Thursday 5 April 2012

ఉపవాసం రోజు తలకు నూనె రాయొద్దా?


  • అశాస్త్రీయ ఆచారాలు3
'కాంతారావు తాతా! ఉపవాసం చేసే రోజుల్లో తలకు నూనె రాసుకోకూడదా?' పక్కింటి పాప రమ్య అడిగింది. రమ్య ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.
'ఎవరు చెప్పారమ్మా?' అడిగాను నేను.
'తాళపత్రం' అనే ఈ పుస్తకంలో ఉంది తాతా!'
'కారణం ఏం చెప్పారమ్మా?'
'తలకు నూనె అంటుకోవడం వల్ల తల చుట్టూ ఓ తేజో వలయం ఏర్పడుతుందట. ఈ వలయం ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రవేశించే అయస్కాంత తరంగాలను నిరోధిస్తుందట. తలపై రాసిన నూనె ఈ శక్తి తరంగాలను మనలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఇలాంటి నిషేధాన్ని ఉపవాసముండే రోజుల్లో మన పెద్దల ఏర్పాటు చేశారట. ఎందుకంటే మన శరీరానికి ఇతర గ్రహాల మరియు నక్షత్రాల నుండి భూమిపైకి ప్రసరించే అయస్కాంత తరంగాల అవసరం ఉంటుంది కాబట్టి' అన్నది రమ్య.
'చూడమ్మా రమ్యా! ఈ మధ్య సైన్సు పదాలను ఉపయోగించి అసంబద్ధమైన వివరణలు ఇవ్వడం, ఆచారాలని సమర్థించడం ఎక్కువైపోయిందని నాసా శాస్త్రజ్ఞులతో సహా, శాస్త్రవేత్తలు ఎంతోమంది అంటున్నారమ్మా! అలాంటి అసంబద్ధమైన వివరణలతో కూడినదే ఈ విషయం. తలచుట్టూ నూనె అంటుకోవడం వల్ల తలచుట్టూ ఓ తేజో వలయం ఏర్పడుతుందనిగానీ, అది ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రసరించే అయస్కాంత తరంగాలను నిరోధిస్తుందని కానీ, అసలలాంటి తరంగాలు ఉంటాయనిగానీ, ఏ సైన్సు గ్రంథంలోనూ చెప్పలేదు. ఆ తరంగాలు తలకు నూనెరాయని రోజుల్లో శరీరంలోకి ప్రవేశిస్తాయట. ఆ తరంగాలు మన శరీరానికవసరమట. అవి మన శరీరానికంత అవసరమైతే, సంవత్సరంలో ఏ ఒకటి, రెండురోజుల్లోనో వాటిని మన శరీరం గ్రహించే ఏర్పాటు చేయడమేమిటి? సంవత్సరమంతా తలకు నూనె రాసుకోవద్దని చెప్పవచ్చుగా? ఇలా సైన్సు పదాలను వాడి మనలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారమ్మా! అర్థంచేసుకో' అన్నాను నేను.
'అవును తాతా! ఇతర గ్రహాల నుండి ఏవైనా అయస్కాంత తరంగాలు వస్తూ ఉంటే, అవి మనకవసరమైతే రోజూ తలకు నూనె రాసుకోవద్దని చెప్పవచ్చుగా? ఎప్పుడో, ఏ కార్తీక సోమవారం నాడో మాత్రమే తలకు నూనె రాసుకోవద్దనడం దేనికి? ఇదంతా సైన్సు పేరును దురపయోగపరుస్తూ చేసే మభ్య ప్రచారమే!' అంది రమ్య.
'అవునమ్మా! బాగా అర్థంచేసుకున్నావు నీవు!' అన్నాను నేను మెచ్చుకోలుగా.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment