Monday, 2 April 2012

'సహజ' ఆహారం

డా|| కాకర్లమూడి విజరు   Fri, 30 Mar 2012,

''అబ్బ...ఏం తిండి ఇది. ఒక రుచీ పచీ ఏం లేదు''
***
''అసలు కూరగాయలు నేలమీదే పండుతున్నాయా?''
***
''ఇదివరలో కరివేపాకు చెట్టు అల్లంత దూరాన వుందనగానే గాలివాటుకి సైతం కమ్మని వాసన వచ్చేది. ఇవాళ రెమ్మ ముక్కు దగ్గర పెట్టుకున్నా వాసన తెలీడంలా!''
***
''కొత్తిమీర కూడా అంతేగా! ఊరకే బారెడు పొడవుంటుందేగానీ వాసనా పాడా?''
''గోంగూరలో పులుపే మాయమైనట్టుంది. చింతపండు పెట్టుకొని వండుకోవాల్సి వస్తోంది. అయినా ఒక్క గోంగూర ఏం ఖర్మలే. అన్ని ఆకుకూరల పరిస్థితీ ఇంతేగా''
***
''కూరగాయలు తరుగుతుంటే వాసనా పాడూ ఏం వుండదు.. ఇంక కూర కమ్మగా వుండమంటే ఏం వుంటుంది?''
***
పట్నపు వంటిళ్లలోనో... కూరగాయల మార్కెట్లోనో ... తరచూ వినిపించే మాటలివి. నిజమే! కరివేపాకుకు ఆ కమ్మటి వాసనేది? గోంగూరకు సహజమైన పులుపేది? కూరగాయలకు, బియ్యానికి ఆ రుచి ఏది? అయినా వాటిని నీళ్లు పోసి పెంచుతున్నామా? ఎరువులు, క్రిమిసంహారక మందులు పోసి కదా సాకుతున్నాం. అంతకన్నా భిన్నంగా అవి మాత్రం ఎలా వుంటాయి? అయితే ఇక రుచికరమైన కూరగాయల ఆశ వదులుకోవాల్సిందేనా! అన్నదానికి సమాధానంగా చేస్తున్న ప్రయత్నమే సహజ సేద్యం. ఆహారం. ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా సహజంగా పండించే ఆర్గానిక్‌ ఆహారం విశేషాలు ఈ వారం అట్టమీది కథలో.
మానవ వైఖరే ఒక విచిత్రం. కాఫీ ఎందుకు మంచిది కాదు. టీ లో ఎటువంటి దుర్గుణాలున్నాయి అనే విషయం కోక్‌ తాగుతూ చర్చించుకుంటాం. నెయ్యి తింటే కొవ్వు ఎంత పెరుగుతుంది? కొవ్వు తీసిన పాలు వాడడం వల్ల లాభాలు ఏమిటి? అని బర్గర్లు, పీజాలు తింటూ వాదించుకుంటాం. ప్రస్తుతం ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. పిల్లల నుండి వృద్ధుల వరకు ఏదో ఒక రకంగా ఆరోగ్యం మీద ఆసక్తి ప్రదర్శిస్తూ, అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఒక పక్క జంక్‌ ఫుడ్‌ చిరుతిళ్లు ఊరిస్తుంటే వాటిని దూరం చేసుకోవడం, వాటికి దూరంగా ఉండడం కొంచెం కష్టమే.
అటువంటి చిరుతిళ్లను ఒకవైపు ఆదరిస్తూనే, మరొకవైపు సహజ, ఆర్గానిక్‌, హెర్బల్‌, నేచురల్‌ అంటూ పరుగెడుతున్నారు. దంపుడు బియ్యం, దొడ్డు బియ్యం అన్ని విధాలా ఆరోగ్యానికి మేలైనవి అంటే వినం. మాంచి పాలిష్‌ పెట్టిన తెల్లటి సన్న బియ్యమే కావాలి. కాస్త దోరగా ఉన్న దేశవాళి టమాటాల కంటే ఎర్రగా, గుండ్రంగా మెరుస్తున్న సంకర జాతి టమాటాలే మనం కొంటాం. చిటికెన వేలంత ఉండే కమ్మటి నాటు కొత్తిమీర కంటే ముంజేతి పొడవుండే సీమ కొత్తిమీరే కావాలి. మనకు తగ్గట్టే కొన్ని కంపెనీలు రెచ్చిపోయి 'సర్వ సుగుణాల రాశి' అంటూ రెండు మూడు రకాల లక్షణాలు కలబోసి ఒక విచిత్రమైన జెనెటికల్‌ ఎంజైమ్డ్‌ వంకాయనో, మొక్కజొన్ననో, టమాటానో... ఎదో ఒకటి రూపొందించి మన ముందుకు తోస్తున్నారు. మనం పద్ధతిగా, మహా పరమానందంగా అటువంటి వాటిని ఆదరిస్తున్నాం.
ఒకప్పటి సేద్యం వేరు. ఇప్పటి సాగు వేరు. అప్పటి వ్యవసాయం అచ్చంగా మనకోసమే (మనుషుల కోసమే) అన్నట్టుండేది. ఇప్పుడు లాభాల కోసం అన్నట్టుంది. పద్ధతులు మారాయి. ప్రకృతి మారింది. పంటలూ మారాయి. నాణ్యతా మారింది. రుచి మారింది. ఆరోగ్యమూ మారింది. కాలం మారింది. మన అలవాట్లూ, అభిరుచులూ, ఆశలూ, ఆకాంక్షలూ అన్నీ మారాయి. అయితే అలా మారుతూ మారుతూ ముందుకు పోతుంటే పోయి పోయి చివరికి మనం మొదలెట్టిన చోటికే వస్తున్నాం. మళ్లీ మన పంటలను ప్రకృతి నిర్దేశించినట్లు పండించుకునే రోజులు వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది అటువైపు మళ్లుతున్నారు. అలా మారిన కొంతమంది కొత్తగా చేపట్టిన కొత్త వ్యవసాయ పద్ధతే 'ఆర్గానిక్‌ వ్యవసాయం'.
సూపర్‌ మార్కెట్ల షెల్ఫులలోనూ, ప్రత్యేకమైన ఔట్‌లెట్లలోనూ ఆర్గానిక్‌ ఫుడ్‌ అంటూ ఒక ఆకుపచ్చటి స్టిక్కర్‌ అంటించిన పదార్థాలు (వరి నుంచి వంకాయ వరకు) ఆకర్షణీయంగా ఆహ్వానిస్తుంటే 'అసలు ఈ రకం ఫుడ్‌లో ప్రత్యేకత ఏంటి?' అనే సందేహమూ, సంశయమూ మనబోటి వారికి రాక తప్పదు. ఆర్గానిక్‌ పదార్థాలు, సాంప్రదాయక వ్యవసాయ పద్ధతులలో పండించే పంటల కంటే ఆరోగ్యమైనవి, సురక్షితమైనవి అని ప్రచారం జరిగింది. రసాయనిక పురుగు మందులను మనం భోజనంలో తీసుకుంటున్నామనే భయం పట్టుకున్నాక ఆర్గానిక్‌ పదార్థాల వైపు మొగ్గు పెరిగింది.
ఆర్గానిక్‌ అనే పదాన్ని రసాయన శాస్త్రంలో కర్బన పదార్థాలకు అన్వయించడం మామూలే. కానీ ఆర్గానిక్‌ వ్యవసాయం, ఆర్గానిక్‌ ఆహారం వంటివి దానికి భిన్నమైనవి. ఒక పంటను ఒక జీవిలా పరిగణించి పెంచడం అనే భావన దీనికి సరిగ్గా సరిపోతుంది. అరణ్యాలలో పండ్లూ, పూలు ఎలా పెరుగుతాయో అలాగే 'సహజం'గా పెంచడం అన్నమాట.
ఆర్గానిక్‌ అనగానే మనకు సహజ, ప్రాకృతిక వంటి అర్థాలు తడతాయి. కానీ విశేషమేమంటే వ్యవసాయాన్ని ప్రకృతికి వదిలిపెట్టకుండా, అంటే పంటలు సహజంగా పెరగకుండా, తమ ఆధునిక విజ్ఞానానికి, సంప్రదాయక వ్యవసాయ పద్ధతులను జోడించి, ప్రకృతిని మలచుకుని, పండించే పంటలన్నమాట. అయితే ఇందులో ప్రకృతిపై ఎటువంటి నియంత్రణా, పైచేయి లేకుండా దానితో మమేకమవడం కనిపిస్తుంది. ఆర్గానిక్‌ వ్యవసాయంలో ఎటువంటి రసాయన క్రిమినాశకాలు వాడే అవకాశం లేదు. అదే విధంగా, ఎరువుగా నేరుగా పశువుల వ్యర్థాలను వాడకూడదు. దాన్ని ముందుగా కంపోస్టుగా మార్చి వాడాలి. కలుపు మొక్కల నివారణ రసాయనాలతో కాకుండా మనుషులే ఏరివేస్తారు. కొన్ని సార్లు ఇతర జంతువులను కూడా వినియోగించాల్సి వస్తుంది. మొత్తం ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలను ఏక కాలంలో వేయడం, నీరు ఆవిరై పోకుండా పంట రక్షణ ఏర్పాటు చేయడం కూడా ఇందులో భాగమే. ఇటువంటి ఖర్చు ఎక్కువ పనులు అవసరమౌతాయి. కాబట్టి ఆర్గానిక్‌ ఉత్పాదనలు మామూలు వాటికంటే ఎక్కువ ఖరీదుగా ఉంటాయి.
మామూలుగా అయితే పురుగులు కనిపిస్తే చాలు లీటర్ల కొద్దీ పురుగు మందులు జల్లడం అలవాటైన మనకు క్రిమి, కీటకాల విషయంలో ఆర్గానిక్‌ వ్యవసాయం మరింత విశేషంగా వుంటుంది. ఇందులో కొంత మేరకు పురుగుల దాడిని అనుమతిస్తారు. మన పంటలకు కీడు కలిగించే కీటకాల సహజ శత్రు కీటకాలను ప్రోత్సహిస్తారు. వేరు వేరు పంటలను పక్క పక్కన వేయడం ద్వారా కీటకాల విస్తరణను అరికడతారు. ఇంకా ఇటువంటి జీవ నియంత్రణా పద్ధతుల ద్వారా రసాయనాల వాడకం పూర్తిగా లేకుండా చేస్తారు.
ఆరోగ్యం ఆహారంతోనే సాధ్యమా?
మనం తినే పదార్థాలు మాత్రమే మనల్ని ఆరోగ్యంగా చేస్తాయా అనే ప్రశ్న కీలకమైంది. ఈ మధ్య మనుషులలో పెరిగిపోతున్న అనేక రుగ్మతలకు కారణం తినే ఆహారమే అన్నట్లు ప్రచారం కల్పిస్తున్నారు. గుండె జబ్బులు, కీళ్ల నొప్పులూ, డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులు పెరిగి మానవులను ముప్పు తిప్పలు పెట్టించి చివరికి ప్రాణాలు సైతం హరిస్తున్నాయి. దాంతో ఆహారమే అందుకు మూలం అనే దురవగాహన పెరిగిపోయింది. వాస్తవానికి మనం తినే ఆహారం కంటే మనం ఎలా ఉంటున్నామో ముఖ్యం. మన జీవన శైలి మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. పూర్వకాలం అందరూ శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు. కాబట్టి వారి ఆరోగ్యాలు దిట్టంగా ఉండేవి. ఇప్పుడు ఎంత గొప్ప 'ఆరోగ్యకరమైన' ఆహారం తిన్నా, కొంచెం కూడా శారీరక వ్యాయామం లేని కొలువులూ, నిత్యం ఏదో ఒక రకమైన ఆందోళనలూ, నిరంతరం కాలుష్యాలతో కాపురమూ... ఇవన్నీ అనారోగ్యానికి, రుగ్మతలకి అసలు కారణాలు. ఒక ముద్ద ఎక్కువ తిన్నా, ఒక పది నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి ఢోకా వుండదు. కానీ రోజూ ఖరీదైన ఆర్గానిక్‌ ఫుడ్‌ తింటూ టీవీ ముందు నుండి కదలక పోతే లాభమేముంది? కాబట్టి ఆరోగ్యం మన చేతుల్లోనే కాదు, మన చేతల్లో కూడా ఉంది.
అందనంత ఎత్తులో ఆర్గానిక్‌
ఆర్గానిక్‌ ఆహార పదార్థాలని వాడే వాళ్లది కొద్ది శాతమే. అందుకు మొదటి కారణం వాళ్లు మాత్రమే ఆరోగ్యంపై అవగాహన కలిగిన వారనో, లేదా వారికే వాటి అవసరం ఉందనో కాదు. వాళ్లు మాత్రమే ఆర్గానిక్‌ ఫుడ్‌ని కొనుగోలు చేయగల స్థోమత ఉన్నవారు. సాధారణ ఫుడ్‌ కంటే కనీసం యాభై శాతం అధిక ధరల్లో ఆర్గానిక్‌ ఫుడ్‌ లభిస్తుంది. మరి అటువంటి ఆహారం రోజూ వినియోగించ గలిగిన వారు బాగా ధనికులు అయి ఉండాలి. మరొక విషయం ఏమిటంటే, ఆర్గానిక్‌ ఫుడ్‌ వాడుతున్నాం అని చెప్పుకోవడం సొసైటీలో ఒక ట్రెండ్‌గా, ఒక హోదాగా మారింది. అలా గొప్ప కోసం కూడా ఆర్గానిక్‌ ఫుడ్‌ ఉపయోగపడుతోంది.
ఆర్గానిక్‌తో ఆరోగ్యమెంత?
ఆర్గానిక్‌ ఆహారం సురక్షితమైనది అనుకోవడమే కాకుండా అది సాధారణ పదార్థాలకంటే ఆరోగ్యవంతమైనది అనుకునే వాళ్లు ఉన్నారు. అమెరికన్‌ వ్యవసాయ విభాగం (ఖూణA) తన వెబ్‌సైట్‌లో 'ఆర్గానిక్‌ ఫుడ్‌ సంప్రదాయ ఫుడ్‌ కంటే ఆరోగ్యకరమైనది, సురక్షితమైనది కానవసరం లేదు' అని ప్రకటించింది. అవి రెండూ కేవలం పంటలు పెంచే విధానంలోనే వ్యత్యాసం కలిగి ఉంటాయి. ఆర్గానిక్‌ పద్ధతిలో పెంచిన ధాన్యాలు, దుంపలు, కూరగాయల్లో మామూలుగా పెంచిన వాటిలో ఉన్నట్లే విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి! కాబట్టి, ఆర్గానిక్‌ పదార్థాలలో చెప్పుకోదగ్గ మార్పు గణనీయమైన స్థాయిలో రసాయన కీటకనాశిని ఆనవాళ్లు లేకపోవడం మాత్రమే.
ఆరంభం
ఆర్గానిక్‌ వ్యవసాయం వినడానికి ఆధునికంగా అనిపిస్తున్నా, దీని ఉనికి ప్రాచీన కాలం నుండే ఉంది. అసలు అదే అప్పటి మన వ్యవసాయ పద్ధతి. పారిశ్రామికీకరణ వల్ల రసాయన మందులు, వాటితో పాటే అనేక తీవ్ర సమస్యలు తలెత్తాయి. దాంతో రుడోల్ఫ్‌ సటినర్‌ అనే ఆయన బయోడైనమిక్‌ అగ్రికల్చరల్‌ (ఆర్గానిక్‌ వ్యవసాయానికి తొలిరూపం) ప్రవేశపెట్టాడు. మధ్య ఐరోపాలో 1920లో ఒక ఆర్గానిక్‌ ఉద్యమం ఆరంభమైంది. మరో రెండు దశాబ్దాల తర్వాత, 1940లలో ఇంగ్లండ్‌కు చెందిన ఆల్బర్ట్‌ హావార్డ్‌ అనే ఆయన స్వతంత్రంగా వ్యవసాయ పద్ధతిని, కృత్రిమ రసాయనిక మందులకు వ్యతిరేకంగా ప్రారంభించాడు. ఆయన, 'నేల ఆరోగ్యంగా ఉంటేనే దానిలో పండే పంటా, ఆ పంటని తిన్న మానవులు ఆరోగ్యంగా ఉండ గల్గుతారు' అనే విషయాన్ని విశ్వసించి ప్రచారం చేశాడు. ఆర్గానిక్‌ వ్యవసాయం ప్రాచీన కాలంనుండే ఉన్నా, దాని పితామహుడిగా ఆల్బర్ట్‌ హావార్డ్‌నే పరిగణిస్తారు. ఇప్పటికే ఆర్గానిక్‌ వ్యవసాయం మొత్తం వ్యవసాయంలో అతి తక్కువ శాతమే అయినా పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ అవగాహనతో అది క్రమంగా పెరుగుతోంది.
ఆర్గానిక్‌ ఆహార పదార్థాల వల్ల అటు ప్రకృతికే కాక మనకూ (వినియోగించేవారికి) కొన్ని లాభాలున్నాయి.
పోషకాలు
ఒక ఆహార పదార్థంలో పోషక విలువలు దానిలోని సహజ విటమిన్లు, ఖనిజాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.
ఆ క్రమంలో ఆర్గానిక్‌ పదార్థాలలో పోషక విలువలు ఆధునిక పద్ధతుల్లో పెంచిన పంటల ఉత్పత్తుల కంటే మెరుగైనవి.
సురక్షితమైనవి.
పైగా, రసాయన మందులు వాడక పోవడం వల్ల వాటి అవశేషాలు ఆహార పదార్థాలలో ఉండవు. అంటే, మనకు ఎటువంటి సమస్యా ఉండదు.
రుచికరమైనవి
ఆర్గానిక్‌ పదార్థాల రుచి కూడా ఇతర పదార్థాల కంటే మెరుగ్గా ఉంటుంది (నాటు కోడికి, ఫాంలో పెంచిన కోడికి ఉండే వ్యత్యాసంలా).
ధీర్ఘకాల మన్నిక
ఆర్గానిక్‌ పదార్థాలు మామూలు వాటికంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కుళ్లడం, బూజు పట్టడం తక్కువ.
అయితే ఆర్గానిక్‌ ఫుడ్‌ అనుకున్నంత, ప్రచారం చేసినంత, వాటిని తయారు చేసిన వారు ఆశించినంత ఆరోగ్యకరమైనవి, సురక్షితమైనవి అనడానికి తగినంత శాస్త్రీయ ఆధారాలు లేవు. పైగా అటువంటివి సాధారణ ప్రజల కోసం ఎక్కడా అందుబాటులో లేవు. అటు వాటిని అమ్మే దుకాణాలు గానీ, వాటి ధరలు కానీ. అమెరికా వ్యవసాయ విభాగ నిర్వచనం ప్రకారం ఆర్గానిక్‌ ఫుడ్‌ అంటే సంప్రదాయక కీటక నాశనులు వాడకుండా పండించే పంటలు. అంటే అటువంటి పదార్థంలో అసలు ఎటువంటి రసాయన ఆనవాళ్లు వుండవు అనడానికి లేదు. ఆ మాటకొస్తే అసలు ఎటువంటి రసాయనిక పదార్థాల ఆనవాళ్లు లేకుండా పంటలను పండించడం దాదాపు అసాధ్యం. ఆర్గానిక్‌ పంటలను కృత్రిమ మిశ్రమాలనూ, బయో ఇంజనీరింగ్‌ పద్ధతులనూ వాడకుండా పండించినవి. అలాగే ఆర్గానిక్‌ మాంసం, గుడ్లు, ఇతర డ్రై ఉత్పత్తులు కూడా హార్మోన్లు, యాంటీ బయాటిక్‌ వాడకుండా పెంచిన జీవుల నుంచి వచ్చినవే.
సేంద్రియ విహారులు
వెండెల్‌ బెర్రీ అనే ఒక తత్వవేత్త, వ్యవసాయదారుడు ఆధునిక నగర జీవులను ఒక్క వాక్యంలో వ్యక్తీకరించాడు. మన సగటు పౌరుడు యుక్తవయసు రాక మునుపే పిల్లల్ని ఎలా కంటారో తెలుసుకుంటాడు. కానీ మూడు పదుల వయసు దాటినా బంగాళ దుంపలు ఎలా పండుతాయో తెలుసుకోడు. అది నిజమే అనిపిస్తుంది. ఈ నాటికీ కార్పొరేట్‌ స్కూళ్లలో లక్షలు పోసి చదువుకుంటున్న వాళ్లు 'అన్నం గింజలు ఏ చెట్టుకు కాస్తాయి?' అని అడుగుతుంటారు.
బహుశా ఇటువంటి ఆలోచనతోనే కాబోలు ఇంగ్లాండులో ఒక మహిళ ఒక అద్భుతమైన ప్రక్రియకు నాంది పలికింది. వారాంతాల్లో సరదాగా పల్లెలకు వెళ్లి, అక్కడ పొలం పనుల్లో అక్కడి వారికి సాయపడడం అనే ఆలోచన ఇప్పటికి సుమారు నలభై ఒక్క సంవత్సరాల క్రితం సూ కొప్పార్డ్‌ అనే మహిళకు కలిగింది. తనలాగే పొలం పనులపై ఆసక్తి, కోరిక ఉండి కూడా అది తీర్చుకోలేని వారికోసం ఆమె రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి, ఔత్సాహికులను రప్పించింది. ఓ నలుగురితో ఒక ప్రయత్నంగా ప్రారంభమైన ఆ సరదా క్రమేపీ ఒక చిన్న ఉద్యమంలా ఊపందుకుంది. వర్కింగ్‌ వీకెండ్స్‌ ఆన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ (WWOOF) ఆ విధంగా ఆరంభమైంది. అనేకమంది ఆర్గానిక్‌ వ్యవసాయదారులు 'వూఫర్‌'లను అనుమతించడం ప్రారంభించారు. రెండువేల సంవత్సరంలో మొట్టమొదటి అంతర్జాతీయ ఊఫ్‌ సమావేశం జరిగింది. అందులో పదిహేను దేశాలనుండి వూఫర్లు పాల్గొన్నారు. క్రమ క్రమంగా పొలాల్లో పనులు కేవలం వారాంతాలకే పరిమితం కాకపోవడంతో పేరును willing workers on orgainic farms అని మార్చారు. ఆ తర్వాత వర్కర్లు అన్న పదానికి అభ్యంతరాలు వచ్చేసరికి, పేరు మళ్లీ మార్పు చేశారు. ఇప్పుడు అది world wide opportunities on organic farms.
ఈనాడు ఊఫ్‌ తొంభై తొమ్మిది దేశాల్లో తన ఉనికిని చాటుతోంది. ప్రతి దేశంలోనూ ఆ సంస్థ స్వతంత్రంగా తన కార్యకలాపాలను నడుపుతోంది. ఔత్సాహికులకు, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ గురించి అవగాహన, అందులో పాల్గొనడానికి, చర్చించడానికి, సూచనలు, సలహాలు, సంప్రదింపులూ, శిక్షణా... అన్నీ ఇందులో వీలవుతాయి. మనదేశంలో పద్దెనిమిది అతిథేయులు ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లోకి ఔత్సాహికుల కోసం ఆహ్వానం పలుకుతున్నారు. కొద్దిగా ఫీజు కట్టి సభ్యులుగా చేరొచ్చు.
మన దేశంలో కర్ణాటక, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ము కాశ్మీర్‌ ...16 రాష్ట్రాలలో ఊఫర్లు వున్నారు.
వివరాల కోసం http//www.wwoofindia.org చూడవచ్చు.
ఆర్గానిక్‌ ఆహార పదార్థాలలో కచ్చితంగా మెరుగైన పోషక పదార్థాలు ఉంటాయని నిర్థారణగా చెప్పలేం. పండించే ప్రక్రియలో, నేలలో అధికంగా సహజ పోషకాలు ఉండడం వల్ల పంటలలో కూడా అధిక పోషకాలు ఉంటాయని అనలేం. కానీ హానికరమైన కీటక నాశకాలు లేకపోవడం వల్ల ఆర్గానిక్‌ ఉత్పాదనలు కచ్చితంగా మెరుగైనవే అని చెప్పొచ్చు. కనీసం ఆర్గానిక్‌ ద్రాక్షాని, యాపిల్‌నీ తొక్కతో సహా తినేయొచ్చు... మందుల భయం లేకుండా.
