Friday 27 April 2012

విజయాలకు పొంగిపోవద్దు...అపజయాలకు కుంగిపోవద్దు


ప్రస్తుతమున్న పబ్లిసిటీ ప్రభంజనం, కార్పొరేట్‌ కాలేజీల వ్యాపార దృక్పథం, పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారినే 'విజేతలు'గా సృష్టిస్తున్నాయి, ఆకాశానికెత్తేస్తున్నాయి. ర్యాంకు సాధించడం ఒక విజయం మాత్రమే. అదే అంతిమ విజయం కాదు. విజేతలకు ఉత్సాహం, ఆనందం, భవిష్యత్‌ పట్ల ఆశావహ దృక్పథం ఏర్పడుతాయి. అదే సమయంలో విజయాలకు పొంగిపోవద్దు... అపజయాలకు కుంగిపోవడం క్షేమం కాదు. విజేతలకు ఆత్మనిగ్రహం లేకపోతే వారి కెరీర్‌కి వచ్చే ఇబ్బంది లేకపోయినా, వ్యక్తిత్వానికి నష్టం కలగవచ్చు. ఆ నష్టం వెంటనే జరగకపోయినా, భవిష్యత్‌లో జరగొచ్చు.
ఉన్నతమైన కెరీర్‌ను ఊహించుకోవడంలో తప్పు లేదు. కానీ దానికంటే ముందు ఉన్నతమైన వ్యక్తిత్వం అవసరం దాన్ని పెంపు చేసుకోవాలి. ఇది ఉంటే అన్నీ ఉన్నట్టే. కెరీర్‌ని, క్యారక్టర్‌తో మిళితం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ, అందుకోసం ఈ టెక్నిక్స్‌ని ఫాలోకండి.
1. ఒదిగి ఉండడం : మనసులో పుట్టే ఆలోచన మనిషిని మలుస్తుంది. మంచీ, చెడులు మన మనసులోనే పుడతాయి. 'ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలి' అనే ఆలోచనా బీజం మీ మనసులో ఉండి ఆ ఆలోచన మీ మనసులో కదలాడినంతకాలం, మీలో అహంకారం పెరగదు.
2. కలసిపోండి : 'వాడికి ర్యాంకు వచ్చాక, కళ్లు నెత్తికెక్కాయి' అనే మాటను కొందరిని ఉద్దేశించి అనడం మనం వినే ఉంటాం. కెరీర్‌కి సంబంధించిన మార్పు మన క్యారక్టర్‌ విషయంలోనూ మార్పు తీసుకురావడం బాధపడాల్సిన విషయమే తప్ప సంతోషపడాల్సిన విషయం కాదు. ముఖ్యంగా అలాంటి మార్పు మనకు బంధుమిత్రులను దూరం చేయకూడదు.అందుకే ర్యాంకు వచ్చాక 'ఇక తిరుగులేదు' అనే భావన రానీయకుండా, బంధుమిత్రులతో ఎప్పటిలాగే మాట్లాడండి.ఒక విధంగా మీరే మరింత విశాల హృదయంతో అందరినీ కలుపుకుపోతూ, భేషజాలు లేకుండా ప్రవర్తించండి.
3. విలువలు గురించి ఆలోచించండి : అభద్రతా భావం నుండి భద్రతా భావం వైపు పయనించే వేళ కొన్ని విలువల పట్ల మరింత నిబద్ధత కలిగి ఉండడం చాలా అవసరం. అది యువతకు ఉండే సహజ సిద్ధమైన ఆకర్షణలు కావచ్చు లేదా సామాజిక అంశాల విషయం కావచ్చు. మీరు బలహీనతలకు, వ్యామోహాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోండి. 'విజయం ఒక మత్తు' అంటారు అనుభవజ్ఞులు. ఆ మత్తులో మనం తప్పు చేయాలనుకోవడం సహజమే. దానికి వయసు కూడా ఎంకరేజ్‌ చేస్తుంది. కాని ఎలాంటి బలహీనతలూ, వ్యామోహాలు దరిచేరకుండా తనను తాను కాపాడుకున్న వారు మాత్రమే చివరి వరకూ విజేతగా నిలబడుతారు. నిజం చెప్పాలంటే అదే అతి గొప్ప విజయం.
4. భవిష్యత్‌ను దర్శించండ్ణి ఒక విజయం కనుల ముందు మెరుపులు మెరిపిస్తుంది. ఆ మెరుపులనే చూస్తుంటే, పయనించాల్సిన మార్గాన్ని దర్శించలేం. మెరుపులనే చూస్తూ కాలం గడిపేశాక మనం సరైన మార్గంలో పయనించడం లేదనే అభిప్రాయం కలిగి అసంతృప్తి కూడా కలిగే అవకాశముంది. అందుకే మెరుపుల వెలుగులోనే మీ భవిష్యత్‌ను దర్శించండి. ఎవరికైతే తన మార్గం పట్ల స్పష్టత ఉంటుందో వారే అంతిమంగా విజయం సాధించగలుగుతారు.
మీరు ర్యాంకు సాధించి ఉంటే అదే అంతిమ 'విజయం' అన్న భ్రమలోపడి, ఆకాశంలో విహరించకండి. 'నంబర్‌వన్‌' ర్యాంకులు సాధించి కెరీర్‌పరంగా ముందుకు వెళ్తూ, ఆగిపోయి అయోమయంలో పడి, అసంతృప్తితో బతుకుతూ జీవితంలో పరాజితులుగా మారిన అనేకులు మన చుట్టూనే ఉన్నారు.
కాబట్టి విజయం తాలూకూ మత్తు వదిలి, వాస్తవంలో జీవించండి. ఇక ఈ పోటీ పరీక్షల్లో పరాజయం పొందినవారు తమ మానసిక ధోరణిని ఇలా మలచుకుంటే తప్పక ప్రయోజనం పొందగలుగుతారు.
1.అపజయం, విజయానికి తొలిమెట్ట్ణు విజయం అందనంత మాత్రాన 'అది మనకు అందనంత దూరంలో ఉంది' అని నిర్ణయించేసుకోకండి. 'అపజయం, విజయానికి పునాది'గా భావించి, రెట్టించిన ఉత్సాహంతో కష్టపడాలని అనుకోండి.
2. ముడుచుకుపోకండి 'అపజయం' అనేది క్షమించరాని నేరం అన్నట్టు ముడుచుకుపోవడం, అందరికీ దూరంగా ఉండడం, బంధుమిత్రుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం, చేయకండి. అపజయమనేది సాధారణమైన విషయం. అది నేరం కాదు. దానిని భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కాబట్టి అపరాధ భావనతో ముడుచుకుపోకండి. దాని వల్ల మీరు ఒంటరితనంగా ఫీలవుతూ తద్వారా అభద్రతా భావం, నిరుత్సాహం, కొని తెచ్చుకుని ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదముంది.
3.ఆత్మవిశ్వాసం పెంచుకోండి 'పరాజయం' నుండి బయటపడాలంటే, ఆత్మవిశ్వాసం అవసరం. మీలో ఆత్మవిశ్వాసం పెంచే వ్యక్తులను గుర్తించి వారితోనే ఎక్కువ సమయం గడపండి. ఆత్మవిశ్వాసం పెరగడం కోసం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం కోసం అది ఉపయోగపడుతుంది.
4. సమీక్ష అవసరం 'అపజయానికి అనేక కారణాలుంటాయి' అంటారు పెద్దలు. మీ అపజయానికి కారణమేంటో తెలుసుకోకపోతే మీరు ఎప్పటికీ విజయానికి ఆమడదూరంలోనే ఉంటారు. సరైన ప్లానింగ్‌ లేకపోవడం, సరిగా కష్టపడకపోవడం, మీ శక్తిసామర్థ్యాలు సరిపోకపోవడం మీ అపజయానికి కారణాలేమో గుర్తించండి. అలా ఆ తప్పును సరిదిద్దుకోండి.
ఒక నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్టే, ఒక ఫలితం విజేతలను, పరాజితులను సృష్టిస్తుంది. విజయం పొందినవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పరాజయం పొందినవారూ పోరాటానికి సిద్ధపడుతూ మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Wednesday 25 April 2012

ముఖద్వారం అటే ఉండాలా..?

కాంతారావు తాతా! వాస్తు విషయంలో నాకో సందేహం వచ్చింది తీరుస్తావా?' ఏదో పుస్తకం చదువుకుంటున్న నా దగ్గరకు వచ్చి ప్రశ్నించింది రమ్య.
'అడుగమ్మా!' అన్నాను నేను.
'ఇంటి ముఖద్వారం తూర్పు లేక ఉత్తరం వైపే చూస్తుండాలట గదా?'
'ఎవరు చెప్పారమ్మా?'
'తాళపత్రం' అనే గ్రంథంలో ఉంది తాతయ్య!'
'ఓహో! ఆ పుస్తకాన్ని నీవూ చదివావా? అయితే, దీనికి సమాధానం నీవే చెప్పగలవు. కానీ, అలా ఉంచడానికి ఆ గ్రంథంలో కారణాలేం చెప్పారమ్మా?'
'వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్‌పొర ఇంకా క్షీణించే అవకాశం ఉన్నందున, అతినీలలోహిత కిరణాలు (ఆల్ట్రావయిలెట్‌ రేస్‌) సూటిగా భూమిని తాకడం వల్ల మానవులకు హాని కలుగుతుందనీ, అదే మన ఇంటిద్వారం ఉత్తరంవైపుకు ఉన్నట్లయితే ఇంట్లోకి అతినీలలోహిత కిరణాలు ప్రవేశించే బెడదుండదట. చక్కగా అరుగులపై కూర్చొని బంధు మిత్రులతో ముచ్చటించుకోవచ్చట తాతయ్యా!'
'సరేనమ్మా! నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాస్తుశాస్త్రం గ్రంథాలు అని చెప్పబడేవి ఎప్పటివి?'
'సరిగ్గా తెలియదు తాతయ్యా. కానీ కొన్ని వందలేళ్ల కిందట రాసినవి అనుకుంటున్నాను.'
'కరెక్టేనమ్మా!' మయమతం, మానసారం, విశ్వకర్మ ప్రకా శికలాంటి ప్రాచీన వాస్తుగ్రంథాలు క్రీ.శ.10వ శతాబ్దం ప్రాంతంలో రాయబడ్డాయి. ఇక ఓజోన్‌పొరను గూర్చి, అతినీలలోహిత కిరణాలను గూర్చి ఎప్పటినుండి తెలుసు?'
'క్రీ.శ. 1865లో జాక్విస్‌ లూయిస్‌ సోగెట్‌ అనే శాస్త్రజ్ఞుడు ఓజోన్‌పొరను కనుగొన్నాడు. అప్పటి నుండి ప్రపంచానికి తెలుసు.'
మరి వెయ్యేళ్ళనాటి వాస్తువాదులు ఆ తరువాత ఎంతోకాలానికి గుర్తించిన (150 ఏళ్ల క్రితమే) ఓజోన్‌ను తెలుసుకొని ముఖద్వారం ఉత్తరదిశలో ఉండాలని రాశారంటే అంగీకరిస్తావా?'
'అంగీకరించను తాతయ్యా'.
ఇక ఉత్తరద్వారం ద్వారా రాలేని అతినీలలోహిత కిరణాలు దక్షిణద్వారం ద్వారా అయితే వస్తాయని అంటే అంగీకరిస్తావా?'
'అంగీకరించను తాతయ్యా!'
'ఇక తూర్పు ద్వారమే ఉండాలనేందుకు కారణం ఆ పుస్తకంలో ఏం రాశారమ్మా?'
'ఇంటి ముఖం తూర్పుదిశగా ఉన్నట్లయితే అరుగుమీద కూర్చోవడం వల్ల ఉదయపు సూర్యకిరణాలు విటమిన్‌ శాతాన్ని పుష్కలంగా కలిగి ఉన్నాయి కాబట్టి మన శరీరాలపై ప్రసరించి, శుభాన్ని కలిగిస్తాయట!'
'ఉత్తరంవైపు నుంచి వచ్చే సూర్యకిరణాలలోని అతినీల లోహిత కిరణాలు మానవులకు హాని చేస్తాయని చెబుతూ, ఉదయపు సూర్యకిరణాలు, అంటే తూర్పువైపు నుంచి వచ్చేవి మన శరీరాలకు మంచివని చెప్పడం అసంబద్ధం కాదా?' 'అవును. తాతయ్యా!'
'తూర్పు నుంచి వచ్చే ఉదయకిరణాలలో విటమిన్ల శాతం ఎక్కువ ఉంటే, పడమటి కిరణాలలో విటమిన్లు పుష్కలంగా ఉండవా?'
'ఎందుకుండవు?'
'మరి పడమర వాకిలి ముఖద్వారంగా ఇళ్లు కట్టుకోకూడదనీ, దీనికి విటమిన్లను కారణంగా చూపెడుతూ తూర్పువాకిలి ఇళ్ళే కట్టుకోమని చెప్పడం అసంబద్ధం కాదా?'
'అసంబద్ధమే తాతయ్యా'
'ఇప్పుడు నీవేమి అర్థంచేసుకున్నావమ్మా..?'
'తూర్పు లేక ఉత్తరం ముఖద్వారాల ఇళ్ళ విషయంలో వాస్తువాదులమని చెప్పుకొనేవారు అతినీలలోహిత కిరణాలు, ఓజోన్‌పొర, విటమిన్లులాంటి సైన్సు పదాలు వాడి కొన్ని అశాస్త్రీయ, అసంబద్ధ విషయాలను ప్రచారం చేస్తున్నారు. గాలి, ఎండ చక్కగా ప్రసరించేట్లుగా ఇళ్ళు కట్టుకుంటే చాలు. ఏ వైపు ముఖద్వారం ఉన్నా ఒకటే.
'అవునమ్మా! నీ సందేహాలకు సమాధానాలు నీవే తెలుసుకున్నావు సంతోషం'' అన్నాను నేను.

కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

గ్రహాలు.. అవగాహన..


  • ఎందుకని? ఇందుకని!
గతవారం సూర్యకుటుం బంలో సూర్యుడితో పాటే భూమి కూడా ఏర్పడిందనీ, తొలిరోజుల్లో అది కూడా స్వయంప్రకాశకమనీ తెలుసుకు న్నాం. మధ్యలో సూర్యుడు, దానిచుట్టూ గ్రహాలు, గ్రహాలచుట్టూ ఉపగ్రహాలు రావడం గురుత్వ బలాల (gravitational forces) ప్రభావమే! ఆధునిక భౌతికశాస్త్ర పరిజ్ఞానం రానంతవరకూ ప్రపంచంలో పురాణగ్రంథాలు, బైబిల్‌ తదితర విశ్వాసాల్లో భూమే కేంద్రం. ఈ సిద్ధాంతాన్నే భూ కేంద్రక సిద్ధాం తం (Geocentric Theory)అనేవారు. భూ కేంద్రక సిద్ధాం తానికి కొద్దోగొప్పో శాస్త్రీయ పదజాలాన్ని ఉటంకించిన వారిలో టోలెమీ ((Ptolemy- క్రీ.శ.90-168) సుప్రసిద్ధుడు. ఆయన ప్రకారం మధ్యలో భూమి ఉండగా దానిచుట్టూ చంద్రుడు (Moon), బుధుడు (Mercury), శుక్రుడు (Venus), సూర్యుడు(Sun), కుజుడు (Mars), గురుడు (Jupiter)), శని (Saturn) గ్రహాలు తిరుగుతాయి. శనిగ్రహం కన్నా ఆవల ఉన్నది స్వర్గం, స్వర్గంపైన ఉన్నది దైవపేటిక. అది మొత్తం ఈ భూకేంద్రక వ్యవస్థను తిప్పుతుంది.
'టోలెమీ నమూనా'లో ఆధునిక విజ్ఞానం ప్రకారం ఎన్నో అవక తవకలున్నా 2వ శతాబ్దంలోనే కొన్ని గ్రహాలను గుర్తించగలగడం, ఏ పరికరాలు లేకున్నా కొన్ని ఆవిష్కరణలు ఆవిష్కరించడం ఆనాటి శాస్త్రజ్ఞుల విజ్ఞతకు చిహ్నం. అయితే ఆ నమూనానే పట్టుకొని వేలా డడం జ్యోతిశ్శాస్త్రం (Astrology)చేస్తున్న మూఢత్వ ప్రచారం. టోలెమీ వంటి ఎందరోచేసిన పాక్షిక సత్యమైన నమూనాను వ్యతి రేకిస్తూ సాధనలేమీ వాడకుండానే హైపేషియా (క్రీ.శ. 370-415) అనే గ్రీకు గణితశాస్త్రజ్ఞురాలు సమీకరణాల ద్వారానే ఇతర గ్రహాలకు భూమి కేంద్రం కాలేదని ఋజువు చేసింది. సూర్యుడే కేంద్రంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువని ప్రతిపాదించింది. ఆమె ప్రతిపాదించిన సూర్యుకేంద్రక సిద్ధాంతం (Heliocentrie Theory) నచ్చని పురుష దురహం కారానికి అండగా భూకేంద్రక సిద్ధాంతానికి వంతపాడే రాచరిక వ్యవస్థ తోడవడంతో ఆమెను పరమ కిరాతకమైన రీతిలో (బహిరం గంగా వివస్త్రను చేసి, ఆల్చిప్పలతో శరీరాన్ని ముక్కలు చేసి) చంపారు నాటి ఛాందసులు. ఇదే వాదనను తన భౌతికవాద దృక్ప థంలో అంతర్భాగంగా ప్రవచించిన బ్రూనో (1548 -1600) ను సజీవదహనం చేశారు. ఆయన రోమ్‌చక్రవర్తితో 'మరణిస్తున్న నాకు.భయం లేదు. నా వాదన మీ పునాదుల్ని కదిలి స్తున్నందున నాకు మరణశాసనాన్ని విధించిన మీకే ఎక్కువ భయం పట్టుకుంది. అబద్ధాల కోసం పిరికి బతుకుకన్నా నిజం కోసం మరణమే నాకు పరమార్థం' అన్నాడు. సత్యాన్వేషణకు, శాస్త్రీయ దృక్పథ ప్రచారానికి, సమసమాజ స్థాపనకు కంకణబద్ధులైన దేశభక్తులకు, సామాజిక సేవాతత్పరులకు బ్రూనో చేసిన ఈ వ్యాఖ్యాలు సదా స్ఫూర్తి దాయకం. 16, 17వ శతాబ్ద కాలంలో గెలీలియో (Galelio, 1564- 1642) తాను రూపొం దించిన టెలిస్కోపు (దూరదర్శిని) సాయంతో అంతకుమునుపు హైపేషియా, బ్రూనో, కోపర్నికస్‌ (Copernicus, క్రీ.శ. 1473- 1543) తదితర శాస్త్రవేత్తలు ప్రతి పాదించిన సౌరకేంద్రక సిద్ధాం తానికి ప్రాయోగిక సాక్ష్యాధారాలతో, సంపూ ర్ణమైన నిర్వివాదమైన రీతిలో సశాస్త్రీ యతను కల్పించాడు. ఆయన సమ కాలీనుడు(contemporary జోహన్సెన్‌ కెప్లర్‌, (Kepler, క్రీ.శ. 1571-1630) తన పేరుతో నేటికీ సుప్రసిద్ధమైన గ్రహగతి సిద్ధాంతాలను (Theory of Planetary Motions) ప్రతిపా దించాడు. గెలీలియో, బ్రూనో, కెప్లర్‌, హైపేషియా, కోపర్నికస్‌ వాదనల బలంతో స్ఫూర్తి పొందిన ఐజాక్‌ న్యూటన్‌ (1642 -1727) తన గణిత మేధోతనంతోను, అద్భుతమైన ప్రాయోగిక ప్రావీణ్యతతోను, పరికరాల సాయంతోను గ్రహాల మధ్య ఉన్న పర స్పర గమనస్థితులకు ఆధారాలను ఇస్తూ గురుత్వ సిద్ధాంతాన్ని(Theory of Gravitation) ప్రతిపాదించాడు. పదార్థాల గమనాలకు సంబంధించిన 3 ప్రాథమిక సూత్రాలను (Newton’s Three Laws of Motion) రూపొందించాడు. అందుకే 2వ సహస్రాబ్దపు అత్యంత మేధోపరమైన శాస్త్రవేత్త లెవరన్న BBCసర్వేలో ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ తర్వాత న్యూటన్‌ పేరు ఉండడం గమ నార్హం. భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగానే నడు స్తున్న జ్యోతిశ్శాస్త్రాన్ని, పంచాంగాన్ని, తిధి జన్మనక్షత్రం - రాహూ కాలం-వర్జ్యం వంటి నిరాధార పద్ధతుల్ని, అబ్బాయి, అమ్మాయిల జాతకాలు కుదర్లేదని పెళ్లి ప్రతిపాదనలు రద్దుకావడాలను, మహిళ లను కించపరచే విధంగా నేడు కొందరు రాస్తున్న దౌర్భాగ్యపు సాహిత్యాన్ని సాధారణ నిరక్షరాస్యులకన్నా మరింత అజ్ఞానంతో నమ్ము తున్న, ఆచరిస్తున్న మధ్యతరగతి చదువరులెక్కువ అవుతుండడం ఆందోళన కల్గించే విషయం. ఎవరేమనుకున్నా, ఎవరికి ఇష్టం లేకున్నా గెలీలియో తనను బందీని చేసి, హింసి స్తున్న పాలక ప్రభువుల్ని ఉద్దేశించి.. ''మీ బుర్రల్లో, మీ సాహి త్యంలో, మీ కార్యకలాపాలలో భూమి చుట్టూ సూర్యుడు తిరుగు తున్నా అక్కడ ఆకాశంలో సూర్యుడి చుట్టూనే భూమి తిరుగు తోంది.'' అన్నట్లు ఎవరేమనుకున్నా సూర్యచంద్రులు, రాహు కేతవులు గ్రహాలు కావు. భూమి కేంద్రం కాదు.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

సునామీలు.. భూకంపలు..


ఈ నెల 11న చేసిన సునామీ హెచ్చరిక మనదేశంలోని ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో, అండమాన్‌-నికోబార్‌ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంతో ఆందోళన రేకెత్తించింది. అదేరోజు ఇండోనేషియాలోని 'ఆసిV్‌ా' ప్రాంతంలో స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 3.38 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 8.6 తీవ్రతతో వచ్చిన భూకంపం ఈ హెచ్చరికకు కారణం. డిసెంబర్‌ 26, 2004లో 9.1 రిక్టర్‌ స్కేల్‌ తీవ్రతతో భూకంపం వచ్చింది. ఫలితంగా వచ్చిన సునామీ వల్ల మానవ చరిత్రలోనే అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగాయి. దీనివల్ల దాదాపు 2.30 లక్షల మంది చనిపోయారు. వీరిలో 75 శాతం మంది ఇండోనేషియా వారే. మన దేశంలో 10 వేలకు పైగా మరణించారు. ఈ నేపథ్యంలో, ఈ నెల చేసిన సునామీ హెచ్చరిక అందర్నీ ఆందోళనకు గురిచేసింది. అయితే, హెచ్చరించినట్లుగా సునామీ రాలేదు. నష్టమూ జరగలేదు. హెచ్చరికను ఉపసంహరించిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో, సునామీ రావడానికీ, భూకంపానికీ మధ్య ఇమిడి వున్న విజ్ఞానాన్ని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక' .
హిందూ మహాసముద్రంలో ఈ నెల 11న వచ్చిన భూకంపం 'భారత-ఆస్ట్రేలియా టెక్టానిక్‌ పళ్లెం' అంతర్భాగంగా రిక్టర్‌ స్కేల్‌పై 8.6 తీవ్రతతో వచ్చింది. దీని కేంద్రం ఇండోనేషియాలో 'బందా ఆసెV్‌ా' పట్టణానికి నైరుతి దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో 23 కిలోమీటర్ల లోతులో సముద్రగర్భంలో ఉంది. ఈ భూకంపం సుమారు 3 నిమిషాలు కొనసాగింది. దీని ప్రకంపనలు హిందూ మహాసముద్రం ద్వారా వ్యాప్తిచెంది ఎంతో దూరంలో ఉన్న మలేసియా, మాల్దీవులు, ఇండియా వంటి దేశాలకూ విస్తరించాయి. ఫలితంగా, సునామీ హెచ్చరికలు 25 దేశాల్లో (హిందూ మహాసముద్రం చుట్టూ వ్యాపించి ఉన్న దేశాలు) ఇవ్వబడ్డాయి. ఇండోనేషియా, థాయిలాండ్‌లలో భయంతో ఎంతోమంది తమ ఇళ్లను వదిలిపెట్టి బయటికి వెళ్లారు.
భారతదేశంలో తూర్పుతీర ప్రాంతాలైన చెన్నయి, కొచ్చి, భువనేశ్వర్‌, కొల్‌కతాల్లో ఈ ప్రకంపనలు కనిపించాయి. కొల్‌కతాలో మెట్రోరైల్‌ సర్వీసుల్ని నిలిపివేశారు. ఎత్తయిన భవనాల నుండి ప్రజల్ని ఖాళీ చేయించారు. దీని తర్వాత 111 చిన్న భూకంపాలు వచ్చాయి. ఇవి రిక్టర్‌స్కేల్‌పై 4 నుండి 6.2 తీవ్రతతో నమోదయ్యాయి. దీనివల్ల చిన్నపాటి సునామీ నికోబార్‌ దీవుల్లో వచ్చింది. ఫలితంగా, తీరప్రాంతంలో 50 సెం.మీ. ఎత్తులో సముద్రపు అలలు లేచాయి. ఇండోనేషియాలో ఈ అలలు 80 సెం.మీ. వరకూ లేచాయి. మొత్తంమీద, భయపడినంత నష్టం మాత్రం ఎక్కడా కలగలేదు. పెద్దగా సునామీ అలలు ఏర్పడకపోవడానికి, నష్టం కలగకపోవడానికి కారణం వచ్చిన భూకంపం 'ఇండో-ఆస్ట్రేలియన్‌ టెక్టానిక్‌ పళ్లెం'లో అంతర్భాగంగా వచ్చిందని, ఆ తర్వాత ఇది 'జారి-ఎదుర్కొనే (స్లిప్‌-స్ట్రైక్‌)' రకంగా మారిందని అమెరికన్‌ భూగర్భ పరిశోధనా సంస్థ తెలిపింది. ఇలా మారడం చాలా అరుదైన సంఘటనగా ఈ సంస్థ తెలిపింది. దీనివల్ల భూకంప తీవ్రత అధికంగా ఉన్నా, పెద్దఎత్తున సముద్రపునీరు స్థానభ్రంశం చెందలేదు. దీంతో ఇది పెద్ద సునామీగా ఏర్పడడానికి దారితీయలేదని ఈ సంస్థ పేర్కొంది. అయితే, 2006 నుండి ఇదే ప్రాంతంలో ఇటువంటి భూకంపాలు మూడుసార్లు వచ్చాయి. ఇది కూడా అంత నష్టం కలిగించలేదు. 2004 సునామీ అనుభవాలను గమనంలో ఉంచుకుంటే, సముద్రగర్భంలో కలిగే భూకంపనలన్నీ భారీ సునామీ ఏర్పడడానికి దారితీయవని ఇప్పటి భూకంపం నిర్ద్వందంగా తెలుపుతోంది.
భూకంపాలు.. రకాలు..
ప్రపంచం మొత్తం దాదాపు 12 టెక్టానిక్‌ పళ్లాలతో నిర్మితమైంది. ఈ టెక్టానిక్‌ పళ్లాలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండకుండా కదులుతూ ఉంటాయి. ఈ పళ్లా లు ఎల్లప్పుడూ ఒకవిధమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాయి. ఈ ఒత్తిడి ఫలితంగా టెక్టానిక్‌ పళ్లాలు ఎప్పుడూ కదుల్తూ ఉంటాయి. ఈ కదలికలన్నీ ఒకే దిశలో ఉండవు. ఎదురెదురుగా కొనసాగవచ్చు. లేక అంతర్భాగంలో కూడా ఏర్పడి కొనసాగవచ్చు. ఆ సమయంలో అధికంగా ఉన్న శక్తి ప్రకంపనలను కలిగిస్తూ వెలికి వస్తుంది.
టెక్టానిక్‌ పళ్లాల చివరి భాగాలు ఒకదానికొకటి ఒరుసుకోవడం (రాసుకోవడం) వల్ల సునామీ కలిగించగల భూకంపాలు ఏర్పడతాయి. ఎక్కడైతే ఈ పళ్లాల అంచులు రాసుకుంటాయో ఆ ప్రాంతంలో నీరు స్థానభ్రంశం చెందుతుంది. దీనివల్ల సునామీ ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు ఈ ప్రక్రియ తరచుగా జరుగుతుంది. ఈ రకం భూకంపాల వల్ల భారీ నష్టం జరుగుతుంది.
టెక్టానిక్‌ పళ్లాల అంతర్భాగంలో బలహీన ప్రాంతాలూ (ఫాల్ట్‌లైన్స్‌) ఉంటాయి. ఈ బలహీన ప్రాంతాల్లో కలిగే భూకంపం అధికపీడన ప్రాంతం వద్ద టెక్టానిక్‌పళ్లెంలో అంతర్గత భూకంపం మొదలవుతుంది. ఇది ఎప్పుడో ఒక్కసారి జరుగుతుంది. దీనివల్ల పెద్దగా నష్టం జరగదు.
అయితే 2001లో గుజరాత్‌లో ఇలాంటి భూకంపం వచ్చింది. దీని కేంద్రం కచ్‌ జిల్లాలోని భుజ్‌ ప్రాంతంలో ఉంది. ఈ భూకంపం వల్ల ఇక్కడ అపారనష్టం కలిగింది. దీనికి కారణం ఈ ప్రాంతపు కట్టడాల నిర్మాణం భూకంపనాన్ని తట్టుకునే విధంగా లేదని నిపుణులు నిర్ధారించారు. ఈ సమయంలో గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలోని 'భుజ్‌' గ్రామం పూర్తిగా ధ్వంసమైంది.
సునామీలు ఎలా ఏర్పడతాయి?
భూకంపాలు కలిగినప్పుడు, అగ్ని పర్వతాలు పేలినప్పుడు లేదా సముద్ర / సరస్సు గర్భంలో పేలుడు సంభవించినప్పుడు లేక పెద్ద పరిమాణంలో భూమి దొర్లి నప్పుడు (లాండ్‌ స్లిప్‌)-వీటి సమీపంలో ఉన్న నీరు పెద్దపరిమాణంలో స్థానభ్రంశం కలుగుతుంది. పెద్దఅలల రూపంలో ఈ నీరు ఎగిసిపడుతుంది. ఇలా వచ్చిన అలలు అదేచోట ఉండకుండా చుట్టూ ఉన్న నీటిలో ప్రకంపనలు సృష్టిస్తాయి. ఇలా సృష్టిం చిన అలలు తీరప్రాంతానికి వస్తాయి. తీరప్రాంతంలో మామూలు అలల్లా కాకుండా సునామీ అలల తరంగదైర్ఘ్యం చాలా పెద్దగా ఉంటుంది. సుమారు కొన్ని వందలమైళ్ల వరకూ విస్తరిస్తుంది. ఇలాంటి అల తీరాన్ని తాకగానే కొన్ని పదుల మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలోని భూమి తీవ్ర ఒత్తిడికి గురవుతుంది.
రిక్టర్‌ స్కేల్‌..
ఇది భూకంప శక్తిని కొలిచే సూచిక. ఇది ఒక లాగ్‌స్కేల్‌ (బేస్‌ 10). భూకంప శక్తి 4.0, 5.0 లను పోలిస్తే 5.0వ రకం భూకంపం 4.0వ రకం కన్నా 31.6 రెట్లు అధికశక్తిని కలిగి ఉంటుంది. 4.9 వరకూ శక్తిగల భూకంపాలు నష్టపర్చవు. అయితే, ఈ రకం భూకంపాలు కొంతమేర ప్రకంపనాల్ని సృష్టిస్తాయి. వీటిని గుర్తించవచ్చు. ఇవి తరచుగా వస్తుంటాయి. 5.0, ఆపైన ఉండే భూకంపాలే నష్టాన్ని కలిగిస్తాయి. 5.0-5.9వ రకం ఒక మోస్తరు శక్తి కల భూకంపాలు. ఈ కంపనాలు నిర్మాణం సరిగాలేని ఇళ్లకు నష్టం కలిగిస్తాయి. పటిష్టంగా నిర్మించిన ఇళ్లకు వీటితో అంత నష్టం కలగదు. 6.0-6.9 శక్తిగల భూకంపాల్ని శక్తివంతమైన భూకంపాలు అంటారు. ఈ భూకంపాలు 165 కిలోమీటర్ల వరకూ నష్టాన్ని కలిగించవచ్చు. 7.0-7.9 భూకంపాల్ని ప్రధానమైవిగా పేర్కొంటారు. 8.0-8.9 శక్తి గల భూకంపాలు కొన్ని వందల కిలోమీటర్ల వరకూ నష్టం కలిగించవచ్చు. వీటిని పెద్ద భూకంపాలు అంటారు. ఇవి సంవత్సరానికి ఒకటి లేక రెండు రావచ్చు. 9.0-9.9 శక్తి గల భూకంపాలు - ఇవి వేల కిలోమీటర్ల ప్రాంతంలో నష్టాన్ని కలిగిస్తాయి. సాధారణంగా పదేళ్లకోసారి వస్తాయి. 10.0-10.9 ఆపైన శక్తిగల భూకంపాల్ని భారీ భూకంపాలు అని వ్యవహరిస్తున్నారు. ఇవి సామాన్యంగా రావు. ఒకవేళ వస్తే విస్తృతమైన ప్రాంతాల్లో అతి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. ఇంతవరకూ 1960, మే 22న 'గ్రేట్‌ చిలియన్‌ ఎర్త్‌క్వేక్‌' సంభవించింది. దీని తీవ్రత 9.5గా రిక్టర్‌స్కేల్‌పై నమోదైంది.
నష్టం కలిగించిన 2004 సునామీ..
ఇది అత్యధిక ప్రాణ నష్టం కలిగించిన సునామీ. ఇది ఇండోనేషియా సుమత్రా ద్వీపకల్పంలో వచ్చింది. 9.0 తీవ్రతతో 2004, డిసెంబర్‌ 26న వచ్చింది. దీని ప్రభావం వల్ల దాదాపు 2.3 లక్షల మంది చనిపోయారు. దీనిలో 75 శాతం మంది ఇండోనేషియన్లు చనిపోయారు. మన దేశంలో 10 వేల మందికి పైగా మరణిం చారు. ముఖ్యంగా అండమాన్‌-నికోబార్‌ కేంద్రపాలిత ప్రాంతంలో అధికారికంగా 1310 మంది చనిపోయారు. 5600 మంది జాడ లేదు. అనధికారికంగా ఏడువేల మంది చనిపోయారు. నికోబార్‌ దీవుల్లో 25 శాతం మంది చనిపోవడమో, గాయపడటమో లేదా కనిపించకపోవడమో జరిగింది. చౌరా దీవుల్లో మూడోవంతు మంది పూర్తిగా చనిపోయారు. అయితే, నాన్‌కోరీ దీవుల సమూహాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వీటిల్లో నివసించే ఏడువేల మంది జాడ లేకుండా పోయారు. ట్వింకెట్‌ ద్వీపం రెండు భాగాలుగా విడిపోయింది. ఈ పెద్ద భూకంపం వచ్చిన తర్వాత 84 చిన్న భూ ప్రకంపనలు (5.0-7.0 తీవ్రతతో) జనవరి 1, 2005 వరకూ వచ్చాయి. అండమాన్‌-నికోబార్‌ దీవులకు దగ్గరలో 2004లో బారెన్‌ ద్వీపకల్పంలో చురుకైన అగ్నిపర్వతం (బారెన్‌-1) ఉంది. ఇది పోర్టుబ్లేయర్‌కు నైరుతి దిశలో 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూకంపం వచ్చిన తర్వాత డిసెంబర్‌ 30న ఈ అగ్నిపర్వతం నుండి విడుదలయ్యే లావా ఎక్కువైంది.
సునామీ అలలు రావడానికి, దుష్ప్రభావాలు కలగడానికి కొంత సమయం పడుతుంది. భూకంపన శక్తి, కేంద్ర దూరం మీద ఇవి ఆధారపడి ఉంటాయి. అందువల్ల 2004 సునామీ తర్వాత తీరప్రాంతంలో 'సునామీ హెచ్చరిక, రక్షణ కేంద్రాల్ని' ఏర్పాటు చేసుకున్నాం. ఇవి ఎంతోమంది ప్రాణాల్ని రక్షించేందుకు తోడ్పడతాయి.
మీకు తెలుసా..?
సునామీ: జపాన్‌ భాషలో 'సు (ట్సు)' అంటే ఓడరేవు. 'నామీ' అంటే అలలు. సునామీ అంటే 'ఓడరేవు అలలు' అన్నమాట. ఇవి మామూలు అలల కన్నా భిన్నమైనవి. మామూలు అలలు 3-4 అడుగుల ఎత్తు, కొన్ని మీటర్లు మాత్రమే తరంగదైర్ఘ్యం కలిగి ఉంటాయి. కానీ సునామీ అలల తరంగదైర్ఘ్యం కొన్ని కిలోమీటర్ల నుండి వందల కిలోమీటర్ల వరకూ ఉండవచ్చు. సముద్రంలో సునామీ వచ్చినప్పుడు కేవలం నీరు ఉబికినట్టుగానే కనిపిస్తుంది. దీన్ని గుర్తించలేకపోవచ్చు. కానీ, ఈ అల తీరానికి చేరేటప్పటికి పరిమిత సముద్రతీర విస్తీర్ణం వల్ల సునామీ అలల ఎత్తు పదుల మీటర్ల వరకూ పెరుగుతుంది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

బార్లీతో బలం


  • -డా. జి.వి. పూర్ణచందు 9440172642
  • 22/04/2012

బార్లీ గింజలను జ్వరం వచ్చినపుడు జావ కాచుకొని తాగేందుకే మనం వాడుతున్నాం. గోధుమ, వరి, జొన్నల తర్వాత బార్లీనే ఆహార ధాన్యంగా ప్రపంచంలో ఎక్కువమంది వాడుతున్నారు. పశువుల మేతలోనూ, బీరు తయారీ పరిశ్రమల్లో కూడా దీని వినియోగం ఎక్కువ. బార్లీ పంట ఈనాటిది కాదు. క్రీ.పూ.10,000 నాటికే బార్లీ పండించటం ప్రారంభించారు. రుగ్వేదంలో పేర్కొన్న యవధాన్యం బార్లీయేనని చెప్తారు. ordeum vulgare అనేధి దీని శాస్ర్తియ నామం. ఇండో యూరోపియన్ పూర్వ రూపాలలో ‘బ్యారే’ అనే పదం బార్లీ పేరుకి మూలంగా భాషావేత్తలు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్, జోర్డాన్ ప్రాంతాల్లో దీని ఉత్పత్తి ప్రారంభమైందట. బహుశా భూ ఉపరితల ఉష్ణోగ్రతను తగ్గించటానికి బార్లీ ఉత్పత్తి ఆనాడు అనివార్యమై ఉంటుంది. ఉష్ణమండల దేశాలవారికి బార్లీ అత్యవసర ఆహార పదార్థం. ఆఫ్రికాలో బార్లీ సాగు మొదట ప్రారంభమైందనే వాదన ఉంది. క్రీ.శ.1500 దాకా బార్లీని రొట్టెల తయారీ కోసమే ఎక్కువగా ఉపయోగించారు.pot barley అంటే పట్టు తక్కువ లేదా దంపుడు బార్లీ గింజలని అర్థం. పాలిష్ చేసిన బార్లీ గింజల్ని ‘పెరల్ బార్లీ’ అంటారు.pearling అంటే తెల్లగా ఫాలిష్ పట్టటం. ముత్యాల్లా ఉంటాయి కాబట్టి ఈ పేరు సార్థకం అయ్యింది.
10-25 శాతం బార్లీ పిండిలో గోధుమ పిండి కలిపి బేకింగ్ ప్రక్రియలో రొట్టెల తయారీకి వాడుతున్నారు. బార్లీ గింజల మాల్ట్ వాడకం ఇప్పుడు ఎక్కువగా ఉంది. నాన్ రొట్టెలు (బ్రెడ్స్), చంటిపిల్లలకు పెట్టే ఫారెక్స్, సెరెలాక్ లాంటి పోషక పదార్థాల తయారీలో ఈ ‘బార్లీమాల్ట్’ ఉపయోగపడుతోంది. బార్లీ మాల్ట్‌లో పోషక విలువలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. బార్లీగింజల్ని నల్లగా మాడ్చి కాఫీ గింజలకు బదులుగా వాడుతున్నారు. అది చేదు రుచినే కలిగింటుంది. ఇలా నల్లగా మాడ్చిన గింజలతో ‘వినెగార్’ తయారుచేస్తున్నారు.
ఓట్స్ అనేవి గొప్ప ధాన్యం అనే ప్రచార ప్రభావంతో తెలుగు నేలమీద చాలామంది ఓట్స్ అటుకులను తిని, ఇంకా తమకు తగినంత బలం రాలేదని అంటుంటారు. ఓట్స్‌కన్నా బార్లీలో మూడురెట్లు అధికంగా పోషక విలువలున్నాయని ఆహార శాస్తవ్రేత్తలు చెపుతున్నారు. బార్లీ అనగానే ఫైబర్ నిండిన ఒక గొప్ప ధాన్యం అని మనకు గుర్తుకు రావాలి. పళ్ల రసాలు, కూరగాయలకన్నా బార్లీద్వారా లాభించే ఫైబర్ పేగులకు ఎక్కువ మేలు చేస్తుంది. భాస్వరం, రాగి, మాంగనీసు ఖనిజాలు నిండుగా ఉన్న ధాన్యం ఇది. గుండె, రక్తనాళాలకు ఎక్కువగా బలాన్ని కలిగిస్తుంది. రక్తపోటుని నివారించటంలో బార్లీ శక్తిమంతంగా పనిచేయటానికి ఈ ఖనిజాలే కారణం. గుండె జబ్బులు, పేగుపూత, జీర్ణకోశవ్యాధులు, అమీబియాసిస్, ‘ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్’ వ్యాధుల్లో ఇది ఔషధమే! రోజుకు 21 గ్రాముల బార్లీని తీసుకొంటే గుండెజబ్బులను నివారించవచ్చునని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు. ఫైబర్ కారణంగా పేగులు శుద్ధి అయి, పేగులలో బంధించబడిన మలం మెత్తబడి సాఫీగా విసర్జించబడుతుంది. మొలలు, లూఠీ వ్యాధులతో బాధపడేవారు బార్లీని ఔషధంగా వాడుకోవాలి. మూత్రంలో మంట తగ్గుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. పేగుల్లో కేన్సర్ రోగాలకు బార్లీతో ఉపశమనం కనిపిస్తుంది.
బార్లీని జావగా మాత్రమే తాగనక్కర్లేదు. దీని పిండితో గోధుమ, జొన్న, రాగి, బియ్యం పిండిగానీ కలిపి రొట్టెలు చేసుకోవచ్చు. రుబ్బిన మినప్పిండిలో బార్లీ పిండిని కలిపి గారెలు, దోశెలు వేసుకోవచ్చు. పూరీ, ఉప్మాలాంటివికూడా వండుకోవచ్చు. యూరోపియన్లు పుట్టగొడుగులతో బార్లీని కలిపి వండుకుంటారు. బార్లీజావలో పెరుగు కలిపి మిక్సీపట్టండి లేదా చల్ల కవ్వంతో చిలకండి. ఈ మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా బార్లీలోని ఫైబర్‌ను త్వరగా పులిసేలా చేసి ఇఖఆకూజష ఘషజజూ అనే కొవ్వు ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బుటిరిక్ ఆమ్లం పెద్ద పేగుల్లో కణాల్ని బలసంపన్నం చేస్తుంది. పేగుల్లో కేన్సర్, అల్సర్లవంటివి రాకుండా చేస్తుంది. పేగులు బలసంపన్నమైతే, సమస్త వ్యాధులనూ నివారించినట్టే కదా..! కామెర్లు, తదితర లివర్ వ్యాధులకు, మూత్రపిండాల వ్యాధులకు బార్లీమజ్జిగ గొప్ప ఔషధం. కొలెస్ట్రాల్‌ని ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లను అదుపు చేసి కొవ్వు పెరగకుండా చేయగల పానీయం ఇది. స్థూలకాయులు, షుగర్‌వ్యాధి ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు. నియాసిస్ అనే బి- విటమిన్ బార్లీలో ఎక్కువగా ఉంటుంది.
బార్లీ మజ్జిగ షుగర్ వ్యాధిలో వచ్చే అరికాళ్ల మంటలు, తిమ్మిర్లను తగ్గించటానికి పనికొస్తుంది. మెనోపాజ్‌కు చేరిన స్ర్తిలు బార్లీ మజ్జిగ తాగితే మెనోపాజల్ సిండ్రోమ్ లక్షణాలు తగ్గుముఖం పడతాయి. పొద్దునే్న లీటర్లకొద్దీ నీళ్లు తాగే అలవాటున్నవారు బార్లీ మజ్జిగ తాగటం అలవాటు చేసుకొంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బాలింతలు బార్లీ గింజలతో కాచిన పాయసం తాగుతూ ఉంటే తల్లిపాలు పెరుగుతాయి. ఆమెపాలు తాగిన బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతాడు. బార్లీపట్ల మనకున్న అపోహలను తొలగించుకొని, అది మన ప్రాచీన ధాన్యాలలో ఒకటిగా గ్రహించి సద్వినియోగపరచుకోవటం అవసరం.

టెక్నీషియన్‌ పోస్టులు

టెక్నీషియన్‌ పోస్టులు

  • జాబ్స్‌...జాబ్స్‌...
స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, బొకారో అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ 264 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
అర్హతలు: పదవ తరగతితోపాటు ఐటిఐ పాసై ఉండాలి.
వయసు: 28 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులను 2012 మే 10లోగా ఓపి బాక్స్‌ నెం. 21, హెడ్‌ పోస్టాఫీస్‌, బొకారో స్టీల్‌ సిటీ-827001, జార్ఖండ్‌ చిరునామాకు పంపాలి.
వివరాలకు:www.sail.in వెబ్‌సైట్‌ చూడండి.
బిఎస్‌ఎఫ్‌లో
బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌ (ఆర్కిటెక్ట్‌)-7 పోస్టులు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌)-183 పోస్టులు, సబ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌)-50 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
వయసు: 25 సంవత్సరాలలోపు ఉండాలి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో బిఇ/బిటెక్‌/డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌ ఉండాలి.
దరఖాస్తులను 2012 మే 5 లోగా ది కమాండెంట్‌ (రిక్రూట్‌మెంట్‌), బిఎస్‌ఎఫ్‌ హెడ్‌ క్వార్టర్స్‌, బ్లాక్‌-10, సిజిఓ కాంప్లెక్స్‌, లోఢ రోడ్‌, న్యూఢిల్లీ-1100003 చిరునామాకు పంపాలి.
వివరాలకు: www.bsf.nic.in చూడండి.
ఎస్‌ఎఫ్‌సిఐలో అసిస్టెంట్లు
స్టేట్‌ ఫార్మ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ అసిస్టెంట్స్‌ (విజిలెన్స్‌, అగ్రికల్చర్‌, హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌-20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
అర్హతలు: అగ్రికల్చర్‌, క్వాలిటీ కంట్రోల్‌, మార్కెటింగ్‌ విభాగాలకు బిఎస్‌సి (అగ్రికల్చర్‌), మిగిలిన వాటికి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 ఏప్రిల్‌ 30.
వివరాలకు:sfci.nic.in చూడండి.
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జూనియర్‌ అసిస్టెంట్‌ (ఫైర్‌ సర్వీస్‌)-250, అసిస్టెంట్‌ (ఆఫీస్‌)-15, సీనియర్‌ అసిస్టెంట్‌ (స్టాటిస్టిక్స్‌)-6, సీనియర్‌ అసిస్టెంట్‌ (నర్సింగ్‌)-1 పోస్టు భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
అర్హతలు: జూనియర్‌ అసిస్టెంట్‌కు డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ / ఆటోమొబైల్‌/ఫైర్‌ ఇంజనీరింగ్‌తోపాటు హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలి.
అసిస్టెంట్‌కు డిగ్రీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. సీనియర్‌ అసిస్టెంట్‌కు జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైఫరీలో డిప్లొమాతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: సీనియర్‌ అసిస్టెంట్‌కు 35 సంవత్సరాలు, మిగిలిన వాటికి 30 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 మే 15.
వివరాలకు:wwww./airportsindia.org.in చూడండి
ట్రాన్స్‌కో మిషన్‌ కార్పొరేేషన్‌లో
ఎపి ట్రాన్స్‌కో జూనియర్‌ అసిస్టెంట్స్‌ (ఎల్‌డిసి)-24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతంలో 16 పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడింది. గత ప్రకటనకు అనుగుణంగా దరఖాస్తు చేసినవారు తిరిగి దరఖాస్తు చేయనవసరం లేదు.
అర్హతలు: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: 18 నుండి 36 సంవత్సరాలలోపు ఉండాలి.క
దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 ఏప్రిల్‌ 28.
వివరాలకు: www.aptransco.gov.in చూడండి.
జూనియర్‌ అసిస్టెంట్స్‌
ఎపిసిడిసిఎల్‌ జూనియర్‌ అసిస్టెంట్స్‌ (ఎల్‌డిసి)-149 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతంలో 100 పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడింది. గత ప్రకటనకు అనుగుణంగా దరఖాస్తు చేసినవారు తిరిగి దరఖాస్తు చేయనవసరం లేదు.
అర్హతలు: డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లేదా పిజి డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ఉండాలి.
వయసు: 18 నుండి 36 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 మే 9.
వివరాలకు: www.ap centralpover.cgg.gov.in చూడండి.

కంపెనీ సెక్రటరీ కావాలంటే...


కంపెనీ సెక్రటరీ.... పారిశ్రామిక రంగంలో అత్యంత గౌరవం, హోదా గల ఉద్యోగమిది. ఇందులో ప్రవేశించిన వారికి ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఆర్థికంగా ఉన్నవారు స్వయం ఉపాధిని కూడా ప్రారంభించవచ్చు. సంబంధిత కోర్సులు పూర్తి చేసినవారు ఆయా సంస్థల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. కావలసిందల్లా తగిన అర్హత సాధించడమే. అత్యంత డిమాండ్‌ గల ఈ కెరీర్లోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఏయే కోర్సులు చదవాలి. తదితర విషయాలు తెల్సుకుందాం.
కంపెనీ సెక్రటరీ కోర్సు చేసినవారికి కంపెనీల్లో, దేశ విదేశాల్లోని వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. స్వయంగా సంస్థలు ప్రారంభించుకోవచ్చు. యాక్ట్‌ 1956 ప్రకారం ఐదుకోట్లు టర్నోవర్‌గల ప్రతి కంపెనీలో పూర్తికాలం సెక్రటరీని నియమించుకోవాలి. వీరికి జీతాలు కూడా లక్షల్లో ఉంటాయి. కాబట్టి కంపెనీ సెక్రటరీ ఉద్యోగానికి డిమాండ్‌ పెరుగుతోంది. అంతేకాదు స్టాక్‌ ఎక్సేంజ్‌లు వివిధ సంస్థలూ, ట్రస్టులూ, అసోసియేషన్‌లూ, ఫెడరేషన్‌లూ, అథారిటీలూ, కమిషన్‌లూ కంపెనీ సెక్రటరీ అర్హతగల వారిని అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాల్లో నియమించుకుంటున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఈ హోదాగల పోస్టుకు ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
అర్హత పొందగానే ఉపాధి ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. పది లక్షల నుంచీ ఐదు కోట్లవరకు టర్నోవర్‌గల ప్రతికంపెనీ నేడు సెక్రటరీలను నియమించుకుంటోంది. కాబట్టి బోల్డన్ని అకాశాలుంటాయి. ట్రైబ్యునల్స్‌లల్లో, కంపెనీ లాబోర్డులల్లో, ట్రేడ్‌ ప్రాక్టీస్‌ కమిషన్‌లల్లో వీరికి అవకాశాలుంటాయి. ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా కంపెనీ సెక్రటరీ హోదాగల వారికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నంలో ఉంది.
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎస్‌ఐ) డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేట్‌ ప్రొఫెషన్‌ ఆప్‌ కంపెనీ సెక్రటరీ చట్టం ద్వారా రూపొందించబడింది. ఐసిఎస్‌ఐ కంపెనీ సెక్రటరీషిప్‌ కోర్సులకు ప్రాధాన్యతనిస్తోంది. డిస్టెన్స్‌లో చదువుకునే అవకాశం కల్పిస్తోంది. అన్ని రకాల సబ్జెక్టులనూ అందిస్తోంది. కంపెనీ సెక్రటరీషిప్‌ వల్ల వృత్తిపరమైన నైపుణ్యాలూ, కార్పొరేట్‌ స్కిల్సూ అలవడుతాయి.
ప్రవేశం ఇలా...
ఆసక్తిగల విద్యార్థులు 10+2 తర్వాత ఇందులోకి ప్రవేశించవచ్చు. ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ లాంటి సిఎస్‌ కోర్సులు చేయొచ్చు. ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశించే అభ్యర్థి 10+2 ఉంటే సరిపోతుంది. అదే ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించే వారు తప్పనిసరి గ్రాడ్యుయేట్‌ అయ్యుండాలి. ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించే వారికి ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ సిఎస్‌ అర్హత కలిగి ఉండాలి.
ప్రాక్టీస్‌... ట్రైనింగ్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్స్‌, ప్రొఫెషన్‌ ప్రోగ్రామ్స్‌లో పాసైన వారే కంపెనీ సెక్రటరీ పోస్టుకు అర్హత సాధించగలుగుతారు. ఈ రెండూ ప్రోగ్రాముల్లో ఏదోఒక అర్హత ఉన్నవారికి కంపెనీలు 16 నెలలపాటు జీతభత్యాలతో కూడిన శిక్షణ ఇస్తాయి. ఇది పూర్తి చేసుకున్న వారే సిఎస్‌ ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
అడ్మిషన్స్‌...
ప్రతి సంవత్సరమూ ఈ కోర్సులో ప్రవేశం కోసం అవకాశం కల్పిస్తారు. జూన్‌, డిశంబర్‌ మాసాల్లో అడ్మిషన్‌ ప్రక్రియ ఉంటుంది. ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి డిశంబర్‌ 31న ప్రకటన వెలువడుతుంది. అదే ఏడాది పరీక్ష ఉంటుంది. ఒకవేళ సెప్టెంబర్‌ 30 ప్రకటన వెలువడితే మరుసటి సంవత్సరం జూన్‌లో పరీక్ష ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలకోసం www.icsi.edu చూడొచ్చు.
ఇ- లెర్నింగ్‌ కోర్సులు
ఐసిఎస్‌ఐ ఇ- లర్నింగ్‌ కోర్సుల్ని అందిస్తోంది. ఇంట్లో కూర్చుని కూడా కంపెనీ సెక్రటరీ ఉద్యోగానికి కావలసిన అర్హత సంపాదించవచ్చు. కంపెనీ సెక్రటరీ ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ ఈ మూడింటికి సంబంధించిన సిఎస్‌ కోర్సులు ఇంటర్నెట్‌ ద్వారా చదువుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు http//elearning.icsi.edu క్లిక్‌ చేస్తే అన్ని సబ్జెక్టులూ చదువుకోవచ్చు.

Monday 23 April 2012

రాకెట్ గమనంపై ముందే లెక్కలు


  • - కొడవటిగంటి రోహిణీప్రసాద్
  • 21/04/2012
కుజుణ్ణి ఉత్త కళ్ళతో సాయంత్రాలు చూడగలం. టెలిస్కోప్ ఉన్నట్టయితే మరింత బాగా చూడవచ్చు. ఈ పద్ధతి ఎప్పుడు మొదలయిందో తెలుసా? 17వ శతాబ్దంలో గెలీలియో తయారుచేసిన టెలిస్కోప్ సహాయంతో రోదసీ పరిశీలన ఆధునిక పద్ధతిలో మొదలయింది. 1957 తరువాత సోవియట్ యూనియన్, అమెరికా, ఇండియా తదితర దేశాలు కృత్రిమ ఉపగ్రహాలనూ, రాకెట్లనూ ప్రయోగించి మనుషులను చంద్రుడి మీదికి దింపేంతటి దాకా వెళ్ళాయి. ప్రస్తుత కాలంలో చంద్రుడి మీదికి రోదసీ నావికులు వెళ్ళడం తగ్గినప్పటికీ అంతరిక్ష పరిశోధనలు మటుకు ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. భవిష్యత్తులో కుజుడి మీదికి మనుషులు వెళ్ళబోతారు కనక ఈ తొలిమెట్లు ఎటువంటివో తెలుసుకుందాం. గ్రహాలన్నీ తమ తమ కక్ష్యల్లో ఆగకుండా తిరుగుతూనే ఉంటాయి కనక వాటిమధ్య జరిగే ప్రయాణాలు ఏ హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళినట్టుగానో సాధ్యపడవు. ఇందులో మొదటి విషయమేమిటంటే గ్రహాల మధ్య తిరిగే రాకెట్లూ, అంతరిక్ష నౌకలూ తిన్నగా సరళరేఖ వెంబడి ప్రయాణాలు చెయ్యవు. అవి వెళ్ళే వృత్తాకార మార్గాలు చాలా పొడవైనవి. భూమి మీదినుంచి రాకెట్ బయలుదేరిన క్షణంలో ఒకచోట ఉన్న కుజుడు అది అక్కడికి చేరేసరికి మరొక స్థానానికి కదిలిపోవడం సహజం. అందుకని ఆ మార్గం ఎటువంటిదో, ప్రయాణానికి ఎంత సమయం పడుతుందో శాస్తవ్రేత్తలు లెక్కకట్టి ఆ క్షణానికి కుజ గ్రహం ఉండే చోటికి రాకెట్ కచ్చితంగా చేరేటట్టుగా చూస్తారు.
భూమి చుట్టూ కక్ష్య (1)లో తిరుగుతున్న ఉపగ్రహాన్ని సరైన సమయంలో (2) ఒక ఇంజన్‌ను ఉపయోగించి దీర్ఘ వృత్తాకార కక్ష్యద్వారా కుజుడి కక్ష్య (3)కు చేర్చవచ్చు. మన ఉపగ్రహం చేరే సమయానికి కుజు డు ఆ ప్రాంతానికి వచ్చేటట్టుగా చూసుకోవచ్చు. ఈ ప్రయాణానికి సుమారు 18 నెలలు పడుతుంది.

దోమ ఒకటి-జబ్బులు ఐదు


దోమల వల్ల చాలా జబ్బులు వస్తాయి. అయితే ప్రధానంగా వేధించేవి ఐదు జబ్బులు. మలేరియా, మెదడువాపు, డెంగీ జ్వరం, చికున్‌ గున్యా, బోదవ్యాధి (పైలేరియా). ఇందులో మలేరియా, మెదడువాపు, డెంగీ జ్వరం మన ప్రాణాలు తీయవచ్చు. చికున్‌గున్యా దీర్ఘకాల నొప్పులతో వేధిస్తుంది. బోధవ్యాధి శాశ్వత అంగ వైకల్యాన్ని కలిగిస్తుంది.
దోమల నివారణ చర్యలు
* మీ ప్రాంతంలో దోమలు ఎక్కువుంటే పంచాయతీ లేదా మున్సిపల్‌ అధి కారులకు తెలియజేయండి.
* ఆరోగ్య శాఖ సిబ్బంది క్రిమి సంహారక మందులు ఇళ్లల్లో చల్లినప్పుడు ప్రతీ గదిలోనూ చల్లించడండి. మందు చల్లిన తర్వాత గోడలు తుడవకూడదు. గోడలకు సున్నం వేయరాదు.
* దోమల నివారణకి పొగవదిలినప్పుడు (ఫాగింగ్‌), ఇళ్లల్లో కిటికీలు, తలుపులు తెరచి ఉంచాలి.
* మీ ఇళ్లచుట్టూ నీరు నిల్వ ఉండకుండా, మురుగు నీటి కాల్వలో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తపడండి. మీ ఇంటి ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోండి.
* మురుగు నీటి కాల్వల్లో, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కిరోసిన్‌, ఇతర దోమల సంహారక మందులు చల్లించండి.
* దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు కాళ్లు, చేతులు పూర్తిగా కప్పుకోవాలి.
* మీకు వీలైతే మీ ఇంటి కిటికీలకు, తలుపులకు దోమలు రాకుండా మెష్‌ అమర్చుకోవాలి.
* వారానికి ఒక రోజు నీటి తొట్లు, పాత్రలు, కుండీలు, కూలర్లలో నీరు పూర్తిగా తీసివేయాలి. దీన్నే డ్రైడే పాటించడం అంటారు.
* దోమల నివారణకు దోమ తెరలు వాడటం అత్యుత్తమమైన మార్గం.
మీరూ ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి !
డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య
ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌
అనారోగ్య సమస్యలా ...?
అయితే మాకు రాసి పంపండి. ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన వైద్యులతో సమాధానాలిప్పిస్తాం. ప్రశ్నలు పంపే వారు వయస్సు, బరువు, జబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచాలి.

Friday 20 April 2012

గున్నమామిడి కొమ్మమీద...


చెట్టుకు పండిన మామిడిపండు రుచి ఎన్నడైనా చూశారా?! ఆ... ఆ... వెంటనే చిన్నతనానికి పరుగెత్తేశారు కదా! దాని రుచి మహత్మ్యం అలాంటిది మరి! వేసవికాలం వస్తుందనగానే మరుమల్లెలకై అతివలు ఎదురుచూడటం సహజం. కానీ, ఆడామగా, పిల్లాపెద్దా తేడాలేకుండా ఆబాలగోపాలం ఒక్కటై ఎదురుచూసేది మాత్రం మామిడిపళ్లకోసమే! అందులో రసాలు ఇష్టపడేది కొందరైతే, బంగినపల్లి రుచించేది మరికొందరికి. ఇవికాక తోతాపురితో మురబ్బా తయారీకి సిద్ధపడిపోయేవారి ఇంకొందరు. ఎవరి ఇష్టాలు ఏమైతేనేం, ఎవరినీ నిరాశపరచకుండా ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరిచే సుగుణం మామిడికి ఉంది. కాబట్టే మామిడి ఫలాల్లో రారాణి(ఏం, రారాజే ఎందుకనాలి? 'ఆమె' పేజీ కదా! మనం వెరైటీగా రారాణి అని పిలిచేద్దాం!)గా కీర్తించబడుతోంది. దేశ విదేశాల్లో మామిడి ఖ్యాతి మారుమ్రోగిపోతోంది.
కేవలం పళ్లు మాత్రమే కాదు, వాటికి ధీటుగా పచ్చిమామిడికీ అంతే పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. వాటిలో పిల్లలు ప్రీతిగా తినే కొబ్బరిమామిడి, పప్పు, కూరలు, చట్నీలలోకి వాడే పుల్లమామిడి, ఆవకాయకోసం మరిన్ని రకాలు... ఇక ఈ చిట్టాకు అంతూదరీ ఉండదు. మరి ఈ మామిడి కేవలం రుచికి మాత్రమే రాణీనా, ఈ మామిడి మన ఆరోగ్యానికేమైనా చేసేదేమైనా ఉందా అని ప్రశ్నిస్తే లభించే సమాధానాలు కోకొల్లలు. మరి అవేంటో ఓసారి పరికిద్దామా?!
* మామిడిలో జీర్ణశక్తికి తోడ్పడే అంశాలున్నాయి. ఇందులోని ఫైబర్‌ అందుకు బాగా ఉపయోగపడుతుంది.
* మామిడి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటిలో ఉండే పెక్టిన్‌, విటమిన్‌ సి ఈ పనిని నిర్వర్తిస్తాయి.
* ఇందులోని విటమిన్‌ డి శరీరసామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
* మామిడిలో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సుగుణాలు దాగున్నాయి.
* ముఖంపై మొటిమలు ఉన్నట్లయితే మామిడి చెక్కతో రుద్ది తరువాత కడిగేసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
* మామిడిలో ఐరన్‌ చాలా ఎక్కువ. ఇది మహిళలకు చాలా అవసరం. రక్తహీనతతో బాధపడే వారు మామిడిపళ్లు అధికంగా తింటే ఆ సమస్యనుండి బయటపడ్డట్లే! ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మేలుచేస్తుంది. మెనోపాజ్‌లో ఉన్న మహిళలు వారి రుగ్మతలను దీనిద్వారా అధిగమించొచ్చు.
* మామిడిలో యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి కేన్సర్‌ను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా, గుండెజబ్బులను దరికి చేరనీయవు.
అన్నట్లు మామిడిపళ్లు రంగు బాగున్నాయని కొనడం మాత్రమే కాదు, అవి పండిన వాసన వస్తున్నాయా లేదా అని గమనించి కొనాలి. ఎందుకంటే కార్బైడ్‌వేసి పండబెడుతున్న పళ్లే నేడు అధికంగా మార్కెట్లో లభిస్తున్నాయి. అవి తింటే మామిడివల్ల ఒనగూడే లాభాలు పోయి, ఆరోగ్యం పాడవుతుంది. అందుకే జాగ్రత్త వహించాలి!
మరి మామిడిలోని సుగుణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తతెలుసుకున్నాంగా! ఇక ఈ వేసవిని ముద్దపప్పు, కొత్తావకాయతో ఎంతగా ఎంజారుచేస్తామో... అంతే గొప్పగా మ్యాంగో మిల్క్‌షేక్‌, మ్యాంగో ఫ్రూట్‌సలాడ్‌లతో వేసవి తాపాన్ని ఇట్టే జయించేద్దాం! మరింకెందుకు ఆలస్యం, లెట్స్‌ బీట్‌ ది హీట్‌ విత్‌ జ్యూసీ, టేస్టీ మ్యాంగోస్‌!!

Wednesday 18 April 2012

ఉపవాసానికీ..ఉత్తరదిశకీ లంకె ఉందా..?


  • అశాస్త్రీయ ఆచారాలు 4
డాక్టర్‌ వెంగనూర్‌ బాలకృష్ణన్‌ అనే ఆయన రచించిన 'తాళపత్రం' అనే గ్రంథంలో అనేక చిత్ర విచిత్ర అంశాలు ప్రస్తావించబడ్డాయి. దీనిని చదివితే ఆచారాల వెనుకనున్న శాస్త్రీయతను వివరించే పేరుమీద 'బట్టతలకీ మోకాలికీ ముడి వేయడం' అనే సామెత గుర్తుకొస్తోంది. ఉదాహరణకు ఆ గ్రంథం 158వ పేజీలో 'బుధవారం రోజు ఉపవాస దీక్షను పాటిస్తున్నవారు ఉత్తరం దిశగా ప్రయాణం చేయకూడదని చెప్పబడింది. వెనుకటి రోజుల్లో ప్రయాణాలు కాలి నడకనే ఉండేవి. ప్రయాణం చేయవలసిన వారు ఆహారం తీసుకోకుంటే ఆరోగ్యం దెబ్బతినదా? ప్రయాణంలో కూడా ఉత్తరదిశ ప్రయాణమే చేయకూడదట. దానికి కారణం దక్షణ ధృవం నుండి ఉత్తర ధృవానికి అయస్కాంతశక్తి వ్యాపించి ఉంటుందనీ, ఆ అయస్కాంత శక్తి వ్యాపించి, దీక్షలో ఉన్నవారిపై విరుద్ధ ప్రభావాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరదిశగా ప్రయాణించకూడదన్న నియమాన్ని పెట్టడం జరిగిందట. ఆ విరుద్ధ ప్రభావం బుధవారం నాడే ఎందుకు ఉంటుంది? మిగిలిన రోజుల్లో అయస్కాంతశక్తి మారిపోతుందా? విరుద్ధప్రభావం ఉపవాస దీక్షలో ఉన్న వారిమీదే ఎందుకు ఉంటుంది? మిగిలిన వారి మీద ఎందుకు ఉండదు? ఇదంతా అర్థంపర్థంలేని ఆచారాలకు శాస్త్రీయ కారణాలున్నాయనే పేరు మీద కొన్ని సైన్సుపదాలను వాడుకొనే ప్రయత్నంగా కనిపించడం లేదూ?! మూఢవిశ్వాసాలను శాస్త్రీయతకు ఆపాదించడంగా కనిపించడం లేదూ..?!
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

విశ్వమార్పులు..


గతవారం 'హరాత్మక చలన' విశ్వ నమూనా (Model of Oscillating Universe) యే ఎక్కువ శాస్త్రీయతకు అనుగుణంగా ఉందని అను కొన్నాం. ఈ హరాత్మక చలన విశ్వనమూనానే 'పల్సేటింగ్‌ యూనివర్స్‌ (Pulsating Universe)' అని కూడా అంటున్నారు. దీనిని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కూడా సమర్థించాడు. దీని ప్రకారం విశ్వానికి అంతం, ఆది లేవు. విశ్వం శాశ్వతం. అయితే అందులో మార్పులూ శాశ్వతమే! మారనిది అంటూ విశ్వంలో ఏదీ లేదు. పదార్థం అంతా ఒకే బిందువు రూపంలోకి వెళ్లినపుడు అందులో పాదార్థిక వైవిధ్యం ఉండదు. పాదార్థిక వైవిధ్యంలేని వ్యవస్థలో కాలం అంటూ ఏదీ ఉండదు. కాబట్టి మన ఊపిరితిత్తులు వెడల్పు అవుతూ, మళ్లీ కుంచించుకుంటున్నట్టుగా ఈ విశ్వం అత్యంత విశాలమైన స్థల రూపంలోకి, అత్యంత కనిష్టమైన స్థల రూపంలోకి పదే పదే వలయ చక్రీయ (Expanding Spiral) గమనంలో ఉన్నట్టు ఈ సిద్ధాంతపు సారాంశం. ప్రస్తుతం మన (సమకాలీన) విశ్వస్థితి పల్స్‌ (ఘటనావ్యవస్థ) లో ఓ దశగా భావించాలి. ఇందులోకి 'మహా విస్ఫోటన' సిద్ధాంతాన్ని అంతర్లీనంగా జొన్పించవచ్చును. సుమారు 1500 కోట్ల సంవత్సరాల కిందట ఈ విశ్వం ఓ రాగి గింజ కన్నా ఇంకా తక్కువ స్థలంలో ఉండేది. అది ఆంతరంగిక ఘర్షణ వల్ల పేలింది. అప్పుడే వైవిధ్యం గల పదార్థం ఆవిర్భవించింది.

విసిరివేయబడ్డట్టు పాదార్థిక భాగాలు చెల్లాచెదురైన క్రమంలో పాదార్థిక రూపాలు గోళాకారాన్ని సంతరించు కొంటాయి. అందులో ఓ గోళాకార పదార్థ సంచయం (lump of matter) పాలపుంత. మొదట సంపూర్ణ గోళాకారంగానే ఉన్నా ఏదో ఒక అంతర్గత అక్షం (axis) చుట్టూనే దాని పదార్థం తిరగడం వల్ల అక్షం దగ్గర ఉబ్బుగానూ అంచుల్లో పలుచగానూ అయ్యే స్థితి ఏర్పడుతుంది. ఇది నిత్యజీవితంలో మనకెదురయ్యే అపకేంద్రబలం (centrifugal force) వల్ల సిద్ధిస్తుంది. అక్షం నుంచి దూరం వెళ్లే కొలదీ వేగం పెరగడం వల్ల అపకేంద్ర బలం కూడా పెరుగుతుంది. అందువల్ల చివర ఉన్న భాగాలు మళ్లీ చిందర వందర గోళాకార ముక్కలుగా విడిపడతాయి. అందులో ఓ అంచులో ఉన్న పాదార్థిక భాగం సౌరమండలం (Solar System) గా రూపొందింది. ఇది కూడా ఉబ్బిన పూరీలాగానూ లేదా ఇడ్లీలాగాను మధ్యలో ఉబ్బుగా, అంచుల్లో పలుచగా ఉండేది. ఇది ఏర్పడి దాదాపు 700 కోట్ల సంవత్సరాలైంది.

ఇందులో మళ్లీ గతితార్కిక పద్ధతిలో అంతర్గత వైరుధ్యాలు, ఘర్షణల వల్ల పరిమాణాత్మకమార్పు, గుణాత్మకమార్పు చెందే విశ్వ నియమానుసారం మధ్యలో అలాగే పదార్థం పోగై సూర్యగోళం రూపొందగా.. అంచుల్లో ఉన్నవి ఆయా సందర్భాల్లో తలెత్తిన యాధృచ్ఛిక (stochastic chance) పునరమరికలో భాగంగా వివిధ గ్రహాలుగా ఏర్పడ్డాయి. విశ్వ గమనంలో యాధృచ్ఛికతకు చాలా పాత్ర ఉంది. ఓ వంద నాణేలను నిరుపేక్ష (impartial) గా పైకి గిరాటేస్తే ఏ నాణెం బొమ్మ పడుతుందో, ఏ నాణెం బొరుసు పడుతుందో చెప్పలేం. కానీ ప్రతినాణెం బొమ్మైనా పడాలి లేదా బొరుసైనా పడాలి. ఏది పడుతుందన్నదే యాధృచ్ఛికం. అన్ని నాణేల్లోనూ యాధృచ్ఛికత ఉన్నా తప్పకుండా అందులో సుమారు 50 నాణేలు బొమ్మల్ని, సుమారు 50 నాణేలు బొరుసుల్ని చూపిస్తాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా 100 నాణేల్ని బొమ్మలుగానో లేదా బొరుసులుగానో వేయలేం. లేదా 25 బొమ్మలుగానూ 75 బొరుసులుగానూ కూడా చూళ్లేము. ఇలా 50 అటూ, 50 యిటూ పడ్డానికే చాలాసార్లు అవకాశం ఉంది. ఇది క్రమత్వం. ఇందులో యాధృచ్ఛికత లేదు. ఇలా విడివిడి భాగాల్లో అంతరంగికంగా యాధృచ్ఛికత ఉన్న సమిష్టి వ్యవస్థలో క్రమత్వం సిద్ధిస్తుందని ఆధునిక క్వాంటం సిద్ధాంతం ఘోషిస్తోంది.

మధ్యలో పదార్థం సూర్యుడిగానూ అంచుల్లోని విగ్రహాలుగానూ మారాయని తెలుసుకున్నాం కదా! వాటి వాటి ప్రమాణాల్ని నిర్దేశించింది కేవలం యాధృచ్ఛికతే! సూర్యుడి నుంచి 3వ గ్రహమే భూమి. సూర్యమండల సంయుక్త పదార్థం (Solar Planetory Disc) నుంచి భూమి స్వతంత్ర పదార్థంగా విడిపడి రూపొందడాన్నే భూమి ఆవిర్భావం అనుకొంటే ఆ సంఘటన జరిగి నేటికి సుమారు 600 కోట్ల సంవత్సరాలైంది. ఆ దశలో మొదట్లో భూమి కూడా పూర్తిగా ఉదజని వాయువు (Hydrogen gas) తో నిండి ఉండేది. అంటే సూర్యుడిలాగే భూమి కూడా పుట్టిన తర్వాత 50 కోట్ల సంవత్సరాల క్రితం వరకు (అంటే నేటికి 550 కోట్ల సంవత్సరాల పూర్వం) స్వయం ప్రకాశకం.

అంటే భూమి కూడా ఒక దశలో నాలుగు హైడ్రోజన్‌ కేంద్రాకాలను కేంద్రక సంలీన ప్రక్రియ (nuclear fusion) ద్వారా హీలియంగా మార్చుతూ కాంతి శక్తిని, ఉష్ణశక్తి తదితర శక్తి రూపాల్ని విడుదల చేసే చిరు నక్షత్రమేనన్న మాట. కాబట్టి భూమిని సూర్యుడి సోదరిగానే భావించాలి తప్ప సంతతిగా కాదన్నది ముఖ్యమైన అంశం. కేంద్రక సంలీన చర్యల్లో ప్రధానాంశం చిన్న చిన్న కేంద్రకాలు పెద్ద కేంద్రకాలుగా గుంపు కావడం. అంటే మొదట్లో పూర్తిగా తేలికైన హైడ్రోజన్‌, హీలియంగా ఉండిన భూ పదార్థం క్రమక్రమంగా అధిక బరువు గల పెద్ద పెద్ద పరమాణు కేంద్రకాలుగా మారిందన్నమాట. సహజంగానే హైడ్రోజన్‌ వాయువు ఖర్చు కావడం వల్ల కేంద్రక సంలీన చర్యకు సరిపడా అది లేకపోవడం వల్లన భూమి నక్షత్రస్థాయి నుంచి తప్పుకుంది. ఆ తదుపరి రసాయనాలు ఏర్పడి, నీటిఆవిరి తయారుకావడం, వాతావరణం రావడం, నీటి నిల్వలు సిద్ధించడం వీలైంది. జీవానికి అనువైనస్థితులు ఏర్పడ్డాయి. ఆ వివరాలు పైవారం తెలుసుకుందాం..!

ప్లాస్టిక్‌ తినే పుట్టగొడుగు..!

'పుట్టగొడుగు' ఫంగస్‌ జాతికి చెందినవి. ఫంగస్‌ మనకి అనేకరకాల వ్యాధులను, ఇబ్బందులను కలిగిస్తుంది. అయితే, కొన్నిరకాల పుట్టగొడుగులు మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఇది వేరే విషయం. అటువంటి ఫంగస్‌ వల్ల మరొక లాభం ఉందని ఇప్పుడు తెలిసింది. 'పెస్తలోతయాప్సిస్‌ మైక్రో స్పోరా' అనే ఒక రకం పుట్టగొడుగు ఫంగస్‌ కేవలం 'పాలీ యురేతిన్‌' (ప్లాస్టిక్‌) తిని జీవిస్తుందని యేల్‌ యూనివర్శిటీ పరిశోధకులు తెలుసుకున్నారు. ఈక్వెడార్‌లో కనిపించే ఈ ఫంగస్‌ వల్ల మన పర్యావరణానికి చెప్పలేని మేలు కలుగుతుందని పుడు పరిశోధకులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

గుండెకు పసుపుతో చికిత్స..!


పసుపుతో అనేకానేక లాభాలున్నాయని మనదేశ ప్రజలకు బాగా తెలుసు. థారులాండ్‌లోని పరిశోధకులు పసుపు గురించి మరో విషయం తెలుసుకున్నారు. బైపాస్‌సర్జరీ చేయించుకున్న, వారిలో గుండెనొప్పులు నివారించే విషయంలో పసుపు తోడ్పడుతుందని వారి పరిశోధనల సారాంశం. బైపాస్‌ సర్జరీ సమయంలో దీర్ఘకాలం గుండె కండరాలకు రక్తప్రసరణ లేక దెబ్బతింటాయి. తిరిగి గుండెనొప్పి వచ్చే ఆస్కారమూ ఎక్కువగా వుంది. అటువంటి సందర్భాలలో, మామూలుగా వాడే మందులతో పాటు పసుపుకి పసుపు వర్ణాన్ని కలిగించే పదార్థం కర్క్యుమిన్‌ను కలిపి ఇస్తే గుండెనొప్పి వచ్చే అవకాశాలు తక్కువట..!

'ధరిత్రి-సుస్థిర భవిష్యత్తు'


విశ్వంలో మానవజాతిలాంటి జీవులు కలిగి వున్న ఒకేఒక గ్రహం ధరిత్రి. దీనిపై జీవావిర్భావం దాదాపు 350 కోట్ల ఏళ్ల క్రితం జరిగింది. ధరిత్రి ఇప్పటిస్థితికిి చేరడానికి దాదాపు 460 కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. విశ్వంలో మనలాంటి జీవాలు గల ఇతర గ్రహం మరేదైనా ఉందా అనే దిశలో పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు. ఇప్పటి ధరిత్రిని అస్థిరపరిచే ఎన్నోచర్యలు కొనసాగుతున్నాయి. ధరిత్రిలోని అన్ని జీవాలను పలుమార్లు పూర్తిగా నాశనం చేయగల అణుబాంబులు అమెరికా, రష్యా వంటి పలుదేశాల దగ్గరున్నాయి. వీటిని సమకూర్చుకోడానికి మరికొన్ని దేశాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. అమెరికా, దాని మిత్రదేశాలు తాము శత్రువులుగా భావించిన ఇతర దేశాలపై ఈ బాంబుల్ని ఉపయోగించడానికి వెనుకాడబోమని బెదిరిస్తున్నాయి కూడా. ప్రకృతివనరులను కొల్లగొట్టేందుకు ఏవో సాకులతో యుద్ధాలు, ఆక్రమణలు, అక్రమాలు జరుగుతున్నాయి. పర్యావరణానికి ఇవి కలిగిస్తున్న హాని అసలు అధ్యయనానికే నోచుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు మానవుడు తన అవసరాలకూ, స్వార్థం కోసం వినియోగిస్తున్న ఎన్నో సాంకేతికాలు వాతావరణాన్ని వేడెక్కిస్తూ, భూగోళాన్ని అస్థిరపరిచేవిగా ఉన్నాయి. ఇదే జరిగితే మరే ఇతర గ్రహానికో పోయి, మనల్ని మనం రక్షించుకునే స్థితి కూడా లేదు. ఇతర గ్రహాల్లో కనీసం మామూలు జీవాలుండగలవన్న ఆధారాలూ లభించడం లేదు. అందువల్ల, మన పృథ్విని మనకోసం, మన భవిష్యత్తరాల కోసం సుస్థిరంగా కొనసాగేలా కాపాడుకోవాలి. ఈ లక్ష్యంతోనే 2012 'ధరిత్రి దినోత్సవం' జరుగుతోంది. ఈ సందర్భంగా 'ధరిత్రి-సుస్థిర భవిష్యత్తు' కోసం తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలను క్లుప్తంగా వివరించేందుకు చివరి భాగంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
ప్రకృతి వనరులు, ఇంధనోత్పత్తి, వినియోగ నిర్ణయాల మీద పృథ్వి భవిష్యత్తు ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరనుందని అంచనా. వీరి అభివృద్ధి అవసరాలను తీర్చడానికి ఇప్పటికన్నా ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఇంధనాన్నీ అధికంగా ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధితోనే గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల పెరుగుతూ, భూగోళ వాతావరణం వేడెక్కడాన్ని, తద్వారా రాగల దుష్పరిణామాలను సంక్షిప్తంగా గతవారం ఇచ్చిన మొదటిభాగంలో తెలుసుకున్నాం.

పృథ్వి సుస్థిరభవిష్యత్తు కోసం గ్రీన్‌హౌస్‌వాయువుల విడుదలను పరిమితంచేస్తూ, భూగోళ వాతావరణ క్షీణతను అరికట్టేందుకు ఇంతవరకూ చేపట్టిన కార్యక్రమాలు ఆశించినమేర ఫలితాల్ని ఇవ్వలేదు. మరి ఈ పెరుగుతున్న జనాభా అవసరాల్ని తీరు స్తూ, భూగోళ సుస్థిరతను ఎలా కాపాడుకోవాలి? అనేది నేడు మనముందున్న ప్రధాన సవాలు. దీనికోసం హరిత సాంకేతికాలను, అభివృద్ధిని సాధించాలని ఓ బృహత్‌ ప్రణా ళికను ఐక్యరాజ్యసమితి 2011లో 'ప్రపంచ ఆర్థిక, సామాజిక సర్వే' నివేదిక రూపంలో మన ముందుంచింది. సుస్థిర పర్యావరణాభివృద్ధికి దోహదపడేలా, పర్యావరణానికి ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేలా పునరుద్ధరణ కార్యక్రమాలను చేపడుతూ ఇప్పటి, భవిష్యత్తు అవసరాలను తీర్చాలని ఈ నివేదిక సూచిస్తుంది. దీనికోసం ఎప్పటిలాగా కాక, నూతనత్వంతో కూడిన సాంకేతికాలతో అభివృద్ధిని సాధించాలని సూచించింది.
మూల సిద్ధాంతం..
ష తరిగిపోయే వనరులకు బదులు, తరగని, పునర్వినియోగించుకోగల వనరుల ఆధారంగా జరిగే అభివృద్దే సుస్థిరాభివృద్ధి. ఇదే ధరిత్రికి సుస్థిర భవిష్యత్తును చేకూరుస్తుంది.
* ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ హరితార్థికాభివృద్ధికి, సుస్థిర భవిష్యత్తుకు మూలాధారం.
* భూమి, నీరు వంటి మౌలిక వనరులను గరిష్ట సామర్థ్యంతో వినియోగించాలి. ఇప్పటి సామర్థ్యాన్ని పెంచాలి.
* చౌకైన, సమర్ధవంతమైన విద్యుత్‌. దూరదృష్టితో తరగని, పునర్వినియోగించు కోగల వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేలా ధరలను నిర్ణయించాలి.
* గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను కనీసస్థాయికి తగ్గించగల సాంకేతికాల వినియోగం.
* అడువుల సంరక్షణ, పునర్‌ పెంపకం, సుస్థిర యాజమాన్య పద్ధతులు, జీవవైవిధ్య సంరక్షణ.
* సమర్థవంతమైన ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు, వ్యక్తిగత రవాణాను నిరుత్సాహపరిచే విధానం.
* భాగస్వామ్యంగల గ్రామీణ ఇంధనం, సాగునీటి యాజమాన్యం, గ్రామీణాభివృద్ధి.
నష్టపరుస్తున్న శక్తులు..
* కార్పొరేట్‌ శక్తుల అమిత లాభాపేక్ష.
* సంపదను పోగుచేసుకోవాలనే సంస్కృతి - దీనికి మద్దతిస్తున్న కార్పొరేట్‌శక్తులు.
* హద్దూ అదుపూ లేని వినియోగ సంస్కృతి.
* ధనికుల జీవనశైలి.
* ప్రకృతి వనరులను కొల్లగొట్టే రాజకీయాలు, ఆక్రమణలు, అక్రమాలు.
* పర్యావరణాన్ని నష్టపర్చగల శాస్త్ర, సాంకేతికాల ఎంపిక.
ఆహారోత్పత్తి.. సాంకేతికాలు..
భూగోళం నుండి విడుదలయ్యే మొత్తం గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో దాదాపు 14 శాతం ఆధునిక వ్యవసాయం వల్ల విడుదలవుతున్నాయి. ఎన్నో విస్తార ప్రాంతాల్లో భూ వినియోగం, నీటి యాజమాన్యం హరిత ఆర్థికాభివృద్ధికి దోహదపడేవిగా లేవు. అడవుల నరికివేతవల్ల దాదాపు మరో 17 శాతం గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలవు తున్నాయి. సుస్థిర వ్యవసాయోత్పత్తికి, అడవుల యాజమాన్యానికి, నేలకోత నివారణకు నీటి కాలుష్య నియంత్రణకు హరిత సాంకేతికాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మెట్ట ప్రాంతాల్లో, పరీవాహక ఆధారాభివృద్ధి (భూసార పరిరక్షణ, నీటి సంరక్షణ), నీటి వినియోగాన్ని తగ్గిస్తూ, ఉత్పాదకతను పెంచుతూ సేద్య విస్తీర్ణాన్ని తగ్గించే శ్రీవరి సేద్యం, సాగునీటి సామర్థ్యాన్ని పెంచే సాంకేతికాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఉపయోగించాలి.
పెట్టుబడులు..
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త హరిత సాంకేతికాల అమలుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను అందించాలని ఐరాస 2011 సర్వే సూచిస్తుంది. దీనికోసం ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు మూడు శాతం (2010లో 1.90 లక్షల కోట్ల డాలర్లు) అవసరమని ఈ సర్వే అంచనా వేసింది. పేదరికాన్ని అధిగమించడానికి, నేల, నీటి వనరుల క్షీణతను నిలువరించడానికి, ఆహారోత్పత్తిని పెంచుతూ ఆకలిని నిర్మూలించడానికి; వాతావరణమార్పుల్ని నిలువరించడానికి, రాగల ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి ఈ నిధులు అవసరం. ఈ నిధుల్లో కనీసం సగం అభివృద్ధి చెందిన దేశాలు స్థానిక వనరుల నుండే సేకరించాలని ఈ నివేదిక సూచించింది. ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పొదుపు మొత్తాలను, ఇతర ఆదాయాల్ని స్థానికంగా కాకుండా అంతర్జాతీయ నిధుల రూపంలో ఉంచుతున్నాయి. ఐచ్ఛికంగా వీటిని ఆయా దేశాల్లోనే ఉంచితే హరిత ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలవని ఈ సర్వే సూచిస్తుంది.
కోపెన్‌హాగన్‌ ఒప్పందంలో 2010-12 మధ్యకాలంలో వార్షికంగా మూడు వేల కోట్ల డాలర్లను, ఆ తర్వాత 2020 వరకూ 10 వేల కోట్ల డాలర్లను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ లక్ష్యం కోసం అందించాలనే నిర్ణయం సరైనదని సర్వే తెలిపింది. కానీ, ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ మార్పుల నియంత్రణకు ఏర్పర్చిన ట్రస్టు నిధుల నుండి ఏడాదికి కేవలం రెండువేల కోట్ల డాలర్లు అందాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో హరితాభివృద్ధికి వార్షికంగా లక్ష డాలర్లు అవసరమవుతుందని సర్వే అంచనా. దీనిలో ఎక్కువ భాగం అంతర్గతంగానే ఆయా దేశాలు సేకరించాల్సి ఉన్నప్పటికీ, ఆరంభంలో హరిత సాంకేతికాల మార్పును వేగం చేసేందుకు విదేశీ సహాయం తోడ్పడుతుందని సర్వే సూచించింది.
కేంద్రీకరించాల్సిన చిన్నకమతాల సేద్యం..
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నకమతాలపై కేంద్రీకరించి, సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధించాలని 1996లో జరిగిన 'ప్రపంచ ఆహార ఉన్నతస్థాయి సమావేశం' సూచించింది. ఈ దేశాల్లో ఇప్పటికీ ఆహారం స్థానికంగా ఉత్పత్తయి, వినియోగింపబడుతున్నందువల్ల ఆహారోత్పత్తి వ్యవస్థ మొత్తం చిన్నకమతాల సేద్యం మీదనే ఆధారపడి ఉంది. అందువల్ల, హరితాభివృద్ధిలో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని 2011 ఐరాస సర్వే పునరుద్ఘాటించింది. కొత్తగా వస్తున్న సాంకేతికాల్ని చిన్న కమతాలు వినియోగించుకోలేకపోతున్నాయని పేర్కొంది. అందువల్ల, ఈ కమతాలకు అవసరమైన మద్దతు వ్యవస్థను, మౌలిక సౌకర్యాలను సమకూర్చాలని ఈ సర్వే తెలిపిింది. ముఖ్యంగా సుస్థిర సాగునీటి వ్యవస్థ, విద్య, శిక్షణ, భూమి, రుణసౌకర్యాల అందుబాటు, భరించగలిగే ధరలకు ఉత్పాదకాల అందుబాటు, మార్కెట్‌ మద్దతు అవసరమని ఇది తేల్చి చెప్పింది.
తిరోగమనంలో మన దేశం..
హరిత ఆర్థికాభివృద్ధికి తిరోగమన దిశలో దేశాభివృద్ధి కొనసాగుతుంది. భూగోళం వేడెక్కడాన్ని, వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతున్నాం కానీ, వీటిని నిలువరించేందుకు పై పై చర్యలకే పరిమితమవుతున్నాం. అంతు లేని వినియోగ సంస్కృతి ప్రోత్సహించబడుతోంది.
అంతర్జాతీయ ఉత్పత్తిలో భాగస్వామ్యం వలన రవాణా అవసరాలు పెరిగి, ఇంధన వాడకం పెరుగుతుంది. ప్రజా రవాణా రోడ్డు సౌకర్యాలను తగ్గిస్తూ, వ్యక్తిగత, ప్రయివేటు వాహనాల వినియోగాన్ని పెంచే అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. దీనివల్ల ఇంధన వాడకం పెరుగుతుంది. పునరుత్పత్తి కాగల ఇంధనం, ఉచితంగా, అపరిమితంగా లభించే సౌరశక్తి ఆధారిత ఇంధనం కాకుండా అతి ఖర్చు, రిస్క్‌తో కూడిన అణువిద్యుత్‌ కేంద్రాల నిర్మాణం పెద్దఎత్తున చేపడు తుంది. ఇదే సమయంలో అవసరానికి మించి పెద్దఎత్తున బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబడుతుంది. ఇవేవీ హరిత సాంకేతికాలు కావు, హరితార్థికాభివృద్ధికి తోడ్పడేవీ కావు.

