Sunday 30 December 2012

పరపతి కోసం..!

  • వాస్తు.. వాస్తవాలు.. - 4
నా ఆప్తమిత్రుల్లో ఒకడైన ఆంజనేయులు (పేరు మార్చ బడింది) 30 ఏళ్ళపాటు ఉద్యోగం చేసి, రిటైరై, తన సొంత ఊరిలో స్థిరపడ్డాడు. అతని ఆహ్వానం మేరకు ఒకసారి వారి వూరు వెళ్ళాను. ఆంజనేయులు బస్టాండుకు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. మేం ఇంటికి వెళ్ళేటప్పటికి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ వసారాలో కూర్చొని వున్నారు. మేం కనిపించ గానే వాళ్లు లేచి నిలబడ్డారు. ఆంజనేయులు వాళ్ళను కూర్చోమని చెప్పి, నన్ను లోనికి తీసికె ళ్ళాడు. మేము కాఫీ తాగి బయటకు వచ్చేవరకూ వాళ్ళు అతనికోసం వేచి వున్నారు. బయటకు వచ్చి కూర్చొని, ఆంజనేయులు 'ఏం నరసయ్యా! ఏంటి సంగతి?' అని అడిగాడు. 'కొత్త ఇల్లు కట్టుకుందామనుకుంటున్నాను సారూ! మీరు వచ్చి ముగ్గేసి, శంకుస్థాపన చేయాలి'' అన్నాడు నరసయ్య వినయంగా. ఆంజనేయులు పంచాంగం చూసి ''వచ్చే సోమవారం ఉదయం ఏడు గంటల 16 నిముషాలకు నేను శంకుస్థాపన చేస్తాను. నువ్వు ఉదయం ఆరు గంటలకే అక్కడ అన్నీ సిద్ధంచేసుకొని వుండు'' అని కావలసిన పదార్థాలు చెప్పి, అతన్ని పంపేశాడు. తరువాత పుల్లయ్యవైపు తిరిగి ''పుల్లయ్యా! నీవెందుకొచ్చావు?'' అని అడిగాడు. ''సారూ! మా అమ్మాయికి కొడుకు పుట్టాడు. మా అల్లుడు ఆ వివరాలు ఈ కాగితం మీద రాసిచ్చాడు. పిల్లవాడి జాతకం రాయండి సార్‌!'' అని ఓ కాగితం ఆంజనేయులుకిచ్చాడు. ఆంజనేయులు ఆ కాగితం తీసుకొని ''ఎల్లుండి రా! జాతకం తయారుచేసి పెడతా' అన్నాడు. పుల్లయ్య వెళ్ళిపోయాడు.
నేను కొంచెం ఆశ్చర్యంగా ''ఆంజనేయులూ! నీవు వాస్తు, జ్యోతిష్యాలు ఎప్పుడు చదివావు? వాస్తుకు సంబంధించి మయమతం, విశ్వకర్మ ప్రకాశిక, వశిష్ఠ సంహిత వంటి గ్రంథాలేమన్నా చదివావా? జ్యోతిష్యానికి సంబంధించి వరాహమిహిరుడి బృహ జ్ఞాతకం వంటి గ్రంథాలు చదివావా?'' అని అడిగాను. ఆంజనేయులు నవ్వుతూ ''కాంతారావ్‌! నేను చదివిన పుస్తకాలు రెండే. ఒకటి 'వాస్తుశాస్త్ర వాస్తవాలు'. రెండవది 'జాతకచక్రం వేయడం ఎలా?' అనే పుస్తకాలు. ఈ రెండు పుస్తకాల విజ్ఞానమే నన్ను ఈ వూళ్ళో వాస్తు, జ్యోతిష్య పండితుడుగా చలామణి చేస్తున్నాయి'' అన్నాడు. దానితో ఆంజనేయులుకున్న వాస్తు, జ్యోతిష్య విజ్ఞానమేమిటో అర్థమైంది. అందుకని మరో ప్రశ్న అడిగాను. ''ఉద్యోగం చేసే రోజుల్లో నీకు వీటిపై ఆసక్తి లేదు కదా? ఇప్పుడింత ఆసక్తి ఎందుకు కల్గింది?'' అని.
చిరునవ్వు నవ్వుతూ ఆంజనేయులు ఇలా అన్నాడు. ''కాంతారావ్‌! తప్పనిసరై పల్లెటూళ్ళో ఉండవలసి వచ్చింది. ఏ విద్యా చేతిలో లేకపోతే ఇక్కడ మనల్నెవరూ గౌరవించరు. అందుకని వాస్తు, జ్యోతిష్యాలు చదివి ఈ వూరి వాళ్ళకు చెబుతున్నా. అందువలన నా పరపతి ఎంతో పెరిగింది. ప్రతివారూ ఏదో ఒక అవసరం కోసం నా దగ్గరకు రావలసి ఉంటుందనుకొని నన్ను ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఏ పని అడిగినా మర్యాదగా చేసిపెడుతున్నారు. నీవు రాగానే చూశావుగదా! నరసయ్యా, పుల్లయ్య నాతో ఎంత వినయంగా మాట్లాడారో? నాకు వీటి వలన ఈ విశ్రాంత జీవితంలో డబ్బూ, గౌరవం రెండూ లభిస్తున్నాయి.
''అవునులే 'అర్ధార్జనే సహాయః' అని వరాహమిహిరుడు తన బృహజ్ఞాతకంలో అందుకే అన్నాడు'' అన్నాను నవ్వుతూ.
''అంటే ఏమిటి?'' అడిగాడు ఆంజనేయులు.
''అంటే జ్యోతిష్యం పురుషుడికి డబ్బు సంపాదించడానికి తోడ్పడుతుంది అని అర్థం.''
ఆంజనేయులు నవ్వి ఊరుకున్నాడు.
సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తాడు?
- ఎం.ఫాతిమా, మునిసిపల్‌ కార్పొరేషన్‌ శ్రీనగర్‌ బాలికోన్నత పాఠశాల, కాకినాడ
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడనే నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గాన్ని భూ పరిభ్రమణ వృత్తం (ECLIPTIC)అంటారు. ఈ వృత్తోపరితలానికి సుమారు 23 డిగ్రీల కోణంలో (900 కాకుండా) వంగిన అక్షం చుట్టూ భ్రమిస్తూ భూమి ఈ వృత్తోపరితల పరిధి (ecliptical perifery) లో పరిభ్రమి స్తోంది. భ్రమణాక్షం (spinning axis) భూమికున్న ఉత్తర దక్షిణ దిశల్లో ఉంది. మనం ఈ భూమి నుంచి దూరంగా వెళ్లి సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే ఎక్లిప్టిక్‌ కక్షను చూస్తు న్నట్లు ఊహించుకొందాం. మనం చూస్తున్నపుడు భూమధ్య రేఖకు పైభాగాన ఉత్తర అమెరికా, రష్యా, గ్రీన్‌లాండ్‌ భాగాలు మనకు కనిపించేలా మనం నిల్చున్నట్లు భావిద్దాం. అపుడు భూమి తన చుట్టూ తాను మన పరిశీలన ప్రకారం ఎడమ నుంచి కుడివైపునకు భ్రమిస్తున్నట్లు ఉంటుంది. అంటే కుడి భాగం సూర్యుడివైపునకు తిరుగుతున్నట్లు, ఎడమభాగం సూర్యుడివైపు పోవడానికి సిద్ధపడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. మనం ఆకాశంలో ఎక్లిప్టిక్‌ వైపు చూస్తున్నపుడు మనకు కుడివైపున సూర్యుడు, ఎడమవైపున భూమి ఉండే విధంగా మన స్థావరాన్ని ఊహించుకోవాలి సుమా!
మనకు పైభాగాన ఉత్తరం, కింది భాగాన దక్షిణం ఉండేలా భూమిని చూస్తున్నాం కాబట్టి కుడివైపున ఉన్న భాగాన్ని తూర్పు అనీ, ఎడమవైపు భాగాన్ని పశ్చిమం (పడమర) అనీ పేర్లు పెట్టకొన్నాం కదా! కుడివైపునకు సూర్యుడి కాంతి పెరిగేలా తిరుగుతున్నందున సూర్యోదయం కుడివైపున (తూర్పున) సంభవిస్తున్నట్లు, ఎడమవైపు (పశ్చిమాన) సూర్యాస్తమయం జరుగుతున్నట్టు ద్యోతకమవుతుంది. నిజానికి ఉత్తర, దక్షిణ ధృవాలకు అర్థం ఉందిగానీ, గణితం ప్రకారం తూర్పు పడమరకు పరమార్థం (absolute meaning) లేదు. కేవలం సాపేక్షం (relative) గా మాత్రమే అర్థం ఉంది. శుక్ర గ్రహం భ్రమణం భూభ్రమణానికి వ్యతిరేకదిశలో ఉన్నందున అక్కడ పశ్చిమాన సూర్యోదయం, తూర్పున సూర్యాస్తమయం ఉంటాయి.


ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
తొలి మహిళా శాస్త్రవేత్త ఎవరు?
- ఎం.వి. గౌతం, కాకినాడ
తొలి మహిళా శాస్త్రవేత్త ఎవరనడం కన్నా తొలి శాస్త్రవేత్త మహిళేనా అన్న ప్రశ్నకు మాత్రం జవాబు 'అవుననే!'. మానవులందరూ శాస్త్రవేత్తలే! మనం మామూలుగా భావించే ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాల్లో శాస్త్రవేత్తల తరహాలో ఎవరు తొలి శాస్త్రవేత్త అంటే దానికి ఇదిమిద్ధంగా జవాబు చెప్పలేము. కానీ విశ్వవిద్యాలయా లు, ప్రయోగశాలలు రాకముందే శాస్త్రవేత్తలు ఉన్నారు. శాస్త్ర విజ్ఞాన చర్చలు, అన్వేషణ తదితర ప్రకృతి పరిజ్ఞాన కార్యకలాపాలు మానవ సమాజంలో అంతర్భా గంగానే ఉండేవి. అందరూ ఆమోదించే విషయం ఒకటుంది. స్త్రీలే తొలి శాస్త్రవేత్తలని! స్త్రీలే తొలి వ్యవసాయదారులని! కాలక్రమేణా ఆస్తి పంపకాలు, వంశపారంపర్యత, గర్భధారణా నంతరం ప్రసవం తర్వాత బిడ్డల సంరక్షణ వంటి కౌటుంబిక వ్యవహారాలు సామాజిక గమనంలో అంతర్భాగమయ్యాక స్త్రీలు ఇళ్లకే పరిమితమయ్యారు. రకరకాల అన్యాయపు పదాలు ఆమెకు అంటగట్టారు. 'అబల' అని, 'అమ్మాయిలు చదివి ఉద్ధరిస్తారా?', 'మగాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడిందని', 'ఆడ పెత్తనం.. దొరతనం' అని, 'ఆడవాళ్లకు అణుకువే అలంకారం' అని, 'తీగకు పందిరిలాగే ఆడవారికి చిన్నపుడు తండ్రి, వయస్సులో భర్త, వృద్ధాప్యంలో తనయుడి అండదండ ఉండాలని', 'మహా పతివ్రత (సాధారణ పతివ్రతకు, మహా పతివ్రతకు తేడా ఏమిటో ఎవరయినా ఉద్ఘాటిస్తే బాగుణ్ణు)' అనీ.. ఇలాంటి ప్రత్యేక పదాల్ని, పాటల్ని స్త్రీలకు అతికించారు.
హైపేషియా అనే గణిత శాస్త్రజ్ఞులు నాల్గవ శతాబ్దకాలంలోనే 'సౌర కేంద్ర సిద్ధాంతాన్ని' ప్రతిపాదించినందుకు మతపెద్దలు ఆమెను అమానుష పద్ధతుల్లో హింసించి, చంపారు. విజ్ఞానశాస్త్ర పరిశోధనల్లో 1901 నుంచి నేటివరకూ వచ్చిన నోబెల్‌ బహుమతులు సుమారు 600 కాగా, అందులో 20 మంది కూడా మహిళా శాస్త్రవేత్తలు లేరు. అప్రమత్త వర్తమాన ప్రపంచ మానవాభివృద్ధి పరిక్రమా (conscious daytoday human endeavours) ల్లో నేటికీ మమేకమైన మానవశ్రమలో మహిళలదే 70 శాతం పైచిలుకు అని సామాజిక శాస్త్రవేత్తలు, విజ్ఞానకోవిదులు ఘోషిస్తున్నారు. వర్తమానంలోనే కాదు, గతంలోనూ అతివలదే అపరిమిత సామాజిక హిత శ్రామిక వెత. అసలు సిసలైన తొలి శాస్త్రవేత్తలు మహిళలే. నేటికీ తెలివి, గంభీరం, చాతుర్యత, మానవత వారివే!

జూపిటర్‌పై కన్నేసిన నాసా..!

మరో దశాబ్దకాలంలో జూపిటర్‌ చంద్రుడిపై కాలుపెట్టాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్ణయించింది. జూపిటర్‌కి యూరోపా చంద్రుడు. అది ఆ గ్రహానికి నాల్గవ అతి పెద్ద సహజ ఉపగ్రహం. మంచుతో నిండి వుండే ఆ ఉపగ్రహానికి చేరువలో అంతరిక్ష నౌకను ప్రయాణింప జేసే ఉద్దేశంలో నాసా వుంది. మానవ రహిత 'యూరోపా క్లిప్పర్‌'ని రెండు బిలియన్ల డాలర్లతో రూపొందించి, 2021 కల్లా సిద్ధం చేయాలని నాసా ఆలోచిస్తుంది. యూరోపా ఉపగ్రహం సుమారు 3,100 కి.మీ. విస్తీర్ణంతో ఉంది. దానిపై జీవం ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని పరిశోధకుల అంచనా. పైకి ఘనీభవించిన మంచు ఉన్నా, దానికింద విశాలమైన ద్రవ రూపంలో నీరున్న సముద్రం ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

తోక పొడవే కీలకం..!

వీర్యకణాల సంఖ్య తక్కువై పిల్లలు పుట్టకపోవడానికి కారణం కావడం మనకు తెలుసు. కానీ వీర్యకణాల సంఖ్య కంటే వాటి తోకల పొడవుపైనే బీజాల సంయోగం ఆధారపడుతుందని తాజా పరిశోధన తేల్చింది. వీర్యకణాల తోకల పొడవుల్లో తేడాలు ఎక్కువగా ఉంటే వాటి సామర్ధ్యత తగ్గుతుందని అంటు న్నారు ఈ పరిశోధకు లు. దీని మూలం గానే 300 మిలియన్ల వీర్యకణాలు ఉత్పత్తి అయితే, వాటిలో కేవలం ఒక శాతం మాత్రమే గర్భాశయం వరకూ వెళ్తాయి. కేవలం కొన్ని డజన్లు మాత్రమే అండం సమీపానికి చేరతాయి. వీర్యకణాలు సరిగా ప్రయాణించలేవని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అవి మార్గంమధ్యలో కాకుండా గోడల్ని పట్టుకుని ప్రయాణిస్తాయనీ, కాస్త ఎక్కువ మలుపుల్లో ప్రయాణించడానికి కష్టపడతాయనీ తేలింది.

కంటిచూపుతోనే..!

సూక్ష్మ సాంకేతికత (నానో టెక్నాలజీ) ఆవిర్భావంతో అద్భుతాలు జరిగే అవకాశాలు అధికమౌతున్నాయి. ఇంతవరకూ రానురాను చిన్నవవుతూ వస్తున్న ఉపకరణాలు ఇకపై మన చూపుల మాటలు వినే దిశగా అభివృద్ధిచెందనున్నాయి. ఒకప్పుడు బటన్లను నొక్కితేనే పనిచేసే ఫోన్లు ఇప్పుడు కేవలం సుతారమైన స్పర్శతోనే స్పందిస్తున్నాయి. ఇదే క్రమంలో స్క్రీన్‌పై మనకు కావలసిన ఐకాన్‌పై కాసేపు దృష్టి సారిస్తే చాలు, అవి స్పందించి పనిచేస్తాయని పరిశోధకులు అంటున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి సూత్రం ఉపయోగ పడుతుందో ఇంకా వెల్లడించలేదు. మొత్తానికి, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు కంటిచూపుతో పనిచేసేరోజులు త్వరలో రానున్నాయని హాలెండ్‌ పరిశోధకులు సెలవిస్తున్నారు.

వయస్సుతో పాటు మారే ఇష్టం..!

పదహారేళ్ళ వయస్సులో అమ్మాయిలకు 'మిస్టర్‌ పర్ఫెక్ట్‌' అనిపించే వ్యక్తి కొన్నేళ్ళు గడిచాక అస్సలు నచ్చకపోవచ్చు. అందుకు కారణం ఆమెలో పెరుగుతున్న పరిణితి అని మనం అనుకుంటాం. కానీ అసలు కారణం హార్మోనులలో వచ్చే మార్పులే అంటున్నారు శాస్త్రవేత్తలు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మగువల్లో హార్మోనులు విడుదల కావడంలో వ్యత్యాసాలు భారీగా ఉంటాయట. ఆ కారణంగా వారి ఆలోచనలు, పరిస్థితులను తట్టుకునే, ఎదుర్కొనే శక్తి, దృక్పథంలో మార్పులు వస్తాయట! ఫలితంగా స్థిరమైన ఆలోచనలు ఉన్నపుడు ఇష్టపడిన వ్యక్తులు కొన్ని సంవత్సరాలకే నచ్చకపోవచ్చట! ఈ నచ్చకపోవడం భర్త విషయంలోనూ, పిల్లల విషయంలోనూ కూడా జరుగుతుందని అంటున్నారు. కానీ సామాజిక కట్టుబాట్ల వల్ల కొన్ని విషయాలు బయటపడవని పరిశోధకుల అంచనా. అయితే, ఇదే విషయంలో పురుషులు మరింత త్వరగా తమ అభిప్రాయాలను, ఇష్టాలను మార్చేసుకుంటారట! ఇదంతా మానవులలో వున్న జంతు లక్షణం అని అంటున్నారు.