కానీ ఆర్గానిక్‌ పదార్థాలకు కూడా విమర్శలు తప్పలేదు. ఆర్గానిక్‌ వ్యవసాయంతో ఇప్పుడు సంప్రదాయక వ్యవసాయంలో చేస్తున్నటువంటి భారీ మోతాదు పంటలను పండించలేం. అంటే జనాభా అంతటి ఆహార అవసరాలను తీర్చలేం. అలాగే కేవలం కంపోస్టునే వాడాలంటే మరి దాన్ని తయారు చేయడానికి (భారీ సేంద్రియంలో) ఎంత అటవీ భూమిని సేకరించవలసి వస్తుందో అనే వాదనా ఉంది. మరో వైపు కృత్రిమ రసాయన పదార్థాలు మానవులపై (ఆహార పదార్థాల ద్వారా) ప్రభావం చూపడానికి అధిక సమయం పడుతుందనీ, వాటికంటే రోజూ పొగ కాలుష్యాలూ, గుట్కా, పొగ, మందు తాగడం వంటి అలవాట్లే పెను దుష్ఫ్రభావాలు చూపుతాయని అంటున్నారు. చాలా రకాల విష పదార్థాలు ఆహారం ద్వారా మన శరీర వ్యవస్థలోకి వెళ్లినా, వాటిని మన అంతర అవయవాలు (కాలేయం, మూత్రపిండాలు) సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. విషాలను చాలా వరకు తగ్గిస్తాయి. అందువల్ల మనం ఇంకా ఈ మాత్రం ఆరోగ్యంగానైనా ఉండగల్గుతున్నాం. కాబట్టి కేవలం ఆర్గానిక్‌ ఆహారం కోసమే వెంపర్లాడడం, అదే మన ప్రత్యామ్నాయం, భవిష్యత్తూ అనేలా ప్రవర్తించడమూ సబబు కాదు అనేవాళ్లూ ఉన్నారు. కేవలం శాకాహారమే మంచిది అనే వాళ్లూ, సమగ్ర ఆహారానికి మాంసాహారం కూడా అవసరమని అనేవాళ్లూ ఎలా ఉన్నారో, అలాగే ఆర్గానిక్‌ ఆహారం విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు తప్పలేదు.
ఆహారానికి మించిన వ్యాపారం లేదని అంటారు. అందుకే కాబోలు మనం మామూలుగా తీసుకునే ఆహారమూ, దాని ముడి సరుకులూ, అసంఖ్యాక వెరైటీలలో అందుబాటులో ఉన్నాయి. మనకి ఎప్పుడూ ఒకే రకం వస్తువు, పదార్థం, భోజనం రుచించదు. కూరలో రకాలున్నట్లే అన్నం కూడ మనం అనేక రకాలుగా వండుకుంటాం. మనలోని ఇటువంటి లక్షణాలను ఆసరా చేసుకుని ఇప్పుడు మార్కెట్లో కొత్త పేర్లతో పదార్థాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. అటువంటి వాటిలో ఆర్గానిక్‌ (సేంద్రియ) ఆహారం, నేచురల్‌/హెర్బల్‌ (సహజ/ మూలికా) ఉత్పాదనలు ముఖ్యమైనవి. వ్యవహార పరంగా ఇటువంటి ఆర్గానిక్‌, హెర్బల్‌, నేచురల్‌ అంశాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. అమెరికాలో సుమారు 70 శాతం మంది ఆర్గానిక్‌ ఆహార పదార్థాలను అప్పుడప్పుడు కొంటే, ఓ పాతిక శాతం మంది ప్రతివారమూ కొనుగోలు చేస్తారట. అటువంటి వారిది ఒకటే మాట. మాకూ, పర్యావరణానికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన ఆహార పదార్థాలు కావాలి.
ఇక్కడ కూడా కొంతమందికి, కొన్ని చోట్ల ఆర్గానిక్‌ పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మామూలు ఆహార పదార్థాల ధరలకే దిమ్మతిరిగిపోతుంటే, అతి ఖరీదైన ఆర్గానిక్‌ ఫుడ్‌ ఎలా కొనగలం అనుకునేవారు ఎక్కువ. అందుకే తక్కువ మందే అటువైపు పోతున్నారు. మరి వారి ఆరోగ్యం ఎంత మేరకు మెరుగైంది అన్నది మనకు తెలీదు. మనకు తెలిసింది ఒక్కటే ...మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. మంచిదే దొరకాలి అని ఎదురుచూసేకన్నా దొరికిందే మంచిది అనుకోవడం అలవాటు చేసుకున్నాం. అయినా ఆర్గానిక్‌ ఫుడ్‌ సకల మానవులకూ అందుబాటులోకి వచ్చి వారికి చక్కటి ఆరోగ్యాన్ని అందించే సమయం ఎప్పుడు వస్తుందో అంత వరకు ఎదురు చూద్దాం.

మార్గదర్శి
ప్రపంచమంతా కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందులతో వ్యవసాయం చేస్తున్న క్రమంలో జపాన్‌కు చెందిన మసనోబు పుకువోకా అందుకు భిన్నంగా ఆలోచించాడు. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు ఎంత ప్రమాదకరమైనవో ఊహించాడు. అవి లేకుండా చేసే వ్యవసాయం గురించి యోచించాడు. ఇంక నాలుగు గోడల మధ్య కూర్చుని రొటీన్‌ ఉద్యోగం ఏమాత్రం చేయలేకపోయాడు. ఉద్యోగం వదిలేసి పల్లెకు వెళ్లాడు. ఈ పల్లెలో ఏం చేస్తావన్న ప్రశ్నకు సమాధానంగా మౌనం వహించాడు. అయితే చేతల్లో కాదు సుమా! దాదాపు 65 సంవత్సరాల పాటు ఆయన చేయని ప్రయోగం...ప్రయత్నం లేదు. సేంద్రియ వ్యవసాయంతో అద్భుతాలు పండించాడు. అమెరికా, యూరపు, ఇండియా, ఆఫ్రికా దేశాలు తిరిగి తను సాధించిన అద్భుతాలను పంచుకున్నాడు. అంతటితో ఆగక తన అనుభవాలను గ్రంథస్థం చేశాడు. ఆయన రచించిన 'వన్‌ స్ట్రా రెవల్యూషన్‌' సంచలనమే అయ్యింది. 'గడ్డి పరకతో విప్లవం' పేరిట తెలుగువారికీ చేరింది.
ఎరువులు ఇలా....
సేంద్రియ వ్యవసాయంలో పశువుల ఎరువుదే ప్రధాన పాత్ర. దీంతో పాటు పంట/విత్తన ఎంపిక, అవసరమైన మేరకే దున్నడం, నేల కోతకు గురికాకుండా జాగ్రత్త పడడం, నేలను కాపాడుకోవడం, వ్యవసాయంతో పాటు ఇతర వ్యవసాయ అనుబంధ వ్యాపకాలకు ప్రాధాన్యం ఇవ్వడం, అనువైన అంతర పంటలు సాగుచేయడం, పంట మార్పిడి చేయడం ముఖ్యమైన అంశాలు. వేసవిలోనే పొలాన్ని పైరు వేయడానికి సిద్ధం చేస్తారు. పొలం దున్ని, చెరువు మట్టి తోలిస్తారు. పైగా పశువులను పొలంలో వదులుతారు. అవి విసర్జించే పేడ, మూత్రం ఎరువుగా ఉపయోగపడతాయి. పైగా సేంద్రియ ఎరువులను మాత్రమే వాడతారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసిన జీవామృతం, వర్మి కంపోస్టు ఎరువులను వాడతారు. ఆవుపేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో చేసిన మిశ్రమాన్ని పైరుమీద స్ప్రే చేస్తారు. పేడ, గడ్డి, వానపాములతో చేసిన వర్మి కంపోస్టును వాడతారు. ఇవి కాక చీడపీడల నుంచి విముక్తి పొందడానికి పంచపత్ర కషాయాన్ని చల్లుతారు. వీటిని అతి తక్కువ పెట్టుబడితో సొంతంగా తయారు చేసుకుంటారు.
తక్కువ పెట్టుబడితో చేసే సాగులో దిగుబడి తక్కువే వచ్చినా నేడు సేంద్రియ ఆహారోత్పత్తులకు గిరాకీ బాగానే వుంటోంది. మన రాష్ట్రంలో... ప్రస్తుతం రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, చిత్తూరు, కడప, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లో ఆర్గానిక్‌ రైతులు సేద్యం చేస్తున్నారు. వీరు చేస్తున్న సేంద్రియ వ్యవసాయానికి గుర్తింపు వుంది. వీరు...వరి, అల్లం, కూరగాయలు, రాగులు, జొన్న, సామలు, కొర్రలు, వేరుశనగ, కంది... పండిస్తున్నారు.

No comments:

Post a Comment