సుస్థిర వ్యవసాయోత్పత్తికి దోహదపడే సాంకేతికాలు (సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ, కలుపు నియంత్రణ) అందుబాటులో ఉన్నప్పటికీ, వీటిని పక్కన పెట్టి, భారీ యంత్రాలు, అధిక రసాయనాల వినియోగంతో కూడిన వ్యవసా యరంగ కార్పొరేటీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వాతావరణమార్పుల దుష్ప్రభావాలకు తట్టుకునే సుస్థిర వ్యవసాయ పరిశోధనలకు ఒక జాతీయ సంస్థ ఏర్పాటైంది. అందుబాటులో ఉన్న సాంప్రదాయ హరిత విజ్ఞానాన్ని పక్కకు పెట్టి, కొత్త పరిశోధనలను చేపట్టే ఔచిత్యాన్ని సమర్థించలేం.
ఎంతో అస్థిరత్వంతో కూడిన బిటి సాంకేతికాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీన్ని హరిత సాంకేతికంగా పరిగణించలేం. ఇది ఎన్నో పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణమని తెలుస్తున్నప్పటికీ, కేవలం కంపెనీల సమాచారం ఆధారంగా బిటి సాంకేతికాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
దుష్ప్రభావాల్ని ఎదుర్కోడానికి మన కార్యక్రమం..
వాతావరణమార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కోడానికి 8 అంశాలపై ప్రత్యేక జాతీయ మిషన్లను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి..
* జాతీయ సౌరశక్తి మిషన్‌: 20 వేల మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించింది. 2010-12లో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం.
* జాతీయ ఇంధన సామర్థ్యాన్ని పెంచే మిషన్‌: ఇది ప్రత్యేక వ్యవస్థాగత ఏర్పాట్ల కోసం ఉద్దేశించింది.
* జాతీయ సుస్థిర నివాసాల మిషన్‌: సుస్థిర రవాణా, ఇంధన సామర్థ్యంగల ఇళ్ల నిర్మాణం, పట్టణ ప్రాంతాల్లో సుస్థిర వ్యర్థ పదార్థాల యాజమాన్యాల కోసం ఇది పనిచేస్తుంది.
* జాతీయ నీటి మిషన్‌: నీటి వనరుల సమన్వయ వినియోగ సామర్థ్యాన్ని కనీసం 20 శాతం పెంచే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.
* జాతీయ హిమాలయ జీవావరణ సుస్థిర మిషన్‌: హిమాలయ మంచు కరగడంపై వాతావరణ పర్యావరణ పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఇది ఉద్దేశించింది.
* జాతీయ హరిత భారత మిషన్‌ : అదనంగా 10 మిలియన్‌ హెక్టార్ల నిరుపయోగ భూముల్ని, సామూహిక భూముల్ని, క్షీణించిన అటవీభూముల్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది.
* జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌ : వాతావరణమార్పుల్ని తట్టుకుని, ఉత్పాదకతను పెంచేందుకు తోడ్పడే సాంకేతికాల అభివృద్ధికి ఉద్దేశించినది. మొత్తం మీద వివిధ వ్యవసాయ, వాతావరణ మండలాల్లో మౌలిక వనరులైన నీరు, భూమి తదితరాల వినియోగాన్ని మెరుగుపరిచి, జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వరదల్ని, ఇతర ప్రకృతి వైపరీత్యాల్ని, చీడ, పీడల్ని తట్టుకునేవిధంగా కొత్తరకాల్ని రూపొందించ డానికి దీని పరిశోధనలు ఉద్దేశించబడ్డాయి.
* జాతీయ వ్యూహాత్మక వాతావరణమార్పుల విజ్ఞాన మిషన్‌ : వాతావరణ మార్పుల వల్ల వస్తున్న సవాళ్లను గుర్తించి, సంబంధిత విజ్ఞానాన్ని, స్పందించాల్సిన అవసరాన్ని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించింది.
అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కలిగించేలా కార్బన్‌ విడుదలను తగ్గించేందుకు అవసరమైన ఓ నిపుణుల గ్రూపు కూడా ఏర్పాటైంది.
మీకు తెలుసా?
* సుస్థిరాభివృద్ధి: ఇప్పటి వనరులను అస్థిరపర్చకుండా, నేడు, పెరుగుతున్న భవిష్యత్తరాల అభివృద్ధి అవసరాలను తీర్చుకొనడం.
* హరితార్థికాభివృద్ధి (సుస్థిరాభివృద్ధి): భవిష్యత్తరాల భద్రతను ఫణంగా పెట్టకుండా భూ, జీవ పర్యావరణాల్ని పరిరక్షిస్తూ, పెరుగుతున్న అభివృద్ధి అవసరాలను తీర్చుకోవడం.
* గ్రీన్‌ టెక్నాలజీస్‌: హరితాభివృద్ధికి దోహదపడే సాంకేతికాలు.
వాతావరణమార్పుల్ని తట్టుకొనే సాంకేతికాలు..
వాతావరణమార్పుల్ని తట్టుకోడానికి ఇప్పటికే 165 సాంకేతికాలు వినియోగిస్తున్నట్లు '2011 ప్రపంచ ఆర్థిక, సామాజిక ఐక్యరాజ్యసమితి సర్వే' నివేదిక తెలుపుతుంది. దీనిలో 42 సాంకేతికాలు (25.5 శాతం) వ్యవసాయం, సంబంధిత రంగాలలో వినియోగింపబడుతున్నాయి. నీటి వనరుల వినియోగంలో 28 రకాల సాంకేతికాలు (17 శాతం)లో ఉన్నాయి. తీరప్రాంతాల్లో 27 సాంకేతి కాలు (16.4 శాతం)లో ఉన్నాయి. మౌలిక రంగంలో 23 సాంకేతికాలు (13.9 శాతం)లో ఉన్నాయి. ఆరోగ్యం, వాతావరణం ముందు హెచ్చరికలు, భూతల జీవావరణం వంటి రంగాలలో మిగతావి వినియోగించబడుతున్నాయి.
మొత్తం సాంప్రదాయ సాంకేతికాల్లో 67 శాతం వాతావరణమార్పులను ఎదుర్కోడానికి వినియోగపడుతున్నాయి. పారిశ్రామికవిప్లవం తర్వాత రూపొందించిన ఆధునిక సాంకేతికాల్లో 57 శాతం సాంకేతికాలు వాతావరణ మార్పుల్ని ఎదుర్కోడానికి దోహదపడుతున్నాయి. ఇక, ఇటీవల రూపొందించిన సాంకేతికాల్లో కేవలం 41 శాతం వాతావరణమార్పుల్ని ఎదుర్కోడానికి దోహద పడుతున్నాయి. ఇవి ప్రధానంగా వాతావరణాన్ని పసిగట్టడంలో, ముందస్తు హెచ్చరికలు జారీచేయడంలో ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత ఆరోగ్యరంగంలో ఉన్నాయి.
వ్యవసాయరంగంలో వినియోగిస్తున్న సాంకేతికాల్లో 47.6 శాతం సాంప్రదాయ సాంకేతికాలు, 31 శాతం ఆధునిక సాంకేతికాలు, కేవలం 21 శాతం మాత్రమే ఇటీవల రూపొందించిన సాంకేతికాలు.
ఇంధన రంగంలో వాతావరణమార్పుల్ని ఎదుర్కోడంలో 66.7 శాతం సాంప్రదాయ సాంకేతికాలు ఉపయోగపడుతున్నాయి. 33.3 శాతం ఆధునిక సాంకేతికాలు. వాతావరణమార్పుల్ని ఎదుర్కోడానికి ఉపయోగపడ్తున్నాయి. ఇటీవల కాలంలో ఏ కొత్త ఇంధన సాంకేతికం దీనికి దోహదపడటం లేదు.
భూతల పర్యావరణ వ్యవస్థ సాంకేతికాల్లో 75 శాతం సాంప్రదాయ సాంకేతికాలు వాతావరణమార్పుల్ని ఎదుర్కోడానికి దోహదపడుతున్నాయి. మిగతావి పారిశ్రామిక విప్లవకాలంలో రూపొందినవి. ఈ రంగంలో దీనికోసం ఇటీవల ఏ కొత్త సాంకేతిక విజ్ఞానమూ రూపొందలేదు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

Tuesday 17 April 2012

నిరంతర ‘వీక్షణం’.. జీవనం దుర్భరం



  • 18/04/2012

...............
‘కేబుల్ కనెక్షన్ తీసివేసిన తర్వాత - నేను
ఆరోగ్యవంతుడినైనట్లు గుర్తించా.. నాలో సృజనాత్మకత
కన్పిస్తోంది.. ఇతరులతో సంబంధాలు మెరుగుపడ్డాయి.. వీటన్నింటినీ చూశాక నాలో ఆత్మబలం పెరిగింది..’- ఇదీ.. టీవీ చూడడం మానేశాక ఓ మధ్య వయస్కుడి మనోగతం. ‘మీ గదిలో టీవీని తొలగించండి.. ఆ తర్వాత మార్పేమిటో మీరే చూస్తారు..’- అని కొందరు తమ అనుభవాలను
ఏకరువు పెడుతున్నారు.
.............................
వినోదానికి, విజ్ఞానానికి కాసేపు టీవీ చూడడం తప్పేమీ కాదు. అయితే, గంటల తరబడి టీవీకి అతుక్కుపోతే ఆరోగ్యంతో పాటు జీవితంలో ఎన్నింటినో కోల్పోతారని వైద్యులు, మానసిక శాస్తవ్రేత్తలు పదే పదే ఘోషిస్తున్నారు. ‘ఇడియట్ బాక్సు’కు బానిసలుగా మారితే బ్రతుకు దుర్భరం కాక తప్పదని అమెరికాతోపాటు పలు దేశాల్లో జరిపిన తాజా సర్వేల్లో వెల్లడైంది. గంటల తరబడి టీవీ ముందు కూర్చోవడం అమెరికా, భారత్ వంటి దేశాల్లో ప్రజలకు అలవాటుగా మారిందని సర్వేలో తేల్చారు. విలువైన కాలం వృథా కావడంతో వ్యాయామం, పుస్తక పఠనం, స్వచ్ఛంద సేవ, మంచి నిద్ర, వేళకు భోజనం వంటివి దూరం అవుతున్నాయని గుర్తించారు. రోజూ నాలుగు గంటలు... అంతకు మించి టీవీ చూడడం వల్ల చాలామందిలో బద్ధకం పెరుగుతోందట. టీవీ కార్యక్రమాలను వీక్షిస్తూ భోజనం చేయడం వల్ల ఊబకాయం సమస్య తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే పనిగా చానల్స్ మారుస్తూ టీవీకే అంకితం కావడం వల్ల సన్నిహితులతో మంచి సంభాషణలకు చాలామంది దూరం అవుతున్నారు. టీవీలో సీరియళ్లు, రియాల్టీ షోలు, సినిమాలు, క్రీడలను చూడడానికే ప్రాధాన్యమిస్తున్నందున ఇంట్లో పెద్దలు, పిల్లలతో మాట్లాడడం తగ్గించేస్తున్నారు. దీంతో కుటుంబ సంబంధాలు లోపిస్తున్నాయి. గతంలో కుటుంబ సభ్యులు సరదాగా పిక్నిక్‌లకు వెళ్లడం, ఆటపాటలతో సందడి చేయడం, కలిసి మెలిసి కబుర్లు చెప్పుకోవడం వంటివి కనిపించేవి. టీవీ పుణ్యమాని ఇవన్నీ గతకాలపు జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. చదువుకున్న వారు సైతం తమ కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తూ, టీవీ సీరియల్స్‌లో అత్తాకోడళ్ల తగాదాల్లో ఆ కుటుంబాలు ఏమవుతాయోనని బెంగ పడిపోతున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం చేయడానికి సమయం ఉండదని చెబుతూ, టీవీ తెరకు గంటలకొద్దీ అతుక్కుపోతుంటారు. నిద్ర పోయే ముందు టీవీ చూడడం మంచి అలవాటు కాదని వైద్యులు చెబుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఆలుమగల మధ్య సైతం ‘ఇడియట్ బాక్స్’ చిచ్చు పెడుతోంది. ఓ పద్ధతి లేకుండా అదే పనిగా టీవీ కార్యక్రమాలను వీక్షించడంతో జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతోంది. టీవీ ముందు కూర్చుని భావోద్వేగాలకు లోనవుతూ భోజనం చేయడం, మద్యం తాగడం వంటివి చేయడంతో మధుమేహం, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందట. కాసేపైనా బయట తిరిగితే.. జీవితంలో ఏం కోల్పోతున్నామో తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. టీవీ చూసే మొత్తం సమయంలో కొన్ని గంటలనైనా వ్యాయామం, ఆటలకు కేటాయిస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది.
రెండేళ్ల లోపు బాలలను టీవీ చూసేందుకు అనుమతించరాదని అమెరికాకు చెందిన పిల్లల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు టీవీకి బానిసలైతే వారిలో సృజనాత్మకత లోపిస్తుంది. వారిలో విజ్ఞానం, విచక్షణ వంటివి పెరగాలంటే బాహ్య ప్రపంచం తెలియాలని, పుస్తక పఠనం, పెద్దల మధ్య తిరగడం వంటివి ఇందుకు దోహదం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. టీవీకి పరిమితమయ్యే పెద్దలు బద్ధకం కారణంగా రోజు వారీ పనులను సైతం వాయిదా వేస్తుంటారు. దీనివల్ల కుటుంబ సభ్యుల్లో విభేదాలు ఏర్పడుతున్నాయి. వాయిదా వేసే పనులను ఒకేసారి చేయాలన్న ఆతృతలో మానసిక వత్తిడికి చాలామంది లోనవుతున్నారు. కొన్ని విషయాల్లో నష్టపోయాక.. విలువైన డబ్బును, కాలాన్ని పోగొట్టుకున్నట్లు తెలుసుకుని కొంద రు బాధ పడుతుంటారు.
గంటల తరబడి టీవీ కార్యక్రమాలను చూడడంతో చాలామంది సృజనాత్మకను కోల్పోతున్నారు. కల్పనలతో కూడాన విషయాలపై మెదడు కేంద్రీకృతం కావడంతో వాస్తవ జీవితాన్ని కోల్పోతున్నారు. ఊహల్లో తేలిపోయేవారు నిజ జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే శక్తిని కోల్పోతున్నారు. టీవీ ప్రభావంతో విలాసవంతమైన వస్తువులనుకొంటూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.వినోదం, విజ్ఞానం అందించే టీవీ కార్యక్రమాల్ని పరిమితంగా చూస్తే తప్పేం లేదు. అయితే, అందుకోసం మనం విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని, మంచి అలవాట్లను, మానవ సంబంధాలను త్యాగం చేయనక్కర్లేదు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను, మంచి విలువలను దూరం చేసుకోనక్కర్లేదు.

Monday 16 April 2012

సూర్యుడి తోబుట్టువులు


  • నిర్వహణ: గోపాలం కెబి gopalvy@gmail.com
  • 16/04/2012
మన సూర్యుడిని ఒంటరి నక్షత్రం అంటుంటారు. సూర్యుడి కాంతి దగ్గరలోని మరో నక్షత్రానికి చేరడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. అలాగని సూర్యుడు మొదటి నుంచీ ఒంటరి నక్షత్రమేనా? సుమారు నాలుగున్నర బిలియన్ సంవత్సరాల నాడు ఈ సూర్యుడు దుమ్ము, వాయువులు కలిగిన ఒక మేఘం నుంచి పుట్టిన సంగతి తెలుసు. అదే సమయంలో ఆ పదార్థం నుంచి మరిన్ని నక్షత్రాలు కూడా పుట్టాయి. అవి సూర్యుడి తోబుట్టువులు. వీటన్నిటికీ పదార్థం అందించిన ఆ ధూళి మేఘం సమసిపోయింది. కానీ, అందులోనుంచి పుట్టిన నక్షత్రాలన్నీ పోలేదు. ఈ ఆలోచనకు ఆధారాలున్నాయి. సౌర మండలం పుట్టినప్పుడు కొంత పదార్థం అక్కడక్కడ చెదిరి మిగిలిపోయింది. వాటిలోని రసాయనాలను పరిశీలించిన తర్వాత, కొన్ని సంగతులను పరిశోధకులు చెప్పగలిగారు. సూర్యుడికి ఒక కాంతి సంవత్సరం కన్నా తక్కువ దూరంలోనే మరో నక్షత్రం పుట్టిందనీ, అది మరీ పెద్దది గనుక పేలిపోయిందనీ లెక్క తేలింది.
సూర్యుడి లాంటి కొలతలు, లక్షణాలున్న నక్షత్రాలన్నీ గుంపులుగానే ఉన్నాయని ఖగోళ పరిశోధకులు గమనించారు. వందల వేల సంఖ్యలో ఈ నక్షత్రాలు చెల్లా చెదురయినట్లు కూడా గమనించారు. అంగారక శిలలు, అంతరిక్ష శిలలలోని రసాయనాలను గమనించినప్పుడు మన సూర్యనక్షత్రం కూడా ఇలాంటి గుంపులో ఉండేదన్న సూచనలు కనబడుతున్నాయి. సూర్యుడు పుట్టిన ఆ గుంపులో కనీసం వెయ్యి నక్షత్రాలు ఉండి తీరాలని పరిశోధకుల అభిప్రాయం.
పాలపుంతలో కోటానుకోట్ల నక్షత్రాలున్నాయి. వాటిలో ఈ వెయ్యి నక్షత్రాలను వెదకడం సులభమయిన పని కాదు. అందునా నక్షత్రాల చరిత్ర మనుషుల చరిత్రలాగే విచిత్రంగా ఉంటుంది. నక్షత్రాల గుంపులు పుట్టి గెలాక్సీగా విస్తరిస్తాయి. అందులోని బలాల కారణంగా నక్షత్రాలు నాశనమయ్యేవీలుంది. నక్షత్రాలు పుట్టడానికి ఆధారమయిన దుమ్ము వాయువుల మేఘమే వాటికి మొదటి శత్రువు. ఈ మేఘాలు నక్షత్రాలకన్నా కోట్ల రెట్లు ఎక్కువ పదార్థం గలవి. వాటికి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కొత్త నక్షత్రాలు మరీ దూరాలకు విసిరివేయబడతాయి. ఈలోగా రకరకాల ప్రభావాలకు గురై కొన్ని నక్షత్రాలు వెంటనే పేలిపోతాయి కూడా. పుట్టిన కొత్త నక్షత్రాలు ఒక గుంపుగా ఉండటానికి వాటి మధ్య గల గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఆధారం. పేలిన నక్షత్రంలోని పదార్థం చుట్టూ చిమ్మినపుడు ఈ శక్తికి తెరలాగ అడ్డువస్తుంది. అంటే నక్షత్రాలు గుంపుగా ఉండక చెదిరిపోతాయి. ఇక వాటి మీద గెలాక్సీలోని శక్తులు పనిచేస్తాయి. మిగతా నక్షత్రాల ఆకర్షణ పనిచేస్తుంది. మొత్తానికి గుంపులోని నక్షత్రాలు చెదిరిపోతాయి. రకరకాల కారణంగా కుటుంబంలోని వారంతా చెదిరిపోయిన ‘సినిమా’ జీవితకథలాంటి పరిస్థితి ఇది!
సినిమాలో కుటుంబం ఏదో ఒక రకంగా, తిరిగి కలిసినట్లు చూపిస్తారు. సూర్యుడి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తిరిగి దగ్గరకు రాకపోవచ్చు. కానీ, అవన్నీ దగ్గరలోనే ఎక్కడో ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో పరిశోధకులు సూర్యుడి చుట్టాల గురించి లెక్కలు వేశారు. సుమారు 330 కాంతి సంవత్సరాల దూరంలో, అలనాడు సూర్యుడితోబాటు పుట్టిన నక్షత్రాలు ఉండి తీరాలని వారు లెక్క చెపుతున్నారు. సూర్యుడంత నక్షత్రం అంతదూరంలో ఉంటే, బైనాక్యులర్స్‌లో నుంచి చూడవచ్చు. కానీ ఈ లెక్కను అందరూ ఒప్పుకోవడం లేదు. నక్షత్రాలు చెదిరి ఒకదాని నుంచి మరొకటి దూరం పోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని, ఈ 330 కాంతి సంవత్సరాలు లెక్క, ఆ బలాల ముందు నిలబడదనీ అంటారు మరికొందరు పరిశోధకులు. ఉంటే, ఏవో కొన్ని నక్షత్రాలు మాత్రమే ఆ దూరంలో ఉండవచ్చునని వారి లెక్కలు చెపుతున్నాయట.
ఎన్ని నక్షత్రాలు, ఎంత దగ్గరలో ఉన్నాయన్న లెక్కలు సాగుతుండగానే, మరికొందరు వాటి కొరకు వెదకులాట మొదలుపెట్టారు. అందుకోసం హెర్మెస్ అనే ప్రత్యేక పరికరాన్ని కూడా తయారుచేయించారు. న్యూసౌత్‌వేల్స్‌లో కువాబరాబ్రాన్ అనే చోట, ఇంగ్లీషువారు, ఆస్ట్రేలియనులు కలిసి స్థాపించిన సైడింగ్ స్ప్రింగ్ నక్షత్ర పరిశోధనశాలలో ఆ పరికరాన్ని టెలిస్కోప్‌కు సాయంగా కలిపారు. ఇరవయివేల కాంతి నక్షత్రాల దూరం లోపలగల నక్షత్రాలను టెలిస్కోపులు ఊరికే చూస్తుంటాయి. హెర్మెస్ మాత్రం వాటిలోని రసాయనాల తీరుతెన్నులను కూడా గమనిస్తుంది. మన చుట్టాలను మరో దేశంలో వెతకాలంటే భాష, సంస్కృతి ఆధారంగా వెదికినట్లు ఉంటుంది ఈ అనే్వషణ.
కనిపించిన ప్రతి నక్షత్రంలోనూ ఇరవయి అయిదు రకాల రసాయనాల తీరును గురించి ఈ పరికరం వివరాలను గమనిస్తుంది. వాటి ఆధారంగా నక్షత్రం పుట్టుక రహస్యాలు అర్థమవుతాయి. ఇదే దారిలో సూర్యుడిని పోలిన రసాయనాలున్న నక్షత్రాలు కనబడితే, అవి తప్పకుండా సూర్యుడి తోబుట్టువులుగా గుర్తింపబడతాయి. పది సంవత్సరాలపాటు కష్టపడితే, మనం వెతుకుతున్న రకం చుక్కల హద్దులు తెలిసే వీలు ఉండవచ్చునంటారు పరిశోధకులు. అక్కడితో కథ ముగిస్తే బాగానే ఉంటుంది. నక్షత్రాలు ఎంతగా విసిరివేయబడినా, వాటి కదలికలో కూడా సూర్యుడికి పోలికలు ఉంటాయి. నక్షత్రాల దారులను గమనించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీవారు వచ్చే సంవత్సరం గైయా అనే అంతరిక్ష నౌకను పంపుతున్నారు. అది తీసిన కదలికల కొలతలకు, హెర్మెస్ రసాయనాలు కొలతలకు పొంతన కుదరాలి. రెండు పరీక్షలలో నిలిచినవి, గెలిచినవీ మాత్రమే సూర్యుడితో సహా పుట్టిన నక్షత్రాలు అనిపించుకుంటాయి.
ఈలోగా సూర్యుని చుట్టాల కొరకు మాత్రమే కాక, మొత్తంమీద లక్ష నక్షత్రాలను గమనించి, రసాయన సమాచారాన్ని కూడా సేకరించే మరో పరిశోధన న్యూమెక్సికోలో మొదలుకానుంది. అందులో అనుకోకుండా ‘మన’ సూర్యుడు లాంటి, ‘మన’ నక్షత్రాలు తగలవచ్చు. ఈ పరీక్షలో నక్షత్రాల వయసులను కూడా అంచనా వేయనున్నారు. సూర్యుడిలాంటి రసాయనాలు, కదలికలతోబాటు, అదే వయసున్న నక్షత్రాలు కనబడితే అవి తప్పకుండా ‘మన’ నక్షత్రాలే అనక తప్పదు. వాటిని కనుగొన్నందుకు ఏం దక్కుతుందని ఎవరికయినా అనుమానం రావచ్చు. ముందు సూర్యుడు, సౌరమండలం ఏర్పడిన తీరు మరింత అర్థమవుతుంది. ఆయా నక్షత్రాల గ్రహాల మీద, జీవం ఉండే వీలు కూడా ఎక్కువగా ఉంటుంది.
మొత్తానికి ఇదంతా మనలాంటి వారి గురించి వెదుకులాటలో భాగమా?

మన ఉపగ్రహ ప్రస్థానం


భారతదేశపు మొదటి స్పేస్ శాటిలైట్ ఆర్యభట్ట 1975, ఏప్రిల్ 19న ప్రయోగింపబడింది.
భూమిని పరిశీలించడానికి నిర్మించిన భాస్కర ఉపగ్రహాన్ని 1979, జూన్ ఏడున ప్రయోగించారు.
1980, జూలై 18న భారతదేశం తన ఉపగ్రహాన్ని తానే ప్రయోగించింది. శ్రీహరికోట రాకేట్ కేంద్రం నుంచి శాటిలైట్ లాంచ్ వియకిల్ అనే రాకెట్ మీద రోహిణి - 1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
ఆ తరువాత అంతరిక్ష ఉపగ్రహాల రంగంలో మన దేశం ఎంతో ప్రగతి సాధించింది. వేరు వేరు ఉపయోగాల కొరకు రకరకాల ఉపగ్రహాలను ప్రయోగించింది. రిమోట్ సెన్సింగ్, సమాచార ప్రసార రంగాలలో ప్రగతి ఉపగ్రహాల వల్లనే వీలయింది.
1985 చివరి నాటికి రోహిణి - 3 ఉపగ్రహం ఆధారంగా దేశంలో 70 శాతం జనాభాకు టీవీ అందుబాటులోకి వచ్చింది.
ఎఎస్‌ఎల్‌వీ, జిఎస్‌ఎల్‌వీ, పిఎస్‌ఎల్‌వీ లాంటి లాంచ్ రాకెట్లను మన దేశంలోనే నిర్మించారు.
ఇన్‌సాట్ క్రమంలో వచ్చిన ఉపగ్రహాలు సమాచార రంగాన్ని పూర్తిగా మార్చివేశాయి.
2003 సంవత్సరంలో ఇన్‌సాట్ - 3 ఏ ప్రయోగింపబడింది. ఈ ఉపగ్రహాన్ని నిర్మించింది మన దేశంలోనే అయినా, ఇన్సాట్ ఉపగ్రహాలన్నీ ఫ్రాన్స్ నుంచి అంతరిక్షంలోకి చేరుకున్నాయి.
2007 మార్చి 12న ఇన్సాట్ క్రమంలోని 4 - బి ప్రయోగింపబడింది. ఇది త్రీ-ఏతో కలిసి పనిచేస్తున్నది.

Sunday 15 April 2012

కందుకూరి వైజ్ఞానిక గోదావరి

తెలుగు ప్రజల ముద్దుబిడ్డ కందుకూరి
మురిపెముంతో కన్నదమ్మా గోదావరీ
మూఢత్వం మూర్ఖత్వం ఎదిరించిన సాహసి
విజ్ఞానం వికాసం అందించిన సమరశీలి
 
జాతకాలు, చేతబడులు బలహీనుల నమ్మకం
నమ్మకాల వ్యాపారం మౌఢ్యస్తుల పన్నాగం
అంధవిశ్వాసాలు ప్రగతికడ్డు అన్నావు,
కపట నాటకాల వారి గుట్టు బయట పెట్టావు.
 
పసివాళ్లకి పెళ్ళిళ్లు వితంతువులకు బొడిగుళ్లు
సామాజిక దురాచారం నాగరికతకవమానం
చదువు సంధ్యలున్న స్త్రీలు మనగౌరవమన్నావు
హితకారిణి సమాజాన్ని అమ్మవై సాకావు
 
చిరిగిన చొక్కానయినా తొడుక్కోమ్మని
ఒక మంచి పుస్తకం మాత్రం కొనుకోమ్మని
సైన్సు పుస్తకాలు మాస పత్రికలతో
దురాచార జగతికి దుమ్ము వదలగొట్టావు
 
విజ్ఞానం సమన్యాయం కందుకూరి కళ్ళు
శాస్త్రీయ దృష్టినిచ్చి కడిగావు కుళ్ళు
నీ మాటను నీ బాటను మేము అనుసరిస్తాము
విజ్ఞానపు వెలుగును లోకమంత పంచుతాము.
 
- డాక్టర్‌ చల్లా రవికుమార్‌,
9440507775

సూర్యుడి చుట్టూ కక్ష్యలు


  • -కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ rohiniprasadk@gmail.com
  • 14/04/2012
సూర్యుడి చుట్టూ అన్నిటికన్నా దగ్గరగా ప్రదక్షిణలు చేసేవి మొదట బుధుడు, తరువాత శుక్రుడు. ఆ తరువాతిది భూమి కాగా అంతకన్నా ఎక్కువ దూరాన తిరిగేది కుజుడు. పటంలో చూపినట్టుగా భూమి, కుజుడు ఎదురెదురుగా వచ్చినప్పుడే సూర్యకాంతి కుజుడిమీద బాగా ప్రతిఫలించి అది మనకు బాగా కనపడుతుందని తెలుస్తుంది. ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో సూర్యుడు పశ్చిమాన అస్తమించిన కాసేపటికి తూర్పున ఎర్రగా వెలిగే కుజగ్రహాన్ని ఎవరైనా చూడవచ్చు.
ఆకాశంలో వెలిగే తారలనూ, గ్రహాలనూ మనుషులు ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మానవజాతి చరిత్ర చాలా ప్రాచీనమైనది. మొదట్లో అనాగరిక పద్ధతిలో జీవిస్తూ, రాత్రిళ్లు గుహల్లోనూ, కోనల్లోనూ తల దాచుకున్న తొలిమానవులు అప్పుడప్పుడూ ఆకాశంలో మిలమిల మెరిసే తారలను ఆశ్చర్యంతో పరికిస్తూ ఉండేవారు. పశ్చిమ యూ రప్‌లో దొరికిన 32 వేల ఏళ్ల నాటి ఒక కేలండర్ చూస్తే అప్పటివారు చంద్రుడి కళలు రోజువారీ పద్ధతిలో ఎలా మారుతూ ఉంటాయో గమనించారని అర్ధమవుతుంది. ఎంతో పరిశీలన జరిగితేకాని ఇటువంటి వివరాలు నమోదు కావు. కాలక్రమాన మన దేశంలోనూ, పశ్చిమాసియాలోనూ ఆ తరువాత యూరప్‌లోనూ నక్షత్ర పరిశీలన మెరుగుపడింది. భూమే అన్నిటికీ కేంద్రమనీ, సూర్యచంద్రులు, నక్షత్రాలూ అన్నీ దాని చుట్టూ తిరుగుతాయనీ అనుకునే రోజులు 15వ శతాబ్దంలో కోపర్నికస్ ప్రతిపాదనల తరవాత కొనసాగలేదు.
కోపర్నికస్ నిర్వహించిన సౌర వ్యవస్థ
కుజగ్రహం ప్రత్యేకత ఏమిటంటే అది చాలావరకూ భూమిని పోలిన గ్రహమే. కొద్దిపాటి మార్పులు చేస్తే అది మనుషులకు నివాస యోగ్యం కావచ్చునని శాస్తవ్రేత్తలు ఆశిస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు జరిగాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

Friday 13 April 2012

మళ్లీ వేసవి వచ్చేసింది


ఎండలు మండిపోతున్నాయి! నోటి తడారిపోతుంది. గొంతు దాహం దాహం అంటూ గోలచేస్తోంది. చెమట చిర్రెత్తిస్తోంది. ఎందుకంటే, వేసవి మళ్లీ విజృంభిస్తోంది. మరి ఈ బాధలకు దూరం కావాలంటే ఏం చేయాలి?! ఏం చేయాలంటే...
మంచినీరు ఎక్కువగా తాగాలి. వడదెబ్బ తగలకుండా, డీహైడ్రేషన్‌నుండి తప్పించుకోడానికి ఇదే సరైన మార్గం.
నీరు ఎక్కువగా ఉండే తాజా పుచ్చకాయ, ద్రాక్ష వంటి పళ్లు తింటే నిస్సత్తువ దగ్గరకే రాదు.
వేసవిలో చెమటబారిన పడిన జుట్టు సులువుగా చిట్లిపోయే అవకాశాలెక్కువ. జుట్టు పొడిబారకుండా కొబ్బరినూనె రాయాలి.
ఈకాలంలో పిల్లలకు సెలవులు. కనుక కొందరు స్విమ్మింగ్‌ నేర్పుతుంటారు. నీటిలోని క్లోరిన్‌ జట్టును ప్రభావితం చేస్తుంది. కనుక రక్షణ పద్ధతులు పాటించడం అవసరం.
ఈకాలంలో చర్మం ట్యాన్‌ అవడం సర్వసాధారణం. ఇందుకు అతినీలలోహిత కిరణాలు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కొందరికి చర్మం బొబ్బలెక్కడం, కమలడం, కొందరికి పేలుతుంది కూడా! వీలైనంత వరకూ ఎండలో తిరగకూడదు. తప్పనిసరిగా వెళ్లాలంటే సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. గొడుగు లేదా స్కార్ఫ్‌, క్యాప్‌ తప్పనిసరిగా వాడాలి.
ఎలోవేరా(కలబంద)రసం కమిలిన గాయాన్ని మాన్పుతుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కనుక రోజూ ముఖానికి, చేతులకు కొద్దిగా ఎలోవేరా రసం రాసుకుని ఆరాక కడుక్కోవాలి.
నూనెపదార్థాలకు వేసవిలో దూరంగా ఉండటమే బెటర్‌! నిజానికి ఏ సీజనైనా ఈ జాగ్రత్త మంచే చేస్తుంది.
నిమ్మరసం, మజ్జిగ, రాగిజావలాంటి ద్రవపదార్థాలు ఈకాలంలో నీరసాన్ని దరిచేరనీయవు. ముఖ్యంగా బయటకు వెళ్లే ముందు ఇవి తాగివెళ్తే నిస్సత్తువ రాదు.
పెరుగులో కొద్దిగా సెనగపిండి కలిపి మెడకు, చేతులకు, ముఖానికి రాసుకుని ఆరాక కడిగితే చర్మం తేటపడుతుంది. మృతకణాలన్నీ తొలగిపోతాయి.
శరీరం అసహనానికి గురికాకుండా తేలికపాటి దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే లేత రంగుల దుస్తులు ధరిస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
వేసవి సాయంత్రాలు కీరా లేక బంగాళాదుంప చక్రాలను కంటిపై ఉంచితే అలసట పోతుంది.
తాజా పోషకాహారం, కనీస జాగ్రత్తలు తీసుకుంటే చాలు... మరుమల్లెల సుగంధాలు, మామిడి పండ్ల మధుర రుచులూ, కొత్త ఆవకాయ తాలూకు కమ్మదనాలు ... వీటన్నింటినీ హాయి గా ఆస్వాదించొచ్చు. అప్పుడు మనకు వేసవి కాలం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో అస్సలు తెలీదు. అంతేనంటారా.?!

Wednesday 11 April 2012

బాలల నేస్తం 1098 చైల్డ్‌లైన్‌


హాలో... ఇక్కడ ఒక బాలుడు ప్రమాదంలో ఉన్నారండీ...
హాలో... తమ బాలుడు తప్పిపోయాడండీ..
హాలో... ఇక్కడ ఒక అనాథ బాలుడు తిరుగుతున్నారండీ...
ఈ సమాచారం అందుకున్న గంటలోనే ఒక బృందం అక్కడకు వస్తుంది. బాలలకు అవసరమైన సహాయాన్ని, పునరావాసాన్ని కల్పిస్తోంది... అదే చైల్డ్‌లైన్‌. ఒక ఉచిత ఫోన్‌ కాల్‌తో ఇన్నిసేవలందిస్తున్న ఛైల్డ్‌లైన్‌ గురించి తెలసుకుందాం. ఆపదలో ఉన్న బాలబాలికల సమాచారాన్ని అందించే బాధ్యతను తీసుకుందాం.
ఛైల్డ్‌లైన్‌ అంటే...
బాలబాలికల హక్కులు పరిరక్షణ, వారి సంక్షేమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ చైల్డ్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వశాఖలు, స్వచ్చంధ సంస్థల సహకారంతో ఇది నడుస్తోంది. 1098 టోల్‌ఫ్రీ నెంబర్‌ను కేటాయించింది. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అనుమతి ఉన్న స్చచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఉంటుంది. బాలబాలికలు ఎక్కడైనా ప్రమాదానికి గురైన, తప్పిపోయిన, అనాథగా తిరుగుతున్నా, బాలకార్మికుడైనా, మానసిక వ్యాధితో బాదపడుతున్న, బాల్య వివాహాలు జరిగినా... ఇలాంటి సమాచారాన్ని ఈ నెంబరుకు తెలియజేయాలి. వెంటనే నియమించబడిన స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు, ఆయా సంఘటనలతో సంబంధమున్న ప్రభుత్వశాఖల అధికారులతో ఒక బృందం అక్కడకు వస్తుంది.
ఆ తర్వాత ఏం చేస్తారు..!
అనాథ బాలుడు అయితే వెంటనే ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న స్వచ్చంధ సంస్థలో పునరావాసం కల్పిస్తారు. మానిసిక సమస్యతో బాధపడుతున్న బాలుడు అయితే మనో వికాస కేంద్రాల్లో చేర్పిస్తారు. వీరికి విద్యనందిస్తారు. వైద్యం అవసరమైతే అందుకు తగిన చర్యలు తీసుకుంటారు. బాల్య వివాహం అయితే పెళ్లి జంటకు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనార్థాలను వివరిస్తారు. అప్పటికే వినకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తప్పిపోయిన బాలుడు గురించి చైల్డ్‌లైన్‌ వెబ్‌సైట్‌లో పెడతారు. ఆయా ప్రాంతాల్లో తమ సంస్థ ప్రతినిధుల ద్వారా వారిని వెతికే ప్రయత్నం చేయిస్తారు.
బాధ్యతలు నిర్వహించేదెవరు..!
ఈ బాధ్యతలన్నింటినీ నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులతో పాటు కొన్ని స్చచ్చంధ సంస్థలను ఎంపిక చేశారు. ఛైల్డ్‌లైన్‌ 1098ను జిల్లా కేంద్రంలోని బెజ్జిపురం యూత్‌ క్లబ్‌లో ఉంది. నోడల్‌ ఏజెన్సీగా బ్రెడ్స్‌ స్వచ్చంధ సంస్థను నియమించారు. బూర్జ మండలం పెద్దపేట, పాతపట్నం మండలం కేంద్రంలో ఆర్ట్స్‌ స్వచ్చంధ సంస్థ, పలాస, ఇచ్చాపురంలో గెస్ట్‌ స్వచ్చంధ సంస్థలను సబ్‌సెంటర్లుగా ఎంపిక చేశారు. వీరితో పాటు ఐసిడిఎస్‌, వైద్యాఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ తదితరశాఖల అనుసంధానంతో ఇవి పనిచేస్తాయి.
ఇప్పటి వరకూ చేసిన సాయం
గత ఏడాది అక్టోబర్‌లో జిల్లాలో అధికారికంగా ఛైల్డ్‌లైన్‌ ప్రారంభమయింది. 1020 ఫోన్‌కాల్స్‌ సమాచారం అందుకున్నారు. 15 మంది బాలబార్మికులను గుర్తించి, వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాలలో చేర్పించారు. తప్పిపోయిన ఏడుగురు చిన్నారులను బంధువులకు అప్పగించారు. 21 మంది యాచక బాలలకు పునరావాసం కల్పించారు. 23 మంది బడిమానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేరేలా చేశారు. ఆమదావలస, లావేరు మండలాల్లో మూడు బాల్యవివాహాలను నిలుపుదల చేశారు.
జిల్లా బాలల సంక్షేమ కమిటీ
బాలల సాధారణ కేసులను విచారించేందుకు బాలల సంక్షేమ జిల్లా కమిటీ(సిడబ్ల్యుసి) ఉంటుంది. కమిటీకి మెజిస్ట్రేట్‌ హోదా ఉంటుంది. వీరికి విచారించే అధికారం ఉంటుంది. ఇటీవల ఆమదావలస మండలం పంతులపేటలో బాల్యవివాహానికి సిద్ధపడిన తల్లిదండ్రును విచారించారు. 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసుకోవాలని తీర్పునిచ్చారు. దీనిని ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష రూపాయలను జరిమానా విధించే అధికారం కమిటీకి ఉంటుంది.

భూమి, విశ్వం ఎలా పుట్టాయి?


  • ఎందుకని? ఇందుకని!
భూమి ఎలా పుట్టింది? అంతకన్నా ముందు ఈ విశ్వం ఎలా పుట్టింది? ఈ విషయాలను సంక్షిప్తంగా తెలియజేయగలరని మనవి.
- ఓ ఔత్సాహిక జనవిజ్ఞాన వేదిక నాయకుడు, హైదరాబాద్‌
తన తల్లిదండ్రులెవరో తెలీనివ్యక్తికి వారి గురించి తెలుసు కోవాలన్న ఉద్వేగభరితమైన కుతూహలం ఎలాగో మన విశ్వం గురించిన ఆసక్తీ మనందరికీ అలాగే ఉండటం సహజమే!
విశ్వావిర్భావం గురించి పలు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నా శాస్త్రీయ నిర్ధారణకు అనుకూలమైన సిద్ధాంతం 'హరాత్మక విశ్వ నమూనా (Model of Oscillating Universe)'. ఆ తర్వాత చెప్పకోదగింది 'మహా విస్ఫోటన సిద్ధాంతం (Big Bang Theory)', 'నిశ్చల గమనస్థితి నమూనా సిద్ధాంతం (Steady State Theory)' కూడా ప్రచారంలో ఉంది. ఈ మూడు సిద్ధాంతాల్లో అటూయిటూగా శాస్త్రీయత ఇమిడి ఉంది. అయితే హరాత్మక చలన సిద్ధాంతానికి ఎక్కువ అవకాశం, సైద్ధాంతిక పునాది ఉన్నాయి. ఎందుకంటే ఈ నమూనా ద్వారా మిగిలిన రెండు నమూనాలను కూడా అంతర్లీనమైనవిగా చూప గలం. అయితే అత్యంత అశాస్త్రీయమైందీ, పాలకవర్గాలకు, ఛాందసులకు బాగా నచ్చిందీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల స్థాయిలో బోధించబడుతున్న సిద్ధాంతం ఒకటి ఉంది. దాదాపు అన్ని మతాల్లోనూ సర్వసాధారణంగా ఉండేది, వాదించేది దీన్నే. దీనిపేరు 'విజ్ఞ నిర్మిత సిద్ధాంతం (Intelli-gent Design Theory)'. ఎవరో ఓ సృష్టికర్త (Creator) ఈ విశ్వాన్ని తన తెలివితేటలతో రూపొందించాడని ఈ సిద్ధాంతం చెబుతుంది. 'ఆ తెలివితేటలున్న వ్యక్తి లేదా శక్తిని ఎవరు సృష్టించారు' అన్న ప్రశ్నను ఈ సిద్ధాంతం దాట వేస్తుంది. ఇది పురాణగ్రంథాలకు అనుకూలంగా ఉండడంతో మతవాదు లు ఎక్కువమంది దీన్ని సమర్థిస్తారు. కానీ ఈ సిద్ధాంతానికి ఆవ గింజంతా ఆధారాలు లేవు. నమ్మకం, విశ్వాసం తప్ప శాస్త్రీయ ఆధారాలు ఏమీలేని ఈ సిద్ధాంతాన్ని పక్కన పెడదాం.
నిశ్చలస్థితి గమన సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వాన్ని ఈ రూపంలో ఉంచేందుకు కొన్ని పదార్థాలు మారుతూ ప్రయత్నిస్తుండగా విశ్వం లో మరికొంత భాగం మరో రూపం లోకి మారుతూ ప్రస్తుత విశ్వాన్ని నిలకడ (steady state) గా ఉంచుతున్నాయి. ఉదాహరణకు సముద్రంలో నీరు ఎప్పుడూ ఆవిరవుతూ మేఘాలుగా మారి, వర్షిస్తూ నదుల్ని నీటితో నింపి నదీ ప్రవాహానికి అవకాశమిస్తోంది. ఆ నదిలో పారే నీరు చివరికి సముద్రంలో కలుస్తోంది. ఈ చక్రీయ చలనాన్ని అవిచ్ఛన్నంగా ఊహించండి. ఇపుడు ఆ నదినే మనం చూస్తున్న విశ్వంగా భావించాలి. నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నేటి నీరు, ఓ గంట కింద నీరు ఒకటే కాదు. కానీ నేటి నీటి గమన విధానం ఓ గంట కిందటి నీటి గమన విధానం ఒకటే. ఈ నీటికి ఆధా రంగా మేఘాలు వర్షిస్తున్నాయి. ఈ మేఘాల్ని సముద్రంలోని నీరు సూర్యశక్తితో సమకూరుస్తోంది. అయితే ఇలా చక్రీయంగా కాకుండా కదులుతున్న చక్రం(Spiral) గానో లేదా నడుస్తున్న బండిచక్రంగానో విశ్వాన్ని భావించాలిగానీ నిలకడగా ఒకేచోట చక్రీయంగా కుమ్మరి సారి చక్రంలాగానో, పంటపొలాల్లో ఊట బావి మోటారు చక్రంగానో భావించకూడదన్నది ఈ సిద్ధాంత సారం. విశ్వంలో ప్రస్ఫుటంగా ఉన్న కొన్ని సార్వత్రిక నియమాల (Laws of Universe) కు ఇది విరుద్ధంగాలేదు. ఉదాహర ణకు విశ్వంలో శక్తి, ద్రవ్యరాశి కలగలిపి స్థిరంగా (Law of Conservation of Mass and Energy) ఉన్నాయి అన్న సిద్ధాంతాన్ని ఇది ఉల్లంఘించదు. 'ఈ విశ్వంలో మారనిది అంటూ ఏదీలేదు (Everything in the Universe Changes)' అన్న మరో నియమాన్ని కూడా ఇది వ్యతిరేకిం చదు. 'ఈ విశ్వం వ్యాకోచిస్తోంది (Universe is Expand-ing)' అన్న మరో వాస్తవాన్ని ఇది కాదనదు. పెరిగే వర్తులాకార చక్రంలాగా ఈ విశ్వ నిశ్చలస్థితి గమనం ఉందని ఇది ఒప్పు కుంటుంది. 'శంఖాకారంలో ఉన్న నత్తగుల్లలో ఓ మధ్యభాగంలో మనం ఉన్నామనుకుంటే దానికి కింద ఉన్న (పూర్వపు) వర్తుల పరిధి(spiral perimeter) నేటి వర్తుల పరిధి కన్నా తక్కువ ఉంటుంది. దానికి పైనున్న (రేపటి) వర్తుల పరిధి మరింత విస్తా రంగా ఉంటుంది. అలాగన్నమాట. ఇలా చక్రీయ వర్తుల గమ నంలో, నిశ్చలస్థితి గమనంలో ఉన్న వ్యవస్థలో ఎంట్రోపీ(entropy) లేదా క్రమరాహిత్యం (disorder) క్రమేపీ పెరుగుతుందనేది మరో ప్రకృతి సూత్రం. దానిని కూడా ఈ విశ్వ సిద్ధాంతం ఆక్షేపణ చేయదు. అయితే ఈ సిద్ధాంతానికి పరాకాష్ట ఏమిటంటే ఎప్పుడోకప్పుడు ఈ విశ్వంలో ఏమీలేని స్థితి ఉండేదని పిస్తుంది. ఆ విధమైన అగమ్య స్థితికి తోడుగా నేటి వాస్తవ విశ్వ రూపానికి వయసెంతో చెప్పలేని పరిస్థితీ ఈ సిద్ధాంతంలో ఉన్న ఓ పరిమితి. అందువల్ల దీన్ని అంతగా స్వీకరించలేదు.
ఇక మహా విస్ఫోటన సిద్ధాంతం గురించి. సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో కేవలం శక్తి మాత్రమే ఉండేదని, ద్రవ్యరాశి రూపంలో ఉండే పదార్థమేదీ లేదని ఈ సిద్ధాంతం చెబుతుంది. శక్తికి స్థలమవసరం లేదు కాబట్టి అపుడు విశ్వంలో పొడవు, వెడల్పు, ఎత్తు అని కొలవగలిగే ప్రాంతమేదీ లేని శూన్య ప్రదేశం (zero space) ఉండేదని ఈ సిద్ధాంతం ప్రస్తావిస్తుంది. పదార్థాలలో కలిగే మార్పుల అంతరమే కాలం కాబట్టి పదార్థమే లేని ఆ శూన్యస్థితిలో కాలం కూడా శూన్యమే (zero time). ఒక్క ఫళాన ఆ శక్తి పదార్థంగా అవతరించిందని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. శక్తి పదార్థంగా మారిన ఆ సంఘటననే మహా విస్ఫోటనం అంటున్నారు. ఆ విస్ఫోటనంలో ఏర్పడిన పదార్థం నెబ్యులా అనబడే మేఘాల ముక్కలుగా మొదట ఏర్పడి ఆ తర్వాత క్రమేపీ కణాలు (particles) గా మారిందంటారు. ఆ సందర్భంగా విడుదలైన కాంతిశక్తి విశ్వం మొత్తం సమానంగా వ్యాపించిందని, దాని ఆనవాళ్లు నేటికీ K- రేడియేషన్‌ పేరుతో ఉన్నట్టు పెంజియాస్‌, విల్సన్‌ అనే ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలు ఋజువు చేశారు. వారిద్దరికీ 1978 సంవత్సరపు భౌతికశాస్త్ర నోబెల్‌ బహుమతిని కూడా బహూకరించారు. మరి విజ్ఞ నిర్మిత సిద్ధాంతాన్ని అదే పనిగా పట్టుకుని వేళ్లాడితే ప్రజలు నమ్మరన్న నమ్మకంతో ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం మతవాదనకు (అంతకుముందు ఏమీలేనట్టు, ఒక్కసారిగా ఉన్నఫళాన దభీమని విశ్వం పుట్టినట్టు) అంతో యింతో దగ్గరగా ఉన్నట్టు అనిపించడం వల్ల ఎక్కువమంది మతవాద శాస్త్రవేత్తలు, శాస్త్రం పేరుతో మతాన్ని బలపర్చే వారికి 'మహా విస్ఫోటన సిద్ధాంతం' మహా విజయ వంతమైన సిద్ధాంతంగా స్ఫురిస్తోంది. కానీ శక్తి ఎపుడూ పదార్థానికి అవతల ఉండదని ఆధునిక క్వాంటం సిద్ధాంతం ఋజువు చేసింది. పదార్థంలో శక్తి (wave), కణతత్వం(particle) జంటగా ఒకే నాణేనికి రెండు పార్శ్వాలుగా ఉంటా యన్నది దాని వాదన. ఓ వైపు అన్ని వాదాలలో ఉన్న ఋజువుల్ని ఆమోదిస్తూనే తార్కికతకు నిలిచేలా విశ్వ పరిణామాన్ని విశదీకరించే సిద్ధాంతం హరాత్మక చలన సిద్ధాంతం. ఆ వివరాలు పై వారం తెలుసుకుందాం.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక