ఉపగ్రహం వినియోగదారులకు సేవలు అందిస్తుండగా, భారత్‌ తయారు చేసిన రెండో నావిగేషన్‌ ఉపగ్రహమిది. భారత దేశంతో పాటు, చుట్టూ 1,500 కిలోమీటర్ల వరకూ స్థితి, గతిని నిర్దేశించి తెలుపుతుంది. అన్నిరకాల పరిస్థితులకూ తట్టుకొని 24 గంటలూ సేవలందిస్తుంది. అంతేగాకుండా దీర్ఘచతురస్రాకారంలో 35 డిగ్రీల దక్షిణం నుండి 50 డిగ్రీల ఉత్తరం వరకూ, 30 డిగ్రీల తూర్పు నుండి సేవలందిస్తుంది. ఇందులో మూడు రకాల విభాగాలున్నాయి. అంతరిక్ష ఉపగ్రహాలు ఎక్కడెక్కడ పరిభ్రమిస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. భూమి మీద వినియోగదారులకు అవసరమైన సేవలందిస్తుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థలో మొత్తం 7 ఉపగ్రహాలుంటాయి. పిఎస్‌ఎల్‌వి సి-22 ద్వారా గత ఏడాది జులై ఒకటో తేదీన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1ఎ తొలి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. నావిగేషన్‌ సిస్టమ్‌లో ఇది రెండోది. దేశంలోని అన్ని విభాగాలకూ సంపూర్ణంగా నావిగేషన్‌ సేవలందాలంటే ఏడు ప్రయోగాలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకూ రెండు నిర్వహించారు. మరో ఐదు ప్రయోగాలను నిర్వహించాల్సి ఉంది. ఈ ఉపగ్రహం ద్వారా సామాన్య ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు, ముఖ్యమైన అధికారులకు పరిమితమైన సేవలందిస్తుంది. కర్ణాటకలోని బైలాలులో దీనికి సంబంధించిన భూ వ్యవస్థ కేంద్రాన్ని నిర్మించారు. నావిగేషన్‌ ఉపగ్రహాలకు ఆ కేంద్రం మెదడులాంటిది. అక్కడి నుంచే నావిగేషన్‌ ఉప్రగహాల పనితీరును ఆపరేట్‌ చేస్తారు. వినియోగదారుల సేవల కోసం, వ్యవస్థ సక్రమంగా నడిపేందుకు దేశంలోని బైలాలు, హసన్‌, బోపాల్‌తో పాటు పలు రాష్టాల్లో నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భూమిపై ప్రయాణించే వాహనాలు, సముద్రంలో ప్రయాణించే ఓడలు, విమానాలకు మార్గాలను, స్థితి, స్థాన, దిక్కులను తెలియజేస్తుంది. ఆపద సమయంలో సూచనలు చేస్తుంది. రవాణా ఓడల ఉనికిని తెలియజేస్తుంది. భూ గోళానికి సంబంధించిన విషయాలను కనుగొని నిర్ధిష్ట సమయంలో తెలియజేస్తుంది. వాహనదారులకు దృశ్యం, శ్రావణ విధానంతో దిశా నిర్దేశం చేస్తుంది. కచ్చిత సమయాన్ని కనుగొంటుంది. ప్రస్తుతమున్న అవసరాల రీత్యా ఈ ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉందని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సంబరాల్లో మునిగిపోయింది. ఈ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ శేఖర్‌ దత్తూ హాజరయ్యారు. ప్రయోగ విజయవంతం అనంతరం ఇస్రో ఛైర్మన్‌కు, ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని షార్‌ డైరెక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, మిషన్‌ డైరెక్టర్‌ ఉన్ని క్రిష్ణన్‌, మాజీ షార్‌ డైరెక్టర్‌ చంద్రదత్తన్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ నాగేశ్వరరావు, రామకృష్ణన్‌, కిరణ్‌ కుమార్‌, శివకుమార్‌ పర్యవేక్షించారు.
ప్రయోగానికి రూ. 260 కోట్లు ఖర్చు
   ఈ ప్రయోగానికి మొత్తం 260 కోట్ల రూపాయలు ఇస్రో ఖర్చు చేసింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1బి ఉపగ్రహానికి 150 కోట్ల రూపాయలు, పిఎస్‌ఎల్‌ వి రాకెట్‌కు 110 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.
Courtesy  with: PRAJA SEKTHI DAILY
వేస‌వి చ‌ల్ల చ‌ల్లా‌గా తాగేయండి !

- ఆమ్‌ కా పన్నా
2 పెద్ద పచ్చి మామిడి కాయలు
2 టీస్పూన్ల జీలకర్ర పొడి
1 టీస్పూన్‌ మిరియాల పొడి
నల్ల ఉప్పు
ఒక చిటికెడు ఇంగువ
పావు కప్పు పంచదార
తయారీ విధానం
మామిడికాయలు కడిగి ముక్కలు చేసి ఉడికించాలి. చల్లబడిన తర్వాత తొక్కు తీయాలి. ముక్కలను చిదిమి పేస్ట్‌ లాగా చేయాలి.
జీలకర్ర పొడి, మిరియాల పొడి, నల్ల ఉప్పు, ఇంగువ, పంచదార ఆ పేస్ట్‌కి కలపాలి. అందులో పంచదార కరిగేవరకు కలపాలి. ఆ పేస్ట్‌ని ఒక గ్లాసుకి ఒక చెంచా చొప్పున వేసి అందులో గ్లాసు నిండా చల్లని నీరు పోస్తే ఆమ్‌ కా పన్నా తయారు
వేసవిలో దాహం తీరడానికి ఎక్కువ నీరు తాగడంతో పాటు ద్రవ పదార్థాలనూ తీసుకుంటూ ఉండాలి. మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఇంట్లోనే రకరకాల రుచికరమైన, పోషకాలు కలిగిన డ్రింక్‌లు చేసుకోవచ్చు.
-జల్‌జీరా
పుదీనా ఆకులు పావు కప్పు
కొత్తిమీర పావు కప్పు
అల్లం ముక్క
జీలకర్ర 2 టీస్పూన్లు
పంచదార 3 టీస్పూన్లు
ఆమ్‌చూర్‌ పౌడర్‌ పావు టీ స్పూన్‌
చాట్‌ మసాలా చిటికెడు
రాళ్ళ ఉప్పు కొద్దిగా
నిమ్మరసం 2 టీస్పూన్లు
నీరు 4 కప్పులు
తయారీ విధానం
నీరు, నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి తిప్పి పేస్ట్‌ చేయాలి. జల్లెడలో వేసి వడకట్టాలి. దానికి నిమ్మరసం చేర్చాలి. తర్వాత 4 కప్పుల నీరు, ఐసు ముక్కలు కలిపి, పైన బూందీ వేయాలి.
-బాదం పాలు
-బాదం పాలు
4 కప్పుల పాలు
పావు కప్పు బాదం పప్పు
ఒక చిటికెడు యాలకుల పొడి
3,4 టీస్పూన్‌ల తేనె
తయారీ విధానం
బాదంపప్పులు వేడినీటిలో రెండు నిమిషాలు నానబెట్టి, తొక్కు తీసి దంచాలి. అడుగు మందం ఉన్న గిన్నెలో పాలు కాచి అందులో బాదం పప్పు పొడిని వేసి ఇరవై నిమిషాలు మరగనివ్వాలి. యాలకుల పొడి వేసి మరి కొంతసేపు మరగనివ్వాలి. మంట మీద నుంచి దించి తేనె కలిపి తిప్పాలి. గోరువెచ్చగా కాని, ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా గాని తీసుకోవచ్చు.
-రండాయి
ఒక కప్పు పాలు, ఒకటిన్నర కప్పు పంచదార, పావు కప్పు ఎండబెట్టిన గులాబీ రేకులు, ఒకటిన్నర లీటర్ల నీరు, ఒక టీస్పూన్‌ బాదంపప్పు
ఒక టీస్పూన్‌ జీడిపప్పు
అర టీస్పూన్‌ గసగసాలు
అర టీస్పూన్‌ సోంప్‌
అర టీస్పూన్‌ యాలకుల పొడి
అర టీస్పూన్‌ రోజ్‌ వాటర్‌
తయారీ విధానం
అర లీటరు నీటిలో పంచదార వేసి కరిగించాలి. ఇతర వస్తువులను మిగిలిన నీటిలో నానబెట్టాలి. అన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లాగా చేయాలి. తీత పేస్ట్‌ను నానబెట్టిన నీటిలో వేసి కలపాలి. ఈ నీటిని ఒక గిన్నెకి మస్లిన్‌
బట్ట కట్టి వడబోయాలి. ఆ పేస్ట్‌కి మరికాస్త నీరు పోసి పిండితే పూర్తిగా రసం బైటికి వచ్చేస్తుంది. దానికి పాలు, పంచదార, రోజ్‌ వాటర్‌ కలపాలి. దానికి యాలకుల పొడి కలిపి తాగే ముందు ఐసు ముక్కలు వేయాలి.
-లస్సీ
2 కప్పుల తాజా పెరుగు
1 టీస్పూన్‌ పంచదార
అర టీస్పూన్‌ యాలకుల పొడి
8 నుంచి 10 మిల్లీ గ్రాముల కుంకుమపువ్వు
2 చుక్కల వెనీలా ఎసెన్స్‌
ఐస్‌ ముక్కలు
ఒక టీ స్పూన్‌ పాలు
తయారీ విధానం
కుంకుమపువ్వు 1 టీ స్పూన్‌ వేడిపాలలో కరిగించాలి.
పెరుగులో పంచదార వేసి కరిగేవరకు మిక్సీలో తిప్పాలి.
తర్వాత అందులో మిగిలిన వస్తువులు కూడా వేసి తిప్పాలి. తాగేముందు ఐసు ముక్కలు వేయాలి.
-మసాలా మిల్క్‌
4 గ్లాసుల పాలు
2 టీస్పూన్‌ల జీడిపప్పు
2 టీస్పూన్‌ల బాదంపప్పు
2 టీస్పూన్‌ల పిస్తా
పావు టీ స్పూన్‌ యాలకుల పొడి
1టీస్పూన్‌ క్రీమ్‌
ఒక చిటికెడు కుంకుమపువ్వు
4 టీస్పూన్‌ల పంచదార
తయారీ విధానం
జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, యాలుకలు, పంచదార, కుంకుమపువ్వు కలిపి మిక్సీకి వేయాలి. మెత్తగా అయిన ఆ పొడిని పాలకు కలపాలి. దానికి క్రీమ్‌ను చేర్చి బాగా గిలకొట్టాలి. దానికి పాలను కలిపి ఫ్రిజ్‌లో ఉంచి 3 గంటల వరకు చల్లబరచాలి.

 Courtesy with: PRAJA SEKTHY DAILY 
కొబ్బరి నీళ్ళకు సవాలు నై...  
     
 ఎండాకాలం వచ్చేసింది. నెత్తిమీద భానుడి ప్రతాపం తాండవం చేస్తోంది. పది నిమిషాలు బయటికి వెళ్లి వస్తే చాలు, శరీరంలోని నీరంతా ఆవిరైపోతోంది. చల్లని నీళ్లు తాగాలని ప్రయత్నిస్తే కూల్‌డ్రింక్‌లు కనిపిస్తాయి. కాని అవి ఆరోగ్యానికి మంచివి కావని మన ఆరోగ్యవేత్తలు నిరూపించారు. మరి దీనికి పరిష్కారం లేదంటారా? ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. ఒకటి, కొబ్బరి నీళ్ళు.
       తక్కువ కేలరీలు, కొలస్ట్రాల్‌ లేని కొబ్బరినీళ్ళలో సుమారు 94శాతం వరకూ మాములు నీళ్లే ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే కొబ్బరి నీళ్లలో కేవలం 2.8శాతం మేరకు చక్కెర, 0.5శాతం వరకూ లవణాలు ఉంటాయి. బి విటమిన్‌ ఎక్కువగా లభిస్తుంది. కొబ్బరి బొండాం ధరకే కూల్‌డ్రింకులు లభించినా, అనారోగ్యాన్ని కల్గించే కారకాలు ఎన్నో ఈ కూల్‌డ్రింక్‌లలో ఉన్నాయి. కాబట్టి ఆమ్లగాఢత ఉన్న కూల్‌డ్రింకులను మానేసి కొబ్బరినీళ్లు తాగమని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉంటారు.
గుండె ఆరోగ్యానికి
       దాహాన్ని తీర్చడానికే కాక, అంతకు మించి ఎక్కువ ఔషధగుణాలు ఈ కొబ్బరి నీళ్లలో ఉన్నాయి. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన గుండె పోటు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. పొటాషియం ఎక్కువగా ఉన్న ఈ కొబ్బరి నీళ్ళు రక్తపోటును తగ్గించి, శరీరంలో నీటిని కోల్పోకుండా కాపాడతాయి.
మూత్రపిండాల్లో రాళ్ళను తగ్గించడానికి
       కొబ్బరి నీళ్ళు తరుచు తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు చేరవు. కొబ్బరినీళ్లలోని పొటాషియం, మెగ్నీషియం మూత్రకారక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అప్పటికే మూత్రపిండాల్లో రాళ్ళు ఉండిపోతే వాటిని మూత్రవిసర్జనలో బయటికి పంపించి వేస్తాయి.
విరేచనాలకు విరుగుడు
       కొబ్బరి నీళ్ళు విరేచనాలను కూడా అరికడతాయి. కొబ్బరినీళ్ళు విరేచనాల ద్వారా శరీరం కోల్పోయిన నీటిని అందించి లవణాలను అందిస్తాయి. శరీరంలోని విష పదార్ధాలను బయటికి పంపేస్తాయి. కొబ్బరినీళ్ళలో సహజసిద్ధమైన సమగాఢత ఉంది. కొబ్బరినీళ్ళలోని ఎలక్ట్రోలైట్‌ ప్రమాణాలు మన శరీరంలోని ఎలక్ట్రోలైట్‌ ప్రమాణాలతో సమానం.
ఎండలో హైడ్రేట్‌
       ఎండాకాలంలో శరీరంలో నీటిని కోల్పోయి డీహ్రైడ్రేషన్‌కు గురవుతుంటారు.దీనికి మంచి విరుగుడు కొబ్బరినీళ్ళే. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్‌లు, చాలా తక్కువ స్ధాయిలో చక్కెర, పుష్కలంగా ఎలక్ట్రోలైట్‌లు ఉండడమే దీనికి కారణం. కొబ్బరినీళ్ళను నేరుగా కాని, నిమ్మరసంతో కాని తీసుకుంటే ఎంతో ఉపయోగం.
వ్యాయామం ముందు, తర్వాత
       వ్యాయామం చేసే సమయంలో చెమటలు పట్టడం, ఉక్కపోతగా ఉండటం సహజం. దీనికి పరిష్కారం, ఎలాంటి రసాయన పదార్ధాలు కాని, కృత్రిమ చక్కెర పదార్ధాలు కాని లేని సహజమైన క్రీడా పానీయం కొబ్బరి నీళ్ళు. వ్యాయామం చేసే సమయంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందడానికి అతితక్కువ కేలరీలు ఉన్న కొబ్బరి నీళ్లు ఎంతో ఉత్తమం. పొటాషియం ఎక్కువగా ఉన్న కొబ్బరినీళ్ళను తీసుకోవడం వలన వ్యాయామం తర్వాత డీహ్రైడ్రేషన్‌ సమస్య రాదు.
చర్మానికి కొత్త అందం
       చర్మం మృదువుగా మారాలనుకుంటే క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్ళు తాగండి. ఇవి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేయడమే కాక, మృత కణాలను కూడా తొలగిస్తాయి. కొబ్బరినీళ్ళను రెండు రోజులకొకసారి చేతులకు, ముఖానికి రాసుకుంటే వృద్ధాప్యఛాయలు కనిపించవు. కొబ్బరినీళ్లలో ఉండే సైటోకైనిన్‌ అందుకు కారణం.
సాధారణ గర్భ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ
       కొబ్బరినీళ్ళు సహజసిద్ధంగా లభించే స్వచ్ఛమైన నీరు. కాబట్టే గర్భిణీలకు ఎంతో మంచిది. గర్భిణీలకు సాధారణంగా వచ్చే మలబద్ధకం, గుండెలో మంట, గ్యాస్‌ట్రబుల్‌ లాంటి సమస్యలకు దివ్యౌషధం కొబ్బరినీళ్ళు.
దంత సమస్యలకు విరుగుడు
       కొబ్బరినీళ్లు స్వచ్ఛమైన, సహజమైన పానీయం. పన్ను ఊడిపోయినప్పుడు దంతవైద్యుని చూసే లోపల ఆ పంటిని జాగ్రత్త చేయగలిగింది కొబ్బరినీళ్ళే.
- కోలస్ట్రాల్‌ శాతం తక్కువగా ఉన్నందున కొబ్బరి నీళ్లు తాగితే కొవ్వు సమస్య ఉండదు.
- తరచూ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో షుగర్‌ స్ధాయిలు అదుపులో ఉంటాయి.
- ముఖం పై మొటిమలు, నల్లటి మచ్చలు పోవాలంటే లేత కొబ్బరి గుజ్జును రాసుకుంటే ఫలితం ఉంటుంది.
- కొబ్బరి నీళ్లలో సోడియం తక్కువగా ఉంటుంది గనుక వాటిని తాగితే అతిసారం, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
- స్నానం చేసే ముంతు శరీరానికి కొబ్బరి నూనెతో బాగా మర్ధనా చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ఎంతో ఉపవమనం కలుగుతుంది.
- ప్రోటీన్ల లోపం ఉన్నవారికి కొబ్బరి పాలు దివ్యౌషధంలా పనిచేస్తాయి.
- కొబ్బరి నీళ్లలో కాస్త పసుపు, గంధం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ముఖం కాంతులీనుతుంది.
- కొబ్బరి నూనెతో తలకు మసాజ్‌ చేసుకుంటే శిరోజాలకే కాదు, కళ్లకు మేలు చేకూరుతుంది.
- పిల్లలకు కూల్‌డ్రింక్‌లు బదులు కొబ్బరి నీళ్లు తరచూ ఇస్తే బలం చేకూరుతుంది.

Courtesy  With: PRAJA SEKTHY DAILY