Wednesday 27 June 2012

విద్యుత్‌ ప్రవాహం ధనధృవం నుండి ఋణధృవానికి జరుగుతున్నట్లు చూపుతారు ఎందుకని?


నిజానికి విద్యుత్‌ వలయంలో ఋణ ధృవం నుంచి ధన ధృవానికి కదిలేది ఋణావేశిత ఎలక్ట్రాన్లు. కానీ విద్యుత్‌ వలయాలలో విద్యుత్‌ ప్రవాహం ధన ధృవం నుంచి ఋణ ధృవానికి జరుగుతున్నట్లు చూపుతారు. ఎందుకని? - ఆర్‌.సౌమిత్‌, ఖమ్మం
పదార్థాలు విద్యుదావేశాన్ని సంతరించుకోవడమనే నిజాన్ని చాలాకాలం కిందటే ప్రాచీన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కిరీటాలు, కవచాలు, కత్తులు, ఆభరణాలు, ఖజానా పెట్టెలు వంటి లోహ వస్తువుల్ని మెరుగుపర్చడానికి చర్మము, దూది వంటి పదార్థాలతో రాపిడి చేసినపుడు ఆ లోహపదార్థాలు ఉన్నట్టుండి ఇతర చిన్న తేలికపాటి వస్తువుల్ని ఆకర్షించడాన్ని తొలి విద్యుత్‌ ఆవిష్కరణగా మనం అంగీకరిస్తున్నాం. అంటే, లోహవస్తువులకు అంతకుముందు లేని గొప్ప ఆకర్షణతత్వం రాపిడి ద్వారా లభ్యం అయినట్టు అర్థం కదా! అంతకుముందు లేనిది ఏదైనా నూతనంగా వస్తే దాన్ని ధనం (positive) గా భావించడం మామూలే! ఖాళీ జేబులోకి 10 రూపాయలు చేరితే జేబుకు ధనమే కదా! అలాగే లోహ వస్తువులు ధన ఆవేశాన్ని (positive electricity) సంతరించుకొన్నాయని భావించారు. రెండు వేర్వేరు ధనావేశిత లోహవస్తువుల్ని దగ్గరగా తీసుకొచ్చినపుడు అవి పరస్పరం వికర్షించుకోవడాన్ని గమనించారు.

తక్కువ (రాచరిక పాలకుల ఉద్దేశ్యంలో) కులస్తులు, వృత్తిదారులు, శ్రామికులు వాడే కొమ్ములు, తప్పెటలు, ఎండుకర్రలు, చిప్పలు, శంఖాలు వంటి వాటిని కూడా రాపిడికి గురిచేసినపుడు అవి కూడా విద్యుదావేశం పొంది వెంట్రుకలు, ఎండుటాకు ముక్కలు తదితర తేలికపాటి తటస్థ (neutral) వస్తువుల్ని ఆకర్షించడం గమనించారు. వీటికి కూడా విద్యుదావేశం లభ్యమయినట్టే అర్థం కదా! ఇలాంటి రెండు వస్తువుల్ని దగ్గరకు తీసుకొస్తే అవి కూడా పరస్పరం వికర్షించుకోవడం గమనించారు. ఇక ఇక్కడే అసలు విషయం ఉంది. విద్యుదావేశానికి లోనయిన రెండు వేర్వేరు రాచరిక లోహ వస్తువులు పరస్పరం వికర్షించుకున్నా, నిమ్న వర్గాలు వాడే కొమ్ములు కూడా విద్యుదావేశాన్ని సంతరించుకొన్నాక పరస్పరం వికర్షించుకొన్నా రాజులు వాడే విద్యుదావేశిత కిరీటాలు, నిమ్నజాతులు వాడే విద్యుదావేశిత కొమ్ములు మాత్రం పరస్పరం ఆకర్షించుకొనేవి.

అవి తీరా భౌతికంగా కలిస్తే అప్పటివరకు తేలికపాటి వస్తువుల్ని ఆకర్షించే (గొప్ప) గుణం ఉన్న కిరీటాలు ఇక ఏమాత్రం ఆ గుణాన్ని ప్రదర్శించలేకపోయేవి. అంటే అగ్రవర్ణస్తులు వాడే లోహ ఆభరణాలకు, నిమ్న వర్ణస్తులు వాడే చెక్కలు, కొమ్ములతో సంపర్కం జరిగితే లోహాల అద్భుత (ధన) గుణాలు పోతున్నాయి. అంటే చెక్కలకు, కొమ్ములకు, చిప్పలకు ఉన్నది ఋణ (negative) లక్షణమున్న ఆవేశం. ఇలా ధన, ఋణ విద్యుదావేశాలు అంటూ గుర్తుల్ని ఆపాదించారు. రాపిడిలో లోహ వస్తువులు ధనావేశాన్ని పొందుతాయని, అలోహ (non metallie) వస్తువులు ఋణావేశాన్ని పొందుతాయని ప్రకటించుకొన్నారు. పైవైపు(+ve) ఉన్న నీరు, లోవైపు (-ve) ప్రవహించినట్టే, రాజుగారి (+ve) దయాదాక్షిణ్యాలతో పేదల (-ve) కు కూలీ అందుతున్నట్టే, సంపన్నుడి (+ve) నుంచే ఋణగ్రస్తుడి (-ve) కి విముక్తి కలుగుతున్నట్టే ధన, ఋణావేశిత వస్తువుల్ని కలిపినపుడు ధన చిహ్నమున్న ధృవం (pole) నుంచే ఋణ చిహ్నమున్న ధృవం వైపు ఆవేశం వెళ్తున్నట్టు సూత్రీకరించారు. మరోమాటలో చెప్పాలంటే ధన, ఋణ ధృవాల్ని సంధానించినపుడు కదిలే ఆవేశం ధనం నుంచి ఋణంవైపే అని అర్థం వచ్చేలా ప్రకటించుకొన్నారు. ఆ విధమైన సాంప్రదాయ పద్ధతి (convention) ని ప్రపంచవ్యాప్తంగా ఆమోదించారు.

కానీ పదార్థ నిర్మాణం, పరమాణు అంతర్నిర్మాణం (atomic structure),ప్రాథమిక కణాల ఆవిష్కరణ తర్వాతే అసలు సంగతి అర్థమైంది. అంతెందుకు? పరమాణు నిర్మాణం బోధపడనంత వరకూ (రూథర్‌ఫర్డు ప్రయోగం జరగనంత వరకు) ధనావేశానికే చలన ధర్మం ఉన్నట్టు, ఋణావేశానికి నిశ్చలమైన స్థితి ఉన్నట్టు ఎలక్ట్రాన్‌ ఆవిష్కర్త (discoverer) అయిన జె.జె. థామ్సన్‌ కూడా పప్పులో కాలేశాడు.
పరమాణు నిర్మాణం పూర్తిగా అవగతమైన ఆధునిక భౌతికశాస్త్ర ఆవిష్కరణల తర్వాతే పేదలు వాడే కొమ్ములు, చిప్పల్లోనే కదిలే ఎలక్ట్రాన్లు రాపిడితో సిద్ధిస్తాయని, సంపన్నులు వాడే ఆభరణాలు, కిరీటాలను రాపిడిచేస్తే ఎలక్ట్రాన్లను పోగొట్టుకొని ధనావేశితమవుతాయనీ అలాంటి రెండు వేర్వేరు ఆవేశితాలైన వస్తువుల్ని సంధానించినపుడు ఎలక్ట్రాన్లే (పేదల వైపు నుంచి) ధనికులవైపు వెళ్తాయనీ అర్థమయింది. కానీ సంప్రదాయం ప్రకారం విద్యుత్‌ ప్రవాహం +ధృవం నుంచి -ధృవం వైపే వెళ్తున్నట్టు విద్యుత్‌ వలయాల (electrical circuits) లో ఇస్తారు. అంటే వాస్తవంగా ఎలక్ట్రాన్లు కదిలే దిశకు వ్యతిరేకదిశలో విద్యుత్ప్రవాహ (current)మున్నట్లు వర్ణిస్తాము. ఇది అంతర్జాతీయంగా ఆమోదించిన సంప్రదాయం (convention).. అయితే ఎలక్ట్రాన్ల ప్రవాహం కేవలం ఘనరూప లోహాల్లో, పాదరసంలాంటి ద్రవరూప లోహాల్లో ఉన్నా ద్రావణాలు, వాయువులలో ధన, ఋణ ఆవేశిత కణాలు రెండూ విద్యుప్రవాహానికి దోహదపడతాయి.

బర్డ్‌ ఫ్లూ .. ఇక మానవ ఫ్లూనా..?


'హెచ్‌5ఎన్‌1' ఇన్ఫూయెంజా అనే బర్డ్‌ఫ్లూ వ్యాధి కొన్ని సంవత్సరాల క్రితం మనల్ని ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతానికి ఈ వ్యాధి పక్షుల నుండి మాత్రమే మనకి వ్యాపిస్తుంది. కానీ, ఆ వైరస్‌ మరో రెండు, మూడు రూపాంతరాలు చెందితే దీని వ్యాధి నేరుగా మానవుడి నుండి మానవు లకు వ్యాపించగలదట! ఇప్పటికే ఈ లక్షణాలు అక్కడకక్కడ కనిపించాయి. ఒక ఐదు ఉత్పరిణామాలు (మ్యూటే షన్లు) జరిగితే, హెచ్‌5ఎన్‌1 వైరస్‌ గాలి ద్వారా మానవులకు వ్యాపించే రకంగా రూపొందుతుందట. ప్రస్తుతానికి, ఆ ఐదు ఉత్పరిణామాలలో రెండు జరిగిపోయాయి. అయితే, మిగతా మూడు ఎప్పటికీ పూర్తవుతాయో శాస్త్రజ్ఞులు అంచనా వేయలేకపోతున్నారు. ఆ ఉత్పరిణామాలు రాకుండా జాగ్రత్తపడలేమా?
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

మన రాచనాగుకి కష్టకాలం..!


కింగ్‌ కోబ్రా అనగానే భయం కలిగేంత గొప్ప జంతువు 'రాచనాగు'. ఇప్పుడు ఆ జాతి అంతరించే దశలో ఉందట! అదేకాదు, మరికొన్ని సర్పజాతులు కూడా త్వరలో అంతరించిపోగలవని నిపుణులు భావిస్తున్నారు. మొన్న జరిగిన రియో +20 సదస్సులో ప్రమాదపుటంచులలో ఉన్న జంతుజాతుల జాబితాని విడుదల చేశారు. అందులో రాచనాగు జాతి సర్పాన్ని మాంసం, చర్మం కోసం వేటాడి చంపుతున్నట్టు, ఫలితంగా ఆ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్టు తెలిపారు. జీవజాతి వైవిధ్యతను పరిరక్షించకుండా సమగ్రాభివృద్ధి, గ్రీన్‌ ఎకానమీ వంటివి సాధ్యం కావని నిపుణులు అంటున్నారు. తాజా జాబితాతో ప్రమాదంలో ఉన్న జీవజాతుల సంఖ్య 63,837కి చేరింది. సదస్సులూ, సమావేశాలూ, చర్చలూ యథావిధిగా జరుగుతున్నా ప్రతిరోజూ ఓ జీవజాతికి ప్రమాదం వాటిల్లుతూనే వుంది. ఒక పక్క అభివృద్ధి పేరిట జంతువుల, మొక్కల సహజ ఆవరణాన్ని వాణిజ్యపంటలకు అనుకూలంగా మారుస్తూ 'జంతు జాతులు అంతరించిపోతున్నాయ'ని వాపోవడం అంత సమంజసంగా లేదు కదూ?

నీళ్ళు లేని స్నానం..!


కొత్త ఆవిష్కరణలు మానవ జీవితాన్ని సౌఖ్యవంతం చేస్తాయి. దీనికి మరో తాజా ఉదాహరణ తోడైంది. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడటం ఒక భాగమైతే, బాధగా ఉన్నవారు కూడా చురుకుగా, చలాకీగా మారడానికి స్నానం ఎంతో మేలు చేస్తుంది. పైగా, అది ఒక రకమైన వ్యాయామం కూడా! అయితే అటువంటి దృష్టితో స్నానం చేయడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఏదో నాలుగు చెంబులు నీళ్ళు కుమ్మరిస్తే సరిపోతుందనే రోజుల్లో ఉన్నాం. ఒక దక్షిణాఫ్రికా విద్యార్థి రూపొందించిన స్నానపు జెల్‌తో అసలు స్నానానికి నీళ్ళే అవసరం లేదంటున్నారు. ఈ జెల్‌ వాడితే శరీరంపైన క్రిములు అంతరించిపోతాయట! వాసనలు పోతాయట! పైగా, చర్మం మృదువుగా ఉంటుందని అంటున్నాడు. నీళ్ళ కొరత ప్రాంతాలలో ఈ జెల్‌ ఒక వరంలాంటిది అని నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ కొత్త ఆవిష్కరణల వల్ల నీటిని ఆదా చేయడం బాగానే ఉంది గానీ బద్ధకం మరింత పెరిగిపోతుందేమో అనే వాళ్ళూ ఉన్నారు.

కనుమరుగు కానున్న పెంగ్విన్‌లు..!


నిత్యం మంచుతో ఉండే అంటార్ట్కికాలో పెంగ్విన్‌లు రాజ్యమేలుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వాటి ఉనికికే ప్రమాదం వాటిల్లేట్టుంది. అందంగా ఉండే ఈ నాలుగు అడుగుల ఎత్తు పక్షులు సముద్ర మంచుపైనే గుడ్లు పెడతాయి. పొదుగుతాయి. పిల్లల్ని సాకుతాయి. గుడ్లు పెట్టే సమయంలో మంచు గనక లేకపోతే వాటి సంతానోత్పత్తి సన్నగిల్లుతుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అంటార్ట్కికా మంచుని సైతం క్రమేపీ కరిగిస్తున్నాయి. ఇదే ఇంకొంతకాలం కొనసాగితే సముద్ర మంచు సన్నగిల్లి, పెంగ్విన్‌ల ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అంటార్ట్కికా తీరప్రాంతం అయిన 'టెఏ అదేలీ'లో పెంగ్విన్లు తగ్గుముఖం పట్టినట్టు ఫ్రెంచ్‌ పరిశోధకులు గమనించారు. 1970వ దశకంలో 150 పక్షులు గుడ్లకు సిద్ధం కాగా, 1999లో కేవలం 20 జతలు మాత్రమే కనిపించాయి. 2009 కల్లా ఒక్క పక్షి కూడా రాలేదు. ఒక ప్రత్యేక వాతావరణంలోనే మనుగడ సాగించగల ఈ జీవులు వాతావరణ మార్పులతో సతమతమై కనుమరగయ్యే ప్రమాదముంది.

వాతావరణం మార్పులు .. సర్దుబాట్లు .. సాధ్యాసాధ్యాలు ..

