
ఈ జవాబు రాసే సమయంలో వార్తాపత్రికల ద్వారా మరో వారంలో నైరుతీ ఋతుపవనాలు వస్తాయనీ ఈ పాటికే కేరళ తీరాలను తాకాయనీ వార్తలు వింటున్నాం. వాటికిదే మన సుస్వాగతం.
అయినా మీరన్నట్లు ఈసారి ఎండాకాలం కొంత వర్షాకాలంలోకి చొరబడింది. వర్షాకాలం ఆరంభం కొంత ఆలస్యమైంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి సిద్ధం. ఇందులో మొదటిది వర్షాకాలం ఆలస్యానికి 80 శాతం కారణం. రెండోదాని ప్రభావం ఇంకా తీవ్రంగా లేదు. దాని ప్రభావం చాలా వందల సంవత్సరాల పాటు కొంచెం కొంచమే ఉంటుంది.
మానవ తప్పిదం అంటే ప్రపంచంలో ఉన్న మానవులందరి తప్పిదం కాదు. కేవలం ప్రకృతి వనరుల్ని తమ లాభాపేక్షతో దండుకొంటున్న పెట్టుబడిదారీవర్గం, దేశాలను కొల్లగొడుతున్న బహుళజాతి సంస్థల ధనదాహం, పర్యావరణానికి ఏమైనా తమ ఆధిపత్యమే నెరవేరాలన్న సామ్రాజ్యవాదపు ఆర్థిక రాజకీయ ప్రణాళికలే ఆ మానవ 'అమానవ తప్పిదాలు'.

భూగర్భ నీటిమట్టం (ground water table) ఆందోళనకర స్థాయిలో పడిపోయింది. మరోవైపు పర్యావరణ కాలుష్యాల్ని వాతావరణంలోకి నెట్టడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి, మీథేన్ తదితర హరిత గృహ వాయువుల (green house gases) పరిమితి మితిమీరుతోంది. ఫలితంగా వాతావరణం వేడెక్కి దానిలోని నీటిస్థాయిని వాయురూపంలోనే ఉంచేందుకు, ద్రవీభవించి వర్షంగా కురవకుండా చేసేందుకు పరిస్థితులు వేగవంతమవుతున్నాయి. మరోవైపు తీరప్రాంతాల్లో సెజ్‌ల పేరిట మోసగాళ్లకు వేలాది ఎకరాల్ని అంటగట్టి ప్రజాసంక్షేమం, ప్రకృతివనరుల పరిరక్షణను పక్కనపెట్టే విధానాలు అమలవుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఉత్పత్తి చేసే విద్యుదత్పత్తిలో అధిక మోతాదు పట్టణవాసుల సుఖాలకు ఉపకరిస్తోంది. గ్రామీణవాసుల గుడిసెల్లోకి, పంట పొలాలకు నీళ్లిచ్చేందుకు కాదు. విద్యుదుత్పత్తిలో సింహభాగం పట్టణ ప్రయోజనా లకు వాడబడుతున్నా అందులో మళ్లీ సుమారు 80 శాతం పైగా ఎయిర్ కండిషనర్లకు, ఎయిర్ కూలర్లకు, రిఫ్రిజిరేటర్లకు, శీతల గిడ్డంగులకు, తదితర శీతలీకరణ సాధనాలకు ఖర్చవుతోంది.
ఇక్కడ శాస్త్రీయంగా రెండు విషయాలను మనం గమనించాలి. ఒక పదార్థాన్ని కొన్ని సెంటీగ్రేడు డిగ్రీల మేర వేడిచేయడం కన్నా అదే వస్తువును అన్నే సెంటీగ్రేడు డిగ్రీల మేర చల్లబర్చడానికి అయ్యే శక్తి ఎక్కువ. ఉదాహరణకు: A, B అనే ఒకే రూపం, నిర్మాణం, పదార్థ స్వభావం ఉన్న వస్తువులు ఉన్నాయనుకుందాం. A అనే వస్తువు ప్రస్తుతం 500C వద్ద ఉందనుకొందాం. B అనే వస్తువు200C వద్ద ఉందనుకొందాం. A ని పట్టుకొంటే మనకు వేడిగా అనిపిస్తుంది. B ని పట్టుకొంటే మనకు చల్లగా అనిపిస్తుంది. మనం B అనేె వస్తువును 200జ నుంచి 500C వరకు వేడిచేసి A లాగానే ఉష్ణోగ్రత ఉండేలా చేయాలని నిర్ణయించామనుకొందాం. అందుకోసం మనం వెచ్చించే ఉష్ణీకరణ శక్తి (Heating Energy) విలువ 100 కెలోరీలు అనుకుందాం. అంటే B మీద మనం 100 కెలోరీల శక్తిని ఖర్చుచేస్తే A స్థితి పొందగలమన్న మాట. కానీ అలాకాకుండా A నే B లాగా చేయాలని ప్రయత్నించాలనుకొందాం. అంటే 500C వద్ద ఉన్న A ని 200C వద్దకు తీసుకురావాలన్నది మన ప్రయత్నం.
అందుకోసం మనం వెచ్చించాల్సిన శక్తి 100 కెలోరీలు సరిపోదు. సుమారు 150 కెలోరీలు అవసరం. అంటే అర్థమేమిటి? 200C నుంచి 500జ (300C మేర) వేడిచేయడానికయ్యే ఖర్చుకన్నా 500C నుంచి 200C కి (300C మేర) చల్లబర్చడానికి అయ్యే ఖర్చు ఎక్కువ. ఇది మన శక్తి నిత్యత్వ సూత్రానికి (law of conservation of energy) వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఆ సూత్రానికి అడ్డంకి రాలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ చల్లబరిచే క్రమంలో చాలా వేడి వాతావరణంలోకి వెళ్తుంది. అలా వాతావరణంలోకి వెళ్లిన వేడిని కూడా లెక్కిస్తే శక్తి నిత్యత్వం అమలైనట్లే. ఇలా వేడి చేయడంకన్నా చల్లబర్చడానికి అధికశక్తి అవసరమన్న సూత్రాన్ని ఉష్ణగతిక శాస్త్ర రెండో నియమం (second law of thermodynamics) అంటారు.
అంటే ఎండాకాలంలో మనం వాడే ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, శీతల గిడ్డంగులు అంతర్గతంగా చల్లబరుస్తున్నా అంతకన్నా అధికంగా వాతావరణాన్ని వేడిచేస్తున్నట్లు అర్థం. ఇలా ఎన్నో విధాలుగా వాతావరణం వేడెక్కడం వల్ల వర్షాల రాకడ మందగిస్తోంది. ఒకవేళ మేఘాలు వచ్చినా అవి వర్షించే స్థితి కూడా సన్నగిల్లుతోంది. ఇక రెండో కారణం ప్రకృతి సిద్ధమన్నాం కదా. అది భూమి ఆత్మభ్రమణ అక్షం (axis of spin) దిశ మారడం (precession). ప్రతి 20 వేల సంవత్సరాలకు ఒకసారి భూమి ఆత్మభ్రమణాక్షం తిరుగుతుంది. తిరిగే బొంగరం వయ్యారం (wobbling) చేస్తున్నట్టు భూమి, భ్రమణాక్షం కూడా వయ్యారం చేస్తుంది. దీనర్థం ఏమిటంటే ప్రతి 10 వేల సంవత్సరాలకి ఒకసారి ఋతువుల్లో మార్పులు వస్తాయి. మరో ఐదు వేల సంవత్సరాల కాలంలో డిసెంబరులో వేసవి, మే నెలలో చలి ఏర్పడే స్థితి వస్తుంది. ఆ పరిస్థితికి జరిగే ప్రయాణం కూడా ఈ వేసవి విస్తారానికి ఓ చిరు కారణం.
No comments:
Post a Comment