Sunday 16 September 2012

పాము పగ పడుతుందా?


  • ఎందుకని? - ఇందుకని!
పాము పగపడుతుందా?
-పి. కార్తీక్‌, నాన్నెబాలుర ఉన్నత పాఠశాల, 8వ తరగతి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా

పాము సరీసృపాలు (reptiles) అనే సకశేరుక (vertebrate) జంతు వర్గానికి చెందిన జీవి. పాముల్లో చాలా రకాలున్నాయి. ఎడారులు, సముద్రాలు కాకుండా మామూలు నేలభాగాల్లో, పొలాల్లో, ఇళ్ల దగ్గర, పొదల్లో, బావుల్లో, చెరువుల్లో, చెట్లమీద కనిపించే చాలా పాములు విషరహితం (non-poisonous). అవి కరిస్తే మనిషి చనిపోడు. ఏదైనా పదునైన ఇనుపతీగలు ఓ సెంటీమీటరు లోపలికి చర్మంలో గుచ్చుకొంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అంతకుమించిన సమస్యలు ఏవీ ఈ పామల కాటు వల్ల రావు. చాలామంది పాము అంటేనే భయం అనిపించడం వల్ల విషరహిత సర్పాలు కాటేసినా విషసర్పాలేమోనని, ఇక మరణం తథ్యం అనుకుంటూ బెంబేలుపడుతూ చాలామంది లేనిపోని సమస్యల్ని కొనితెచ్చుకుంటారు. కొందరు ఆ భయంతోనే గుండె ఆగి చనిపోతారు కూడా. పైన చెప్పినచోట్ల కనిపించే ఎన్నోరకాల పాముల్లో కేవలం మూడుపాములు మాత్రమే విషపూరితమైనవి (1) త్రాచుపాము లేదా నాగుపాము (cobra), 2. కట్లపాము (krait), 3. రక్తపింజెర (viper). వీటిని సులభంగా గుర్తించగలం. నాగుపాము పడగ ద్వారాను, పడగమీద ఉండే గుర్తు ద్వారాను దీనిని గుర్తించవచ్చును. కట్లపాము వీపు మీద నల్లని అడ్డగీతలు ఉంటాయి. ఇది చాలా పొట్టిగా ఉంటుంది. ఒక మీటరుకన్నా తక్కువే ఉంటుంది. నాగుపాము సైజు ఓ మోస్తరు నుంచి రెండు మీటర్ల వరకూ ఉంటుంది. రక్తపింజెర వీపుమీద '8' గుర్తుల్ని అడ్డంగా రాసి, చైనులాగా కలిపినట్లు మచ్చలు ఉంటాయి. రక్తపింజెరి కూడా రెండు మీటర్ల వరకూ పెరుగుతుంది. చెట్లపై కనిపించే పసిరిక పాము, చెరువుల్లో, బావుల్లో ఉండే నీటిపాము లేదా పూడుపాము, జెర్రిపోతు అనబడే పెద్దపాములు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవేవీ విషసర్పాలు కావు.
పాములు విషం కలిగినవైనా, విషం కానివైనా వాటికి చెవులు ఉండవు. కాబట్టి అవి మనిషి చేసే శబ్ధాల్ని, పాటల్ని, నాగస్వరాల్ని ఏమాత్రం వినలేవు. చెవిటివాని ముందు శంఖం ఊదినా వినిపిస్తుందేమోగానీ నాగుపాము, మరే పాము ముందర ఎంత గొప్ప నాగస్వరంతో 'నాగదేవతా రావా!' అనో 'నోము, పండించవా స్వామీ!' అనో అరిచి గీ పెట్టినా వినిపించుకోవు. ఎందుకంటే వాటికి చెవులే ఉండవు. పరిణామక్రమంలో పాముల చెవులు వ్యర్థావయవాలు (vestigial organs) అయ్యాయి. పాములు కేవలం పొట్ట అడుగున ఉన్న చర్మం ద్వారా భూమి మీద మన కాలి అడుగుల వల్లో, కప్ప గెంతుల వల్లో కలిగే కంపనాలను మాత్రమే గుర్తించగలవు. పాము కళ్లు కూడా అంత గొప్పవేమీ కావు. పాములు రంగుల్ని చూడలేవు. పైగా వాటికి ద్విమితీయ దృష్టి (binocular vision) లేదు. అంటే వస్తువును నలుపు, తెలుపులోనే కాకుండా స్పష్టంగా కూడా చూడలేవన్న మాట. పాముల మెదడు చాలా చిన్నది. ఆ చిన్న బుర్రతో తన సంతానాన్ని కూడా తాను గుర్తించుకొనే శక్తి దానికుండదు. తన స్థావరమేదో కూడా కనుగొనడానికి నానా యాతన పడుతుంది. అలాంటి పాములు మనుషుల్ని గుర్తించి, పగ పడతాయనడం, అలా అనుకోవడం మూఢనమ్మకం అనే కన్నా అధిక అజ్ఞానం అనాలి. 'వాడివి పాము చెవుల్రా!' అని బాగా వినేవారిని అంటాం. కానీ మాట వినిపించుకోని చెవిటిమేళం కోసం అనాలి.
విషపాములు కరిచినా భయం లేకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడేందుకు 90 శాతం అవకాశం ఉంది. పాము కాటేస్తే మంత్రాలు ఏవీ పనిచేయవు. చికిత్సతోనే పాము కాటు నుంచి బతికి బయటపడతాం. పాముల పుట్టలో పాలుపోస్తే వాటికి చాలా అయిష్టం. ఎందుకంటే పాములు పాలు తాగవు. 'పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది?' అన్న ప్రశ్నను కృతఘ్నతకు చిహ్నంగా వాడతారు. పాముకు పాలుపోస్తే చస్తుంది కాబట్టి, అన్యాయానికి (పాలు పోసి పెంచేవారి దుర్భిద్ధికి) గుర్తుగా ఆ సామెత వాడాలి.
వచ్చేవారం మనం పాము పుట్టల్లో గుడ్లు వేస్తారు. అవి తింటాయా? నాగస్వరం ఊదితే నాగుపాము పడగ ఆడిస్తుంది కదా? అదెలా? పాములు కుబుసం విడవడం, బుస కొట్టడం చేస్తాయి? దానివల్ల ఏమీ ప్రమాదం లేదా? వాసన తెలుస్తుందా? వంటి వివరాలు తెలుసుకుందాం..!

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

No comments:

Post a Comment