భూగోళ వాతావరణం.. ఋతుపవనాల కాలచక్రం తరచుగా, మారుతున్నాయి. ఈ కొద్ది మార్పులే ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి ప్రభావం అన్ని దేశాలపై ఒకే విధంగా లేదు. ఇవి ఇలాగే కొనసాగితే ఈ ఆందోళనకు ఏమవుతుంది? ఇవీ నేడు మనల్ని వేధిస్తున్న ప్రశ్నలు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ స్థాయిలో ఉండటమే కారణం. ఈ ఏడాది కొంచెం ఆలస్యంగా వచ్చిన నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రంలో దోబూచులాడుతున్నాయి. విస్తార ప్రాంతాల్లో సాధారణ స్థాయి కన్నా తక్కువ వర్షపాతం కురిసింది. ఈ సమయం లోనే-ఆగస్టు, సెప్టెంబర్‌ ప్రాంతంలో ఎల్‌నీనో ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వస్తున్న వాతావరణ మార్పుల్ని అర్థంచేసుకుని, మన ఉత్పత్తి విధానం, జీవనశైలిలో అవసరమైన సర్దుబాట్లు చేసుకొనే వీలుందా? వీలుంటే, భౌతికంగా ఏమేర సిద్ధంగా ఉన్నాం? అనే అంశాలను..ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్ష పరిశోధనల ద్వారా భూగోళ వాతావరణం వేడెక్కు తుండడాన్ని నిర్వివాదంగా గుర్తిస్తున్నాం. ఏ హద్దూ, అదుపూ లేకుండా మానవ కార్యక్రమాలు, జీవనశైలితో విడుదలవుతున్న ఉద్గారాలు (హరిత గృహ వాయువులు) దీనికి కారణాలుగా గుర్తించాం. ఋతుపవనాల కదలికలో ఏర్పడిన అనిశ్చిత స్థితికి భూగోళ వాతావరణమార్పులు ప్రధాన కారణాలని గుర్తిస్తున్నాం. దీనివల్ల వస్తున్న దుష్పరిణామాలను ఎలా ఎదుర్కోగలం? నివారించగలం? అనేది మనకో సవాల్‌. భూగోళ వాతావరణం వేడెక్కడానికి మూలకారకులైన అమెరికాలాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాల నియంత్రణకు ఒప్పుకోవడం లేదు. ఏ బాధ్యతనూ తీసుకోవడం లేదు. వీటి దుష్ప్రభావాలను మాత్రం అభివృద్ధి చెందిన దేశాలు, అన్ని దేశాల్లోని పేదలు ఎక్కువగా భరించాల్సి వస్తోంది. ఈ ధనిక దేశాలు, ధనికులు తమ జీవనశైలిని మార్చుకోకుండా భూగోళం వేడెక్కడాన్ని నిలవరించలేం. వస్తున్న వాతావరణమార్పుల్ని, ఋతుపవనాల అనిశ్చితిని కట్టడి చేయలేం.

ఈ లక్ష్యంతో, 20 ఏళ్ల క్రితం బ్రెజిల్‌లోని రియోడిజినాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో 21 అంశాలతో కూడిన కార్యక్రమాన్ని రూపొందించారు. ఇవి ఏమేర అమలైనాయని అంచనా వేసి, సుస్థిరాభివృద్ధికి తోడ్పడే భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించడానికి 'రియో+20' పేరుతో అదేచోట ఈ నెలలో మరో శిఖరాగ్ర సమావేశం జరిగింది. అమెరికాలాంటి దేశాల పాక్షిక దృక్పథం వల్ల ఈ సమావేశాల్లో నిర్దిష్టమైన కార్యక్రమం రూపొందలేదు. ఈ నేపథ్యంలోనే, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఋతుపవనాల కదలికల్లో పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితులను, వాటి దుష్పరిణామా లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది నైరుతీ ఋతుపవనాలు కొద్దిగా ఆలస్యంగానైనా వచ్చాయి. కానీ, దోబూచులాడుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ దుష్పరిణామాలను ఏమేర ఎదుర్కోగలం అనేది మన ముందున్న ప్రశ్న.

భూగోళ స్థాయిలో ఈ మార్పులను నిలువరించడానికి ఇప్పట్లో అవకాశాలు లేవు. కానీ, వీటిని ఎదుర్కోడానికి అవసరమైన సాంకేతికాలు మనదేశంలో ఉన్నాయి. ఇవి దాదాపు మన సాంప్రదాయ సేద్య సాంకేతికాలతో పోలి వున్నాయి. చిన్న కమతాలలో అనుసరించే 'మనుగడ సేద్య పద్ధతులు' దీనికి దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ స్థానిక వనరుల్ని వినియోగిస్తూ, రిస్క్‌ను తగ్గిస్తూ సుస్థిర ఉత్పత్తికి తోడ్పడతాయి. కానీ, నేటి ప్రపంచీకరణలో చిన్నకమతాల సేద్యానికి బదులు భారీ యాంత్రీకరణ, కృత్రిమ వ్యవసాయ రసాయనాలపై ఆధారపడే 'కార్పొరేట్‌ సేద్యం' ఉద్గారాల్ని పెంచుతోంది. భూగోళ వాతావరణాన్ని మరింతగా వేడిక్కిస్తోంది. ఇది వాతావరణ అనిశ్చితిని, రిస్క్‌ను పెంచుతుంది. వ్యవసాయోత్పత్తి విధానాన్ని పునరాలోచించాలి. 'చిన్న కమతాల ఆధారిత' సుస్థిర సాంకేతికాలతో సేద్యాన్ని కొనసాగించకపోతే వాతావరణ మార్పుల్ని తట్టుకోవడానికి ఇప్పుడున్న అవకాశాల్ని కోల్పోవాల్సి వస్తుంది.
దుష్పరిణామాలు..
హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ శాస్త్రజ్ఞుల తాజా సమాచారం (2011 రామ్‌జాగ్‌ తదితరులు) ప్రకారం మెట్ట ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు క్రమంగా పంటకాలాన్ని తగ్గిస్తాయి. ఉష్ణోగ్రత 3.3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగితే మంచి యాజమాన్యంతో కూడా జొన్న దిగుబడి 27 శాతం తగ్గుతోంది. కానీ, వర్షం 11 శాతం పైగా పెరిగినా దిగుబడి నష్టపోదు. అనంతపురంలో వేరుశనగ దిగుబడి 38 శాతం ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల తగ్గుతోంది. కానీ, అదే సమయంలో పెరిగే వర్షం పంట దిగుబడిని పెంచడానికి తోడ్పడుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత, కార్బన్‌ డై ఆక్సైడ్‌ సాంద్రత ఒకేసారి పెరగడం వల్ల, ఖరీఫ్‌లో జొన్న దిగుబడి 22-50 శాతం, సజ్జ దిగుబడి 33-51 శాతం, వేరుశనగ 23-29 శాతం, కంది 8-11 శాతం, మంచిశనగ ఏడు శాతం తగ్గుతాయని అంచనా వేయబడింది. అంటే ఇతర పంటల కన్నా కంది, మంచి శనగ అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. కానీ, ఇప్పటికే చలి ఎక్కువగా వుండే మధ్యప్రదేశ్‌లో మాత్రం పెరిగిన ఉష్ణోగ్రత మంచిశనగ దిగుబడిని తొమ్మిది శాతం పెంచుతుంది. మొత్తంగా చూస్తే, యాజమాన్య స్థాయి తక్కువగా ఉన్నప్పుడు వాతావరణ మార్పుల ప్రభావం అంతగా ఉండదు.
బావుల కింద..
బావుల కింద ఆరుతడి పైర్లను వేయాలి. మాగాణి వరిని వేయకూడదు. దీనికి బదులుగా 'శ్రీవరి'ని సాగు చేయవచ్చు. కుంటలు, చెరువుల కింద ఆరుతడి పంటలను లేదా కూరగాయలను పండించాలి. చెరువులు నిండితే తప్ప మాగాణి వరి చేయకూడదు.
మన దేశంలో..
వాతావరణమార్పులపై అధ్యయనం చేసిన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కమి షన్‌ భారతదేశంలో రాగల ఉష్ణోగ్రత, వర్ష పాత మార్పులను అంచనా వేసింది. దీని ప్రకారం:
ఉష్ణోగ్రత..
ఈ శతాబ్ధం అంతానికి సగటు ఉష్ణోగ్రత 0.87 నుండి 6.31 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మధ్య పెరగవచ్చని అంచనా. 2020 దశకం ఖరీఫ్‌లో ఇది 0.87 నుండి 1.12 డిగ్రీల సెంటీగ్రేడ్‌ స్థాయికి, రబీలో 1.08 నుండి 1.54 డిగ్రీల స్థాయికి పెరగవచ్చు. 2050 దశకం ఖరీఫ్‌లో 1.81 నుండి 2.37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ. రబీలో 2.54 నుండి 3.18 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ పెరగవచ్చు. 2080 దశకం ఖరీఫ్‌లో 2.91 నుండి 4.62 డిగ్రీలు; రబీలో 4.14 నుండి 6.31 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ ఇది పెరగవచ్చట!
వర్షపాతం..
2080 దశకం రబీలో సగటు వర్షపాతం గరిష్టంగా 24.8 శాతం తగ్గవచ్చు లేదా 15.18 శాతం వరకూ పెరగవచ్చు.
ఈ వివరాలన్నీ సగటు గణాంకాలు మాత్రమే. అసలు పంటల్ని, జీవనశైలిని ప్రభావితం చేసేది స్థానిక ఉష్ణోగ్రతలు, వర్షపాత మార్పులు. నేలల స్వభావం, సేద్య పద్ధతులు కూడా ప్రాధాన్యత వహిస్తాయి. అందువల్ల స్థానిక వనరుల వినియోగం ఆధారంగా ఉత్పత్తి చేయాలి.
సర్దుబాట్లు.. సాధ్యాసాధ్యాలు..
ఒక్కమాటలో చెప్పాలంటే భారతదేశంలో ఇప్పుడొస్తున్న చిన్న చిన్న వాతావరణ మార్పుల్ని ఎదుర్కోగలం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేసిన పరిశోధనలు, ఉత్పత్తిలో వినియోగిస్తున్న సాంకేతికాలు దీనికి ఉపయోగపడేవే. అయితే, ఒకేసారి పెద్దమార్పులు వస్తే ఎదుర్కోడానికి ఈ సాంకేతికాలు సరిపోవు. వ్యక్తిగత స్థాయిలో పటిష్టమైన బీమా పథకం తోడ్పడుతుంది.
వ్యవసాయోత్పత్తికి అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికాల ఉష్ణోగ్రత, వర్షపాతం హెచ్చుతగ్గుల్ని తట్టుకోడానికి ఉద్దేశించినవే. ఇప్పుడు మెట్ట సేద్యంలో సూచిస్తున్న సాంకేతికాల్లో ఈ రెంటి యాజమాన్యం ఇమిడి వున్నాయి. స్వల్పకాలిక రకాల అభివృద్ధి, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల రకాల గుర్తింపు, తీవ్ర బెట్ట పరిస్థితుల్లో కూడా మనగలిగే రకాల అభివృద్ధి వీటికి ఉద్దేశించినవే.
మిశ్రమ వ్యవసాయం కూడా వాతావరణ మార్పుల్ని పటిష్టంగా ఎదుర్కోడానికి తోడ్పడుతుంది.
మారుతున్న వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి రైతులు వేసే పంటరకాల్ని మార్చుతూ ఇప్పటికే పలు చర్యల్ని తీసుకుంటున్నారు. వీటిలో మిశ్రమ పంటల సేద్యం ముఖ్యమైనది. అయితే, కార్పొరేటీకరణ, పెట్టుబడి ఉత్పత్తి విధానంలో ఏదో ఒక పంటనే వేస్తుండడంతో వాతావరణమార్పులు రిస్క్‌ను పెంచుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాల గుర్తింపు, ఎంపిక వాతావరణమార్పుల్ని తట్టుకోడానికి ఎంతో తోడ్పడతాయి. ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో ఇప్పటికే అనుసరిస్తున్న 'సమగ్ర పరీవాహక ఆధారిత ఉత్పత్తి' ఋతుపవనాల అనిశ్చితిని ఎదుర్కోడానికి తోడ్పడతాయి.
సేంద్రీయ ఎరువుల వాడకం నేలల నీటి నిల్వ శక్తిని పెంచి, బెట్టను తట్టుకోడానికి తోడ్పడుతుంది. 'సంరక్షణ (కన్జర్వేషన్‌) సేద్యం'లో కనీసస్థాయిలో లేదా అసలు దున్నకుండా పైరుని వేయాలి. నేలను పంటల శేషపదార్థాలతో కప్పి వుంచుతూ, నేలలో తేమను పరిరక్షించడంలో ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి మరో అనువైన ప్రక్రియ. ఉన్న నీటివనరులను సమర్థవంతంగా, వున్న పంటల్ని సంరక్షించేలా సాగునీటిని వాడాలి. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే బిందు, తుంపర్ల సేద్యాన్ని చేపట్టాలి. మాగాణికి బదులు 'శ్రీవరి పద్ధతి'లో వరిని సాగుచేయాలి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

ఎల్‌నీనో అంటే...


భూగోళం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ఎల్‌నీనో ప్రభావం తరచుగా, బలంగా ఉంటుంది. ఫసిఫిక్‌ మహాసముద్రంలో, ఆ ప్రాంత వాతావరణంలో అప్పుడప్పుడు వచ్చిన ఉష్ణోగ్రత, పీడనాల్లో వస్తున్న 'దక్షిణ మార్పులనే' (సదర్న్‌ ఆసిల్లేషన్‌) 'ఎల్‌నీనో' అంటారు. తాహితి, ఆస్ట్రేలియాలోని డార్విన్‌ ప్రదేశాల మధ్య వాతావరణ పీడనమార్పుల రూపంలో ఇది బహి ర్గతమవుతుంది. తూర్పు ఫసిఫిక్‌ మహా సముద్రంలో ఉపరితలం, అంతర్భాగంగా వేడెక్కడం లేదా చల్లబడే రూపంలో ఇది బహిర్గతమవుతుంది. ఎల్‌నీనో సమయంలో ఉపరితల సముద్రం (కొన్ని సెంటీమీటర్ల మందంగల పొర) వేడిగా, అంటే 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ అధికంగా ఉంటుంది. కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో దీని ప్రభావం ఉంటుంది.
ఎల్‌నీనో ప్రారంభాన్ని
ఈ కింది మార్పుల వల్ల గుర్తించవచ్చు:
1. హిందూ మహాసముద్రం, ఇండోనేషియాలో, ఆస్ట్రేలియాలో ఉపరితల పీడనం పెరుగుతుంది.
2. తహతి, మిగతా మధ్యతూర్పు ప్రాంత ఫసిఫిక్‌ మహాసముద్ర గాలిలో పీడనం పడిపోతుంది (డిప్రెషన్‌ ఏర్పడుతుంది).
3. దక్షిణఫసిఫిక్‌ మహాసముద్రంపై వచ్చే ట్రేడ్‌ వింగ్స్‌ బలహీనపడతాయి లేదా తూర్పువైపు మళ్ళుతాయి.
4. పెరూ (దేశం) దగ్గర వేడిగాలి పైకెళుతుంది. దీనివల్ల ఉత్తరపెరూ ఎడారిలో వర్షాలు కురుస్తాయి.
5. పశ్చిమ ఫసిఫిక్‌ మహాసముద్రం నుండి హిందూ మహాసముద్రం - తూర్పు ఫసిఫిక్‌ మహాసముద్రం మధ్య వేడినీరు విస్తరిస్తుంది. ట్రేడ్‌ వింగ్స్‌ దిశ ఎన్నో నెలలు మారినప్పుడు ఎల్‌నీనో ప్రారంభమవుతుంది.
మామూలుగా భూమధ్యరేఖ దాపుల్లో వీచే వాణిజ్య పవనాల వల్ల (ట్రేడ్‌ విండ్స్‌) నైరుతీ ఋతుపవనాలు వస్తాయి. కానీ ఒకోసారి ఈ పవనాల దిశ మారి ఎల్‌నీనో రూపంలో బయటపడుతుంది. వాణిజ్య పవనాల దిశ మారడం వల్ల భారతదేశంలో రావాల్సిన నైరుతీ ఋతుపవనాల వర్షం దక్షిణ అమెరికాలోని పెరూ, చిలీ దేశాలలో కురుస్తుంది. ఫలితంగా నైరుతీ ఋతుపవన ప్రభావ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2-7 సంవత్సరాలకు ఒకసారి ఎల్‌నీనో వస్తుంది. ఒకసారి ప్రారంభమైన తర్వాత దీని ప్రభావం తొమ్మిది మాసాల నుండి రెండు సంవత్సరాల వరకూ కొనసాగుతుంది.

Tuesday 26 June 2012

ఎర్రబస్సు . ఇన్‌



ఈ కుర్రోడు మన తెలుగోడే....పేరు ఫణీంద్ర సామ...స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా...ఇతను అంతర్జాతీయ వార్తలకెక్కాడు...కారణం అతను ప్రారంభించిన రెడ్‌బస్‌.ఇన్‌ అన్‌లైన్‌ బస్‌ టికెట్‌ బుకింగ్‌ సంస్థే. ఓ చిన్న సమస్యకు పరిష్కారం కనుగొనే క్రమంలో పుట్టిన ఒక చిన్న ఆలోచన అతని జీవితాన్నే మార్చుసింది. ఆరేళ్ల క్రితం మామూలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగయిన ఫణీంద్ర ఇప్పుడు వందల కోట్ల టర్నోవర్‌ గల సంస్థకు సీఈవో. అంతర్జాతీయ అవార్డు అందుకున్న సృతనాత్మక వ్యాపారవేత్త. ఇంతకీ అతనికొచ్చిన సమస్యేమిటి, అతను చేసిన ఆలోచనేమిటి, అతని జీవితం ఎలా మలుపుతిరిగింది....ఇదే నేటి స్ఫూర్తి కథనం...
ఆరేడేళ్లు..వెనక్కి వెళ్లండి...ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి బస్సు టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే ఏం చేసేవాళ్లం...కాళ్లు ఈడ్చుకుంటూ ఆర్టీసీ బస్టాండుకో, ప్రైవేట్‌ ట్రావెల్‌ ఏజెంట్‌ ఆఫీసుకో వెళ్లేవాళ్లం...టికెట్‌ బుక్‌ చేసుకునేవాళ్లం. ఒక ఏజెంట్‌ వద్ద టికెట్‌ దొరక్కపోతే మరో ఏజెంట్‌ వద్దకు పరిగెత్తేవాళ్లం...అదో పెద్ద ప్రయాసగా ఉండేది. ఇప్పుడా శ్రమ లేదు. ఆర్టీసీ సహా ప్రైవేట్‌ బస్‌ సంస్థలూ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సర్వీసును అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరు, ఇంటర్నెట్‌ ఉంటే ఇంట్లో నుంచే ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్టు బుక్‌ చేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచనకు 2006లోనే శ్రీకారం చుట్టిన మన తెలుగు యువకుడు ఓ సంస్థను స్థాపించి ఇప్పడు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. అతనే నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఫణీంద్ర సామ. ఆ సంస్థే 'రెడ్‌బస్‌ డాట్‌ ఇన్‌'.

ఆ దీపావళి రోజు...
బిట్స్‌, పిలానీలో ఈఈఈ చదివిన సామ బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. ఓ దీపావళి పండగకు ఇంటికి రావాలనుకున్నారు. బెంగళూరులో ఓ ప్రైవేట్‌ బస్సు ఏజెంట్‌ వద్దకు వెళ్లారు. అతను రెండు మూడు బస్‌ ఆపరేటర్లకు ఫోన్‌చేసి ఆఖరికి టికెట్లు లేవని చెప్పారు. అలా నాలుగైదు ఏజెన్సీలను సంప్రదించినా అదే సమాధానం వచ్చింది. ఇంకా చాలా మంది బస్సు ఏజెంట్లు ఉన్నా, వారందరి వద్దకు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో మిత్రులంతా పండక్కి స్వస్థలాలకు వెళ్లిపోయినా ఫణీంద్ర మాత్రం తన గదిలో ఒంటరిగా ఉండిపోయారు. ఒక దీపావళికి ఇంటికి వెళ్లలేకపోయినా...జీవితం చిచ్చుబుడ్డీలా వెలిగే ఆలోచన ఆ సమయంలో అతనికి వచ్చింది. అన్ని బస్సుల్లో సీట్ల ఖాళీల వివరాలు ఒకేచోట లభిస్తే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందిగదా అనిపించింది. అంతే మిత్రులు వచ్చాక తన ఆలోచనను వారితో పంచుకున్నారు. అంతా కలసి ఓ సాఫ్ట్‌వేర్‌ తయారు చేశారు.

ఎర్రబస్సే గుర్తొచ్చింది...
ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేయడానికి అవకాశమున్న ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా అన్ని బస్సు సర్వీసులను అనుసంధానం చేస్తే ప్రయాణికులు ఇంట్లో నుంచిగానీ, ఏజెంట్‌ వద్ద నుంచిగానీ ఏ బస్సుకైనా, ఏ రూట్లోనైనా ఇట్టే టికెట్టు బుక్‌ చేసుకోవచ్చు. చాలా మంది బస్సు ఆపరేటర్లను కలిసి ఇదే విషయాన్ని వివరించారు సాఫ్ట్‌వేర్‌ తయారు చేసిన ముగ్గురు మిత్రులు. ఉచితంగా ఇస్తామన్నా ఈ సాఫ్ట్‌వేర్‌ను తీసుకోడానికి ఎవరూ అంగీకరించలేదు. అయినా వారు నిరుత్సాహపడలేదు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సలహాలు ఇచ్చే ఓ సంస్థ కలిశారు. ఆ సంస్థ సలహాతో తామే ఆన్‌లైన్‌ బస్‌ టికెట్‌ బుకింగ్‌ ఏజెన్సీని ప్రారంభించాలనుకున్నారు. అప్పుడు, చిన్నప్పుడు ఎక్కిన ఎర్రబస్సు గుర్తొచ్చింది. వెంటనే 'రెడ్‌బస్‌ డాట్‌ ఇన్‌' అనే పేరుతో సంస్థను ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు వదిలేశారు. ఓ బస్సు ఆపరేటర్‌ను ఒప్పించి వారంలో ఐదు సీట్లు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ టికెట్లు ఎలా విక్రయించాలన్నది ప్రశ్న...రెడ్‌బస్‌ డాట్‌ ఇన్‌ గురించి వివరిస్తూ ముద్రించిన కార్డులను బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు వెళ్లి ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఏమాత్రం నామూషాగా భావించకుండా ప్రహరీ బయట నిలబడి ఈ ప్రచారం చేశారు.

ఏడాదికేడాది విస్తరణ
తిరుపతికి చెందిన ఓ యువతి 2006 ఆగస్టు 22న మొదటి టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. ఆ రోజు ఆమెను ఇప్పుడు సీఈవోగా ఉన్న ఫణీంద్ర సామనే స్వయంగా బస్సు ఎక్కించారు. ఐదు టికెట్లను ఐదు రోజుల్లోనే అమ్మేశారు. ఇక తిరిగి చూసుకోలేదు. తొలుత బెంగళూరు నగరంలో ఎంతమంది బస్‌ ఆపరేటర్లు ఉన్నారు, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఎన్ని బస్సులున్నాయి, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి తదితర వివరాలు సేకరించారు. ఆ తరువాత తమ రెడ్‌ బస్‌ డాట్‌ ఇన్‌లో ఎక్కువ మంది బస్‌ ఆపరేటర్లను చేర్పించేందుకు కృషి చేశారు. అదేసమయంలో అత్యంత సృజనాత్మక ఆలోచనతో కూడిన ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకొచ్చారు. ఏడాదికేడాది సంస్థ విస్తరించింది. మొదటి ఏడాది ఐదు లక్షల వ్యాపారం చేశారు. రెండో ఏడాది రూ.5 కోట్లు, మూడో ఏడాది రూ.30 కోట్లు, నాలుగో ఏడాది రూ.60 కోట్లు..ఇలా పెరుగుతోంది ఆ సంస్థ టర్నోవర్‌. వెయ్యి కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది రెడ్‌బస్‌ సీఈవో ఫణీంద్ర సామ లక్ష్యం.

10 వేల బస్సుల్లో సీట్ల బుకింగ్‌
ఐదు సీట్లతో 2006 ఆగస్టులో మొదలైన సంస్థ ఇప్పుడు 10 వేలకుపైగా బస్సుల్లోని సీట్లు విక్రయిస్తోంది. ఆ సంస్థ 15 రాష్ట్రాల్లో 2,500 పట్టణాలు, నగరాల్లో సేవలిందిస్తోంది. రెడ్‌బస్‌.ఇన్‌లో 1300 మంది బస్‌ ఆపరేటర్లు, ఏజెంట్లు, 10 వేలకుపైగా బస్సులు నమోదయివున్నాయి. రోజుకు 5 లక్షల టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి. రోజుకు ఐదు వేల టికెట్లు విక్రయిస్తోంది. దేశ వ్యాప్తంగా 10 ఆఫీసులున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, కోయంబత్తూరు, పూణే, ఢిల్లీ, విశాఖపట్నం, అహ్మదాబాద్‌, ముంబయి, విజయవాడల్లో రెడ్‌బస్‌ ఆఫీసున్నాయి. 250 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ రోజుదాకా 90 లక్షల టికెట్లు విక్రయించింది. సెల్‌ఫోన్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌, ఈ-టికెటింగ్‌ వంటివీ ప్రవేశపెట్టింది. టికెట్లు ఇంటికే తెచ్చిచ్చే ఏర్పాట్లూ కొన్ని పట్టణాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ అవార్డు
సృజనాత్మక ఆలోచనతో ప్రారంభించిన రెడ్‌బస్‌ డాట్‌ ఇన్‌ సంస్థకు ఇటీవల అంతర్జాతీయ అవార్డు లభించింది. అత్యంత సృజనాత్మక ఆలోచనతో వ్యాపారం ప్రారంభించే సంస్థలకు అమెరికాలోని ఓ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డును రెడ్‌బస్‌ డాట్‌ ఇన్‌ దక్కించుకుంది. చిన్న సమస్యను పరిష్కరించే లక్ష్యంతో మొదలైన ఆలోచన పెద్ద వ్యాపార సామ్రాజ్యంలా విస్తరించడమే ఈ అవార్డు రావడానికి కారణమయింది. ఏమైనా మన తెలుగు యువకుడు ఒక అద్భుతమైన ఆలోచనతో కేవలం ఆరేళ్లలో వందల కోట్ల వ్యాపారవేత్తగా ఎదగడం అరుదైన, స్ఫూర్తిదాయకమైన విజయమేగదా!

Wednesday 20 June 2012

AC విద్యుత్‌ను ఎందుకు నిల్వచేయలేము?


DC విద్యుత్‌ను మాత్రమే నిల్వ చేయగలము. Aజ విద్యుత్‌ను ఎందుకు నిల్వచేయలేము? - ఎ.వినోద్‌కుమార్‌, కాకినాడ.
DC అంటే Direct Current‌కి సంక్షిప్తరూపం. ఇందులో విద్యుత్ప్రవా హం ఒకే దిశలో ఒకే తీరుగా ఉంటుంది. అంటే కాలానుగుణంగా విద్యుత్తీగలో విద్యుత్ప్రవాహం (Electrical Current) మారదు. విద్యుత్ప్రవాహం అంటే ఒక సెకనులో విద్యుత్తీగలో ఏదై నా ఒక బిందువు నుంచి కదిలే విద్యుదా వేశమన్న మాట. ఉదాహరణకు ఓ 12 ఓల్టుల లెడ్‌స్టోరేజి బ్యాటరీలో ఎపుడూ విద్యుత్‌ పొటెన్షియల్‌ అలాగే ఉందనుకుందాం. ఆ బ్యాటరీ ధన (+ve), ఋణ (-ve) ధృవాలను 6 వోల్టుల విరోధం (resistance) ఉన్న తీగతో కలిపామనుకుందాం. అపుడు ఆ తీగలో ఎక్కడ కొలిచినా సెకనుకు 2 కూలుంబుల విద్యు దావేశం కదుల్తుందని అర్థం. ఆ తీగలో 2 ఆంపియర్ల విద్యుత్ప్రవాహం ఉందని అంటాం. మరోమాటలో చెప్పాలంటే ఒక తీగలో సెకనుకు ఎన్ని కూలుంబుల విద్యుదావేశం ఓ బిందువు (point) నుంచి వెళ్తుందో అన్ని ఆంపియర్ల విద్యుత్ప్రవాహం ఉన్నట్లు అర్థం.

అయితే ఈ విద్యుత్‌ ఋణధృవం నుంచి ధనధృవం వైపునకు ఏకోన్ముఖంగా ఎలక్ట్రాన్ల ప్రవాహం రూపంలో ఉంటుంది. మునుపు చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం రెండు ఆంపి యర్ల విద్యుత్ప్రవాహం జరుగుతున్న తీగలో ప్రతి బిందువు నుంచి సెకనులో 12 బిలియన్‌ బిలియన్ల (12శ1018) ఎలక్ట్రాన్లు చీమల్లాగా జరజరా పాకిపోతున్నట్లు భావించాలి. బ్యాటరీలో ధన, ఋణధృవాలను కలపనంతవరకు ఎలక్ట్రాన్లు తేనెతుట్టెలో కరుచుకుని ఉన్న తేనెటీగల్లాగా ఋణధృవం దగ్గర పోగయి ఉంటాయి. ఇలా ఎన్ని ఎలక్ట్రాన్లను బ్యాట రీల ఋణధృవం దగ్గర పోగెయ్యగలిగితే అంత విద్యుత్‌ శక్మం (electrical potential) ఆ బ్యాటరీకి ఉంటుంది.

అదే ఋణధృవం దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్లు ప్రవాహానికి అనువుగా పోగుపడున్నాయో బ్యాటరీలోని ధనధృవం దగ్గర అంతమేరకు ఎలక్ట్రాన్ల ఖాళీలు (holes or positive electron gaps) ఉన్నట్టు అర్థం. అంటే బ్యాటరీలో ధనధృవం దగ్గర ఎలక్ట్రాన్లు అనే పిట్టలు లేని ఖాళీగూళ్లు, ఋణధృవం దగ్గర గూళ్లులేని అన్నే పిట్టలు ఉన్నట్టు భావిద్దాం. ధృవాలను మన టార్చిలైటు ద్వారానో, సెల్‌ఫోను ద్వారానో, వీూ3 పాటల ప్లేయర్‌ ద్వారానో, గోడగడియారం ద్వారానో లేదా టివి రిమోట్‌తో ఆన్‌ చేయడం ద్వారానో విద్యుత్తీగల ద్వారా కలిపినపుడు ఆయా సాధనాలలో ఉన్న వంకరటింకర దారిలో ఒకేవైపు పిట్టల్లాంటి ఎలక్ట్రాన్లు ఎగురుకుంటూ వెళ్లి మార్గమధ్యంలో ఆయా పరికరాల పనిని నెరవేరుస్తూ ధనధృవం దగ్గర ఖాళీగా ఉన్న గూళ్లను చేరుకుంటాయన్న మాట. ఇలా ధన, ఋణధృవాల దగ్గర ఎలక్ట్రాన్ల రూపంలో పోగయిన లేదా (ఖాళీ అయిన) విద్యుదావేశిత ప్రాంతాలుండడాన్నిDirect Current‌ విద్యుత్‌ నిల్వలు (DC sources) అని అంటారు.

ధన, ఋణ ధృవాలను పరికరాల తీగల ద్వారా కలపనంతవరకు (అంటే ఆయా పరికరాలను ఆన్‌ చేయనంతవరకు) విద్యుదావేశం ధన ఋణధృవాల దగ్గర స్థిరంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనన్ని ఖాళీలను ధనధృవం దగ్గర, సాధ్యమయినన్ని అదనపు ఎలక్ట్రాన్లను ఋణ ధృవం దగ్గర పోగుచేసి ణజ విద్యుత్‌ను నిల్వచేయగలము. ఇపుడిక AC సంగతి చూద్దాము. AC అంటే Allternating Current ‌ కి సంక్షిప్త రూపం. ఇక్కడ Alternating అంటే ఒకసారి అటూ, మరొకసారి ఇటూ అని అర్థం. ఒకసారి, మరోసారి అంటే కాలానుగుణంగానన్నమాట. విద్యుత్తీ గలో ఎడమవైపు నుంచి కుడివైపునకు కొంతకాలంపాటు ఎలక్ట్రాన్లు ప్రవహిస్తే ఆ తర్వాత అంతేకాలం పాటు కుడివైపు నుంచి ఎడమవైపునకు ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. మరోమాటలో చెప్పాలంటే కొంతసేపు తీగ ఎడమచివర ఋణధృవంగాను, కుడిచివర ధన ధృవంగాను పనిచేయగా, వెనువెంటనే తమ పాత్రలను మార్చుకుని కుడి చివర ఋణధృవంగాను, ఎడమచివర ధనధృవంగాను మారతాయి.

మన ఇళ్లలో మనం వాడే TRANSCO వాళ్ల విద్యుత్‌ AC విద్యుత్తు. ఇక్కడ ప్రతి సెకనులో 25 సార్లు ఎడమనుంచి కుడికి, మరో 25 సార్లు కుడి నుంచి ఎడమకు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఉదాహరణకు పిల్లల్ని ఊపే ఉయ్యాలనే చూడండి. ఉయ్యాల నిలకడగా ఉన్నపుడు అక్కడ మనం నిల్చున్నామను కుందాం. ఇక ఎవరో ఆ ఉయ్యాలను బాగా ఊపి వదిలేశారనుకుందాం. అపుడు మనకు ఉయ్యాలతొట్టి గమనం ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఎడమ వైపు నుంచి కుడివైపుకు పోతుంది తీరా కుడివైపుకు తేరుకున్నాక మళ్లీ ఎడమవైపుకు ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలా కొంతసేపు ఎడమ నుంచి కుడికి, మరి అంతేసేపు వెనువెంటనే కుడి నుంచి ఎడమవైపుకు ఉయ్యాల ఊగుతుంది కదా! అలాగే Aజ విద్యుత్తును మోసుకెళ్లేతీగలో కూడా ఎలక్ట్రాన్లు అనే ఉయ్యాలతొట్టి ఒకసారి ఎడమ నుంచి కుడికి, మరోసారి కుడి నుంచి ఎడమకు కదుల్తుంటాయి.

అయితే ఇక్కడ మరోవిషయం గమనించాలి. ఇలా పదే పదే దిశను మార్చుకోవడమే కాదు. ఆ విద్యుత్ప్రవాహ తీవ్రత (Electrical Current) కూడా ఒకేతీరుగా ఉండదు. ఎడమ నుంచి కుడికి ప్రయాణం ప్రారంభమైనపుడు మెల్లమెల్లగా విద్యుత్తు ఆవేశ పరిమా ణం (కదిలే ఎలక్ట్రాన్ల సంఖ్య) క్రమంగా పెరగడం వల్ల విద్యుత్‌ శక్మం గరిష్టంగా సుమారు 320 వోల్టుల వరకు పెరిగి మళ్లీ తగ్గి శూన్యమవుతుంది. తిరిగి కుడి నుంచి ఎడమకు ప్రయాణించేపుడు కూడా క్రమేపీ పెరుగుతూ సుమారు 320 వోల్టులకు చేరుకుని మళ్లీ తగ్గుతూ వెళ్తుంది. ఉయ్యాల ఉదాహరణ మళ్లీ తీసుకుందాం. ఉయ్యాల వేగం ఎడమ నుంచి కుడికి ప్రయాణించే క్రమంలో మెల్లగా పెరిగి మధ్యలో అత్యధికమై మళ్లీ తగ్గుతుంది. అలాగే ఎడమవైపు ప్రయాణం లో కూడా మధ్యలోనే గరిష్ట వేగం కల్గుతుంది.

ఉయ్యాల గమనాన్ని గణితంలో సైన్‌ తరంగ గమనం (sine wave) అంటారు. అలాగే మన ఇళ్లలో వాడే 230 వోల్టుల సింగిల్‌ ఫేజ్‌లో కూడా విద్యుత్‌ శక్మం, ప్రవాహం సైన్‌ తరంగం రూపంలోనే ఉంటుంది. ఇలా గరిష్టం అటూఇటూ సెకనులో 100 సార్లు జరుగుతుంది. ఒకసారి కుడివైపున ప్రారంభమై ఎడమ చివర చేరుకుని మళ్లీ కుడివైపునకు చేరడాన్ని ఓ వలయం (cycle) అంటాము. అంటే, మన ఇళ్లల్లోకి వచ్చే విద్యుత్‌లో ఇలాంటి వలయాలు 50 ఉంటాయి. అందుకే మన సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరాను 50నఓ (సెకనకు 50 సైకిళ్లు అని అర్థం) అంటారు. పెరిగి మళ్లీ తిరుగుతుంది. కాబట్టి, గణిత పద్ధతిలో RMS (Root mean square) వోల్టేజీగా 230 వోల్టులను సూచిస్తారు. సాధారణంగా విద్యుదయస్కాంత ప్రేరణల (Electro magnetic Induction) ద్వారా జలవిద్యుత్‌గానో(Hydro electric), ఉష్ణవిద్యుత్తు (Thermal Power) గానో, లేదా అణువిద్యుత్తు (Nuclear Power) గానో ఇతర శక్తి రూపాల్నించి మార్చడం ద్వారా Aజ విద్యుత్తును పొందుతాము. కాలానుగుణంగా పదే పదే దిశలు మార్చుకుంటూ జరిగే ప్రవాహం కావడం వల్ల Aజ విద్యుత్తును నిల్వ చేయలేము. ఎప్పటికప్పుడు ఉత్పత్తవుతున్న విద్యుత్‌ను వాడుకుంటూనే ఉండాలి. కేవలం AC ని ఇన్వర్టర్లు (లేదా LCR వలయాలు) ఉపయోగించి ణజ కు మార్చి నిల్వచేయగలము. Aజ ని AC గానే నిల్వ చేయడం వీలుకాదు.

ఎనిమిది గ్లాసుల నీళ్లు అవసరమా..?


రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది అనేది ఇప్పటివరకూ ఉన్న ఒక నమ్మకం. మానవులు తమ శరీరాలలో నీటి సమతుల్యత కాపాడుకోవడానికే నీరు తాగాలి. అందుకు నీరు అవసరమైనప్పుడే తాగడం మంచిది. రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం వల్ల ఒనగూడే లాభం పెద్దగా లేదు అంటున్నారు నిపుణులు. పండ్లు, పండ్ల రసాలు, కాఫీ, టీ కూడా బోలెడు నీటిని అందిస్తాయి. ఒక ఉడకబెట్టిన దుంపలో 75 శాతం నీరు ఉంటుంది. అందువల్ల, కేవలం నీటినే తాగడం వల్ల ఏదో మాజిక్‌ జరగదని పరిశోధకులు భావిస్తున్నారు. మన దాహం మనకి ఎంత నీరు కావాలో చెబుతుంది. లేదంటే మూత్రం కూడా ఎంత నీరు కావాలో హెచ్చరిస్తుంది. మూత్రం మరీ పసుపుగా ఉంటే నీటి అవసరం ఎక్కువ. మూత్రం మరీ నీళ్ళలాగా కనబడితే మాత్రం నీరు ఎక్కువైనట్టే లెక్క.
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

అధికవేడితో జంతువులకు హాని..!


గత వందేళ్లుగా భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంది. అందుకు కారణాలు అనేకమున్నా, ఆ పెరుగుదల కొన్ని జంతువులకు ప్రాణాంతకమయ్యే ప్రమాదకరంగా గోచరిస్తోందని పరిశోధకులు అంటున్నారు. వాతావరణంలో వేడి పెరుగుతూ పోతే జంతువులు మరొక వీలైన ప్రదేశానికి తరలిపోవడం ప్రకృతి లో మామూలుగా జరుగుతున్న విషయం. అయితే, ఇటువంటి వీలు అన్ని జంతువు లకీ ఉందని ఈ మధ్య తెలిసింది. అమెజాన్‌ వంటి వర్షారణ్యాలలోని జంతువులు వాతా వరణం మారేంత వేగంగా తమ నివాస స్థలాన్ని మార్చుకోలే వని వెల్లడైంది. అలా తమ నివాసాన్ని మార్చుకోలేని పక్షంలో అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. పది కంప్యూటర్‌ ప్రోగ్రాంలతో ఇప్పటికీ, 2100కీ మధ్య జరిగే వాతావరణ మార్పులు, వాటి వేగాన్ని అంచనా వేశారు. అలాగే, జంతువులూ తమ స్థావరాన్ని మార్చే ప్రక్రియనూ అంచనా వేసి, ప్రతి వంద జంతువులలో తొమ్మిది ప్రాణాపాయస్థితిలోకి చేరుకుంటాయని నిర్థారించారు. పెరుగుతున్న వేడితో అన్నిటికీ సమస్యే.

అడుగంటుతున్న భూగర్భజలాలు..!


ప్రపంచవ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. గత తొమ్మిది సంవత్సరాలుగా ఇటువంటి ప్రక్రియ జరుగుతోందని అంటున్నారు. ఈ తరహా తగ్గుదల మన దేశంతో సహా కాలిఫోర్నియా, చైనా, మధ్య ప్రాచ్య ప్రాంతాలలో మరింత ఎక్కువగా ఉందని తేలింది. అందుకు కారణం ఈ నీటిలో విస్తరిస్తున్న వ్యవసాయమే అంటున్నారు. 'కారు' అంత పరిమాణంలో ఉండే రెండు ఉపగ్రహాల సాయంతో ఈ అధ్యయనం చేశారు. సహజంగా భూగర్భజలం నిండే ప్రక్రియకన్నా మనం దానితోడి వాడే వేగమే ఎక్కువ. అందువల్ల ఇటువంటి దుష్పరిణామం ఏర్పడింది అని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య మరింత జటిలం కానుంద నీ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులు కూడా ఇందుకు ఒక కారణం. రానున్న రోజులలో భూగర్భ నీటిమట్టం మరింత దిగజారుతుందని వీరు ఆందోళనపడుతున్నారు.

నడుస్తూ విద్యుత్‌ పుట్టించవచ్చు..!


బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం ఉపకరణాన్ని రూపొందించారు. నడిచేటప్పుడు మన శరీర కదలికల్ని ఉపయోగించుకుని విద్యుత్‌ను ఉత్తత్తిచేసే పరికరాన్ని వాళ్ళు తయారుచేశారు. మోకాలిపై అమర్చుకునే వీలున్న ఈ పరికరం నడిచేటప్పుడు మోకాలి కదలికల మూలంగా విద్యుత్‌ని విడుదల చేస్తుంది. ఆల్ట్రాసౌండ్‌ స్కానర్లు, సోనార్‌ సెన్సార్లలో ఉపయోగించే 'పీజో ఎలక్ట్రిక్‌' పదార్థాలని వాడి దీనిని తయారుచేశారు. ఇప్పటికి ఈ పరికరం రెండు మిల్లీవాట్ల విద్యుదుత్పత్తి చేయగలదు. కానీ, కొద్దిపాటి మార్పులుచేస్తే ఇది 30 మిల్లీవాట్ల విద్యుత్‌ను విడుదల చేసే వీలుందని అంటున్నారు. విపరీతంగా బరువున్న బ్యాటరీలను మోసుకెళ్ళే మిలిటరీలో ఈ పరికరం బాగా ఉపయోగపడుతుందని దీని సృష్టికర్తలు అంటున్నారు.

డీజిల్‌ పొగతో క్యాన్సర్‌..!


ఈ మధ్య క్యాన్సర్‌ రావడానికి కారణాలు పెరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. తాజాగా డీజిల్‌ ఇంజన్ల నుండి వెలువడే ఉద్గారకాలు క్యాన్సర్‌ను కలిగిస్తాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ఈ అనుమానం 1988లోనే ఉన్నా, దీనిని నిర్ధారించడానికి ఇప్పటికి వీలైంది. సిగిరెట్‌ పొగ పీల్చడంకంటే డీజిల్‌ వాహనాలు వెదజల్లే పొగవల్లే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ అని ఇపుడు తేల్చారు. అంతేకాకుండా దీనివల్ల మూత్రకోశ క్యాన్సర్‌ కూడా వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. డీజిల్‌ నాణ్యతను మార్చితే ఇటువంటి ప్రమాదాలు తగ్గుతాయా అనే విషయంపై ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. కానీ, అటువంటి మార్పువల్ల మానవులకి జరిగే నష్టం మాత్రం పెద్దగా తగ్గదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వ్యసనం నుండి బయటపడాలంటే?


ఇది సాధ్యం. అయితే, వ్యసనం నుండి బయటపడడం ఒక్కరోజులో సాధ్యంకాదు. వ్యసనం నుండి బయటపడాలనే దృఢసంకల్పం వ్యసనపరుడిలో మొదట ఉండాలి. దీనివల్ల కలిగే లాభాలను బాధితుడు బాగా అర్థంచేసుకోవాలి. వీరికి స్నేహితులు, కుటుంబసభ్యులు పూర్తి సహకారం అందించాలి.
పనివత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలలో ఏదో ఒకదాన్ని తమ వ్యసనానికి సాకుగా చెప్తుంటారు. వీటికి బయటవారే కారణమని కూడా వీరు భావిస్తుంటారు. తమ బాధ్యతను ఒప్పుకోరు. అందువల్ల తమ వ్యసనానికి తామే ప్రధానకారణమని మొదట వీరు గుర్తించాలి. తగిన వైద్య సహాయంతో వీరు పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ ప్రక్రియలో మూడు దశలున్నాయి.
1. ఉపసంహరణ లక్షణాల దశ..
వ్యసనానికి అలవాటు పడినవారు మత్తుమందుల వాడకాన్ని మానివేసినప్పుడు 'ఉపసంహరణ లక్షణాలు' కనిపిస్తాయి. తీవ్రంగా చెమట పట్టడం, తల తిరిగినట్లు ఉండడం, చికాకు, నిద్రలేమి మొదలైన లక్షణాలు ఉంటాయి. వ్యసనకారక పదార్థాన్ని బట్టి ఈ లక్షణాలను తగ్గించే మందులను వైద్యులు సూచిస్తారు. వీటిని వైద్య పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.
2. చికిత్స కొనసాగించే దశ..
ఈ దశలో వ్యసనాన్ని తగ్గించుకుంటారు. మందులు, ఇతర సాంకేతిక ప్రక్రియల కంటే కౌన్సి లింగ్‌, యోగా, ధ్యానం, సంగీతంలాంటి మంచి అలవాట్లపై ధ్యాస మళ్లించడం ఈ దశ చికిత్సలో ముఖ్యభాగం. క్రమశిక్షణ అలవరచుకొనడం; ఇష్టమైన వృత్తిని చేపట్టడం వంటివి కూడా ఈ దశలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వ్యసనం నుంచి క్రమేణా బయట పడుతూ, ఆత్మ పరిశీలన ద్వారా తనను తాను సరిచేసుకోవాలి. ఈ సమయంలో స్నేహితులకు, కుటుం బానికి, సమాజానికి మరింత దగ్గరవుతుండాలి.
హెరాయిన్‌, మార్ఫిన్‌, మెథడోన్‌ వంటి ఒపి యేట్స్‌కు బానిసలైన వారికి నాల్ట్రాక్సేన్‌ (చీaశ్ర్‌ీతీవ-ఞశీఅవ) అనే మందు ఉపయోగపడుతుంది.
3. మళ్లీ లోనుకాకుండా నివారణ దశ..
సానుకూల జీవన శైలితో మళ్లీ వ్యసనానికి గురవకుండా ఈ దశలో జాగ్రత్తపడాలి. 'ఈ ఒక్క సారికేంలే!' అని మొదలుపెడితే కథ మళ్లీ మొదల వుతుంది. ఇది చాలా ముఖ్యమైన దశ.
- డా|| టి. సురేష్‌, జనవిజ్ఞాన వేదిక,
ఆరోగ్య విభాగం రాష్ట్ర కన్వీనర్‌

మత్తుమందులు .. దురుపయోగం..దుష్పరిణామాలు..


నొప్పి యాజమాన్యం, శస్త్రచికిత్సల్లో మత్తుమందుల వాడకాన్ని అనివార్యంగా మార్చింది ఆధునిక చికిత్స. ఈ మందులే మాదక ద్రవ్యాలుగా దురుపయోగమవుతూ యువతను మత్తులో ముంచెత్తు తున్నాయి. ఫలితంగా వీరు చైతన్య రహితులుగా, నిర్వీర్యులుగా మారుతున్నారు. మానవ బలహీనతల్ని ఆధారం చేసుకుని లాభాపేక్షే ధ్యేయంగా గల ఆర్థికవ్యవస్థ ఈ దుష్పరిణామాలకు మూలాధారం. మత్తుమందుల ఉత్పత్తి, రవాణా, అమ్మకాల్లో ఈ శక్తులదే పైచేయి. ఇది అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న వ్యాపారం. ప్రభుత్వాలు దీనిని నియంత్రించే స్థితిలో లేవు. అసాంఘిక మాఫియా గ్రూపులు ఆయా ప్రభుత్వాల్ని, పాలకపక్షాల్ని నియంత్రిస్తూ తమ కార్యక్రమాలను యథేచ్ఛగా కొనసాగించ గలుగుతున్నాయి. వీటి కట్టడికి ప్రయత్నిస్తున్నవారిని చంపడానికీ ఈ మాఫియాలు వెరవడం లేదు. కోట్లాదిమంది యువకుల్ని నిర్వీర్యం చేస్తూ వేల కోట్ల రూపాయల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ అసాంఘిక దొంగ రవాణా, వ్యాపార కార్యక్రమాల్ని కట్టడి చేయడానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కార్యక్రమాల్ని రూపొందిస్తుంది. ఈ కృషిలో భాగంగా ప్రతి ఏడాది జూన్‌ 26ను 'అంతర్జాతీయ మత్తుమందుల దురుపయోగం.. దొంగరవాణాల నిరోధకదినం'గా పాటించాలని ఆదేశించింది. చైనాలో గ్యాంగ్‌డమ్‌ ప్రాంతంలో హుమేన్‌ వద్ద నల్లమందు వాణిజ్యాన్ని విచ్ఛిన్నం చేసిన అప్పటి చైనా నాయకుడు లింగ్‌ జక్‌సో జ్ఞాపకార్థం ఈ తేదీ ఎన్నుకోబడింది. ఈ నేపథ్యంలో 'మత్తు మందులు (మాదక ద్రవ్యాలు).. దురుపయోగాన్ని.. వాటి దుష్పరిణామాల్ని..' సంక్షిప్తంగా తెలుపుతూ.. మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
చికిత్సలో ఉపయోగపడే పదార్థాన్ని 'మందు'గా వ్యవహరిస్తున్నాం. నొప్పిని మరిపించి లేదా తగ్గించేందుకు తోడ్పడే మందుల్ని 'మత్తు మందులు'గా వ్యవహరిస్తున్నారు. వీటిని కనిపెట్టిన తర్వాత, శస్త్రచికిత్స ఎంతో సులువైంది. తద్వారా ఈ పదార్థాలు మానవాళికి ఎనలేని సేవను చేస్తున్నాయి. వైద్యుల సలహాతో సంబంధం లేకుండా ఈ మందును తీసుకోవడాన్ని కొనసాగిస్తే మొదట చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ, త్వరలోనే దీని దుష్ప్రభావాలు బయటపడతాయి. ముఖ్యంగా ఈ మందుల్ని తీసుకోకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా, ఇదొక వ్యసనంగా మారుతుంది.
మత్తు మందులు తీసుకోవడం వ్యసనంగా మారిన స్థితిలో బాధితులు చైతన్య రహితులుగా, నిర్వీర్యులుగా మారిపోతారు. విచక్షణను కోల్పోతారు. ఇది వారి ఆరోగ్యాన్ని, సామాజిక, ఆర్థిక సంబంధాలపై చాలా దుష్ప్రభావం కలిగిస్తుంది. వ్యసనపరులు తమలో తాము కుంచించుకుపోయి, పరిస రాల్ని విస్మరిస్తారు. అంతిమంగా, ఆత్మనూన్యతకు లోనవుతారు.ఇది కుటుంబసభ్యుల, స్నేహితుల మీదా దుష్ప్రభావం కలిగి ఉంటుంది. అయితే, వీటి వ్యాపారం నిఘూ ఢంగా, పెద్దఎత్తున కొనసాగుతుంది. దీని కట్టడి నేడు అంతర్జాతీయంగా పెద్దసవాల్‌.
బాధితులు...
ధనవంతుల కుటుంబాలలో.. కౌమారదశలో వున్న పిల్లలు. వీరి స్నేహితులు వీటికి ఎక్కువగా బానిసలవుతున్నారు. ఫలితంగా వీరు చైతన్య, బాధ్యతా రహితు లుగా మారిపోతున్నారు. ఒకోసారి ఈ మందుల కోసం ఎంతటి ఘోరానికి పాల్పడ టానికీ వెనుకాడటం లేదు. ఇది సామాజిక సమస్యగా మారిపోతుంది. ఇటీవల ఈ బాధితుల సంఖ్య పెరుగుతున్నదనే సమాచారం ఆందోళన కలిగిస్తుంది. దీని వైఫల్యానికి ప్రభుత్వం, సమాజం, తల్లిదండ్రులూ అందరూ బాధ్యులే. ఈ సమస్య తీవ్రమవడానికి పెరుగుతున్న ఆర్థిక తారతమ్యాలు, జీవిత లక్ష్యం లేకపోవడం. సంబంధిత యంత్రాంగ వైఫల్యం ప్రత్యక్ష కారణాలుగా కొనసాగుతున్నాయి.
రకాలు..
* కోకాపేస్ట్‌ (కోకాబేస్‌) : కోకా చెట్ల ఆకుల నుండి దీన్ని సేకరిస్తారు. దీన్ని శుభ్ర పరిచి కోకెయిన్‌ను తయారుచేస్తారు.
* క్రాక్‌ (కోకెయిన్‌) : కోకెయిన్‌ హైడ్రో క్లోరైడ్‌.
* హీరోయిన్‌ (హీరోయిన్‌ హైడ్రో క్లోరైడ్‌) : దీన్ని ఇంజెక్షన్‌ రూపంలో తీసుకుంటారు. దీన్ని హీరోయిన్‌ నెం.4 అని కూడా అంటారు.
* హీరోయిన్‌ నెం.3 : పొగపీల్చడానికి వాడతారు. ఇది తక్కువ నాణ్యతతో ఉంటుంది.
* పాపీ స్ట్రా : విత్తనాలు తీసిన తర్వాత ఓపియమ్‌ పాపి (గసగసాలు) చెట్లకు సంబంధించిన అన్ని భాగాలు.
* కెన్నాబిస్‌ : గంజాయి - దీని ఉత్పత్తి, వినియోగం స్థానికంగానే ఉంటుంది. ఇదే ఎక్కువగా వినియోగంలో ఉంది.
* ఎటిఎస్‌ : యంఫÛటామైన్‌ రక ఉత్ప్రేరకాలు. ఇవి కృత్రిమంగా తయారుచేసినవి. వీటిని తయారుచేసే పదార్థాలు స్థానికంగా దొరుకుతాయి. అందువల్ల, దీని తయారీ, వినియోగం స్థానికంగానే ఉంటుంది.
2008 నుండి పదేళ్ల కాలంలో, అంటే 2018 నాటికి మత్తుమందుల దొంగ ఉత్పత్తి రవాణా దురుపయోగాన్ని పూర్తిగా నివారించాలని లేదా నియంత్రించాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నిర్ణయించింది. ఈ లక్ష్యాలతోనే ఇది పనిచేస్తుంది.
అసలు కారకులు..
నల్లమందు వ్యాపారంలో అత్యధిక లాభాలుండటంతో బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ 19వ శతాబ్ధంలో చైనాలో నల్లమందు వ్యాపార హక్కుల కోసం ఏకంగా రెండుసార్లు యుద్ధాల్ని చేసి, విజయం పొందింది. అప్పటి చైనా రాజు దిగుమతి సుంకాన్ని అధికంగా వేయడంతో ఈ యుద్ధాలు జరిగాయి. ఈ మందు టర్కీ, ఇండియాలో ఉత్పత్తయ్యేది. స్థానిక ప్రజలు నల్లమందును తీసుకొని, నిర్వీర్యులుగా మారుతుండటంతో 1800లోనే దీని దిగుమతిని చైనా రాజు నిషేధించాడు. అయినప్పటికీ, దొంగరవాణా, వ్యాపారం ఆగలేదు, కొనసాగింది. ఈ నియంత్రణ ప్రయత్నాలే అంతిమంగా నల్లమందు యుద్ధాలకు దారితీశాయి. ఈ యుద్ధాల్లో ఓడిపోవడంతో బ్రిటిష్‌ వారికి నల్లమందు ఎగుమతికి, అమ్ముకోడానికి ఎన్నో హక్కుల్ని చైనా ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత, ఫ్రెంచి అమెరికన్‌ కంపెనీలు కూడా ఇలాంటి హక్కుల్నే పొందాయి. ఇక వర్తమానకాలానికి వస్తే ఐక్యరాజ్యసమితి మత్తుమందుల నియంత్రణ కార్యక్రమం అంచనా ప్రకారం 2001లో ఆఫ్ఘనిస్తాన్‌లో 185 టన్నుల ముడి నల్లమందు ఉత్పత్తి అయింది. 2000లలో దీని ఉత్పత్తి 3,276 టన్నులుండేది. అంటే, ఒకేఒక్క సంవత్సరం 2001లోనే దాదాపు 94 శాతం ఉత్పత్తి తగ్గింది. ఇది తాలిబాన్ల కృషి ఫలితం. కానీ, 2002లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తర్వాత నల్లమందు ఉత్పత్తి తిరిగి 2000 సంవత్సరం స్థాయికి పెరిగింది. 2006 నాటికి ప్రపంచంలో 92 శాతం నల్లమందు ఆఫ్ఘనిస్తాన్‌ నుండే వచ్చిందని ఐక్యరాజ్యసమితి నివేదిక-2010లో పేర్కొంది. అంటే, మత్తుమందుల ఉత్పత్తి, దొంగ రవాణా వెనుక ఏ శక్తులు బలంగా ఉన్నాయో ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు కదా?
మన దేశంలో..
* 'హీరోయిన్‌' అనే మత్తుమందు వాడకందార్లు 2006లో 7.71 లక్షల మంది.
* నల్లమందు వినియోగదారులు 6.74 లక్షల మందితో రెండోస్థానంలో ఉన్నారు.
* 'హీరోయిన్‌' రకం వినియోగం 17 టన్నులు. ప్రపంచ వినియోగంలో ఇది దాదాపు ఐదు శాతం.
* నల్లమందు వినియోగం 67 టన్నులు. ప్రపంచ వినియోగంలో ఇది ఆరు శాతం.
* మొత్తం నల్లమందు పదార్థాల వినియోగం 239.8 టన్నులు నల్లమందుతో సమానం.
* నల్లమందు మొక్కలు (ఓపియమ్‌ పాపి) 1500-2000 హెక్టార్లలో సేద్యం చేయబడుతున్నాయి. ఇదేగాక, 2009లో ఆరు వేల హెక్టార్లలో దీని సేద్యం అనుమతించబడింది.
* స్వాధీనం చేసుకున్న 'హీరోయిన్‌' 1.1 టన్నులు.
* పట్టుకున్న నల్లమందు ఉత్పత్తులు 13 టన్నులు. కాగా, దీనిలో నల్లమందు రెండు టన్నులు.
(ప్రపంచ మత్తుమందుల 2010 నివేదిక ఆధారంగా...)
మీకు తెలుసా..?
* మందుల వినియోగం: వైద్యుల సలహా మేరకు చికిత్సకు మత్తు మందుల వాడకం.
* దుర్వినియోగం : వైద్యుల తప్పుడు సలహాతో మత్తు మందు వినియోగం.
* దురుపయోగం : సొంత నిర్ణయంతో మత్తుమందును సేవించడం.
* ప్రపంచంలో 15.5 నుండి 29.0 కోట్ల మంది ప్రజలు మత్తు మందుల్ని వినియోగిస్తారని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.
* సామాజికంగా 1.6-3.8 కోట్ల మంది (మత్తు మందులు దురుపయోగం చేసే వారిలో మొత్తం 10-15 శాతం) సమస్యాత్మకంగా మారారు.
* సమస్యాత్మకంగా మారిన వారిలో 12-30 శాతం చికిత్స పొందుతున్నారు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

Wednesday 13 June 2012

దిష్టి తగులుతుందా?


    
  • అశాస్త్రీయ ఆచారాలు11
           ఇటీవల మా స్నేహితుని మనువడి పుట్టినరోజు ఫంక్షన్‌కి వెళ్లొచ్చాం. వచ్చేటప్పటికే మా మనుమరాలు అమూల్య ఒళ్ళు కొంచెం వేడిగా ఉంది. ఒకటే ఏడుస్తోంది కూడానూ. ఎత్తుకున్నా ఏడుపు ఆపడం లేదు. వెంటనే మా అమ్మ 'ఒరేరు! చిన్నదానికి దిష్టి తగిలిందిరా!' అంది. మేము వారించేలోగానే లోపలికెెళ్ళి ఎండు మిరపకాయలు, ఉప్పు తెచ్చి పాప చుట్టూతా వాటిని తిప్పి మండేపొయ్యిలో వేసింది. అవి చిటపట మంటూ కాలిపోయాయి. ఘాటైన వాసనేమీ రాలేదు. అప్పుడు మా అమ్మ 'చూడరా లక్ష్మీకాంతం! ఘాటే రాలేదు. చిన్నదానికి ఎంత దిష్టి తగిలిందో..! నువ్వు దిష్టీ, గిష్టీ లేదంటావుగానీ, దిష్టి లేకపోతే మిరపకాయల కోరొచ్చి మనందరికీ దగ్గొచ్చేది' అంది.
అప్పుడు నేను మా అమ్మతో 'అమ్మా! ఇప్పుడు కొంచెం ఎక్కువ మిరపకాయలు, ఉప్పు తీసుకొని నాకు దిష్టి తీయి. తర్వాత వాటిలో సగం ఈ పొయ్యిలో వెయ్యి. ఏమవుతుందో చూడు' అన్నా. మా అమ్మ ఆ ప్రకారమే చేసింది. ఘాటు వాసన రాలేదు. 'అంటే నాకూ దిష్టి తగిలిందా?' అని అడిగాను.
మా అమ్మ మౌనం వహించింది. 'ఇప్పుడు మిగిలిన కాయలు ఈ కుంపట్లో వెయ్యి' అన్నా. ఆమె వేసింది. వెంటనే రూమంతా విపరీతమైన ఘాటు వాసన.. అందరికీ ఒకటే దగ్గు.
'ఇప్పుడు ఏమంటావమ్మా! నాకు దిష్టి తగిలిందా? తగల్లేదా?' అన్నాను. అమ్మ ఏమీ మాట్లాడలేదు.
అప్పుడు నేను దీని వెనకున్న సైన్సు సూత్రాన్ని వివరించా. 'నీవు మొదట ఉప్పూ, మిరపకాయలు భగ భగ మండే పొయ్యిలో వేశావు. అంత పెద్దమంటకు మిరపకాయలు ఒక్కసారిగా మండిపోయాయి. అందువలన వాటిలోని రసాయనపదార్థాలు ఒక్కసారి గా గాలిలో కలిసిపోయాయి. దీంతో పొగకాని, కోరు గాని రాలేదు. రెండవసారి నుసికట్టిన బొగ్గులపై వేశావు. అవి మండటానికి కావలసినంత ఆక్సిజన్‌ చాలక మెల్లగా వేడెక్కి, నింపాదిగా మండాయి. అప్పు డు పొగ, కొన్ని రసాయనాలు విడుదలయ్యాయి. వాటి వలన మనందరికీ దగ్గొచ్చింది. అంతేకానీ మొదటిసారి పొయ్యిలో వేసినప్పుడు దిష్టి తగిలిన సూచనగానీ, రెండవసారి కుంపట్లో వేసినపుడు తగలకపోవడానికి గానీ సూచన కాదు. అదంతా మంట తీవ్రతకు సంబం ధించిన విషయం. నీవు చిన్నదానికి దిష్టి తీసినపుడు ఆ మిరప కాయలు కుంపట్లో వేసినట్లయితే అప్పుడు కోరొచ్చి ఉండేది. అప్పుడు నువ్వు 'చిన్నదానికి జ్వరం వచ్చిందిరా! డాక్టరు దగ్గరకు తీసికెళ్లు' అనే దానివి.
'మన చిన్నది తెల్లగా, బొద్దుగా ముద్దొస్తోంది కదా! అందువల్ల ఫంక్షన్‌లో అందరూ ఎత్తుకొని, ముద్దు చేశారు. ఇలా చాలామంది చేయడంతో పసిపిల్ల లు ఇబ్బందిపడతారు. దీంతో పిల్లల ఒళ్లు వెచ్చ బడుతుంది. మనం దూరప్రయాణం చేస్తే ఎలా బడలికగా ఉంటుందో అలా అన్న మాట. వాళ్ళకు కొంత విశ్రాంతి ఇస్తే మామూలు స్థితికి వస్తారు. నేనిప్పుడు చిన్నితల్లిని కాసేపు చల్లగాలిలో తిప్పుతాను. నిద్రపోయి, తెల్లవారేటప్పటికి మామూలై ఆడుకొంటుంది' అన్నా. అన్నట్లే కొంతసేపు తిప్పిన తర్వాత పాప నిద్రపోయింది.
మా అమ్మ 'అదిసరే లక్ష్మీకాంతం! కొన్నికళ్ళు దిష్టి కళ్ళంటారు కదరా? దీంతో పిల్లలకు అన్నం సహించదు. మరి దానికేమంటావు?'
'దిష్టి కళ్ళు అనేవేవీ ఉండవమ్మా! మన కళ్ళలోంచి కొన్ని ప్రత్యేకకిరణాలేవీ ఇతరులపై పడవు. ఏ వస్తువు మీదైనా వెలుతురు కిరణాలు పడ్డప్పుడు, ఆ వస్తువు కాంతి మన కళ్ళల్లోకి పడుతుంది. ఇక కళ్ళల్లోంచి దిష్టి అనేది ఇతరుల మీద పడటం ఎలా సంభవం? మీరేం చేస్తుంటారంటే పిల్లలకు జ్వరం వచ్చినా, ఆకలి తగ్గినా అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, మందుల గురిం చి ఆలోచించకుండా ఆ రోజు పసిబిడ్డను ఎవరు చూ శారు? ఎవరి కళ్ళుపడ్డాయో అని అనవసర, అశాస్త్రీయ ఆలోచనలు చేస్తారు. మిరపకాయల, బుంగ దిష్టిల్లాం టివి తీస్తారు. దిష్టి లేదని అర్థంచేసుకోమ్మా!' అన్నాను.
రెండురోజుల క్రితం బంధువుల పెళ్ళికి వెళ్ళాము. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ పాపని ఎత్తుకుని, బంధువుల పలకరింపులవగానే, చల్లగాలిలో ఆడించా. ఇంటికి వచ్చిన తర్వాతా పాప ఉల్లాసంగా ఆడుకున్నది.
ఆ తర్వాత మా అమ్మ దిష్టి సంగతి ఎప్పుడూ ప్రస్తావించలేదు.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

పిరిమిడ్ల నిర్మాణానికి రాళ్లను ఎక్కడ నుంచి తెచ్చారు?


   

      ఈజిప్టులో పిరమిడ్లు నిర్మించారు కదా! ఆ చుట్టుపక్కల కొండలు, రాళ్లు లేవు. మరి అంత పెద్ద    
      రాళ్లను ఎక్కడ నుంచి ఎలా తెచ్చారు?
      - రాంబాబు, రాజమండ్రి
ఈజిప్టులోని పిరమిడ్లు సుమారు 4600 సంవత్సరాల క్రితం పురాతన మానవ నిర్మితాలు. క్రీ.పూ. 2630 మొదలుకొని క్రీ.పూ. 660 సంవత్సరాల వరకు వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాల్లో నిర్మించబడిన సౌష్టవ నిర్మాణాలివి. పిరమిడు అంటే గణిత శాస్త్రంలో ఓ ప్రత్యేక అర్థం ఉంది. ఒక సమబాహు బహుభుజి (Equilateral Polygon) మూలల (corners) నుంచి సమానదూరంలో ఓ కూచ్యాగ్రాన్ని (apex) చేరేలా నిర్మించబడిన ఘనరూపమే పిరమిడు. సాధారణంగా బహుభుజిని నేలపై పూర్తిగా ఆనేలా రూపొందించి ప్రతి మూల నుంచి భుజాలంత దూరంలో కూచ్యాగ్రం ఉండేలా ఈ పిరమిడ్లను రూపొందిస్తారు. ప్రతి మూల నుంచి ఓ అంచు కూచ్యాగ్రానికి వెళ్తుండడం వల్ల పిరమిడు పార్శతలాలు (lateral faces) ఎపుడూ త్రికోణాకారంలోనే ఉంటాయి. సాధారణంగా భూమి మీదున్న బహుభుజి భుజమంతే దూరంలో ఉండేలా పిరమిడును నిర్మిస్తే పార్శ్వ తలాలు విధిగా సమబాహు త్రిభుజాకారం (Equilateral Triangle) రూపంలోనే ఉంటాయి. నేలమీదున్న బహుభుజాన్ని ఆధార భూమి (base) అంటారు.

పిరమిడు నిర్మించాలంటే కనీసం మూడు భుజాలున్న బహుభుజ భూమి కావాలి. ఇలాంటి పిరమిడును చతుర్ముఖి (tetrahedron)అంటారు. బహుభుజిలో ఎన్ని భుజాలుంటాయో అన్నే పార్శ్వ ముఖాలుంటాయి. ఈజిప్టులోని పిరమిడ్లు చాలామటుకు చతురస్రాకార (square) భూమి ఉండేలా సమబాహు త్రిభుజాకృతులు పార్శ్వతలా లుగా నిర్మించబడినవి. ఇలాంటి పిరమిడ్లను చతుర్భుజ (tetragonal) పిరమిడ్లు అంటారు. సుమారు 138 పిరమిడ్లు ఈజిప్టు, ఆ చుట్టుపక్కల ఉన్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో చాలామటుకు శిథిలం కాగా, కేవలం పదిలోపే ఇంకా పిరమిడు రూపంలో ఉన్నాయి. మిగిలినవి కాలక్రమేణా ఎండలకు, గాలులకులోనయి నేలమట్టం అయ్యాయి. మరికొన్ని విరూపం (deshaped) అయ్యాయి.

ఈజిప్టు, సుడాన్‌లలో వందలాదిగా నేటికీ నిలిచి ఉన్న పిరమిడ్లలో కైరో నగరం సమీపాన గిజి ప్రాంతంలో ఉన్న కుఫ్టు పిరమిడ్‌ (Pyramid of Khufu) ప్రస్తుతం వరకు ఉన్న పిరమిడ్లలోనే అత్యంత ఎత్తయ్యింది. ఇది ప్రాచీన ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా నేటికీ భాసిల్లుతోంది. ఈజిప్టు రాజుల్లో నాల్గవతరానికి చెందిన ఫారోకుఫు వంశపు పాలకుల సమాధిగా దీన్ని క్రీ.పూ. 2580లో ప్రారంభించి క్రీ.పూ. 2560 వరకు పూర్తిచేశారని ప్రసిద్ధి. ఈ పిరమిడు చతుర్భజి భూమి భుజం పొడవు సుమారు 230 మీటర్లు. ఎత్తు (భూమి మధ్య నుంచి) సుమారు 150 మీటర్లు. దీనర్థం ఏమిటంటే ఈ పిరమిడును ఒకసారి చుట్టి రావడానికి సుమారు కిలో మీటరు దూరం (4X230=920 మీ) ఉంటుందన్న మాట.

క్రీ.శ 1311లో ఇంగ్లాండులో లింకన్‌ క్యాథడ్రెల్‌ (Lincoln Cathedral) నిర్మిం చేంత వరకు అంటే దాదాపు 3800 సంవత్స రాలపాటు మానవ నిర్మిత నిర్మాణాల్లో అత్యంత ఎత్తయిన, విశాలమైన కట్టడంగా ఈ పిరమిడు కీర్తించబడుతోంది. మీరన్నట్లు ఈ పిరమిడు, మిగిలిన పిరమిడ్లు చాలామటుకు దీర్ఘ ఘనాకారం (parallelepiped) లోకి తొలచ (chistled) బడిన బండరాళ్లతోను, గట్టి ఇటుకలతోను, సముద్రశంఖాలతో చేసిన దీర్ఘఘనాకార దిమ్మలతోను నిర్మించారు. ఒక్కో నిర్మాణానికి సగటున 10 సంవత్సరాలు పట్టింది. ఎన్నో శతాబ్దాలపాటు నిర్మించిన ఈ పిరమిడ్ల నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీల సంఖ్య లక్షవరకు ఉండవచ్చని అంచనా! మానవ నిర్మితం అంటూ చరిత్రలో ఘనత చెందిన పిరమిడులోని ప్రతి రాయి వెనుకా ఆనాటి శ్రామిక బానిసల చెమట, రక్తం లేదా ప్రాణాలు ఉన్నాయి. వేదనలు, కొరడా దెబ్బలు ఉన్నాయి.

శిక్షలూ, మరణదండనలూ ఉన్నాయి. ఈజిప్టులో పిరమిడ్ల దరిదాపుల్లో కొండలూ, బండరాళ్లు లేకపోయినా, వాహనాలు, పెద్ద పెద్ద యంత్రాలూ లేకపోయినా వేలాది సంవత్సరాలుగా సాగిన పిరమిడ్ల నిర్మాణంలో గొప్పదనమెవరిది? పిరమిడ్లు అంటూ వచ్చాక వాటి చుట్టూ ఎన్నో అభూతకల్పనలూ, మహత్తులూ, వాటిని నిర్మించిన రోమను చక్రవర్తుల, ఈజిప్టు రాజుల ఘనచరిత్రనే మనం వింటుంటాము. కానీ వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న నైలునది నుంచో, ఎర్ర సముద్రం నుంచో వేలాది శ్రామిక బానిసలు కాలినడకనే లక్షలాది బండరాళ్లను, గవ్వల్ని మోసుకొచ్చారు.

మహా అయితే అడపాదడపా ఒంటెల బళ్లను వాడి ఉండవచ్చును. లక్షలాది గవ్వల్ని భట్టీల్లో వేసి సున్నపుదిమ్మల్ని చేశారు. ఆ వేడిలో అసువులు బాసిన బానిస బతుకులెన్నో! లక్షలాది బండల్ని ముక్కలు చేస్తూ వాటికి దీర్ఘఘనాకృతిని చెక్కిన బక్క బతుకుల హీనాకృతులెన్నెన్నో! మోయడం, మోదడం తప్ప ప్రమోదాలెరుగని శ్రామిక వీపుల మీద కొరడా మోతలెన్నో! రాచరిక నిరంకుశాన్ని తలెత్తి ప్రశ్నించిన తలతీతలెన్నో! 'ప్రభువెక్కిన పల్లకి కాదోరు, దాన్ని మోసిన బోయీలెవ్వరు? తాజ్‌మహల్‌ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవ్వరు' అన్న శ్రీశ్రీ మాటల్నే ఇక్కడా అన్వయించుకోవాలి. పర్యావరణాన్ని కొందరే కాలుష్యం చేస్తుంటే మానవులందరికీ ఆ పాపాన్ని అంటగట్టే దోపిడీవ్యవస్థే బహుళ శ్రామికశక్తి నిర్మితమైన చారిత్రక కట్టడాల కీర్తికిరీటాల్ని మాత్రం రాజుల గొప్పలుగా చెప్పుకుంటారు. చరిత్ర రథసారథులైన శ్రమజీవుల్ని చరిత్రహీను లుగా కనుమరుగుచేస్తారు.

మామిడితొక్క కొవ్వు కరిగిస్తుంది..!

                 మామిడికాయలు తింటే కొవ్వు కరుగుతుందని, బరువు తగ్గుతుందనీ తెలిసింది. అయితే, మామిడిపండుతో దానిపై తోలును కూడా తింటేనే ఈ మేలు కలుగుతుందని ఆస్ట్రేలియా పరిశోధకులు అంటున్నారు. ఇంకో విషయం కూడా వారు గమనించారు. కొన్నిరకాల మామిడి పళ్ళు తింటే వ్యతిరేక ఫలితాలు ఉంటాయట. ఈ పరిశోధన ఆస్ట్రేలియాలో జరిగింది. కాబట్టి, అక్కడ సాధారణంగానే దొరికే 'ఇర్విన్‌, నాండాక్‌ మై' రకాల తోలులో మానవ కొవ్వుకణాల అభివృద్ధిని అడ్డుకునే పదార్థం ఉందని కనిపెట్టారు. 'కెన్సింగ్టన్‌ ప్రైడ్‌' అనే రకం మాత్రం కొవ్వు కణాలను ప్రేరేపించే పదార్థం కలిగి ఉందని తెలిసింది. ఈ పరిశోధన ఇంకా ప్రాథమికదశలోనే ఉన్నా, త్వరలో ఏ ప్రత్యేక పదార్థం వలన కొవ్వు కరుగుతుందో తెలుసుకునే వీలుంది అంటున్నారు. మరి, మనం తినే రకాల్లో ఎలా వుందో? తెలుసుకోవాల్సిందే.

మానవావిర్భావం ఆసియాలోనే..!




            ఆధునిక మానవుడి మూలాలు అందరూ అనుకుంటున్నట్టుగా ఆఫ్రికాలో కాక ఆసియాలో ఉన్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. మయన్మార్‌లో తాజాగా లభించిన ఒక శిలాజం ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. ఇంతకు ముందు వానరాలు, మహావానరాలు (ఏప్స్‌), మానవుల పరిణామానికి సంబంధించిన ఆనవాళ్ళు ఆఫ్రికాలోనే ఉన్నాయని, అందువల్ల ఈ ప్రదేశంలోనే మానవావిర్భావం జరిగిందని భావించేవారు. తాజాగా, మయన్మార్‌లో ఒక మానవుడికి సంబంధించి పూర్వం ఉన్న జీవి తాలూకు దంతం లభించింది. ఆ దంతాలు సుమారు 37 మిలియన్‌ ఏళ్ళ క్రితం నాటివని తేలింది. ఆఫ్రికా మానవుని మూలాలకు నిలయం అయితే ఆసియా మన ప్రాచీన వంశస్తులు పుట్టిన ప్రదేశం అని అంటున్నారు.

వంటగదికన్నా రోడ్డే నయం..!




              కాలుష్యం విషయంలో రోడ్లు అతి తీవ్రంగా ఉంటాయని అనుకుంటాం. కానీ, వాస్తవానికి మన వంటగదిలోని కాలుష్యం ట్రాఫిక్‌తో నిండిన రోడ్ల కంటే దారుణం అని ఇటీవల పరిశోధకులు తెలుసుకున్నారు. మన సగటు వంట గదులలోని గ్యాస్‌పొయ్యిలు, క్లీనింగ్‌ పదార్థాలు, రూం ఫ్రెషనర్లు వంటివి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ రోడ్ల మీద కంటే వంటగదుల్లో మూడురెట్లు ఎక్కువట. అందుకు కారణం గ్యాస్‌స్టవ్‌లు, విద్యుత్‌ స్టవ్‌లు. వీటిపై,నిర్వహించిన పరిశోధనలో గ్యాస్‌స్టవ్‌ల వల్లే ఎక్కువ కాలుష్యం వెలువడుతుందని తేలింది. పైగా, అటువంటి కాలుష్యం వల్ల వృద్ధులలో హృద్రోగాలు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందట.

కొవ్వు నుండి ఎముకలు..!


             

                 కొవ్వు నుండి ఎముకను సృష్టించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. కొవ్వు కణజాలం నుండి కణాలను స్వీకరించి ఒక నెలలో సంపూర్తిగా అభివృద్ధి చెందిన ఎముకను రూపొందించగలిగారు. ఆ ఎముక సుమారు రెండు అంగుళాల పొడవు ఉంది. ఇటువంటి ఎముకలను శరీరం బయట, పరిశోధనశాలలో అభివృద్ధిచేసి, ఆ తరువాత శరీరంలో అమర్చవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రమాదాలలో ఎముకలు కోల్పోయినవారికీ, ఇతరత్రా ఎముకలు అవసమైన మేరకు వాటి కచ్ఛితమైన ఆకారాన్ని, వివరాలను అంచనా వేసి, సరిగ్గా అలాగే రూపొందించవచ్చు. పైగా, ఈ ఎముకలు సంబంధిత శరీరం నుండే తయారుకావడంతో ఆ తరువాత ఎటువంటి దుష్ప్రభావాలూ ఉండవు. ఇటువంటి ఎముకల మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్‌) ఇప్పటికే కొన్ని జంతువులలో విజయవంతంగా జరిగాయి. సాధారణ ప్రమాదాల సందర్భాలలోనే కాకుండా, ప్లాస్టిక్‌ సర్జరీలలో కూడా ఇటువంటి ఎముకల అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మనదేశంలో జీవవైవిధ్యం


మనదేశం ప్రధానంగా ఉష్ణమండలంలో ఉండటంతో జీవవైవిధ్యం ఎక్కువగానే ఉంది. ప్రపంచజీవుల్లో గల మొత్తం వైవిధ్యంలో 7.3% మన దేశంలోనే ఉంది. ముఖ్యంగా బాక్టీరియాల్లో 21% ఫంగస్‌ జాతుల్లో 20%, అల్గేలలో 16%. బ్రయో ఫైటాలో 17% పైగా వైవిధ్యం ఉంది. ఇక చేపల్లో కూడా అధికంగా 11.7% వైవిధ్యం మనదేశంలోనే ఉంది. ఒక అంచనా ప్రకారం 193 జంతు జాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటిలో క్షీరదాలు-75, పక్షులు-73, తోకున్న జీవులు (రెప్టైల్స్‌) -16,చేపలు-4, సరీసృపాలు (పాముల్లాంటివి)-3, వెన్నెముకలేని ఇతర జీవాలు-22 ఉన్నాయి.

పెరుగుతున్న జనాభా, అడవులు, మడ అడవుల నరికివేత, విస్తరిస్తున్న సేద్యం జీవవైవిధ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. ఇటీవలకాలంలో ఉదృతంగా ప్రవేశపెడుతున్న బిటి సాంకేతిక విజ్ఞానం ఆయా పంటల్లో జీవవైవిధ్యాన్ని బాగా తగ్గిస్తుంది. నిరంతరం కొనసాగిస్తున్న నీటిప్రాజెక్టుల నిర్మాణం జీవవైవిధ్యాన్ని తగ్గిస్తున్నాయి. లోయల్లో నిర్మించే పెద్ద రిజర్వాయర్ల (ఉదా: సర్దార్‌ సరోవర్‌, సైలెంట్‌ వాలీ) వల్ల అపార జీవవైవిధ్యాన్ని, కొన్ని జాతుల్ని కోల్పో యాం, కోల్పోతున్నాం. ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర కట్టడాల వల్ల కొన్ని జాతులు తమ నివాస స్థలాల్ని పూర్తిగా లేక పాక్షికంగా కోల్పోతున్నాయి. వున్న పెద్ద నివాసస్థలాలు చిన్నచిన్నవిగా విడిపోతున్నాయి. ఫలితంగా స్థానికంగా జరిగే పునరుత్పత్తి పెరిగి, జీవవైవిధ్యం క్షీణిస్తుంది.

ఒక నివేదిక ప్రకారం మన దేశంలో ఇప్పటికే 19 జాతులు పూర్తిగా అంతరించాయి. మరో 1236 జాతులు ప్రమాదంలో ఉన్నాయి. వీటిలో 41 వర్గాలకు సంబంధించిన జీవజాతులు సహజ పర్యావరణంలో అంతరించాయేమోనని భావిస్తున్నారు. 152 అంతరించిపోయే దిశలో ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. 251 జాతుల్లో సంఖ్య బాగా తగ్గింది. వీటి లో కొన్నింటిని మాత్రమే అప్పుడప్పుడు చూడగలుగుతు న్నాం. చిరుతపులులతో సహా 23 జంతువులు సహజ వాతావరణంలో దాదాపు అంతరించిపోయాయి.

ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య దశాబ్ధం..


జీవవైవిధ్య పరిరక్షణకు, సుస్థిరాభివృద్ధికి తోడ్పడే విధంగా ఒక వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేయించే లక్ష్యంతో 2011-2020 కాలాన్ని 'ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య దశకం'గా ఐక్యరాజ్యసమితి 2011, ఏప్రిల్‌లో ప్రకటించింది. ఈ కాలంలో జీవవైవిధ్య పరిరక్షణకు రూపొందించిన కార్యక్రమాలకు మద్దతునివ్వడం, దీనికోసం అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థల కార్యక్రమాల అవసరాలకు మద్దతునివ్వడం, జీవవైవిధ్య పరిరక్షణ సమస్యలను అందరికీ తెలిపేలా కృషిచేయడం ఈ దశాబ్ధ వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగం.
ఐక్యరాజ్యసమితి రూపొందించిన వ్యూహాత్మక జీవవైవిధ్యం ప్రణాళికలో కేంద్రీకరించిన అంశాలు..
* జీవవైవిధ్య నష్టాల్ని పరిమితం చేయడం.
* జీవవైవిధ్యాన్ని సుస్థిర వినియోగంతో కొనసాగించడం.
* ఇతరజాతులు, వాతావరణమార్పులు, కాలుష్యం, నివాసస్థలాలలో జీవవైవిధ్యాలకు వచ్చే ప్రమాదాల్ని గుర్తించి, ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయడం.
* స్థానిక విజ్ఞానాన్ని, ఆవిష్కరణలను, ఆచారాలను రక్షించడం.
* జన్యువనరుల వినియోగం, సంబంధిత అంశాలలో అందరికీ సమాన భాగస్వామ్యం కల్పించడం.
* అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక వనరులను సమకూర్చడం.
* ఎరువుల వాడకాన్ని, పారే నీటిలో ఇతర జాతులు పెరగడాన్ని నివారిస్తూ, బయటి జంతుజాలాల దాడుల నుండి స్థానిక జీవవైవిధ్యానికి రక్షణ కల్పించడం.
మీకు తెలుసా..?
* 'బయలాజికల్‌ డైవర్శిటీ' పదాన్ని మొదట 'రేమండ్‌ ఎఫ్‌ డాస్‌మాన్‌' 1968లో ఉపయోగించారు. 1985లోనే బయలాజికల్‌ డైవర్శిటీ జంట పదాల్ని 'ఏకపదం' 'బయోడైవర్శిటీ' (జీవవైవిధ్యం) గా 'డబ్ల్యుజి రోజెన్‌' వాడారు.
* అటవీ జంతువులు, వ్యవసాయం, చేపలు, తదితర జీవాలు పర్యావరణలో ముఖ్యభాగంగా గుర్తింపబడ్డాయి. కానీ పర్యావరణ నిర్వచనంలో 'జీవవైవిధ్యాన్ని' చేర్చలేదు.
* పర్యావరణంలో నీరు, గాలి, భూమి, నివాసస్థలం ఇమిడి ఉన్నాయి. కానీ, పర్యావరణ పరిరక్షణలో గాలి, నీరు మీదనే కేంద్రీకరించి కృషి కొనసాగుతుంది.
* జీవవైవిధ్యం, జీవావరణ వ్యవస్థల సేవలను అందించేందుకు అంతర ప్రభుత్వాల ప్రణాళిక ఏప్రిల్‌, 2012లో రూపొందించబడింది. జీవవైవిధ్య, జీవావరణ వ్యవస్థను సుస్థిర యాజమాన్యానికి అవసరమైన ప్రపంచస్థాయి స్పందనను నిర్దేశించే లక్ష్యంతో ఇది రూపొందింది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

జీవవైవిధ్యం..


పర్యావరణం, దీనిలో భాగమైన వాతావరణం మారుతున్నాయి. హరిత వాయువులు, ఉష్ణోగ్రత, కాలుష్యం పెరుగుదల వీటిలో ముఖ్యభాగాలు. ఇవన్నీ సంయుక్తంగా జీవవైవిధ్యంపై దుష్ప్రభావం కలిగి ఉన్నాయి. ఫలితంగా జీవవైవిధ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ విధంగా ఇంతవరకు దాదాపు ఒక శాతం వైవిధ్యాన్ని కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. సుస్థిరాభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఇలా క్షీణిస్తున్న జీవవైవిధ్యం మానవ మనుగడకు కూడా ప్రమాదకరమని నిపుణులు నిర్ధారిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2011-2020 దశాబ్ధాన్ని ఐక్యరాజ్యసమితి 'జీవవైవిధ్య దశకం'గా 2011, ఏప్రిల్‌లో ప్రకటించింది. ఇంతకుముందు (1992లో) జీవవైవిధ్యంపై 'రియో డి జనరో'లో జరిగిన 'అంతర్జాతీయ సమ్మేళనం' నిర్ణయాలను 198 దేశాలు అంగీకరించాయి. ఈ దశకంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తూ సుస్థిరాభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు తీసుకునేలా వివిధ దేశాలను ప్రేరేపించడమే దీని లక్ష్యం. అందువల్ల, వీటిని దృష్టిలో ఉంచుకొని, వాతావరణమార్పులు, జీవవైవిధ్య కొనసాగింపు ప్రాధాన్యతలను, సంబంధించిన అంశాలను క్లుప్తంగా తెలుపుతూ మీముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
జన్యువులు, జాతులు, జీవావరణ వ్యవస్థల మొత్తం మార్పులను సంయుక్తంగా 'జీవవైవిధ్యం'గా భావిస్తారు. మరోవిధంగా చెప్పాలంటే, జీవవ్యవస్థల్లోని అన్నిస్థాయి జీవాల్లో ఉన్న మొత్తం మార్పులను సంయుక్తంగా 'జీవవైవిధ్యం'గా భావిస్తారు.
పర్యావరణ ఆరోగ్యపటిష్టతకు జీవవైవిధ్యం చిహ్నం. ఇది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగానూ, ధృవప్రాంతాల్లో కనీసస్థాయిలో జీవవైవిధ్యం ఉంటుంది. మైనస్‌ (-) ఉష్ణోగ్రత గల ధృవప్రాంతాల్లో కొన్ని జీవాలు మాత్రమే నివసించగలుగుతున్నాయి.
వేగంగా వచ్చే పర్యావరణ మార్పులు పెద్దఎత్తున జీవజాతుల్ని అంతరింప జేస్తున్నాయి. భూగోళం మీద ఉన్న జంతుజాలాల్లో దాదాపు ఒక శాతం ఇలా అంతరించిపోయాయి. భూగోళంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో వైవిధ్యం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనే మానవులు విస్తారంగా ఉంటున్నారు. వీటిని జీవవైవిధ్యం ఉధృతంగా గల ప్రాంతాలు (హాట్స్‌పాట్స్‌) గా గుర్తిస్తున్నారు.
ఇప్పటివరకు మేధావులకే పరిమితమైన ఈ అంశాలు నేటి వాతావరణమార్పులు, ఫలితంగా దెబ్బతింటున్న సుస్థిరత నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దీనిని అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
మానవ ప్రయోజనాలు..
జీవావరణ వ్యవస్థ సేవలను జీవవైవిధ్యం ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వాయు నాణ్యత, వాతావరణం (కార్బన్‌ డై ఆక్సైడు మదింపు), నీటి పరిశుభ్రత, సంపర్కం (వృక్షజాతుల్లో), నేలకోత నివారణలు జీవవైవిధ్యం మీద ఆధారపడి ఉంటాయి.
వ్యవసాయంలో..
పంటల సేద్యం, వాతావరణం, సస్యరక్షణ, ఇతర వడిదుడుకుల్ని తట్టుకోడానికి జీవవైవిధ్యం తోడ్పడుతుంది. సాంప్రదాయ మెట్ట సేద్యంలో ఇది విస్తారంగా ఉపయోగపడేది. కానీ, 'ఏక పంట' సేద్యంతో వడుదుడుకుల భారం ఎన్నోరెట్లు పెరిగింది. దీనివల్ల సేద్యంలో రిస్క్‌ బాగా పెరిగింది. రిస్క్‌ను తట్టుకోడానికి ప్రత్యామ్నాయవ్యవస్థ సరిగ్గా పనిచేయడంలేదు. బిటి సాంకేతికం వైవిధ్యాన్ని తగ్గించి, రిస్క్‌ను ఎన్నోరెట్లు పెంచింది. ఫలితంగా బిటి పత్తి సగటు దిగుబడులు గత ఆరేళ్లుగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక చరిత్రలోకిపోతే, 1970 దశకంలో ఇండోనేషియా నుండి మనదేశానికి 'రైస్‌ గ్రాసి స్టంట్‌ వైరస్‌' వచ్చింది. దీనిని తట్టుకోగల రకం ఒకటి మనదేశంలోనే గుర్తించారు. దీనితో ఈ వైరస్‌ను తట్టుకొనేరకాలు రూపొందించ బడ్డాయి. వరిలో జీవవైవిధ్యం మనదేశంలో విస్తారంగా ఉండటంవల్లనే ఇది సాధ్యమైంది.
ఇదేవిధంగా 1970లో శ్రీలంక, బ్రెజిల్‌, మధ్య అమెరికాలోని కాఫీ తోటలు 'రస్ట్‌ (తుప్పు రోగం)' వచ్చింది. దీన్ని తట్టుకొనేరకం ఇథియోపియాలో గుర్తించబడింది. ఫలితంగా దీన్ని తట్టుకొనేరకం రూపొందించడం వీలైంది. 1846లో ఐర్లాండ్‌లో 'పొటాటో (ఆలుగడ్డ) బ్లైట్‌' వల్ల దాదాపు 10 లక్షల మంది చనిపోయారు. మరో 10 లక్షలమంది ఆ ప్రాంతాన్నే వదిలిపోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో రెండురకాల్నే సేద్యం చేయడం దీనికి ముఖ్యకారణం.
'ఏక పంట' సేద్యం ఎన్నో వ్యవసాయ సంక్షోభాలకి కారణమైంది. దీనివల్లే 19వ శతాబ్ధంలో యూరప్‌లో వైన్‌ పరిశ్రమ పూర్తిగా నాశనమైంది. మనం తినే 80 శాతం ఆహారం కేవలం 20 రకాల మొక్కల నుండి వస్తున్నప్పటికీ వీటిలో దాదాపు 40 వేల జాతులు సేద్యం చేయబడుతున్నాయి. ఈ జాతుల మీద ఆహారానికి, రక్షణకు, దుస్తులకు ఆధారపడుతున్నాం. ఇప్పటికీ భూగోళంలో సజీవంగా ఉన్న జీవవైవిధ్యం ఆహారోత్పత్తిని పెంచడానికి, మన వైవిధ్యభరితమైన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. అయితే, క్షీణిస్తున్న జీవవైవిధ్యం ఈ ఎంపిక అవకాశాలని తగ్గిస్తుంది.
ఆరోగ్యంలో..
మన ఆరోగ్యంలో కూడా జీవవైవిధ్యం కీలకపాత్ర కలిగి ఉంది. అయితే, ఇది వాతావరణమార్పులతో దగ్గర సంబంధాలు కలిగి ఉంది. ముఖ్యంగా అనారోగ్యాల్ని వ్యాప్తిచేసే కీటకాల నియంత్రణలో, నాణ్యమైన తాగునీటి కొరత, సేద్య జీవవైవిధ్యాలను ప్రభావితం చేస్తున్నాయి. జీవవైవిధ్యం తరిగేటప్పుడు మొదట అంతరించేది అంటురోగాలు రాకుండా నిలువరించే బ్యాక్టీరియాలే. బతుకుండేవి జబ్బుల్ని వేగంగా వ్యాప్తిజేసే జీవాలే. అలాగే మన ఆహారపు అలవాట్లు, పోషకభద్రత, సామాజిక, మానసిక ఆరోగ్యాలు కూడా జీవివైవిధ్యం వల్ల ప్రభావితమవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో, ఆ తర్వాత కోలుకోవడంలో జీవవైవిధ్యం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది.
కొత్త మందుల గుర్తింపు తయారీలో జీవవైవిధ్యం ఎంతో తోడ్పడుతుంది. జీవ మూలాల నుంచే ఎక్కువభాగం కొత్త మందులు రూపొందుతున్నాయి. దాదాపు 80 శాతం మేర మందుల అవసరాలు ప్రకృతి సహజంగా ఉండే జీవాలే సమకూరుస్తున్నాయి.

Wednesday 6 June 2012

సమాచార సేకరణకు ఎన్నో వ్యయప్రయాసలు





 
 
 
                    భూమి మీది మబ్బులు 80 కి.మీ కన్నా ఎత్తున ఉండవు కాని కుజుడి మీద ఒత్తిడి తక్కువ కనక 100కి.మీ. ఎత్తున కూడా మేఘాలుంటాయట. ఇవి కార్బన్ డయాక్సయిడ్‌తో నిండి మసకగా కనిపిస్తాయట.
30 ఏళ్ళ క్రితం చంద్రుడిమీద కాలుమోపాక మనుషులు ఏ ఇతర గ్రహాలకూ ప్రయాణించలేదు. వెళితే గిళితే మన పొరుగు గ్రహాలైన శుక్ర, కుజులే మనకు దగ్గర. శుక్రుడి మీది పరిస్థితులు మహా భయంకరమైనవి కనక మిగిలినది సుమారు 23కోట్ల కి.మీ దూరాన ఉన్న కుజుడే. కుజుడి మీద మనుషులు వెళ్ళి పరిశోధనలు చేస్తే ఎంతో విలువైన సమాచారం లభిస్తుందనడంలో సందేహం లేదు. అయితే అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కనక ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. అసలు వెళ్ళిరావడానికే రెండేళ్ళు పడుతుందని అంచనా. పరిశోధనలకై వెచ్చించే సమయం దీనికితోడవుతుంది. భూమితో సంపర్కం లేకుండా నెలల తరబడి రోదసీ నావికుల బృందం కాలం గడపాలి. వారు మానసికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇదికాక రోదసీ యాత్రికుల ఆరోగ్యం పాడయే ప్రమాదం ఉందని మీర్ అంతరిక్ష కేంద్రంలో ఎక్కువకాలం గడిపి వచ్చినవారి మీద జరిపిన పరీక్షలు తెలియజేస్తున్నాయి.
కుజుడి గురుత్వాకర్షణ భూమిలో 38% మటుకే ఉంటుంది కనక భూమి మీద 70కిలోలు తూగే వ్యక్తి బరువు కుజుడిమీద 26.6 కిలోలు మాత్రమే ఉంటుంది. ఎక్కువ కాలం భార రహిత స్థితిలో ఉండడం, బైటినుంచి హానికరమైన వికిరణాల తాకిడి మొదలైనవి ప్రమాదకరంగా అనిపిస్తాయి. ఎముకలూ, కండరాలూ బలహీనమవుతాయి.
            ప్రయాణానికి అతిశక్తివంతమైన రాకెట్లు అవసరవౌతాయి. కుజుడి మీదికి ఇంధనంతోబాటు చాలా సామగ్రి కావలసి వస్తుంది. చంద్రుడి మీదికి వెళ్ళినప్పుడు వాడేసిన పదార్థాలను జారవిడిచినట్టుగా కుజుడిపై ప్రయాణంలో వీలవదు. కావలసిన పరికరాలను అంచెలంచెలుగా అంతరిక్షంలోకి పంపి, అక్కడ వాటన్నిటినీ తగిన పద్ధతిలో కూర్చి అమర్చడం అనేది మీర్ విషయంలో జరిగినంత సులువుగా జరగదు. మనుషులను పంపేముందుగా చంద్రుడి విషయంలోలాగా కుజుడి గురించిన విస్తృతమైన సమాచారం రాబట్టాలి. కుజుడి మీదికి రోదసీ నౌకలను పంపి అక్కడి పదార్థాలను వెనక్కి తెప్పించే ఏర్పాట్లకే ఇంకా పదేళ్ళు పట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో మానవులు గ్రహాంతర యానాలు చేసి కొత్త ప్రదేశాలకు వెళ్ళేందుకు సిద్ధవౌతారు. అందుకు తొలి ప్రయత్నాలు మన జీవిత కాలంలో మొదలవబోతున్నాయి. మరొక పాతిక, ముప్పై సంవత్సరాల్లో కుజగ్రహానికి మనుషులు ప్రయాణించబోతారు.
- కొడవటిగంటి రోహిణీప్రసాద్
rohiniprasadk@gmail.com

పరిమిత వస్తువులతోనే గ్రహాంతర యానం


  • - కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ rohiniprasadk@gmail.com
కుజ గ్రహానికి ప్రయాణం-7
మనం ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఎన్నో రకాలుగా యోచించి, అన్నిటినీ సిద్ధం చేసుకుంటాం. ఎంత దూరానికి ఎంతకాలంపాటు వెళుతున్నామనేదాన్ని బట్టి తీసుకెళ్ళవలసిన దుస్తులూ, వస్తువులూ, సామాన్లూ అన్నిటినీ సర్దుకుంటాం. మన దేశం కాకుండా విదేశానికి ప్రయాణమవటానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే, ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణానికి అవసరమైన వస్తువులు ఎక్కువే అనిపించినప్పటికీ విమానంలో తీసుకెళ్ళగలిగిన బరువు ఒక స్థాయికి మించకూడదనే నిబంధన ఉంటుంది. దూరదేశాల్లో మనకు కావలసిన పచ్చళ్ళూ, ఊరగాయలూ దొరకవేమోనని అనిపించినా ఎక్కువ సామాను ప్రతిబంధకం అవుతుందని కొన్నిటిని వదులుకుంటాం. ఈ సమస్యలన్నీ గ్రహాంతర యానంలో కూడా ఉంటాయి.
కుజగ్రహం మీద తినడానికి ఆవకాయ కాదుగదా, పీల్చడానికి ఆక్సిజన్ కూడా దొరకదు కనక అన్నీ మన వెంట తీసుకెళ్ళవలసిందే. అటువంటి ప్రదేశంలో ఏవి లభించవో ఇక్కడుండగానే ఊహించి, ఆ ప్రకారంగా ప్రయాణ సన్నాహాలు చేసుకోవాలన్నమాట. అలాగని పనికొచ్చేవీ, పనికిరానివీ లెక్కలేనన్ని వస్తువులు మోసుకెళ్ళడమూ వీలుకాని పనే. ఎందుకంటే వీటన్నిటినీ మోస్తూ, భూమి గురుత్వాకర్షణను అధిగమించి భూమిని వీడవలసిన రాకెట్ ఎంతో ఇంధనాన్ని ఖర్చుపెట్టవలసి వస్తుంది. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం.
కుజ గ్రహానికి రాకెట్..
యూరప్ రోదసీ సంస్థతోబాటుగా రష్యా ప్రతిపాదించిన ఒక ప్రయోగంలో కుజగ్రహానికి రెండు రాకెట్లను పంపవచ్చని సూచించారు. ఒకదాంట్లో ఆరుగురు రోదసీనావికులనూ, రెండోదాంట్లో వారి సామగ్రినీ పంపవచ్చని అన్నారు. అమెరికా కూడా రెండో, మూడో రాకెట్లు ప్రయోగించాలనే ప్రతిపాదన చేసింది (పటం). దీన్నిబట్టి ఇటువంటి ప్రయాణంలో ఎన్ని చిక్కులున్నాయో అర్థమవుతుంది. ఏ రాకెట్ అయినా దాని శక్తిలోని అధిక భాగాన్ని భూమ్యాకర్షణ శక్తిని అధిగమించటానికే ఉపయోగిస్తుంది. అందువల్లనే అన్నిటికన్నా పెద్దదిగా కనిపించే రాకెట్ కింది భాగపు గొట్టం ఇంధనాన్ని కలిగినదై, పని పూర్తవగానే విసర్జించబడుతుంది. కుజగ్రహానికి చేరవలసిన భాగం చిన్నదిగా, ముందు భాగంలో అమర్చబడి ఉంటుంది. దాని ఆకార స్వరూపాలూ, నిర్మాణ విశేషాలూ అన్నీ కూడా నిర్వర్తించవలసిన పనులనుబట్టి ఏర్పాటవుతాయి. (చిత్రం) అమెరికా రూపకల్పన చేసిన రాకెట్

ప్రత్యేక దుస్తులు లేకుండా తిరగలేం!


  • - కొడవటిగంటి రోహిణీప్రసాద్ rohiniprasadk@gmail.com
కుజ గ్రహానికి వెళ్ళడం అంత సులువైన పనేమీకాదు గానీ ఒకవేళ మనుషులు అక్కడికి వెళ్ళినట్టయితే ఏం చెయ్యాలనేది శాస్తవ్రేత్తలు చాలా వివరాలతో సహా ఆలోచించి పెట్టుకున్నారు. అక్కడ మనకు పనికొచ్చేవీ, ఇబ్బంది పెట్టేవీ కూడా ఉంటాయి. ఆ విశేషాలు కొన్ని ఆసక్తికరం. అవేమిటో చూద్దాం.
కుజగ్రహం ఉపరితలానికి దిగువన గడ్డకట్టిన నీరు దొరకవచ్చుననేది అక్కడికెళ్ళిన వారికి లాభకరం కావచ్చు. ఈ విషయంలో చంద్ర మండలంకన్నా అది ఎంతో మెరుగైనదే. అలాగే గాలేలేని చంద్రుడిలా కాకుండా కుజుడి మీద పల్చని వాతావరణపు పొర ఒకటి ఉంటుంది. కుజుడు తనచుట్టూ తాను తిరిగేందుకు 24 గంటల 39నిమిషాలు పడుతుంది కనుక రోజుల కాలవ్యవధి దాదాపు మనవంటిదే. భూమి అక్షం వంగిన కోణం 23 డిగ్రీల 44’ కాగా కుజుడిది 25 డిగ్రీల 19’ కనక రుతువులన్నీ దాదాపు మనలాంటివే. భూమిలో పదోవంతు ద్రవ్యరాశిగల కుజుడి మీది మొత్తం పొడినేల భూమితో పోల్చదగినదే. మనవంటి ప్రాణులకు సహాయపడగలిగిన రసాయనాలు అక్కడి నేలలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ మనకు తోడ్పడే అంశాలు.
మనకు ఇబ్బంది కలిగించగల విషయాల్లో అక్కడి గురుత్వాకర్షణ తక్కువ కావడం ఒకటి. అది భూమితో పోలిస్తే 38% మాత్రమే కనక యాత్రికులు బరువుకోల్పోతే వచ్చే కష్టనష్టాలను అంచనావేసుకోవాలి. అక్కడి చలి విపరీతం. అది -63 నుంచి -140 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుందట. అక్కడ సరస్సులవంటి నీటివనరులేవీ ఉండవు. సూర్యుడి చుట్టూ కుజుడు తిరిగే కక్ష్య మనకన్నా దీర్ఘవృత్తం కనక దూరమైనప్పుడు చలి బాగా పెరుగుతుంది. అక్కడి వాతావరణపు ఒత్తిడి 66 మిల్లీ బార్లు మాత్రమే (మనకు 1 బార్). అందుచేత ప్రత్యేకమైన దుస్తులు లేకుండా తిరగడం సాధ్యంకాదు. అక్కడి గృహాలన్నిటిలోనూ కృత్రిమ పద్ధతుల్లో గాలి ఒత్తిడిని పెంచక తప్పదు. అక్కడ మనకన్నా 15రెట్లు ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్, కొంత కార్బన్ మోనాక్సైడ్ కూడా ఉంటాయి కనక అది పీల్చదగిన గాలి కాదు. వాతావరణపు పొర నిరోధించదు కనక భూమితో పోలిస్తే అక్కడి రేడియేషన్ ప్రభావం కూడా రెండున్నర రెట్లు ఎక్కువే. వీటన్నిటికీ ఉపాయాలు అవసరమవుతాయి. ఏది ఏమైనా మొత్తంమీద సౌర వ్యవస్థలోకల్లా భూమి తరవాత కుజుడి లాగా నివాసయోగ్యమైన ప్రదేశం మరొకటి లేదు. బుధ, శుక్ర గ్రహాలమీది ఉష్ణోగ్రత అతి భయంకరమైనది. గురువు, శని, యురేనస్, నెప్‌ట్యూన్ గ్రహాలన్నీ వాయువుల ముద్దలే కనక మనుషులు దిగగలిగిన నేల ఏమీ ఉండదు. (చిత్రం) కుజగ్రహం పైనా, భూగర్భంలోనూ నివాసాల ఊహాచిత్రం