Wednesday, 6 June 2012

సముద్రాలు... మహా సముద్రాలు...

భూగోళ, జీవ పరిణామక్రమంలో కీలకపాత్ర పోషించినవి ప్రధానంగా రెండు శక్తులు. సౌరశక్తి మొదటిది కాగా, రెండోది నీరు. భూగోళ ఉపరితలంలో ఉన్న మొత్తం నీటిలో 97 శాతం సముద్రాలు, మహా సముద్రాలలో ఒకేచోట ఉన్నది. భూగోళ వాతావరణం, ఋతుపవనాలు, వర్షం రాకపోకలను, ఉష్ణోగ్రతలను నియంత్రించటంలో సముద్రాలు, మహా సముద్రాలే కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య రవాణాలో 90 శాతం సముద్రం, మహా సముద్ర మార్గాల ద్వారానే ఇప్పటికీ జరుగుతుంది. సముద్ర ఉత్పత్తులు (చేపలు, పీతలు, రొయ్యలు తదితరాలు) మానవ ఆహారంలో ఒక ముఖ్యభాగంగా కూడా కొనసాగుతున్నాయి. వీటి సేకరణ వాటి పునరుజ్జీవశక్తిని మించడంతో ఈ వనరులు క్రమంగా క్షీణిస్తున్నాయి. మానవ నాగరికత, సంస్కృతి వీటితో మమేకమై ఉన్నాయి. ఇంత ప్రాముఖ్యత కలిగిన సముద్రాలను, మహా సముద్రాలను కలుషితం చేసే చర్యలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. వివిధ పరిశ్రమల కాలుష్యాలకు అంతిమ గమ్యంగా సముద్రం మారిపోయింది. సహజవాయువు, ముడిచమురు వెలికితీతలో, వీటి రవాణాలో జరుగుతున్న ప్రమా దాలు కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి. ఇవి జలచరాల సుస్థిరతను దెబ్బతీస్తాయి. మానవ జీవితం లో మహా సముద్రాల ప్రాధాన్యతను గుర్తుచేసి, ఆలోచింపజేసి, పరిరక్షించేందుకు వీలుగా 2008 నుండి జూన్‌ 8వ తేదీని 'ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం'గా జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. 2011-12లో దీన్ని 'యువకులు - మార్పుకోసం వచ్చే కొత్త అలలు' అనే లక్ష్యంతో నిర్వహించాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సముద్రాలు, మహా సముద్రాలకు సంబంధించిన విజ్ఞానాన్ని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.

           భూగోళంపై అతి భారీగా నీరు ఒకేచోట ఉండటం ద్వారా మహాసముద్రాలు ఏర్పడతాయి. ప్రపంచంలో ప్రధానంగా ఐదు మహా సముద్రాలున్నాయి. ఇవి: ఫసిఫిక్‌, అట్లాంటిక్‌, హిందూ, ఆర్కిటిక్‌, దక్షిణ మహా సముద్రాలు. ఇవికాక, 12కు పైగా సముద్రాలున్నాయి. వీటిలో మధ్యదరా సముద్రం అతి పెద్దది. మహా సముద్రాలు, సముద్రాలు వివిధ ఖండాల్ని వేరు చేస్తున్నాయి. మహా సముద్రాల మధ్య సరిహద్దు లంటూ ఏమీలేవు. కానీ, వీటిమధ్య నీరు అంతర్గతంగా, బహిర్గతంగా ఎప్పుడూ ప్రవహిస్తూ (కరెంట్స్‌) కలుస్తూ ఉంటుంది. మహా సముద్రాలు, సముద్రాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. సముద్రాలు, మహా సముద్రాలకన్నా చాలా చిన్నవి. సముద్రభాగం ఏదోమేర భూభాగంతో కలిసి ఉంటుంది. సముద్రం, భూమి కలిసే ప్రాంతాన్ని సముద్రతీరంగా వ్యవహరిస్తున్నాం. దీనికి విరుద్ధంగా మహా సముద్రం మరొక మహా సముద్రం లేక సముద్రంతో కలిసి ఉంటుంది.
లవణాలు..
సముద్రంలోని నీరు ఎప్పుడూ లవణాలతో కూడి ఉంటుంది. వీటిలో సోడియం లవణమే ఎక్కువగా ఉంటుంది. మిగతా వివరాలను 'లవణాల పరిమాణం' ఐటంలో చూడండి. భూమిపై వర్షాలు పడటం ప్రారంభమైనప్పటి నుండీ నీరు ఎత్తు ప్రాంతం నుండి పల్లపు ప్రాంతాలకు నదుల ద్వారా ప్రవహిస్తూ సముద్రాలుగా ఏర్పడ్డాయి. సముద్రాలలోని నీరు ఆవిరై తిరిగి వర్షంగా భూమీపై పడి, భూమిలోని లవణాలను కరిగించుకుని, మోసుకుంటూ నదుల ద్వారా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నాయి. ఇలా సముద్రంలో లవణాలు నిరంతరం చేరుతుంటాయి. వీటి నుండి నీరు మాత్రమే ఆవిరవుతుండటంతో సముద్రా లలో లవణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
లవణాల పరిమాణం..
సముద్రపునీటిలో లవణాలు కరిగి ఉంటాయి. వీటి పరిమాణం (శాతంలో) కొద్దిగానే మారుతుంటుంది. నీరు ఆవిరిగా మారడంపై, వర్షం మీద ఇది ఆధారపడి ఉంటుంది. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లవణ పరిణామాలు సహజంగా తగ్గిపో తాయి. అదేనీరు వేగంగా ఆవిరయ్యేకాలంలో లవణ పరిమాణం కొద్దిగా పెరుగు తుంది. వర్షాకాలంలో వరదనీరు పెద్దఎత్తున వచ్చి కలిసినప్పుడు కొంతమేర లవణ శాతం తగ్గుతుంది. నీరు గడ్డకట్టడం, కరగడమూ లవణ పరిమాణాల్ని ప్రభావితం చేస్తాయి. నీరు గడ్డకట్టినప్పుడు తాత్కాలికంగా లవణ పరిమాణం పెరుగుతుంది. కరి గినప్పుడు తగ్గుతుంది. సముద్రపునీటిలో సగటున 3.5% లవణాలున్నాయి. ఈ లవ ణాల్లో 55% క్లోరైడ్‌ రకానికి చెందినవి. 7.7 % సల్ఫేట్స్‌, 0.4% బై కార్బొనేట్స్‌, 0.2% బ్రోమైడ్‌రకాలు. 0.003% ఫ్లోరైడ్‌, 30.6% సోడియం, ఆ తర్వాత మెగ్నీషియం 3.68%, కాల్షియం 1.18%, పొటాషియం1.11% మేర లవణాలు ఉన్నాయి. లవణ పరిమాణమార్పులు జలచరాలను ప్రభావితం చేస్తాయి.
నీటి కదలిక..
సముద్రాలలో నీరు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. నిరంతరం కదులుతూ ఉంటుంది. అలలు, ఆటుపోట్లు, అంతర్గత ప్రవాహం ద్వారా నీరు కదులుతుంది. గాలి వేగంగా వీయడం వల్ల అలలు ఏర్పడతాయి. అయితే, వీటి వల్ల భారీగా నీరు కదలదు. సముద్రతీర ప్రాంతాలలోనే ఈ అలల తాకిడి గరిష్టంగా ఉంటుంది. మహాసముద్రాలలో అలల ప్రభావం కనపడదు.
ఆటూపోట్లు..
చంద్రుని కదలికల్ని బట్టి (చంద్రోదయం, అస్తమ యం, పౌర్ణమి, అమావాస్య) నీరు ఆటూపోట్ల ద్వారా స్థానభ్రంశం చెందుతుంది. ఈ సమయంలో భూభాగం పైకి నీరు కొన్ని అడుగుల నుండి కిలోమీటర్ల వరకూ విస్తరించి, వెనుదిరుగుతుంది. అంతర్గత ప్రవాహాలు సముద్రాలలో ప్రధానంగా ఉష్ణోగ్రతల తేడాల వల్ల కలుగుతాయి. ఈ కదలిక సముద్రాల మధ్య ఉంటుంది. ఉపరితల, అంతర్గత ప్రవాహాలు మహా సముద్రాలలో మెల్లగా ఉంటాయి. ఉత్తరార్ధ గోళంలో గడియారపు ముల్లు దిశలో, దక్షిణార్ధ గోళంలో గడియారపు ముల్లుకు వ్యతిరేకదిశలో ఈ ప్రవాహాలు ఉంటాయి. ఉష్ణోగ్రతల్లోని తేడాలు, గాలి కదలికలు కలిసి భూ ఉపరితల వాతావరణంలో ఆవిరి రూపంలో నీటి కదలికల్ని సృష్టిస్తాయి. ఈ కదలికలు మేఘాల ఏర్పాటుకు దారితీస్తాయి. ఆ తర్వాత, ఋతుపవనాలు సృష్టించబడి, వాటి కదలికలకు తోడ్పడతాయి. ఇవి వర్షాల్ని కురిపిస్తాయి.