భారీ కాయంతో..!

అధికబరువు, ఊబకాయం వంటివి ఎన్నో ఇబ్బందులను కలిగిస్తాయని తెలుసు. ఇప్పుడు ఊబకాయం వున్న స్త్రీలు గర్భం ధరిస్తే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం అంటున్నారు. ఊబకాయం వల్ల శరీరంలో కొవ్వేకాక ఇతరరకాల సమస్యలూ ఎక్కువే. ముఖ్యంగా గర్భాశ యం, దానికి సంబంధిత నాళాలు వంటివి కూడా సక్రమంగా ఉండవని పరిశోధకులు గమనించారు. భారీకాయులు గర్భం ధరించడమే కష్టం. ఒకవేళ ధరించినా, దాన్ని నిలుపుకోవడం మరింత కష్టం అంటున్నారు. హార్మోనులు, శరీర చర్యలు (మెటబాలిజం) సక్ర మంగా జరగవని, అందువల్ల బిడ్డ సరిగా అభివృద్ధి చెందదని పరిశోధకులు గమనించారు.

Wednesday 19 December 2012

శ్రీనివాస రామానుజన్‌ వారసత్వం...

 
శ్రీనివాస రామానుజన్‌ అనగానే గుర్తుకొచ్చేది 32 ఏళ్లలోనే పేదరికాన్ని, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు గడించిన ఓ 'సహజ గణితశాస్త్ర మేధావి'. ఈయన జీవితచరిత్ర యువ మేధావులకు ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఈ స్ఫూర్తి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిలో విజయాల్ని సాధించాలనే పట్టుదలను పెంచుతుంది. ఇంత పిన్న వయస్సులోనే రామానుజన్‌ సాధించిన విజయాలు అందరినీ అబ్బురపరిచాయి.. పరుస్తున్నాయి. ఈ వారసత్వాన్ని మనదేశ యువ మేధావులకు అందించాలనే ఏకైక లక్ష్యంతో ఆయన జన్మదినమైన డిసెంబర్‌ 22ను 'గణితశాస్త్ర దినోత్సవం'గా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదేవిధంగా ఆయన 125వ జయంతి సంవత్సరాన్ని 'జాతీయ గణితశాస్త్ర సంవత్సరం'గా ప్రభుత్వం ప్రకటించింది. దీని ముగింపు ఉత్సవంగా ఈ నెల 17-22 తేదీల మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయం 'శ్రీనివాస రామానుజన్‌ వారసత్వం' పేరుతో అంతర్జాతీయ గణితశాస్త్ర సదస్సును నిర్వహిస్తుంది. ఈ సందర్భంలో రామానుజన్‌ జీవిత విశేషాలను, సాధించిన విజయాలను క్లుప్తంగా తెలుపుతూ మీముందుకు వచ్చింది ఈవారం 'విజ్ఞానవీచిక'.
ఆధునిక జీవితంలో గణితశాస్త్రం లేని పార్శ్వం లేదంటే అతిశయోక్తి కాదు. పొలాల్లో సేద్యం చేస్తున్నా, అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నా.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వ్యాయామం చేస్తున్నా, చిత్రలేఖనం వేస్తున్నా, చరిత్రను తెలుసుకోవాలన్నా.. మన నిత్యజీవితంలో ఇతర అనేక విషయాల్లో గణితశాస్త్ర ప్రమేయం లేకుండా సాధ్యం కాదు. ఇంతటి ప్రాముఖ్యతగల గణితశాస్త్రం, కారణాలేమైనప్పటికీ, అందరికీ అంత తేలిగ్గా అన్పించదు.
జీవితం..
ఇప్పటి తమిళనాడు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సిలోని 'ఈరోడ్‌'లో 1877, డిసెంబర్‌ 22న శ్రీనివాస రామానుజన్‌ జన్మించారు. అతి పిన్న వయస్సులో, పదేళ్లలోపే, ఆయనకు ఎస్‌.ఎల్‌.లోనీ రచించిన 'త్రికోణమితి' (ట్రిగనోమేట్రీ) పుస్తకాన్ని చదివే అవకాశం లభించింది. దీన్ని కేవలం రెండేళ్లలోనే రామానుజన్‌ ఆకళింపు చేసుకోడమేకాక, దీనిలో వున్న ముఖ్యమైన ఎన్నో సిద్ధాంతాల్ని నిరూపించగలిగాడు. కొన్నింటిని స్వతంత్రంగా గుర్తించాడు. ఈ వయస్సులోనే గణితశాస్త్రంలో ఈయన ఎన్నో బహుమతుల్ని పొందాడు. పదిహేనేళ్లు వచ్చేటప్పటికి సంఖ్యాశాస్త్రం మీద ఆయన పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. 1911లో 'ఇండియన్‌ మ్యాథమెటికల్‌ సొసైటీ జర్నల్‌'కు మొదటి పరిశోధనా పత్రాన్ని పంపించాడు. గణితశాస్త్రంలో అసమాన ప్రతిభను కనబర్చినప్పటికీ, ఈ శాస్త్ర ఆవిష్కరణలోకి రామానుజం ప్రవేశం మాత్రం అంత తేలిగ్గా జరగలేదు. అక్కడ ప్రభుత్వ కళాశాలలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌ లభించినప్పటికీ, వార్షిక పరీక్ష తప్పడంతో అది రద్దయ్యింది. దీనికి ప్రధానకారణం, లెక్కల్లో ప్రతిభకనబర్చినా, మిగతా పాఠ్యాంశాల్లో తప్పడం. గణితశాస్త్రంపైనే పూర్తి సమయం కేంద్రీకరించడంతో మిగిలిన పాఠ్యాంశాల్ని చదవడానికి చాలినంత సమయం లేకపోయేది. జీవనోపాధి కోసం స్థానిక అకౌంటెంట్‌ జనరల్‌ ఆఫీసులో గుమస్తాగా పనిచేశాడు. కానీ, అక్కడ ముందుచూపుగల పోర్ట్‌ట్రస్ట్‌ ఛైర్మన్‌ ఈయనకు గణితశాస్త్రంలో పరిశోధనలు చేసే అవకాశం కల్పించాడు. ఫలితంగా 1912-13లో కేంబ్రిడ్జి యూనివర్శిటీలోని 'హార్డి' అనే గణిత శాస్త్రజ్ఞుడికి పత్రాలు సమర్పించాడు. అయితే, వాటిని హార్డి మొదట్లో అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత హార్డి ఆ పత్రాలను పరిశీలించి, రామానుజన్‌ను 1914లో ఇంగ్లండ్‌కు రప్పించాడు. రామానుజన్‌ ఇంగ్లండ్‌ (కేంబ్రిడ్జి) కు వెళ్లినప్పుడు హార్డి దగ్గరనే స్వతంత్రగా పరిశోధనలు చేశాడు. రామానుజన్‌ గణితశాస్త్ర పరిశోధనలు ఒక క్రమపద్ధతిలో వుండేవి కాదు. ఇవి తర్కం, ఆలోచనల, అవగాహనల మీద ఆధారపడి వుండేవి. ఒకోసారి ఫలితాలు వచ్చినా, వాటికిగల కారణాలను నిర్ధిష్టంగా చెప్పలేకపోయేవాడు. అయితే, హార్డి ఈ అంతరాల్ని పూరించేవాడు. కేంబ్రిడ్జి యూనివర్శిటీ 1916లో రామానుజన్‌కు ఆయన పరిశోధనల ఆధారంగా 'సైన్స్‌' డిగ్రీని ఇచ్చింది. అక్కడ రాయల్‌ సొసైటీలో మొదటి భారతీయ ఫెల్లోగా ఎంపికయ్యాడు.
ఈయన సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన సిసలైన శాఖాహారి. యుద్ధ సమయంలో ఈయనకు సరైన ఆహారం దొరకేది కాదు. దీనికితోడు వాతావరణం సరిపడక ఆరోగ్యం క్షీణించింది. 1918లో ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడటంతో స్వదే శానికి తిరిగి వచ్చాడు. కానీ, 1919లో ఈయన అనారోగ్యం ముదిరి, క్షయ వ్యాధి తో మరణించాడు. ఈయన ప్రత్యేకత ఏమిటంటే తను రాసిన నోటు పుస్తకాల్ని పదిలంగా దాచుకోవడమే. ఇవి ఆ తర్వాత ప్రచురితమయ్యాయి. పరిశోధన లకూ ఉపయోగపడ్డాయి. ఈయన చేసిన సూత్రీకరణలు చాలాకాలం తర్వాత నిరూ పింపబడ్డాయి. ఈయన నోట్స్‌ను ఆధా రంగా చేసుకుని అమెరికన్‌ గణిత శాస్త్ర వేత్త 'బ్రూస్‌ సి బ్రాంట్‌' పలు సంపుటా లను రచించాడు. 1997 నుంచి 'రామా నుజన్‌ జర్నల్‌' అనే పేరున ఒక గణిత మ్యాగజైన్‌ ప్రారంభమై నేటికీ కొనసాగు తోంది. దీనిలో ఈయన చేసిన అనేక సూత్రీకరణల ప్రభావాల్ని విశ్లేషిస్తున్నారు.
గణితశాస్త్ర దినోత్సవ విశేషాలు..
జాతీయ స్థాయిలో 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ & టెక్నాలజీ' (డిఎస్‌టి) ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించినా, వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ కార్యక్రమాలను స్కూలు, కళాశాల, విశ్వవిద్యాలయం లేదా సాధారణ ఇతర సంస్థలు కూడా నిర్వహించవచ్చు. మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాల ప్రోత్సాహానికి 'ఆంధ్రప్రదేశ్‌ శాస్త్ర, సాంకేతిక మండలి (అప్‌కాస్ట్‌)' కృషి చేస్తుంది. ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ప్రజల్లో గణితశాస్త్రం పట్ల ఆసక్తిని, అవసరాన్ని గుర్తింపచేయడం. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని పటిష్టపరుస్తూ శాస్త్రీయ దృక్పధాన్ని అందరిలో కలగజేయడం మరో ముఖ్యోద్దేశం. దీనిలో భాగంగా వక్తృత్వ, క్విజ్‌, ఉపన్యాసాల పోటీలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయవచ్చు. పరిశోధనా సంస్థలు, ప్రయోగశాలలు, విద్యాసంస్థలు, శాస్త్ర, సాంకేతిక ఆధారిత ప్రభుత్వేతర సంస్థలు ఈ కార్యక్రమాల్ని చేపట్టవచ్చు. మామూలుగా ఈ కార్యక్రమాలు అక్టోబర్‌లో ప్రారంభమై, డిసెంబర్‌ 22తో పూర్తయ్యేలా నిర్వహించాలని వీరు సూచిస్తున్నారు.
గణితశాస్త్రం అంటే?
దీనికి అంకెలతో ప్రమేయం వున్నప్పటికీ ఈ శాస్త్రం కేవలం సంఖ్యలకే సంబంధించింది కాదు. దీని పరిధి చాలా విస్తృతమైంది. వివిధ అంశాల మధ్య సంబంధాల్ని చూడగలగడం, తర్కం (లాజిక్‌), అనుప్రయోగ సామర్థ్యము, సృజనాత్మకత అన్నీ దీనిలో ఇమిడి వున్నాయి. మన నాగరికత అభివృద్ధికి ఇది ఎంతో తోడ్పడుతుంది. అన్నిరకాల విజ్ఞానశాస్త్రాల ప్రగతిలో ఇది కీలకపాత్ర వహిస్తుంది. దీని అత్యున్నతమే నేడు మనం చూస్తున్న కంప్యూటర్‌ విజ్ఞానం, సమాచార సాంకేతిక విజ్ఞానం. ఈ రెండూ ఇతర సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి ఆధారంగా విశ్వాన్ని అర్థంచేసుకోవడంలో మనం చాలా ముందుడుగు వేయగలిగాం. ఆర్థిక, సామాజిక రంగాలలో ఎన్నో మార్పుల్ని తెస్తూ, శ్రామికులు, పేదల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్న ప్రపంచీకరణకూ ఇదే మూలం.
ఆసక్తి ఎలా..?
ఓ ఒకే సమాధానం వచ్చే తేలికపాటి నోటి లెక్కల్ని నేర్పాలి. ఉదా: 2×2=4, 3+1=4, 5-1=4 8క్ష్మి2=4.. భలే ఎలాగైనా నాలుగే వస్తుంది కదా! ఇలా చెప్పడం పిల్లలకి హుషారునూ, ఆసక్తినీ కలిగిస్తుంది.
- ఆలోచనల్ని పెంచుకోవడం, ఎత్తుగడలు వేయడమే లెక్కలు. అందుకే వీటి గురించి భయపడాల్సిన పనిలేదు.
- లెక్కలు అంటే అంకెలనీ, సమాచారం సేకరణ అనీ, ఆల్‌జీబ్రా అంటే గుండెగాబరా అనీ రకరకాల వ్యాఖ్యానాలు వాడుకలో ఉన్నాయి. కానీ పిల్లలకు పదిరూపాయలు ఇచ్చి చాక్లెట్లు తెచ్చుకోమంటే అవసరమైనంతే తెచ్చుకుని మిగిలిన చిల్లర మనకు ఇచ్చేస్తారు. ఇలా సమాజం ద్వారానే పిల్లలు మొదట లెక్కల్ని నేర్చుకుంటారు.
- పుస్తకాలతో, పెన్నులతో పనిలేకండా 99 లోపు అంకెలతో కూడికలు, తీసివేతలు, వేళ్లతోనే ఎంచక్కా చేయవచ్చు.
- ప్రాథమిక విద్య నేర్చుకునే పిల్లలు ఆడుతూ పాడుతూ చిన్ని చిన్ని లెక్కల్ని నేర్చుకోవచ్చు. దీన్ని ఫింగర్‌ మెథడ్‌ అంటారు.
- ఒకవారం పేపరు, పుస్తకం, పెన్ను ఏమీ ఇవ్వకుండా ఆటలతో లెక్కలు చెప్పాలి. లెక్కలు ఇంత తేలికా అని పిల్లలు అనుకుంటారు. తర్వాత వాళ్లే ఎంతో ఇష్టంగా లెక్కలు నేర్చుకుంటారు. చేస్తారు.
- ప్రతిరోజూ పేపర్‌లో అంకెలతో వచ్చే ఫజిల్స్‌, ప్లేకార్డ్సు ద్వారా తీసివేతలు, కూడికలు నేర్పించవచ్చు. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది లెక్కల్లోనే కాకుండా ఇతర అంశాల్ని చదవడంలో కూడా తోడ్పడుతుంది.
హైస్కూల్‌ పిల్లలంటే కొంత చదువు గురించి అవగాహన కలిగినవాళ్లు. అందువల్ల..
- సైన్సు, లెక్కలు దేశాభివృద్ధికి ఎంత ఉపయోగమో వారికి అర్థమయ్యేలా ఉపాధ్యాయులు చెప్పగలగాలి.
- పిల్లల్లో సృజనాత్మకత పెరగడానికి పోటీ పరీక్షల్లో తరచూ పాల్గొనేలా చేయాలి. దీనివల్ల గెలుపు-ఓటముల్ని సమానంగా స్వీకరించడం వారికి అలవాటవుతుంది. లేకపోతే ఒకేసారి పరీక్షల్లో తప్పినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడతాయి.
- పరిమితమైన స్వేచ్ఛ ఇస్తూ అంతర్జాలాన్ని (ఇంటర్‌నెట్‌) ఉపయోగించుకునేలా అవకాశం ఇవ్వాలి. గంట టైము మాత్రమే ఇవ్వాలి. గేమ్సు, ఫజిల్స్‌ ఆడనివ్వాలి. అయితే వాళ్లు అవే చేస్తున్నారో లేదో పరిశీలిస్తూ ఉండాలి. లేకపోతే పిల్లలు పక్కదారి పట్టే అవకాశమూ లేకపోలేదు.
- అంతర్జాల సౌకర్యం లేనివారు పేపర్లలో వచ్చే ఫజిల్స్‌ చేయించడంతో పాటు ఫజిల్స్‌ బుక్స్‌ దొరుకుతాయి. వాటిని చేయించాలి.
- ప్రతిదీ టైము పెట్టి చేయడం అలవాటు చేయాలి. దీనివల్ల సమయపాలన పిల్లలకు చిన్నప్పుడే అలవాటవుతుంది.
- మొదట ఇష్టం వచ్చినంతసేపు చదవమనాలి. ఆ తర్వాత టైము పెట్టి చదవమనాలి.
- బాగా చదవగల అబ్బాయి పక్కనే కొంచెం ప్రోత్సహిస్తే అభివృద్ధి చెందగలిగే అబ్బాయిని కూర్చోబెట్టి ఒకే లెక్క ఇద్దరికీ ఇచ్చి, టైము పెట్టి చేయించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో పట్టుదల పెరిగి బాగా చేస్తారు.
- అలాగే తొందరగా చేసేస్తే, మిగిలిన టైము ఆడుకోవడానికి వదలాలి. అలా చేయడం కూడా వారిని ప్రోత్సహించినట్లవుతుంది.
- నావకు దిక్సూచీ వలే ఉపాధ్యాయుడు పిల్లలకు మార్గదర్శకుడిలా ఉండాలి.
- పిల్లలకు ఆసక్తిగా చెప్పేందుకు ఉపాధ్యాయుడు ముందే సిద్ధమై, తరగతికి రావాలి.
- పిల్లలకు అర్థమవ్వడానికి అవసరమైతే చెప్పే పద్ధతుల్లో మార్పు చేసుకోవాలి.
- ఉపాధ్యాయులు చెప్పిన పద్ధతిలోనే లెక్క చేయడం కాకుండా, వేరే పద్ధతుల్లో చేసేందుకు పిల్లలకు అవకాశమివ్వాలి. అలా చేసినప్పుడు వారిని అభినందించాలి. ఇది చాలా ముఖ్యం.
- లెక్కల్లో బట్టీపట్టే విధానం అస్సలు కూడని పద్ధతి. లెక్కను ఏ సూత్రం ప్రకారం ఎలా పరిష్కారం (సాల్వ్‌) చేయాలో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి.
- మొత్తంమీద గణితం, లెక్కలు చేయడం చాలా తేలికనే భావన పిల్లల్లో కలిగించాలి.

పూనక రహస్యం?

           పూనకాలు రావడం, జాతర్లలో డప్పులకు అనుగుణంగా ఊగిపోతూ భక్తులు నృత్యాలు చేయడం వెనుక రహస్యం ఏమిటి? - పి.అరవింద్‌, సాయిచరణ్‌, నెల్లూరు

పూనకాలు, దయ్యంపట్టడం వంటివి పల్లెటూళ్ల లో విరివిగా చూస్తాము. తమాషా ఏమిటంటే ఈ పూనకాలు, దయ్యాలు బాగా డబ్బులున్నవాళ్లకు, పారిశ్రామికాధిపతులకు, ప్రొఫెసర్లకు, ఐఏఎస్‌ అధికార్లకు, శాస్త్రవేత్తలకు, రాజకీయనాయకులకు ఎప్పుడూ పట్టవు. వారెపుడూ పూనకా లతో ఊగిపోవడం మనం చూడం. ఎటొచ్చీ గ్రామీణుల్లోనూ, అందునా పేదవర్గాలలోనూ, ఇళ్లల్లో తాగుబో తులు, జూదగాళ్లు వున్నచోట్ల ఇలాంటి హడావిడి చూస్తాము. ముఖ్యంగా ఈ పూనకాలు స్త్రీలలో ఎక్కువ. ఇటీవల కాలంలో ఖమ్మం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కొందరు మహిళలు పూనకాలు వచ్చి, భవిష్యవాణిని వినిపిస్తూ మీడియాలో గొప్ప ప్రచారం పొందుతున్నారు. పూనకాలు లేదా దయ్యంపట్టడం ప్రధా నంగా రెండు రకాలు. ఒకటి : దొంగవేషాలు. మామూలుగా మాట్లాడితే ఎవరూ వినరని లేని పూనకానికి పూనుకుంటారు. దయ్యం పట్టినట్లు నటిస్తారు. మనసులో వున్న తిట్లు, శాపనా ర్థాలు, ఆందోళనలు, ఆలోచనలు, అవసరాలు బయటపెట్టేం దుకు దయ్యం పట్టడం, పూనకాలు ఆవహించడం వంటి ముసుగులో కేకలేస్తుంటారు. ఇలాంటి దయ్యాల్ని సుతా రంగా నాలుగు బడితె దెబ్బలతో వదల గొట్టొచ్చు లేదా అడిగిన మాంసం కూరో, నగలో ఇచ్చి సంతృప్తిని కలిగించే కార్యక్రమమో చేస్తే దయ్యం మాయమవు తుంది. పూనకం పూర్తవుతుంది.
ఇక రెండోది: ఇది ఓ రకమైన మానసిక జబ్బు. మనస్సులో వున్న ఎన్నో కష్టాలు, ఆవేదనలు, అగచాట్లు మితిమీరినపుడు వారి అదుపాజ్ఞలు లేకుండానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఇలాంటి ప్రకోపనాల న్నింటినీ కలిపి 'హిస్టీరియా' జబ్బు అంటాము. ఇది ముఖ్యంగా పీడిత మహిళల్లో గమనిస్తాము. రోజూ తాగి వచ్చి తన్నే భర్త, చదువు సంధ్యలు మానేసి బలదూరుగా తిరుగుతూ రోజూ వచ్చి ఇంట్లో అవీయివీ పట్టుకెళ్లి, జూదాల్లో, పోకిరీ వేషాల్లో పారేసుకొనే కొడుకులు, అత్తల ఆరళ్లు భరించలేక మానసికంగా ప్రతిక్షణం కుమిలిపోతున్నా ఏమి చేయలేని పరిస్థితి దాపురించినపుడు వారి అదుపాజ్ఞల్లో లేకుండానే మానసిక ప్రకోపనాలు ఏర్పడే అవకాశం ఉంది. అపుడపుడూ ఇలాంటి ప్రకోపనాలు మితిమీరి, వారు వింత ప్రవర్తనల్ని ప్రదర్శిస్తారు. ఇలాంటి 'పూనకాల్ని', 'దయ్యం'పట్టడాల్ని మనం సానుభూతితో అర్థంచేసుకోవాలి. కాసేపు విశ్రాంతినివ్వాలి. పూనకం వచ్చిన వారిలోని మానసికస్థితిని మెరుగుపర్చేందుకు మానసిక వైద్యుణ్ణి సంప్రదించిగానీ, ఇంట్లో కష్టాల్ని కలిగించే అంశాల్ని కాస్తన్నా తగ్గించిగానీ స్వాంతన కలిగించాలి. ఇలాంటి పూనకాల్ని వేప మండలతో కొట్టి, చీపురుకట్టలతో బాది, వారిని హింసించి తగ్గించాలనుకోకూడదు. వాళ్లను పీడిస్తున్న దయ్యాలు ఎక్కడో లేవు. ఇంట్లో తాగుబోతు భర్తే పెద్దభూతం, ఆశల్ని అడియాసలు చేసిన కన్నకొడుకే కసాయి దయ్యం. కట్నం తేలేదని బాధించే అత్తమామలే అసురగణం. కుటుంబ సమస్యలు, ఆర్థిక అగచాట్లు, అప్పుల పీడనలే ఆమె పాలిట పిశాచాలు. ముందు ఆ దయ్యాల్ని, భూతాల్ని, అసురగణాల్ని, పిశాచాల్ని పొలిమేర దాటిస్తే ఎప్పటిలాగే ఆ మహిళలు బంగారు జీవితాన్ని పొందగలుగుతారు.
జాతర్లలో డప్పుల శబ్దాలకు అనుగుణంగా నృత్యాలు చేయడం మామూలే. లయబద్ధమైన సంగీతాలకు, వాయిద్యాలకు అనుగుణంగా పాదాలు తాడించడం, చేతులు కదిలించడం, దేహం మొత్తాన్ని అనునాదంగా ఊగించడం మానవ నైజం. సంగీతమనే బలానికి ప్రతిస్పందనే అలాంటి ప్రత్యానుభూత నృత్యాలు. వాటిని మనం అర్థంచేసుకోవాలి, ఆదరించాలి. అయితే మరీ విర్రవీగి అడ్డగోలుగా, లయ విరుద్ధంగా అసందర్భ భంగిమలతో హంగామా చేయడం మాత్రం మద్యపాన ఫలిత వికృతాకృతమే! ఇక్కడ దయ్యం, గియ్యం ఏమీ లేదు. బాగా కైపెక్కి కన్నూ, మిన్నూగానక చేసే వితండ తాండవమే అది. మద్యం కైపు తగ్గాక మధ్యలోనే నృత్యం కానిచ్చి నిష్క్రమించేసి కథ ముగిస్తారు.
శాస్త్ర విజ్ఞానం ప్రకారం దయ్యాలు లేవు. దయ్యాన్ని ఎవ్వరూ చూడలేదు. చూడలేరు కూడా. ఎందుకంటే అవి లేవు. మనుషులు చనిపోయాక ఆత్మలు దయ్యాలవుతాయని, తీరని కోర్కెల్ని తీర్చుకొనేందుకు అనువైన (ఙబశ్రీఅవతీabశ్రీవ) మనుషుల్ని ఆవహించి, అవసరాల్ని పరిపుష్టి చేసుకొన్నాకగానీ ఆ ఆత్మలు ఆవహించిన వారిని వదల వనీ, వారికి పట్టిన దయ్యాల్ని మంత్రగాళ్లు (వఞశీతీషఱర్‌ర) మంత్రాలతో, వేపాకు తాడనాలతో, పొగలతో, 'హాం, హీం, క్రీమ్‌, భ్రీమ్‌, హామ్‌..' వంటి భీకర శాపాలతో మాత్రమే వదలగొట్టగలరని భావించడం సోమరిపోతుల్ని ప్రోత్సహించడమే అవుతుంది.
సినిమాలలో, కథలలో, కొన్ని టీవీ ఛానళ్లలో చూపుతున్న దయ్యాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, పూర్వ జన్మ స్మృతులు, మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, బాణామతులు, చేతబడులు ఇవన్నీ అశాస్త్రీయ అమానుష ప్రక్రియలు. పనిగట్టుకొని దోపిడీశక్తులు, మతఛాందస భావ వ్యాప్తి సంతృప్త మనస్కులు చేసే విషప్రచారాలు మాత్రమే.
అవసరాలు తీరని ఆత్మలు ఏవైనా దయ్యం రూపంలో పేద, అమాయక ఆడవాళ్ళని ఆవహిస్తే ఆ దయ్యాలకేం లాభం? ఏదైనా గొప్ప మంత్రినో, గనుల సామ్రాజ్యరాజునో, సాగరతీరాల్ని కబళించి ప్రజల భూముల్ని కబ్జా చేసి వేలాది కోట్లు దండుకొనే సంపన్నులనో పట్టుకొంటే అన్ని కోర్కెలు క్షణాల్లో తీరతాయి. అభ్యుదయవాదులమందరం ఆ దయ్యాలకు ఈ విధమైన అర్జీపెట్టుకొందాం. అపుడు పేద మహిళలకు, గ్రామీణ రైతులకు పట్టిన దయ్యం వదులుతుంది.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

ఎవరి వాస్తు వారిదే..!

  • వాస్తు.. వాస్తవాలు..
               అది విజయవాడ పక్కనే ఉన్న సీతానగరంలోని చినజియ్యర్‌ ఆశ్రమం. దానిలో ఆరోజున వాస్తుపై వాస్తు వాదులకూ, వాస్తు వ్యతిరేకులకూ చర్చ జరగబోతోంది. ''సత్యాన్వేషణ మండలి' బాధ్యులు పుట్టా సురేంద్రబాబు ఏర్పాటు చేసిన ఆ చర్చకు చిన జియ్యర్‌స్వామి అనుమతించారు. ఆ చర్చకు వాస్తువాదులూ, వాస్తు వ్యతిరేకులూ, ఆహుతులందరూ వచ్చారు. సురేంద్రబాబు పరిచయవాక్యాల అనంతరం చర్చ మొదలైంది. మొదటగా వాస్తువాది రామయ్య (పేరు మార్చబడింది) మాట్లాడుతూ ''అన్ని సమస్యలకూ కారణం వాస్తే. అన్నిటికీ పరిష్కారం వాస్తే. నా పరిశోధనలో తేలిందేమిటంటే వాస్తు విరుద్ధమైన ఇళ్ళల్లో నివసించడమే అనారోగ్యం, దరిద్రం, ఉద్యోగ బాధలు మొదలైన అన్ని ఈతి బాధలకూ మూలకారణం. కొందరు చెబుతున్నట్లుగా ఎక్కడో ఆకాశంలో ఉన్న గ్రహాలకు మన జీవితాలను శాసించే శక్తి ఉందనడం అర్ధరహితం'' అన్నాడు. వెంటనే మరో వాస్తువాది నరసింహం (పేరు మార్చబడింది) లేచి ''రామయ్య చెప్పేదే అర్ధరహితం. మానవులను ఎండ, వాన, చలి నుండి కాపాడునదే గృహముగానీ మానవుల కష్టసుఖములన్నిటికీ వాస్తే మూలకారణమనటం అర్ధరహితమైన వాదన'' అన్నాడు. వెంటనే మరో వాస్తువాది వెంకట్రావు లేచి ''మానవుని యొక్క దశను ఇంటియొక్క దిశయే నిర్ణయిస్తుందని మా గురువు రామయ్య 30 సంవత్సరాల పరిశోధనలో అనేక వందల ఇళ్ళల్లో నిరూపించారు. ఉదాహరణకు ఈశాన్యం పెరగకపోతే దిఙ్మూఢం (దింగ్మూఢం) అని శాస్త్రం చెబుతోంది. ''దింగ్మూఢం కులనా శస్వాత్‌'' అని ప్రాచీన గ్రంథాలు కూడా ఘోషిస్తున్నాయి. అంటే ''ఈశాన్యం పెరగకపోతే వంశ నాశనం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మా గురువు సూచనను అనుసరించి ఈశాన్య మూలన స్థలాన్ని పెంచుకున్నవారు అనేకమంది సుఖాలను అనుభవిస్తున్నారు. అదీ వాస్తుశాస్త్ర మహిమ'' అన్నాడు. వెంటనే మరో వాస్తువాది ప్రకాశరావు లేచాడు. వాస్తు వ్యతిరేకులకు అవకాశమీయకుండా వాస్తువాదులే ఒకరి వాదననొకరు ఖండించుకోవడం వాస్తు వ్యతిరేకులకు వింతగానూ, ఆనందంగానూ ఉంది. ప్రకాశరావు మాట్లాడుతూ ''మానవులు నివసించే స్థలం ఏమూలన పెరిగినా శోకమే మిగులుతుందని 'శోకో విషమ బాహుకే' అనే శాస్త్ర ప్రమాణం చెబుతోంది. అంతేకాదు. మా గురువు నరసింహం పరిశోధనల్లో రుజువైంది కూడా అదే. ఈశాన్యం పెరగడం కోసం పక్కింటివారి స్థలాన్ని ఆక్రమించుకొని, తగవులపాలై, కోర్టులకెక్కి, ఆర్థికంగా నాశనమైన వారెందరో వున్నారు. కాబట్టి ''దింగ్మూఢం కులనాశస్యాత్‌ అనేది వాస్తు విరుద్ధం'' అన్నాడు. అలా వాదనలు పెరిగి, పెరిగి వాస్తువాదులే ఒకరినొకరు వ్యక్తిగతంగా నిందించుకొనేంత వరకూ పరిస్థితి మళ్ళింది. చర్చ రసాభాసగా మారింది. దీనితో వాస్తు వ్యతిరేకులు ఒక్కమాట కూడా మాట్లాడకుండానే 'వాస్తు అనేది పరస్పర విరుద్ధాంశాలతో కూడినదని'' ఆహుతులు అర్థంచేసుకోడమే ఆనాటి 'వాస్తు సంవాద' ఫలితం..!

కె.ఎల్‌.కాంతారావు,
జన విజ్ఞాన వేదిక.

టైటాన్‌పై హైడ్రోకార్బన్‌ నది..!

         శనిగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం అయిన టైటాన్‌పై అతి భారీ నదీవ్యవస్థను నాసా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. శని గ్రహపు చంద్రుడు టైటాన్‌పై కనిపించే నదీ లోయ 400 కిలోమీటర్ల కంటే పొడవుగా ఉంది. అది టైటాన్‌ ఉత్తర ధృవప్రాంతంలో 'క్రాకెన్‌ మారే' అనే సముద్రం లోకి ప్రవహిస్తు న్నట్టు తెలిసింది. నాసా పంపించిన ''కాసిని'' మిషన్‌ ద్వారా ఇటు వంటి నదీవ్యవస్థ స్పష్టంగా కనిపించడం ఇదే తొలిసారి. సౌర కుటుంబంలో భూ గ్రహం తరువాత ద్రవరూపంలో విస్తారమైన సముద్రాలు ఉండే అవకాశం ఉన్నది టైటాన్‌పైనే! అయితే అక్కడి చిక్కటి వాతావరణం వలన ద్రవం త్వరగా ప్రవహించదు. టైటాన్‌పై ద్రవాలు హైడ్రోకార్బన్‌లు - ఇథేన్‌, మీథేన్‌ వంటి వాటితో వుంటాయని తెలిసింది. మన గ్రహంపై ద్రవం నీరు అయితే టైటాన్‌పై అది మీథేన్‌.

టైటాన్‌పై హైడ్రోకార్బన్‌ నది..!

         శనిగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం అయిన టైటాన్‌పై అతి భారీ నదీవ్యవస్థను నాసా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. శని గ్రహపు చంద్రుడు టైటాన్‌పై కనిపించే నదీ లోయ 400 కిలోమీటర్ల కంటే పొడవుగా ఉంది. అది టైటాన్‌ ఉత్తర ధృవప్రాంతంలో 'క్రాకెన్‌ మారే' అనే సముద్రం లోకి ప్రవహిస్తు న్నట్టు తెలిసింది. నాసా పంపించిన ''కాసిని'' మిషన్‌ ద్వారా ఇటు వంటి నదీవ్యవస్థ స్పష్టంగా కనిపించడం ఇదే తొలిసారి. సౌర కుటుంబంలో భూ గ్రహం తరువాత ద్రవరూపంలో విస్తారమైన సముద్రాలు ఉండే అవకాశం ఉన్నది టైటాన్‌పైనే! అయితే అక్కడి చిక్కటి వాతావరణం వలన ద్రవం త్వరగా ప్రవహించదు. టైటాన్‌పై ద్రవాలు హైడ్రోకార్బన్‌లు - ఇథేన్‌, మీథేన్‌ వంటి వాటితో వుంటాయని తెలిసింది. మన గ్రహంపై ద్రవం నీరు అయితే టైటాన్‌పై అది మీథేన్‌.

టైటాన్‌పై హైడ్రోకార్బన్‌ నది..!

         శనిగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం అయిన టైటాన్‌పై అతి భారీ నదీవ్యవస్థను నాసా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. శని గ్రహపు చంద్రుడు టైటాన్‌పై కనిపించే నదీ లోయ 400 కిలోమీటర్ల కంటే పొడవుగా ఉంది. అది టైటాన్‌ ఉత్తర ధృవప్రాంతంలో 'క్రాకెన్‌ మారే' అనే సముద్రం లోకి ప్రవహిస్తు న్నట్టు తెలిసింది. నాసా పంపించిన ''కాసిని'' మిషన్‌ ద్వారా ఇటు వంటి నదీవ్యవస్థ స్పష్టంగా కనిపించడం ఇదే తొలిసారి. సౌర కుటుంబంలో భూ గ్రహం తరువాత ద్రవరూపంలో విస్తారమైన సముద్రాలు ఉండే అవకాశం ఉన్నది టైటాన్‌పైనే! అయితే అక్కడి చిక్కటి వాతావరణం వలన ద్రవం త్వరగా ప్రవహించదు. టైటాన్‌పై ద్రవాలు హైడ్రోకార్బన్‌లు - ఇథేన్‌, మీథేన్‌ వంటి వాటితో వుంటాయని తెలిసింది. మన గ్రహంపై ద్రవం నీరు అయితే టైటాన్‌పై అది మీథేన్‌.

భూతాపాన్ని ఎదుర్కోవచ్చు..!

           అనూహ్యంగా అధికమవుతున్న భూతాపోన్నతిని అధిగమించడానికి ఒక అమెరికన్‌ శాస్త్రవేత్త పరిష్కారం సూచించాడు. ఆర్కిటిక్‌ ప్రాంతాన్ని పునఃఘనీభవించడమే ఆ సూచన. 'డేవిడ్‌ కీత్‌' అనే హార్వార్డ్‌ ఆచార్యుడు కాంతిని పరావర్తనం చెందించే పదార్థాలను అక్కడి వాతావరణంలోకి వదిలితే, అవి సూర్యరశ్మిని భూమి మీదకు తక్కువగా వచ్చేలా చేస్తాయని ఆయన అంటున్నారు. ఆ విధంగా ఆర్కిటిక్‌ ప్రాంతంలో శీతల వాతావరణాన్ని తిరిగి కలిగించి, మంచు ఏర్పడేలా చేయవచ్చు అంటున్నారు. సూర్యరశ్మిని కేవలం 0.5% తగ్గించినా కూడా ఆర్కిటిక్‌ ప్రాంతంలో మంచుని గణనీయంగా పెంచవచ్చని ఆయన సెలవిచ్చాడు. గత సెప్టెంబర్‌లో ఆర్కిటిక్‌ మహాసముద్రంపై మంచు 20 ఏళ్ళ క్రితం వున్న దానికంటే సగం వుంది.

ఋతువులతో మారే గృహాలు..!

             బిట్రిష్‌ ఆర్కిటెక్ట్‌లు కొత్తరకం 'స్మార్ట్‌' ఇళ్ళను ప్రతిపాదిం చారు. ఇవి ఋతువులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా తమను తాము మార్పు చేసుకుంటాయి. ఉదాహరణకి ఉద యం నిద్రలేచినపుడు సూర్యోదయం అయితే, ఇల్లు మొత్తం తిరుగుతూ రోజంతా ఇంట్లో సూర్య రశ్మి పడేలా మార్పు చెందు తుంది. ఈ ప్రతిపాదన లకు మూలం గత శతాబ్ది ప్రారంభంలో 'హెన్రీ దాడినీ' అనే ఒక గణిత శాస్త్రవేత్త కనిపెట్టిన సూత్రం. ఒక చతురస్రాన్ని ముక్కలుగా చేసి వాటిని సమభుజ త్రికోణంగా అమర్చడం. ఈ గృహాలు తమ గోడలని మార్చుకుంటూ గదులను తిరిగి రూపొందించు కుంటూ, తలుపులు కిటికీలుగా, కిటికీలు తలుపులుగా మారి కొత్త కొత్తగా తయారవుతాయి. వేడినీ, చలినీ తప్పిస్తూ నిత్యం అనుకూల వాతావరణాన్ని కల్పించే ఈ కొత్త తరహా గృహాలు 'డి హౌస్‌' అనే కంపెనీ ద్వారా రూపొందనున్నాయి.

ఔషధాలతో కరిగే కండోమ్స్‌..!

            శరీరంలోనే కరిగిపోయి, గర్భం, హెచ్‌ఐవి, ఇతర లైంగిక వ్యాధుల రాకుండా నివారించే స్త్రీ కండోమ్‌ని పరిశోధకులు రూపొందించారు. వాష్టింగ్టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు సూక్ష్మ తంతువు లలో ఎలెక్ట్రో స్పిన్నింగ్‌ అనే ప్రక్రియని ఉపయో గించి ఈ కండోమ్‌లు తయారుచేశారు. ఆ తంతువుల్ని ఔషధాలతో అతి సూక్ష్మజాలంలాగా అల్లవచ్చు. ఈ కండోమ్‌ల వాడకం తర్వాత శరీరంలోనే కొన్ని నిమిషాల్లో లేదా కొన్నిరోజుల్లో కరిగిపోయేలా చేయవచ్చు. ఈ విధంగా ఔషధాలను ఇవ్వడం వలన వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

శబ్ధంతో పనిచేసే టూత్‌ బ్రెష్‌..!

          బిట్రన్‌ శాస్త్రవేత్తలు అల్ట్రాసౌండ్‌ తరంగాలతో పనిచేస్తూ, దంతాలను శుభ్రం చేసే బ్రెష్‌ను రూపొందించారు. ఎమ్మిడెంట్‌ అనే ఈ బ్రెష్‌లు నిమిషానికి 86 మిలియన్ల శబ్ధతరంగాలను విడుదల చేస్తాయి. కేవలం ఆ తరంగాలే దంతాలను శుభ్ర పరుస్తాయి. ఆ తరంగాలు ఒక ప్రత్యేకమైన టూత్‌పేస్ట్‌లో లక్షలాది సూక్ష్మ బుడగలను ఏర్పరిచి, తద్వారా దంతాలను శుభ్రం చేస్తాయి. ఎమ్మిడెంట్‌ బ్రెష్‌ ధర 80 పౌండ్‌లు అంటే మనకి దాదాపు ఏడు వేల రూపాయలు. దానితో వాడవలసిన పేస్ట్‌ ధర నాలుగు పౌండ్లు. అంటే 350 రూపాయలు.

Thursday 13 December 2012

అలర్జీలు... అవగాహన...

అలర్జీ వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. ప్రపంచ జనాభాలో 30-40 శాతం దీని బారినపడుతున్నారు. పెద్దల కంటే పిల్లల్లో ఇది ఎక్కువగా వస్తుంది. దీనికి సరైన చికిత్స లేదు. కనిపించే చిహ్నాల ఆధారంగా ఉపశమనం చేయబడుతుంది. పర్యావరణం, వాతావరణ కాలుష్యం, ఆహారంలో వస్తున్న మార్పులు అలర్జీలను పెంచుతున్నాయి. మందుల అలర్జీలు కూడా పెరుగుతున్నాయి. అలర్జీల వల్ల ప్రాణాపాయం లేనప్పటికీ, సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో కష్టాలు, నష్టాలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారిలో వృత్తిపరమైన అలర్జీలతో రోగాలు, నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ప్రపంచ అలర్జీ సంస్థ' 2011లో అలర్జీలపై సమగ్ర సమాచారంతో ఒక నివేదికను తీసుకొచ్చింది. 'ప్రపంచ అలర్జీ సంస్థ' ప్రత్యేక సమావేశాలు హైదరాబాద్‌లో ఈ నెల మొదటివారంలో జరిగాయి. అలర్జీలపై అవగాహన కలిగించుకుంటే వీటి నుండి రక్షించుకోవడానికి వీలవుతుంది. దీనికోసం బాధితుల, బాధిత కుటుంబసభ్యుల, వైద్యుల సమన్వయ పాత్ర ఎంతో అవసరం. వీటికి సంబంధించిన సమాచారాన్ని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
సహజంగా రోగ కారక క్రిములు లేదా హాని కలిగించగల మాంసకృత్తుల అణువులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు శరీర రక్షణ వ్యవస్థ 'ప్రతిరక్షక కణాల (యాంటీబాడీస్‌)' ను ఉత్పత్తి చేసి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ, కొన్ని సందర్భాలలో ఏ రోగ కారక క్రిములు లేదా హాని కలిగించగల మాంసకృత్తుల అణువులు శరీరంలో ప్రవేశించకపోయినా శరీర రక్షణ వ్యవస్థ చురుకుగా మారి, ప్రతిరక్షక కణాలను ఉత్పత్తి చేస్తుంది. దీనితో సహజంగా వుండే రోగ నిరోధకవ్యవస్థ చురుకుగా సహించలేని స్థాయికి మారుతుంది. ఈ స్థితిని అలర్జీగా భావిస్తున్నాం. మరోమాటలో చెప్పాలంటే మన శరీర రక్షణ వ్యవస్థ (దీనిలో తెల్ల రక్తకణాలకు ప్రధానపాత్ర వుంది.) హాని కలిగించగల బయట పదార్థాల నుండి తప్పు సంకేతాల్ని పొందుతూ, అవసరం లేకున్నా ప్రతిరక్షక కణాలను ఉత్పత్తి చేసి, సహించలేని స్థాయికి వెళుతుంది.
అలర్జిన్ల ప్రభావం అందరిలో, అన్ని సమయాల్లో ఒకేవిధంగా వుండదు. ఇది కొద్ది అసహనం నుండి సహించలేని స్థాయిలో వుంటూ మన జీవన విధానాన్నే పరిమితంచేయొచ్చు. అయితే, దీనివల్ల ప్రాణహాని కలగకపోవచ్చు. కానీ, అలర్జీ ఒక పరిధిని దాటినప్పుడు మరణం కూడా సంభవించవచ్చు. అలర్జీకి శాశ్వత చికిత్స లేదు. కానీ, దుష్ప్రభావాల నుండి ఉపశమనం కల్పించవచ్చు.
అలర్జీని కంటితో ప్రతి చిహ్నాల ద్వారా (రెస్పాన్స్‌ సిమ్‌టమ్స్‌) గుర్తించవచ్చు. లేక 'ఇమ్యునోగ్లోబిన్‌ ఇ' పరీక్ష ద్వారా నిర్ధారించుకోవచ్చు. 'ఇమ్యునోగ్లోబిన్‌-ఇ' పరిమాణం అలర్జీ తీవ్రతను సూచిస్తుంది.
ప్రభావ చిహ్నాలు..
మామూలుగా శ్వాసకోశం ప్రభావితం కావచ్చు. ఫలితంగా, ముక్కు నుండి నీరు కారొచ్చు (రైనైటిస్‌). దగ్గు, తుమ్ములు రావొచ్చు. కళ్లు ఎర్రబడి, నీరు కారవచ్చు. అలర్జీ పదార్థాలను తీసుకున్నప్పుడు ఉబ్బసం చిహ్నాలు కనిపిస్తాయి. ఈ సమయంలో శ్వాస నాళాలు సంకోచిస్తాయి. ఊపిరితిత్తుల్లో చీము ఏర్పడుతుంది. ఫలితంగా, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మామూలు కన్నా వేగంగా, బలంగా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో పిల్లి కూతలు కూడా వినిపించవచ్చు.
'సైనస్‌' వల్ల ముక్కులో ద్రవపదార్థం ఏర్పడి, కారుతుంది. తల భారంగా మారుతుంది. నుదురు ఉబ్బి, నొప్పి, శ్వాసపరమైన ఇబ్బంది కలుగుతుంది. కళ్లకలక వచ్చినప్పుడు (కళ్లు కలిగినప్పుడు) కళ్లు ఎర్రగా మారి, మండుతూ, దురదతో, నీరు కారుతూ, పుసులు కడతాయి. అలర్జీతో చెవులు మూసుకుపోయి వినపడకపోవచ్చు. చర్మం మీద దద్దుర్లు, కురుపులు, తామర, గజ్జి రావచ్చు. జీర్ణకోశం ప్రభావిత మైనప్పుడు కడుపులో నొప్పి, ఉబ్బటం, వాంతులు, నీళ్ల విరోచనాలు అవుతాయి.
కారణాలు..
అలర్జీ కారణాలు వ్యక్తిగతమైనవి లేదా బహిర్గతమైనవి కావచ్చు. ఇవి కొంతమేరకే వంశపారంపర్యంగా ఉంటూ, లింగ, ప్రాంత, వయస్సును బట్టి రావచ్చు. ఎక్కువ అలర్జీలు పర్యావరణ ప్రభావంతోనే వస్తాయి.
- దుమ్మూ ధూళి, గాలిలో అధిక తేమ, అల్మరాల్లో, గది మూలల్లో చేరే పురుగుల (మైట్స్‌) దుమ్ము, కందిరీగలు, చీమలు, తేనెటీగలు కుట్టినప్పుడు శరీరంలో ప్రవేశించే విషం వల్ల.
- ఇన్ఫెక్షన్‌ వాతావరణంలో వున్నప్పుడు.
- బాల్యంలో వచ్చిన జబ్బులు.
- పర్యావరణ కాలుష్యం.
- అలర్జీ కలిగించే పదార్థాలు తీసుకున్నప్పుడు లేక అవి మన శరీరాన్ని ప్రభావితం (ఎక్స్‌పోజ్‌) చేసినప్పుడు.
- ఆహార మార్పులు జరిగినప్పుడు.
శరీరానికి సరిపడని ఏ పదార్థాన్ని తిన్నా అలర్జీ వస్తుంది. ముఖ్యంగా వేరుశనగ, గుడ్లు, పాలు కొందరికి సరిపడవు. మరికొందరికి చేపలు, కొన్నిరకాల పండ్లు, కొన్ని రంగులు సరిపడకపోవచ్చు. ఆహారోత్పత్తుల శుద్ధి క్రమంలో వినియోగించే రసాయనాలు అలర్జీల్ని కలిగించవచ్చు.
ఆహారేతర పదార్థాలు - రబ్బరుకు సంబంధించిన వస్తువులు స్వతంత్రంగాగానీ, వేరే పదార్థాలతో కలిసినప్పుడుగానీ అలర్జీ కలుగుతుంది.
చికిత్స..
చికిత్సలో అలర్జీ కారకాన్ని గుర్తించడమే కీలకం. మారుతున్న అంశాల్ని గమనంలో వుంచుకుని, బాధితులే స్వయంగాగానీ లేక వైద్యుని సహాయంతో దీనిని గుర్తించవచ్చు. ఇలా గుర్తించిన తర్వాత దాన్ని పూర్తిగా మానుకోవాలి లేదా తప్పించుకోవాలి. అలర్జీని ఎదుర్కోడానికి ఇదే అత్యుత్తమ మార్గం. ఇది వీలుకానప్పుడు చిహ్నాలను బట్టి వైద్యుని సలహా మేరకు మందుల్ని వాడాలి.
రోగ నిరోధక చికిత్సా పద్ధతి (ఇమ్యునో థెరిపీ)..
అలర్జీ తీవ్రంగా వున్నప్పుడు లేక ఇతరత్రా ఎదుర్కోలేనప్పుడు రోగ నిరోధక చికిత్సా పద్ధతి ని అవలంబిస్తున్నారు. మన దేశంలో ఇప్పుడి ప్పుడే ఈ పద్ధతి ప్రాచుర్యం పొందుతుంది. ఈ చికిత్సలో అలర్జీ కారక పదార్థం కలిగి వున్న ద్రవాన్ని (ఎక్స్‌ట్రాక్ట్‌) ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. నోటితో తీసుకునే మందులు కూడా ఇటీవల తయారవుతున్నాయి. దీని డోసును క్రమంగా పెంచుతూ, దఫ దఫాలుగా ఇస్తారు. దీనివల్ల ఇమ్యూనోగ్లోబిన్‌-జి ఉత్పత్తి అయి, ఆమేర అలర్జీల నుండి రక్షిస్తుంది. ఈ చికిత్స వల్ల దీర్ఘకాల ఉపశమనం కలుగుతుంది.

మన దేశంలో..
- ప్రపంచ అలర్జీ నివే దిక (2011) ప్రకారం మన దేశంలో ఉబ్బసం, ముక్కు కారడం 1964లో వరుసగా 1%, 10%గా వుండేవి. కానీ, ఇటీవల కాలంలో ఉబ్బసం 3%-14 శాతానికి, ముక్కు కారడం 20 శాతానికి పెరిగింది. ఒకటి లేక అంతకన్నా ఎక్కువ అలర్జీలతో బాధపడుతున్నవారు మొత్తం జనాభాలో 20-30% మేర వున్నారు.
- తుమ్మ, ఆముదం, వయ్యారిభామ (పార్థీని యం) జొన్న, తోటకూర తదితర చెట్ల పుప్పొడి కాలుష్యం వల్ల అలర్జీలు వస్తున్నాయి.
- బొద్దింకలు, కందిరీగలు, తేనెటీగలు అలర్జీ కారకాలుగా గుర్తించారు.
- వంటచెరుకుగా కట్టెల్ని వాడటం వల్ల వచ్చే పొగ అలర్జీ కలిగిస్తుంది.
- విస్తరిస్తున్న పరిశ్రమల వల్ల గాలిలో చేరే సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌ వల్ల అలర్జీలు వస్తున్నాయని గుర్తించింది.
- దేశంలో 300 మంది అలర్జీ నిపుణులు అదీ పట్టణ ప్రాంతాల్లోనే వున్నారు.
- నిపుణులనుపెంచడానికి అలర్జీని పాఠ్యాంశంగా చేర్చాలని ఈ నివేదిక సూచించింది.
వృత్తిపరమైనవి..
- భవన నిర్మాణ కార్మికుల్లో సిమెంట్‌ (క్రోమియం, కోబాల్ట్‌) రబ్బరు, చెక్క సంబంధితమైనవి, దుమ్మూ, ధూళి వల్ల అలర్జీలు వస్తాయి.
- గని కార్మికుల్లో దుమ్మూ, ధూళీ, కార్బన్‌ మోనాక్సైడ్‌, తేమ వల్ల శ్వాసకోశ సంబంధ అలర్జీలు ఎక్కువగా వస్తాయి.
- వంటచేసేవాళ్లలో కూరగాయలు, పండ్ల వల్ల వస్తాయి. కట్టర్స్‌, రబ్బరు చేతి తొడుగుల వల్ల, మసాలాలవల్ల వస్తాయి.
- క్షౌరవృత్తిదారులకు హెయిర్‌ డై (రంగు), రబ్బరు, వాసన, మెటల్‌ వల్ల వస్తే, రజక వృత్తిదారుల్లో సబ్బులు, సర్ఫ్‌ల వల్ల అలర్జీలు వస్తాయి.
- వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రంగులు, రసాయనాల వల్ల అలర్జీలు వస్తాయి.
- సేద్యం చేసేవారికి అధికతేమ, ఎరువులు, సస్యరక్షణ మందులు, రబ్బరు తదితరాల వల్ల అలర్జీలు కలుగుతాయి.
ప్రమాదాంశాలు..
'ప్రపంచ అలర్జీ సంస్థ' అలర్జీ ప్రమాదాల్ని పెంచే అంశాల్ని సవివరంగా గుర్తించింది. సమగ్ర సమాచార పుస్తకాన్ని 2011లో ప్రచురించింది. ఇది నిర్ధారిస్తున్న తీవ్ర ప్రమాదాంశాలు..
- జన్యువులు, పర్యావరణ అంశాల సంయుక్త ప్రభావాలు అలర్జీల్లో ముఖ్యభాగం.
- స్పందించే ఇమ్యునోగ్లోబిన్‌-ఇ ప్రతిరక్షక కణాలు దాదాపు 40 శాతం జనాభాలో వున్నాయని అంచనా.
- వీచే గాలిలో పుప్పొడి కణాలు, బూజు (ఫంగస్‌), మైట్‌ ధూళికణాలు, బొద్దింకలు, తదితర కీటకాలతో అలర్జీ నేరుగా సంబంధం కలిగి వుంటుంది.
- ఉబ్బసం, కళ్లు ఎర్రబడి, ముక్కు నుండి నీరుకారడం, ముక్కు దిబ్బడ, చర్మంపై దద్దుర్లు వ్యాధులకూ అలర్జీ కారకాలకూ దగ్గర సంబంధం వుంది. కాలుష్య ప్రభావం ఈ అలర్జీల్ని మరింత పెంచుతుంది.
- ఇంటా, బయటా వున్న కాలుష్యం శ్వాసకోశ సంబంధమైన అలర్జీల్ని, ఆస్తమా (ఉబ్బసం) ను కలిగిస్తాయి.
- కారకాలను గుర్తించి, దాన్నుండి తప్పించుకుంటే అలర్జీల నుండి రక్షణ పొందవచ్చు.
- అలర్జీ బాధితులకు, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అవినాభావ సంబంధం వుంది. పేద ప్రజలు, పరిసరాల పరిశుభ్రంగా లేని ప్రాంతాల్లో నివసించే వారిలో ఉబ్బసం సంబంధిత అలర్జీ వ్యాధులు ఎక్కువగా వుంటాయి.
- వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం రెండూ కలిస్తే అలర్జీ బాగా పెరుగుతుంది.
- వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల పెద్ద వారు శ్వాస సంబంధ అలర్జీల్ని ఎదుర్కొం టారు. ఒకోసారి వీరు అకస్మాత్తుగా మరణించవచ్చు.
- ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ, ఉరుములు, మెరుపులు వంటి వాతావరణాంశాలు అలర్జీకి దోహదపడే జీవ రసాయనిక మార్పుల్ని ప్రభావితం చేస్తాయి.
- దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సూచనల్ని తప్పకుండా ఇవ్వాలి.
బిటి వల్ల..
జన్యుమార్పిడి సాంకేతికంలో డిఎన్‌ఏ ప్రొటీన్‌ అణువుల మార్పు ప్రధానాంశం. జన్యు మార్పిడి ఆహారాన్ని (ఉదా:బిటి రకం) తిన్నప్పుడు కొత్త ప్రొటీన్‌ లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా అలర్జీలు రాగల ప్రమాదం ఎక్కువగా వుందని ఎలుకల్లో చేసిన ప్రయోగాల్లో నిర్ధారించబడింది.
బిటి పత్తి చేలల్లో పనిచేసే వ్యవసాయ కార్మికులు అలర్జీలకు గురయ్యారు. వీరికి దురద, దద్దుర్లు, పుండ్లు, శ్వాసకోశ సంబంధ అలర్జీలొచ్చాయి. బిటి పత్తి ఆకుల్ని తిన్న పశువులు పారుడు రోగానికి గురయ్యాయి. కొన్ని చనిపోయాయి.

మీకు తెలుసా..?
- అలర్జీలంటే అసహనీయ (సహించ లేని) స్థాయిలోని రోగ నిరోధక వ్యవస్థ వల్ల కలిగే స్థితి.
- అలర్జన్‌ లేక అలర్జిన్‌ : అలర్జీ కలిగించే పదార్థం.
- ఇమ్యునోగ్లోబిన్‌-ఇ : ఇవి ఒక రకమైన అసహనీయ నిరోధకశక్తి రూపొందించుకున్న మస్ట్‌, బాసో ఫిిల్స్‌ తెల్లరక్త కణాలు. వీటి పరిమాణం అలర్జీ తీవ్రతకు చిహ్నం.
- ఇమ్యునోగ్లోబిన్‌-జి : ఇవి మరొక రకమైన ఇమ్యునోగ్లోబిన్‌ ప్రతిరక్షక కణాలు. వీటి ఉత్పత్తి, పరిమాణం 'ఇమ్యునోగ్లోబిన్‌-ఇ' ద్వారా కలిగే అలర్జీని నియంత్రిస్తుంది.

పదేళ్లలో మారిన వాస్తు..?!

  • వాస్తు.. వాస్తవాలు.. 2
ఆయన గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా పేరు ప్రఖ్యాతలు, శిష్యగణమున్న వ్యక్తి. ఆయన పేరు నరసింహశాస్త్రి (పేరు మార్చబడింది). అయితే అందరూ ఆయనను 'గురువుగారూ! అయ్యవారూ!' అనే పిలుస్తారుగానీ పేరుతో పిలవరు. ప్రతిరోజూ అనేకమంది శిష్యులు ఆయన ఇంటికి వచ్చి, ఆయనకు పాదాభివందనం చేసి, ఆయన ఆశీర్వాదాలు తీసుకొనిపోతారు. గురువుగారు తన ఇంట్లో కాలుమోపితేనే తమకు ఐశ్వర్యం కలుగుతుందని ఆయన శిష్యులు నమ్ముతారు. అందుకని వాళ్ళు ఆయనను కారులో తమ ఇళ్ళకు తీసుకువెళ్ళి, ఘనంగా ఆతిథ్యమిచ్చి పంపుతారు. తమ గృహం పావనమైందని సంతోషిస్తారు.
ఒకరోజు చిలకలూరి పేటలోని వ్యాపారి అయిన ఒక శిష్యుడు ఆయనను కారులో తనింటికి తీసుకువెళ్ళాడు. సోఫాలో కూర్చోబెట్టి, ఆయన పాదాలు వెండి పళ్ళెంలో పెట్టి, కడిగి, ఆ నీళ్ళను నెత్తిన చల్లుకున్నాడు. తర్వాత ఆయన కాళ్ళ దగ్గర నేలపై కూర్చొని, ఇలా అడిగాడు. ''అయ్యగారూ! నాకేమీ కలిసి రావడం లేదు. ఎందుకని?''
అప్పుడు గురువుగారు ఇల్లంతా పరిశీలించి చూసి 'నీ ఇంటికి వాస్తుదోషం ఉంది నాయనా!'' అన్నాడు.
దానికి వ్యాపారి 'అదేమిటో సెలవీయండి అయ్యగారూ! సరిచేయించుకుంటాను' అన్నాడు.
'ఈ వాకిలి దక్షిణంవైపు వుండకూడదు నాయనా! ఉత్తరంవైపు ఉండాలి. ఈ పూజామందిరం తూర్పువైపు వుండకూడదు నాయనా! ఈశాన్యం ఉండాలి. ఈ బీరువా తూర్పువాకిలి వైపు తిరిగి వుండకూడదు. పడమరవైపు వాకిలి వుండాలి. ఈ మార్పులన్నీ చేయించు నాయనా!' అన్నాడు అయ్యగారు.
తర్వాత గురువుగారు వెళ్ళబోయేముందు వ్యాపారి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనను సాగనంపాడు.
పదేళ్ళు గడిచాయి. వ్యాపారి ఒక మాదిరిగా సంపాదించాడు. అయినా గురువుగారిని కోరినట్లు జిల్లాలోనే తాను పెద్ద ధనికుణ్ణి కాలేకపోయానని దిగులుపడసాగాడు. ఆ విషయం గురువుగారినే అడిగి తెలుసుకుందామని, ఆయనను ఆహ్వానించి, కారులో తన ఇంటికి తీసుకువచ్చాడు. కిందటి సారిలాగే, సోఫాలో కూర్చోబెట్టి, కాళ్ళు కడిగి, నెత్తిన చల్లుకొని, ఇలా అడిగాడు.
'అయ్యగారూ! నాకు పెద్దగా కలిసిరావడం లేదు. ఎందుకంటారు?' అయ్యగారు పదేళ్ళ నాడు చెప్పినదంతా మర్చి పోయాడు. గత పదేళ్ళుగా శిష్యులంద రికీ రొటీన్‌గా చెబుతు న్నట్లుగానే చెప్పడం మొదలెట్టాడు. 'నాయ నా! నీ ఇంటికి వాస్తు దోషం ఉందయ్యా!' అన్నాడు. శిష్యుడు కొంచెం ఆశ్చర్యపోయినా, తమాయించు కొని 'ఏమిటో చెప్పండి గురువుగారూ!' అన్నాడు.
గురువుగారు చెప్పసాగాడు. 'ఈ వాకిలి ఉత్తరంవైపు ఉండకూడదు నాయనా! దక్షిణంవైపు ఉండాలి' అన్నాడు. శిష్యుడు కొంచెం నోరెళ్ళబెట్టాడు.
'ఈ పూజామందిరం ఈశాన్యంవైపు వుండకూడదు నాయనా! తూర్పువైపు వాకిలి వుండాలి' గురువుగారి ఆదేశం.
శిష్యుడు నోరు పూర్తిగా వెళ్ళబెట్టాడుగానీ గురువుగారిని ఏమీ అనలేదు.
అక్కడితో ఆగక గురువుగారు ఇలా అడిగారు 'ఎవరు నాయనా? ఇంత వాస్తు విరుద్ధంగా నిర్మింపజేసింది?'
శిష్యుడిక ఆగలేకపోయాడు. 'మీరే స్వామీ! పదేళ్ళ కిందట ఈ వాస్తుమార్పులన్నీ సూచించినది' అని సమాధానమిచ్చాడు.
'ఇప్పుడు నోరువెళ్ళబెట్టడం గురువుగారి వంతైంది. అయినా, తమాయించుకొని 'ఇప్పుడు నేను చెప్పినవన్నీ గత పదేళ్ళ పరిశోధనా ఫలితాలు నాయనా!' అన్నాడు. శిష్యుడు ఒక జీవం లేని నవ్వునవ్వాడు.
గురువుగారు బయలుదేరారు. ఈసారి శిష్యుడు సాష్టాంగ నమస్కారం చెయ్యలేదు. చేతులు జోడించి, గురువుగారిని సాగనంపాడు.

కె.ఎల్‌.కాంతారావు,
జన విజ్ఞాన వేదిక.

నిలకడ కోల్పోతున్న హిమాలయాలు..!

          స్థిరంగా ఉన్నవి అనుకుంటున్నా హిమాలయ ప్రాంతాలు ఇప్పుడు అంత స్థిరమైనవి కావని అంటున్నారు. భారతదేశం, టిబెట్‌ మధ్యలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా వుందని హెచ్చరిస్తు న్నారు. స్టాన్‌ఫోర్డ్‌కి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు రెండేళ్ళు ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేసి, ఇక్కడ ఇంకా పర్వతాల జననం చురుగ్గా ఉందనీ, ఆ కారణంగా భూగర్భ ఫలకాలు ఒకదానితో ఒకటి ఢకొీట్టే అవకాశాలు, తద్వారా భూకంపాల అవకాశాలు అధికంగా వున్నాయని భావిస్తున్నారు.

కాఫీతో మధుమేహం దూరం..!

ఇప్పుడు భారతదేశంలో మధుమేహం వేగంగా విస్తరిస్తుంది. మధుమేహాన్ని దూరంగా వుంచడానికి రోజూ మూడునాలుగు కప్పుల కాఫీ సేవిస్తే చాలు అంటున్నారు పరిశోధకులు. ఆ మాత్రం కాఫీని సేవిస్తే మధుమేహం వచ్చే అవకాశాలను 25% మేర తగ్గిస్తాయట. అయితే, ఇందుకు అసలు కారణం ఏమిటో, కాఫీలో ఏ పదార్థం మధుమేహం రాకుండా అడ్డుపడుతుందో ఇంకా నిర్దారించ లేదన్నారు. ఆ ఫలితాలు వచ్చేవరకూ కాఫీని కాస్త ఎక్కువ సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చేమో!?

బహిర్ముఖుల జీవితకాలం ఎక్కువ..!

           తమలో తామే బాధపడుతూ, తమ విషయాలు ఎవరికీ చెప్పకుండా, ఎవరితో కలవకుండా ఉండటానికి ఇష్టపడే వాళ్ళని అంతర్ముఖులు అంటారు. వీరికి వ్యతిరేక వ్యక్తిత్వంగల వారిని బహిర్ముఖులు అంటారు. వీరిదంతా దూసుకుపోయే స్వభావమే. అటువంటి స్వభావం గల వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని, (అంతర్ముఖులతో పోలిస్తే) తెలిసింది. గొరిల్లాలపై చేసిన అధ్యయనం ఈ విషయాన్ని రూఢ చేసింది. పద్దెనిమిది సంవత్సరాలుగా సుమారు మూడువందల గొరిల్లాలపై జరిపిన పరిశోధన అనంతరం ఈ ఫలితాలను ప్రచురించారు.

జిప్సీలు మనవాళ్లే..!

ప్రపంచమంతా వున్న సంచారజాతి జిప్సీల మూలాలు మనదేశంలోనే వున్నాయని తాజా పరిశోధన తెలిపింది. అనేక దేశాలలో వున్న జిప్సీల రక్త నమూనాలు సేకరించి, వాటిలో డిఎన్‌ఏను పరీక్షించి ఈ వాస్తవాన్ని నిర్ధారించారు. యూరప్‌, మధ్య ఆసియా దేశాల జిప్సీల డిఎన్‌ఏలకు, మన దేశ జిప్సీ తెగల డిఎన్‌ఏలతో పోల్చి చూస్తే, సుమారు 1500 ఏళ్ళ క్రితం భారతదేశాన్ని వదిలి వెళ్ళిన ఒక తెగ నుండి విదేశీ జిప్సీలు ఆవిర్భవించారని తేలింది. క్రీ.శ.500 లో మన పంజాబ్‌ ప్రాంతం నుండి మొదటి జిప్సీ గుంపు దేశాన్ని విడిచి వెళ్లిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వాళ్ళు బల్గేరియా, యూరప్‌ చేరారనీ, ఆ తరువాత విస్తరించారనీ తెలిసింది. వారి ప్రయాణంలోనే ప్రతికూల వాతావరణపరిస్థితుల వల్ల కేవలం 47 శాతం మంది మాత్రమే యూరప్‌ చేరుకోగలి గారట! అక్కడా జన్యుపరమైన ఇబ్బందుల వల్ల, యూరప్‌లో అప్పటికే స్థిరంగా వున్న ప్రజలలో గల వివక్ష వంటి అంశాల కారణంగా జిప్సీల జనాభా బాగా క్షీణించిపోయిందట..!

రోదసీలోకి విమానాన్ని పంపలేమా?

రోదసిలోకి రాకెట్‌నే పంపాలా? విమానాన్నో, హెలికాప్టర్‌నో పంపలేమా?
- ఎన్‌. శివ, శాంతి ఎయిడెడ్‌ పాఠశాల, శాంతి ఆశ్రమం, కాకినాడ
విమానాలు, హెలికాప్టర్లు వంటి ఆకాశయాన వాహనాలు గాలిలో మాత్రమే ప్రయాణించగలవు. తమ రెక్కల ద్వారా లేదా చక్రాలకున్న రెక్కల్లాంటి ప్రొపెల్లర్‌ బ్లేడ్ల ద్వారా గాలిని ఓవైపు నెట్టుతూ న్యూటన్‌ మూడవ గమనసూత్రం (Newton’s Third Law) ప్రకారం, బెర్నౌలీ సూత్రం ఆధారంగాను విమానాలు, హెలికాప్టర్లు ముందుకు వెళతాయి. కానీ రోదసీలో గాలి ఉండదు. మొత్తం శూన్యం (vacuum). అలాంటి ప్రదేశాల్లో విమానాలు, హెలికాప్టర్లు ఏమీ పనిచేయవు. కేవలం స్వంత ఇంధనాన్ని మండించుకొనడం వల్ల విడుదలైన వేడి వాయువుల్ని వేగంగా తన కింద వున్న నాజిల్‌ రంధ్రం (Nozzle orifice) ద్వారా బయటికి బలంతో నెట్టడం వల్ల ఏర్పడే ప్రతిచర్య (reaction) తో మాత్రమే రాకెట్లు వెళ్లగలుగుతున్నాయి. ఇందులో కూడా న్యూటన్‌ మూడవ గమనసూత్రం ఇమిడి వుందన్న విషయం మరిచిపోకండి.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

Wednesday 5 December 2012

క్యాన్సర్‌ సవాళ్లు.. పరిష్కారాలు

 
 
       అంటుకున్నా వ్యాపించని రోగాల మరణాలు పెరుగుతున్నాయి. మనదేశంలో సగంపైగా మరణాలు వీటివల్లే కలుగుతున్నాయి. క్యాన్సర్‌, గుండెజబ్బు, మధుమేహం, శ్వాసకు సంబంధించిన వ్యాధులు, మానసిక రోగాలు, గాయాలు ఈ కోవ కిందకొస్తాయి. గాయాలు తప్ప మిగతావి దీర్ఘకాల స్వభావం కలవి. వీటి చికిత్స, యాజమాన్యంలో మందుల అవసరం, ఖర్చు ఎక్కువ. ఇవన్నీ మన జీవనశైలితో ముడిపడి వున్నాయి. అన్ని వయస్సులవారికీ ఇవి వస్తున్నాయి. వీటి బాధితులు రోజురోజుకూ పెరుగుతుండటంతో వీటి నివారణ, గుర్తింపు, చికిత్సలపై కేంద్రీకరణ పెరుగుతుంది. వీటిలో క్యాన్సర్‌ ముఖ్యమైంది. మొత్తం మరణాల్లో దీనివల్ల 20 శాతం మేర వుంటున్నాయి. వీటి చికిత్సకు నిపుణులు, ఆధునిక పరికరాలు అవసరం. శాస్త్రీయపరంగా చూస్తే, వీటి గుర్తింపు, చికిత్స పరిశోధనల్లో ఎంతో ప్రగతి సాధించబడింది. అయితే, ఈ ఫలితాలు అవసరమైన వారందరికీ అందవలసి వుంది. వీటిపై అవగాహన పెంచుకుంటే క్యాన్సర్‌ను నివారించి, జీవనాణ్యతను పెంచుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో, క్యాన్సర్‌ గుర్తింపు, నివారణ, చికిత్సలో అభివృద్ధిని సంక్షిప్తంగా తెలుపుతూ మీముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.

నియంత్రణలేని జీవకణ పునరుత్పత్తి, పెరుగుదల క్యాన్సర్‌కు ప్రధానకారణం. ఇలా ఎందుకవుతుందో ఈనాటికీ సరిగ్గా అర్థం కాలేదు. కానీ, జీవకణాల్లో జరిగే జన్యుమార్పులు (డిఎన్‌ఏ మార్పులు) వీటికి అంతిమకారణాలు. అయితే, వారసత్వంగా వచ్చే క్యాన్సర్‌లు 5 నుండి 10 శాతం మాత్రమే. మిగతా క్యాన్సర్‌లు 90-95 శాతం ఇతర కారణాలవల్ల వస్తున్నాయి. జన్యుకారణం కానివన్నీ పర్యావరణ ప్రభావం వల్ల వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఆహారం, ఊబకాయం వల్ల 30-35 శాతం, అంటురోగక్రిముల వల్ల 15-20 శాతం, రేడియోథార్మిక కిరణాల వల్ల 10 శాతం వరకూ క్యాన్సర్‌ వచ్చే అవకాశం వుంది. పొగాకు తాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. గనుల్లో ముఖ్యంగా బొగ్గు, ఖనిజ తవ్వకాల్లో పనిచేసేవారికి అక్కడి కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తుంది. శుద్ధిచేసిన ఆహారం (ప్రాసెస్డ్‌ ఫుడ్‌) తినడం వల్ల కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

ప్రారంభం..
భౌతిక శ్రమ లేకపోవడం, పర్యావరణ కాలుష్యం వల్ల జీవకణ డిఎన్‌ఏలో మార్పులు వస్తాయి. ఈ డిఎన్‌ఏ మార్పులవల్ల జీవకణ విభజన వేగం పెరుగుతుంది. ఏదో ఒక భాగంలో ఏదో ఒక జీవకణం ఇలా ప్రభావితమై అతివేగంగా పునర్విభజనకు గురై, పెరుగుతుంది. ఈ కణాలు ఇతర కణాల జన్యువులతో కలిసి వాటిని నష్టపర్చవచ్చు లేక అప్పటికే వున్న లోపాలుగల జన్యువులతో కలిసిపోవచ్చు. ఇలా మొదలైన క్యాన్సర్‌ క్రమంగా శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లి, స్థిరపడి అక్కడ క్యాన్సర్‌ను కలిగించవచ్చు.

క్యాన్సర్‌ కారణాలు నిర్దిష్టంగా తెలియవు. కానీ, పొగాకు వినియోగం (దీనిలో వున్న కొన్ని అమైనోఆసిడ్స్‌, నికోటిన్‌, ఇతర రసాయనాలు), రేడియోథార్మిక కిరణాల ప్రభావం, భౌతిక శ్రమ లేకపోవడం, ఊబకాయం, వాతావరణ కాలుష్యం క్యాన్సర్‌ రిస్క్‌ను పెంచుతాయి.
క్యాన్సర్‌లన్నీ ఒకటే కావు. దాదాపు 200ల రకాలు గుర్తించబడ్డాయి. శరీరంలోని ఏ భాగంలోనైనా ఇది రావచ్చు. ఫలితంగా, దీని రోగ లక్షణాలు క్యాన్సర్‌ వచ్చిన శరీరభాగం మీద ఆధారపడి వుంటాయి.

క్యాన్సర్‌ మొదట నెమ్మదిగా ప్రారంభమైనా, ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. అందువల్ల, రోగ లక్షణాలు గుర్తించే స్థాయిలో బయటపడేటప్పటికే రోగం అభివృద్ధి చెందిన దశలో వుంటుంది. అయితే, దీని గుర్తింపుకు ఆధునిక పరీక్షాపద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా స్క్రీనింగ్‌ టెస్ట్‌, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, మెడికల్‌ ఇమేజింగ్‌ (ఎంఆర్‌ఐ వంటివి) తదితరాలు క్యాన్సర్‌ గుర్తింపుకు తోడ్పడుతున్నాయి. ఒకసారి క్యాన్సర్‌ వుందని అనుమానించిన తర్వాత బయాప్సీ పరీక్ష ద్వారా మైక్రోస్కోపులో పరీక్షించి, రోగాన్ని నిర్ధారిస్తారు.

పిలకలు (మెటాస్టాసిస్‌)...
క్యాన్సర్‌ ఇతర శరీరభాగాలకు విస్తరించినప్పుడు ఇవి వస్తాయి. వీటిని 'సెకండరీస్‌' అని కూడా అంటారు. ఇవి కనపడితే వ్యాధి ముదిరినట్లు భావించాలి. క్యాన్సర్‌లో శోషరస నాళ వ్యవస్థ (లింఫ్‌సిస్టమ్‌) లో నోడ్స్‌ ఉబ్బి, శరీర పైభాగంలో కనిపిస్తాయి. కాలేయం, పిత్తాశయం పెరగడాన్ని పొట్టలో గుర్తిస్తారు. నొప్పి, ఎముకలు విరగడం, నరాల జబ్బు రూపంలో బయటపడుతుంది.

జాతీయస్థాయిలో..
జాతీయ క్యాన్సర్‌ నియంత్రణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూ. 731 కోట్ల ఖర్చుతో జూన్‌ 2010 నుండి ప్రారంభించింది. దీనికింద 13 మెడికల్‌ కాలేజీలతో సహా 27 ప్రాంతీయ క్యాన్సర్‌ కేంద్రాలు స్థాపించారు. 57 వైద్య సంస్థలకు, 40 వైద్య కళాశాలలతో సహా క్యాన్సర్‌ శాఖల్ని పటిష్టపరిచేందుకు ఆర్థిక సహాయం అందించబడింది. ఈ పథకాన్ని మధుమేహం, గుండెజబ్బులు, 'బ్రెయిన్‌ స్ట్రోక్‌'లకు సంబంధించిన జాతీయ పథకాల్లో కలిపారు. ఇలా కలిపి రూపొందిన జాతీయ కార్యక్రమం కింద 21 రాష్ట్రాలలో 100 జిల్లాల్లో ముందుగా గుర్తించేందుకు, రోగ నిర్ధారణకు, చికిత్స యాజమాన్యానికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో గర్భసంచి ముఖద్వారం, రొమ్ము, నోటి క్యాన్సర్‌లకు అవకాశం కల్పించారు.
చిహ్నాలు..
- ఊపిరితిత్తుల్లో: తరచుగా దగ్గు, న్యూమోనియా వస్తాయి. అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు ఉమ్మితో రక్తం పడొచ్చు.
- గొంతులో: మింగడంలో ఇబ్బంది, నొప్పి వుంటాయి.
- పురీషనాళంలో (కోలోరెక్టల్‌):మల విసర్జనలో ఇబ్బంది, రక్తం పడొచ్చు.
- రొమ్ములో :గడ్డలు ఏర్పడటం.
- కణితలు:అంతర్గత రక్తస్రావం.
- రక్తహీనత :మలం, మూత్ర విసర్జనలో రక్తం పడటం.
- జీర్ణాశయం :వాంతులు, అజీర్తి వంటి లక్షణాలుంటాయి.
పైన చిహ్నాలు వుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి.

రక్తంలో..
రక్త కణాల ఉత్పత్తి, ధర్మాలను రక్తక్యాన్సర్‌ ప్రభావితం చేస్తుంది. ఇది ప్రధానంగా బోన్‌ మారో (ఎముకల మజ్జ / మూలగ) లో ప్రారంభమవుతుంది. ఇక్కడే రక్తం, రక్తకణాలు ఉత్పత్తవుతాయి. మామూలుగా మజ్జలో వున్న మూలకణాలు అభివృద్ధి అయి, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తయారవుతాయి. ఎక్కువ రక్తక్యాన్సర్‌ల్లో తెల్లరక్త కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దీనితో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇలా అడ్డగోలుగా పెరిగే కణాల్ని క్యాన్సర్‌ కణాలంటారు. ఇవి మిగతాకణాల్ని సరిగా పనిచేయనియ్యవు. ఫలితంగా, రోగ నిరోధకశక్తిని కోల్పోయేలా చేస్తుంది. రక్తాన్ని గడ్డకట్టనీయదు. రక్త క్యాన్సర్‌కు ప్రధానంగా మందులతో (కీమోథెరిపీ పద్ధతిలో) చికిత్స చేస్తారు.
ప్రధానంగా మూడురకాలైన రక్త క్యాన్సర్‌లున్నాయి.
ఇవి: 1) లుకేమియా,
2) లింఫోమా, 3) మైలోమా.
1. లుకేమియా : తీవ్రస్థాయిలో వున్నప్పుడు ప్రభావితమైన తెల్ల రక్తకణాల ఆధారంతో రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
ఎ. లింఫోబ్లాస్టిక్‌ (తెల్లరక్తకణాలు) లుకేమియా: దీనివల్ల సహజంగా వున్న వైరల్‌ అంటు రోగాల్ని ఎదిరించేశక్తిని కోల్పోతుంది. ఇది పిల్లల్లో (15 సంవత్సరా లలోపు) ఎక్కువగా వస్తుంది. ఎక్కువ మందిలో ఇది రెండు నుండి ఐదేళ్లలోపు పిల్లలకి వస్తుంది. దీనికి కారణాలు తెలియదు. మందులతో పిల్లల్లో 85 శాతం మందిలో దీన్ని తగ్గించవచ్చు. అయితే పెద్దవాళ్లల్లో 40 శాతం మందిలోనే తగ్గే అవకాశం వుంది.

బి. మైలాయిడ్‌ సెల్స్‌ (మూలగ) లుకేమియా: ఇది సహజంగా వున్న బ్యాక్టీరియా, పరాన్న జీవుల్ని, కణజాల నష్టాన్ని పరిమితంచేసే శక్తిని కోల్పోయేలా చేస్తుంది. ఈ రకం క్యాన్సర్‌ వచ్చినప్పుడు పాలిపోవడం, అలసిపోవడం, శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. తరచుగా అంటురోగాలు వస్తాయి. అసాధారణంగా, తరచుగా రక్తస్రావం జరుగుతుంది. ఇది ఎక్కువగా 60 ఏళ్లు పైబడినవారిలో, అదీ పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. పొగాకు తాగడం వల్ల ఇది వచ్చే అవకాశం ఎక్కువ.

లింఫోమా : ఈ క్యాన్సర్‌ శోషరస నాళ వ్యవస్థ (లింఫు సిస్టమ్‌) ను ప్రభావితం చేస్తుంది. ఇది రోగ నిరోధకశక్తిలో ఒక భాగం. ఎముకల మజ్జ, తెల్లరక్తకణాలు, లింఫు గ్రంథులు రోగ నిరోధకశక్తిలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. ఇది వస్తే లింఫు గ్రంథులు ఉబ్బుతాయి. ఇదే క్యాన్సర్‌కి చిహ్నం. తెల్లరక్తకణాలు పనిచేయవు. తరచుగా ఇన్ఫెక్షన్స్‌, వ్యాధులు వస్తాయి.

మైలోమా : ప్లాస్మా జీవకణాలకు క్యాన్సర్‌ సోకుతుంది. ఈ జీవకణాలు మామూలుగా రోగ నిరోధకశక్తికి అవసరమైన యాంటీబాడీల్ని తయారుచేస్తాయి. క్యాన్సర్‌ వచ్చినప్పుడు ఈ శక్తిని కోల్పోతాయి. ఎముక మజ్జలో వుండే కణాలు కూడా వేగంగా పునరుత్పత్తి అయ్యి, అక్కడే వుంటాయి. దీనివల్ల ఎముకలు ఉబ్బుతాయి. వెన్నెముకలో, పుర్రెలో, తొంటి ఎముకల్లో, ఉరః పంజరం (రిబ్స్‌) లో, ఇలా ఎక్కడైనా ఎముకల్లో ఏర్పడవచ్చు. దీన్ని ఎముకల క్యాన్సర్‌ అంటారు. దీనివల్ల నొప్పి, రక్తహీనత, ఎముకలు విరిగిపోవడం, శరీరంలో గడ్డలు గడ్డలుగా ఏర్పడటం, అలసిపోవడం, మూత్రపిండాలు దెబ్బతినడం జరుగుతుంది. ఇవన్నీ ఆలస్యంగా బయటపడతాయి.

క్యాన్సర్‌ కణాలను చంపడానికి లేదా పెరగకుండా ఆపేయడానికి ప్రత్యేక రసాయనాలను వాడుతూ చికిత్స చేయడాన్ని 'కీమోథెరిపీ' అంటారు. ఈ రసాయనాలు వేగంగా పెరుగుతూ, పునరుత్పత్తవుతున్న జీవకణాలపై దాడి చేస్తాయి. ఈ సమయంలో మామూలు కణాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తాయి. ఫలితం గా, కొంతకాలం దుష్ప్రభావాల్ని (సైడ్‌ ఎఫెక్ట్స్‌) కలిగిస్తాయి. కీమోథెరిపీ ఆపిన తర్వాత మామూలు కణాలు పునరుజ్జీవం పొందుతాయి. కాబట్టి, ఈ దుష్ప్రభావాలు కొంతకాలమే వుంటాయి. కీమోథెరిపీ శరీరం మొత్తం విస్తరించి, ప్రభావితం చేస్తుంది. అందువల్ల దీన్ని ప్రధానంగా రక్త క్యాన్సర్‌ చికిత్సకు వాడతారు. మిగిలిన క్యాన్సర్‌లలో కూడా, ఇతర శరీరభాగాల్లో ఎక్కడైనా క్యాన్సర్‌ కణాలు వుంటే వాటిని చంపేయడానికి కూడా ఈ చికిత్సను ఉపయోగిస్తారు. రేడియేషన్‌తో పాటు దీన్ని క్యాన్సర్‌ నివారణకు సమన్వయంతో వాడతారు.

దుప్ప్రభావాలు: వెంట్రుకలు రాలిపోతాయి. ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గిపోతారు, నోట్లో, గొంతులో పుండ్లు పడవచ్చు. వాంతులు అవ్వొచ్చు, అవుతాయి, అయ్యేట్లు అన్పించవచ్చు, మల బద్ధకం, డయేరియా, అలసిపోవడం జరుగుతుంది. వేళ్లు, మునివేళ్లూ స్మర్శ జ్ఞానం కోల్పోతాయి. గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిన వచ్చు. పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. కొందరిలో బుద్ధిమాంద్యం కూడా రావచ్చు. వంధ్యత్వం కూడా కలగవచ్చు. వీటిల్లో కొన్నింటిని నియంత్రించడానికి మరికొన్ని మందులు వాడతారు. వీటిల్లో కొన్ని దుష్ప్రభావాలు తాత్కాలికంగా వుంటాయి. మరికొన్ని దీర్ఘకాలం వుంటా యి. కొన్నిసార్లు గుండె, ఊపిరితిత్తులు, నాడీవ్యవస్థ, మూత్రపిండాలు, పునరుత్పత్తి అంగాలలో శాశ్వత మార్పులు రావచ్చు. ఏదేమైనా, క్యాన్సర్‌ చికిత్స తర్వాత వైద్యుని పర్యవేక్షణలో తప్పనిసరిగా వుండాలి.
కీమోథెరిపీలో ఈ దుష్ప్రభావాల్ని కలగకుండా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్దేశించిన కణాలకే (టార్జెటెడ్‌ సెల్స్‌) మందు అందేలా నానో టెక్నాలజీతో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఇతర చికిత్సలు: శస్త్ర చికిత్స, రేడియేషన్‌, కీమోథెరిపీ మూడూ కలిపి సమన్వయంతో వ్యాధికి చికిత్స చేస్తున్నారు. వ్యాధి స్థాయిని బట్టి చికిత్సను ఎంపిక చేస్తారు.

మీకు తెలుసా..?
- జీవకణాల్లో డిఎన్‌ఏ మార్పుల్ని కల్గించే రసాయనాలను 'మ్యూటాజన్స్‌' అంటారు. క్యాన్సర్‌ కలిగించే పదార్థాలను 'కార్సినోజన్స్‌' అంటారు. మ్యూటాజన్స్‌ అన్నీ కార్సినోజన్స్‌ కావు.
- ఎన్నో మ్యూటాజన్స్‌ క్యాన్సర్‌ కారకాలు. కానీ అన్నీ క్యాన్సర్‌ కారకాలూ మ్యూటాజన్స్‌ కావు. ఉదా: ఆల్కాహాల్‌.
- పొగాకులో నైట్రోసామైన్స్‌, పోలిసైక్లిన్‌, యారోమాటిక్స్‌, హైడ్రోకార్బన్‌ వంటి రసాయనాలు వుంటాయి. ఈ రసాయనాల ప్రభావంతో 20 శాతం క్యాన్సర్‌లు వస్తాయి.
- ఆంకాలజీ అంటే కణితులు (క్యాన్సర్‌) గురించిన శాస్త్రము.

ఇతర గెలాక్సీల్లోకి వెళ్లి పరిశోధనలు చేయొచ్చా..?

 
 
మనం ఇతర గెలాక్సీల్లోకెళ్లి అక్కడున్న నక్షత్రాలు, గ్రహాలు మన సౌరకుటుంబంలాగే ఉన్నాయో లేదో పరిశోధన చేయలేమా?
- ఎన్‌.మనోజ్‌రెడ్డి, హన్మకొండ

ప్రస్తుతం వీలుకాదనే చెప్పవచ్చు. బహుశా రాబోయే కొన్ని శతాబ్దాల పాటు కూడా వీలుకాకపోవచ్చును. గెలాక్సీ అంటే మన ఊరులాంటిదో లేదా మన భూమిలాంటిదో కాదు. ఒక సగటు గెలాక్సీ (మనం వున్న మన పాలపుంత లేదా మిల్కీవే గెలాక్సీలాంటిది) వ్యాసం సుమారు 60,000 (అక్షరాలా అరవైవేలు) పార్సెక్కులుంటుంది. ఒక్కో పార్సెక్కు (జూaతీరవష) విలువ 3.26 కాంతి సంవత్స రాలు. ఓ కాంతి సంవత్సరం (శ్రీఱస్త్రష్ట్ర్‌ yవaతీ) అంటే కాంతి ఒక సంవత్సరం పాటు శూన్యంలో ప్రయాణించే దూరం. ఇలా లెక్కిస్తే ఓ పార్సెక్కు దూరం సుమారు 31 ట్రిలియన్‌ కిలోమీటర్లు. దీన్నే 310000000000 00 (31 తర్వాత 12 సున్నాలు) కి.మీ. ఇలాంటి పార్సెక్కులే సుమారు 60,000 ఓ సగటు గెలాక్సీ అంచుల మధ్య వున్న దూరం. అంటే ఓ సగటు గెలాక్సీ నిడివి 60000 × 31000000000000 = 1860000000 000000000 = 18.6 × 1017 కి.మీ. గెలాక్సీలు సాధార ణంగా పొద్దు తిరుగుడు పువ్వు ఆకారంలో ఉంటా యని ఊహిస్తే ఆ పొద్దుతిరుగుడు పువ్వు అంచుల మధ్య ఉన్న వ్యాసం (సఱaఎవ్‌వతీ) సుమారు 18,600 కోట్ల కోట్ల కి.మీ. ఉంటుందన్న మాట. మన పాల పుంత కూడా దాదాపు ఇంతే వ్యాసం లో వుంది. ఈ గెలాక్సీ అంచులో మన సౌరమండలం ఓ మారుమూల వుంది. ఇక్కణ్నుంచి మనం పాల పుంతలోని ఆవలివైపునకు రాకెట్లలో గంటకు 1,80,000 కి.మీ. వేగంతో వెళ్లినా (ఇది కూడా ఇప్పుడు సాధ్యం కాదు) ఆవలి అంచుకు చేరడానికి సుమారు లక్ష కోట్ల సంవత్సరాలు పడుతుంది. మన విశ్వం ప్రస్తుత రూపంలో ఆవిర్భవించి 1500 కోట్ల సంవత్సరాలైంది. ఇలాంటి గెలాక్సీలు మన సాంకేతిక పరిజ్ఞాన పరిశీలనకు అనువుగా వున్న విశ్వం (శీbరవతీఙabశ్రీవ బఅఱఙవతీరవ) లోనే సుమారు 170 బిలియన్లు (17×1010) ఉన్నాయి. ఒక్క గెలాక్సీనే ఇంత దూరంలో విస్తరించి వుండగా, గెలాక్సీకీి గెలాక్సీకీ మధ్య వున్న దూరం గెలాక్సీల నిడివికన్నా కొన్ని లక్షలరెట్లు ఎక్కువ వుంటుందన్న విషయం మర్చిపోవద్దు. మన సౌరమండలంలోనే వున్నా మన పక్కింటి వ్యక్తి అనదగ్గ కుజగ్రహం (వీaతీర) దగ్గరకు పరిశోధనార్థం రాకెట్టులో అక్కడికి చేరడానికి దాదాపు ఆర్నెల్లు పడుతుంది. మన సూర్యుడే మనకు అత్యంత దగ్గరున్న నక్షత్రం. ఆ తర్వాతి నక్షత్రం ఆల్ఫా సెంటారి. అది మన సూర్యుడికి సుమారు 4.5 కాంతి సంవత్సరాల దూరంలో వుంది. కుజ గ్రహానికి మనం ప్రస్తుతం వెళ్లగలిగిన సాంకేతిక పరిజ్ఞానం తోనే ఇవాళ ప్రయాణం ప్రారంభించి (2013 సంవత్సరం) అక్కడికి చేరుకోవాలంటే సుమారు 38 కోట్ల సంవత్సరాలు పడుతుంది. మన ఊళ్లోనే (మన మిల్కీవే గెలాక్సీ) మన పక్కింటికి (మన సౌరమండ లానికి అతి దగ్గరగా వున్న ఆల్ఫాసెంటారి నక్షత్రానికి) వెళ్లడానికే సుమారు 38 కోట్ల సంవత్సరాలు పడుతుంటే, మన ఊరిని దాట డానికే సుమారు లక్ష కోట్ల ఏళ్లు పడుతుంటే మన ఊరి నుండి కొన్ని లక్షల రెట్లు అధిక దూరంలో వున్న పక్క ఊరికి (ఆండ్రోమిడా గెలాక్సీ: ఇదే మన మిల్కీవే గెలాక్సీకి అతి దగ్గరగా వున్న గెలాక్సీ) వెళ్లడా నికి ఎన్ని లక్షల కోట్ల కోట్ల సంవత్స రాలు పడుతుందో ఊహించండి. కాబట్టి ఇంట గెలవలేని వాళ్లం, ఊర్లో రచ్చా గెలవలేని వాళ్లం పక్క వూరి పార్లమెంటును ఏం గెలు స్తాం? ఊహలకు కూడా సాధ్యంకాని వ్యవహారం. కాబట్టి పక్క గెలాక్సీకి వెళ్లడానికి మనకు సరదా వుంటే ఆ సరదా ఊహల్లో కూడా వీలుకాని మహద్భాగ్యం మహావిశ్వంలో ఉంది.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

పెరుమాళ్ళయ్య పుస్తకావిష్కరణ

 
 
ప్రఖ్యాత వాస్తు పండితుడు పెరుమాళ్ళయ్య (పేరు మార్చబడింది) వాస్తుపై రచించిన పుస్తకావిష్కరణ సభ ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి హాలులో జరగబోతోంది. ఐదు గంటలకే పెరుమాళ్ళయ్య అనుచరులు హాలు ఆవరణలో బ్యానర్లు కట్టి, లోపల వేదికపై ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. ఐదు ముప్పావుకు పెరుమాళ్ళయ్య ఆ రోజు ముఖ్యఅతిథి రాజశేఖర్‌తో కలిసి కారులో వచ్చారు. హాలులో అప్పటికి 10, 15 మందికి మించిలేరు. పెరుమాళ్ళయ్య కొద్ది గా నిరాశపడ్డారు. మరో పది నిమిషాల్లో పుస్తకావిష్కర్త, మరో వక్త, ఆర్కిటెక్చరల్‌ ఇంజనీర్‌ అచ్చిరెడ్డి వచ్చారు.

సమయం ఆరైంది.. ఆరుంబావైంది.. ఆరున్నర దాటింది. హాలులోని సీట్లలో పది శాతానికి మించిలేరు. ఆరుముప్పావుకు ఇక తప్పదని సభ మొదలుపెట్టారు. ముఖ్యఅతిథి ఉపన్యాసం తర్వాత పుస్తకావిష్కరణ జరిగింది. తర్వాత గ్రంథకర్త పెరుమాళ్ళయ్య ఉపన్యాసం మొదలుపెట్టారు.
''సభాసదులారా! నా పుస్తకావిష్కరణ సభకు వందమంది కూడా హాజరుకాలేదు. అంటే, ఈ సభ విఫలమైంది. కారణం ఏమిటో తెలుసా? సభను ఏర్పాటు చేసిన రవీంద్రభారతి హాలుకు వాస్తుదోషం వుంది. భవనం బయట వాకిలి దక్షిణంగానూ, భవన ముఖద్వారం ఆగేయంవైపుకూ ఉన్నాయి. ఈశాన్యం ఎత్తుగా వుంది. ఇన్ని వాస్తుదోషాలున్నాయి. కాబట్టే సభ విఫలమైంది. అనేక పట్టణాలలో ఇలాంటి వాస్తుదోషాలున్న సభాభవనాలను నేను పరిశీలించి, ఆ దోషాలను నివారిస్తూ, నిర్మాణాలను సరిచేసిన తర్వాత ఆ భవనాలలో సభలన్నీ దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఈ భవనానికి కూడా వెంటనే వాస్తుదోష నివారణ కోసం పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని నేను భవన నిర్వాహకులను కోరుతున్నాను.''

సభికులందరికీ ఆయన ఉపన్యాసం కొంత ఆశ్చర్యాన్నీ, మరికొంత నవ్వునూ తెప్పించింది. వారిలో వారు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఈలోగా అధ్యక్షులవారు తర్వాత వక్త ఆర్కిటెక్ట్‌ అచ్చిరెడ్డిని ప్రసంగించాల్సిందిగా కోరారు. ఆయన ప్రసంగం ఇలా సాగింది.. ''ఆవిష్కరణ సభకు నన్ను ఆహ్వానించిపుడే నేను వాస్తు వ్యతిరేకిననీ, ఇలాంటి సభలకు రాలేననీ పెరుమాళ్ళయ్యకు చెప్పాను. అయినా, వాస్తు విమర్శను వేదికమీదనే తిప్పకొట్టగలననీ, అందువలన తప్పకరావాలనీ పెరుమాళ్ళయ్య నన్ను బలవంతం చేశారు. దీంతో నేను ఈ సభకు రాక తప్పలేదు.పెరుమాళ్ళయ్యగారు తన పుస్తకావిష్కరణ సభ విఫలం కావడానికి కారణాల్ని రవీంద్ర భారతికి ఆపాదించారు. దానికి వాస్తుదోషం వుందన్నారు. నేను గత 20 ఏళ్లుగా ఈ హాలులో అనేక సభలకు, కళా ప్రదర్శనలకు హాజరయ్యాను. అన్నిసార్లూ హాలు నిండిపోవడం, అనేకమంది సీట్లు దొరకక వెనుక్కు తిరిగివెళ్ళడం కళ్ళారా చూశాను. ఇది నా అనుభవమే కాదు. నా మిత్రులు అనేకమంది అనుభవం కూడా! రవీంద్ర భారతికి వాస్తుదోషం వుంటే ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వేల సభలు ఎలా దిగ్విజయంగా కొనసాగుతాయి? ఆ విషయం పక్కనపెడదాం. రవీంద్ర భారతి హాలును పెరుమాళ్ళయ్య ముందే చూచారు గదా? వారికి వాస్తుదోషాలు అప్పుడే తెలిసి వుంటాయి గదా? మరివారు దోషాలున్న వేదికను ఎందుకని ఏరికోరి ఈ కార్యక్రమానికి ఎన్నుకొన్నారు? తన సభ విఫలం కావాలనా? వారు అలా అనుకోరు కాబట్టి ఈ భవనానికి వాస్తుదోషాలున్నాయనేది వాదనకు నిలిచే అంశం కాదు. ఈ విషయాన్ని సభికులందరూ అర్థంచేసుకోవాలని కోరుతున్నాను'' అని ముగించారు.

ఆర్కిటెక్ట్‌ అచ్చిరెడ్డి విమర్శలకూ, వాదనలకూ పెరుమాళ్ళయ్య మౌనమే సమాధానమైంది. దీనితో సభికులు 'వాస్తు అంతా డొల్లా!. పెరుమాళ్ళయ్య మాటలన్నీ అబద్ధాలే..!.' అని నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయారు.
కె.ఎల్‌.కాంతారావు,
జన విజ్ఞాన వేదిక.

క్రిమినాశకాలతో మెదడుకు చేటు!

తక్కువ మోతాదులో కూడా క్రిమినాశకాలు మెదడుకు చేటు తెస్తాయని తెలిసిందే. డజనుకుపైగా అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అధికమోతాదుల్లో కీటకనాశన మందులు ఇతర ప్రాణులపై చెడు ప్రభావం చూపుతాయని తెలిసినా, ఆ మందులు తక్కువ మోతాదుల్లో ఎటువంటి ప్రభా వాలు చూపుతాయో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ పరిశోధనల ప్రకారం ఆర్గానో ఫాస్ఫేట్‌ కీటకనాశనులు ఏకంగా జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావాన్ని చూపి, ఆ శక్తిని గణనీయంగా తగ్గిస్తాయి. ఆ ప్రభావం దీర్ఘకాలంపాటు ఉంటుందని పరిశోధకులు భావిస్తు న్నారు. ఈ విషయంలో పరిశోధన ఇంకా కొనసాగుతోంది.

పాలల్లో చేపనూనెతో ఆరోగ్యం..!
పాలు, చేప నుండి వెలికి తీసిన నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని విదితమే! ఇప్పుడు ఆహార శాస్త్ర పరిశోధకులు పాలల్లో, పాల ఉత్పాదనల్లో, చేపల నుండి తీసిన ఒమేగా నూనెలను మిళితం చేస్తున్నారు. అటువంటి మిశ్రమనూనె వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందనీ, గుండె బలంగా ఉంటుందనీ వీరు భావిస్తున్నారు. పాలల్లో చేప నూనెను కలపడం వలన పాల వాసన, రుచిలో ఏమాత్రం తేడా లేదని తెలిసింది. పైగా, నూనె కలిపిన పాలు నిలువ కూడా ఉంటాయట! కేవలం చేప నూనెనే విడిగా తీసుకోవడం ఇబ్బంది అనుకునేవారికి ఇటువంటి పాలు, పాల పదార్థాలను తీసుకోవడం గొప్ప వెసులుబాటు కానున్నాయి.

మెర్క్యురీపై మంచు..!
ఇతర గ్రహాలపై జీవం, గ్రహాల ఆవిర్భావం వంటి అంశాల పరిశోధనలో నిరంతరం కొత్త విషయాలు వెలికి వస్తూనే వున్నాయి. తాజాగా, మెర్క్యురీ గ్రహంపై మంచు వుందని తెలిసింది. నాసా అంతరిక్ష వాహనం నుండి ఈ వివరాలు అందాయి. గ్రహాలపైన నీరు వుండటం అనేది వాటిపై జీవం వుండే అవకాశాల్ని సూచిస్తుంది. ఆ దిశగా జీవావిర్భావ ప్రక్రియలో ఏమైనా ఆధారం లభిస్తుందేమో అని శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. మెర్క్యురీ ధృవప్రాంతాలలో మంచు సుమారు రెండుమైళ్ళ మేర వ్యాపించి వున్నట్టు తెలిసింది. మరి దీనివలన మరిన్ని కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయేమో చూడాలి మరి!

మెదడు ముడతల్లోనే రహస్యం..!
జీనియస్‌గా పేరొందిన ఐన్‌స్టీన్‌ మెదడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆ మేధావి 1955లో మరణించాడు. ఆ తరువాత ఆయన మెదడును 240 భాగాలుగా చేసి, ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులకు అధ్యయనం నిమిత్తం పంపారు. వాటిలో చాలా వరకూ పోయాయి. చివరికి ఆయన మెదడుకు సంబంధించి, ఊహాగానాలే తప్ప, వాస్తవాలు బయటపడలేదు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఆ మెదడు 240 ముక్కలలో నుండి తీసిన రెండువేల సన్నని పొరల ఫొటోలను వాడి కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఐన్‌స్టీన్‌ మెదడు సాధారణ మెదడులాగే 1,230 గ్రాములుంది. కానీ, అసాధారణంగా,ఆ మెదడులో ముడతలు చాలా అధికంగా వున్నాయి. మరో 85 మెదడులను పోల్చి చూస్తే ఈ విషయం తెలిసింది. ముడతలు అధికంగా వుండటం అంటే నాడీ కణాలు అధికంగా వున్నట్టు. పైగా ఐన్‌స్టీన్‌ మెదడు ముడతలు మామూలుగా కాకుండా చాలా సంక్లిష్టంగా వున్నాయని తెలిసింది.

వేసవిలో పుడితే లెక్కల్లో వెనకా..?
వేసవికాలంలో పుట్టిన పిల్లలు లెక్కల్లో వెనకబడతారని ఇంగ్లాండులో జరిపిన పరిశోధనలు తెలిపాయి. సుమారు 50 వేల మంది పిల్లలపై జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది. మే, ఆగస్టు నెలల మధ్యలో పుట్టిన పిల్లలకు లెక్కలలో కాస్త మందగింపు ఉంటుందని, వారికి ట్యూషన్‌ అవసరం వుంటుందని ఇప్పుడు భావిస్తున్నారు. పైగా, ఆ మాసాలలో పుట్టిన అబ్బాయిల్లో ఈ సమస్య అమ్మాయిల కంటే ఎక్కువని అంటున్నారు. అయితే, ఇటువంటి విచిత్ర ఫలితాలకి అసలు కారణం ఇంకా తెలియదు.
- డాక్టర్‌ కాకర్లమూడి 

Wednesday 28 November 2012

సునీతా విలియవమ్స్‌ అంతరిక్ష పరిశోధనలు

 
 
            ఇప్పటి పరిస్థితుల్లో అంతరిక్షంలో దీర్ఘకాలం వుండి, పరిశోధనలు కొనసాగించడం ఎంతో రిస్క్‌, ప్రమాదంతో కూడుకున్నవి. వీటికి ఎంతో ఆధునిక, వైవిధ్యభరితమైన విజ్ఞానం, ధైర్యసాహసాలు వుండాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ సాంకేతిక విజ్ఞానంతో పాటు వాతావరణం, జీవ, భౌతిక రసాయన విజ్ఞానశాస్త్రాలు, ఖగోళశాస్త్రం, ఆరోగ్య విజ్ఞానం తదితర శాస్త్రాలలో ఉన్నత నైపుణ్య స్థాయి వుండాలి. వీటన్నింటితో పాటు శరీర దారుఢ్యం, మనోనిబ్బరం, సమయోచిత నిర్ణయశక్తి కావాలి. వీటన్నింటి మేలుకలయికతోనే అంతరిక్షంలో దీర్ఘకాలం వుంటూ పరిశోధనలు చేయగలం. ఇలా అత్యధికకాలం పరిశోధనలు చేసిన మహిళల్లో మొదటి మహిళ సునీతా విలియమ్స్‌. ఈమె 2007-12 మధ్య రెండు దఫాలుగా (318 రోజులు) అంతరిక్షంలో వున్నారు. ఈ కాలంలో ఏడుసార్లు (మొత్తం 50 గంటల 40 నిమిషాలు) అంతరిక్షంలో నడిచి (స్పేస్‌ వాక్‌) ఖ్యాతి పొందారు. ఈమె భారత సంతతికి (గుజరాత్‌) చెందిన వ్యక్తని తెలుసుకుంటే మనం ఒకింత గర్వపడతాం. ఈమె అమెరికా పౌరురాలు. అక్కడే పుట్టి, పెరిగి, చదివారు. మొదట భౌతికశాస్త్రాలలో పట్టభద్రురాలు. ఆ తర్వాత ఇంజనీరింగ్‌ శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. నేవీలో, ఆ తర్వాత నాసాలో పనిచేశారు. ఇటీవల నవంబరు 19న రెండవ ప్రయాణాన్ని (123 రోజులు) పూర్తిచేసుకుని భూమిపై దిగారు. ఈ సందర్భంలో అంతరిక్షంలో ఆమె చేసిన పరిశోధనలు ఎంతో ఆసక్తిగా వున్నాయి. వీటిని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.

అంతరిక్షంలో దీర్ఘకాలం వుండి పరిశోధనలు చేయడానికి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఉపయోగపడుతుంది. సునీతా విలియమ్స్‌, ఇతర అంతరిక్ష పరిశోధకులతో కలిసి దీనిలోనే దీర్ఘకాలం పరిశోధనల్లో పాల్గొన్నారు.

అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం..
ఇది భూమిపై సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులో ఉండి, భూమితో పాటు నిరంతరం తిరుగుతుంది. ఇప్పటికి 12 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు. దీనిలో వాతావరణ నియంత్రణ, ఆహార సరఫరా వ్యవస్థ, పరిశుభ్రత, విద్యుత్‌, ఉష్ణోగ్రత నియంత్రణ, సమాచార ప్రసారాలు, కంప్యూటర్‌ వ్యవస్థలు ప్రధానంగా పనిచేస్తాయి. అంతరిక్షంలో శాశ్వతంగా వలస ప్రాంతాల్ని ఏర్పర్చుకోవటానికి వీలుంటుందా? దీర్ఘకాలం అంతరిక్షంలో ఎగరగలమా? అనేవి నిర్ధారించుకొనే ప్రధాన లక్ష్యాలతో దీని పరిశోధనలు ప్రారంభ మయ్యాయి. దీనిని రష్యా, అమెరికా, జపాన్‌, యూరోపియన్‌ యూని యన్‌, కెనడా దేశాల అంతరిక్ష పరిశోధనా విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని ప్రధాన నియంత్రణ కేంద్రం రష్యాలోని బైక నూర్‌ వద్ద వుంది. దీని బరువు దాదాపు 450 టన్నులు. పొడవు 72.8 మీటర్లు. వెడల్పు 108.5 మీటర్లు. ఎత్తు సుమారు 20 మీటర్లు. అయితే దీనిలో వాతావరణ పీడనం దాదాపు భూ వాతావరణంతో సమానంగా వుంటుంది.
మానవ శరీరంలో కండరాల వాపు, ఎముకల నష్టం, ద్రవాలలో జరిగే మార్పులలో దీని పరిశోధనలు కొనసాగాయి. 2006 నాటికి వచ్చిన ఫలితాల్నిబట్టి దీర్ఘకాలం అంతరిక్ష ప్రయాణం చేయవచ్చనీ, ఇతర గ్రహాలకు చేరే అంతరిక్ష ప్రయాణం (ఆరునెలల మేర) చేపట్టే అవకాశాలున్నాయనీ నిర్ధారించింది. దీనిలో ఎప్పుడూ దాదాపు బరువులేని వాతావరణస్థితి కొనసాగుతుంది. దీనిలో జీవశాస్త్రం, మానవ శరీరనిర్మాణశాస్త్రం, భౌతికశాస్త్రం, అంతరిక్షం, వాతావరణం, రసాయనిక సంబంధిత శాస్త్రాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనం భూమిపై చేయలేని ప్రయోగాలు ఈ కేంద్రంలో చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త వస్తువుల్ని, పదార్థాల్ని తయారుచేయడానికి వీలవుతుంది.

పరిశోధనాంశాలు..
సునీతా విలియమ్స్‌ ఆమె సహచరులూ కలిసి 30 అంశాలపై 240 ప్రయోగాల్ని చేశారు. వీటిలో ప్రధానమైనవి: అంతరిక్ష పరిశోధనలు..
గాలి, నీరు, ఉపరితల పరిశీలనకు జపాన్‌ రూపొందించిన ఒక రోబోటిక్‌ చేయిని అంచనా వేస్తారు. వైద్య రంగంలో ఎముకలు, కండరాల వాపు / క్షీణత లపై భారరహిత స్థితిలో చేపలపై ప్రయోగాలు నిర్వహిస్తారు. వీటిపై రేడియేషన్‌ ప్రభావాల్ని అంచనా వేస్తారు. అంతర గ్రహ సమాచార ప్రసారవ్యవస్థలో జరుగు తున్న ఆలస్యానికి గల కారణాలను పరిశోధిస్తారు. తద్వార బుధ, ఇతర గ్రహాల నుండి వచ్చే సంకేతాల ఆలస్యాలను లోతుగా అర్థంచేసుకునే వీలుకలుగుతుంది.

అంతరిక్షంలో మానవులు..
స్ఫటికాలు రూపొందడాన్ని అర్థంచేసుకోవడానికి, ఆహారం ఇతర పదార్థాలలో వాటి నిల్వ కాలపరిమితులను తెలుసుకోడానికి తోడ్పడుతుంది. అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన ఆహారాన్ని తయారుచేయడంలో ఈ పరిశోధనలు తోడ్పడతాయి. అంతరిక్షంలో మానవులు దీర్ఘకాలం వున్నప్పుడు శరీరంలో జరిగే మార్పుల్ని అర్థంచేసుకోవడానికీ ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి. ఈ కాలంలో నిద్రాభంగ పరిస్థితుల్ని, రక్త ప్రసరణ స్థితిగతులను అర్థంచేసుకోవడానికి ఈ పరిశోధనలు ఉద్దేశించబడ్డాయి.

ఆరోగ్యం..
కెనడా రూపొందించిన లేజర్‌ పరికరాల ద్వారా జీవకణాలను విశ్లేషించడానికి, వర్గీకరించడానికి ఉపయోగపడే పరిశోధనలను, మాంసకృత్తులలో ప్రవేశపెట్టగల మార్పుల్ని అర్థంచేసుకోడానికి ఈ పరిశోధనలు తోడ్పడతాయి. ముఖ్యంగా రోగాల్ని ముందుగానే తెలుసుకుని గుర్తించడానికి పరిశోధనలు జరిగాయి. సాల్మొనెల్లా బాక్టీరియా ఆహారాన్ని నిల్వలో విషంగా మారుస్తుంది. దీన్ని ఎదుర్కొనడానికి వ్యాక్సిన్‌ తయారీకి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటువంటి ఆహారం తినడంవల్ల పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు.

నానో సాంకేతికాలు..
భారరహిత స్థితి (జీరో గ్రావిటీ) లో జంతుజాల కణ సమూహాలపై నానో స్థాయిలో జరిగే మార్పుల్ని అర్థంచేసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి. తద్వారా అంతరిక్షంలో ఏవైనా జీవాలుంటే గుర్తించడానికి వీలవుతుంది.

భూగోళ శాస్త్రం..
ప్రకృతి వైపరీత్యాలను, పర్యావరణ పరిణామాలను, సంఘటనలను పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి ఉపయోగపడే సాంకేతికాలు పరీక్షింపబడుతున్నాయి. ఇవి భూగోళంలో నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడతాయి.

రసాయనిక శాస్త్రం..
భౌతిక - రసాయనిక మార్పుల్ని, ఎమల్షన్‌ బిందువుల (పెయింట్‌ బిందువు ల్లాంటివి) స్థిరత్వాన్ని తెలుసుకోడానికి కావాల్సిన పరిశోధనలు చేస్తున్నారు.

ఎంతెత్తు నుండి భూమిని చూడగలం?
ఎటువంటి పరికరాల తోడ్పాటు లేకుండా అంతరిక్షంలో భూమిని ఎంత దూరం నుండి చూడగలం? అనేది శాస్త్రజ్ఞుల్ని వేధిస్తున్న ప్రశ్న. దూరం వెళ్లి చూస్తే భూమి సూర్యుని పక్కన వున్నట్లు కనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్లి చూస్తే సూర్యుని నుంచి మిరిమిట్లుగొలుపుతూ వచ్చే కాంతి అసలు భూగోళాన్ని కనపడనీయకుండా చేస్తుంది. భూగోళానికి 300 కిలోమీటర్ల ఎత్తులో గల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి చూసినట్లయితే భూమి పైభాగం కనిపిస్తుంది. అక్కడ భూమి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అక్కడ నుంచి భూగోళంపైగల ఎత్తయిన పర్వతాలు, లోయలు, పెద్ద నదులు, పెద్ద పట్టణాల్లో విద్యుత్‌దీపాలు కనిపిస్తాయి. అంతరిక్షం నుండి భూమిని చూస్తే ఇంటి బాల్కనీలో నుండి కిందకు చూచినట్లు వుందని సునీతా విలయమ్స్‌ తన తండ్రికి వర్ణించి చెప్పారు. అయితే ఆమె పై నుండి భారతదేశాన్ని మబ్బుల అసౌకర్యం వల్ల చూడలేకపోయారట!
అదే చంద్రలోకాన్ని దాటి 3.8 లక్షల కిలోమీటర్ల నుండి చూస్తే భూగోళం మనం చూస్తున్న చంద్రుని (వెలుగుతున్న బంతి) లాగా కనిపిస్తుంది. ఇంకా పైకి పోయి, బుధ, శుక్ర తదితర గ్రహాల్ని దాటి చూసినట్లయితే భూమి ఒక నక్షత్రంలాగా కనిపిస్తుంది. ఇలా 14 బిలియన్‌ కిలోమీటర్ల దూరం పోయి చూస్తే భూమి అస్సలు కనపడదు. ఒకవేళ అంతరిక్షంలో గ్రహాంతరవాసులు టెలిస్కోపు ద్వారా చూస్తే భూగోళాన్ని బహుశా ఇంకా దూరం నుండీ చూడగలుగుతారు.

సునీతా విలియమ్స్‌..
సునీతా విలియమ్స్‌ 45 ఏళ్ల అంత రిక్ష మహిళా పరిశోధకురాలు. అమెరికా పౌరురాలు. ఈమె తండ్రి దీపక్‌ పాండ్యా వైద్యులు, భారత సంతతి (గుజరాత్‌)కి చెందినవారు. తల్లి బోనీ పాండ్యా స్లోవేనియా దేశస్థురాలు. సునీతా రెండు దఫాలుగా అంతరిక్ష సాహస యాత్రలు చేశారు. మొదట 14, 15 సాహసయాత్రలలో 2006, డిసెంబరులో అంతర్జాతీయ అంతరిక్ష పరి శోధనా కేంద్రానికి వెళ్లారు. ఈ సమయం లో మూడుసార్లు అంత రిక్షంలో నడిచారు. 2012, జులై 15 నుం డి నవంబర్‌ 19 వరకూ ఆమె 32, 33 సాహస యాత్రల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన స్థానానికి కమాండర్‌గా సెప్టెంబర్‌ 15 నుండి యాత్రాంతం వరకూ పనిచేశారు. అంతరిక్షంలో మొట్టమొదటి వ్యక్తిగా ఈత, సైక్లింగ్‌, పరిగెత్తడం - ఈ మూడింటినీ వరుసగా పూర్తిచేశారు. పరిశోధనా స్థానంలోనే ఈమె 800 మీటర్ల వరకూ ఈతతో సమానమైన వ్యాయామాన్ని చేశారు. ఆ తర్వాత 29 కిలోమీటర్ల సైక్లింగ్‌ చేశారు. ట్రెడ్‌మిల్‌ పై 6.4 కిలోమీటర్లు పరిగెత్తారు. ఈ మొత్తాన్ని గంట 48 నిమిషాల 33 సెకన్ల లో పూర్తిచేశారు. 2007, సెప్టెంబర్‌లో మన దేశాన్ని సందర్శించారు. తన పూర్వీకుల గ్రామమైన ఝులాసన్‌, సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈమెకి సర్దార్‌ వల్లభారుపటేల్‌ 'విశ్వప్రతిభ' అవార్డును ప్రపంచ గుజరాతీ సొసైటీ అందించింది. ఈమె అంతరిక్షంలో వున్న ప్పుడు రోజుకు 15-17 గంటలు పని చేసేవారు. మిగతా సమయంలో తప్పని సరిగా నిద్రపోవాలనే నియమం వుండేది. ఆ నియమానుసారం నిద్రపోయేవారు.

మీకు తెలుసా..?
ట స్పేస్‌ షటిల్‌: అంతరిక్షంలోకి వాహక నౌకలను పంపడానికి మాటిమాటికీ వినియోగించగల రాకెట్‌ను 'స్పేస్‌ షటిల్‌' అంటారు. దీనిని అమెరికాకు చెందిన 'నాసా' (నేషనల్‌ ఏరోనాటిక్‌ Ê స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) రూపొందించింది. దీనిలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. 1. రాకెట్‌ లాంచ్‌ వాహకం, 2. కక్ష్యలో ప్రవేశపెట్టడానికి అనువైన రాకెట్లు, 3. భూగోళ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడానికి అవసరమైన ఏర్పాటు. స్పేస్‌ షటిల్‌లో కక్ష్య వాహకం, బయట వైపు ఇంధన ట్యాంకు, రెండు ఘన రాకెట్‌ బూస్టర్లు వుంటాయి.
ట ఇంతవరకు దీనిని 1981-2011 మధ్య కాలంలో 135 సార్లు ప్రయోగించారు.