Saturday, 31 March 2012

పుస్తక పఠనం... ప్రగతికి సోపానం...


చిన్నారులూ..!
చదువు వేరు.. పుస్తక పఠ నం వేరు.. చదువు పఠనా నికి సాధనం. పుస్తక పఠ నం విజ్ఞానాన్ని పెంచి, ప్రగ తికి సోపానమవుతుంది. పుస్తకాలు చదవడమనేది మంచి అలవాటు. అది చిన్నతనంలోనే అబ్బాలి. మరి రేపు 'అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం' సందర్భంగా పుస్తక పఠనం ప్రారంభించేద్దామా?!
కొన్ని అలవాట్లు చిన్నప్పుడే అలవడాలి. 'మొక్కై వంగనిది మానై వంగునా..!' అనే సామెత వినే ఉంటారు. బాల్యంలోనే పుస్తక పఠనం అలవాటైతే అది ఎప్పటికీ వాడిపోదు సరికదా! మిమ్మల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది.
పుస్తక పఠనంతో అపరిమిత విజ్ఞానం మీ సొంతమవుతుంది. కొత్త విషయాలు తెలుసు కోవాలన్న ఆసక్తి కలుగుతుంది. మీలోని ఊహాశక్తి అధికమవుతుంది.
ఇన్ని లాభాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి పిల్లలకి పుస్తకాలు చదవడం అలవాటు చేయండి అంటారు పెద్దలు. ఇంత మంచి అలవాటు మీరంతా చేసుకోవాలనే ఈ నెల 2వ తేదీన 'అంతర్జాతీయ బాలల పుస్తక మహోత్సవం' నిర్వహిస్తున్నారర్రా!
పాశ్చాత్య ప్రపంచంలో సంచలనం సృష్టించిన 19వ శతాబ్ధపు రచయిత 'హాన్స్‌ క్రిస్టియన్‌ ఏండా ర్సన్‌'. ఈయన బాలసాహిత్యంలో దిట్ట. హాలెండ్‌కు చెందిన ఈయన రచనలంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడేవారంట! అందుకే ఈయన రచనల్ని అన్ని భాషల్లోకి అనువదించారర్రా! మీకు ఆయన రచనలు దొరికితే తప్పక చదవండే!
ఆయన పుట్టినరోజైన 'ఏప్రిల్‌ 2'ను 'అంతర్జా తీయ బాలల పుస్తక దినోత్సవం'గా జరపాలని 1967లో నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని పురస్క రించుకుని మీలాంటి పిల్లల్లో సాహిత్యాభిలాష పెంచాలన్నదే ఉద్దేశం. మీరంతా మంచిపిల్లలు కదా! మరి ఎంచక్కా ఎండాకాలం సెలవుల్లో బోలెడన్ని కథల పుస్తకాలు చదవండే..!

Thursday, 29 March 2012

మనదైన గుర్తింపు కోసం...


మన గురించి మనం ఆలోచించుకుని, మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని తపన పడకపోతే అందరిలో ఒకరిగానే మిగిలిపోతాం.
ప్రముఖులుగా మనం చెప్పుకునే ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఫలానా వ్యక్తి బిజినెస్‌మెన్‌, ఫలానా వ్యక్తి డాక్టర్‌, ఫలానా వ్యక్తి సంఘసేవకుడు- ఇలా మనం ప్రతి వ్యక్తిని అతడి వృత్తి, ప్రవృత్తుల ఆధారంగానే గుర్తుంచుకుంటాం. కుటుంబంలోని వ్యక్తులు తప్ప మిగిలిన సమాజమంతా వ్యక్తులను వృత్తి, ప్రవృత్తుల ఆధారంగానే గుర్తిస్తుంది. అందరికీ ఏదో ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. దానిని ఎక్కువ మంది గుర్తించటమే మనకు ప్రత్యేకతను కలిగేలా చేస్తుంది. ఎంత ఎక్కువ మంది ఓ వ్యక్తిని గుర్తించగలిగితే, అతడు అంత ప్రముఖుడిగా గుర్తింపును పొందుతాడు.
మరి మీరు అందరిలో ఒకరిగా మిగిలిపోవాలనుకుంటున్నారా? లేక మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఎక్కువ మంది నుంచి పొందాలని కోరుకుంటున్నారా?
ఒకవేళ మీరిలా అందరిలో ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే, ఇలాగే జీవితం కొనసాగించండి. అలా కాక, ప్రత్యేకమైన గుర్తింపు, ప్రముఖుడిగా పేరు కోరుకుంటే మిమ్మల్ని మీరు ఆకోణంలో తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటినుండే ప్రారంభించండి. అందుకు మీరు చేయవలసినవి.
కోరికలను గుర్తించండి : కోరికలే మనిషిని ముందుకు నడిపిస్తాయి. కోరికలే మనిషిని సృష్టిస్తాయి. కోరికలు లేని మనిషి ఉండడు. ఐతే కొంతమంది మాత్రమే తమలోని కోరికలను గుర్తిస్తారు. మరి కొంతమంది కోరికలను గుర్తించినా, గుర్తించనట్టే ప్రవర్తిస్తారు. కోరికలను గుర్తించడమంటే మీరేం కోరుకుంటున్నారో ఓ లిస్ట్‌ తయారుచేయడం కాదు. ఒక కోరిక తీరగానే మరో కోరికను ఆ లిస్ట్‌లో చేర్చి కొత్తగా లిస్ట్‌ చేయడం అసలే కాదు. మనలో ఎన్నో కోరికలుంటాయి. మంచి బట్టలు కొనుక్కోవాలి. మంచి సినిమా చూడాలి, వేసవి సెలవులను బాగా ఎంజారు చేయాలి - ఇవీన్న కోరికలే! కానీ ఇవేవి మనకు ప్రత్యేక గుర్తింపునివ్వవు. ప్రముఖుడిగా మార్చవు. కాబట్టి మీ కోరికలలో ఉత్తమమైనవి గుర్తించండి. 'నేను డాక్టర్‌ కావాలనుకుంటున్నాను- సంఘసేవ చేయాలనుకుంటున్నాను' - ఇలాంటి ఉత్తమమైన కోరికలను గుర్తించండి.
సంకల్పం చేసుకోండి: ఉత్తమమైన కోరికలు గుర్తించడంలోనే మనం కోరుకున్నది జరిగిపోదు. ఏదైనా కార్యం సాధించాలంటే 'సంకల్పం' అవసరం. మీలోని ఉత్తమమైన కోరికలు గుర్తించాక, సంకల్పం చేసుకోండి. 'నాకున్న ఉత్తమమైన కోరికలలో ఈ కోరిక తీర్చుకోవడానికి ఈ క్షణం నుండి నేను సంకల్పం చేసుకుంటున్నాను' అయితే సంకల్పం చేసుకునే ముందు కోరికలను విశ్లేషించుకోండి. ఏ కోరిక మీకు ఉత్తమమైనదిగా అనిపిస్తుంది. దాని వలన మీకు లభించే ప్రత్యేకమైన గుర్తింపు ఎలాంటిది... తదితర విషయాలను అవగాహన చేసుకోండి.
విజువలైజ్‌ చేసుకోండి :కోరికలంటే ప్రత్యేక
గుర్తింపుకు మార్గాలు. మంచి బట్టలు తోడుక్కోవాలనే కోరిక కూడా ఒక ప్రత్యేక గుర్తింపుకు సంబంధించినదే. అయితే మీరిప్పుడు కోరుకోవలసింది బట్టలు వలన వచ్చే తాత్కాలికమైన ప్రత్యేక గుర్తింపు కాదు. విజయం సాధించటం ద్వారా పొందే శాశ్వత, ప్రత్యేక గుర్తింపు మీరు కోరుకున్న ఆ శాశ్వత ప్రత్యేక గుర్తింపు, మీకు లభించినప్పుడు మీ జీవనశైలి ఎలా మారిపోతుంది. ఆ సమయంలో మీరు పొందే ఆనందం- తదితర విషయాలను ఒక్కసారి విజువలైజ్‌ చేసుకోండి. ఆ విజువలైజేషన్‌ను అప్పుడప్పుడు రిపీట్‌ చేసుకోండి. ఆ విజువలైజేషన్‌ మీకు 'శక్తి'ని సృష్టించి ఇస్తుంది.
కష్టపడండి : శాశ్వత ప్రత్యేక గుర్తింపు సాధించటం, అంత సులభమేం కాదు. ప్రత్యేక గుర్తింపు సాధించటం అంత సులభమే అయినట్టయితే అందరూ ప్రముఖులే అయి ఉండేవారు. కోరికలను గుర్తించి, సంకల్పం చేసుకుని కష్టపడేవారు పరిమితం. కష్టపడితేనే ఫలితముంటుంది. కష్టపడినవారికే శాశ్వత ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కాబట్టి మీరూ కష్టపడాలి.
ప్రత్యేకతను చాటుకోండి : అందరూ అనుసరించే మార్గమే కావచ్చు. ఆ మార్గంలో మీదంటూ ఓ బాణీ, ఓ వాణి ఉండాలి. మీ కంటూ ప్రత్యేకత సృష్టించకపోతే, మీరు జనానికి తెలిసినా మీ గురించి ప్రత్యేకించి చర్చించుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే మీరు ఎనుకున్న మార్గంలో మీదైనా శైలిలో ముందుకు సాగుతూ గమ్యం చేరుకోండి.
మన మైండ్‌సెట్‌ ఎప్పుడూ పరిమిత లక్ష్యాలనే నిర్దేశించుకుని సాధించుకోవడం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అసాధారణ లక్ష్యాలు నిర్దేశించుకుంటే అవి అందుకోగలమో లేదోనన్న భయం మనలో ఉంటుంది. అసాధారణ లక్ష్యాలను అవలీలగా సాధించిన వ్యక్తులు మన చుట్టూనే ఉన్నారు. మరి మనం అసాధారణ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఎందుకింతగా భయపడుతున్నాం?
మనం ఆ తరహా భయాన్ని ముందు వదలాలి. మన కోరికలలో ఉత్తమమైనది. ఉదాత్తమైనది ఎన్నుకోవాలి. ఆ కోరికలను కలలుగా భావించకుండా, వాస్తవరూపంలోకి మలచుకోవడానికి కృషి చేయాలి. కోట్లాది జనంలో, మనమూ ఒకరంగా మిగలకూడదనుకుంటే మీరు చేయవలసిన పనుల గురించి ముందు చెప్పుకున్నాం. అసాధారణ లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటికి చేరుకున్న వ్యక్తుల లిస్ట్‌ తయారుచేసుకోండి. అందరినీ ఆ లిస్ట్‌లో చేర్చనక్కర్లేదు. మీలో మీరు గుర్తించిన కోరికకు దగ్గరగా ఉండే విజయవంతమైన వారి పేర్లు పది పదిహేను లిస్ట్‌లో చేర్చండి. వారి సక్సెస్‌కి కారణం తెలుసుకోండి. ఆ వ్యక్తులే మీకు స్ఫూర్తిగా భావించండి
ఆ లక్ష్యం సాధించగలిగేదిగా ఉండాలంటారు. కానీ సాధారణ లక్ష్యాలనే టార్గెట్‌ చేయడం వలన మనలో ఉన్న అపరిమిత శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. లక్ష్యం ఎప్పుడైతే చిన్నదిగా ఉంటుందో మనం మన శక్తిని అతికొద్దిగానే వాడుకోగలుగుతున్నాం. అసాధారణ లక్ష్యాలను అవలీలగా సాధించిన వ్యక్తులు ఉండగా, మీరు ఆపనినే ఎందుకు చేయలేకపోతారు? కాబట్టి నాలో ఉన్న శక్తిని కొంతవరకైనా ఉపయోగించుకోవాలంటే లక్ష్యం అసాధారణమైనదిగా ఉండాలని అనుకోండి.
ఆ భయాన్ని వీడండి 'ఇంతపెద్ద లక్ష్యం నేను సాధించగలనా?' అనుకోకండి. మనసులో భయం ఏర్పడితే సహజసిద్ధమైన శక్తి సద్వినియోగం చేసుకోలేకపోతాము. భయం లేనప్పుడే మనం ఒత్తిడి లేకుండా లక్ష్యం చేరుకోగలుగుతాం. అసలు మీ మైండ్‌సెట్‌నే మార్చుకోవడానికి ప్రయత్నించండి. 'లక్ష్యం పెద్దదే. అసాధారణ లక్ష్యమేమీ కాదు. నేను ఈ లక్ష్యం సాధించగలను'అని మనసును ట్యూన్‌ చేసుకోండి.
మీ లక్ష్యసాధనలో మీరు ఎంతవరకూ సఫలీకృతులవుతున్నారో అప్పుడప్పుడు విశ్లేషించుకోండి. ఆప్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకోండి అసాధారణ లక్ష్యాలు నిర్ణయించుకోవడం వల్ల మనం కోల్పోయేది ఏమీ ఉండదు.
మనం ఆలోచనా సరళి, ప్రవర్తనారీతులు, వ్యక్తిత్వ ప్రదర్శన ఉన్నతంగా ఉంటాయి. ఆ లక్ష్యం చేరుకోవడం కష్టమైనా, మనం ఒక ఉన్నతస్థాయిలోనే నిలబడతాం. అది మనం కోరుకున్న సాధారణస్థాయికి మించే ఉంటుంది.
కాబట్టి అసాధారణ లక్ష్యాలు నిర్ణయించుకోండి. మనలో ఉన్న శక్తి ఏమిటో మనకు తెలీదు. కష్టపడడం ప్రారంభించాకే మనం ఎంతగా కష్టపడగలమన్నది మనకి తెలుస్తుంది. అలాంటప్పుడు మన శక్తిని మనం తక్కువగా అంచనా వేసుకోవడం అవసరమా?!

విద్యార్థులూ! ఇక మీదే విజయం!

  

జి.కిరణ్‌
పరీక్షలంటే అందరికీ గాభరా. పరీక్ష తేదీ ముంచుకొస్తున్న కొద్దీ పిల్లలు మరింత కంగారు పడతారు. తల్లిదండ్రులు మరీనూ. వారికి కంటిమీద కునుకుండదు. పిల్లల్ని ప్రశాంతంగా ఉండనీయరు. పరీక్ష రోజుకు కౌంట్‌డౌన్‌ చేస్తూ ప్రతీక్షణం పరీక్షల గురించే మాట్లాడతారు. పరీక్షలు తప్ప మరో మాటెత్తితే 'చదువుపై శ్రద్ధ లేద'ంటూ కసురుకుంటుంటారు. కానీ ఇది తప్పు...... పరీక్షలు దగ్గరకొస్తున్న కొద్దీ పరీక్షల గురించి పిల్లల దగ్గర ఎక్కువగా మాట్లాడకూడదు.
విద్యార్థులకు సరయిన సూచనలు, సలహాల నిస్తూ తల్లిదండ్రులు 'మార్గదర్శకత్వం' నెరపాలి. పరీక్షలను సలక్షణంగా రాయడానికి విద్యార్థులకూ, వారికి సహకరించే పెద్దలకూ అవసరమైన సూచనలను విద్యావేత్త చుక్కా రామయ్య గారు అందజేస్తున్నారు. వీటిననుసరించి ప్రిపరేషన్‌ను కొనసాగించి, పరీక్షలు రాస్తే మంచి మార్కులతో పాసై భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దుకోగలరు.
సహజ ప్రతిభ ప్రదర్శించాలి..
ఎలా చదవాలి? ఏం రాయాలి? అనే టెన్షన్‌ పిల్లలదయితే...
ఎక్కువ మార్కులు, ర్యాంకులు తెచ్చుకుని తమ పిల్లలు బాగా ముందుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇది సహజం. అతిగా భయపడటం, టెన్షన్‌ పడటం అసహజం. అయితే... భయంతో టెన్షన్‌ పడుతూ పని చేస్తే 'అయ్యే' పని కాస్తా గందరగోళంలో పడుతుంది. కాబట్టి నింపాదిగా పని చేసుకోవాలి. సబ్జెక్టుపై స్పష్టమైన అవగాహన పెంచుకుంటూ చదివితే విద్యార్థులకు చదువు ఒంటబడుతుంది. కొందరు ఈపాటికే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసి ఉంటారు. కొనసాగిస్తున్నవారు ఈ పద్ధతిలో ప్రిపరేషన్‌ సాగిస్తే పరీక్షా కాలాన్ని సునాయాసంగా గట్టెక్కగలుగుతారు.
వాస్తవానికి పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు పరీక్ష రాసే విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగానే వ్యవహరించాలి. దీనివల్ల విద్యార్థి ప్రతిభ ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే లేదా తగ్గించే ఏ పనీ పేరెంట్‌ చేయకూడదు. పరీక్షల సమయంలో పిల్లలు ప్రశాంతంగా తమ సహజ ప్రతిభను ప్రదర్శించేటట్లు ప్రోత్సహించాలే తప్ప 'భయానక వాతావరణం' సృష్టించరాదు. పరీక్షల విషయంలో అనుభవం లేని పిల్లలకు పెద్దలు తగిన విధంగా మద్దతునిచ్చి'ప్లాన్‌' చేసి పెట్టాలి. వారికి సన్నిహితంగా ఉంటూ వారి అవసరాలు గుర్తించాలి. అందుకు తగినట్లుగా మానసిక ధైర్యం ఇవ్వాలి.
పరీక్షల ముందు...
పరీక్షలకు కనీసం వారం పదిరోజుల ముందునుంచీ పిల్లలకు తగిన నిద్ర ఉండేట్టు చూడాలి. అంతే తప్ప పరీక్ష రోజు దగ్గర పడుతున్న కొద్దీ నైటవుట్లు చేయించే ప్రయత్నం చేయకూడదు. సంవత్సరమంతా చదివినదే పరీక్షల్లో రాయగలుగుతారే తప్ప చివరి నాలుగైదు రోజుల్లో అదనంగా నేర్చుకునేదేమీ ఉండదు. వెనుకబడిన సబ్జెక్టు విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ సమయంలో హాఫ్‌ఇయర్లీ, ప్రీఫైనల్‌ పేపర్స్‌ను సమీక్షించి అందులోని లోపాలను సవరించే ప్రయత్నం చేయడం మంచిది. చిన్న చిన్న పొరపాట్ల కారణంగా వాటిలో మార్కులు తగ్గిన వాటిని గుర్తించి వాటిని సరిదిద్దుకునే విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలి. బాగా చదివినా, శ్రద్ధగా పరీక్షలు రాసినా చిన్న పొరపాట్ల కారణంగా ఎలా మార్కులు తగ్గినదీ వారికి విశదీకరిస్తూ ఆ పొరపాట్లు పబ్లిక్‌ పరీక్షల్లో చేయకుండా స్పృహ కలుగజేయాలి. పరీక్షా పత్రంలో జవాబులు స్పష్టంగా రాయడం అవసరం. పరీక్షకు వారం పదిరోజుల ముందు రాత మెరుగ్గా ఉండేందుకు సాధన చేయించాలి.
పరీక్ష రోజు...
పరీక్షలు అయిపోయే వరకూ పిల్లలు ప్రతి రోజూ రాత్రి వేళకు నిద్రకుపక్రమించేటట్లు చూడాలి. అలాగే త్వరగా నిద్రలేపాలి. పరీక్షకు సంబంధించినవన్నీ అమర్చుకునేటట్లు చూడాలి. చాలామంది పిల్లలు పరీక్ష రోజు ఉదయాన్నే సిలబస్‌ మొత్తాన్ని గబగబా తిరగేస్తూ అన్నీ గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. నిజానికి పరీక్ష రోజు మైండ్‌ బ్లాంక్‌గా ఉంటుంది. ఏదీ గుర్తుకు రాదు. అది బాగా ప్రిపేర్‌ అయ్యారనడానికి గుర్తు. పరీక్ష హాల్లోకి వెళితే అన్నీ గుర్తుకు వస్తాయి. అందుకని ముందు కంగారు పడరాదు. పిల్లలకు ఈ విషయం తెలీదు. అందుకని దీనిని పెద్దలే వారికి తెలియజెప్పాలి.
పరీక్ష హాల్లో...
పరీక్షల విషయంలో పిల్లలకు అనుభవం ఉండదు. అనుభవం ఉన్న పెద్దలు పిల్లలకు అన్ని విషయాలూ ఓపిగ్గా వివరించాలి. ప్రతీ పరీక్షకు అవసరమైనవి ఉంటాయి. ఉదాహరణకు మేథమేటిక్స్‌ పరీక్షకు జామెట్రీ బాక్స్‌ తదితర వస్తువులు తీసుకెళ్ళేట్లు చూడాలి. ఒకటికి రెండు పెన్సిల్స్‌, పెన్నులు ఇచ్చి పంపించాలి. ప్రశ్న పత్రం ఎలా చదవాలో ఎలా మొదలు పెట్టాలో ఏదైనా జవాబు గుర్తుకు రాకపోతే ఏం చేయాలో? ముందే వివరించాలి. ఇదే సమయంలో గత ఎగ్జామ్స్‌లో సాధించిన విజయాలు గుర్తుకు తెస్తూ ఈ పరీక్షా బాగా రాయగలరని ప్రోత్సహించాలి. ఒక పరీక్ష పూర్తయిన తరవాత దానిలో ఎన్ని మార్కులు వస్తాయో పిల్లలు ఇంటికి రాగానే చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. దాని వల్ల ఒక పరీక్ష బాగా రాయలేకపోతే దాని ప్రభావం మరో పరీక్షపై పడే అవకాశముంది. అందువల్ల పరీక్ష ప్రస్తావన పదే పదే చేయకపోవడం మంచిది. పరీక్షలనేవి చదువులో భాగమే తప్ప పరీక్షలే జీవిత లక్ష్యం కాదు. అనుభవజ్ఞులైన పెద్దలకు ఈ విషయం తెలియనిది కాదు. అయితే ఇదే పరిపూర్ణతను పిల్లల పరీక్షల విషయంలో ప్రదర్శించాలి. అంతే తప్ప ఆత్రుత ప్రదర్శించి పిల్లల ప్రతిభను తగ్గించవద్దు.
ఒత్తిడి
కొంతమంది పిల్లలు పరీక్షల ముందు ఒక విధమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. బాగా చదివే పిల్లలు కూడా అనవసరమైన అనుమానాలు పెంచుకుని పరీక్షల ముందు డల్‌గా అయిపోతారు. దీన్నే ' ప్రి ఎగ్జామ్‌ స్ట్రెస్‌' అనవచ్చు.
మంచిగా చదివే పిల్లలు కూడా ఎగ్జామ్స్‌ ముందు ఇలాంటి టెన్షన్‌కు గురవుతారని ఇటీవల ఒక సర్వేలో తేలింది. అనవసరమైన ఈ మానసిక ఒత్తిడి వల్ల విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశమున్నట్లు ఈ సర్వే తేల్చింది. పరీక్షలు ఎలా రాస్తామో? అనే అనవసరమైన ఆందోళన వల్ల సరిగా రాయకపోవటం కూడా జరగవచ్చు. అలా జరిగినప్పుడు ఆశాభంగాన్ని తట్టుకోలేని పిల్లలు కొంతమంది ఆత్మహత్యకు తలపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి.
పిల్లలు ఇలా ఒత్తిడికి గురవకుండా పెద్దవారు జాగ్రత్త పడవచ్చు. అసలు పిల్లల 'స్ట్రెస్‌'కు పెద్దలే కారణమవుతారు కొన్నిసార్లు. తమ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వారి గురించి అతిగా ఆలోచిస్తూ అస్తమానం పరీక్షల గురించే జ్ఞాపకం చేస్తూ తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకొని, ర్యాంకులు తెచ్చుకోవాలంటూ హెచ్చరిస్తూంటారు. ఇవి ఎక్కువైనప్పుడు సహజంగానే పిల్లల్లో ఆందోళన పెరుగుతుంది. అందుకని పిల్లలను ఇలాంటి ఒత్తిడికి గురి చేయకుండా పెద్దలు జాగ్రత్త వహించాలి. పిల్లలు బాగా చదువుకోవాలనీ, గుర్తింపు పొందాలనీ, వృద్ధి చెందాలనీ కోరుకోవడంలో తప్పులేదు. అదే పనిగా ఒత్తిడి చేయడం మాత్రం కచ్చితంగా తప్పేనని గుర్తుంచుకోవాలి.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.....
పరీక్షల సమయంలో అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. పిల్లలు తమ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. రిలాక్స్‌ కావడానికి, తినడానికి, నిద్రపోవడానికి సమయాలు కేటాయించాలి. తదనుగుణంగా ప్రిపరేషన్‌ టైమ్‌ టేబుల్‌ వేసుకుని అన్నీ సరిగా అమరేటట్లు చూడాలి. ప్రిపరేషన్‌ సమయంలో 'పాజిటివ్‌' ఆలోచనలు కలిగే వాతావరణాన్ని కల్పించాలి. చదువు విషయంలో వారికి ఇలాంటి భావాలే కలిగేటట్లు ప్రవర్తించాలి. వేళకు తిండి తినకపోయినా, రాత్రిళ్ళు నిద్రపోకపోయినా శారీరకంగానూ, మానసికంగానూ అలసి పోయి చదువుపై ఆసక్తి తగ్గుతుంది. శ్రద్ధ తగ్గాక చదివేది అర్థం కాదు. దానితో జవాబులను బట్టీ వేయాలని చూస్తారు. ఇక సమస్యలు ప్రారంభమవుతాయి. ఇది గమనించి వారికి తిండి, నిద్ర సక్రమంగా లభించేట్లు చూడాలి.
కంటిన్యూగా మూడు, నాలుగు గంటలు చదివే కన్నా గంట చదివి 10 నిమిషాలు రిలాక్స్‌ అవడం మంచిది. దానివల్ల 'ఫ్రెష్‌నెస్‌' కలిగి చదివింది తొందరగా బోధపడుతుంది. అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తే 'ఫ్రెష్‌'గా పరీక్షలు రాయవచ్చు.
ఇలా చదవండి...
పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు చదువుకుంటూ వెళ్ళే కన్నా విషయంపై అవగాహన పెంచుకుంటూ చదివితే ఫలితముంటుంది. అంటే చదివే పాఠం గురించి ముందు స్థూలంగా అర్థం చేసుకోండి. అందులో ఏయే విషయాలను చెప్పారో తెలుసుకోవాలి. ఉదాహరణకు భూకంపాల గురించి ఒక పాఠం ఉందనుకుంటే దానిలో భూకంపం అంటే ఏమిటి? అవి ఎందుకు వస్తాయి? వాటిని ఎలా కొలుస్తారు? వంటి వివరాలుంటాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే భూమి గురించి కూడా కొన్ని వివరాలనిస్తారు. ఈ పాఠాన్ని చదివే ముందు ఈ విషయాలను సీక్వెన్స్‌లో పెట్టుకుంటే చదివింది కూడా 'ఈజీ'గా అర్థమవుతుంది. పరీక్షల్లో రాయడానికి వీలుగా ఉంటుంది. ఒకసారి విషయం అర్థమయితే అది వ్యాసరూప ప్రశ్న అయినా, ఆబ్జెక్టివ్‌ అయినా కూడా జవాబులు స్పష్టంగా రాయవచ్చు.

ఇలా చదవడం అయ్యాక... విషయం అర్థమయినాక ఓసారి పరీక్షా పత్రం మోడల్‌ పేపర్‌ను చూడండి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయి? జవాబులు ఏ విధంగా రాయాలి? అనేది తెలుసుకుని ఆ విధంగా అర్థమయిన సబ్జెక్టును స్థూలంగా 'ఎరేంజ్‌' చేసుకుంటే సబ్జెక్టుపై 'గ్రిప్‌' వస్తుంది. ఇదయ్యాక ఓసారి మీకై మీరే లేదా తల్లిదండ్రుల సహాయంతో ప్రశ్నలను రాసుకుని ఒక ప్రశ్నాపత్రాన్ని సొంతంగా తయారు చేసుకోండి. దానికి జవాబులు రాయడం 'ప్రాక్టీసు' చేయండి. చదవడం ఎంత ముఖ్యమో, రాయడం కూడా అంతే ముఖ్యం. ఇలా రాయడం వల్ల లోపాలు తెలుస్తాయి. రానిది ఉంటే మళ్ళీ చదువుకునే అవకాశముంటుంది. పరీక్ష హాల్లో కెళ్ళాక జవాబుల కోసం 'తడుముకు'నే అవసరముండదు. రాయడం కూడా ప్రిపరేషన్‌లో భాగమేనని గుర్తుంచుకోండి. సమయాన్ని బట్టి ఒకటి రెండు సార్లు రివిజన్‌ చేసుకుంటే ఎలాంటి కంగారు, భయం లేకుండా సాఫీగా పరీక్షలను రాయవచ్చు. అనుకున్న మార్కులు సంపాదించుకోవచ్చు.
- ఆల్‌ ది బెస్ట్‌...

Wednesday, 28 March 2012

గోవుమాలక్ష్మికి కోటి దండాలు


నిన్నటి తరం చదువులు చదివిన వారెవరైనా, ‘ఆవు వ్యాసం’ రాకుండా స్కూలు దాటి హైస్కూలు గడప తొక్కివుండరు. ‘నాలుగు కాళ్లు, రెండు కొమ్ములు వుండును..పాలు ఇచ్చును..’ఇలా. ఆవుకు హిందూ సంస్కృతిలోనే కాదు, భారతీయ జన జీవనంలో అద్భుతమైన ప్రాముఖ్యత వుంది. అందుకే చిన్నతనంలోనే ఆవుగురించిన నాలుగు మంచి మాటలు నేర్పాయి నిన్నటి చదువులు. నేటి ‘కేజీ’ల బరువు విద్యకు మాత్రం ‘సి-్ఫర్ కౌ’ అని కూడా మిగల్లేదు..‘సీ- ఫర్ క్యాట్’ అనే తెలుసు.
సరే ఆవు వ్యాసం మర్చిపోవడం అలా వుంచితే, ఆవును, ఆవు పాల గుణగణాల్ని, ఆవు మానవాళికి అందించే మేలును కూడా మర్చిపోవడం మరో బాధామయ సంగతి. ఇంతకు మించి, ఆవును కేవలం పాలిచ్చే జంతువుగా చూసి, దాన్ని పరిశోధనలతో హింసించి, ఆఖరికి, రోజుకు వీలైనన్ని ఎక్కువ లీటర్ల పాలిచ్చే హైబ్రీడ్, జెర్సీ రకాల ఉత్పాదన దిశగా మానవాళి తెలివి తేటలు పయనించాయే తప్ప, మరో విధంగా కాదు. అయితే మన ప్రాచీన ఆయుర్వేద గ్రంధాల్లో పేర్కొన్న ఆవు పాలు, ఇతర పదార్ధాల ఔషధ గుణాలన్నీ ఈ హైబ్రీడ్ ఆవుల ద్వారా సాధ్యం కాదన్న సంగతిని కూడా ఈ సందర్భంలో విస్మరించారు.
ఎరువుల తిండిపై మొగం మొత్తి, అందులో అరుచి, ఆనారోగ్యం తప్ప మరేమీ లేదని, ఆర్గానిక్ పదార్ధాల వైపు జనం ఎలా మళ్లుతున్నారో, అలాగే హైబ్రీడ్ ఆవుపాల (ఎ-1రకం) వెంట కాకుండా, దేశీ ఆవు పాల వైపు(ఎ-2రకం), వాటి మంచి చెడ్డల వైపు జనం దృష్టిని మళ్లించే ఉద్ధేశంతో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో మూడు రోజుల ప్రదర్శన ఒకటి బుధవారం ప్రారంభమైంది. చరక డెయరీ, డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల తదితర సంస్థల సారథ్యంలో ఈ ప్రదర్శన ప్రారంభమైంది.
మన దేశంలో ఆవుల జాతులు చాలా రకాలే వుండేవి. కానీ రాను రాను ఆ సంఖ్య చిక్కిపోతోంది. ఇప్పుడు అది కేవలం మూడు పదుల లోపు సంఖ్యకు చేరుకుంది. వీటిలో వీలయినన్నింటిని ఈ ప్రదర్శనలో వుంచారు. ముఖ్యంగా ఏడు రకాల ఆవుల చుట్టూ ఒకేసారి ప్రదక్షిణ చేస్తే, మంచిదన్న హిందూ విశ్వాసాన్ని దృష్టిలో వుంచుకుని, ఇక్కడ ఓ చిన్న శాలలో ఏడు ఆవులను వుంచారు. అలాగే ఆవు, ఆవు పంచకం, ఆవు పాలు తదితర విశేషాలతో కూడిన వివిధ స్టాల్స్‌ను ఏర్పాటు చేసారు. ఆవుకు సంబంధించిన విశేషాలతో కూడిన సెమినార్‌లు నిర్వహిస్తున్నారు. వివిధ రుగ్మతలకు ఆవు పదార్ధాలు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది ఇక్కడ వివరిస్తున్నారు. ఇన్ని విశేషాలతో కూడిన ఈ ప్రదర్శన కేవలం మూడు రోజులు అంటే 30వ తేదీ వరకు మాత్రమే వుంటుంది.
- హిమజశ్రీనివాస్

‘ఫైవ్ స్టార్’ స్కూళ్లు అవసరమా?


పాతిక ఎకరాల సువిశాల ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక భవన సముదాయం.. భూకంపం వచ్చినా ప్రమాదం లేని గదులు, రోబోటిక్స్, కంప్యూటర్స్, లాంగ్వేజి ల్యాబ్‌లు.. ఫైర్ సేఫ్టీ, కేబుల్ టీవీ, ఎ.సి. సౌకర్యం, సిసి టీవీలతో నిరంతర నిఘా, ఎకోపార్క్, సైన్స్‌పార్క్, జిమ్, స్కేటింగ్ మైదానం, వాకింగ్ ట్రాక్, హైస్పీడ్ ఇంటర్నెట్, ఆడియో వీడియో గదులు.. ఈ జాబితా చదువుతుంటే ఇదేదో ఫైవ్‌స్టార్ హోటళ్లలో సమకూర్చే సదుపాయాల గురించి అనుకుంటే ‘తప్పు’లో కాలేసినట్లే. అంతం లేని ఈ చాంతాడు జాబితా ‘ఫైవ్‌స్టార్’ స్కూళ్లకు సంబంధించినది. రియల్ ఎస్టేట్ సంస్థలు, విలాసవంతమైన హోటళ్ల మాదిరి ఖరీదైన బ్రోచర్లను పంపిణీ చేస్తూ ఫైవ్‌స్టార్ స్కూళ్లు విద్యను ఇప్పటికే మార్కెట్ సరకుగా మార్చేశాయి. ‘ఈ హైటెక్ హంగులన్నీ మీ పిల్లల బంగారు భవిష్యత్‌కు కోసమే..’-అంటూ ఫైవ్‌స్టార్ పాఠశాలలు ఏటా అడ్మిషన్ల సీజన్‌లో భారీ హోర్డింగ్‌లు పెట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రచారానికి తగ్గట్టే ఇవి సంపన్న వర్గాలకే అందుబాటులో ఉంటున్నాయి. అయితే, ఇలాంటి పాఠశాలల్లో అడ్మిషన్ పొందితేనే తమ పిల్లలు బాగా రాణిస్తారని మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ అవస్థల పాలవుతున్నారు. ఎంత బాగా ఖర్చు చేస్తే పిల్లలు అంత బాగా చదువుతారనే భావనను వ్యాప్తి చేస్తున్న ఫైవ్‌స్టార్ పాఠశాలలు దండిగానే లాభాలను ఆర్జిస్తున్నాయి. హైటెక్ సౌకర్యాల గురించి గొప్పలు చెప్పే ఈ పాఠశాలల యాజమాన్యాలు విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, పిల్లల్లో ఆత్మవిశ్వాసం వంటి పదాల జోలికి వెళ్లకపోవడం మనకు విడ్డూరంగానే కనిపిస్తుంది. పిల్లల్ని సున్నితమైన బొమ్మలుగా, టెక్నాలజీకి బానిసలుగా మార్చడం తప్ప ఫైవ్‌స్టార్ స్కూళ్లలో సహజత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, మానవ సంబంధాలు, పిల్లల మానసిక సామర్థ్యం వంటివి కనిపించడం లేదన్న ఆరోపణలున్నాయి.
పాఠశాలల్లో పరిశుభ్రత, ప్రాథమిక సౌకర్యాలు అవసరమే అయినప్పటికీ లక్షలకు లక్షలకు వెచ్చించి హోటళ్లలో మాదిరి విలాసవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయనక్కర్లేదని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. అవసరం లేని ఆర్భాటాలు, హైటెక్ హంగులతో విద్యాబోధన మెరుగుపడుతుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఖరీదైన భవంతులు, కళ్లు చెదిరే హంగులు మంచి విద్యాప్రమాణాలకు భరోసా ఇస్తాయా? అన్న అనుమానాలు లేకపోలేదు.
గురుకుల పాఠశాలల సంస్కృతి పూర్వం భారతీయ సమాజంలో ఉండేది. గురుశిష్యుల మధ్య మంచి సంబంధాలు, క్రమశిక్షణ, వ్యక్తిగత శ్రద్ధ, పిల్లల్లో అన్యోన్యత, సమానభావం వంటివి అలనాడు కనిపించేవి. కాలగమనంలో విద్యావ్యవస్థలోనూ అనూహ్యమైన మార్పుల ఫలితంగా కార్పొరేట్
స్కూళ్లు తెరపైకి వచ్చాయి. అయితే, నేటికీ దేశంలో అధికశాతం విద్యాసంస్థలు ప్రభుత్వరంగంలోనే నడుస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకూ విద్యారంగాన్ని పాలకులు దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్నందున ప్రైవేటు సంస్థలకు గిరాకీ పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదివితే పరువు తక్కువ అన్న భావం నెలకొనేలా పరిస్థితులు మారిపోయాయి. తల తాకట్టు పెట్టయినా కానె్వంట్లు, టెక్నో స్కూళ్లు, కార్పొరేట్ కళాశాలల్లో పిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రులు తపన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫైవ్‌స్టార్ స్కూళ్లు ఆవిర్భవించాయి. తరగతి గదులను హోటళ్ల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఈ స్కూళ్లకే దక్కింది. ‘డబ్బుతోనే హోదా’ అనే భావాన్ని ఇవి పిల్లల్లో బలంగా నాటుతున్నాయి. గురువులపై, పెద్దలపై అంతగా గౌరవం లేకపోవడం, తామే అధికులమన్న భావం వంటివి ఇక్కడి పిల్లల్లో కనిపిస్తుంటాయన్న విమర్శలు లేకపోలేదు. సంస్కృతి, క్రమశిక్షణ, ప్రమాణాలు, వ్యక్తిత్వ నిర్మాణం వంటి విషయాలకు ఇవి ప్రాధాన్యం ఇవ్వకపోతే విద్యార్థులు మంచి పౌరులుగా రాణించలేరన్న విమర్శలున్నాయి. ‘ఎక్కువ ఫీజులు చెల్లిస్తేనే ఎక్కువ లాభం’ అన్న భావన తల్లిదండ్రుల్లో నాటుకు పోవడంతో ఈ స్కూళ్ల హవా కొనసాగుతోంది.
ఫైవ్‌స్టార్ హోటళ్ల సంస్కృతి ప్రభావం విద్యారంగంపై పడడం మంచి పరిణామం కాదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. విద్యా సంస్థల మధ్య పోటీ వాతావరణం పెచ్చుమీరడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రమాణాల విషయానికి పోకుండా ‘హైటెక్ హంగుల’పైనే ఆధారపడాలనుకోవడం వాంఛనీయం కాదంటున్నారు. విలాసవంతమైన వాతావరణంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దేశంలో అధికశాతం ఉన్న పేదవర్గాల విద్యార్థుల ఉన్నతికి ఈ సంస్థలు ఎలాంటి చొరవ చూపడం లేదని, తల్లిదండ్రులు కూడా ఈ పరిణామాలను పరిశీలించి తగిన పాఠశాలలను ఎన్నుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యారంగం ‘బతకడానికి’ కాదని, బతుకుల్ని మార్చడానికి అని గుర్తించాలని వారు అంటున్నారు.

పళ్లు తోమేటప్పుడు దిక్కు పాటించాలా?


  • అశాస్త్రీయ ఆచారాలు 2
సుబ్బారావు! వచ్చి ఎంతసేపయింది?' చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి అడిగాను.
'చాలాసేపైంది. వచ్చినవాళ్లనీ గమనించ కుండా ఏమిటంత దీక్షగా చదువుతున్నావ్‌?' అడిగాడు సుబ్బారావు.
'తాళపత్రం' అని ఒక పుస్తకం. దీంట్లో మన ఆచారాలకు సంబం ధించి అర్థంపర్థంలేని వివరణ ఇస్తున్నారు. నీకూ ఒకటి రెండు చెప్పమంటావా?'
'చెప్పు.'
'పళ్లు తోముకునేప్పుడు తూర్పు వైపుకుగానీ, ఈశాన్యం వైపుకుగానీ తిరిగి కడుక్కోవాలట. కారణం ఈ దిశలు కామదేవుడికి, మరియు వనస్పతికి చెందిన వట. రోజు ప్రారంభం ఈ దిశల్లో ఉంటే ఆయా దేవత ల కటాక్షం కలుగుతుందట!'
'మంచిదేగా!' అన్నాడు సుబ్బారావు యథాలాపంగా.
'నాదో చిన్నప్రశ్న. తూర్పు వైపు తిరిగి పళ్లు తోమేట ప్పుడు ఉమ్మేది ఏవైపుకు?' నవ్వుతూ అడిగాను.
సుబ్బారావుకు నా ప్రశ్న అర్థమైంది.
'తూర్పువైపు తిరిగి ఉమ్మితే సూర్యుడికి కోపం వస్తుందిగానీ మనకు కటాక్షం కలగదు గదా?' అన్నాడు నవ్వుతూ సుబ్బారావే.
'అలాగే ఈశాన్యంవైపు ఉమ్మినా ఆ దిక్కు దేవుడికి కోపం వస్తుంది గదా?' అడిగాను.
'అవునవును' అన్నాడు మరలా నవ్వుతూ.
'కాబట్టి, ఏ దిక్కు మొహంపెట్టి పళ్లు తోము కుంటే ఆదిక్కు దేవుడికి కోపం వస్తుంది'.
'మరేం చేయాలంటావు?'
'సుబ్బారావు! ప్రతి చిన్న దినచర్యకూ ఏవో కొన్ని గీతలు గీసి, ఆ గీతల మధ్యే నడవాల నడం దానికి వివరణగా ఏదో ఒక దేవుడికి కోపం వస్తుందని భయపెట్టడం, మనల్ని వారు గీచిన గీతల్లో బంధించే మోసపుచర్య. దాన్ని అర్థంచేసుకో. ఎటుతిరిగి పళ్లు తోము కున్నా, ఏవైపు ఎంగిలినీళ్లు పారబోసినా, ఎటుపక్కన గోళ్లు విసిరివేసినా, దానివల్ల మనకు కలిగే లాభనష్టాలకూ ఏ సంబంధం లేదు. అలాంటి సంబంధం నిరూపిం చబడలేదు. కాబట్టి అలాంటివి నమ్మనవసరం లేదు. ఆచరించ నవసరమూ లేదు..' అన్నాను.
'అవునవును' అన్నాడు సుబ్బారావు.
'వీళ్ళు ఇచ్చే అసంబద్ధ, అశాస్త్రీయ వివరణలకు ''సైన్సు అంగీ కరించింది'' అనే తోకను ఎక్కువగా జోడిస్తున్నారు. కావాలంటే ఈ విషయం పరిశీలించు.
'మన పూర్వులు గమ నించినదేమిటంటే అస్తమించే సూర్యుడు, ఉదయించే సూర్యుడంతటి శక్తి కలవాడు కాదని, ఈ వాస్తవాన్ని సాయంత్రం ఆకాశం సూర్యుని దిక్కు ఎర్రబడి ఉండటం ద్వారా నిరూపితపరచినారు. ఆధునిక శాస్త్రం సైతం ఈ విషయాన్ని అంగీ కరించింది' అని రాశారు.
'ఏ ఆధునిక సైన్సూ ఉదయిస్తున్న సూర్యుడి శక్తికీ, సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడి శక్తికీ, సైజుకీ, వెలుగుకీ తేడాలున్నాయని ఎక్కడా చెప్పలేదు. ఇలా రాయడం ఆధునిక సైన్సును వక్రీకరించడమే' అన్నాను.
'నీవన్నది నిజం నిజం' అన్నాడు సుబ్బారావు కవితా ధోరణిలో.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

సైన్స్‌ ముందా? మూఢనమ్మకాలు ముందా?


సైన్సు ముందా? లేక మూఢనమ్మకాలు ముందా? - ఓ. నవ్య, ఇంటర్మీడియట్‌, శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల, విజయవాడ
ఆదిమ మానవుడికి, పాతకాలం ప్రజలకు సైన్సు తెలీదు కాబట్టి వాళ్లు నమ్మిన వాటిల్లో చాలామటుకు నేటి సైన్సు సూత్రాలకు విరుద్ధంగా ఉన్నట్టు ఋజువైంది కాబట్టి, అలాంటివన్నీ మూఢనమ్మకాలనుకొంటే, మూఢ నమ్మకాలే ముందు ఆ తర్వాతే సైన్సు అనుకోవడానికి ఆస్కారముంది. లేదా మనిషికే తెలివితేటలు, పరిశీలించే గుణం, ప్రశ్నించేతత్వం ఉన్నాయి కాబట్టి, ఏ ఆధారమూ లేకుండా ఏ నమ్మకాన్నీ ఏర్పర్చుకోడు కాబట్టి సైన్సు (విజ్ఞానం లేదా జ్ఞానం) ముందు, ఆ తర్వాతే మూఢనమ్మకాలని కూడా భావించే అవకాశమూ ఉంది. నిజానికి ఈ రెండు వాదనలూ సరికావు. ఇందులో ఏదో ఒక వాదమే కరెక్టు అనుకుంటే అదే పెద్ద మూఢనమ్మకం అవుతుంది. ఈ ప్రశ్న 'విత్తు ముందా, చెట్టు ముందా' అన్న మీమాంసకు చెందింది కాదు. ఆ విషయంలో విత్తే ముందు అని తేల్చుకున్నాం. అలాగే 'గుడ్డు ముందా, పక్షి ముందా' అన్న ప్రశ్న కోవలో కూడా ఈ ప్రశ్న చేరదు. ఎందుకంటే పక్షి కన్నా గుడ్డే ముందని తెల్సుకున్నాం.

కానీ 'విజ్ఞానశాస్త్రం ముందా? లేక మూఢనమ్మకాలు ముందా?' అన్న ప్రశ్నలో మీమాంస అటోయిటో తేలేదికాదు. మానవ చరిత్రలో నేటివరకూ ఈ రెండు విషయాలు దాదాపు సమాంతరంగా నడిచాయి. నేటికీ నడుస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు నా తలలో మెదడున్నట్టు నేను విశ్వసిస్తున్నాను. దాన్ని ఋజువు చేసుకోవడానికి నేను తలను బద్దలు కొట్టుకొని మెదడు ఉందా, లేదా అని మొండివాదన చేయను. తలలు పగిలి చనిపోయిన వారి తలల్లో మెదడు ఉన్నట్టు, శవాలను వైద్యకళాశాలల్లో శస్త్ర పరీక్ష (dissection) చేసేపుడు ఆ మనుషుల తలల్లో మెదడు ఉన్నట్టు నేను చూశాను. కాబట్టి నా తలలో కూడా మెదడు ఉన్నట్టు నేను నమ్ముతున్నాను. ఇది శాస్త్ర పరిజ్ఞానం.

బిగ్‌బ్యాంగ్‌కు ముందర విశ్వం లేనేలేదని వాదించే వారున్నారు. ఏ ఆధారం లేకుండా ఏర్పర్చుకొనే అభిప్రాయాలను నమ్మకాలు లేదా విశ్వాసాలు అంటాం. సరైన శాస్త్రీయ ఆధారం ప్రాతిపదికన ఏర్పర్చుకొనే నమ్మకాలను, విశ్వాసాలను శాస్త్ర పరిజ్ఞానం (scientific knowledge) అంటాం. రుజువైన శాస్త్ర పరిజ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాల్ని మాత్రమే మూఢనమ్మకాలు అనాలి. ఒక నమ్మకాన్ని మూఢనమ్మకమని తేల్చేందుకు ఋజువు లేనంతవరకూ దాన్ని నమ్మకంగానే గౌరవించాలి. బిగ్‌బ్యాంగ్‌కు ముందర కూడా విశ్వం మరో గుణంలో ఉందని భావించే వారూ ఉన్నారు. ఇందులో ఎవరిదీ మూఢనమ్మకం కాదు. ఉదాహరణకు 16వ శతాబ్దంలో గెలీలియో ప్రయోగం ద్వారా ఋజువు చేయనంతవరకూ ఓ పెద్ద రాయిని, ఓ చిన్న రాయిని కొంత ఎత్తు నుంచి ఒకేసారి వదిలితే పెద్దరాయే ముందు పడుతుందనేది అప్పటి ప్రజల్లో ఉన్న నమ్మకం.

అంతేగానీ మూఢనమ్మకం కాదు. కానీ గెలీలియో ప్రయోగపూర్వకంగా పెద్దరాయి, చిన్నరాయి ఒకేసారి కిందపడతాయని ఋజువు చేశాక (16వ శతాబ్దంలో ఆ ప్రయోగానంతర చరిత్రకాలంలో) కూడా ఎవరైనా పెద్దరాయే ముందు పడుతుందని నమ్మితే అది మూఢనమ్మకం అవుతుంది. ఇనుమును, బొగ్గును, పాదరసాన్ని బంగారంగా మార్చవచ్చని రసవాదులు (Alchemists) విఫల ప్రయత్నాలు చేశారు. ఆనాడు మూలకాలు, సంయోగ పదార్థాలు, లవణాలు, పరమాణువులు, పరమాణు కేంద్రకం, చర్యలలో శక్తి ప్రమేయం తదితర విషయాలు తెలీవు. కాబట్టి, వారి ప్రయత్నాలను మూఢనమ్మకాలు అనకూడదు. కేవలం నమ్మకాలనే అనాలి. కానీ నేడు ఉడకబెట్టి, లేదా రోట్లో దంచి, లేదా ఎండలో ఆరబెట్టి ఇనుమును బంగారంగా మార్చడానికి ఎవరయినా ప్రయత్నిస్తే అది మూఢనమ్మకం అవుతుంది. ఎందుకంటే ఇనుము, బంగారం వేర్వేరు మూలకాలనీ (elements) వాటిని పరస్పర వినిమయం (mutually converted) గా చేయాలంటే కేంద్రక చర్యలే (Nuclear processes) శరణ్యం అనీ, ఆ చర్యలు సాధారణ పరిస్థితుల్లో వీలుకాదనీ ఋజువైంది. నేడు పదార్థాన్ని శూన్యం నుంచి సృష్టించలేమని ఋజువైంది. కానీ బాబాలు శివలింగాల్ని తీస్తారని నమ్మడం మూఢనమ్మకమే.

నక్షత్రరాశులు శరవేగంతో కదుల్తూ ఉన్నాయి. వాటి ప్రభావం బిడ్డల మీద ఆవగింజలో అరవై కోట్ల కోట్ల వంతు కూడా లేదని సైన్సు ఋజువు చేసింది. కానీ జ్యోతిశ్శాస్త్రాన్ని ఇంకా నమ్మేవాళ్ల నమ్మకం మూఢనమ్మకం. కాలానికి రంగు, రుచి, వాసన లేదు. అన్ని సెకన్లు ఒకేతీరుగా ఉన్నాయని ఋజువైంది. కానీ ఇది మంచికాలం, అది దుర్ముహూర్తం, ఇది వర్జ్యం, అది రాహూకాలం వంటి నమ్మకాలను మూఢనమ్మకాలుగా పరిగణించాలి. ఇలా ఋజువైన ఆయా సమకాలీన శాస్త్ర సూత్రాలకు విరుద్ధంగా ఏర్పర్చుకున్న నమ్మకాలను మూఢనమ్మకాలని అంటారు. ఒక నమ్మకాన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేయాలంటే అది ఎందుకు మూఢత్వమో తెలియజేసే ప్రాతిపదిక (yardstick or basis)ఉండాలి. సైన్సే ఓ గొప్ప ప్రాతిపదిక. అయితే ''నేటి సైన్సు సూత్రాలు రేపు మారవచ్చు కదా! ఇప్పుడు సైన్సు సూత్రాలకు విరుద్ధంగా నా నమ్మకం ఉన్నంత మాత్రాన నా నమ్మకాన్ని మూఢనమ్మకంగా ఎలా కొట్టి వేస్తారు మీరు?'' అని ఎవరైనా వాదించవచ్చు. అయినా సరే, ఆయా కాలాల్లో ప్రస్ఫుటమైన ప్రాయోగిక పద్ధతులతో మేళవించిన సైన్సుకు వ్యతిరేకంగా ఉన్న నమ్మకాలు ఆయా కాలాల్లో మూఢనమ్మకాలే అవుతాయి. 'అలా కాకుండా ఎవరి నమ్మకం వారిది' అని మూఢనమ్మకాల్ని ఆమోదిస్తే అది ప్రగతికి వ్యతిరేకం. సామాజిక గమనానికి అలాంటి స్వేచ్ఛా (మూఢ) నమ్మకాలు ప్రతిబంధకాలవుతాయి. మూఢనమ్మకాలను సమాజం నుంచి వేరు చేయాల్సిందే.

సైన్సును సాధించిందీ మానవుడే. మూఢనమ్మకాలూ మానవుడివే. జంతువులకు సైన్సు లేదు. మూఢనమ్మకాలూ లేవు. సైన్సును, నిజజీవితాన్ని మేళవింపు చేసుకోనంత వరకూ మూఢనమ్మకాలూ, సైన్సు సమాంతరంగా నడిచాయి. నడుస్తున్నాయి. ఒకటి ముందు, ఒకటి తరువాత అన్న ధోరణి లేదింతవరకు. అలా సమాంతరంగా, పరస్పర వైరుధ్యాలతో అవి నడిచేలా చేసే వ్యవస్థనే మనం దోపిడీవ్యవస్థ అంటున్నాం. కానీ, ప్రతి నమ్మకాన్నీ సైన్సు అనే అద్దంలో చూసుకొంటూ బేరీజు వేసుకొని ఎప్పటికపుడు నమ్మకాల చుట్టూ మూఢత్వం పేరుకోకుండా చూసుకొనే సమాజంలోనే నమ్మకాల స్థానంలో సైన్స్‌ ఉంటుంది. అదే సమసమాజం, వర్గరహిత సమాజం. సైన్సు వేరుగా, నమ్మకాలు వేరుగా ఉండవు. ఒకటి ముందు ఒకటి తర్వాత అన్న సమస్య కూడా తలెత్తదు.

కనుమరుగు కానున్న కొన్నిపక్షులు!


మానవ అనాలోచిత చర్యలు, స్వార్థ అభివృద్ధి కార్యక్రమాలూ అనేక జీవ జాతుల్ని పొట్టనబెట్టు కుంటున్నాయి. తాజాగా, అటువంటి మరో ఘాతుకం వెలుగు చూసింది. మన దేశంలో కనీసం 14 పక్షి జాతులు అంతరించిపోయే దిశలో ఉన్నట్టు ఏకంగా పర్యావరణ, అటవీ అమాత్యుల వారే చెప్పారు. ఈ దారుణానికి కారణం క్రిమి నాశకాల మందుల్ని అతిగా వాడటం. వేట, సహజ ఆవాసాల క్షీణత కూడా దీనికి కారణాలని సెలవిచ్చారు. ఇలా అంతరించిపోగల పక్షి జాతుల్లో గుడ్లగూబ నుండి రాబందు వరకూ, మొత్తం పద్నాలుగు రకాలు ఉన్నట్లు తెలిసింది. అయితే, వీటిలో మన జాతీయపక్షి మాత్రం లేదు.

జన్యుమార్పిడి పంటలు ... సామాజక కోణం...


కంపెనీ, ప్రభుత్వ సమాచారం ప్రకారం బిటి పత్తి సాంకేతికం ఇటీవల ఫలవంతమైన సాంకేతికాల్లో ఒకటి. కాయ తొలుచు పురుగు నివారణకు ఏ మందులూ వాడాల్సిన పనిలేదని, అధిక దిగుబడి వస్తుందనే లక్ష్యంతో దీని సేద్యానికి 2002, మార్చి 26న అనుమతివ్వబడింది. దీంతో బిటి సాంకేతికానికి దశాబ్దకాల అనుభవం. అయినా, 2004-05 నాటికి పత్తిలో దీని విస్తీర్ణం 5.6 శాతం మాత్రమే. ఆ తర్వాత ఇది వేగంగా విస్తరించి, 2011-12 నాటికి 90 శాతానికి చేరింది. కానీ, ఇదే జన్యువులు కలిగిన బిటి వంగ సేద్యానికి ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా ఇది సురక్షితమని తేలేంతవరకూ అనుమతి నిరవధికంగా వాయిదాపడింది. దీంతో దాదాపు 20కి పైగా ఇతర ఆహార పంటల్లో ఈ సాంకేతికంతో రూపొందించిన కొత్తరకాల విడుదలకు అన్నీ సిద్ధమై ఆగిపోయాయి. కంపెనీ, ప్రభుత్వం చెప్తున్నట్లుగా బిటి పత్తి సఫలమైతే, అదే జన్యువుల్ని కలిగిన బిటి వంగ పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందనేది ఆలోచించా ల్సిన అంశం. పెరుగుతున్న ఆహార, ఇతర వ్యవసాయోత్పత్తుల అవసరాలని తీర్చుకోవాలంటే జన్యుమార్పిడి పంటలు మినహా మరో గత్యంతరం లేదని, అందువల్ల బిటి వంగను వ్యతిరేకిస్తున్న వారిని ఆధునిక సాంకేతిక వ్యతిరేకులుగా, అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తున్నారు. ఫలితంగా రైతులకు, దేశానికి ఎంతో నష్టం కలిగిస్తున్నారని ముద్ర వేస్తున్నారు. ఈ వ్యతిరేకతకు సాంకేతిక కారణాలకన్నా, ఇతర కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనీ దుష్ప్రచారమూ చేస్తున్నారు. ఈ లోపల ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం (2011-12) పత్తి రైతుల ఆత్మహత్యలు ఒకేసారి పెరిగి, కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జన్యుమార్పిడి పంటల సాంకేతికంలో ఇమిడి వున్న సామాజిక కోణాలను 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
గత పదేళ్లుగా వాణిజ్యస్థాయిలో సేద్యమవుతున్న జన్యు మార్పిడి పంట బిటి పత్తి. దీనిలో 'బాసిల్లస్‌ తురింజినిసిస్‌' అనే బ్యాక్టీరియాకు సంబంధించిన జన్యువులను ప్రవేశపెట్టారు. ఫలి తంగా పత్తిలో ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన విషపదార్థం నిరంతరం ఉత్పత్తై వేరు సహా మొక్క అన్నిభాగాలకు విస్తరి స్తుంది. కాయలో ఉన్న ఈ విషపదార్థం కాయతొలుచు పురుగు లను నియంత్రిస్తుంది. ఇది ఈ సాంకేతికంలో ఇమిడి ఉన్న సిద్ధాంతం. ఈ సాంకేతికాన్ని 'అంతర్గత బిటి విష ఉత్పత్తి (ఎం డోటాక్సిన్‌) సాంకేతికం' గా వ్యవహరిస్తున్నారు. ఈ విషపదార్థం ప్రధానంగా సీతాకోకచిలుకకు సంబంధించిన లార్వాలను చంపుతుంది, నియంత్రిస్తుంది. ఈ జన్యువులను ఇప్పటికే 35 పంటల్లో ప్రవేశపెట్టారు. వీటిలో ఆహారపంటలు ముఖ్యమైనవి.
బిటి సాంకేతిక ప్రభావం..
ఈ సాంకేతికానికి స్వతహాగా అధిక దిగుబడి ఇచ్చే గుణం లేదు. 2002లో మొదట మహికో మోన్‌శాంటో కంపెనీకి చెంది న బిటి ఎంఇసిహెచ్‌-12, 162, 184 హైబ్రీడ్‌రకాలకు వాణిజ్యసేద్యానికి అనుమతిచ్చారు. ఈ రకాలు అప్పటికే సేద్యంలో ఉన్న హైబ్రీడ్‌లతో పోటీపడి, అధికదిగుబడిని ఇవ్వలేకపోయాయి. ఫలితంగా 2005లో వీటి అనుమతి రద్దు చేయబడింది. ఆ తర్వాత ఈ బిటి జన్యువులను అప్పటికే ప్రాచు ర్యం పొందిన బన్నీ, బ్రహ్మ వంటి హైబ్రీడ్‌లలో ప్రవేశపెట్టారు. దీని తర్వాత మాత్రమే ఈ సాంకేతికం ద్వారా రూపొందించిన కొత్త రకాలు అధిక దిగుబడిని తాత్కాలికంగానైనా ఇచ్చాయి. అంటే, బిటి హైబ్రీడ్‌ అధికదిగుబడి వచ్చిన సందర్భాలలో ఆయా హైబ్రీడ్‌ల అంతర్గత సామర్థ్యం వల్లనే కానీ, బిటి సాంకేతికం వల్ల కాదని నిర్ద్వందంగా నిరూపితమవుతుంది. ఇప్పుడు ఇలా 780 బిటి హైబ్రీడ్ల సేద్యానికి అనుమతి ఉంది. 2011-12 నాటికి సేద్యమవుతున్న మొత్తం 850 లక్షల ఎకరాల పత్తిలో 90 శాతం బిటి రకాలే సేద్యమవుతున్నాయి. వీటిలో కూడా ఒకే ఒక కంపెనీకి (మోన్‌శాంటో) చెందిన హైబ్రీడ్లు 85 శాతం మేర సేద్యమవుతున్నాయి.

బిటి సేద్యం తర్వాత పత్తి ఉత్పత్తి రెట్టింపుకు పైగా పెరిగింది. ఈ కాలంలో విస్తీర్ణం మూడున్నర రెట్లు పెరిగింది. మొత్తం హైబ్రీడ్‌ రకాలే వాడుతున్నారు. ఎరువుల వినియోగం పెరిగింది. సాగునీటి విస్తీర్ణమూ పెరిగింది. ఉత్పత్తి పెరుగు దలకు ఇవన్నీ కారణాలే. కానీ, మోన్‌శాంటో కంపెనీ మాత్రం పెరిగిన ఉత్పత్తంతా తన సాంకేతికం వల్లనేనని తప్పుడు ప్రచారం చేస్తోంది. రైతులకు రూ.31,500 కోట్లు అదనపు ఆదాయం వచ్చినట్లు ప్రచారం చేస్తోంది. రైతులకు ఇంత అదనపు ఆదాయం వస్తే వారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది? ఇటీవల పెరిగి, కొనసాగుతున్న పత్తి రైతుల ఆత్మహత్యలకు కంపెనీ ఏమీ జవాబు చెప్పడం లేదు. తప్పుడు ప్రచారాన్ని కంపెనీ తొలగించాలని అడ్వర్టయిజ్‌ మెంటల్‌ కౌన్సిల్‌ కూడా తీర్పు చెప్పింది.
వచ్చిన నేపథ్యం..
సంస్కరణలు, స్వేచ్ఛా వ్యాపారం నియంత్రణ చేయలేని లద్దె, పచ్చ పురుగుల వల్ల 1997లో పత్తి రైతులు వరంగల్‌- కరీంనగర్‌ జిల్లాల్లో బాగా నష్టపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ నేపథ్యంలో, పచ్చ పురుగుల్ని తట్టుకునే శక్తి ఉందంటూ బిటి పత్తి ప్రవేశపెట్టబడింది. అప్పట్లో సామాజిక కార్యకర్తలు, కొంతమంది శాస్త్రజ్ఞులు బిటి సాంకేతిక లోపాల్ని ఎత్తి చూపుతూ రాగల ప్రమాదాల్ని ముందే హెచ్చరించినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. మహికో బిటి హైబ్రీడ్‌లు విఫలమై, అప్పటికే ప్రాచుర్యం పొందిన బన్నీ, బ్రహ్మ వంటి హబ్రీడ్‌లలో బిటి జన్యువుల్ని పెట్టిన తర్వాత మాత్రమే ఇవి నిలదొక్కు కున్నాయి. ఇతర మెట్ట పైర్ల సంక్షోభ నేపథ్యంలో ధరలు కూడా ఇతర పంటల ధరలకన్నా ఆకర్షణీయంగా ఉండటంతో బిటి పత్తి సేద్యం వేగంగా విస్తరించింది.
అవాస్తవ ప్రచారం..
బిటి కొత్తగా ప్రవేశపెట్టినపుడు తన హైబ్రీడ్‌లను వాడితే కాయతొలుచు పురుగు నియంత్రణకు ఎటువంటి మందునూ వాడాల్సిన అవసరంలేదనీ, అధిక దిగుబడి వస్తుందనీ, ఖర్చు తక్కువవుతుందనీ ప్రచారం చేసింది. ఈ పదేళ్ల అనుభవంలో ఇవన్నీ అవాస్తవాలని ఋజువైనాయి. కొద్ది కాలంలోనే బోల్‌గార్డ్‌-1 కాయతొలుచు పురుగును తట్టుకొనే శక్తిని కోల్పోయింది. ఆ తర్వాత దీనిని కంపెనీ కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఇదే జన్యువులు కలిగిన బోల్‌గార్డ్‌-2 రకాన్ని విడుదల చేసింది. దీనిలో కూడా తట్టుకునే శక్తి వేగంగా వస్తుంది. పురుగు ఉధృతాన్ని గమనిస్తూ అవసరమనుకుంటే కాయతొలుచు పురుగు నియంత్రణకు మందుల్ని వాడాలని ఇపుడు కంపెనీయే సూచిస్తుంది. పిచికారీల (స్ప్రే) సంఖ్య మొదట తగ్గినా ఆ తర్వాత పెరిగాయి. ముఖ్యంగా రసం పీల్చు పురుగుల ఉధృతం పెరిగింది. వాటి ద్వారా వచ్చే తెగుళ్లూ ఎక్కువయ్యాయి. ఆకుముడత తెగులు బెడదగా మారింది. దీంతో పురుగుల మందు వినియోగం దాదాపు ముందు స్థాయికి పెరిగింది. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రకారం బిటి రకానికి 15 శాతం ఎరువుల్ని ఎక్కువగా వేయాలి. సాగునీటి అవసరమూ ఎక్కువే. బెట్టనూ ఏమాత్రం తట్టుకోలేదని రైతులు గ్రహించారు. మొదట దిగుబడి పెరిగినట్లు కనిపించినా ఆ తర్వాత దిగుబడి తగ్గిపోతూ ఉంది (వివరాలు వేరేచోట). అంతిమంగా, రైతులకు ఖర్చులూ పెరిగాయి. రిస్కూ పెరిగింది. తద్వారా కంపెనీ ప్రచారంలోని డొల్లతనం వెల్లడైంది.
ఆహారంలో..
వంగలో బిటి జన్యువుల్ని పెట్టారు. కోసే సమయంలో కాయలో బిటి విషం పురుగును చంపేస్థాయిలో ఉంటుంది. అదే కాయల్ని తిన్నప్పుడు విషం నేరుగా జీర్ణకోశంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం కాదని నిర్ద్వందంగా నిరూపించాల్సిన బాధ్యత కంపెనీదే. దీనికి అవసరమైన పరీక్షల్ని క్షుణ్ణంగా చేయకుండానే తనకున్న పలుకుబడితో బిటి వంగను వాణిజ్య సేద్యానికి అనుమతి పొందేందుకు యత్నించింది. దాదాపుగా సఫలమైంది. కానీ, ఇది ముందుగానే తెలుసుకొని మేల్కొన్న ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. రాష్ట్ర ప్రభు త్వాలూ వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో, ప్రజాభిప్రాయాన్ని సేకరించిన అప్పటి పర్యావరణ శాఖ కేంద్ర మంత్రి అవసరమైన పరీక్షలు పూర్తయ్యి, సురక్షితమని నిరూపించేవరకూ అనుమతిని నిరవధికంగా వాయిదా వేశారు. నేరుగా తినని బిటి పత్తి, తినే ఆహారం ఒకటే కాదని ప్రజలు గ్రహించారు. కానీ కంపెనీ, జనెటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రూవల్‌ కమిటీలు గుర్తించకపోవడం దేశ దౌర్భాగ్యం. ఈనాటికీ, శరీరంలో ప్రవేశించిన బిటి విషం ఎలాంటి ప్రభావాల్ని కలిగిస్తుందనేది నిర్దిష్టంగా నిరూపించే పరిశోధనలు చేయకుండానే బిటి వంగను వ్యతిరేకించిన వారంతా ఆధునిక సాంకేతిక వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. సంబంధిత కేంద్రమంత్రినీ వేరే శాఖకు మార్చి వేశారు. కారణాల్ని ఊహించడం కష్టం కాదు.
ఇతర జన్యుమార్పిడి పంటలు...
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇప్పుడు 50కి పైగా పంటల్లో జన్యుమార్పిడి పరిశోధనలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. వీటన్నింటిలో విదేశీ, బహుళజాతి సంస్థలే కీలకం. జాతీయ పరిశోధనా సంస్థల పాత్ర నామమాత్రపు స్థాయికి దిగజారింది.
బిటి సాంకేతిక సామర్థ్యంపై విమర్శ వచ్చినప్పుడల్లా పెరుగుతున్న ఆహార, వ్యవసాయోత్పత్తుల అవసరాల్ని తీర్చుకోవడానికి 'జన్యు మార్పిడి సాంకేతికం' అనివార్యమని బిటి సమర్థకులు ప్రచారం చేస్తున్నారు. ఈ కొత్త సాంకేతికం బెట్ట పరిస్థితులనూ, చవిటి నేల పరిస్థితులనూ తట్టుకోవడానికి, పోషకలోపాల్ని సరిదిద్దడానికి, ముఖ్యంగా విటమిన్‌ ఎ సరఫరాకు, ఇతర పోషకాల్ని సమర్థవంతంగా అందించడానికి అవసరమని చెప్తుంటారు. అంతర్గత విష తయారీ సాంకేతికపై వీరు నేరుగా చర్చించరు. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల కన్నా లేక అసలు పురుగు మందుల్నే నేరుగా వాడని పురుగు నియంత్రణ పద్ధతులకన్నా అంతర్గత విష తయారీ సాంకేతికం (ఎండో టాక్సిన్‌ ప్రొడక్షన్‌) సమర్ధవంతమైందని, సుస్థిరమైందని నిరూపించే ఏ ప్రయోగాల ఫలితాల్నీ చూపించడం లేదు. ఏ కొత్త సాంకేతికాల్ని ప్రవేశపెట్టాలన్నా అప్పటికే వాడుకలో ఉన్న సాంకేతికం కన్నా కొత్తది మెరుగైనదని నిరూపించిన తర్వాతనే అంగీకరించాలి. ఇది సైన్స్‌ సూత్రం. దీన్ని పాటించకుండా కేవలం రాజకీయ, ఆర్థిక పలుకుబడితో జన్యు మార్పిడి సాంకేతికాల్ని రుద్దే ప్రయత్నం అభిలషణీయం కాదు.
గుత్తాధిపత్యం..
ప్రపంచీకరణ విధానాలు, భారత-అమెరికా వ్యవసాయ విజ్ఞాన చొరవ ఒప్పందం తర్వాత భారత వ్యవసాయ పరిశోధనల ఎజెండా మారిపోయింది. చిన్నకమతాల రైతుల అవసరాలకు బదులు కంపెనీల అవసరాలనే కేంద్ర బిందువుగా మార్చి, అమలు చేయబడుతుంది. విత్తన నియంత్రణ, సరఫరా బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుని, ప్రయివేటు కంపెనీలకు అప్పగించింది. దీని ఫలితమే కేవలం 3, 4 ఏళ్లల్లో మోన్‌శాంటో కంపెనీకి పత్తి ఉత్పత్తిపై గుత్తాధిపత్యం ఏర్పడింది. దీంతో విత్తన ధరలు, అందించే సాంకేతికం వంటి అన్ని విషయాలపై ఈ కంపెనీయే పెత్తనం చేస్తోంది. పైకి ఏమి చెప్పినప్పటికీ ప్రభుత్వ పాత్ర ప్రేక్షకస్థాయికి దిగజారింది. ఆహారధాన్యాల్లో ఈ గుత్తాధి పత్యం ఏర్పడితే రాబోయే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలు ఊహించడానికే భయంకరంగా ఉంటాయి. ఇవి బ్రిటిష్‌ వలసపాలనను పోలి ఉంటాయి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను, 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
సంక్షోభంలో పత్తిరైతు..
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి కేంద్ర పత్తి పరిశోధనా సంస్థల సమాచారం ఆధారంగా జనవరి 9, 2012న పత్తి వేసే అన్ని రాష్ట్రాలకూ రహస్య సలహాల్ని అందించినట్లు తెలుస్తుంది. వీటి ప్రకారం వివిధ సేద్య వాతావరణ ప్రాంతాల్లో మంచి స్థానిక సమగ్ర వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులను గుర్తించి, వారి అనుభవాలను ఇతర చిన్న రైతులకు అందించాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా బిటి పత్తి ఉత్పాదకత తగ్గుతూ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2011-12లో ఒకేసారి పత్తి రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగాయి. ఈ కాలంలో విత్తనం, సస్యరక్షణ మందులు, ఎరువుల ధరలు, సాగునీటి ఖర్చులు పెరిగాయని, అదే సమయంలో పత్తి ఉత్పత్తి తగ్గిందని ఈ సలహాల్లో పేర్కొనట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో..
బిటి పత్తి 2002-03లో ప్రవేశపెట్టిన తర్వాత విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ 2010- 11 నాటికి 44.6 లక్షల ఎకరాలకు చేరింది. ఈ మధ్య కాలంలో దూది ఉత్పత్తి ప్రభుత్వ లెక్కల ప్రకారం 19.75 లక్షల బేళ్ల నుండి 53.0 లక్షల బేళ్లకు పెరిగింది. సగటు ఎకరా దూది దిగుబడి 167 కిలోల నుండి 2006-07లో 252 కిలోలకు, 2007-08లో 276 కిలోలకు పెరిగింది. ఆ తర్వాత ఇది క్రమంగా తగ్గుతూ 2010-11 నాటికి 202 కిలోలకు పడిపోయింది. ఇది 2003-04 స్థాయికన్నా చాలా తక్కువ. ఇక 2011-12లో పత్తి 47 లక్షల ఎకరాల్లో సేద్యమైంది. ఉత్పత్తి, దిగుబడి పూర్తి అంచనాలు అందుబాటులో లేవు. వేసిన పైరులో 70 శాతం పైగా బెట్ట వల్ల 50 శాతం పైగా ఉత్పాదకతను కోల్పోయినట్లు ప్రాథమిక ప్రభుత్వ అంచనాలు తెలియజేస్తున్నాయి.
మీకు తెలుసా..?
* సాంప్రదాయ బ్రీడింగ్‌ (ప్రజననం) పద్ధతిలో ఒకే పంటలో అభిలషణీయమైన గుణగణాలు కలిగిన రెండు రకాల మధ్య సంక్రమణం సాధ్యమవుతుంది. తద్వారా కొత్త రకాల్ని రూపొందిస్తారు. భిన్న జాతుల మధ్య ఇలాంటి సంక్రమణం సాధ్యం కాదు. ఇలా వచ్చిన సంతాన గుణగణాలకు స్థిరమైన వేలాది జన్యువులు కలిగిన క్రోమోజోములు ఆధారం. ఇవి స్థిరత్వం కలిగి ఉంటాయి.
* జన్యుమార్పిడి రకాల్లో భిన్న జాతుల మధ్య గుర్తించిన కొన్ని జన్యువులను ఎంపిక చేసిన వేరే జాతిలో ప్రవేశపెట్టవచ్చు. తద్వారా వచ్చిన సంతానం తల్లిదండ్రుల గుణాలు కలిగి ఉంటాయి. అయితే, ఇవి కొన్ని జన్యువుల ఆధారంగానే ఉండడంతో వీటి స్థిరత్వం తక్కువ. ఉదా: బిటి పత్తిలో బ్యాక్టీరియాకు చెందిన క్రై1ఏసి లాంటి జన్యువులను పత్తిలో ప్రవేశపెట్టడం వల్ల వచ్చిన సంతానంలో బాక్టీరియాకు చెందిన విషపదార్థ తయారీ గుణం ఉంటుంది. కొత్తరకాల్ని రూపొందించడంలో ఈ పద్ధతి ఎక్కువ అవకాశాల్ని అందిస్తుంది. కానీ, అన్ని పరిమాణాల్నీ ముందే ఊహించలేం. సాంప్రదాయ బ్రీడింగ్‌ పద్ధతిలో రూపొందించిన సంతానంతో జన్యుమార్పిడి సంతానాన్ని నేరుగా పోల్చలేం. దేని ప్రత్యేకత దానిదే.
* పత్తి:-గింజలతో కూడినది. దీనిలో దూది బరువు కేవలం మూడోవంతు కాగా, మిగతాది గింజల బరువే.
* దూది:- గింజలు తీసివేసినది.
* బేలు:- 170 కిలోల దూది.

Tuesday, 27 March 2012

మానవ జాతి మిగులుతుందా?


నీళ్లుండవనీ, తిండి దొరకదనీ, కాలుష్యమనీ ఏదో ఒక కారణం చెప్పి అందరూ మనుషులు మిగలరని మాత్రమే చెపుతుంటారు. 2008లో ఆక్స్‌ఫర్డ్‌లో జరిగిన ఒకసమావేశంలో, మానవ జాతికి ఉన్న ముప్పులను గురించి సర్వే చేశారు. 2100 సంవత్సరం నాటికి మనుషులు మిగిలే అవకాశం 19 శాతం మాత్రమే అని లెక్క తేల్చారు. కానీ, ఇంత నిరాశ పనికిరాదనీ, కనీసం మరో లక్ష సంవత్సరాల వరకు మనిషి జాతి కొనసాగుతుందనీ మరికొందరు చెపుతున్నారు.
మనిషి జాతి పుట్టి రెండు లక్షల సంవత్సరాలైంది. రకరకాలుగా మారు తూ జాతి కొనసాగింది. ఈ లెక్కన చూస్తే కనీసం 5100 సంవత్సరాల నుంచి 78 లక్షల సంవత్సరాలదాకా మనిషి కొనసాగే వీలు ఉందంటారు ప్రిన్స్‌టన్ పరిశోధకుడు రిచర్డ్ గాట్. పాలిచ్చే జంతువులలో పుట్టిన ప్రతి జాతి సుమారు పదిలక్షల సంవత్సరాలు కొనసాగింది. అన్నింటిలోకీ తెలివిగలదిగా గుర్తింపు పొందిన మానవజాతి అంత సులభంగా అంతం కాదంటారు పరిశీలకులు.
వింతగా.. మనిషి తెలివి మనిషికే శత్రువయింది. నాగరికత ముందుకు సాగిన కొద్దీ సాంకేతిక శాస్త్రం మనిషి మీదకు తిరగబడే వీలుంది. అది కనీసం అదుపు తప్పుతుంది. బయోటెక్నాలజీలో పుట్టే కొత్త జాతులు, అణ్వాయుధాలు, నానో టెక్నాలజీల కారణంగా ఎప్పుడేం జరిగేదీ చెప్పడం కష్టం. నాగరికత, సాంకేతిక శాస్త్రం ప్రగతి సాధించిన కొద్దీ, ప్రపంచమంతా ఒకే కుటుంబమవుతుంది. సమాజాలు ఒంటరిగా బతకవలసిన అవసరం, ప్రమాదం ఉండవు. సమస్య ఎక్కడ వచ్చినా, అది అందరి మధ్యకు వస్తుంది. అందరూ కలిసి సమధానాలు వెతుకుతారు.
సూక్ష్మజీవులు, వ్యాధులతో మనుషులందరూ మట్టుబెట్టుకుపోయే ప్రమాదం ఉంది. 1918లో ఫ్లూ వ్యాధి వచ్చి ప్రపంచ జనాభాలో ఆరు శాతం మందిని మింగింది. గడచిన వంద సంవత్సరాలలో ఈ రకం సంఘటనలు నాలుగుదాకా జరిగాయి. వ్యాధి కారణంగా ఒక జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోవడమేంటే, ఆ జాతి ఒక చిన్న దీవిలాంటి చోట పరిమితమయి ఉంటేనేగానీ, వీలు పడదు. లక్షలు, కోట్లమంది ఒక వ్యాధికి గురయినా మొత్తం మానవజాతి సమసిపోవటం ప్రస్తుత పరిస్థితులలో అసంభవం!
మరో ప్రమాదం, భయంకరమయిన ప్రకృతి బీభత్సాల నుంచి రావచ్చు. భూగోళం చరిత్రలో సగటున 50 వేల సంవత్సరాలకు ఒకసారి పెద్ద అగ్నిపర్వతం పేలి వెయ్యి ఘనపు కిలోమీటర్ల బూడిదను ఆకాశంలోకి వెదజల్లినట్లు సాక్ష్యాలున్నాయి. వాటిలో మనుషుల సంఖ్య బాగా తగ్గిందని కూడా తెలుసు. సుమత్రాలోని టోబా పేలి 74 వేల సంవత్సరాలయింది. అప్పటి బూడిద కారణంగా మనిషి జాతి ఇంచుమించు తుడిచిపెట్టుకుపోయింది. కానీ, ప్రస్తుతం జనాభా విస్తరణ అప్పటిలా లేదు. అప్పట్లో ఉన్న కొద్ది జనాభా కొంత ప్రాంతంలోనే ఉండేది. ప్రస్తుతం ఏడువందల కోట్లమంది, ఎన్నో ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఇంత మందిని మింగేయగల ఉత్పాతం ఆలోచనలకు అందడంలేదు.
మరో అగ్నిపర్వతం పేలి, బూడిద కారణంగా చీకట్లు సంవత్సరాలపాటు అలుముకుంటే పంటలు పండవు. కొన్ని బిలియన్ల జనం ఉనికికి ప్రమాదం రావచ్చు. అంతటి సంఘటనలు వరుసగా రెండుసార్లు జరిగితే తప్ప మానవ జాతి మట్టుబెట్టుకుపోదంటారు నిపుణులు.
మానవ జాతికి అన్నింటికన్నా పెద్ద ఆపద అంతరిక్షంనుంచి వచ్చే వీలుంది. సూర్యునిలో మంటలు, అంగారక శిలలువచ్చి గుద్దుకోవడం, సూపర్ నానోలు పేలి గామా కిరణాలు కుప్పలుగా రావడం వంటివి జరిగే వీలుంది. ముప్ఫయి కోట్ల సంవత్సరాలకొకసారి ఇలాంటి ఉత్పాతాలు జరుగుతాయట. హాని కలిగించే కిరణాలు పుట్టి, క్యాన్సర్లు కలిగి కొన్ని సంవత్సరాలు, అలా కొనసాగే రకంగా ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగేదీ చెప్పడం ఇంచుమించు అసాధ్యం!
ఎన్ని లెక్కలు వేసినా, రానున్న లక్ష సంవత్సరాలలో మనిషి జాతి మాయమవడం మాత్రం జరిగేలా లేదని లెక్కలు చెపుతున్నాయి. సూర్యుని మంటల గురించి కూడా చెప్పలేము. అయినా అంతగా మంటలు రావేమోనంటారు, ఆ రంగంలో వారు! ఇక అంగారక శిల వచ్చి ఢీకొట్టడం మిగిలింది. అంతరిక్షం నిండా రకరకాల రాళ్లున్నాయి. రాక్షసి బల్లులు అంతమయేందుకారణం 15 కిలోమీటర్ల వెడల్పున్న రాతి తాకిడేనని నమ్మకం. ఎప్పుడో 400 మీటర్ల రాయి వచ్చి తాకే అవకాశం మాత్రం ఉదంటున్నారు. దాని బలం పదివేల మెగాటన్నుల టిఎన్‌టీ (బాంబులోని పేలుడు పదార్థం)కి సమానంగా ఉంటుంది. అది ఏదో ఒక దేశాన్ని తుడిచిపెడుతుందేమోగానీ, మొత్తం ప్రపంచాన్ని కుదపజాలదు.
మానవజాతి మిగిలే అవకాశాలు 19 శాతమని కొందరంటే, కాదు... లక్ష సంవత్సరాలలో తుడిచిపెట్టుకుపోయే అవకాశం 20 శాతమని మరింత మంది అంటున్నారు. ఉంటామనే అనుకుందాం మరి!

వీటిని కూడా కాపాడాలి

నిర్వహణ: గోపాలం కెబి

‘‘సముద్రంలో తిమింగలాలు, అడవుల్లో పాండాలు అంతరించిపోయాయంటే అది ఘోరమయిన విషయమే. కానీ, వాటితోబాటు ప్రపంచం మాత్రం ముగిసిపోలేదు. కానీ అమోనియాను ఆక్సీకరణం చెందించడానికి చేతనయిన రెండు జాతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి రెండూ అంతరించిపోతున్నాయంటే, అది మరో రకం పరిస్థితి. ఆ పని మనకు తెలియకుండానే, ప్రస్తుతం జరుగుతూ ఉండవచ్చు!’’
ఈ మాటలను అంటున్నది ఎవరో అయితే పట్టించుకోనవసరం లేదు. వాతావరణాన్ని పునర్నిర్మించడమనే ఒక పద్ధతి వచ్చింది. ఆ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో తలమునకలవుతున్న ఒక సీనియర్ పరిశోధకుడు టామ్ కర్టిస్ చెప్పిన మాటలవి. మనమంతా సూక్ష్మజీవులను గురించి పట్టించుకోకుండా ఉంటున్నామని ఆయన గొంతెత్తి చెపుతున్నాడు. జీవం అనే చెట్టుకు చాలా కొమ్మలున్నాయి. అందులోని మొక్క లు, జంతువులను మాత్రమే పరిరక్షణ వాదులు పట్టించుకున్నారు. సుక్ష్మజీవుల గురించి చాలామందికి తప్పుడు అభిప్రాయాలున్నాయి. అవి మనుషులకు, జంతువులకూ హాని చేసేవి అనుకునేవారే ఎక్కువ. అది నిజం కాదని తెలిసినా నిపుణులు కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అవి సంఖ్యలో మిగతా జీవులకన్నా చాలా చాలా ఎక్కువే అయినా కంటికి కనపడవు! కంటికి కనబడే జీవులను మాత్రమే పరిరక్షిస్తామంటే తప్పుగదా! అని అంటున్నారు కొందరు పరిశోధకులు.
సూక్ష్మజీవులు అంతటా వ్యాపించి ఉన్నాయి. అంతులేకుండా ఉన్నాయి. కానీ వాటిలోకూడా కొన్ని రకాలు అంతరించే పరిస్థితికి చేరుకుంటున్నాయి. అయినా 1993లో ప్రకటించిన జీవన వైవిధ్యం పట్టికలో వాటి గురించి ప్రస్తావన కూడా లేదు. ఈ పట్టికలో ఏక కణజీవుల గురించి పట్టింపు కనబడదు. మొక్కల సంరక్షణ కోసం ప్రపంచ స్థాయిలో తయారయిన పథకంలో ఫీంజీ (బూజు) జాతుల గురించి కొంత ఉంది. అది కొంత మాత్రమేనని అందరూ గుర్తించవలసిన అవసరం ఉంది.
మొక్కలలో వాటి గట్టిదనానికి ఆధారమయిన లిగ్నోసెల్యులోజ్ అనే పదార్థం ఉంది. చెటు,్ల మొక్కల నిర్మాణంలో ఎక్కువశాతం ఈ పదార్ధమే ఉంటుంది. చచ్చిన మొక్కలలోని ఈ పదార్థాన్ని కొన్ని రకాల ఫంజీలు విరుస్తాయి. అప్పుడు మట్టిలో సారం పేరున పోషకాలు చేరుతాయి. మట్టిలో ఈ సారం ఉంటేనే వ్యవసాయం సాగుతుంది. పంటలు పండుతాయి. అంటే లిగ్నో సెల్యులోజ్‌ను విరవడం ద్వారా ఈ ఫంజీలు మనుషులకు, జంతువులకు ఎంతో ఉపకారం చేస్తున్నాయని అర్థం! వ్యవసాయ భూముల్లోనే కాదు, అడవుల్లో, అన్ని చోట్లా ఈ ఉపకారం జరుగుతున్నది. మరి వాటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఎంత అన్యాయం?
సూక్ష్మజీవులు కొన్ని ప్రత్యేక స్థలాలలో మాత్రమే ఉండవు. అంతటా వ్యాపిస్తాయి అని ఒక మాట ఉంది. అంటే, అవి ఒకచోట అంతరించినా, మరోచోట ఉండనే ఉంటాయని భావం. కొన్ని రకాలగురించి తప్పిస్తే, ఈ అభిప్రాయం నిజం కాదు. నిజానికి రోగాలకు కారణాలయిన సూక్ష్మజీవులు కూడా మనుషులవల్ల వ్యాపించాయి తప్ప, వాటంతటవి అంతటా లేవు.
జీవుల శరీరాల మీద, లోపలా రకరకాల సూక్ష్మజీవులుంటాయి. వాటివల్ల జీవులకు, జీవులవల్ల వాటికీ ఉపకారం ఉంటుంది. ఈ రకం సూక్ష్మజీవులు వాటికి ఆధారమయిన జీవులు లేనిదే మనజాలవు. ఆ జీవులు కూడా ఉండవలసిన సూక్ష్మజీవులు లేనిదే మనజాలవు. మనుషులలో కూడా బోలెడన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయని, ఉండాలనీ చాలామందికి తెలియకపోవచ్చు. ఈ మధ్యన సోమాలియా దేశంలోని ఒక అడవి గాడిద జాతి గురించి పరిశోధనలు జరిగాయి. దాని పేగుల్లో ఒక బూజు జాతి జీవి బతుకుతూ ఉంటుంది. అడవులు అంతరిస్తున్న కారణంగా ఈ గాడిదలు అంతరిస్తున్నాయని గుర్తించారు. నిజానికి ఆ జాతి గురించి తెలిసింది తక్కువ. గాడిదలు పోతే, వాటి శరీరంలోని సూక్ష్మజీవులు కూడా లేకుండా పోతాయి. ఈ సూక్ష్మజీవులు లేనందుకు గాడిదలు పోయే స్థితి కూడా ఉంది. ఆర్కిడ్ జాతి మొక్కల వేళ్లమీద కొన్నిరకాల సూక్ష్మజీవులుంటాయి. ఈ అరుదయిన, అందమయిన ఆర్కిడ్‌లు, వాటికి సాయం చేసే సూక్ష్మజీవులు ఒక రకం కారణంగా మరొకటి అంతమవుతున్నాయని కూడా గుర్తించారు.
మనుషులు, మిగతా పాలిచ్చే జంతువుల పేగులలో ఉండవలసిన సూక్ష్మజీవులన్నీ సక్రమంగా ఉండకుంటే ఆరోగ్యాలు పాడవుతాయి. అందుకే సూక్ష్మజీవులన్నింటినీ పరిశీలించి గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిఎన్‌ఏ విశే్లషణ ద్వారా వీటిని గురించి సులభంగా పరిశోధించగలుగుతున్నారు. ఒకే రకంగా కనబడినా సరే, పూర్తిగా వేరు రకాలవీ, వేరు పద్ధతిలో సాయపడగలవీ ఎన్నో రకాల సూక్ష్మజీవుల గురించి తెలియవస్తున్నది. అవి జీవుల శరీరంలో ఏయే భాగాలలో ఉండేది కూడా వివరంగా తెలుస్తున్నది.
పర్యావరణాన్ని కాపాడితే, అందులోని జీవులన్నింటినీ కాపాడినట్లేనంటారు కొంద రు. కానీ, మనకు ఆసక్తికరమయిన జంతువులు, వృక్షాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే మనం కాపాడాలనుకుంటాం. ఆ రకంగా ఎడారులు, మంచు ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో ఉండే సూక్ష్మజీవులు నిర్లక్ష్యం పాలయ్యే వీలుంది. అంటార్కిటికాలోని వోస్టోక్‌లో మంచు కింద నాలుగు కిలోమీటర్ల లోతున సరస్సు ఉందని తవ్వకాలు జరుగుతున్నాయి. అంటే, మంచుమీద సహజంగా ఉండే సూక్ష్మజీవుల వాతావరణం మారి అక్కడికి కొత్త జీవులు వచ్చి చేరుకుంటాయి.
సూక్ష్మజీవులు మాత్రమే ఎక్కువగా ఉండే ప్రాంతాలున్నాయి. అక్కడి జీవుల కారణంగా మనకు జరిగే మేలు తెలియదు. కీడు తెలియదు. మట్టిలో ఉంటే జీవ వైవిధ్యం అంతులేనిది. ఆ మట్టి మట్టిగా ఉండాలంటే, సూక్ష్మజీవులుకూడా ఉండాల్సిందే. వన్యప్రాణులను కాపాడాలని పండగలు, ప్రచారాలు చేస్తుంటాం. అంతే ఉత్సాహంతో, ‘కంటికి కనబడని లెక్కలేనన్ని’ సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవాలి. వాటిని కాపాడాలి. అన్ని సూక్ష్మజీవులూ ‘విషం’ కావని అందరికీ అర్థం కావాలి. అన్నీ రోగాలనిచ్చేవి కావు. అవి లేనిదే మన బతుకులు గడవని సూక్ష్మజీవులు ఎన్నో ఉన్నా యి. నిజానికి ఉపయోగపడే సూక్ష్మజీవులే ఎక్కువ. ఈ ప్రపంచంలో సూక్ష్మజీవుల స్థానాన్ని, వాటి ఉపయోగాలనూ అందరూ అర్థం చేసుకోవడం అవసరం!

సైన్సంటే ఏమిటి?


‘సైన్సును సమాజంలోకి తీసుకుపోతున్నాము’-అన్నారొక పెద్దాయన. నిజమే. ఆ అవసరం చాలా ఉందనిపించింది, ఆ మాట వినగానే. ఆయనగారికి తెలిసిన సైన్సు, అలాంటి వారంతా చేస్తున్న సైన్సు, అందరికీ పట్టదు. అంత సులభంగా అర్థం కాదు. ఆ సైన్సును ఆయనగారు అరటిపండు గుజ్జులాగా చేసి మన ముందు ఉంచినా, మనకు అదేమిటో అంతుపట్టదు. అసలు, సైన్సు అని ఒకటి ఉందనీ, మనమంతా అందులోనే, దానివలన, దానిచేత బతుకుతున్నామనీ మనకు తెలియదు మరి! ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో సైన్సు కానిది ఏదీ లేదు. ప్రపంచంలో మనం కూడా ఉన్నామంటే, మనం కూడా సైనే్స. ఈ సంగతి తెలియకుండానే మనమంతా బతుకుతున్నాము. మన గురించి, మన బ్రతుకు, పరిసరాలు, ప్రపంచం గురించి మనకు తెలుసనే అనుకుంటాము. కానీ తెలిసింది గోరంత మాత్రమే. అందుకే ‘సైన్సు’ అనగానే ‘ఇది మనది కాదు, మనకు కాదు!’ అన్న భావన ఎదురవుతుంది.
మనమున్నాము. మరిన్ని జంతువులు, చెట్లు, మరెన్నోరకాల ప్రాణులున్నాయి. భూమి, నీరు, గాలి, వాతావరణం ఉన్నాయి. కదలిక, కాలం, విద్యుత్తు, అయస్కాంతం, అంతరిక్షం, నక్షత్రాలు, ఇలా ఎనె్నన్నో ఉన్నాయి. మన నుంచి మొదలు మహా విశ్వం దాకా ఉండే అన్నింటి గురించి, నిర్మాణం, పని తీరు, పరస్పర సంబంధాలు, వాటి వెనుక శక్తుల గురించి తెలుసుకుంటే.. అదే సైన్సు. తెలుసుకోవాలన్న కోరికతో ముందుకు సాగి, మరీ లోతుగా ఆ తెలివిలో మునిగినవారు సైంటిస్టులు. వారికి తెలిసిన సైన్సు, ‘మన గురించి కాదు!’ అనేంత లోతుకు చేరింది. వారికీ, మామూలు మనుషులయిన మనకు మధ్యన దూరం పెరిగింది. మొదటినుంచి మొదలుపెట్టి, సైన్సు గురించి తెలుసుకోవాలని ప్రయత్నించేవారికి, కొంత తెలుసు. వాళ్లు లోతులకు వెళ్లాలనే ప్రయత్నంలో, బ్రతుకులోని సైన్సును మరిచిపోతుంటారు.
సైన్సు అన్నది ఒక మూడు అంతస్తుల భవనమయితే, సైంటిస్టులు పై అంతస్తులో ఉంటారు. మిగతా ప్రపంచం కన్నా వారికి లోతయిన సైన్సు గురించి ఎక్కువ ధ్యాసుంటుంది. మధ్య అంతస్తుతో వీరికి కొంచెం సంబంధాలు ఉంటాయి. ఏ కొందరికోతప్ప కింద అంతస్తు ఒకటి నేల మీద ఉందనీ, అది కూడా సైనే్స అనీ భావం కలగడానికి తీరిక, ఆలోచన ఉండదు. కొంతమంది కింది అంతస్తుతో సంబంధం లేకుండా, తమ ప్రపంచంలో బతుకుతుంటారు. తమ శ్రమ మొత్తం, కింది అంతస్తుతో సహా మొత్తం భవనం కోసమన్న సంగతి వారికి గుర్తుచేయాలి!
మధ్య అంతస్తులోవారు తెలిసీ తెలియక బతుకుతుంటారు. సైన్సు ఉందని తెలుసు. సైన్సన్నా, సైంటిస్టులన్నా బోలెడంత గౌరవం వీరికి! కానీ, సైన్సు కోసం అనుకుని, సూత్రాలను, శాస్త్రాలను చదువుతారే తప్ప, అర్థం చేసుకుని, ప్రభావాలను వెదికే పద్ధతి అలవాటు ఉండదు. వీళ్లకు అప్పుడప్పడు కింద అంతస్తులో వారితో సంబంధాలు ఉంటాయి. కానీ, ఆ సంబంధంలో సైన్సుమాత్రం ఉండదు. జరిగేదంతా సైనే్స అయినా అదింకా సైన్సుగా కనబడదు! సైన్సు భవనంలో కింద అంతస్తు చాలా పెద్దది. అది ఈ ప్రపంచమంత పెద్దది. ప్రపంచమే ఈ అంతస్తు. అందులో మనమంతా ఉన్నాము. మనకు సైన్సు అంటే తెలియదు. మనం, మన బతుకు సైన్సు అని తెలియదు. చెప్పడానికి ఎవరూ రారు. వచ్చినా సరైన మాటలు చెప్పరు. కనుక మనలో కొందరు సైన్స్ అనే మాట వినకుండానే, బతుకు సాగిస్తారు. కొందరు అనకుండా, అందరూ అనడం బాగుంటుందేమో! మీరింత వరకు ఈ వ్యాసాన్ని చదివారంటే, మీరు పై అంతస్తుల గురించి పట్టించుకుంటారనీ, అప్పుడప్పుడు మొత్తం భవనం గురించి పట్టించుకుంటారనీ అనవచ్చు. ‘పిల్లలు చదువుతారు’ అంటారు చాలామంది సైన్సు గురించి మాట్లాడుతూ! ‘మీరెందుకు చదవరు?’ అని వారిని ఎవరడగాలి?
నిద్ర లేచింది మొదలు మరునాడునిద్ర లేచేదాకా, బ్రతుకంతా సైన్సు. శరీరం, దాని పనితీరు, ఆరోగ్యం, అనారోగ్యం, అందుకు కారణాలు, అన్నీ సైన్సు. కూడూ, గూడూ, గుడ్డా, అంతా సైన్సు. అర్థమయితే, అందులో కొంత సాంకేతిక శాస్త్రం ఉంది. అదేదో కొత్త సంగతి కాదు. ఒక విషయం, లక్షణాలు, పరిస్థితులను తెలుసుకుంటే సైన్సు. దాన్ని వాడుకునేందుకు పద్ధతులను సిద్ధం చేస్తే, అది సాంకేతిక శాస్త్రం. ఇందులో యంత్రాలు, పరికరాలు, పద్ధతులూ మొదలయినవి ఉంటాయి. వాటికి ఆధారమయిన సమాచారమంతా సైన్సు. ప్రపంచమంతా సాంకేతిక ప్రపంచమయింది. లాట్రిన్ లేకున్నా సరేగాని, అందరిదగ్గరా సెల్‌ఫోన్‌లు మాత్రం ఉన్నాయని జనాభా లెక్కలవారు చెపుతున్నారు. ఫోన్, ఫ్యానూ, ఫ్రిజ్, కనీసం లైటు, లేకుంటే నూనె దీపం వీటన్నిటిలోనూ సాంకేతిక శాస్త్రం ఉంది. సైన్సు ఉంది. దీపం ఉంది చాలు.. అందులో సైన్సు నాకెందుకు? అని అనుకుంటే, అంతకన్నా అమాయకులు మరొకరు ఉండరు. చమురు దీపంలో ఒత్తి వెలిగిస్తే మండుతుంది. కిరసనాయిలు దీపంలో వత్తి మరోలాగ ఉండాలి. గుండ్రని లైటు బల్బులో వేడి కూడా పుడుతుంది. వేడెక్కని కరెంటు దీపాలున్నాయి. ఇలాంటి సంగతులు మీకు తెలిసే ఉంటాయి. అంటే మీకు సైన్సు తెలుసని అర్థం. అది సైన్సు అని మాత్రం తెలియదు. భవనం మొత్తం సైన్సు. కానీమధ్య అంతస్తులో ‘్భట్టీ’ సైన్సు, పైన అంతస్తులో ‘గట్టి’ సైన్సు ఉన్నాయని అనుకుంటాము కొందరము. అసలు మన భవనం సైన్సు అని తెలియకుండానే బతుకుతాము మరికొందరము. అందుకే మనమధ్యకు సైన్సును తీసుకురావాలనుకుంటారు ‘పైవాళ్లు’. వాళ్ల సైన్సు మనకు అర్థం కాదు. మనకు తెలిసిన సైన్సు, మన అనుభవంలోకి వస్తున్న సైన్సు గురించి మనకు సూచన ఇస్తేచాలు. ఈ కింద అంతస్తులోని మన బ్రతుకులు మరింత బాగా నడుస్తాయి.
సైన్సు ఉందనీ, అందుకు సంబంధించి ఒక ఆలోచన పద్ధతి ఉందనీ, తెలియక మనమంతా ‘గుడ్డెద్దు చేలో పడ్డట్టు’ బతుకుతున్నాము. ఆలోచన తీరు కొంచెం మారితే, మనం చేసే పనుల అర్థం తెలుస్తుంది. పరిశీలన, ప్రయోగం, అనుభవాల ద్వారానే ప్రపంచంలోని పద్ధతులన్నీ నడిచాయి. ప్రమిదలో గ్యాసు నూనె అనే కిరసనాయిలును పోసి, దీపం వెలిగిస్తే, వత్తితో బాటు ప్రమిదంతా మండుతుంది. అయినా నేనలాగే చేస్తానంటే, అది సైంటిఫిక్ ఆలోచన కాదు. అలాంటి ఆలోచనలతో గుడిసె, ఇల్లు అంతా మండుతుంది. సైన్సునూ, దాని పద్ధతినీ పట్టించుకోని మన బతుకులు ఈ రకంగానే సాగుతున్నాయి. వ్యవసాయం, ఆరోగ్యం, సదుపాయాలు, వస్తువులు అన్నీ సైన్సులోంచి పుట్టి సాంకేతిక శాస్త్రం ద్వారా మనకు చేరుతున్నాయి. ఆ సంగతి తెలిసీ తెలియక, పట్టించుకోకుండానే వాటిని వాడుకుంటున్న మనకు పై అంతస్తులో వారు, సైన్సును పంచి పెడుతున్నామంటారు. ముందు బతుకును తాకిన సైన్సును అర్థం చేసుకుందాం. తర్వాత మిగతా సైన్సు కూడా అర్థమవుతుంది.

Monday, 26 March 2012

గతంలో దృశ్యాలే!


జరగబోయేది తెలియదు, జరిగిపోయింది మిగలదు... అనికదా మనకున్న అభిప్రాయం. కానీ, మనం బతుకుతున్నది గతంలో అంటే నమ్మగలరా? కనీసం, మనం చూస్తున్నది గతం అంటే అర్థమవుతుందా? కాంతి వేగంగా కదులుతుంది, నిజమే. కానీ, దానికి కూడా ఒక వేగం, పరిధి ఉన్నాయి. మన కంటికి కనిపించే వస్తువు ఏదయినా కాంతి కారణంగానే కనిపిస్తుంది. వస్తువుమీద ప్రతిఫలించిన కాంతి మన కంటికి చేరడానికి కొంత సమయం పడుతుంది. అంటే మనం చూస్తున్న దృశ్యం అంతకాలం కిందటిదని గదా అర్థం! అద్దం ముందు నిలుచున్నామనుకుందాం. మనకు కనిపించే మన తీరు కొంతకాలం కిందటిది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎంత కాలంకిందటిది? అని ప్రశ్నించిన తర్వాత సంగతి మరింత బాగా తెలుస్తుంది. అద్దానికి మనం అడుగు దూరంలోనే ఉన్నాం. అంత దూరాన్ని దాటడానికి కాంతి సెకండులో వెయ్యి మిలియన్ల భాగం సమయాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఆ తేడాను మనం చూడలేము. కనుకనే కనిపించింది ఈ క్షణమే అనుకున్నా తప్పులేదు. వస్తువు నుంచి ఎంత దూరంలో ఉంటే, అది కనిపించే సమయంలో తేడా అంతగా పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని వస్తువులు మనకు ఇంచుమించు అదే క్షణంలో కనిపించిన భావం ఉంటుంది గనుక సరిపోయింది. ఒక్కసారి తల ఎత్తి ఆకాశంలోకి చూస్తే, ఈ గతం సంగతి మరింత అనుభవంలోకి వస్తుంది.
చందమామను చూడండి. ఆ గోళం భూమికి అన్నింటికన్నా దగ్గరలోగల అంతరిక్ష విశేషం. సగటున చందమామ మననుంచి 3,80,000 కిలోమీటర్లు (2,36,120 మైళ్లు) దూరంలో ఉంది. కనుక మనం చూస్తున్న చంద్రబింబం, ఒక సెకండు కింద ఉండిన తీరు మాత్రమే! సెకండుతేడా తెలిసే వీలుంది. కానీ, అంత దూరం దృశ్యంలో ఆ తేడా కనబడటం లేదు. మరిక సూర్యుని వేపుచూడండి. గతం బతుకు కథ మొదలవుతుంది!
సూర్యనక్షత్రం మన నుంచి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. కిలోమీటర్లలో చెప్పాలంటే 93 మిలియనులు. అంతరిక్షం లెక్కలో చూస్తే, అది మనకు అన్నిటికన్నా, దగ్గరలో వున్న నక్షత్రం. ఇక్కడ కాంతి వేగం గురించి కొంచెం తెలిసే వీలుంది. మనం ఈ క్షణాన సూర్యుని చూస్తున్నామంటే... అది ఎనిమిది నిమిషాల కిందటి బింబం లేదా దృశ్యం! ఏం చేసినా వీలుగాదు, గానీ, ఒక సంఘటనను ఊహించండి. ఒక్కసారిగా సూర్యగోళం మాయమయిందనుకోండి. ఆ సంగతి మనకు ఎనిమిది నిమిషాలదాకా అర్థం కాదు. అంటే సూర్యుని వెలుగు, వేడిమి ఆ ఎనిమిది నిమిషాల కాలంపాటు మనకు అందుతూనే ఉంటుంది. సూర్యుని ప్రభావం కూడా అంతసేపు వరకు కొనసాగుతూనే ఉంటుంది. గ్రహాలన్నీ సూర్యుని గురుత్వాకర్షణ కారణంగా ఆ గోళం చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు మాయమయినా ఆ గురుత్వాకర్షణ కూడా కొనసాగుతుంది. ఆ ఎనిమిది నిమిషాలు గ్రహాలు... లేని సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. సూర్యుడిని చూడడమంటే గతంలోకి చూడడమని అర్థమయి ఉంటుంది. ఆ గతం వెలుగు, వేడి ఆధారంగానే మనం చూడగలుగుతున్నాము. బతక గలుగుతున్నాము!
గతంలోకి మన చూపు ఇక్కడ మొదలవుతుంది. ఇక మరింత దూరం చూచిన కొద్దీ మనం, మరింత గతంలోకి వెళ్లిపోతాము. గ్రహాలు, వాటి చుట్టూ ఉండే ఉపగ్రహాలు మనకు తెలుస్తున్నాయి. కానీ తెలిసేది... అవి కొంత గతంలో ఉండిన పరిస్థితి మాత్రమేనని అర్థమయే ఉంటుంది. అంగారక గ్రహం, భూమి... సూర్యుని చుట్టూ ఒకే మార్గంలో, ఒకే దూరంలో తిరగవు. మార్గాలు రెండుగా, ఒకదానికొకటి దూరంగా ఉన్నాయని సులభంగానే అర్థమవుతుంది. కానీ, వాటి మధ్య దూరం మారుతూ ఉంటుందంటే ఆలోచన కొంత దూరం సాగాలి. కనుక అంగారక గ్రహం మనకు ఉండే దూరాన్ని బట్టి, దాని దృశ్యం మనకు నాలుగు నుంచి పనె్నండు నిమిషాలు తేడాతో కనబడుతుంది.
మానవుడు అంగారక గ్రహం మీద దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా మనుషులు లేని పరిశోధక నౌకలను గ్రహంమీద దింపి పరిశీలనలు జరిపించాడు. ఈ క్షణాన కనిపించేది ఈ క్షణం దృశ్యం, స్థానం కాదని తెలుసు. లెక్క సరిగా చేస్తే గానీ, గ్రహాన్ని సరిగా చూడడం, దాని మీదకు ఒక నౌకను దింపడం కుదరదు. ఎంత విచిత్రమో ఊహించండి. అక్కడ దిగిన యంత్రం పేరు మార్చ్ రోవర్. అంగారక గ్రహం మనకు వీలయిన ఎక్కువ దూరంలో ఉందంటే, దాని దృశ్యం పనె్నండు నిమిషాల తరువాత కనబడుతుంది. అక్కడ కదులుతున్న మార్చ్ రోవర్‌కు ఒక సంకేతం పంపించాలి. దాన్నుంచి మన వరకు సమాచారం అందాలి. ఈ రెంటికీ కనీసం నలభయి నిమిషాలు పడుతుంది. నౌక ప్రమాదంలో ఉందంటే, భూమి మీది పరిశోధకులు ఏదో చేయాలన్న ప్రయత్నానికి అర్థంలేదు! అందుకనే, ఈ రకం యంత్రాలన్నీ తమ నిర్ణయాలు తాము చేసుకునే రకంగా తయారుచేస్తారు. అవి నెమ్మదిగా పనిచేస్తాయి కూడా!
గురుగ్రహం మనకు దగ్గరగా ఉన్న సమయంలో కనిపించేది ముప్ఫయి రెండు నిమిషాల క్రిందటి దృశ్యం. మనమింకా సౌరమండలంలోనే ఉన్నాము. అంచుల్లో ఉన్న నెప్ట్యూన్ గ్రహం నాలుగు గంటల క్రిందట దృశ్యం మాత్రమే మనకు కనబడుతుంది.
వోయేజర్ వన్ అనే అంతరిక్ష పరిశోధక నౌక ఆ దూరాలను దాటి అంతరిక్షపులోతులోకి కదిలిపోతూ ఉంది. సౌర మండలం వెలుపలి అంచులనుంచి అది భూమికి అందించిన సమాచార సంకేతం ఇక్కడికీ లేదా ఇక్కడనుంచి పంపిన సందేశం, అక్కడకు చేరడానికి 31 గంటల 52 నిమిషాలు 22 సెకండ్లు. ఇది కూడా 2010 సంవత్సరం నాటి లెక్క! ఇంకా లోతులలో ఉండే నక్షత్రాలు, పన్సార్లు, క్వేజార్లనుంచి మనమున్న దూరం లెక్కలను అందుకే గంటలలో కాక, కాంతి సంవత్సరాలలో కొలుస్తారు.
టెలిస్కోపు అవసరం లేకుండా మామూలు కంటికి కనిపించే చేరువ నక్షత్రం ఆల్ఫాసెంటారి! అది మనకు నాలుగు సంవత్సరాలు క్రితమున్న తీరుగా కనబడుతున్నది. నక్షత్రాలు అంతరిస్తాయని తెలుసు గదా! అంతరించిపోయి, ప్రస్తుతం లేని నక్షత్రాలను దూరం కారణంగా, మనమింకా చూడగలుగుతున్నామంటే నమ్మగలరా? మరిక మనం గతంలో బతుకుతున్నామంటే ఆశ్చర్యం ఏముంది?

Sunday, 25 March 2012

కాలం చెల్లిన తతంగం...'పంచాంగం'

 సవ్వడి డెస్క్ : కెఎల్‌ కాంతారావు    

మీరెప్పుడైనా ఏదైనా పంచాంగాన్ని తిరగేశారా? దానిలో తిథులు, మాసాలు, గ్రహణాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, సమయాలతో పాటు ఇంకా మన జీవితాల్ని శాసిస్తాయని చెప్పబడే అనేక విషయాలు ఉంటాయి. ఆ సంవత్సరానికి నాయకులైన గ్రహాలు, దానివల్ల ఫలితాలు, సరుకుల ధరలు, వాతావరణం, శిశుజననానికి మంచి సమయం, గృహ సంబంధమైన వస్తువులు ఉపయోగించటానికి శుభ ముహూర్తాలూ, బాలికల రజస్వల ఫలితాలు, బల్లిపాటు ఫలితాలు .... ఒకటేమిటి- అన్నీ పంచాంగంలో ఉంటాయి. వాస్తవానికి ఇవన్నీ సామాన్యుల జీవితాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే కొందరు స్వార్థపరుల కల్పనలు. ఖగోళ శాస్త్ర ప్రగతి గురించి, దానిలోకి స్వార్థపరుల కల్పనలు ఎప్పుడు ప్రవేశించాయి, వాటి విష ఫలితాలేమిటి? వంటి సంగతులు తెలుసుకుందాం.
వేదాల్లో బలుల ప్రస్తావన
భారతీయుల ఆది గ్రంథమైన రుగ్వేదంలో గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, వాటి గమనాల గురించి పేర్కొన్నారు. యజుర్వేద కాలం నాటికి నెలలు, నెలల పేర్లు చెప్పబడ్డాయి. దేవతలకు జంతు బలులంటే ఇష్టమనీ, ఆ బలులు ఫలానా కాలాల్లో చేస్తే మంచిదనీ ఊహించుకుని ఆయా కాలాల్లో ఆ పనులు చేసేవారు. దశ పూర్ణ మాసం అంటే అమావాస్య, పౌర్ణమిలలో ఏయే బలులు చేయాలి? చాతుర్మాసంలో (ప్రత్యేకంగా పేర్కొనబడిన నాలుగు మాసాల కాలంలో) ఏయే బలులు చేయాలి? ఇవన్నీ యజుర్వేదంలో చెప్పబడ్డాయి. రుతువుల వివరణ కూడా అందులో ఉంది. సామవేదంలో ఉత్తరాయణం, దక్షిణాయణం, వాటి ప్రాధాన్యం, మహావ్రత కర్మల ఆచరణ వివరించబడ్డాయి. అధర్వణ వేదంలో రాహువు ద్వారా సూర్య గ్రహణం వస్తుందని ఉంది. యజుర్వేదంలో సంవత్సరానికి 12 నెలలని చెప్పారు. అప్పుడప్పుడూ 13వ నెలను అధికమాసంగా చేర్చాలని అధర్వణ వేదంలో పేర్కొన్నారు. అభిజిత్‌ మొదలైన నక్షత్రాల పట్టిక దానిలో ఉంది.
తర్వాత కాలంలో లగధుడు అనే ఖగోళ శాస్త్ర పండితుడు ప్రాచీన గ్రంథాల్లోని విషయాలను పరిష్కరించి, క్రోడీకరించి వేదాంగ జ్యోతిషం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది క్రీపూ రెండు లేదా ఒకటో శతాబ్దంలో జరిగింది. ఈ గ్రంథంలో సూర్యచంద్రుల గమనాలకు సంబంధించిన సూత్రాలు వివరించారు. 'ఖగోళ శాస్త్రం వైదిక అనుబంధ పాఠాల్లో కిరీటం వంటిది' అని లగధుడు పేర్కొన్నాడు. ఖగోళ శాస్త్రం కాలం గురించి తెలుసుకునేదని వేదాంగ జ్యోతిషంలో పేర్కొన్నారు. వేదాలు బలుల గురించిన విషయాలను వివరిస్తాయని కాబట్టి, కాలక్రమేణా నిర్దేశించబడిన ఈ బలుల గురించి తెలుసుకోవాలంటే ఖగోళ శాస్త్రంలో నిష్ణాతుడు కావాలనీ పేర్కొనబడింది.
నెలలూ రుతువులూ ...
వైదిక రుషులు పూర్ణ చంద్రబింబం ఏ నక్షత్రంలో ఉండగా వస్తుందో ఆ నెలకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజున చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉంటే- ఆ మాసాన్ని చైత్రమనీ, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖమనీ, జ్యేష్ట నక్షత్రంలో ఉంటే జ్యేష్ట మాసమని, ఫల్గుణీ నక్షత్రంలో ఉంటే ఫాల్గుణ మాసమనీ పేర్లు పెట్టారు. పన్నెండు చంద్ర మాసాలను రెండు నెలలకొకటి చొప్పున విభజించి, వాటిని ఆరు రుతువులుగా నిర్ణయించారు. వైదిక సాహిత్యంలో చంద్రుడికి స్వయం ప్రకాశం లేదని సూర్యకాంతిని గ్రహిస్తుందని పేర్కొనబడింది. బృహస్పతి వంటి గ్రహాల ప్రస్తావన కూడా ఉంది.
తిథులూ పక్షాలూ ...
తరువాత కాలాన్ని మరింత కచ్చితమైన చిన్న చిన్న భాగాలుగా విభజించారు. శతపథ బ్రాహ్మణంలో ఒక రోజును 30 ముహూర్తాలుగా విభజించారు. ఒక ముహూర్తాన్ని 15 కిస్ప్రూలు గానూ, ఒక కిస్ప్రూను 15 ఇడానీలు గానూ, ఒక ఇడానీ అంటే 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగానూ విభజించారు. అంటే సంవత్సరాన్ని 10,800 ముహూర్తాలు లేక 3 కోట్ల 64 లక్షల 50 వేల ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా విభజించారు.
వైదిక రుషులు ఒక మాసాన్ని రెండు స్వాభావికమైన భాగాలు లేక పక్షాలుగా విభజించారు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకూ ఉండే వెలుతురు భాగం శుక్ల పక్షంగానూ, పౌర్ణమి నుంచి అమావాస్య వరకూ ఉండే చీకటిభాగం కృష్ణ పక్షంగానూ విభజించారు. ఈ రెండు పక్షాలూ కలిపితే ఒక చంద్రమాసం అయింది. ఒక పక్షాన్ని 15 తిథులుగా విభజించారు. ఈ తిథుల విభజన తొలిసారిగా ప్రపంచంలో భారతీయులే చేశారు. అవి పాఢ్యమి, విదియ, తదియ మొదలైనవి. తిథుల పేర్లకూ, సంస్క ృత సంఖ్యలకూ సంబంధం ఉంది. సంస్క ృత సంఖ్యలు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ- ఇలా ఉంటాయి. తిథులు కూడా వాటి లాగానే పాఢ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి - అని పిలవబడ్డాయి. తిథుల విభజన తర్వాత 12 చంద్ర మాసాలకు సంవత్సరానికి 12 రోజులు కలిపి- అంటే రెండున్నరేళ్లకోసారి 30 రోజులు అధికమాసాన్ని కలిపి 366 రోజులతో కూడిన చంద్ర మాసాన్ని తయారు చేశారు.
కాలగణనకే పంచాంగాలు
మొట్టమొదటి పంచాంగంలో అంటే- కొన్ని వందల సంవత్సరాల వరకూ కాల గణన, గ్రహణాల వివరాలు మాత్రమే ఉండేవి. క్రీ.పూ. 230 తరువాత, భారతదేశంపై అలెగ్జాండర్‌ దండయాత్ర తరువాత భారత, గ్రీకు సంస్క ృతుల సమ్మేళనం ప్రారంభమైంది. దాని ప్రభావం ఖగోళ శాస్త్రంపై కూడా పడింది. అప్పటివరకూ ఉన్న నక్షత్ర పద్ధతి, బాబిలోనియన్ల గ్రీకుల 12 రాశుల రాశి చక్రంగా మార్పు చేయబడింది. అవి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మొదలైనవి. ఈ కాలంలో కూడా పంచాంగాలు కాలగణనకే ఉపయోగపడ్డాయి.
పక్కదోవ పట్టిన పంచాంగం!
క్రీ.పూ.4వ శతాబ్ది నుంచి మనుస్మ ృతికి భారతదేశంలోని ఎక్కువ రాజ్యాల్లో గౌరవం లభించింది. స్పష్టంగా చెప్పాలంటే బ్రాహ్మణులకు మాత్రమే విజ్ఞాన శాస్త్రాల అధ్యయనం, బోధన పరిమితమైన తరువాత పంచాంగాల్లో వికృత ధోరణులు పొడసూపాయి. ఖగోళశాస్త్రంలో పండితులైన వారు తిథుల్లో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అన్నారు. భూమి లాగానే రాళ్లూ, రప్పలూ వంటి పదార్థాలతో నిండిన గ్రహాలనూ, సూర్య నక్షత్రాన్నీ, 27 నక్షత్రాలనూ, చంద్రుడనే ఉప గ్రహాన్నీ దేవతలుగా మార్చారు. వాటి ప్రభావం మానవుల మీద అపారంగా ఉంటుందని అన్నారు. ఖగోళశాస్త్ర విజ్ఞానంతో మానవుల జీవితాలకు సంబంధించిన ఫలితాలంటూ ఏవేవో చెప్పసాగారు. మానవుల జీవితాల్లో జయాపజయాలకు, కష్ట సుఖాలకూ, వారి మనస్తత్వాలకూ - వారు జన్మించిన తేదీని బట్టిగానీ, చంద్ర సంవత్సర వివరాలను బట్టి గానీ, స్త్రీలకు రజస్వల కాలాన్ని బట్టి గానీ సంబంధం ఉంటుందని అన్నారు. బల్లి పాటుకూ, పిల్లి ఎదురు కావడానికీ, తుమ్ముకూ భవిష్యత్తుతో సంబంధం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రతి కీడుకూ శాంతి అవసరమన్నారు. అవన్నీ తమకు తెలుసునన్నారు. శాంతి చేయించినందుకు దక్షిణగా కొంత తమకు ముట్టజెప్పాలన్నారు. ప్రచార యంత్రాంగాన్ని తమ చేతుల్లో ఉంచుకుని ఇటువంటి అశాస్త్రీయ భావజాలానికి విస్తృత ప్రచారం కల్పించారు. ఈ అంశాలపై శాస్త్రీయ పరిశోధన చేస్తే వారి జోస్యాలు అబద్దాలని తేలాయి. తేలుతున్నాయి. 400 ఏళ్లనాడే వేమన పెళ్లి ముహూర్తాలను గురించి తన పరిశోధనా సారాంశాన్ని అత్యంత శక్తివంతంగా ఇలా తెలిపాడు :
'విప్రులెల్లజేరి వెర్రి కూతలు కూసి
సతిపతులను గూర్చి సంబరమున
మును ముహూర్తముంచ ముండెట్లు మోసెరా
విశ్వదాభిరామ వినుర వేమ'
ఏ పార్టీకి ఆ పంచాంగం!
ఇటీవలి సంవత్సరాల్లో ప్రతి ఉగాది పండుగ నాడూ కాంగ్రెస్‌, టిడిపి, టీఆరెస్‌, బిజెపిల ఆధ్వర్యంలో తమ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం జరుగుతోంది. ఏ రాజకీయ పార్టీ ఆస్థాన జ్యోతిష్యుడు ఆ పార్టీ నాయకుడు అధికారంలోకి వస్తాడని జోస్యం చెప్పడం రివాజుగా మారిపోయింది. 2009 ఉగాది పంచాంగంలో వారు తమ జోస్యాలకాధారంగా ఏవో గ్రహాల చలనాన్ని వివరించారు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క రకంగా గ్రహాలు ఎలా భ్రమణం చెందుతాయో వారికే తెలియాలి. అయినా ఆ సంవత్సరం జ్యోతిష్యులు చెప్పినట్టుగా చంద్రబాబు, అద్వానీ, కెసిఆర్‌, చిరంజీవి అధికారంలోకి రాలేదు.
2010-11 వికృతి నామ సంవత్సరంలో పంచాంగ ఫలితాలు ఇలా ఉన్నాయి : నేమాని వారు దుర్భిక్షం వస్తుందని చెబితే, తంగిరాల వారు మంచి వర్షాలు, పంటలూ పండుతాయని సెలవిచ్చారు. ములుగు వారు రాహుల్‌ ద్రావిడ్‌ ఆడడు, సహచరులను ఆడనివ్వడని, టీముకు బరువని చెప్పారు. కానీ ద్రావిడ్‌ 2010 డిసెంబరు నాటికి 200 క్యాచ్‌లు పట్టి, ప్రపంచ రికార్డు స్థాపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 191 పరుగులు చేసి మాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇవేనా జోస్యాలంటే ...? రాళ్లూ రప్పలకూ దైవత్వాన్ని ఆపాదించి వాటికి మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాలు ఉన్నాయంటే నమ్మేయడమేనా? పంచాంగకర్తలు ప్రజలను భయపెట్టి, శాంతుల పేరు మీద తరతరాలుగా దోచుకుంటున్నారు.
మహిళల పట్ల అణచివేత వైఖరి
స్త్రీల విషయంలో వీరి జోస్యాలు మరింత దుర్మార్గంగా ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి పంచాంగాల్లో బాలికలు రజస్వల కావడం వంటి విషయాల్లో ఫలితాలు ప్రకటిస్తున్నారు. సాయంత్రం పూట రజస్వల ఐతే జారగుణం కల స్త్రీ అవుతుందని ప్రకటించారు. సంధ్యలలో అయితే- చెడు ప్రవర్తన కలది ఔతుందని సూత్రీకరించారు. ఈ విషయాలనే పొన్నలూరి శ్రీనివాస గార్గేయ అచ్చ తెలుగులో రాసి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. లేచిపోతుందని, వ్యభిచారిణి, దొంగ అవుతుందని తన పంచాంగంలో పేర్కొన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇది స్త్రీ మనోభావాలను గాయపరచడమే కాక మానవ హక్కుల ఉల్లంఘన కూడా. అసలు వీరిలా చెప్పడానికి ఆధారం ఏమిటి? బల్లి తొడపై పడితే ఆ స్త్రీ వ్యభిచారిణి అవుతుందట. పురుషులకు అలాంటి ఫలితమేదీ చెప్పలేదు. ఈ ప్రకటనలన్నీ స్త్రీలను మానసికంగా వేధించి మరింతగా తమ అధీనంలో ఉంచుకోవడానికేనని అర్థం కావడం లేదా?
నాటి నుంచి నేటివరకూ ఈ పంచాంగ కర్తలు, జ్యోతిష్కులు- అంతా తమకే తెలుసని, ప్రజల జీవితాలపై తామే అధినాథులమని విర్ర వీగుతున్నారు. ఒకప్పుడు వ్యవసాయానికి, కాలగణనకు ఉపయోగపడిన పంచాంగం సైన్సు ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలో- కాలం చెల్లిన తతంగమే అవుతుంది. ఖగోళ విజ్ఞానం దాన్లో లేదని కాదు. అయితే, చాలా పరిమితమైనది. కొంతమంది స్వార్థపరుల, మూఢమతుల ప్రమేయంతో అదిప్పుడు ప్రగతికి ఆంటకంగా తయారైంది. కాబట్టి- ఈ అశాస్త్రీయ భావజాలంపై విద్యావంతులు, మహిళలు ఉవ్వెత్తున ఉద్యమం తేవాలి. శాస్త్రీయ భావజాల పూరితమైన నవ సమాజం కోసం నడుం బిగించాలి.
(వ్యాసకర్త ఫోను : 9490300449)

‘కూల్‌డ్రింక్స్’తో జాగ్రత్త..

వే సవి ఎండలు మండుతుంటే శీతల పానీయాలతో గొంతు తడుపుకుని సేద తీరాలని అందరూ భావిస్తారు. మరీ ఎక్కువగా కూల్‌డ్రింక్స్ తాగితే మొదటికే మోసం వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు లోతుగా అధ్యయనం చేసి కొత్త విషయాలను ఆవిష్కరించారు. ప్రతిరోజూ కూల్‌డ్రింక్ తాగేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వీరు తేల్చారు. కాగా, వారానికోసారి శీతల పానీయం తాగేవారి పరిస్థితి మెరుగ్గానే ఉంటుందని చెబుతున్నారు. కూల్‌డ్రింక్స్‌లోని తీపి పదార్థాలు రక్తంలో కొవ్వు పెరగడానికి కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ కొవ్వు కారణంగా గుండెపై వత్తిడి అధికమవుతుంది. శీతల పానీయాల వల్ల శరీరం బరువు కూడా పెరుగుతోందంటున్నారు. అధిక బరువు వల్ల అనేక ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. వేసవి తాపం నుంచి బయటపడేందుకు, గుండెజబ్బుల బారిన పడుకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగడం ఎంతో మేలని వారు చెబుతున్నారు.

Saturday, 24 March 2012

ఆల్‌ఫ్రెడ్ నోబెల్


  • - పాటిబండ్ల ధనలక్ష్మి
  • 17/03/2012
డైనమైట్, జిలెటిన్ లాంటి పేలుడు పదార్థాల ఆవిష్కర్తగా ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు అందరికీ తెలుసు. ఆయన చాలా సాదాసీదాగా, ఆదర్శవేత్తగా వుండేవాడు.
ఆయన తల్లి ఆండ్రితా అటుసెల్, తండ్రి ఇమాన్యుయేల్ నోబెల్. ఆయన 1833వ సంవత్సరంలో అక్టోబర్ 21న స్వీడెన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో జన్మించాడు. తండ్రి ఒక గొప్ప పారిశ్రామికవేత్త, ఆవిష్కర్త.
ఆయన అందరిలాగా బడికి వెళ్ళి చదువుకోలేదు. ఆయనకు అందరిలాగా ఎలాంటి డిగ్రీలు లేవు. చిన్నప్పుడు ఒక ప్రైవేట్ ట్యూటర్ దగ్గర చదువుకున్నాడు. ఆయన తండ్రి ఇంజనీరింగ్‌లో వౌలిక విషయాలను బోధించి, అతని మేధో వికాసానికి దోహదం చేసాడు. తన 16వ ఏటనే ఆయన గొప్ప కెమిస్ట్‌గా పేరుపొందాడు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్వీడిష్ భాషలు నేర్చుకున్నాడు.
ఆయన ఆవిష్కరణలు నోబెల్‌ను ప్రపంచంలోనే అధిక సంపన్నునిగా మార్చాయి. ఆయన పరిశోధనలు కేవలం పేలుడు పదార్థాలకే పరిమితం కాలేదు. ఆ తర్వాత ఆయన ఎలెక్ట్రో కెమిస్ట్రీ, ఆప్టిక్స్, బయాలజీ, ఫిజియాలజీ లాంటి ఎన్నో శాస్త్రాలలో ఆసక్తి పెంచుకున్నాడు.
నోబెల్ నాస్తికుడు. ఆయన తన సంపాదననంతా నోబెల్ ఫౌండేషన్‌కే ఇచ్చేసాడు. మొదట్లో ఆయన శాంతి, సాహిత్యం, రసాయనిక శాస్త్రం, భౌతికశాస్త్రం, వైద్యశాస్త్రం లాంటి అయిదు అంశాలలోనే నోబెల్ బహుమతిని ఏర్పాటుచేసాడు.
ప్రతి దేశం కూడా నోబెల్ బహుమతి పొందిన శాస్తవ్రేత్తలను గురించి ఎంతో గర్విస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్, సర్ సి.వి.రామన్, హరగోవింద్ ఖురానా, మదర్ థెరిస్సా, ఎస్.చంద్రశేఖర్, అమర్త్యసేన్ మన దేశానికి చెందిన నోబెల్ బహుమతి గ్రహీతలుగా కీర్తి గడించారు.

Friday, 23 March 2012

పరీక్షలంటే భయం ఎందుకు?


  • -మనస్విని
  • 24/03/2012
పరీక్షల కాలం వచ్చింది. దీంతో చాలామంది విద్యార్థులకు భయం పట్టుకుంటుంది. ఎలా చదవాలి? పరీక్షలు ఎలా రాయాలి? అని తెగ ఆందోళన పడుతుంటారు. నేడు పరీక్షల విషయంలో పిల్లలకంటే వారి తల్లిదండ్రులకే కంగారు ఎక్కువగా వుంటోంది. తమ ఇరుగుపొరుగువారి పిల్లలకంటే తమ పిల్లలకు ఎక్కడ తక్కువ మార్కులు వస్తాయేమోనని వారు భయపడతారు. ఈ కారణంతో తమ పిల్లల శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా బాగా చదవాలంటూ వారిపై వత్తిడి తీసుకువస్తారు. స్కూలులో టీచర్లు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకువచ్చి వారిలో వచ్చే మానసిక, శారీరక సంఘర్షణలకు కారణమవుతున్నారు.
ప్రతిరోజూ ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటలవరకూ అంటే పనె్నండు గంటల పాటు పిల్లలకు స్కూలు, ట్యూషన్‌తోనే సరిపోతుంది. ఇక పరీక్షలు వచ్చిన సమయంలో నిరంతరం చదుతూనే వుంటారు. ఇలా ఎప్పుడూ చదువులో మునిగితేలుతూంటే వారిలో మానసిక ఒత్తిడి పెరిగి అనార్యోం పాలవుతున్నారు. పిల్లలపై ప్రతినిత్యం తల్లిదండ్రులు ఈ విధంగా ఒత్తిడి చేయడం, చదువు విషయంలో కఠినంగా ప్రవర్తించటం మంచిది కాదు.
సర్వసాధారణంగా పరీక్షలు దగ్గరపడినపుడు, అవి ప్రారంభమైనపుడు పిల్లలు తమ మెదడుని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసేస్తారు. అలా చేయటం మంచిది కాదు. ఈ సమయంలోనే పిల్లలకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరం. మానసికంగా ఆందోళన చెందితే వారు పరీక్షలు సరిగా రాయలేరు. పైగా అంతకుముందు చదివినదంతా మర్చిపోయే ప్రమాదమూ వుంది. పరీక్షల సమయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే వారిలో భయం, ఆందోళన వంటివి మాయమవుతాయి.
సమయ పరిధి
చదువుకునేటపుడు అదేపనిగా గంటలకు గంటలు చదవకుండా 40-45 నిముషాలకోసారి చదివేలా నిర్దిష్ట సమయాన్ని పిల్లలే నిర్ణయించుకోవాలి. మధ్యమధ్యలో టీవీ చూడకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి.
స్థలం
పిల్లలు చదువుకోవటానికి నిర్దిష్టమైన స్థలాన్ని లేదా చోటును చూసుకోవాలి. నలుగురు కూర్చున్నచోట కూర్చుని చదవటంవల్ల వాళ్ళేం చదువుతున్నారో వారికి అర్థం కాదు. అందుకని సాధ్యమైనంత వరకూ ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. టీవీనో, డివిడిలో సినిమాలు చూస్తూనే చదువద్దు. మంచంపైన ఫ్లాట్‌గా, బోర్లా పడుకుని చదవకూడదు.
స్వీయ పరీక్షలు
స్కూలులో ఎలాగా టెస్ట్‌లు పెడతారు కదా అని బద్ధకించకూడదు. వాళ్ళకి వాళ్ళే స్వయంగా ఇంట్లో టెస్ట్ పెట్టుకుంటే పరీక్షలంటే భయం పోయి వారిపై వారికి ధైర్యం, నమ్మకం ఏర్పడతాయి.
ఆత్మవిశ్వాసం
ఒకచార్టు తయారుచేసుకుని, దానిలో రోజూ మీరేం చదువుతున్నారో, ఎంత చదువుతున్నారో రాసుకోవాలి. ఆ విధంగా టైంటేబుల్ తయారుచేసుకుని ఒక క్రమపద్ధతి ప్రకారం చదివితే పరీక్షలు సమీపించే సమయానికి సిలబస్ పూర్తిచేయగలుగుతారు.
రిలాక్సేషన్ కోసం
అప్పుడప్పుడూ వ్యాయామాలు చేయటంవల్లకూడా మనసుకు సంతోషంగా అనిపించి రిలాక్స్ పొందే అవకాశం వుంది. మనసులో ఎటువంటి భయాలను పెట్టుకోకుండా హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే తేలికగా పరీక్షలను ప్రశాంతంగా వారు రాయగలుగుతారు.
పౌష్టికాహారం
పౌష్టికాహార లోపంవల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆ కారణంగా పరీక్షలు సరిగా రాయలేకపోతారు. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు వంటివి మానేయాలి.
నెగెటివ్ థింకింగ్
చదువుకు సంబంధించి మనసులో ఏ విధమైన నెగెటివ్ థింకింగ్ (వ్యతిరేకంగా ఆలోచించటం)ను పెంపొందించుకోకూడదు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించుకోవాలి. అప్పుడు భయం, ఆందోళన లాంటివి దరిచేరవు.
నిపుణుల సలహా
విద్యార్థినీ విద్యార్థులు మానసిక వత్తిడికి లోనైతే కనుక ఒకసారి మానసిక వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది. నిపుణుల కౌనె్సలింగ్ వల్ల పిల్లలలో నూతనోత్సాహం వస్తుంది.
ఇక పిల్లల చదువుకు సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఎలా వుంటుందో పరిశీలిస్తే- పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్నివిధాలా సహకరించాలి. ఆ సమయంలో వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాక పిల్లల ఆరోగ్యం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏ విధమైన మానసిక, శారీరక వత్తిడులకు లోనుకాకుండా చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులదే.
పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులలో ఈ కింది మార్పులు వచ్చే అవకాశం ఉంది.
* మూడ్ మారటం
* ఉద్వేగాన్ని ఆపుకోలేకపోవటం
* అందరితో కలిసిమెలిసి వుండలేకపోవటం
* తమపై తమకు శ్రద్ధ తగ్గిపోవటం
* నిద్రసరిగా ఉండకపోవటం
* తలనొప్పి, వొళ్ళునొప్పి వంటివి రావటం
* ఆకలి లేకపోవటం లేదా మందగించటం
* ఆత్మన్యూనతతో తమని తాము తక్కువ చేసుకుని బాధపడటం
* నిత్యం తాము చేసుకునే పనులపై ఆసక్తి తగ్గటం
* త్వరగా గానీ, కారణం లేకుండా గానీ కోపంరావటం
* దేనిపైనా శ్రద్ధ లేకపోవటం
* తాము దేనికీ అర్హులం కామని అనుకోవటం
* అశక్తతతో బాధపడటం
* అకారణంగా తమని తాము నిందించుకోవటం, మనసులో వ్యతిరేక ధోరణిని, భావాలను పెంపొందించుకోవటం- ఇలాంటివన్నీ కనిపించవచ్చు.
-పైన పేర్కొన్న వాటిని అందరూ పిల్లలకూ అన్వయించి చూడటం మంచిదికాదు. అందరూ పిల్లలు అలా వుండకపోవచ్చు. ఒకవేళ తమ పిల్లలలో ఈ ధోరణి, లక్షణాలు కనిపించినట్లయితే వాటినుంచి బయటపడేలా తల్లిదండ్రులు చూ డాలి. తల్లిదండ్రులు శ్రద్ధ చూపిస్తే పిల్లలలో పరీక్షలంటే భయం తప్పకుండా పోతుంది.
-మనస్విని

Saturday, 17 March 2012

చెట్టు..!


  • నేను నేర్చిన పాట
నన్నెందుకు గొడ్డలితో నరుకుతావురన్నా..?
నా గొంతుకు రంపంతో కోయకురోరన్నా..!
నేనెదిగితే ఏమైనా కష్టమా?
పచ్చగా మరి నేనుంటే నష్టమా?
నిమ్మలంగ బతకమంటు కాయలిస్తా.. పండ్లిస్తా..!
కంటికింక గాలి పెరిగి మంచివాన కురిపిస్తా..!
మంచివాన కురిపించి బంగారం పండిస్తా..!
గాలిలో పొగలు సెగలు కంఠంలో నిలుపుకుంటా..!
పక్షులను, ప్రాణులను ప్రాణంగా చూసుకుంటా..!
మీ తాతలు ముత్తాతలు మా నీడనే బతికిరంట..!
అందుకే మా చెట్లలన్నింటికి చేతులెత్తి మొక్కమంట..!!
- తలకంటి విపిన్‌రెడ్డి 1వ తరగతి

Friday, 16 March 2012

అమ్మో! పొట్టలో పురుగులు


డా. శ్యామలాంబ, శిశు వైద్య నిపుణులు  
            చిన్నపిల్లల్లో కనిపించే ముఖ్యమైన సమస్యల్లో నులిపురుగులు ఒకటి. నులిపురుగులు మాత్రమే కావు, ఇలా పొట్టలో ఆవాసాన్ని ఏర్పరచుకుని మనల్ని అనారోగ్యం పాలుచేసే పరాన్నజీవులు రకరకాలున్నాయి. వాటిలో మనదేశంలో నులిపురుగులదే పైచేయి. నులిపురుగులు మనమీద ఆధారపడి బతికేవి. ప్రపంచంలో
1 బిలియన్‌ ప్రజలు దీనిబారిన పడిఉంటారని అంచనా. అతి
శుభ్రమైన దేశాల్లో కూడా వీటి పాలపడేవారుండటం విశేషం! దీనికి అనేక కారణాలున్నాయి.
కారణాలు:

ా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత లోపంవల్ల
ా రక్షిత నీరు 70-80% ప్రదేశాల్లో ఉంది. కానీ మన దేశంలో శానిటరీ సౌకర్యం 20-30% మాత్రమే ఉంది. ఇవి ఎలా వ్యాప్తి చెందుతాయి అనే అవగాహన లేనపుడు అందరూ దీని బారిన పడతారు.
నులిపురుగులు మన పొట్టలోకి ఎలా వస్తాయి? ఎలా వ్యాప్తి చెందుతాయి?

1. పిల్లలు బయట ఆడుకునే సమయంలో మట్టిలో ఆడుకున్నపుడు ఈ నులిపురుగుల అండాలు గోళ్లనుండి నోట్లోకి పోయే అవకాశం ఎక్కువ.
2. కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నపుడు ఇవి సులువులో పొట్టలోకి ప్రవేశిస్తాయి.
3. సరైన వండని పదార్థాల ద్వారా ఇవి పొట్టలోకి వ్యాపిస్తాయి. ముఖ్యంగా ఆవుమాంసం, పందిమాంసం ద్వారా టేప్‌ వర్మ్‌ రావచ్చు.
ఎక్కువగా ఈ నులిపురుగులు 4-6 ఏండ్ల లోపు పిల్లలు బడిపిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే ఏ వయసువారైనా వీటి బారిన పడొచ్చు.
లక్షణాలు:

1. ఈ పరాన్నజీవులు ఏ అలజడి మనిషిలో కలిగించకుండా కూడా ఉంటాయి.
2. పొట్టలో నులినొప్పి.
3. ఆకలి లేకపోవడం.
4. బరువు పెరగకపోవడం... ముఖ్యంగా పిల్లల్లో
5. పోషకాహార లోపాలు
6. ఎనీమియా(రక్తహీనత)
7. రోజులో ఎక్కువసార్లు విరోచనాలు
8. దద్దుర్లు అప్పుడప్పుడూ రావచ్చు
9. ఇస్నోఫీలియా, ఆస్తమా వంటి ఎలర్జీలు ఉన్నపుడు వీటిని గురించి ఆలోచించి పరీక్షచేసి మందులివ్వాలి.
10. ఇది ఎక్కువ సంఖ్యలో ఉన్నపుడు పేగుకు అడ్డుపడి, వాంతులు, పొట్ట ఉబ్బినపుడు ఎమర్జెన్సీ అవుతుంది. అప్పుడు తప్పకుండా ఆసుపత్రికి వెళ్లాలి. పూర్వం పిల్లల్లో వచ్చిన నులిపురుగులను ఆపరేషన్‌ చేసి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
11. థ్రెడ్‌ వర్మ్స్‌ ఉన్నపుడు మలద్వారంవద్ద దురద, మూత్రంలో మంట మొత్తం కుటుంబసభ్యుల్లో ఉండొచ్చు.
పరాన్నజీవులను ఎలా గుర్తించడం:
పైన చెప్పిన లక్షణాలు పిల్లల్లో కనిపించినపుడు మలపరీక్షద్వారా నిర్ణయం చేయాలి. కొన్ని ప్రాంతాల్లో అంటే నులిపురుగులు ఎక్కువగా కనిపిస్తున్న ప్రాంతాల్లో... బడిపిల్లల్లో 'డీ వార్మింగ్‌' పేరిట ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు.


పరాన్నజీవుల నివారణ:
1. నులిపురుగులు కనిపించినపుడు పిల్లలకు వైద్యుని సలహాతో నివారణ మందులు ఇవ్వాలి.
2. ఒక్కరికి వైద్యం చేయడంకాకుండా మొత్తం బడిపిల్లలందరికీ అవసరాన్ని బట్టి వైద్యుని చూపించి 'డీ- వార్మింగ్‌' చేయించాలి.
3. థ్రెడ్‌ వర్మ్‌ కనిపిస్తే మొత్తం కుటుంబానికి ఒకేసారి మందులు వాడాలి.
4. ప్రజల్లో శుభ్రతగురించి, పరాన్నజీవుల ప్రభావం గురించి అవగాహన తీసుకురావాలి.
5. 'చెప్పులు' చాలా జబ్బులనుండి మనల్ని రక్షిస్తాయి. ముఖ్యంగా 'హుక్‌వర్మ్‌' తిన్నగా చర్మంనుండే శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అలాకాకుండా చెప్పులు కాపాడతాయి.
6. అలాగే 'స్పైరోకీటల్‌ జాండిస్‌' అనే వర్మ్‌ పేడనుండి అంటే పశువుల మలమూత్రాలనుండి శరీరంలోకి ప్రవేశిస్తుంది. తోటపనిచేసేవారు మొక్కలకు బలం చేకూరుతుందని పేడ వేస్తుంటారు. ఆ సమయంలో ఈ పరాన్నజీవి శరీరంలోకి తిన్నగా ప్రవేశిస్తుంది. అందుకే జాగ్రత్త వహించాలి. గ్రామాల్లో పేడతో కళ్లాపి జల్లేవారూ ఇది గుర్తించాలి.
పరిసరాల పరిశుభ్రత:
పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఉన్నందువల్ల కలుషితాలు తక్కువ. కానీ పల్లెల్లో ఈ పరిస్థితి లేదు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత నేటికీ కరువే. ఈ మధ్య చేసిన ప్రభుత్వ సర్వేలు సైతం గ్రామాల్లో పరిశుభ్రతా లేమిని చెబుతున్నాయి. భారతదేశంలోని సగం ఇళ్లకు సెల్‌ఫోన్లు ఉన్నాయట. కానీ, టాయిలెట్లు లేవట! సరైన బాత్రూములు, టాయిలెట్లు లేని కారణంగా అక్కడి ప్రజలు రోడ్డుపక్కన, పొలాలు, చెరువుల పక్కన మలమూత్ర విసర్జన చేస్తారు. ఇది వారి ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది. పరాన్నజీవులు, రోగకారకాలు ఒకరినుండి మరొకరికి చాలా సులువుగా సంక్రమిస్తాయి.
మంచినీళ్లు నిల్వ ఉంచే పద్ధతి:
ఇది చాలా ముఖ్యం. సాధారణంగా ఒక బిందెలో నీరు నిల్వచేస్తారు. అందులో గ్లాసు లేదా లోటా ముంచుకుని నీటిని తాగుతారు. అలా ముంచినపుడు గోళ్లలోని పరాన్నజీవుల అండాలు మరొకరికి సంక్రమిస్తాయి. అందుకే అలా చేయకూడదు. బిందె మూతి చేయి దూరనంత సన్నగా ఉండాలి. లేదంటే ట్యాప్‌ ఉన్న కుండలు, కూజాలు వాడాలి. నీటిని కాచి చల్లార్చాలి. మంచినీటిపై ఎప్పుడూ మూతపెట్టాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా జబ్బులనుండి నివారణ పొందవచ్చు.
ప్రమాదం రాకుండా ఎలా జాగ్రత్తపడాలి:
ఇక్కడ వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. ఎవరి తువాలు వాళ్లే ఉపయోగించాలి. మరొకరి తువాలు వాడకూడదు. వారి బట్టలు వేరుగా ఉతకాలి. మందులిచ్చినపుడు మొత్తం కుటుంబానికి ఇవ్వాలి. గోళ్లు సరిగ్గా కత్తిరించుకోవాలి. ఏ పనికి ముందైనా చేతులు సరిగ్గా శుభ్రపరచుకోవడం ముఖ్యం. చిన్నపిల్లల అండర్‌ గార్మెంట్స్‌ ఆరు గంటలకోసారి మార్చాలి. అపుడు వ్యాధి త్వరగా తగ్గుముఖం పడుతుంది. పెంపుడు జంతువులనుండి జాగ్రత్తగా ఉండాలి. వాటినుండి పరాన్నజీవులు చాలా తొందరగా వ్యాప్తిచెందుతాయి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు, మొత్తం కుటుంబం కడుపులోని పురుగుల బారినుండి తప్పించుకోవచ్చు.

Wednesday, 14 March 2012

గాలి వీస్తే చెట్లు ఎందుకు ఊగుతాయి?


గాలి ఎలా వీస్తుంది? గాలి వీస్తే చెట్లు ఎందుకు వూగుతాయి? - ఎన్‌. ప్రత్యూష, సర్‌ సి.వి.రామన్‌ పబ్లిక్‌ స్కూల్‌, వరంగల్‌
గాలిలో అణువులు ఉన్నాయి. ప్రధానంగా నైట్రోజన్‌ సుమారు 79 శాతం వరకు, ఆక్సిజన్‌ సుమారు 19 శాతం, సుమారు 1 శాతం ఆర్గాన్‌ జడ వాయువు, చాలా తక్కువే అయినా మనల్ని ఆందోళనకు గురిచేస్తున్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ కూడా వాతావరణంలో సుమారు 0.04 శాతం, ఇంకా నీటి ఆవిరి సుమారు 1 శాతం గాలిలో ఉంటాయి. ఈ పదార్థాలన్నీ గాలిలో వాయు రూపంలో ఉండడం వల్ల, ఈ పదార్థాల అణువుల సైజు చాలా తక్కువగా (సగటున 5A0 కన్నా తక్కువ) ఉండడం వల్ల గాలి కంటికి కనిపించదు. ఒక A00అంటే ఒక ఆంగ్‌స్ట్రామ్‌ అని అర్థం. ఒక ఆంగ్‌స్ట్రామ్‌ A0 కొలత ఒక మిల్లీమీటరులో ఒక కోటివంతో భాగంగా అర్థంచేసుకోవాలి.

ఆర్గాన్‌ తప్ప గాలిలోని మిగిలిన అణువుల్లో కనీసం రెండు పరమాణువులు (atoms) ఉన్నాయి. ఆర్గాన్‌ వంటి ఏక పరమాణుక పదార్థాల పరమాణువులు కేవలం మూడు దిశల్లో ప్రయాణం చేయగలవు. ఈ చలనాలను స్థానమార్పిడి చలనాలు (translational motions)అంటారు. వీటి గమనంలో గతిశక్తి (kinetic energy) దాగి ఉంటుంది. ద్విపరమాణుక అణువుల (diatomic molecules) యిన ఆక్సిజన్‌, నైట్రోజన్‌ వంటి అణువులకు స్థాన మార్పిడి చలనాలతో పాటు అవి గిరగిరా తిరగడం వల్ల వాటికి రెండు విధాలుగా భ్రమణ చలన గతిశక్తి (rotational kinetic energy) సిద్ధిస్తుంది. అంతేకాదు, ఈ అణువుల్లో కంపనాలూ (oscillations) ఉంటాయి. పరమాణువుల మధ్య ఉన్న రసాయనిక బంధం ఓ స్ప్రింగులాగా పనిచేయడం వల్ల నైట్రోజన్‌, ఆక్సిజన్‌ వంటి అణువులు ఎపుడూ డోలనాలు (periodic motions)చేస్తూనే ఉంటాయి. అంటే ఈ అణువులలో మొత్తంగా 6 విధాలైన (3 translational + 2 rotational + 1 vibrational) గమన విధానాలు ఉన్నాయన్నమాట. కార్బన్‌ డై ఆక్సైడ్‌, నీటి ఆవిరి వంటి త్రిపరమాణుక అణువుల (triatomic molecules) దగ్గర అదనంగా ఇంకా కొన్ని కంపనాలు (vibrations) ఉంటాయి.

అంటే వీటి దగ్గర 6 కన్నా హెచ్చు గమన పద్ధతుల్లో శక్తి ఉండగలదు. ఇలా గాలిలో ఉన్న అణువులు ఎప్పుడూ చలనాలలో ఉండడం వల్ల అవి పాత్రల గోడల మీద వత్తిడి (impact) కలిగిస్తాయి. ఇలా గాలిలోని అణువుల వల్ల ఓ ఉపరితలంలో ఓ చదరపు సెం.మీ. మీద పనిచేసే వత్తిడినే వాతావరణ పీడనం (atmospheric pressure) అంటారు. ఇలాంటి వత్తిడి బలా(impacting force)నికి ఓ ధర్మం ఉంది. కదలని వస్తువుల్ని కదిలించేది, కదలికలో ఉన్న వస్తువుల్ని మరింత కదిలించేది బలమే కదా? దీన్నే న్యూటన్‌ మొదటి గమన సూత్రం (Newton First Law of Motion) అంటారు. ఇంటిగోడలు, మనుషుల శరీరం, బస్సులు, నేల, చెట్లకాండం బాగా కుదురుగా, దృఢంగా ఉండడం వల్ల చిన్న చిన్న బలాలు వాటిని ఏమాత్రం అటూ ఇటూ కదిలించలేవు.

కానీ చెట్ల ఆకులు, చిన్న చిన్న శాఖలు (branches) చిన్నపాటి బలాలు పనిచేసినా కదలగలవు. కాబట్టి గాలిలోని అణువులు కోట్లాదిగా నికరం (effective) గా చెట్ల ఆకుల మీద పనిచేస్తే ఆకులు కదలాల్సిందే. అయితే సాధారణ పరిస్థితుల్లో గాలి నిలకడగా ఉన్నప్పుడు, ఆకులమీద అన్నివైపులా సమానంగా గాలి అణువుల వత్తిడి పనిచేస్తుంది. ఈ స్థితిలో ఆకుల మీద నికరబలం శూన్యం కావడం వల్ల చెట్ల ఆకులు నిలకడగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వాతావరణంలోని గాలిలో సూర్యకాంతి పడే తీరుతెన్నులు వేర్వేరుగా ఉన్నా, గాలి స్పర్శించే పదార్థాల గుణగణాలు వేర్వేరుగా ఉన్నా గాలిలో ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు (temperature gradients) ఏర్పడతాయి.

అధిక ఉష్ణోగ్రత అంటే అర్థం గాలి అణువుల్లో ఎక్కువ శక్తి ఉండడం. తక్కువ ఉష్ణోగ్రత అంటే గాలి అణువుల్లో తక్కువ శక్తి ఉండడంగా అర్థంచేసుకోవాలి. అంటే, ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఎక్కువ శక్తి (ఉష్ణోగ్రత) ఉన్న ప్రాంతం నుంచి గాలి అణువులు తక్కువ శక్తి (ఉష్ణోగ్రత) ఉన్న ప్రాంతం వైపు కదలడం వల్ల గాలిలో స్థూలచలనాలు ఏర్పడతాయి. వీటినే సంవహన చలనాలు convective currents) అంటారు. ఇవి ఓ వైపు నుండి మరోవైపు వేగంగా వీయడం వల్ల నికరంగా గాలిలో స్థూలమైన గమనాలు (wind currents) వస్తాయి. కాబట్టి ఆ తాకిడికి చెట్ల ఆకులు ఊగుతాయి. ఈ స్థూల గమనాలు మితిమీరితే తుపానులు, సుడిగుండాలు, ఈదురుగాలులు వచ్చి ఆకులతో పాటు భవనాలు, చెట్లు కదులుతాయి. కొన్నిసార్లు కూలతాయి.