లోతు..
సముద్రపు సగటు లోతు సుమారు 4000 మీటర్లు. కానీ, కందకాల్లో 11 వేల మీటర్ల (11 కి.మీ.) వరకూ ఉండవచ్చు. లోతును బట్టి సముద్రాన్ని మూడు మండలాలుగా గుర్తించారు.
కిరణజన్య సంయోగక్రియ మండలం: సముద్రం పై నుండి 200 మీటర్ల లోతు వరకూ ఇది విస్తరించి ఉంటుంది. చూడటానికి దీనిలోని నీరు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. దీనిలో సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు, నక్షత్ర చేపలు, ఆల్చిప్పలు, ష్రింప్స్‌, తాబేళ్లు, తదితరాలు సూక్ష్మదర్శినితోనే చూడగల కోట్లాది వృక్షజాతి ప్లాంక్టన్‌లు అనే సూక్ష్మజీవులు దీనిలో ఉంటాయి. వృక్షజాతికి చెందిన ఈ ప్లాంక్టన్‌లు సూర్మరశ్మిని ఉపయోగించుకుని, స్వయంగా ఆహారం తయారుచేసుకొని, వృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవుల్ని చేపలు, ఇతర జలచరాలు ఆహారంగా తీసుకొంటూ వృద్ధి చెందుతాయి.
మసక వెలుతురు (ట్విలైట్‌) మండలం: ఇది 200 మీటర్ల నుండి 1000 మీటర్ల మధ్య ఉంటుంది. దీనిలో ఉష్ణోగ్రత దాదాపు నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్‌ ప్రాంతంలో ఉంటుంది. కాకపోతే లోతుకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత రెండు డిగ్రీల వరకూ తగ్గుతుంది. ఈ మండలంలో డాల్ఫిన్స్‌, వేర్స్‌ తదితర జలచరాలు ఉంటాయి.
చీకటి (డార్క్‌) మండలం: దీనిలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. దీంట్లో కూడా పెద్ద పెద్ద జలచరాలు ఉంటాయి. అన్నింటికన్నా అడుగుభాగాన గుమ్మడికాయ ఆకారంలో సముద్రజీవాలు ఉంటాయి.
అడుగుభాగం..
ఇది ఎత్తుపల్లాలతో కూడి ఉంటుంది. ఎక్కువభాగం చదునుగా ఉంటుంది. మధ్యలో 'రిడ్జ్‌'భాగాలూ, అడుగున పర్వతాలూ ఉంటాయి. దీన్ని పర్వతభాగం అంటాం. ఒంపులు, కందకాలు (లోతైన పెద్దగుంటలు), అగ్నిపర్వతాలూ ఉంటాయి. ఈ అగ్నిపర్వ తాలు పేలుతుంటాయి. ఈ పేలుళ్లతో వెలువడిన లావా చల్లబడి పర్వతాలు, ఎత్తు పల్లాలు ఏర్పడతాయి. (సముద్రపు అడుగుభాగం బొమ్మలో చూడండి.)
అసలు నీరే లేకపోతే..?
భూమిపై అతి భారీగా ఉన్న నీరు ఉష్ణోగ్రతల్ని అదుపులో ఉంచుతుంది. త్వరగా వేడెక్కకుండా, చల్లారకుండా నిలువరిస్తుంది. తద్వారా జల, భూ చరాల మనుగడకి, అభివృద్ధికి దోహదపడుతుంది. వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. భూగోళం మీద ఈ నీరే కనుక లేకపోతే ఎలాంటి పరిమాణాలు వస్తాయో తెలుసుకోవాలంటే శుక్ర గ్రహంపై ఉన్న వాతావరణస్థితిని, అక్కడ పూర్తిగా అంతరించిన జీవరాశిని అర్థంచేసుకోవాలి. శుక్రగ్రహ వాతావరణ పరిస్థితుల గురించి ఇదే పేజీలో గతవారమే వివరంగా ఇవ్వడం జరిగింది. క్లుప్తంగా శుక్ర గ్రహ ఉపరితల వాతావరణం 460 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ ఉంటుంది. రాత్రి, పగలూ ఈ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదు. ఆక్సిజన్‌ ఉండదు. కాబట్టి దీనిపై ఏ జీవం కొనసాగడానికీ అవకాశం లేదు. ఒకప్పుడు శుక్ర గ్రహం మీద భూమిపైలాగే సముద్రాలున్నాయని భావిస్తున్నారు. అక్కడ నియంత్రణ లేని హరిత వాయువుల ప్రభావం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు విడుదలై నీరంతా ఆవిరైపోయిందట! అయితే, ఆ శుక్ర గ్రహంలో 'ఆకర్షణ శక్తి' దాదాపు లేకపోవడంతో వెలువడిన వాయువులు గ్రహ అంతర్భాగంలోకి వెళ్లాయి. అప్పుడున్న జీవాలు నశించిపోయాయి. అక్కడి వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ మాత్రం ప్రస్తుతం 96.5% ఉంది. వాతావరణం లో నత్రజని 3.5% మాత్రమే ఉంది. సల్ఫ్యూరిక్‌ ఆసిడ్‌ ఎక్కువగా మేఘాల రూపంలో ఉంది. భూగోళంపై జీవానికి అనుకూలంగా లేని అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే సముద్రాల్ని కాపాడుకుంటూ హరిత వాయువుల్ని నియంత్రించాలి. ఇది శుక్ర గ్రహం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం.

No comments:

Post a Comment