Friday, 16 March 2012

అమ్మో! పొట్టలో పురుగులు


డా. శ్యామలాంబ, శిశు వైద్య నిపుణులు  
            చిన్నపిల్లల్లో కనిపించే ముఖ్యమైన సమస్యల్లో నులిపురుగులు ఒకటి. నులిపురుగులు మాత్రమే కావు, ఇలా పొట్టలో ఆవాసాన్ని ఏర్పరచుకుని మనల్ని అనారోగ్యం పాలుచేసే పరాన్నజీవులు రకరకాలున్నాయి. వాటిలో మనదేశంలో నులిపురుగులదే పైచేయి. నులిపురుగులు మనమీద ఆధారపడి బతికేవి. ప్రపంచంలో
1 బిలియన్‌ ప్రజలు దీనిబారిన పడిఉంటారని అంచనా. అతి
శుభ్రమైన దేశాల్లో కూడా వీటి పాలపడేవారుండటం విశేషం! దీనికి అనేక కారణాలున్నాయి.
కారణాలు:

ా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత లోపంవల్ల
ా రక్షిత నీరు 70-80% ప్రదేశాల్లో ఉంది. కానీ మన దేశంలో శానిటరీ సౌకర్యం 20-30% మాత్రమే ఉంది. ఇవి ఎలా వ్యాప్తి చెందుతాయి అనే అవగాహన లేనపుడు అందరూ దీని బారిన పడతారు.
నులిపురుగులు మన పొట్టలోకి ఎలా వస్తాయి? ఎలా వ్యాప్తి చెందుతాయి?

1. పిల్లలు బయట ఆడుకునే సమయంలో మట్టిలో ఆడుకున్నపుడు ఈ నులిపురుగుల అండాలు గోళ్లనుండి నోట్లోకి పోయే అవకాశం ఎక్కువ.
2. కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నపుడు ఇవి సులువులో పొట్టలోకి ప్రవేశిస్తాయి.
3. సరైన వండని పదార్థాల ద్వారా ఇవి పొట్టలోకి వ్యాపిస్తాయి. ముఖ్యంగా ఆవుమాంసం, పందిమాంసం ద్వారా టేప్‌ వర్మ్‌ రావచ్చు.
ఎక్కువగా ఈ నులిపురుగులు 4-6 ఏండ్ల లోపు పిల్లలు బడిపిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే ఏ వయసువారైనా వీటి బారిన పడొచ్చు.
లక్షణాలు:

1. ఈ పరాన్నజీవులు ఏ అలజడి మనిషిలో కలిగించకుండా కూడా ఉంటాయి.
2. పొట్టలో నులినొప్పి.
3. ఆకలి లేకపోవడం.
4. బరువు పెరగకపోవడం... ముఖ్యంగా పిల్లల్లో
5. పోషకాహార లోపాలు
6. ఎనీమియా(రక్తహీనత)
7. రోజులో ఎక్కువసార్లు విరోచనాలు
8. దద్దుర్లు అప్పుడప్పుడూ రావచ్చు
9. ఇస్నోఫీలియా, ఆస్తమా వంటి ఎలర్జీలు ఉన్నపుడు వీటిని గురించి ఆలోచించి పరీక్షచేసి మందులివ్వాలి.
10. ఇది ఎక్కువ సంఖ్యలో ఉన్నపుడు పేగుకు అడ్డుపడి, వాంతులు, పొట్ట ఉబ్బినపుడు ఎమర్జెన్సీ అవుతుంది. అప్పుడు తప్పకుండా ఆసుపత్రికి వెళ్లాలి. పూర్వం పిల్లల్లో వచ్చిన నులిపురుగులను ఆపరేషన్‌ చేసి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
11. థ్రెడ్‌ వర్మ్స్‌ ఉన్నపుడు మలద్వారంవద్ద దురద, మూత్రంలో మంట మొత్తం కుటుంబసభ్యుల్లో ఉండొచ్చు.
పరాన్నజీవులను ఎలా గుర్తించడం:
పైన చెప్పిన లక్షణాలు పిల్లల్లో కనిపించినపుడు మలపరీక్షద్వారా నిర్ణయం చేయాలి. కొన్ని ప్రాంతాల్లో అంటే నులిపురుగులు ఎక్కువగా కనిపిస్తున్న ప్రాంతాల్లో... బడిపిల్లల్లో 'డీ వార్మింగ్‌' పేరిట ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు.


పరాన్నజీవుల నివారణ:
1. నులిపురుగులు కనిపించినపుడు పిల్లలకు వైద్యుని సలహాతో నివారణ మందులు ఇవ్వాలి.
2. ఒక్కరికి వైద్యం చేయడంకాకుండా మొత్తం బడిపిల్లలందరికీ అవసరాన్ని బట్టి వైద్యుని చూపించి 'డీ- వార్మింగ్‌' చేయించాలి.
3. థ్రెడ్‌ వర్మ్‌ కనిపిస్తే మొత్తం కుటుంబానికి ఒకేసారి మందులు వాడాలి.
4. ప్రజల్లో శుభ్రతగురించి, పరాన్నజీవుల ప్రభావం గురించి అవగాహన తీసుకురావాలి.
5. 'చెప్పులు' చాలా జబ్బులనుండి మనల్ని రక్షిస్తాయి. ముఖ్యంగా 'హుక్‌వర్మ్‌' తిన్నగా చర్మంనుండే శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అలాకాకుండా చెప్పులు కాపాడతాయి.
6. అలాగే 'స్పైరోకీటల్‌ జాండిస్‌' అనే వర్మ్‌ పేడనుండి అంటే పశువుల మలమూత్రాలనుండి శరీరంలోకి ప్రవేశిస్తుంది. తోటపనిచేసేవారు మొక్కలకు బలం చేకూరుతుందని పేడ వేస్తుంటారు. ఆ సమయంలో ఈ పరాన్నజీవి శరీరంలోకి తిన్నగా ప్రవేశిస్తుంది. అందుకే జాగ్రత్త వహించాలి. గ్రామాల్లో పేడతో కళ్లాపి జల్లేవారూ ఇది గుర్తించాలి.
పరిసరాల పరిశుభ్రత:
పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఉన్నందువల్ల కలుషితాలు తక్కువ. కానీ పల్లెల్లో ఈ పరిస్థితి లేదు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత నేటికీ కరువే. ఈ మధ్య చేసిన ప్రభుత్వ సర్వేలు సైతం గ్రామాల్లో పరిశుభ్రతా లేమిని చెబుతున్నాయి. భారతదేశంలోని సగం ఇళ్లకు సెల్‌ఫోన్లు ఉన్నాయట. కానీ, టాయిలెట్లు లేవట! సరైన బాత్రూములు, టాయిలెట్లు లేని కారణంగా అక్కడి ప్రజలు రోడ్డుపక్కన, పొలాలు, చెరువుల పక్కన మలమూత్ర విసర్జన చేస్తారు. ఇది వారి ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది. పరాన్నజీవులు, రోగకారకాలు ఒకరినుండి మరొకరికి చాలా సులువుగా సంక్రమిస్తాయి.
మంచినీళ్లు నిల్వ ఉంచే పద్ధతి:
ఇది చాలా ముఖ్యం. సాధారణంగా ఒక బిందెలో నీరు నిల్వచేస్తారు. అందులో గ్లాసు లేదా లోటా ముంచుకుని నీటిని తాగుతారు. అలా ముంచినపుడు గోళ్లలోని పరాన్నజీవుల అండాలు మరొకరికి సంక్రమిస్తాయి. అందుకే అలా చేయకూడదు. బిందె మూతి చేయి దూరనంత సన్నగా ఉండాలి. లేదంటే ట్యాప్‌ ఉన్న కుండలు, కూజాలు వాడాలి. నీటిని కాచి చల్లార్చాలి. మంచినీటిపై ఎప్పుడూ మూతపెట్టాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా జబ్బులనుండి నివారణ పొందవచ్చు.
ప్రమాదం రాకుండా ఎలా జాగ్రత్తపడాలి:
ఇక్కడ వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. ఎవరి తువాలు వాళ్లే ఉపయోగించాలి. మరొకరి తువాలు వాడకూడదు. వారి బట్టలు వేరుగా ఉతకాలి. మందులిచ్చినపుడు మొత్తం కుటుంబానికి ఇవ్వాలి. గోళ్లు సరిగ్గా కత్తిరించుకోవాలి. ఏ పనికి ముందైనా చేతులు సరిగ్గా శుభ్రపరచుకోవడం ముఖ్యం. చిన్నపిల్లల అండర్‌ గార్మెంట్స్‌ ఆరు గంటలకోసారి మార్చాలి. అపుడు వ్యాధి త్వరగా తగ్గుముఖం పడుతుంది. పెంపుడు జంతువులనుండి జాగ్రత్తగా ఉండాలి. వాటినుండి పరాన్నజీవులు చాలా తొందరగా వ్యాప్తిచెందుతాయి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు, మొత్తం కుటుంబం కడుపులోని పురుగుల బారినుండి తప్పించుకోవచ్చు.

No comments:

Post a Comment