ప్రయోగం చేసి చూద్దాం

 

ఆక్సిజన్ వినియోగం


ఒక ఇనుప వస్తువుకు తేమ, గాలి తగిలితే  అది తుప్పుపడుతుంది. వస్తువు తుప్పుపట్టే  నేపథ్యంలో వాతావరణం ఏ విధంగా ప్రభావితం అవుతుందో తెలుసుకునే ప్రయోగం చేసి చూద్దాం.  ఒక పరీక్ష నాళిక తీసుకుని దానిలో
నిండుగా నీరు పోయాలి. దానిని బోర్లించితే అందులోని నీరంతా బయటకు  వెళ్లిపోతుంది. కాని పరీక్ష నాళిక లోపలి
గోడలు తేమగా ఉంటాయి. ఇప్పుడు ఈ పరీక్ష నాళికలో కొద్దిగా ఇనుప రజనువేసి బాగా కుదపాలి. కొన్ని ఇనుప రజను ముక్కలు పరీక్ష నాళిక లోపలి గోడలకుగల తేమకు అంటుకుని ఉండిపోతాయి. మళ్లీ పరీక్ష నాళికను బోర్లించాలి. పరీక్ష నాళిక లోపలి గోడలకు అంటుకొని ఇనుప రజను పరీక్ష నాళికనుండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సాసర్ తీసుకుని అందులో నీరుపోయాలి. సాసర్‌లోని నీటిలో పరీక్ష నాళికను తలకిందులుగా నిలబెట్టాలి. అంటే పరీక్షనాళిక మూతి సాసర్ నీటిలో మునిగిఉంటుంది. అమరికను బొమ్మలో చూడవచ్చు. ఈ అమరికను ఆ విధంగా రెండురోజులు అదే విధంగా ఉంచాలి.  రెండురోజులు తరువాత పరికరాన్ని పరిశీలిస్తే కొంత నీరు సాసర్‌నుండి పరీక్ష  నాళికలోకి పైకి ఎక్కిన విషయం గమనిస్తారు. ఈ పరిశీలననుబట్టి పరీక్ష నాళికలోని కొంత
వాయువు హరించుకుపోయిన విషయం స్పష్టమవుతుంది. ఆ కారణంగానే సాసర్‌లోని నీరు పరీక్ష నాళికలోకి పైకి
ఎక్కింది. గాలిలోగల ఆక్సిజన్ ఉపయోగపడి ఇనుప రజను తుప్పుపట్టింది.  అంటే ఇనుము తుప్పుపట్టడానికి కావలసిన ఆక్సిజన్‌ను వాతావరణం నుండి  సంగ్రహిస్తుంది. వాతావరణంలోని గాలిలో అయిదవ వంతుగల ఆక్సిజన్‌ను ఇనుము తుప్పుపట్టేటప్పుడు వినియోగించుకుంటుంది.
______________________________________________________________________

ఘన పదార్థాల వ్యాకోచం


వేడికి ఘన పదార్థాలు వ్యాకోచిస్తాయి. ప్రయోగాత్మకంగా, సులువుగా ఈ విషయాన్ని నిరూపించడం ఎలాగో చేసి చూద్దాం. రెండు సమానంగా ఉండే కర్ర దిమ్మలను కొంత దూరంలో వేరువేరుగా ఉంచండి. ఈ దిమ్మలపై ఒక ఇనుప కమీని అమర్చాలి. ఈ ఇనుప కమీ రెండు వైపులా కొనలు కనీసం 5 సెం.మీ. బయటకు ఉండేలా దిమ్మలపై ఉంచాలి. ఇనుప కమీ కదలకుండా ఉండేందుకు ఒక వైపు దిమ్మె పైగల కమీ కొన సమీపంలో కొంత బరువు ఉంచాలి. ఇది కమీని కదలకుండా కిందికి నొక్కిఉంచుతుంది. బొమ్మలో చూపిన విధంగా కమీ రెండవ కొనవైపు ఒక ఇనుప సూదిని 90డిగ్రీల కోణంలో వంచి రెండవ దిమ్మెపై ఉంచాలి. కమీ ఈ సూదిపై ఉంటుంది. ఈ సూదిమొన ఉన్నచోట దిమ్మపై పక్క భాగంలో పెన్నుతో గుర్తుపెట్టాలి.
ఇనుప కమీ మధ్యభాగంలో దిమ్మల నడుమ ఒక స్టవ్‌ను వెలిగించి దాని వేడి కమీకి తగులునట్లు చేయాలి. స్టవ్ వేడికి కమీ వ్యాకోచించడం ప్రారంభించింది. కమీ ఒక కొనవైపు బరువు వున్న కారణంగా అది అటువైపు కదలదు. రెండవ వైపునకు కమీ వ్యాకోచం కారణంగా పొడవు పెరుగుతుంది. కమీ పొడవు పెరగడంతో దానికింద సూది కూడా ముందుకు దొర్లుతుంది. సూదితోపాటు దాని మొన కూడా కదులుతుంది. గుర్తునుబట్టి మొన ఎంత కదిలింది తెలుస్తుంది. వేడి ఎక్కువగా కమీకి తగిలే కొలది సూది మొన ఎక్కువగా కదులుతుంది. స్టవ్‌ను ఆర్పివేస్తే కమీ చల్లబడి సంకోచిస్తుంది. సూది మొన తొలి గుర్తువద్దకు వస్తుంది. రైలు పట్టాలు వేసవిలో వ్యాకోచిస్తాయని పట్టాలు బిగించేటప్పుడు పట్టా పట్టామధ్యన ఈ కారణంగానే కొద్ది ఖాళీని వదులుతూ ఉంటారు.
________________________________________________________________

ఉష్ణ శోషణం


తెలుపు తక్కువగాను, నలుపు అధికంగానూ ఉష్ణాన్ని శోషించుకుంటాయి. అదేవిధంగా వాటి ఉష్ణోగ్రతలో మార్పులు ఉంటాయి. రకరకాల రంగులు వేరువేరుగా ఉష్ణాన్ని శోషించుకుంటాయి. వాటి ఉష్ణోగ్రతలు తదనుగుణంగా ఉంటాయి. దీనిని నిరూపించేందుకు ఒక చిన్న ప్రయోగం చేసి చూద్దాం.
పెద్ద మంచు ముక్కను తీసుకోవాలి. ఈ మంచు ముక్క ఉపరితలం నునుపుగా, సమతలంగా ఉండాలి. ఇలా మంచు ముక్కను సరిచేసుకునేందుకు ఒక వేడి గినె్నను ఉపయోగించాలి. ఈ వేడి గినె్నను మంచు ఉపరితలంపై రుద్దితే అది నున్నగా తయారవుతుంది.
తెలుపు, నలుపు ఇంకా రకరకాల రంగుల గుడ్డలను దీర్ఘచతురస్రాకారంగా సమానంగా ఉండునట్లు కత్తిరించాలి. ఈ గుడ్డలను మంచు ఉపరితలంపై బొమ్మలో చూపిన విధంగా పరచాలి. ఇప్పుడు ఈ మంచు దిమ్మను ఎండలో ఉంచాలి.
రంగు గుడ్డను బట్టి దాని అడుగున వున్న కరిగిన మంచు పరిమాణం మారుతూ ఉంటుంది. తెల్లని గుడ్డపై పతనం చెందిన సూర్యరశ్మి ఎక్కువ భాగం పరావర్తనం చెందడంవలన అది తక్కువ ఉష్ణాన్ని శోషించుకుంటుంది. అందుకే తెల్లని గుడ్డ కింద మంచు ఎక్కువగా కరుగుతుంది. నల్లని గుడ్డ మాత్రం సూర్యరశ్మిని ఎక్కువగా శోషించుకుంటుంది. అది ఎక్కువగా వేడెక్కడం వలన దాని కింద మంచు ఎక్కువగా కరుగుతుంది.
రకరకాల రంగులు రకరకాలుగా ఉష్ణాన్ని శోషించుకున్న కారణంగా వాటికింద మంచు రకరకాల పరిమాణాలలో కరుగుతుంది.
అంధులు 26 రంగు దీపాలను ఏర్పరచి వాటిని కరెంటుతో వెలిగించి, వాటికి ఇంగ్లీషు అక్షరాలు పేర్లు పెట్టుకుని వాటిని వెలిగించి తాకి ఆ అక్షరాన్ని తెలుసుకుంటూ ఉండడం తరచూ సైన్సు ఎగ్జిబిషన్స్‌లో కనిపించే ఒక నూతన ప్రక్రియ. ఇది బ్రెయిలీ లిపి వంటిదని ఈ వస్తు ప్రదర్శకులు చెబుతూ ఉంటారు.
-సి.వి. సర్వేశ్వర శర్మ
___________________________________________________________________

బ్యాటరీ ధృవసూచిక


కారులోని బ్యాటరీ పాతదయిపోవడంవల్ల దాని ధృవాలు కనపడడంలేదు. పైగా దానికి కొంత కరెంటు అందితే అది కారును ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది. మరొక కారు బ్యాటరీ అందుబాటులో వుంది. ధృవాలు స్పష్టత లేకపోవడంవల్ల జంపర్ కేబుల్ వున్నా వినియోగించుకోలేని స్థితిలో వున్నారు.
అటువంటప్పుడు బ్యాటరీ ధృవాలను కచ్చితంగా కనుగొనగల సూచికను మీరు తయారుచేసి సమస్యకు పరిష్కారం చేయగల్గుతారు.
పొడవుగా ఉండే రెండు రాగి తీగలను తీసుకుని వాటి చివరల కొంతమేర ప్లాస్టిక్ రక్షిత భాగం తొలగించాలి. ఒక డ్రై సెల్ తీసుకుని దానిని ఒక పలకపై పరుండబెట్టి దానిపై అది కదలకుండా ఉండునట్లు దాని మధ్యభాగంలో టేపు అతికించాలి.
డ్రై సెల్ బొడిపె భాగానికి రాగి తీగ రక్షితభాగం తొలగించిన ఒక కొనను టేపు సహాయంతో అతికించాలి. ఒక ఆలుగడ్డను తీసుకుని దానిని చాకు సహాయంతో వెడల్పుగా ఉండే ముక్కగా కోయాలి. రెండవ రాగి తీగ రక్షిత భాగం తొలగించిన కొనను డ్రై సెల్ రెండవ వైపు కింది భాగానికి అతికించాలి టేపుతో. ఇప్పుడు రెండు రాగితీగల రెండు చివరి కొనలు రక్షిత భాగం తొలగించినవి విడిగా వున్నాయి. వాటిని ఆలుగడ్డలోని గుజ్జులో దాదాపు 8 సెంటీమీటర్ల దూరంలో గుచ్చాలి. కొంత సమయం గడిచేసరికి ఆలుగడ్డలో గుచ్చిన తీగల వద్ద మార్పులు కనబడతాయి. బ్యాటరీ ధనధృవానికి కలిపిన తీగ గుంజులో బుడగలను ఏర్పరుస్తుంది. ఇవి ప్రస్ఫుటంగా కనపడకపోవచ్చు. బ్యాటరీ ఋణధృవం నుండి వచ్చిన తీగ గుజ్జులో దిగబడిన చోట ఆకుపచ్చగా తయారవుతుంది. దీనిని బట్టి బ్యాటరీ ఋణధృవం గుర్తుపట్టగల్గుతారు. రెండవ ధృవం ధనధృవం అవుతుంది. ఈ ఆలుగడ్డ సూచికను ఉపయోగించి కారు బ్యాటరీ ధన, ఋణ ధృవాలు గుర్తుపట్టగల్గుతారు.
_______________________________________________________________

సంగీత వాయిద్యం


ఒక గాజు జాడీని తీసుకోవాలి. దానిని మూడువంతుల వరకూ నీటితో నింపాలి. ఇందులోకి తక్కువ వ్యాసంగల ఒక ప్లాస్టిక్ పైపును దింపాలి. పైపు దిగువ కొన జాడీ కింది భాగానికి తగలాలి.
పైపును నిటారుగా వుంచి గొట్టం పైభాగంలో ఊదాలి. కొద్దిగా ప్రాక్టీసు చేస్తే ఊదడంవల్ల ఎక్కువ పిచ్‌లో శబ్దం వెలువడుతుంది. పైపులోగల గాలి స్తంభం కంపించడంవల్ల ఈ శబ్దం వస్తుంది. నిజానికి ఈ గాలి స్తంభం పొడవు తక్కువగా ఉంటుంది. ఎక్కువగా గొట్టంలో నీరు నిండి ఉంది. గొట్టాన్ని కొంచెం పైకి లాగి గాలి ఊదితే గాలి స్తంభం పొడవు పెరిగి శబ్దం వస్తుంది గాని దాని పిచ్ తగ్గుతుంది. గొట్టంపైకి లాగుతూ ఉంటే దానిలోని గాలి స్తంభం పొడవు పెరుగుతూ ఉంటుంది. గాలి స్తంభం పొడవు పెరిగేకొలదీ గాలి దానిలోకి ఊదడంవల్ల వెలువడే శబ్దం పిచ్ తగ్గిపోతూ ఉంటుంది. గాలి స్తంభం పొడవు మారుతూ ఉంటే శబ్దం రకరకాల పిచ్‌లతో వెలువడుతుంది. కొద్ది ఓర్పుతో గాలిని ఊదుతూ గాలి స్తంభాల పొడవును చాకచక్యంగా సర్దుబాటుచేసుకుంటే రకరకాల సంగీత ధ్వనులను పుట్టించగల్గుతారు. బాకా ఊదేవారు ఈ విధంగానే గాలి స్తంభం పొడవును సరిచేసుకుంటూ సంగీతం వినిపిస్తారు.
________________________________________________________________________

చేసి చూద్దాం

  • - సి.వి.సర్వేశ్వరశర్మ
  • 28/04/2012
ఒక గాజు గరాటు తీసుకుని దాని వెడల్పు మూతికి ఒక రబ్బరు బెలూన్ సాగదీసి మూతగా అమర్చి బిగుతుగా ఉండేటట్లు ఒక రబ్బరు బ్యాండ్‌ను తొడగాలి. ఇది సున్నితమైన విభాజక పటలంగా పనిచేస్తుంది. సూచికలో ఇదే ప్రధాన భాగం.
గరాటు కాడకు ఒక రబ్బరు గొట్టం కొనను అమర్చాలి. గొట్టం రెండవ కొన ఒక ప్లాస్టిక్ స్ట్రా కొనకు తగిలించాలి. ఒక నిలువుగా ఉండే స్టాండ్‌ను తీసుకోవాలి. ఈ స్టాండ్‌పై ప్లాస్టిక్ స్ట్రాను ‘యు’ ఆకారంలో వంచి కదలకుండా తగిలించాలి.
ఇప్పుడు రబ్బరు గొట్టాన్ని గరాటు కాడనుండి తీసివేయాలి. ఒక ‘ఐ’డ్రాపర్ సహాయంతో ‘యు’ గొట్టంలో సగం వరకూ నిండునట్లు ఎర్ర రంగు నీరుపోయాలి. ఇప్పుడు రబ్బరుగొట్టాన్ని మళ్లీ గరాటు కాడకు తగిలించాలి.
ఒక అక్వారియం తొట్టె తీసుకుని దానిలో మూడువంతుల నీరుపోయాలి. గరాటు మూతిని నీటిలో లోపలకు దిగునట్లు దింపాలి. గరాటు మూతి నీటిలో లోతుకు వెళ్లేకొలదీ ‘యు’ గొట్టంలోని ఎరుపు నీటి మట్టం పరిశీలించండి.
గరాటు మూతిని నీటిలో లోతుకు పంపేకొలది దాని మూతికి కట్టిన రబ్బరు పటలంపై నీటి భారం పెరుగుతుంది. అంటే, దానిపై పీడనం పెరుగుతుంది. ఫలితంగా పటలాన్ని గరాటులోకి గెంటడం జరుగుతుంది. గరాటులోని గాలి పీడనం దీనివల్ల పెరిగి ‘యు’ గొట్టంలోని రంగు నీటిపై దీని ప్రభావం పడుతుంది. అందుకే తెరచిన ‘యు’ గొట్టంవైపు నీటి మట్టం పైకి పెరుగుతుంది.
రకరకాల లోతుల్లోకి ఈ గరాటు దింపి ‘యు’ గొట్టంపై రంగునీటి మట్టం ఏ మేరకు పెరుగుతున్నదీ గమనించి దానిని క్రమాంకనం చేయవచ్చు. దీనివల్ల సులువుగా ఈ పరికరం ఉపయోగించి నీటిలో ఎంత లోతులో గరాటు వున్నది తెలుసుకోవచ్చు.
_______________________________________________________________

ఆక్సిజన్ తయారీ

  • - సి.వి. సర్వేశ్వరశర్మ
  • 21/04/2012
వృక్షాలు, మొక్కలు వాతావరణంలోని కార్బన్‌డై ఆక్సైడ్‌ను గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగ ప్రక్రియ జరుపుకుని ఆక్సిజన్‌ను విడుదలచేస్తాయి. అందుకే వృక్షాలను, మొక్కలను ఆక్సిజన్ ఫ్యాక్టరీలని పిలుస్తారు. ఇప్పుడు మొక్కల సహాయంతో ఆక్సిజన్‌ను ఎలా తయారుచేయవచ్చునో చేసి చూద్దాం.
ఒక బీకరు తీసుకుని దానిని పూర్తిగా నీటితో నింపాలి. అందులో నీటి మొక్కను ఉంచాలి. ఈ మొక్కపై ఒక గాజు గరాటును బోర్లించాలి. ఒక పరీక్ష నాళికను పూర్తిగా నీటితో నింపి గాజు గరాటు కాడపై బోర్లించాలి.
ఈ మొత్తం పరికరాన్ని ఆరుబయట సూర్యరశ్మి దానిమీద పడునట్లు ఉంచాలి. కొంత సమయం గడచిన తరువాత పరిశీలించి చూడాలి. నీటి మొక్కనుంచి ఏదో వాయువు విడుదలవుతున్నట్లు నీటిలో బుడగల రూపంలో కన్పిస్తుంది. ఈ గాలి బుడగలు పైకి లేస్తూ పరీక్ష నాళికను జేరి అందులో నీటిని కిందికి స్థానభ్రంశం చెందిస్తూ అచట చేరుతాయ.
ఈ విధంగా ఎండలో ఉంచిన ఈ పరికరంలో సూర్యరశ్మిని ఉపయోగించుకుని మొక్క ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ పరీక్ష నాళికలోకి జేరుతూ ఉంటుంది. చివరకు పరీక్ష నాళిక పూర్తిగా ఆక్సిజన్‌తో నిండిపోతుంది. పరీక్ష నాళికలోకి మండే అగ్గిపుల్ల ఉంచితే అది మరింత కాంతివంతంగా మండుతుంది. మంట ఆర్పి పుల్లను పరీక్ష నాళికలోకి ఉంచితే అది మండడం మొదలు పెడుతుంది. పరీక్ష నాళికలో పోగయ్యినది ఆక్సిజన్ అని స్పష్టమవుతుంది.
_________________________________________________________________

ఎ.డి. కరెంటు మోటారు

ఒక కార్కు బిరడా తీసుకోవాలి. దాని మధ్యభాగం గుండా కుట్టుకునే సూదిని గుచ్చి దాని మొన పైకి వచ్చేలా చేయాలి. ఈ సూది మొనపై ఒక వర్తులాకారపు అల్యూమినియం పలచని పళ్లెం బ్యాలన్స్ అయ్యేలా ఉంచాలి. ఆ పళ్లెం సూది మొన ఆధారంగా గిరగిరా తిరిగేందుకు ఇబ్బంది లేని విధంగా అమర్చాలి.
ఒక గుర్రపునాడా అయస్కాంతాన్ని తాడుతో వేలాడదీసి అది సరిగా అల్యూమినియం ప్లేటుపై వీలయినంత దగ్గరగా ఉండేలా చేయాలి. బొమ్మలో చూపిన విధంగా ఉంచాలి. అయస్కాంతం అల్యూమినియం పళ్లానికి ఏ మాత్రం తగలకూడదు.
అయస్కాంతం వేలాడ దీసిన తాడును 20సార్లు మెలితిప్పితే బాగా పురి ఎక్కుతుంది. దానిని వదిలివేస్తే పళ్లెంపై అయస్కాంతం వేగంగా భ్రమణం చెందుతుంది. ఇలా అయస్కాంతం ఆత్మభ్రమణం చేయడంవల్ల దిగువున వున్న అల్యూమినియం పళ్లెం సూది మొనపై గిరగిరా తిరుగుతుంది.
అల్యూమినియం, అయస్కాంతాల మధ్య కొద్దిపాటి అయస్కాంత బలం నెలకొంటుంది. గుర్రుపునాడా అయస్కాంతం ఆత్మభ్రమణం చేయడంవల్ల అల్యూమినియం పళ్లెంలో సుడిగా కరెంటు ఉత్పత్తి అవుతుంది. దీనినే ఎడీ కరెంటు అంటారు. ఈ కరెంటు కారణంగా అల్యూమినియం పళ్లెంపై అయస్కాంత క్షేత్రాన్ని గమనించవచ్చు.
అయస్కాంతం ఆత్మభ్రమణం చేసే దిశలోనే ఈ అయస్కాంత క్షేత్రం ఏర్పడి అదే దిశలో అల్యూమినియం పళ్లాన్ని భ్రమణం చెందిస్తుంది. పైన వేలాడదీసిన అయస్కాంతం ఎంత వేగంగా ఆత్మభ్రమణం చెందుతుంటే దానికి అనుగుణమైన వేగంతో అల్యూమినియం పళ్లెం కూడా సూదిమొనపై ఆత్మభ్రమణం చేస్తూ ఉంటుంది. కారులో ఉండే స్పీడోమీటరు ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.
______________________________________________________________

ఏకాంతర విద్యుత్ (ఎ.సి)

  • - సి.వి.సర్వేశ్వర శర్మ
  • 31/03/2012
ఒక తీగ చుట్టలో అయస్కాంతం అటూ ఇటూ కదులుతూ ఉంటే ఏకాంతర విద్యుత్ తీగలో పుడుతుంది. ఈ సూత్రం ఆధారంగా చిన్న ప్రయోగం చేసి చూద్దాం.
ఒక గ్లాసు తీసుకుని దాని గోడల చుట్టూ ఒక రాగి తీగను 60 చుట్లు చుట్టాలి. తీగ రెండు కొనలు సుమారు 30 సెం.మీ. చుట్టలో లేకుండా వదలాలి. ఈ తీగ చుట్టను దగ్గరగా చుట్టడంవల్ల అదొక క్వాయిల్‌గా తయారవుతుంది. ఈ తీగ చుట్టను గ్లాసునుండి బయటకు లాగి అది వీడకుండా ఉండునట్లు చిన్న చిన్న తీగ ముక్కలతో దానిని బంధించాలి. ఈ తీగ చుట్టను ఒక ప్లయివుడ్ ప్లాట్ ఫారమ్‌పై నిలువుగా బిగించాలి. తీగ చుట్ట మందాన్ని గుర్తించాలి.
తీగ చుట్ట కొనలు ప్లాట్‌ఫారమ్‌పై తీగ చుట్టకు ఇరువైపులా కొంత దూరంలో రంధ్రాలుచేసి అడుగునకు బిగుతుగా లాగి టేపుతో కదలకుండా అతికించాలి.
బొమ్మలో చూపిన ఆధారంగా ప్లాట్‌ఫారమ్ చివరి అంచులనుండి ‘ఎల్’ ఆకారంలో ప్లయివుడ్ ముక్కలు బిగించాలి. ఈ ‘ఎల్’ల చివరలనుండి బొమ్మలో చూపిన విధంగా తీగ చుట్టమధ్యభాగం గుండా పోయేటట్లు ఒక ఊయల ఏర్పాటుచేయాలి. ఒక దండాయస్కాంతాన్ని తీగ చుట్ట కేంద్రం గుండా పోయిన ఊయల మధ్య భాగంలో అమర్చాలి. తీగ చుట్ట కొనలను గాల్వనా మీటరుకు కలపాలి.
ఇప్పుడు ఊయలను ఊపితే తీగ చుట్ట నడుమ అయస్కాంతం అటూ ఇటూ ఊగుతుంది. ఫలితంగా తీగ చుట్టను ఖండించే అయస్కాంత బలరేఖల సంఖ్య మారి తీగ చుట్టలో విద్యుత్ ప్రేరితమవుతుంది.
అయస్కాంతం అటూ, ఇటూ ఊగుతుంది. కాబట్టి తీగ చుట్టలో విద్యుత్ ఏకాంతరంగా ఉత్పత్తిఅవుతుంది. ఈ విషయాన్ని గాల్వనామీటరులో గుర్తించవచ్చు. తీగ చుట్ట మందం మార్చి ప్రేరిత విద్యుత్ బలం ఎలా పెరుగుతున్నది తెలుసుకొనవచ్చు.
-___________________________________________________________

అయస్కాంత స్ప్రింగ్

థర్మోకోల్ పలక ఒకటి తీసుకోవాలి. దాని మధ్యభాగంలో ఒక దండాయస్కాంతాన్ని ఉంచాలి. ఈ అయస్కాంతం చుట్టూ థర్మోకోల్‌పై పెన్సిల్ సూదిమొనతో ఆరు రంధ్రాలు చేయాలి.
అయస్కాంతం కొనల ముందు ఒక్కొక్క రంధ్రం పొడవు పక్కల సమదూరంలో ఇరువైపులా రెండు రంధ్రాల చొప్పున నాలుగు రంధ్రాలు చేయాలి.
అయస్కాంతాన్ని తొలగించి, ఒకొక్క కన్నంలోను ఒకొక్క పెన్సిల్ చొప్పున కదలకుండా ఉండునట్లు థర్మోకోల్ పలకలోకి దింపాలి. ఈ పెన్సిళ్ల మధ్యన దండాయస్కాంతాలు ఒకదానిపై మరొకటి అమర్చాలి. పై అయస్కాంతం కింది భాగం కింది అయస్కాంతం పైభాగం వికర్షించుకునే విధంగా వీటిని అమర్చాలి. ఈ విధంగా అయిదు అయస్కాంతాలను పెన్సిళ్ల నడుమ ఉంచాలి.
ఈ అయిదు అయస్కాంతాలు ఒకదానిపై మరియొకటి తేలుతూ ఉంటాయి. పై అయస్కాంతాన్ని కిందికి నొక్కితే స్ప్రింగ్‌ను నొక్కినట్లు అవుతుంది. ఎందుకంటే పై అయస్కాంతం నొక్కిన తరువాత తిరిగి తొలి స్థానానికి వెనుదిరిగి వస్తుంది.
అయస్కాంతాల ఉత్తర, దక్షిణ ధృవాలన్నీ ఒకేవైపుకు వచ్చేటట్లు అమర్చడంవల్ల అవి వికర్షించుకుంటాయి. అయస్కాంతాల అయస్కాంత బలరేఖలు అన్నిదిశల్లోనూ విస్తరించుకుంటాయి. ఈ అయస్కాంతాల వికర్షణ ఒక బంపర్ మాదిరిగా పనిచేస్తుంది.
ఒక గొప్ప విశేషం ఏమిటంటే గురుత్వాకర్ష బలంకన్నా అయస్కాంత బలం బలమైనది. ఇది శాస్తవ్రేత్తలను ఆశ్చర్యపరుస్తున్న అంశం. ఈ అయస్కాంత స్ప్రింగ్‌లను కార్లలోను, ఇతర వాహనాలలోను షాక్ అబ్జార్బర్స్‌గా వాడాలనే ఆలోచనలో ఉన్నారు. అత్యంత వేగంగా ప్రయాణంచేసే రైళ్లకు కూడా ఇవి భేషుగ్గా వినియోగపడతాయని నమ్ముతున్నారు.

_____________________________

 

భూమి, చంద్రుల తులన బిందువు

  • - సి.వి.సర్వేశ్వర శర్మ
  • 17/03/2012
అంతరిక్షంలో అనేక ఖగోళ వస్తువులు కక్ష్యల్లో తిరుగుతున్నాయి. సూర్యుడు గెలాక్సీ కేంద్రంగాఉన్న కక్ష్య వెంబడి మెల్లిగా తిరుగుతున్నాడు. గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ భిన్నకక్ష్యలో తిరుగుతున్నాయి. చందమామలు వాటి వాటి గ్రహాలచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఒక ఖగోళ వస్తువు మరొక ఖగోళ వస్తువు వెంబడి తిరగడంలో ఎన్నో సంశ్లిష్టమైన గణిత సమస్యలు ఎదురవుతాయి. ఒక గ్రహం దాని చందమామ కక్ష్యల్లో తిరిగేటప్పుడు వీటి నడుమ ఎచటో ఒక కేంద్ర బిందువు వుంటుంది. దీనినే బేరీ సెంటర్ అంటారు. అంటే ఈ రెండింటి ఉమ్మడి కక్ష్యల గురుత్వ కేంద్రం అవుతుంది అది. ఇది ఎలాగో ఈ ప్రయోగం ద్వారా తెలుసుకుందాం.
30 సెం.మీ. పొడవుగల దారాన్ని తీసుకోవాలి. దీని ఒక కొన పొడవైన పెన్సిల్ ముక్కు వైపు భాగానికి రెండున్నర సెంటీమీటర్ల దూరంలో కట్టాలి. పెన్సిల్ ముక్కువైపు తడిపిన ముద్దమట్టిని అద్ది బేస్‌బాల్ సైజులో ఒక మట్టిగోళంగా ఏర్పాటుచేయాలి. ఈ గోళంనుండి ముందుగానే దారం నిదానంగా పైకి వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ గోళం నుండి పెన్సిల్ మిగిలిన భాగం బయటకు ఉండాలి. పెన్సిల్‌కు రబ్బరు ఉండే వైపున గోళీకాయంత పరిమాణంలో మట్టితో మరొక మట్టి గోళం నిర్మించాలి. పెద్ద గోళం భూమి. చిన్న గోళం చంద్రుడు. దారం ఆధారంగా పైకి లాగి ఈ వ్యవస్థను వేలాడ దీయాలి. వేలాడినపుడు పెన్సిల్ క్షితిజ సమాంతరంగా ఉండి భూమి, చంద్రుడు సంతులనం కావాలి. ఆ విధంగా సంతులనం చెందకపోతే చంద్రుడికి మరికొంత మట్టి అంటించడం లేదా భూమినుండి కొంత మట్టిని తొలగించాలి. సంతులనం చెందినపుడు భూమి, చంద్రుడు క్షితిజ సమాంతరంగా పెన్సిల్‌కు ఇరువైపులా వేలాడుతూ ఉంటారు. పెన్సిల్‌పై దారం కట్టిన బిందువే భూమి, చందమామల గురుత్వ కేంద్రం. చంద్రుని వైపుగల భూతలంనుండి భూమిలోకి 4,352 కిలోమీటర్ల లోతులో ఈ కేంద్రం ఉంది.
_______________________________________________________

ఊగే స్ప్రింగ్

ఒక స్ప్రింగ్ ద్వారా విద్యుత్ ప్రవహింపజేస్తే అది అయస్కాంతంగా మారి చేసిన ఏర్పాటు కారణంగా ఊగుతూ ఉంటుంది. అదెలాగో ఈ ప్రయోగం చేసి చూద్దాం.
ఒక పెన్సిల్‌పై రక్షిత రాగి తీగ సర్పిలాకారంగా చుట్టి పెన్సిల్ పైనుండి తీగను వేరుచేయాలి. ఈ తీగ ఒక కొనను గోళాకారపు బెండుగుండా పోనివ్వాలి. ఒక పెన్సిల్ సూదిమొన ఈ బెండులోకి ఒక ప్రక్కన గుచ్చాలి. పెన్సిల్ రెండవ కొన ఒక పుస్తకంపై ఉంచి అది కదలకుండా ఉండునట్లు టేపు వెయ్యాలి.
ఈ పుస్తకాన్ని పుస్తకాల దొంతరపై ఉంచి సర్దుబాటు చేయాలి. ఎలా సర్దుబాటు చేయాలంటే పెన్సిల్, బెండు ఒకే ఎత్తులో ఉండి బెండునుండి సర్పిలాకారపు తీగ 5 అంగుళాల ఎత్తునుండి బెండునుండి వేలాడుతూ ఉండాలి.
సర్పిలాకారపు తీగ కింది కొనను కొద్దిగా కిందికి లాగితే తీగ స్ప్రింగ్ మాదిరి ఉంటుంది. తీగ కింది భాగం నిటారుగా ఉండునట్లు మెలి తిప్పి ఈ తీగ కొనలవద్ద ఉండే రక్షిత భాగాన్ని తొలగించాలి.
ఒక బ్యాటరీ ధృవానికి బెండునుండి వచ్చిన తీగయొక్క తొలగించిన రక్షిత భాగంగల తీగను కలపాలి. ఒక ప్లాస్టిక్ బేసిన్‌లో వెచ్చని నీరుపోయాలి. దీనిలో కరిగినంత ఉప్పువేయాలి. సర్పిలాకారపు స్ప్రింగ్ కింది భాగంలో రక్షిత భాగాన్ని తొలగించిన తీగను ఈ ఉప్పునీటి ద్రావణంలో కొద్దిగా మునుగునట్లు ఏర్పాటుచేయాలి.
బ్యాటరీ రెండవ ధృవానికి కలిపిన మరొక తీగ రెండవ కొన రక్షిత భాగం కొంతమేర తొలగించి దానిని ఉప్పు నీటిలో బొమ్మలో చూపినట్లు ఉంచాలి. ఈ మొత్తం అమరికవలన అదొక మూసిన విద్యుత్ వలయంగా తయారయి స్ప్రింగ్‌లోకి విద్యుత్ ప్రవహిస్తుంది. ఫలితంగా స్ప్రింగ్ ఒక అయస్కాంతంగా మారుతుంది. ఒక కొన దక్షిణ ధృవం మరొక కొన ఉత్తర ధృవం అవుతాయి. వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకోవడంవల్ల స్ప్రింగ్ దగ్గరకు నొక్కబడి ఉప్పునీటినుండి తీగ కొన బయటకు వస్తుంది. దీనివల్ల వలయం తెరువబడి స్ప్రింగ్‌లో అయస్కాంత తత్త్వం పోతుంది. ఫలితంగా స్ప్రింగ్ సాగడం తిరిగి ఉప్పునీటిలో తీగ కొన మునగడం జరుగుతుంది. మళ్లీ వలయం మూయబడుతుంది. స్ప్రింగ్ అయస్కాంత తత్త్వం పొంది దగ్గరకు ముడుచుకుంటుంది. ఇది కొనసాగుతూ ఇలా స్ప్రింగ్ ఊగుతూ ఉంటుంది.
__________________________________________________________

ఎముకలు - ఖనిజాలు

ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కణాల పెరుగుదలకు, వాటి మరమ్మతులకు విటమిన్లు అవసరం. మరి ఖనిజాల సంగతి ఏమిటి? తగినన్ని ఖనిజాలు శరీరానికి అందకపోతే ఏమి జరుగుతుంది? ఈ ప్రయోగం ద్వారా తెలుసుకుందాం.
రెండు సర్వసమానంగా ఉండే గాజు జాడీలను తీసుకోవాలి. ఒకదానిలో మూడువంతులు వెనిగార్ పోసి నింపాలి. రెండవ దానిలో అంతే పరిమాణంలో నీరు పోయాలి. జాడీల పైన ‘వెనిగార్’, ‘నీరు’ అని లేబుల్స్ రాసి అంటించాలి.
ఒక కోడిపిల్ల ఎముకలను తీసుకుని సబ్బుతోను, నీటితోను బాగా శుభ్రపరచి తడి ఆరిపోయే విధంగా వాటిని ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక ఎముకను వెనిగార్‌గల జాడీలోను, మరొక ఎముకను నీరుగల జాడీలోను ఉంచాలి.
ఒక వారంరోజులు గడచిన తరువాత ఆ ఎముకలను జాడీల నుండి బయటకు తీసి ఆర బెట్టాలి. నీటినుండి తీసిన ఎముకను, వెనిగార్ నుండి తీసిన ఎముకను వంచడానికి ప్రయత్నించాలి. వెనిగార్‌లో ఉంచిన ఎముక సులువుగా వంగిపోతుంది. అది రబ్బరుతో తయారయినట్లుంటుంది. నీటి నుండి తీసిన ఎముకలో మార్పు ఉండదు. గట్టిగా ఉండి వంచబడదు.
వెనిగార్ ఆమ్లం. ఆది కాల్షియం ఖనిజాలను కరిగించుకుంటుంది. ఖనిజాలు లేకపోవడంవల్ల ఎముక బలహీనపడి వంగింది. పనికిరానిదిగా మారింది. ఎముకల్లోని కాల్షియం ఖనిజాలపై నీటి ప్రభావం ఏమీ లేదు. ఏదైనా పచ్చడి చేసుకునేటప్పుడు వెనిగార్ వాడవద్దని అర్థం కాదు, తగినన్ని పాలు తీసుకోవాలి. ఎముకల గట్టిదనాన్ని కాల్షియం ఖనిజాలు కాపాడుతూ ఉంటాయి. ఈ ఖనిజాలు శరీరానికి తగినంతగా అందితే ఎముకల బలం తగ్గదు.
____________________________________________________________

చేసి చూద్దాం

 ఆపిల్ పండితే ఏమవుతుంది?


                      పళ్లు పండినపుడు వాటిలో రసాయన చర్యలు జరుగుతాయి. ఇప్పుడు ఈ ప్రయోగంలో ఆ రసాయన చర్యల గురించి ప్రదర్శన చేయవచ్చు. ఆపిల్ పళ్లు ఆకుపచ్చని పచ్చి కాయ మొదలు బాగా పండిన ఆపిల్ పండు వరకు గల కొన్ని ఆపిల్స్ తీసుకోవాలి. ఒకొక్క ఆపిల్ నుండి దాని మధ్య భాగం నుండి వెళ్లే విధంగా చాకుతో గుండ్రని బిళ్లల మాదిరి ఒక్కొక్క బిళ్లను ఒక్కొక్క ఆపిల్‌నుండి కోయాలి. ఈ ముక్కలను ఒక అల్యూమినియం పలుచని కాగితపు రేకుపై ఉంచాలి.
ఒక ప్లాస్టిక్ గ్లాసు తీసుకుని దానిలో సగం పైన నీరుపోయాలి. దీనిలో అయిదు చుక్కలు అయోడిన్ వేసి దూది కొద్దిగా తీసుకుని దానితో నీటిలో కలియతిప్పాలి. ఇప్పుడు ఈ దూదికి అయోడిన్ ద్రావణం అంటి ఉంటుంది. దీనితో ఆపిల్ ముక్కలను పెయింట్ చేయాలి. ప్రతి ముక్కకు సంపూర్తిగా ఈ పెయింట్ వేయాలి.
పండని ఆపిల్ ముక్క కేంద్ర భాగం తెల్లగా ఉంటుంది. మిగిలిన భాగమంతా ముదురు నీలంగా మారిపోతుంది. ముక్క పండడం దశలో ఉంటే దాని భాగం లేత నీలంగా మారుతుంది. పండిన ఆపిల్ ముక్క విషయంలో ఏ విధమైన రంగు మార్పు ఉండదు.
పళ్ల విషయంలో పచ్చిది పండుగా పండడమంటే పచ్చి దానిలో వున్న స్టార్చ్ పూర్తిగా షుగర్‌గా మార్పుచెందే రసాయన ప్రక్రియ మాత్రమే. పచ్చికాయలో స్టార్చ్ మాత్రమే ఉండడంవల్ల అయోడిన్‌తో చర్య పొంది ముదురు నీలిరంగులోకి మారింది.
కొద్దిగా పండిన వాటిలో కొద్దిగా స్టార్చ్ మరికొద్దిగా షుగర్ ఉంటాయి. అందుకే లేత నీలి రంగులోకి మారింది. బాగా పండిన ముక్కలో అసలు స్టార్చ్ ఉండదు. అంతా షుగర్‌గా మారిపోయింది. అందుకే దాని రంగులో మార్పు ఉండదు.
________________________________________________________________

నిశ్వాసలో ఏముంది?

మనం గాలి పీల్చుకుని మరలా వదిలేస్తూ ఉంటాం. దీనినే ఉచ్ఛ్వాస, నిశ్వాసలు అంటారు. గాలి పీల్చుకున్నప్పుడు అందులోని ఆక్సిజన్‌ను శరీరం గ్రహిస్తుంది. శరీరంలో తయారైన కార్బన్‌డైఆక్సైడ్ మనం వదిలే గాలితో విసర్జితం అవుతుంది. మనం వదిలే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ ఉందని నిరూపించే ప్రయోగం ఇది. ఒక పరీక్ష నాళిక. స్ట్రా ఒకటి తీసుకోవాలి. కొద్దిగా సున్నపు నీటిని సేకరించాలి. సున్నపు నీటిలోకి కార్బన్ డైఆక్సైడ్ ప్రవహిస్తే అది పాలవలే తెల్లగా విరుగుతుంది.
కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉనికి సులువుగా కనుగొనేందుకు అతి చౌకయిన విధానం సున్నపుతేటతో ప్రయోగం. పరీక్ష నాళికలో మూడవవంతు సున్నపుతేటతో నింపాలి. స్ట్రాను సున్నపు నీటిలో పూర్తిగా ముంచి వదిలే గాలిని నోటితో స్ట్రాగుండా ఊదాలి. ఈ వదిలిన గాలితో సున్నపు నీటిలో బుడగలు ఏర్పడి పైకివచ్చి అదృశ్యం అయిపోతాయి. పారదర్శకంగా ఉన్న సున్నపుతేట పాలవలే తెల్లగా తయారవుతుంది. అంటే వదిలిన గాలిలో కార్బన్‌డైఆక్సైడ్ ఉందని రుజువు అయ్యింది.
__________________________________________________________

చేసి చూద్దాం

మండుతున్న కొవ్వొత్తిపై మైక్రోస్కోపు స్లయిడ్స్ ఒకదాని తరువాత మరొకటి ఉంచి వాటి తలలు నల్లగా మసితో తయారగునట్లు చేయాలి. ఈ విధంగా నాల్గయిదు స్లయిడ్స్ తయారుచేసుకోవాలి.
సుమారు 7.25 సె.మీ. పొడవుగల తీగను తీసుకుని, దాని ఒక కొనను శృతిదండం ఒక భుజానికి టేపుతో అతికించాలి. తీగను వక్రంగా వంచి శృతి దండం భుజానికి 5సె.మీ. కిందికి దిగునట్లుచేయాలి. శృతి దండాన్ని క్షితిజ సమాంతరంగా ఉంచాలి.
ఒక పెన్సిల్ అడుగు భాగంనుండి 5 సె.మీ. ఎత్తులో శృతిదండం కాడను తాడుతో కట్టాలి. బొమ్మలో చూపిన విధంగా శృతిదండం క్షితిజ సమాంతరంగానే ఉండాలి. పెన్సిల్‌తో శృతి దండం 90డిగ్రీల కోణంలో ఉండాలి.
స్కేలు, స్లయిడ్ టేబుల్ తలంపై ఒకే తలంలో ఉండాలి. బొమ్మలో చూపినట్లు పెన్సిల్ అడుగుభాగం స్లయిడ్‌కు ఎడమవైపున స్కేలుకు ఆనుకుని ఉండునట్లు అమర్చాలి.
శృతి దండాన్ని రబ్బరు సుత్తితోకొట్టి ఆవేశపరచాలి. తీగ రెండవ కొన స్లయిడ్ నల్లతలంపై కదులుతూ ఉంటుంది. పెన్సిల్‌ను స్కేలు వెంబడి వెనుకకు లాగుతూ ఉంటే స్లయిడ్ తలంపై తీగ కొన తరంగాలను గీస్తూ ఉంటుంది. ఈ తరంగం శృతి దండం స్వచ్ఛమైన పిచ్‌తో కంపిస్తున్న విషయం ధృవీకరిస్తుంది.
పెన్సిల్‌ను రకరకాల వేగాలతో వెనుకకు లాగుతూ ఉంటే స్లయిడ్స్‌పై తరంగాలు మారుతూ ఏర్పడతాయి. శృతి దండాన్ని తక్కువ, ఎక్కువ బలాలతో రబ్బరు సుత్తితో కొట్టి తరంగాల తీరును గమనించాలి. ఈ విధంగా రకరకాల తరంగాలను స్లయిడ్స్‌పై ఏర్పరచి శృతి దండం కంపనాలకు తరంగాల స్వరూపాలకు సంబంధం అవగాహన చేసుకోవచ్చు.
ఈ స్లయిడ్స్‌పై తయారయిన తరంగాలపై షెల్లాక్ స్ప్రేచేస్తే ఈ స్లయిడ్స్‌పై ఏర్పడిన ధ్వని తరంగాలు చెరిగిపోకుండా శాశ్వతంగా ఉంటాయి. వాటిని ప్రదర్శించి, మనం చేసిన ప్రయోగం ఫలితాలు ఇతరులకు వివరించవచ్చు.
________________________________________________________

No comments:

Post a Comment