Wednesday 25 April 2012

ముఖద్వారం అటే ఉండాలా..?

కాంతారావు తాతా! వాస్తు విషయంలో నాకో సందేహం వచ్చింది తీరుస్తావా?' ఏదో పుస్తకం చదువుకుంటున్న నా దగ్గరకు వచ్చి ప్రశ్నించింది రమ్య.
'అడుగమ్మా!' అన్నాను నేను.
'ఇంటి ముఖద్వారం తూర్పు లేక ఉత్తరం వైపే చూస్తుండాలట గదా?'
'ఎవరు చెప్పారమ్మా?'
'తాళపత్రం' అనే గ్రంథంలో ఉంది తాతయ్య!'
'ఓహో! ఆ పుస్తకాన్ని నీవూ చదివావా? అయితే, దీనికి సమాధానం నీవే చెప్పగలవు. కానీ, అలా ఉంచడానికి ఆ గ్రంథంలో కారణాలేం చెప్పారమ్మా?'
'వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్‌పొర ఇంకా క్షీణించే అవకాశం ఉన్నందున, అతినీలలోహిత కిరణాలు (ఆల్ట్రావయిలెట్‌ రేస్‌) సూటిగా భూమిని తాకడం వల్ల మానవులకు హాని కలుగుతుందనీ, అదే మన ఇంటిద్వారం ఉత్తరంవైపుకు ఉన్నట్లయితే ఇంట్లోకి అతినీలలోహిత కిరణాలు ప్రవేశించే బెడదుండదట. చక్కగా అరుగులపై కూర్చొని బంధు మిత్రులతో ముచ్చటించుకోవచ్చట తాతయ్యా!'
'సరేనమ్మా! నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాస్తుశాస్త్రం గ్రంథాలు అని చెప్పబడేవి ఎప్పటివి?'
'సరిగ్గా తెలియదు తాతయ్యా. కానీ కొన్ని వందలేళ్ల కిందట రాసినవి అనుకుంటున్నాను.'
'కరెక్టేనమ్మా!' మయమతం, మానసారం, విశ్వకర్మ ప్రకా శికలాంటి ప్రాచీన వాస్తుగ్రంథాలు క్రీ.శ.10వ శతాబ్దం ప్రాంతంలో రాయబడ్డాయి. ఇక ఓజోన్‌పొరను గూర్చి, అతినీలలోహిత కిరణాలను గూర్చి ఎప్పటినుండి తెలుసు?'
'క్రీ.శ. 1865లో జాక్విస్‌ లూయిస్‌ సోగెట్‌ అనే శాస్త్రజ్ఞుడు ఓజోన్‌పొరను కనుగొన్నాడు. అప్పటి నుండి ప్రపంచానికి తెలుసు.'
మరి వెయ్యేళ్ళనాటి వాస్తువాదులు ఆ తరువాత ఎంతోకాలానికి గుర్తించిన (150 ఏళ్ల క్రితమే) ఓజోన్‌ను తెలుసుకొని ముఖద్వారం ఉత్తరదిశలో ఉండాలని రాశారంటే అంగీకరిస్తావా?'
'అంగీకరించను తాతయ్యా'.
ఇక ఉత్తరద్వారం ద్వారా రాలేని అతినీలలోహిత కిరణాలు దక్షిణద్వారం ద్వారా అయితే వస్తాయని అంటే అంగీకరిస్తావా?'
'అంగీకరించను తాతయ్యా!'
'ఇక తూర్పు ద్వారమే ఉండాలనేందుకు కారణం ఆ పుస్తకంలో ఏం రాశారమ్మా?'
'ఇంటి ముఖం తూర్పుదిశగా ఉన్నట్లయితే అరుగుమీద కూర్చోవడం వల్ల ఉదయపు సూర్యకిరణాలు విటమిన్‌ శాతాన్ని పుష్కలంగా కలిగి ఉన్నాయి కాబట్టి మన శరీరాలపై ప్రసరించి, శుభాన్ని కలిగిస్తాయట!'
'ఉత్తరంవైపు నుంచి వచ్చే సూర్యకిరణాలలోని అతినీల లోహిత కిరణాలు మానవులకు హాని చేస్తాయని చెబుతూ, ఉదయపు సూర్యకిరణాలు, అంటే తూర్పువైపు నుంచి వచ్చేవి మన శరీరాలకు మంచివని చెప్పడం అసంబద్ధం కాదా?' 'అవును. తాతయ్యా!'
'తూర్పు నుంచి వచ్చే ఉదయకిరణాలలో విటమిన్ల శాతం ఎక్కువ ఉంటే, పడమటి కిరణాలలో విటమిన్లు పుష్కలంగా ఉండవా?'
'ఎందుకుండవు?'
'మరి పడమర వాకిలి ముఖద్వారంగా ఇళ్లు కట్టుకోకూడదనీ, దీనికి విటమిన్లను కారణంగా చూపెడుతూ తూర్పువాకిలి ఇళ్ళే కట్టుకోమని చెప్పడం అసంబద్ధం కాదా?'
'అసంబద్ధమే తాతయ్యా'
'ఇప్పుడు నీవేమి అర్థంచేసుకున్నావమ్మా..?'
'తూర్పు లేక ఉత్తరం ముఖద్వారాల ఇళ్ళ విషయంలో వాస్తువాదులమని చెప్పుకొనేవారు అతినీలలోహిత కిరణాలు, ఓజోన్‌పొర, విటమిన్లులాంటి సైన్సు పదాలు వాడి కొన్ని అశాస్త్రీయ, అసంబద్ధ విషయాలను ప్రచారం చేస్తున్నారు. గాలి, ఎండ చక్కగా ప్రసరించేట్లుగా ఇళ్ళు కట్టుకుంటే చాలు. ఏ వైపు ముఖద్వారం ఉన్నా ఒకటే.
'అవునమ్మా! నీ సందేహాలకు సమాధానాలు నీవే తెలుసుకున్నావు సంతోషం'' అన్నాను నేను.

కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment