Thursday, 1 March 2012

సామాజిక పాత్ర..


మూఢవిశ్వాసాల్ని రాజకీయలబ్ధికి ఓ పద్ధతి ప్రకారం సామా న్యుల్లో ప్రవేశపెట్టి, పోషిస్తూ రాజులకాలం నుండే పాలకులు వినియో గించుకుంటున్నారని దేవీప్రసాద్‌ ఛటోపాధ్యాయ 'భారత తాత్విక స్రవంతి: సజీవాలు, నిర్జీవాలు' (పేజీలు 39-43) చదివితే అర్థమవుతుంది.
రాజులు, రాజ్యాలు, రాజ్యాంగయంత్రాంగం ఏర్పడి, కోట్లాది మంది ప్రజల శ్రమను కొల్లగొట్టడం మొదలైనప్పటి నుండే ఈ విశ్వా సాలు పెద్దఎత్తున ప్రచారంలోకి రావడం మొదలైందని చెప్పవచ్చు.
విపరీతమైన పన్నుల, ఇతర రూపాలలో విధించిన భారాలు ప్రజల్ని నిరుపేదలుగానూ, రాచరికవర్గాల్ని మరింత సంపన్నులు గానూ మార్చాయి. ఫలితంగా ప్రజలలో వస్తున్న అసంతృప్తిని పక్క దోవ పట్టించడానికి మూఢవిశ్వాసాలను పెంచాలని, రాజగురువులు, సలహాదారులు రాజులకు సలహాలిచ్చేవారని కౌటిల్యుడు రాసిన 'అర్ధ శాస్త్రం' ద్వారా అర్థమవుతుందని ఆర్‌.ఎస్‌.శర్మ విశ్లేషణ పూర్వకంగా వివరించినట్లు ఛటోపాధ్యాయ తెలిపారు.
''రాజుకు వ్యక్తిగతంగా ఎలాంటి మూఢవిశ్వాసాలు ఉండ కూడదు. కానీ, ప్రజలలో మూఢవిశ్వాసాలు పెంచాలి అని కౌటిల్యుడు భావించాడు. ఉదా: రాజు కొన్నిసార్లు రాత్రివేళల్లో ఒక దేవుడినిగానీ, పవిత్రమైన మందిరాన్నిగానీ స్థాపించాలి. ఆ తర్వాత, దేవుడి పూజ కోసం, అతను సమ్మేళనాలు, జాతరలు జరిపి సొమ్ము వసూలు చేసుకొని, తన ఖజానాను పెంపొందించుకోవాలి. ఏదైనా చెట్టుదగ్గర రాక్షసుడి వేషంలో ఒక గూఢచారిని నియమించి రోజూ ప్రాణ బలి కోరుతూ ప్రజలలో భయోత్పాతాన్ని కలిగించాలి. వీటికి అనుకూ లించని వ్యక్తులచే విషం తాగించి, చంపి, ఇదంతా దేవతల శాపం వల్లనే జరిగిందని గూఢచారులచే చెప్పించాలి. అలాగే, దేవుడిని నిరాకరించే వ్యక్తిని గూఢచారులు తాచుపాముతో కరిపించాలి. అంతేకాక ఆ అపశకునాలకు వ్యతిరేక కార్యక్రమాల పేరు మీద ఖజానాను నింపేందుకు వారు విరా ళాలు వసూలు చేయవచ్చు. కొన్ని సందర్భాలలో రహస్యంగా దేవుడి ప్రతిమల్ని నాశనం చేయాలి. దానివల్ల వరదలు సంభవించి నట్లు, ఇది శత్రు వు ఓటమికి సూచనైనట్లు గూఢచారు లతో ప్రచారం చేయించాలి. రాజుకు అతీతశక్తులున్నాయనీ, వారికి స్వర్గం నుండి యుద్ధశక్తులు లభించాయని వారు ప్రచారం చేయాలి'' అని కౌటిల్యుడు చెప్పినట్లు ఆర్‌.ఎస్‌.శర్మ విశ్లేషించారు. దీన్నే రాజులు, పాలకవర్గాలు కాలానుగుణంగా మార్చి, మూఢవిశ్వా సాలను ప్రజలలో ప్రచారం చేశారు, చేస్తున్నారు.
నిజాం కాలంలో..
''కొన్ని వందల ఏళ్ళ నుండి చేస్తు న్న దొరల దోపిడీకి, దానివలన అను భవిస్తున్న నరక యాతనలు, తీవ్ర అవమానాలకు విసిగి 1940లో తెలంగాణా ప్రాంతం ప్రజలు కమ్యూ నిస్టులచే చైతన్యవంతులవుతుంటే, వారి చైతన్యాన్ని నీరుకార్చడానికి, దొర లు అనేక మూఢవిశ్వాసాల ప్రచారాని కి పెద్దఎత్తున ప్రయత్నించారని ప్రము ఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు చుక్క రామయ్య ఇటీవల ఒక పత్రిక లో రాశారు. ఆ ప్రయత్నాలలో భాగం గా, ప్రతి గ్రామానికీ పురాణాలు చెప్పే బ్రాహ్మణులను పిలిపించారు. వారికి ఒక్కొక్కరికీ 2,3 ఎకరాల పొలం రాశా రు. వారితో 'దొరల ఐశ్వర్యానికి కార ణం వారు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమనీ, ప్రజల దరిద్రానికి కారణం వారు పూర్వజన్మలో చేసుకున్న పాప మనీ, కాబట్టి ఈ జన్మలో దొరలపై అసూయతో వారి ఆస్తుల దోపిడీకి ప్రయత్నిస్తే ఆ పాపం కారణంగా వచ్చేజన్మలోనూ దరిద్రులుగా పుడ తారనీ, కష్టాలనుభవిస్తారనీ' చెప్పమని ఆదేశించారు. ఇదీ మూఢ నమ్మకాల ప్రచారకారణం. అందువల్ల, మూఢవిశ్వాసాలకు మూలం, కొనసాగింపు పాలకవర్గాలూ, వారి ప్రచార సాధనాలేనని చెప్పవచ్చు.
జ్యోతిష్యం తదితరాలు..
పాలకవర్గాలచే ఇలా ప్రచారంలోకి ప్రవేశపెట్టబడినవే జ్యోతి ష్యం, సంఖ్యాశాస్త్రం, బల్లిశాస్త్రం, వాస్తు మొదలైనవి. ఈ 'శాస్త్రా'లన్నీ ప్రజలకు ''నీ కష్టాలకు కారణం పైనున్నటువంటి పురుషులో, స్త్రీలో, నపుంసకులో, గ్రహాలూ, బల్లులు, ఎదురొచ్చే పిల్లులు, కింద పడేసిన గోళ్ళు, కంచం కడిగిన నీళ్ళు, మూలనున్న చీపుళ్ళు'' అని చెబుతాయిగాని, దొరలదోపిడీ అని మాత్రం చెప్పవు. అసలు ఈశాన్య మూలన ఉండే చీపురు మన ధనాన్ని ఎలా నాశనం చేస్తుందో, ఈ రెంటికీ మధ్యన కార్యాకారణ సంబంధం ఏముందో వివరించవు. అంతేకాదు; ఆ సంబంధాన్ని నిరూపించలేవు. పై అంశాలలో ఏదీ రుజువుకు నిలవలేదు. అయినా, ఆ ప్రచారం అలా సాగుతూనే ఉంది. ఉంటోంది.
అయితే విజ్ఞానశాస్త్రం పెరిగేకొలదీ, విశ్వాసాలు సన్నగిల్ల సాగాయి. దీనికి ఇటీవలి ఉదాహరణనే తీసుకుందాం. గ్రహణాల చుట్టూ అనేక మూఢవిశ్వాసాలు అల్లబడినాయి. గ్రహణ సమయంలో ఆహారం విషతుల్యమౌతుందనీ, గర్భిణీ స్త్రీలు బయట తిరిగితే తొర్రి (పెదవి చీలడం) గల పిల్లలు పుడతారనీ ప్రజలు నమ్మేవారు. కానీ, విజ్ఞానశాస్త్రం గ్రహణ సమయంలో సూర్యుడు లేక చంద్రుడి నుండి ఎలాంటి విషకిరణాలూ ప్రసరించవని రుజువు చేసింది. పసిపిల్లల తొర్రికి ప్రధానకారణం మేనరిక వివాహాలు, తద్వారా బయటపడిన జన్యులోపాలేనని గ్రహణ సమయంలో గర్భిణి స్త్రీ చలనానికి ఏ సంబంధమూ లేదని నిరూపించింది. అందువలన, ఆ విశ్వాసాలు వెనుకపట్టుపట్టాయి. ఈనాడు గ్రహణ సమయంలో జనవిజ్ఞాన వేదిక ఏర్పాటుచేస్తున్న గ్రహణ భోజనాలకు వేలాదిమంది హాజరై భోంచేసి, ఆరోగ్యంగా తిరిగి వెళ్తున్నారు. అనేక మంది కార్యకర్తలు గర్భిణులైన తమ భార్యలను గ్రహణ సమయంలో ఆరుబయట తిప్పుతున్నారు. తర్వాత ఆ స్త్రీలు పండంటి బిడ్డలను కంటున్నారు. ఇలా విశ్వాసాలపై విజ్ఞానశాస్త్రం నిరంతరం విజయాలు సాధి స్తోంది. ముందుకు సాగుతోంది. ప్రజలను ప్రగతిపథాన నడిపిస్తోంది.
'ఇవన్నీ అంగీకరిస్తున్నానుగానీ, రాజులు ప్రజలను పన్నులతో పీడించుకుతినే వారని మీరన్నారు. దానికేమైనా రుజువుందా?' అని
నన్ను ప్రకాషరావు అనే మిత్రుడు అడిగాడు.
''ఉందండీ. ఎక్కడిదాకానో ఎందు కు? ఇటీవలనే వెలుగులోకి వచ్చిన కేరళలోని తిరు వనంతపురం పద్మనాభ స్వామి ఆలయ సంపదను, ఆనాటి రాజులు, దేవాలయానికి ఎలా సమకూ ర్చారు? పన్నుల ద్వారా'' అని కేరళ గ్రంథాలయాల్లో లభించిన చరిత్ర పుస్త కాల్లో రాయబడిన విశేషాలను ఇటీవల ఆంధ్రజ్యోతి 18.7.2011న ప్రచురిం చింది. దాని ప్రకారం ''తిరువనంత పురం రాజులు పుట్టుకపన్ను,చావుపన్ను లాంటి దుర్మార్గపు పన్నులే కాకుండా పసిబిడ్డల చనుబాల మీద 'ములకారం' అనే పన్నును వేశారు. అయితే, అతి దుర్మార్గమైన ఈ పన్నును ఓ మహిళ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె పన్ను కట్టకుండానే తన బిడ్డకు పాలిచ్చింది. ఈ విషయం తెలిసిన రాజు తీవ్ర ఆగ్ర హావేశాలతో ఆ ఇంటికి భటులను పంపాడు. వారు పన్ను కట్టవలసిందే నని హూంకరించారు. తొలుత తాను కట్టేదిలేదని ధిక్కరించినా, కాసేపటి తర్వాత ఆమె సొమ్ము తెస్తానని లోపలి కెళ్ళింది. తన రెండు రొమ్ము లను కోసి తెచ్చి.. 'ఇదిగోపన్ను తీసుకోండి' అం టూ వారి మొహాన విసిరికొట్టి, అక్కడి కక్కడే కుప్పకూలి మరణించింది.'' 'ఇదీ విషయం. ఇలాంటి దుర్మార్గ పాలన లపై ప్రజలు అసంతృప్తిని పక్క దోవ పట్టించ డానికే వారు మూఢవిశ్వా సాలను వ్యాప్తి చేస్తున్నారని' నా మిత్రునికి వివరించాను.
నేటి పాలకవర్గం...
రాజ్యాంగం ఉపోద్ఘాతం (పీఠిక) లోనే మన దేశాన్ని సార్వభౌమ సమసమాజ, లౌకిక (సెక్యులర్‌), ప్రజాస్వామ్య గణతంత్రం (రిపబ్లిక్‌)గా ప్రకటించింది. ఆర్టికల్‌ 51 ఎ (హెచ్‌) ద్వారా పౌరుల ప్రాథమిక బాధ్యతలలో 'శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, పరిశీలన, సంస్కరణల ఉత్సుకత'ను పెంపొం దించాల్సిన బాధ్యత ఉంచబడింది. దీనికి విరుద్ధంగా రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటున్నానని వాగ్దానం చేస్తున్న ఈనాటి పాలకవర్గం మూఢవిశ్వాసాల ప్రచారంలో కొత్తపుంతలు తొక్కు తున్నాయి. దీనికోసం ఆధునిక వైజ్ఞానిక, ప్రచార పద్ధతుల్ని వినియోగిస్తున్నాయి. వెలవెలబోతున్న దేవాలయాలను ఆధునీ కరిస్తున్నాయి. తీర్థయాత్రీకుల సౌకర్యాల కోసం ప్రతి సంవత్స రం వందలు, వేలకోట్లు ఖర్చు చేసి ప్రచారాన్ని, అన్ని సదుపా యాల్ని కలిగిస్తుంది.
మత విశ్వాసాలను ప్రోత్సహించేందుకు రాజ్యాంగానికి విరుద్ధంగా పాలకులు అనుసరిస్తున్న పద్ధతుల్ని అర్థంచేసుకోవా లంటే వివిధ పుష్కరాల సమయంలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పరిశీలించవచ్చు. దీన్ని హజ్‌ యాత్రలో, ఇతర మత సంబంధ కార్యక్రమాలలో, క్రిస్టియన్లు, ఇతర మైనార్టీ మతవిశ్వాసాల ఉత్సవాలలో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా వెల్లడిస్తోంది.
పాలకవర్గాలు వెలవెలబోతున్న దేవాలయాలను ఆధునీ కరిస్తున్నాయి. తీర్థయాత్రీకుల సౌకర్యాల కల్పన కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాయి. దానితో యాత్రీకుల సంఖ్య పెరిగింది, పెరుగుతోంది. ఉదా: జమ్మూ-కాశ్మీర్‌లో అమరనాథ్‌ ఆలయాన్ని 1989లో కేవలం 12,000 మంది మాత్రమే సందర్శించారు. కానీ ఆతర్వాత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకశ్రద్ధతో, తీర్థయాత్రీకుల మౌలిక సౌకర్యాలను, పర్యా వరణ సంస్థల రికమెండేషన్లను పక్కనబెట్టి కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేశారు. ఆ కారణం ఫలితంగా యాత్రీకుల సంఖ్య 2007 నాటికి 4లక్షలకు పెరిగింది. అలాగే వైష్ణవదేేవి ఆల యానికి భక్తుల సంఖ్య 1986లో 13 లక్షలు ఉండగా, 2007 నాటికది 70 లక్షలకు పెరిగింది! దేశంలోని 60 శాతం పాఠశా లల్లో బాలికలకు మరుగుదొడ్లు కట్టించడానికి, ప్రభుత్వాల దగ్గర డబ్బు లేకపోవడం తీవ్రంగా గమనించాల్సిన విషయం.
'సత్యసాయిబాబా'గా ప్రకటించుకున్న సత్యనారాయణ రాజు 'దర్శనం' కోసం వెళ్ళే యాత్రీకులకు దక్షిణమధ్య రైల్వేశాఖ 2000లో 50% ఛార్జీల రాయితీని ప్రకటించింది. అలాగే శాస్త్రవిజ్ఞానం ఇంత అభివృద్ధి చెందిన తర్వాతా, ఈనాడు, సకాలంలో వర్షాలు కురవకపోతే ఆలయాలు, చర్చీలు, మసీదు ల్లో పూజలు, ప్రార్థనలు చేయమని ప్రభుత్వమే ఆదేశాలిస్తుంది. వరదలు వచ్చినప్పుడు నదీ ప్రార్థనలను కలెక్టర్లు చేయడం గురించి మనం చదువుతున్నాం. ఇదే విధంగా హజ్‌యాత్రీకుల సౌకర్యార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిఏటా వందల కోట్ల ను ఖర్చు చేస్తున్నారు. క్రిస్టియన్‌ మత విశ్వాసులకు ఎన్నో రాష్ట్రాల్లో కోట్ల ఖర్చుతో ప్రోత్సాహాలను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఇస్తున్నాయి. తద్వార మత, మూఢవిశ్వాసాల కొనసా గింపుకు ఆధునిక కాలంలో కూడా పాలకవర్గం తోడ్పడుతోంది.
ఇటీవల హరిద్వార్‌ కేంద్రంగా 'గాయత్రీ పరివార్‌' అనే ఒక థార్మిక ప్రచారసంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ చేస్తున్న ప్రచారాంశాలలో ఒకటేమిటంటే 'గాయత్రీ మంత్రం' లో అద్భుతమైన మానవాతీతశక్తులున్నాయని. ఆధ్యాత్మిక గురువు డా||ప్రణవ్‌ పాండ్య ప్రకారం 'గాయత్రీ మంత్రంలోని 24 స్వరాలు' మానవ శరీరంలోని ఉన్నత కేంద్రాలపై 'పాజి టివ్‌ ఫలితాన్నిస్తాయి. ఆ మంత్రం యొక్క ఆశ్చర్యకరమైన శక్తి, అత్యున్నత పరిధిలో ధ్వని సంబంధ తీవ్ర చలనాలుగానూ, శక్తి క్షేత్రాలుగానూ మారుతుంది.' 'హిందూయిజం, టుడే సెప్టెం బర్‌ 92) 'శాస్త్రీయ ఆధ్యాత్మికత' పేరు మీద వీరుచేస్తున్న ప్రచా రానికి అత్యున్నత విద్యావంతులే ఎక్కువగా ఆకర్షితులౌతున్నా రనీ, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ సభ్యులు ఏడు కోట్ల మంది ఉన్నారనీ వారి ప్రకటనలే తెలియజేస్తున్నాయి. వీరు చెప్పే పాజిటివ్‌, నెగటివ్‌శక్తులు ఇంతవరకు ప్రపంచంలోని ఏ శాస్త్రీ య విశ్వవిద్యాలయమూ అంగీకరించకపోయినా, వీరు హరి ద్వార్‌లో స్థాపించిన విద్యాలయానికి ప్రభుత్వం 'డీమ్డ్‌ యూని వర్శిటీ' హోదాను ఇచ్చింది. వీరి 'పరిశోధనాసంస్థ'కు గుర్తింపు నీయడం పాలకవర్గాలకూ, వీరికీ ఉన్న గాఢ సంబంధాన్ని సూచిస్తోంది. దీనినే ప్రముఖ రచయిత్రీ మీరానందా ఇలా విశ్లే షించారు. 'విద్యాపరమైన అత్యున్నత విధాన నిర్ణయసంస్థ యూనివర్శిటీ గ్రాంట్స్‌కమిషన్‌, ఆధునికశాస్త్రాలైన బయో టెక్నాలజీ, జినోమిక్స్‌తోబాటు మార్మికకళలలోనూ కేంద్రీకృత పరిశోధనలకు ఎప్పుడైతే అంగీకారం తెలిపిందో, అప్పుడు గురు కుల పాఠశాలలు మార్మికకళలను శాస్త్రాలుగా పరిగణించబో వని ఎవరూ ఆశించలేరు (దిగాడ్‌ మార్కెట్‌, పేజి 121)'.

కె.ఎల్‌.కాంతారావు,
జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment