Wednesday 28 November 2012

సునీతా విలియవమ్స్‌ అంతరిక్ష పరిశోధనలు

 
 
            ఇప్పటి పరిస్థితుల్లో అంతరిక్షంలో దీర్ఘకాలం వుండి, పరిశోధనలు కొనసాగించడం ఎంతో రిస్క్‌, ప్రమాదంతో కూడుకున్నవి. వీటికి ఎంతో ఆధునిక, వైవిధ్యభరితమైన విజ్ఞానం, ధైర్యసాహసాలు వుండాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ సాంకేతిక విజ్ఞానంతో పాటు వాతావరణం, జీవ, భౌతిక రసాయన విజ్ఞానశాస్త్రాలు, ఖగోళశాస్త్రం, ఆరోగ్య విజ్ఞానం తదితర శాస్త్రాలలో ఉన్నత నైపుణ్య స్థాయి వుండాలి. వీటన్నింటితో పాటు శరీర దారుఢ్యం, మనోనిబ్బరం, సమయోచిత నిర్ణయశక్తి కావాలి. వీటన్నింటి మేలుకలయికతోనే అంతరిక్షంలో దీర్ఘకాలం వుంటూ పరిశోధనలు చేయగలం. ఇలా అత్యధికకాలం పరిశోధనలు చేసిన మహిళల్లో మొదటి మహిళ సునీతా విలియమ్స్‌. ఈమె 2007-12 మధ్య రెండు దఫాలుగా (318 రోజులు) అంతరిక్షంలో వున్నారు. ఈ కాలంలో ఏడుసార్లు (మొత్తం 50 గంటల 40 నిమిషాలు) అంతరిక్షంలో నడిచి (స్పేస్‌ వాక్‌) ఖ్యాతి పొందారు. ఈమె భారత సంతతికి (గుజరాత్‌) చెందిన వ్యక్తని తెలుసుకుంటే మనం ఒకింత గర్వపడతాం. ఈమె అమెరికా పౌరురాలు. అక్కడే పుట్టి, పెరిగి, చదివారు. మొదట భౌతికశాస్త్రాలలో పట్టభద్రురాలు. ఆ తర్వాత ఇంజనీరింగ్‌ శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. నేవీలో, ఆ తర్వాత నాసాలో పనిచేశారు. ఇటీవల నవంబరు 19న రెండవ ప్రయాణాన్ని (123 రోజులు) పూర్తిచేసుకుని భూమిపై దిగారు. ఈ సందర్భంలో అంతరిక్షంలో ఆమె చేసిన పరిశోధనలు ఎంతో ఆసక్తిగా వున్నాయి. వీటిని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.

అంతరిక్షంలో దీర్ఘకాలం వుండి పరిశోధనలు చేయడానికి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఉపయోగపడుతుంది. సునీతా విలియమ్స్‌, ఇతర అంతరిక్ష పరిశోధకులతో కలిసి దీనిలోనే దీర్ఘకాలం పరిశోధనల్లో పాల్గొన్నారు.

అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం..
ఇది భూమిపై సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులో ఉండి, భూమితో పాటు నిరంతరం తిరుగుతుంది. ఇప్పటికి 12 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు. దీనిలో వాతావరణ నియంత్రణ, ఆహార సరఫరా వ్యవస్థ, పరిశుభ్రత, విద్యుత్‌, ఉష్ణోగ్రత నియంత్రణ, సమాచార ప్రసారాలు, కంప్యూటర్‌ వ్యవస్థలు ప్రధానంగా పనిచేస్తాయి. అంతరిక్షంలో శాశ్వతంగా వలస ప్రాంతాల్ని ఏర్పర్చుకోవటానికి వీలుంటుందా? దీర్ఘకాలం అంతరిక్షంలో ఎగరగలమా? అనేవి నిర్ధారించుకొనే ప్రధాన లక్ష్యాలతో దీని పరిశోధనలు ప్రారంభ మయ్యాయి. దీనిని రష్యా, అమెరికా, జపాన్‌, యూరోపియన్‌ యూని యన్‌, కెనడా దేశాల అంతరిక్ష పరిశోధనా విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని ప్రధాన నియంత్రణ కేంద్రం రష్యాలోని బైక నూర్‌ వద్ద వుంది. దీని బరువు దాదాపు 450 టన్నులు. పొడవు 72.8 మీటర్లు. వెడల్పు 108.5 మీటర్లు. ఎత్తు సుమారు 20 మీటర్లు. అయితే దీనిలో వాతావరణ పీడనం దాదాపు భూ వాతావరణంతో సమానంగా వుంటుంది.
మానవ శరీరంలో కండరాల వాపు, ఎముకల నష్టం, ద్రవాలలో జరిగే మార్పులలో దీని పరిశోధనలు కొనసాగాయి. 2006 నాటికి వచ్చిన ఫలితాల్నిబట్టి దీర్ఘకాలం అంతరిక్ష ప్రయాణం చేయవచ్చనీ, ఇతర గ్రహాలకు చేరే అంతరిక్ష ప్రయాణం (ఆరునెలల మేర) చేపట్టే అవకాశాలున్నాయనీ నిర్ధారించింది. దీనిలో ఎప్పుడూ దాదాపు బరువులేని వాతావరణస్థితి కొనసాగుతుంది. దీనిలో జీవశాస్త్రం, మానవ శరీరనిర్మాణశాస్త్రం, భౌతికశాస్త్రం, అంతరిక్షం, వాతావరణం, రసాయనిక సంబంధిత శాస్త్రాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనం భూమిపై చేయలేని ప్రయోగాలు ఈ కేంద్రంలో చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త వస్తువుల్ని, పదార్థాల్ని తయారుచేయడానికి వీలవుతుంది.

పరిశోధనాంశాలు..
సునీతా విలియమ్స్‌ ఆమె సహచరులూ కలిసి 30 అంశాలపై 240 ప్రయోగాల్ని చేశారు. వీటిలో ప్రధానమైనవి: అంతరిక్ష పరిశోధనలు..
గాలి, నీరు, ఉపరితల పరిశీలనకు జపాన్‌ రూపొందించిన ఒక రోబోటిక్‌ చేయిని అంచనా వేస్తారు. వైద్య రంగంలో ఎముకలు, కండరాల వాపు / క్షీణత లపై భారరహిత స్థితిలో చేపలపై ప్రయోగాలు నిర్వహిస్తారు. వీటిపై రేడియేషన్‌ ప్రభావాల్ని అంచనా వేస్తారు. అంతర గ్రహ సమాచార ప్రసారవ్యవస్థలో జరుగు తున్న ఆలస్యానికి గల కారణాలను పరిశోధిస్తారు. తద్వార బుధ, ఇతర గ్రహాల నుండి వచ్చే సంకేతాల ఆలస్యాలను లోతుగా అర్థంచేసుకునే వీలుకలుగుతుంది.

అంతరిక్షంలో మానవులు..
స్ఫటికాలు రూపొందడాన్ని అర్థంచేసుకోవడానికి, ఆహారం ఇతర పదార్థాలలో వాటి నిల్వ కాలపరిమితులను తెలుసుకోడానికి తోడ్పడుతుంది. అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన ఆహారాన్ని తయారుచేయడంలో ఈ పరిశోధనలు తోడ్పడతాయి. అంతరిక్షంలో మానవులు దీర్ఘకాలం వున్నప్పుడు శరీరంలో జరిగే మార్పుల్ని అర్థంచేసుకోవడానికీ ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి. ఈ కాలంలో నిద్రాభంగ పరిస్థితుల్ని, రక్త ప్రసరణ స్థితిగతులను అర్థంచేసుకోవడానికి ఈ పరిశోధనలు ఉద్దేశించబడ్డాయి.

ఆరోగ్యం..
కెనడా రూపొందించిన లేజర్‌ పరికరాల ద్వారా జీవకణాలను విశ్లేషించడానికి, వర్గీకరించడానికి ఉపయోగపడే పరిశోధనలను, మాంసకృత్తులలో ప్రవేశపెట్టగల మార్పుల్ని అర్థంచేసుకోడానికి ఈ పరిశోధనలు తోడ్పడతాయి. ముఖ్యంగా రోగాల్ని ముందుగానే తెలుసుకుని గుర్తించడానికి పరిశోధనలు జరిగాయి. సాల్మొనెల్లా బాక్టీరియా ఆహారాన్ని నిల్వలో విషంగా మారుస్తుంది. దీన్ని ఎదుర్కొనడానికి వ్యాక్సిన్‌ తయారీకి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటువంటి ఆహారం తినడంవల్ల పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు.

నానో సాంకేతికాలు..
భారరహిత స్థితి (జీరో గ్రావిటీ) లో జంతుజాల కణ సమూహాలపై నానో స్థాయిలో జరిగే మార్పుల్ని అర్థంచేసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి. తద్వారా అంతరిక్షంలో ఏవైనా జీవాలుంటే గుర్తించడానికి వీలవుతుంది.

భూగోళ శాస్త్రం..
ప్రకృతి వైపరీత్యాలను, పర్యావరణ పరిణామాలను, సంఘటనలను పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి ఉపయోగపడే సాంకేతికాలు పరీక్షింపబడుతున్నాయి. ఇవి భూగోళంలో నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడతాయి.

రసాయనిక శాస్త్రం..
భౌతిక - రసాయనిక మార్పుల్ని, ఎమల్షన్‌ బిందువుల (పెయింట్‌ బిందువు ల్లాంటివి) స్థిరత్వాన్ని తెలుసుకోడానికి కావాల్సిన పరిశోధనలు చేస్తున్నారు.

ఎంతెత్తు నుండి భూమిని చూడగలం?
ఎటువంటి పరికరాల తోడ్పాటు లేకుండా అంతరిక్షంలో భూమిని ఎంత దూరం నుండి చూడగలం? అనేది శాస్త్రజ్ఞుల్ని వేధిస్తున్న ప్రశ్న. దూరం వెళ్లి చూస్తే భూమి సూర్యుని పక్కన వున్నట్లు కనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్లి చూస్తే సూర్యుని నుంచి మిరిమిట్లుగొలుపుతూ వచ్చే కాంతి అసలు భూగోళాన్ని కనపడనీయకుండా చేస్తుంది. భూగోళానికి 300 కిలోమీటర్ల ఎత్తులో గల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి చూసినట్లయితే భూమి పైభాగం కనిపిస్తుంది. అక్కడ భూమి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అక్కడ నుంచి భూగోళంపైగల ఎత్తయిన పర్వతాలు, లోయలు, పెద్ద నదులు, పెద్ద పట్టణాల్లో విద్యుత్‌దీపాలు కనిపిస్తాయి. అంతరిక్షం నుండి భూమిని చూస్తే ఇంటి బాల్కనీలో నుండి కిందకు చూచినట్లు వుందని సునీతా విలయమ్స్‌ తన తండ్రికి వర్ణించి చెప్పారు. అయితే ఆమె పై నుండి భారతదేశాన్ని మబ్బుల అసౌకర్యం వల్ల చూడలేకపోయారట!
అదే చంద్రలోకాన్ని దాటి 3.8 లక్షల కిలోమీటర్ల నుండి చూస్తే భూగోళం మనం చూస్తున్న చంద్రుని (వెలుగుతున్న బంతి) లాగా కనిపిస్తుంది. ఇంకా పైకి పోయి, బుధ, శుక్ర తదితర గ్రహాల్ని దాటి చూసినట్లయితే భూమి ఒక నక్షత్రంలాగా కనిపిస్తుంది. ఇలా 14 బిలియన్‌ కిలోమీటర్ల దూరం పోయి చూస్తే భూమి అస్సలు కనపడదు. ఒకవేళ అంతరిక్షంలో గ్రహాంతరవాసులు టెలిస్కోపు ద్వారా చూస్తే భూగోళాన్ని బహుశా ఇంకా దూరం నుండీ చూడగలుగుతారు.

సునీతా విలియమ్స్‌..
సునీతా విలియమ్స్‌ 45 ఏళ్ల అంత రిక్ష మహిళా పరిశోధకురాలు. అమెరికా పౌరురాలు. ఈమె తండ్రి దీపక్‌ పాండ్యా వైద్యులు, భారత సంతతి (గుజరాత్‌)కి చెందినవారు. తల్లి బోనీ పాండ్యా స్లోవేనియా దేశస్థురాలు. సునీతా రెండు దఫాలుగా అంతరిక్ష సాహస యాత్రలు చేశారు. మొదట 14, 15 సాహసయాత్రలలో 2006, డిసెంబరులో అంతర్జాతీయ అంతరిక్ష పరి శోధనా కేంద్రానికి వెళ్లారు. ఈ సమయం లో మూడుసార్లు అంత రిక్షంలో నడిచారు. 2012, జులై 15 నుం డి నవంబర్‌ 19 వరకూ ఆమె 32, 33 సాహస యాత్రల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన స్థానానికి కమాండర్‌గా సెప్టెంబర్‌ 15 నుండి యాత్రాంతం వరకూ పనిచేశారు. అంతరిక్షంలో మొట్టమొదటి వ్యక్తిగా ఈత, సైక్లింగ్‌, పరిగెత్తడం - ఈ మూడింటినీ వరుసగా పూర్తిచేశారు. పరిశోధనా స్థానంలోనే ఈమె 800 మీటర్ల వరకూ ఈతతో సమానమైన వ్యాయామాన్ని చేశారు. ఆ తర్వాత 29 కిలోమీటర్ల సైక్లింగ్‌ చేశారు. ట్రెడ్‌మిల్‌ పై 6.4 కిలోమీటర్లు పరిగెత్తారు. ఈ మొత్తాన్ని గంట 48 నిమిషాల 33 సెకన్ల లో పూర్తిచేశారు. 2007, సెప్టెంబర్‌లో మన దేశాన్ని సందర్శించారు. తన పూర్వీకుల గ్రామమైన ఝులాసన్‌, సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈమెకి సర్దార్‌ వల్లభారుపటేల్‌ 'విశ్వప్రతిభ' అవార్డును ప్రపంచ గుజరాతీ సొసైటీ అందించింది. ఈమె అంతరిక్షంలో వున్న ప్పుడు రోజుకు 15-17 గంటలు పని చేసేవారు. మిగతా సమయంలో తప్పని సరిగా నిద్రపోవాలనే నియమం వుండేది. ఆ నియమానుసారం నిద్రపోయేవారు.

మీకు తెలుసా..?
ట స్పేస్‌ షటిల్‌: అంతరిక్షంలోకి వాహక నౌకలను పంపడానికి మాటిమాటికీ వినియోగించగల రాకెట్‌ను 'స్పేస్‌ షటిల్‌' అంటారు. దీనిని అమెరికాకు చెందిన 'నాసా' (నేషనల్‌ ఏరోనాటిక్‌ Ê స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) రూపొందించింది. దీనిలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. 1. రాకెట్‌ లాంచ్‌ వాహకం, 2. కక్ష్యలో ప్రవేశపెట్టడానికి అనువైన రాకెట్లు, 3. భూగోళ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడానికి అవసరమైన ఏర్పాటు. స్పేస్‌ షటిల్‌లో కక్ష్య వాహకం, బయట వైపు ఇంధన ట్యాంకు, రెండు ఘన రాకెట్‌ బూస్టర్లు వుంటాయి.
ట ఇంతవరకు దీనిని 1981-2011 మధ్య కాలంలో 135 సార్లు ప్రయోగించారు.

గడ్డకట్టిన సరస్సుల అడుగున జీవులు ఎలా జీవిస్తాయి?

 
 
సరస్సులు గడ్డకట్టినపుడు లోపల జీవులు చనిపోకుండా ఎలా ఉంటాయి?
- వై. అనీల్‌, వరంగల్‌
          ఇలాంటి ప్రశ్నకు గతంలో ఇదే శీర్షికలో జవాబు ఇచ్చినట్టు గుర్తు. ఏదేమైనా పాఠకుల సౌకర్యార్థం మరోసారి దీనికి క్లుప్తంగా జవాబిస్తాను. నీటికన్నా మంచుగడ్డ సాంద్రత (density) తక్కువ. అందువల్లే గట్టిగా ఉన్న ఐసుగడ్డ ద్రవరూపంలో వున్న సాధారణ నీటిపైన తేలి ఉంటుంది. ఇది నీటికి ఉన్న ప్రత్యేక అసంగతక (anamolous) లక్షణం. తద్వారానే సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వున్న ధృవప్రాంతాల్లో ఐసుగడ్డలు నీటిపైనే తేలియాడుతూ నీటి ద్రవ పరిమాణం క్రమానుగతిలో ఉండడం వల్ల భూమి మీద నేల ప్రాంతం కనీసం 25 శాతమైనా వుంది. అలా కాకుండా ఘనస్థితి (solid state) లో వున్న ఐసుగడ్డలు మిగిలిన పదార్థాల్లాగే నీటిలో మునిగేలా అధిక సాంద్రతతో ఉన్నట్లయితే ద్రవనీరు సముద్రాలలో పొంగి, తీర ప్రాంతాలు మొత్తం మునిగిపోయేవి. నేల ప్రాంతం మచ్చుకు 15 శాతం మాత్రమే భూతలం (earth’s surfaces) మీద ఉండేది. కాబట్టి నీటికున్న భౌతిక లక్షణాలు కూడా భూమ్మీద జీవం మనడానికి సహకరిస్తున్నాయి.
ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీరు మైనస్‌లో ఉన్నా అక్కడ పైభాగాన మంచుగడ్డల వత్తిడి (pressure) వల్ల నీటి ద్రవీభవన ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది. అంటే ఋణ ఉష్ణోగ్రత (subzero temperature) వున్నా కూడా నీరు తనమీద అధిక వత్తిడి (తేలియాడే మంచుగడ్డల బరువు వల్ల) ఉన్నప్పుడు గడ్డకట్టకుండా ద్రవస్థితిలోనే ఉండగలదు. అందువల్లే పైన ధృవప్రాంతాలు గట్టిగా ఉన్నా ఆ నేల కింద ద్రవస్థితిలో ఉన్న నీటిలో జలచరాలు మనగలుగుతున్నాయి. తగినంత ఆక్సిజన్‌ అక్కడక్కడా ఉన్న సందుల ద్వారా నీటిలో కరిగి ఉంటుంది. పైగా జంతుజీవాలతో పాటు వృక్ష జీవులైన నాచు, ఆల్గే వంటివి కూడా అక్కడ ఉండడం వల్ల, మంచుగడ్డల ద్వారా కూడా కాంతి పోగలగడం వల్ల, అక్కడజీవులు వదిలిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉండడం వల్ల, కావలసినంత నీరుకూడా ఉండడం వల్ల కిరణజన్య సంయోగక్రియ ((photosynthasis) జరిగి, తగు మోతాదులో ఆక్సిజన్‌ విడుదలవుతోంది. కాబట్టి జలచరాలు, తదితర జీవులు గడ్డకట్టిన సరస్సుల కింద, ధృవప్రాంతాల కింద జీవించగలుగుతున్నాయి.

ఈ భూమ్మీద జనాభా పెరిగిపోతోంది. భూమి దేని ఆధారం మీద నిలబడింది? ఇంత బరువుకు భూమి కుంగిపోకుండా ఎలా ఉండగలుగుతోంది?
- వై.సుధీర్‌కుమార్‌, వరంగల్‌.

భూమి, తదితర గ్రహాలు, వాటి ఉపగ్రహాలు మొదలైన ఖగోళ వస్తువులెన్నో సమతాస్థితి (equilibrium) లో ఉన్నాయి. దీనర్థం ఏమిటంటే భూమ్మీద పనిచేసే అన్నివిధాలైన బలాల నికరబలం సున్న. మిమ్మల్ని ఒకరు కుడివైపునకు, మరొకరు ఎడమవైపునకు ఇంకొకరు వెనక్కి, వేరొకరు ముందుకు లాగుతున్నా మీరు ఉన్నచోటే ఉన్నారనుకొందాం. దీనర్థం ఏమిటి? మీపైన బలాలేమీ లేవని కాదు కదా? కానీ ముందు బలాన్ని వెనక బలం సమం చేసి, ముందుకుగానీ వెనక్కిగానీ మిమ్మల్ని కదలకుండా చేసింది. అలాగే ఎడమ బలం, కుడి బలానికి సమం చేసి ఎడమ కుడిలో ఎటూ కదలకుండా చేసింది. అలాగే భూమి మీద బలాలు ఎన్ని వున్నా అన్నింటి నికరబలం శూన్యమైపోవడం వల్ల ఎటూ కృంగిపోవడం లేదు. భూమితోపాటే భూమి వున్న మనుషులు, జనాభా ఉన్నారు. ఈ జనాభా ఆకాశం నుంచి వూడిపడిన గంధర్వులో, దేవతా పురుషులో, గ్రహాంతరవాసులో కాదు. ఇక్కడున్న పదార్థాలే మార్పు చెంది, పదేపదే చక్రియంగా జీవులు ఏర్పడుతున్నాయి. రైలు పెట్టెలో బెర్తు కింద వున్న మీ సూట్‌కేసును తీసేసి అందులో వున్న వస్తువుల్ని బోగీలో చెల్లాచెదరుగా విసిరేస్తే బోగీ కృంగిపోదు కదా? అలాగే ఇదీను.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

నాభిలో బాక్టీరియా అడవులు..!

          భూమి మీద వర్షారణ్యాలలో ఉన్నంత విస్తృతంగా, వైవిధ్యంగా సూక్ష్మజీవులు మానవుల నాభిలో ఉంటాయని తెలిసింది. అమెరికా పరిశోధకులు నాభిలో 2,368 జాతుల బాక్టీరియాలను కనుగొన్నారు. వాటిలో 1,458 జాతులు ఇంకా సైన్సుకి తెలియనివే కావడం విశేషం.70 శాతం కంటే ఎక్కువ వ్యక్తులలో కేవలం ఎనిమిది జాతులే కనిపించాయట! ఇలా కొందరిలో కొన్ని జాతుల బాక్టీరియా మాత్రమే ఉండటానికి కారణాలను అన్వేషిస్తున్నారు. అధికంగా కనిపించే జాతులు ఏ విధంగా మార్పు చెందుతూ పరిణామం చెందాయో అధ్యయనం చేస్తున్నారు. ఇన్ని రకాల బాక్టీరియా ఉన్నా, వాటివల్ల మనకి ప్రత్యేకంగా హాని లేదంటున్నారు ఈ పరిశోధకులు. పైగా, ఆ బాక్టీరియా లేకపోతే, మన వ్యాధి నిరోధకవ్యవస్థ సరిగా పనిచేయదని వీరు భావిస్తున్నారు.
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ

డెంగీ వ్యాధికి టీకా మనదే..!

             
           ప్రస్తుతం మనుషులని గజ గజలాడిస్తున్న డెంగీ వ్యాధికి అతి ప్రతిభావంతమైన టీకా పరీక్షలు మనదేశంలోనే జరగనున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే మరో రెండేళ్లలో డెంగీ టీకా మందు ప్రపంచ వ్యాప్తంగా లభ్యమవుతుంది. ఒక ఫ్రెంచ్‌ మందుల కంపెనీ 'సనోఫీ పాశ్చర్‌' ఈ టీకాను పరీక్షిస్తోంది. ప్రస్తుతం థారులాండ్‌ నుండి ఇండియా వరకూ ఈ టీకాను పరీక్షించాలని నిర్ణయించారు. ఈ టీకా కనీసం మూడు నాలుగు రకాల డెంగీని ఎదుర్కొంటుంది. టైపు-2 డెంగీ అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల హేమరేజిక్‌ జ్వరం వచ్చి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. కానీ ఇప్పుడు రూపొందించిన టీకా ఈ రకం డెంగీని అరికట్టదు.

రెండు నెలల నిద్రా..?!

          అమెరికాలో ఒక అమ్మాయికి విచిత్ర వ్యాధి వచ్చింది. అతి అరుదుగా వచ్చే 'స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోం' అనేదే ఈ వ్యాధి. దీనివల్ల నికోల్‌ డేలియాన్‌ అనే పదిహేడేళ్ళ అమ్మాయి ఏకంగా 64 రోజులు నిద్రలో మునిగిపోయింది. ఆమె సాధారణ నిద్ర రోజుకి 18-19 గంటలట! అప్పటికీ, భోజనానికి లేచిన నికోల్‌ నిద్రలో నడుస్తున్నట్టే ప్రవర్తిస్తుందట! ఆమెకు ఏమీ గుర్తు కూడా రాదట! 'క్లేఇని-లెవిన్‌ సిండ్రోం'గా పిలిచే ఈ నాడీ వ్యాధి వల్ల రోజులు, నెలలు, చివరికి కొన్ని సంవత్సరాలపాటు ఎటువంటి లక్షణమూ కనిపించకుండా ఉంటారట! ఈ వ్యాధికి కారణాలు ఇంతవరకూ తెలియదు.

బృహస్పతి కంటే పెద్దగ్రహం..!

            బృహస్పతి కంటే పదమూడు రెట్లు పెద్దగావున్న గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారు. బహుశా ఈ కొత్త గ్రహం మన సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం కావచ్చని అంటున్నారు వీరు. ఈ కొత్త గ్రహం 'కప్పా ఆన్ద్రోమీడా' అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. సూర్యుడి కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉన్న ఈ భారీ గ్రహం భూమికి 170 కాంతి సంవత్సరాల దూరంలో వుంది. ఇంత భారీ గ్రహాన్ని గత నాలుగేళ్ళలో గమనించలేదని పరిశోధకులు అంటున్నారు. అంతరిక్షం నిత్యం కొత్త వింతల్ని చూపుతూనే ఉంది కదా!

లావుతో లాభం..!

       శరీరంలో కిలోలు పెరుగుతుంటే బాధ సహజమే. కానీ నిజానికి లావుగా వున్న వాళ్ళు బక్కపలచని వాళ్ళకంటే ఆనందంగా, సరదాగా ఉంటారని కొత్త పరిశోధన చెబుతోంది. ఈ విశిష్ట లక్షణానికి కారణం వారి జన్యువులే అంటున్నారు. లావుగా వున్న వారి జన్యువులలో డిప్రెషన్‌ కలిగించే విషయాలు తక్కువగా ఉంటాయట. లావుకి సంబంధించిన ఒక ప్రొటీన్‌ వల్ల స్థూలకాయం వస్తుందట. కానీ అదే ప్రొటీన్‌ వల్ల డిప్రెషన్‌ వచ్చే అవకాశం దాదాపు ఎనిమిది శాతం తక్కువ ఉంటుందట. మొత్తానికి, లావుతో కూడా ఒక లాభం ఉందన్న మాట.

Thursday 22 November 2012

జీవానుకరణ..



        ప్రకృతిని, దాని నమూనాలను, వ్యవస్థలను, పనివిధానాలను, దానిలోని వివిధ భాగాలను, విడివిడిగా లేదా సామూహికంగా అనుకరిస్తూ, లేదా స్ఫూర్తి పొందుతూ మానవ సమస్యలను పరిష్కరించడమే జీవానుకరణ. ఈ అనుకరణ మానవాభివృద్ధికి ఎంతో తోడ్పడింది. మానవుడు తాత్విక ఆలోచనలతో ప్రకృతిలోని వివిధ పార్శ్వాల్ని అర్థంచేసుకుంటున్నాడు. అలాగే నిత్యజీవితంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలకు, ఆకాంక్షలకు సమాధానాలు కనుగొనేందుకు జీవానుకరణను ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఇటీవల కాలంలో జీవానుకరణ ద్వారా ఎన్నో కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సంక్షిప్తంగా 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో తెలుపుతూ మీముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
గత 3600 కోట్ల సంవత్సరాల కాలంలో స్వానుభవంతో భూగోళంపై ప్రకృతి తన జీవజాతులను, వ్యవస్థలను, పదార్థాలను అభివృద్ధిపరుచుకుంది. ఇది మనకెంతో అనుభవాల్ని, స్ఫూర్తిని అందిస్తూ కొత్త సాంకేతికాల్ని రూపొందించడానికి తోడ్పడింది. ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ప్రకృతిలో భారీ నుంచి నానో స్కేల్‌ పరిమాణాల మధ్య గల జీవాల స్ఫూర్తి కొత్త ఇంజనీరింగ్‌ సాంకేతికాలు రూపొందేందుకు తోడ్పడింది.
జీవానుకరణ సాంకేతికం కొత్తదేమీ కాదు. మానవావిర్భావం నుండే సంక్లిష్ట సమస్యల నుండి సాధారణ సమస్యల పరిష్కారానికి మానవుడు ప్రకృతిని పరిశీలిస్తూ స్ఫూర్తిని పొందుతూనే వున్నాడు. నీటిని వికర్షించడం (సహజంగా నీరు ఆకర్షణ గుణంగలది), ఉధృత గాలుల్ని తట్టుకోవడం, స్వయం సమకూర్పు (సెల్ఫ్‌ అసెంబ్లీ), సౌరశక్తిని వినియోగించుకోవడం వంటి ఎంపికచేసిన లాభాలను పొందడానికి జీవానుకరణ ఎంతో తోడ్పడింది. తద్వారా ఎంపిక చేసుకున్న రంగాలలో కొత్త సాంకేతికాలు రూపొందాయి.
విమానాల రూపకల్పన..
ప్రారంభ జీవానుకరణలో పక్షుల్ని గమనించి, వాటిలాగే ఎగురుతూ అన్ని అడ్డంకులనూ అధిగమిస్తూ దూరప్రాంతాలకు తేలిగ్గా చేరే ప్రయత్నాలను మానవుడు చేపట్టాడు. దీనికోసం ఎగిరే యంత్రాలను రూపొందించాలనుకున్నాడు. అయితే, దీనిలో సఫలం కాలేదు. కానీ, 1452-1519 మధ్యకాలంలో లియోనార్డో డావెన్సీ (ఇటాలీయన్‌-ఫ్రెంచ్‌ తాత్వికవేత్త) ఎగిరే పక్షి శరీర నిర్మాణాన్ని సూక్ష్మంగా, క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఈ వివరాలను సేకరించడమేకాక, వివిధ దశల్లో ఎగిరే పక్షి బొమ్మల్ని కూడా గీశాడు. వీటి ఆధారంగా తన ఊహాశక్తితో ఎగిరే యంత్రాల ఆకృతి (స్కెచ్‌)ని రూపొందించాడు. ఈ ప్రయత్నాలను కొనసాగిస్తూ రైట్‌ సోదరులు గాలికన్నా బరువైన యంత్రంతో 1903లో ఎగరగలిగారు. వీరు ఎగిరే పావురాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇదే నేడు ఆధునిక విమానంగా రూపొందింది.
సైక్లోన్‌ను తట్టుకోగల ఇళ్ల నిర్మాణం.
సముద్ర తీరప్రాంతాల్లో వాయుగుండం ఏర్పడినప్పుడు వచ్చే అతివేగ గాలుల్ని తట్టుకోగల ఇళ్ల నిర్మాణం స్ఫూర్తి ప్రకృతి నుండి తీసుకున్నదే.
నానో స్థాయిలో..
ప్రకృతిలో నానో పరిమాణంలో ఎన్నో జీవజాతులు వున్నాయి. ఇవి కొత్త పదార్థాలను రూపొందించడానికి మూసఫలకాలు (టెంప్లెట్స్‌) గా ఉపయోగపడ్డాయి. ఇటువంటి జీవజాతులు బ్యాక్టీరియా, వైరస్‌, డయాటమ్స్‌, బయో మాలిక్యూల్స్‌ తదితరాలు. వీటి స్ఫూర్తితో నానో వైర్లు, క్వాంటమ్‌ డాట్స్‌, నానో ట్యూబులు సమర్థవంతంగా రూపొందించబడ్డాయి. సాంప్రదాయ పద్ధతుల్లో వీటిని తయారుచేయడం చాలా కష్టం. వీటి నిర్మాణాల ద్వారా సౌరవిద్యుత్‌ పరికరాలు (ఫొటోవోల్టెక్‌ సెల్స్‌), సెన్సర్స్‌ (గుర్తించగల పరికరాలు), ఫిల్టరేషన్‌ (వడబోత), ఇన్స్యులేషన్‌ (నిరోధకశక్తి గలవి), వైద్య పరికరాలు రూపొందాయి..
నానో జీవానుకరణలో ఇతర విజ్ఞానాల అవగాహన అవసరం. ముఖ్యంగా జీవశాస్త్రం, ఇంజనీరింగ్‌, భౌతికశాస్త్రం, పదార్థ విజ్ఞానశాస్త్రం, నానో సాంకేతిక శాస్త్రం తదితర సంబంధిత విజ్ఞానశాస్త్రాల అవగాహన అవసరం. అప్పుడే నానో జీవానుకరణ ద్వారా కొత్త పదార్థాలను రూపొందించే వీలవుతుంది.
వైరస్‌ల స్ఫూర్తితో..
జంతుజాలాల నిర్మాణ స్ఫూర్తితో జీవ ఖనిజ మార్పిడి (బయో మినరలైజేషన్‌) సాంకేతికం ద్వారా మూసఫలకాలను రూపొందించి, వాటితో కొత్త పదార్థాల్ని తయారుచేస్తున్నాం.
వైరస్‌లు స్వతహాగా జీవం లేకున్నా కొన్ని పరిస్థితుల్లో జీవాలుగానే పునరుత్పత్తి కలిగి వుంటాయి. టొబాకో మొజైక్‌ వైరస్‌ (పొగాకు వైరస్‌) సహజంగా మొక్కల్లో రోగాన్ని కలిగిస్తుంది.. చూడటానికి ఇది పొడుగ్గా, దృఢంగా (రాడ్‌ వలే) కనిపిస్తుంది. వీటి పైపొర చాలా దృఢంగా వుంటుంది. 60 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వేడిని తట్టుకుంటుంది. పిహెచ్‌ (ఉదజని సూచిక) 2 నుండి 10 యూనిట్ల వరకూ తట్టుకుంటుంది. ఇవీ వీటి ప్రత్యేకత. ఈ నిర్మాణ స్ఫూర్తితో నానోవైర్లు, ట్యూబ్‌లు, క్వాంటమ్‌ డాట్స్‌ తయారయ్యాయి. సిలికాన్‌, లెడ్‌ సల్ఫైడ్‌, క్యాడ్మియమ్‌ సల్ఫైడ్‌ ట్యూబ్‌లను తయారుచేస్తారు. వీటిని ఇతర పదార్థాలను అందించడానికి వాహకాలు (క్యారియర్లు) గా ఉపయోగించవచ్చు. ఇదేవిధంగా గుండ్రంగా వుండే వైరస్‌ల స్ఫూర్తితో 6.5 పిహెచ్‌ కన్నా ఎక్కువగా వున్నప్పుడు పదార్థాలను పీల్చుకుని ఉబ్బుతాయి. తద్వారా, ఎంపిక చేసిన పదార్థాలనే తీసుకునే ఖనిజ లవణాల పదార్థాలను రూపొందించారు.
రంగురంగుల పదార్థాల తయారీ..
మామూలుగా రంగు పదార్థాలను రంగును ఆపాదించే పిగ్మెంట్లను కలిపి తయారుచేస్తారు. కానీ, సీతాకోకచిలుక రెక్కలు, నెమలి ఈకల్లో రంగుల స్ఫూర్తితో వివిధ కాంతుల్ని ఇవ్వగల పదార్థాలను రూపొందించారు. వీటిలో ఆయా రంగులు కలిగిన పిగ్మెంట్లను వినియోగించాల్సిన అవసరం లేదు. మార్చి మార్చి రంగుల్నిచ్చే బల్బులు ఈ స్ఫూర్తితో తయారైనవే.
మరికొన్ని తయారీలు..
- 'వెల్‌క్రో'ను ఉపయోగించి మాటిమాటికీ దృఢంగా అతికించి, తేలిగ్గా ఊడదీయవచ్చు. ఇప్పుడు జిప్పుల స్థానంలో వీటిని వినియోగిస్తున్నారు. ఇది గరుకుగా, 'కొక్కాలు' కలిగి వుండే 'పల్లేరుకాయ'ల్లాంటి కాయల ముళ్ల స్ఫూర్తితో రూపొందించబడింది.
- జింబాబ్వేలోని హరారే వద్ద ఈస్టిగేట్‌ సెంటర్‌ అనే భవనం నిర్మించబడింది. దీనిలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగి, తగ్గకుండా నిర్మాణం చేయబడింది. దీనికి స్ఫూర్తి ఆఫ్రికా దేశంలో ఎత్తుగా పెరిగిన చెదల పుట్ట. దీనిలో బయట ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ మారినప్పటికీ లోపల మాత్రం ఉష్ణోగ్రత మారకుండా స్థిరంగా వుంటుంది. ఇలా నిర్మించడం ద్వారా ఎయిర్‌కండిషన్లకు అవసరమైన విద్యుత్‌ ఆదా అవుతుంది.
- చీకట్లో శబ్ధ తరంగాల ప్రకంపనల ద్వారా గబ్బిలాలు రాత్రి కూడా చూడగలుగుతాయి. ఇదే స్ఫూర్తితో గుడ్డివారికి మార్గం చూపించేలా వాకింగ్‌ స్టిక్‌ను రూపొందించారు.
- సాలెగూడు నిర్మాణానికి సాలీడు అతి గట్టి సిల్క్‌ దారాన్ని తయారుచేస్తుంది. ఇదే స్ఫూర్తితో కెప్లర్‌ దారాన్ని బులెట్‌ప్రూఫ్‌ జాకెట్ల తయారీకి ఉపయోగించారు. ఈ స్ఫూర్తితోనే తయారైన పదార్థాలను దీర్ఘకాలం నిల్వ వుండగల ప్యారాచూట్లను, సస్పెన్షన్‌ బ్రిడ్జి కేబుళ్లను, చికిత్సలో కృత్రిమ కండరాలను, ఇతర పదార్థాల్ని రూపొందించడానికి వినియోగిస్తున్నారు.
- షార్క్‌ చేప చర్మ నిర్మాణ స్ఫూర్తితో పొరలు పొరలుగా గల సౌర విద్యుత్‌ పరికరాల్ని రూపొందిస్తున్నారు.
- ఇదేవిధంగా పెంకు పురుగులు స్ఫూర్తితో మంచు నుండి తేమను గ్రహించగల పదార్థాల్ని తయారుచేస్తున్నారు.
- ఒక రకమైన పెంకు పురుగు (బీటిల్స్‌) స్ఫూర్తితో తేమతో కూడిన సూక్ష్మ స్ప్రే సాంకేతికాన్ని తయారుచేశారు. దీనితో స్ప్రే చేయడం వల్ల మామూలు స్ప్రే వల్ల కలిగే కాలుష్యం, దుర్వాసన వంటివి వుండవు.
అంతర్జాతీయ సంస్థ..
లాభాపేక్ష లేకుండా ఈ సంస్థను 'బయోమిమిక్రీ ఇన్నోవేషన్స్‌ ఇన్‌స్పైర్డ్‌ బై నేచర్‌' అనే పుస్తకాన్ని రచించిన రచయిత్రి జానిన్‌ బెనియుస్‌ 2006లో స్థాపించింది. ఆమె పుస్తకం ప్రచురణ తర్వాత జీవానుకరణపై అమితంగా పెరిగిన ఆసక్తిని దృష్టిలో వుంచుకుని, ఈ సంస్థ స్థాపించబడింది. దీని లక్ష్యం ప్రకృతిలో వున్న సమర్ధవంతమైన అద్భుత డిజైన్లను అధ్యయనం చేయడానికి శాస్త్రజ్ఞులను, ఇంజనీర్లను, ఆర్కిటెక్ట్‌లను ఒకే వేదిక మీదకు తెచ్చి, సుస్థిరమైన సాంకేతికాలను రూపొందించడం. దీనికోసం ఇది ప్రత్యేకమైన కోర్సులను, కార్యశాలలను నిర్వహిస్తుంది. ఇది ప్రధానంగా విద్యార్థులకు, వృత్తిదారులకు, సాధారణ ప్రజలకు విద్యా కార్యక్రమాలను రూపొందిస్తుంది. సుస్థిర అభివృద్ధిలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోడానికి జీవానుకరణ ద్వారా కొత్త విధానాల రూపకల్పనకు కృషి చేస్తుంది. జీవవైవిధ్య పరిరక్షణ దీనిలో భాగమే. జీవానుకరణ ద్వారా వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని జీవవైవిధ్య పరిరక్షణకు అందేలా కృషి చేస్తుంది.

మీకు తెలుసా..?
- బయోమిమిక్రీ అంటే జీవానుకరణ. ఇది గ్రీకు పదం బయాస్‌ (జీవం), మిమెసిస్‌ (అనుకరించడం) నుండి వచ్చింది.
- 'ఒట్టోష్మిట్జ్‌' అనే అమెరికన్‌ మేధావి జీవశాస్త్రం నుండి ఆలోచనలను సాంకేతిక విజ్ఞానానికి తరలించే విజ్ఞానానికి 'బయోమెటిక్స్‌' అనే పదాన్ని మొదట వాడాడు. ఇదే 'జీవ ఇంజనీరింగ్‌ సాంకేతికం'.
- జీవానుకరణ, జీవ ఇంజనీరింగ్‌ సాంకేతికాలు ఒకే నాణేనికి రెండు బొమ్మల్లాంటివి. వీటిని పరస్పరం మార్చుకోగలవిగా ఒకేదాన్ని సూచించడానికి వినియోగిస్తున్నారు.
- జీవజాతుల ఉత్పత్తులను, పదార్థాలను (ఎంజైమ్స్‌, సిల్క్స్‌ తదితరాలు) అనుకరిస్తూ, అవి రూపొందించిన నిర్మాణాలు, చేస్తున్న విధులు, పద్ధతుల (మాంసకృత్తుల పొందిక, కిరణజన్య సంయోగ ప్రక్రియ) ఆధారంగా కృత్రిమంగా యంత్రాలతో తయారుచేసే ప్రక్రియను ''జీవ ఇంజనీరింగ్‌ విజ్ఞానం''గా 'వెబ్‌స్టర్‌ డిక్షనరీ' 1974లో నిర్వచించింది.
- మానసిక నిపుణుడు, ఇంజనీర్‌ అయిన 'జాక్స్‌ స్టీలే' ప్రకృతిని అనుకరిస్తూ రూపొందే వ్యవస్థల విజ్ఞానానికి 'బయానిక్స్‌' అనే పదాన్ని 1960లో వాడాడు.
- నానో కణాలు : ఒకటి నుండి 100 నానో మీటర్ల పరిమాణంగల పదార్థాలు. నానోమీటరు అంటే మీటరు మందంలో 100 కోట్ల వంతు.
- తామరాకు 'నీటి'ని పీల్చుకోదు. ఒక నీటిబొట్టును ఆకుపై వేస్తే అది అలాగే నిలిచి వుంటుంది. ఇదే స్ఫూర్తితో వర్షంలో తడిచినప్పుడు భవనాల్ని రక్షించడానికి రంగుల్ని తయారుచేస్తున్నారు.

సముద్రసర్పాల విషానికి విరుగుడు లేదా?

  • ఎందుకని? - ఇందుకని!
ప్రపంచంలో అన్ని విషసర్పాలకు విరుగుడు వుందికానీ సముద్రజల సర్పాలకు విరుగుడు లేదని నేను కొన్ని మేగజైన్స్‌ ద్వారా తెలుసుకొన్నాను. నిజమేనంటారా?
- బాలబొమ్మల అఖిలబిందు, 9వ తరగతి, శశివిద్యాలయం, తాడేపల్లిగూడెం.
ప్రపంచంలో అన్ని విషసర్పాల విషాలకు విరుగుడు మందులున్నాయి. అలాగే సముద్రసర్పపు విషానికీ విరుగుడు ఉంటుంది. ఫలాని పాము విషానికే విరుగుడు ఉండదనడం కేవలం అపోహ మాత్రమే! లేదా కాలక్షేపానికి కొందరల్లిన సంచలన సమాచారం (రవఅఝ్‌ఱశీఅaశ్రీ అవషర). ఏ విషానికైనా విరుగుడును ఎందుకు తయారుచేస్తారో తెలిస్తే సముద్రసర్పాల విషాలకు విరుగుడు తయారుకాదు అన్న వాళ్లను ఎలా తయారుకాదో ప్రశ్నించగలం.
సాధారణంగా పాము విషానికి విరుగుడు మందు తయారుచేయడానికి గుర్రానికి పాము విషాన్ని (గుర్రం చనిపోని పరిమాణంలో) దాని రక్తంలోకి (ఱఅ్‌తీaఙవఅశీబర) ఇంజక్ట్‌ చేస్తారు. ఆ తర్వాత గుర్రంలో ఆ విషాన్ని ఎదుర్కొనడానికి ప్రతిదేహాలు (aఅ్‌ఱbశీసఱవర) అనే రసాయనాల్ని గుర్రపు రక్షణవ్యవస్థ (ఱఎఎబఅఱ్‌y రyర్‌వఎ) జీవసంశ్లేషణ (bఱశీరyఅ్‌ష్ట్రవరఱర) ద్వారా తయారు చేసుకుని రక్తంలోకి విడుదల చేస్తుంది. అంటే విషపు అణువుల్ని తటస్థం (అవబ్‌తీaశ్రీఱరవ) చేయడానికి దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఈ ప్రతిదేహాలు పోరాటం చేస్తాయి. అయితే గుర్రంలోకి ఎక్కిన విషపు పరిమాణంకన్నా ఎక్కువ మోతాదులోనే ప్రతిదేహాలు ఏర్పడడంవల్ల విషపు అణువుల్ని తటస్థం చేసి నిర్వీర్యం అయిన ప్రతిదేహాలు ఆపై పనిచేయకున్నా అదనంగా ఇంకా చాలా ప్రతిదేహాలు రక్తంలో మిగిలే ఉంటాయి. ఆ సందర్భంలో గుర్రపు రక్తాన్ని సేకరించి, దానిలోని ఎర్రరక్త కణాల్ని ప్రత్యేక పద్ధతుల్లో వేరు చేయగా, మిగిలిన రక్తపు ద్రవాన్ని (దీన్నే సీరం అంటారు) భద్రపరుస్తారు. ఇది ఏ సర్పపు విషాన్ని గుర్రానికి ఎక్కించడం వల్ల ఈ ప్రతిదేహాలు రూపొందాయో ఆ సర్పపు కాటు బారినపడ్డ వారికి విరుగుడు మందు (aఅ్‌ఱఙవఅశీఎ) గా వైద్యులు నిర్దేశించిన మోతాదు (సశీరవ) లో ఎక్కిస్తే ఆ సర్పపు కాటుకు అది విరుగుడుగా పనిచేస్తుంది. సముద్రపు పాముల్ని పట్టుకొని వాటి కోరలు (టaఅస్త్రర) ద్వారా వాటి విషాన్ని సేకరించి, పైన పేర్కొన్న గుర్రపు తతంగం చేసే వీలుంది. కాబట్టి సముద్రసర్పాల విషానికి విరుగుడు లేదన్న ప్రశ్నకు అర్థంలేదు. విరుగుడు ఉందన్నదే సమాధానం.
సముద్ర సర్పాలన్నీ పరిణామక్రమంలో నేలమీదే ఆవిర్భవించాయి. అయినా ఏ సముద్ర సర్పమూ నేలమీద బతకలేదు. సముద్ర సర్పాలన్నీ విషసర్పాలే. ఏభై పైచిలుకు జాతులు (రజూవషఱవర) ఉంటాయి. సముద్ర సర్పాలు ఫసిఫిక్‌ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో మాత్రమే ఉన్నట్లు జీవావరణ శాస్త్రవేత్తలు (వషశీశ్రీశీస్త్రఱర్‌ర) అంటున్నారు. నీటిలోనే బతగ్గలిగినా ఇవి అడపాదడపా నీటిపైకొచ్చి ఊపిరితిత్తుల విధానం ద్వారానే శ్వాసప్రక్రియ (తీవరజూఱతీa్‌ఱశీఅ) కావిస్తాయి. వీటికి చేపల్లాగా మొప్పలు (స్త్రఱశ్రీశ్రీర) ఉండవు. సముద్రసర్పాల కాటుకు విరుగుడును ఆస్ట్రేలియాలో నిజూూ దీఱశ్‌ీష్ట్రవతీaజూఱవర ూఙ్‌ ూ్‌స., 45 ూశీజూశ్రీaతీ =శీaస,ూaతీసఙఱశ్రీశ్రీవ 3052, Vఱష్‌శీతీఱa, Aబర్‌తీaశ్రీఱaు అనే కంపెనీ దశాబ్దాలుగా తయారుచేస్తూ ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. విస్తారమైన తీరప్రాంతంలో దక్షిణభాగంలో చేపలుపట్టే జాలరులకు సముద్రసర్పాల విషాలకు విరుగుడు మందులను మన ప్రభుత్వాలు సరిపడా తయారుచేసుకుని అందుబాటులో ఉంచుకోవాలి.
మామూలు కుక్కకాటుకు, పంట పొలాల్లో పాముకాటుకు విరుగుడు మందులు అందని ప్రభుత్వాసుపత్రుల్లో, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సముద్రపు పాముల కాటుకు విరుగుడు మందు అడగడం గొంతెమ్మ కోర్కె అవుతుందేమో! కానీ పాము కాటుకు గురైనపుడు విరుగుడు మందు దొరకక అష్టకష్టాలు పడుతూ ఎంతోమంది మంత్రగాళ్ల మాయలకు బలైపోతున్నారు. ఈ మంత్రగాళ్లే విషానికి విరుగుడు లేదన్న పుకార్లను శక్తికొలదీ ప్రచారంలో పెడతారు. దీనివల్ల ప్రజల్లో మూఢత్వం పెరిగిపోతుంది. దీన్ని విజ్ఞానవంతులంతా అడ్డుకోవాలి.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

పెరిగిన రాబందుల సంఖ్య..!

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్   Thu, 22 Nov 2012, IST  

              మన దేశంలో రాబందులు కనుమరగవుతున్నాయని మొన్నటివరకూ ఆందోళన నెలకొంది. కానీ తాజా అంచనాల ప్రకారం, గతంలో 99 శాతం పడిపోయిన రాబందుల సంఖ్య కాస్త పెరిగిందని తెలిసింది. 90వ దశకంలో రాబందులు తీవ్రంగా తగ్గిపోయాయి. అంతకు ముందు అవి దాదాపు నాలుగు కోట్ల వరకూ వుంటే, గతేడాదికి వాటి సంఖ్య ఒక లక్షకు పడిపోయింది. వాటి తగ్గుదలకు కారణం దైక్లోఫినాక్‌ అనే ఒక నొప్పి తగ్గించే మందు అని తేలింది. ఆ మందును పశువులకు విస్తృతంగా వాడతారు (అంతకంటే విస్తృతంగా మనమూ వాడతాము. అయితే మనల్ని రాబందులు తినే అవకాశం లేదు). పశువుల శక్తివంతమైన జీర్ణశక్తి వల్ల ఆ మందు వాటిపై దుష్ప్రభావం కలిగించదు; కానీ వాటి కళేబరాలని తిన్న రాబందులకు మాత్రం ఆ మందు ప్రాణాంతకంగా మారుతుంది. ఆ మందు వాడకాన్ని నిషేధించిన తరువాత రాబందుల సంఖ్యలో కాస్త పెరుగుదల కనిపించిందట.

భయాన్ని వాసనతో పసిగట్టొచ్చు..!

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్   Thu, 22 Nov 2012, IST  

             చాలా జంతువులలాగే మనం కూడా భయాన్ని వాసన ద్వారా పసిగట్టవచ్చు అని పరిశోధకులు తెలియజేస్తున్నారు. మానవులు ఆవిర్భావ క్రమంలో తమ వాసన గ్రహించే శక్తిని కోల్పోతూ వచ్చారు. అయితే ఆ శక్తి సన్నగిల్లిందేగానీ పూర్తిగా సమసిపోలేదని ఇపుడు అంటున్నారు. కొంతమంది స్వచ్ఛంద పురుషులకు భయంకర సినిమా చూపించి అప్పుడు వెలువడిన చెమటను సేకరించారు. ఆ తరువాత ఇంకొంతమందిని ఆ చెమటను వాసన చూడవలసినదిగా కోరారు. భయం గొలిపే దృశ్యాలు చూసినప్పుడు వచ్చిన చెమట వాసన చూడగానే కనుపాపలు విచ్చుకోవడం వంటి ఫలితాలు కనిపించాయి. ఈ పరిశోధన ద్వారా తేలింది ఏమిటంటే మనకీ పూర్వపుశక్తులు కొన్ని ఇంకా మిగిలి మరుగున వున్నాయి.

తగ్గిన నక్షత్ర జననాలు..!

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్   Thu, 22 Nov 2012, IST  

                  అంతరిక్షంలో నక్షత్రాల జననాలు గణనీయంగా తగ్గిపోయాయని అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. మునుపటి కంటే 1/30వ వంతు మేర నక్షత్ర ఆవిర్భావం పడిపో యిందని వీరు అంటున్నారు. పైగా, ఈ తగ్గుదల ఇలాగే కొనసాగనుందట. అయితే ఈ తగ్గుదల ఈనాటిది కాదట. గత పదకొండు బిలియన్‌ సంవత్సరాల నుండీ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అంటే పదకొండు బిలియన్‌ ఏళ్ళ క్రితం నక్షత్రాలు అత్యధిక సంఖ్యలో జనించేవి. ఇప్పుడు మన విశ్వంలో ఎక్కువ శాతం వృద్ధ నక్షత్రాలే ఉన్నాయట.

కోసిన మాంసాన్ని కడగకూడదు..!

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్   Thu, 22 Nov 2012, IST  

                    కోడి మాంసమో, మేక మాంసమో షాపు నుండి తెచ్చాక తెగ కడిగి శుభ్రపరచడం మనకు అలవాటు. ఇక ఆ అలవాటు మానుకోవాలి అంటున్నారు శాస్త్రజ్ఞులు. మనం కడిగితే ఆరోగ్యం అనుకుంటే, వారేమో కడక్కపోతేనే ఆరోగ్యం అంటున్నారు. పచ్చి మాంసంపై సూక్ష్మక్రిములు విపరీతంగా ఉంటాయి. వాటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో మనం కడగటం వలన అవి పోవడం సంగతి అటుంచి మన చేతులు, నీటి ద్వారా అవి మరిన్ని పదార్థాలకి విస్తరించే ప్రమాదం ఉందని తెలిసింది. పైగా మాంసం ఉడుకుతున్న సమయంలో ముక్క ఉడికిందా లేదా అని రుచి చూడటం వలన కూడా సూక్ష్మక్రిములు మనలో ప్రవేశించే వీలుందట! వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో కొద్ది సమయం ఉడికించడం వలన మాత్రమే ఈ సూక్ష్మక్రిముల్ని తగ్గించవచ్చని అంటున్నారు. నీటిని బాగా పీల్చుకునే పేపర్‌ నాప్కిన్‌తో మాంసాన్ని బాగా అద్ది, వండుకుంటే ఎటువంటి సమస్యా ఉండదని నిపుణులు సలహా. ఇది మనం పాటించడం కొంచెం కష్టం కావచ్చు.

కవలల్లో జన్యుమార్పులు..!

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్   Thu, 22 Nov 2012, IST  

             ఒకే పిండం నుండి ఏర్పడ్డ ఇద్దరు పిల్లలు జన్యుపరంగా ఒకేవిధంగా ఉంటారని ఇప్పటివరకూ అనుకునేవారు. అందువల్ల వారు రూపంలోనేగాక, ప్రవర్తనలో కూడా ఏకత్వం ప్రదర్శించడం మనకి తెలుసు. కానీ, తాజా పరిశోధనలో అటువంటి ఏక పిండ కవలల్లో కూడా జన్యువుల మార్పు ఏదోమేర ఉంటుందని తేలింది. ఇటువంటి కవలలు ఏర్పడే సమయంలో అధిక శాతం ఒకేవిధమైన జన్యు చిత్రమే కలిగి వున్నా, అభివృద్ధి దశలో వందల కొద్దీ జన్యుమార్పులు సంతరించుకుంటారని అంటున్నారు. కవల పిల్లలిద్దరిలో ఒకరికి మాత్రమే క్యాన్సర్‌ రావడం వెనుక కారణం ఈ జన్యుమార్పులేనని భావిస్తున్నారు. పరిశోధకుల అంచనా ప్రకారం కవలలు సగటున 359 జన్యు భేదాలు కలిగి వుంటారట. కాబట్టి ఇకనుండీ కవలలు 'అచ్చంగా' ఒకేలా ఉంటారని అనుకోకూడదేమో!

Thursday 15 November 2012

పటాసులు మెరుపుల్ని, శబ్దాల్ని ఎలా ఇస్తాయి?

  • ఎందుకని? ఇందుకని!
దీపావళి రోజే ఈ ప్రశ్న పంపుతున్నాను. మతాబులు, తారాజువ్వలు, పటాసులు అలా కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపుల్ని, చెవులు గింగురుమనేలా శబ్దాలను ఎలా ఇస్తాయి?
- ఎ. అర్చన, ఫాతిమా బాలికల పాఠశాల, వరంగల్‌
దీపావళి రోజు, పండుగల రోజు, సంబరాలపుడు, క్రీడల ప్రారంభోత్సవాలు, ముగింపు ఉత్సవాల్లో మతాబులు, తారాజువ్వలు, పటాసులు పేల్చడం ఆనవాయితీ. ప్రపంచవ్యాప్తంగా ఈ సంప్రదాయం వివిధ పద్ధతుల్లో, వివిధ చట్ట పరిధుల్లో, వివిధ మోతాదుల్లో కొనసాగుతోంది. బాంబులు (పరమాణు బాంబులు కాదు సుమా!) కాకర పువ్వొత్తులు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, అగ్గిపుల్లలు, చేంతాళ్లు, మిలియన్లు మొదలైన పేర్లతో పిల్చినా మనం మాత్రం కాల్చే ప్రతిదాన్నీ మొత్తంగా 'మతాబులు' అని ఇకపై పిలుద్దాం. ఈ 'మతాబులు' వివిధ తీరుతెన్నులు, పని పద్ధతులు అన్నీ రసాయనిక ప్రక్రియలే (chemical processes). ప్రధానంగా ఇవి రసాయనిక వియోగ (decomposition) ప్రక్రియలు. క్రియాజనకాలు (reactants) ఘనస్థితి (solid stage) లో ఉండగా, క్రియాజన్యాల (products) లో కొన్నయినా వాయుస్థితిలో ఉంటాయి. అంతఃశక్తితో, ఎంతో వత్తిడితో గాలిలో కంపనాలు రావడం వల్ల చెవులు దద్దరిల్లేలా శబ్దాలు వస్తాయి. కాకరపువ్వులు, చేంతాళ్లు బాహాటం (open) గా ఉండడం వల్ల కేవలం మెరుపుల్ని, వేడిని ఇస్తాయిగాని శబ్దాల్ని ఎక్కువగా ఇవ్వవు. చిచ్చుబుడ్లలో పదార్థాల్ని ఒక క్రమపద్ధతిలో పేర్చడం వల్ల పేలకుండా కేవలం జువ్వల్లాగా ఈతచెట్టు శాఖల్లాగా విస్తరిస్తూ బయటపడేలా ఉత్పన్న పదార్థాలు విడుదలవుతాయి. ఇదే చిచ్చుబుడ్డికి శంఖాకారం (cone shape) బదులు స్తూపాకారం (cylindrical) గా చేసి తలకిందులుగా వెలిగిస్తే అది రాకెట్టు (తారాజువ్వ) లాగా న్యూటన్‌ 3వ గమనసూత్రం ఆధారంగా నింగిలోకి ఎగురుతుంది.
పర్‌ క్లోరేట్లు, నైట్రేట్లు, క్లోరేట్లు, అయొడేట్లు, నైట్రైట్లు, థయోసల్ఫేట్లు, సల్ఫోనేట్లు వంటి లవణ పదార్థాలకు తోడుగా వివిధ లోహాల చూర్ణాల్ని (metal powders), బొగ్గు పొడి (charcoal) ని, గంధకపు పొడి (sulfur powder) ని కలిపి మతాబుల్లో పెట్టి వేడిచేసినపుడు (నిప్పు అంటించడం అంటే ఇదే) క్రియాజనకాలు సుంఖల చర్యలో (chine reaction) పాల్గొని విపరీతమైన వేగంతో క్రియాజన్యాల్ని ఇస్తాయి. క్లోరైడులు, అయోడైడ్‌లు, లోహ ఆక్సైడ్‌లతో పాటు నైట్రోజన్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ వంటి వేడి వాయువుల్ని మెరిసే మధ్యస్థ ఉత్తేజ పదార్థాల్ని (reaction intermediates), కాలీకాలని వేడి క్రియాజనకాల రేణువులన్ని వెదజల్లడం వల్ల శబ్ధంతోపాటు, కాంతులు వస్తాయి. పదార్థాల్లో పొటాషియం ఉంటే ఊదారంగు, కోబాల్టు ఉంటే నీలంరంగు, అల్యూమినియం అంటే తెల్లని రంగు, కాల్షియం ఉంటే ముదురు ఎరుపురంగులు వస్తాయి.
ఎంతో ఖరీదైన అరుదైన లోహపు చూర్ణాల్ని, విషపూరితమైన లవణాలను విపరీతంగా వాడటం వల్ల శబ్ద కాలుష్యంతోపాటు వాయు కాలుష్యం ఈ మతాబులను పేల్చడం వల్ల వస్తుంది. మతాబుల్ని పేల్చడం (fireworks) అనే తంతు చాలామటుకు మతసంబంధ కార్యకలాపాలతో ముడిపడి వుండడం వల్ల మతాబులు చేసే వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని తక్కువ చేసి చూపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. పైగా ఈ తంతుకు ఒక కుహనా శాస్త్రీయ సమర్థన (pseudo scientific explanation) ను అంటగడుతున్నారు. మతాబులు పేల్చడం ద్వారా విడుదలయ్యే విషవాయువులతో దోమలు నశిస్తాయనీ, పంటలకు తెగుళ్లు కలిగించే కీటకాలు నశిస్తాయనీ వీరు సమర్థిస్తారు. అదే నిజమైతే వర్షాకాలం ముందరే ఈ పని చేయాలి. ఎందుకంటే ఎండాకాలంలో వాయు కాలుష్యం తొందరిగా సమసిపోతుంది. వర్షాకాలం అనంతరం వచ్చే దీపావళి, దసరా తదితర పర్వదినాల సందర్భంగా గాలిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు, నేల కూడా చెమ్మగా వుంటుంది. ఈ కాలుష్యపు ఫలితాలు కీటకాలతో పాటు మనుషులకు, సాధారణ జీవవైవిధ్యానికి హాని కలిగిస్తాయి.
ప్రతి సంవత్సరం వందలాది మంది బాలకార్మికుల్ని పొట్టన పెట్టుకుంటున్న మతాబుల వెనుక మతలబులు చాలానే ఉన్నాయి. ఆర్భాటాలకు, అహంభావాల ప్రదర్శనకు, ఆబగా ఆర్థిక పేరాశలకు కొలబద్ధలుగా ఉన్న మతాబుల పరిశ్రమల్ని కొన్ని దేశాలు నిషేధించాయి. పరిమిత స్థాయిలో సంబరాలను చాటుకోవడానికి మతాబుల్ని వాడడంలో కొంత సమర్థన ఉందనుకొన్నా 'అతి సర్వత్ర వర్జయేత్‌!'

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (6)

 Wed, 14 Nov 2012, IST                                అశాస్త్రీయ ఆచారాలు 24

                ''చంద్రమౌళీ! విషయం ఏమిటో చెప్తానన్నావుగా ఏమిటది?'' అడిగాను నేను. ''అసంబద్ధమైన అంశాలున్నాయనో, పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయనో, రుజువుకు అందని అంశాలున్నాయనో వివరించి వాస్తును 'శాస్త్రం' కాదని మీ జన విజ్ఞానవేదిక వాళ్ళు ప్రజలలో వాస్తు పిచ్చిని వదిలించవచ్చు. కానీ వాళ్లల్లో వాస్తుపై నమ్మకం ఎందుకు కల్గింది? ఇంటి స్థలానికి ఈశాన్యం మూల కొంచెం పెరగటానికీ, ఇంటి యజమాని సుఖాలకీ సంబంధం ఉంటుందంటే ఎందుకు నమ్ముతున్నారు? సుఖాలకీ, కష్టాలకీ కారణం తమ చుట్టూ ఉండే ప్రజల ఆలోచనలూ, తమను పాలించే ప్రభువుల విధానాలూ అని ఎందుకు విశ్వసించడం లేదు? ఎందుకంటే వారిలో కొన్ని వందల సంవత్సరాలుగా శాస్త్రీయ ఆలోచనా విధానం నశించింది. జ్ఞానవంతులనబడే వాళ్ళు అలాంటి ఆలోచనా విధానాన్ని నశింపజేశారు. ఈ పరిస్థితినే నూరేళ్ళ నాటి సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఇలా వివరించారు. ఇదిగో ప్రస్తుతం ఆయన ఉపన్యాసాల గ్రంథాన్నే చదువుతున్నాను'' అంటూ తను తెచ్చుకున్న పుస్తకాన్ని తీసి చదవసాగాడు చంద్రమౌళి....
''స్వప్రయోజనపరులైన కొందరు సర్వజనులను మూఢత్వమున ముంచినారు. సత్య విద్యలన్నియు మూలబడినవి. అందుచేత పర్వతములకు, నదులకు బిడ్డలు పుట్టుట వారికి గొప్ప సత్యం. కల్లు సముద్రములు, నేతి సముద్రములు వారి భూగోళశాస్త్రం. సూర్యచంద్రులను 'పెద్దపాము' మింగుట వారి ఖగోళశాస్త్రం. స్వకాయ కష్టము విడిచి, ఇట్టి 'సత్యము'లను బోధించి, జీవించుట వారి కులవృత్తి. ఇట్టి జ్ఞానవంతులు తామే సర్వజ్ఞులమనుకొని, ఉన్న నాలుగు శాస్త్రములను తామే అభ్యసించి, ఇతరులను చదువనీయక పోవుటచేత, వారికి నిజమైన జ్ఞానాన్ని సంపాదించుటకుగానీ, వృద్ధి పొందించుటకుగానీ, జనులలో వ్యాపింప జేయుటకుగానీ అవకాశము లేకపోయినది'' (1894లో రాజమండ్రిలో చేసిన ఉపన్యాసము నుండి).
ఇది చదివి చంద్రమౌళి చెప్పడం కొనసాగించాడు. ''కాబట్టి మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేయవలసినది, ప్రజలకు ఒక్కో అంశంలోని అశాస్త్రీయతను వివరిస్తూనే, వారిలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం. అదీ ముఖ్యంగా చిన్నపిల్లల మనస్సులలో. ఎందుకంటే వారు మొక్కల్లాంటి వారు, భావిభారత పౌరులు. ''మొక్కైవంగుతుందిగానీ మానై వంగుతుందా?'' అనే సామెత నీకు తెలుసుగదా?'' అన్నాడు చంద్రమౌళి.
''నిజమే చంద్రమౌళీ! ఒక్కో మూఢనమ్మకం వెనుక ఉన్న అశాస్త్రీయతను వివరిస్తూనే, ''రుజువుపర్చలేని విషయాలను నమ్మకూడదు; ప్రతి సమస్య వెనుక ఉన్న వాస్తవిక కారణాల్ని గ్రహించాలి'' అనే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. అదే బాధ్యతగల ప్రతి పౌరుడి ముఖ్యకర్తవ్యం. ఈ విషయంలో నీవు చెప్పిన దానిని అంగీకరిస్తూనే ఒక చిన్న సవరణ చేస్తున్నాను'' అన్నాను.
''ఏమిటా సవరణ?'' ఆసక్తిగా అడిగాడు చంద్రమౌళి.
''నీవు మీ జన విజ్ఞాన వేదిక వాళ్లు చేయవలసినది ప్రజలలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం'' అన్నావు. 'మీ' కి బదులు 'మనం' అను. అర్థమైందా? 'నీవు', 'మేము' కలిసి 'మనం' ప్రజలలో శాస్త్రీయ భావాలను పెంపొందిద్దాం. సరేనా?'' అన్నాను నవ్వుతూ.
''చాలా సంతోషంగా అంగీకరిస్తున్నాను'' అన్నాడు చంద్రమౌళి నవ్వుతూ.
''చాలా చాలా సంతోషం'' అన్నాను నేను కూడా నవ్వుతూ.

కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

ప్రజారోగ్యం.. దశ.. దిశ..

Wed, 14 Nov 2012, IST  


                'ప్రజారోగ్యం' వైద్యుల సంఖ్య మీద, అందుబాటులో వుండే నిపుణులు, సిబ్బంది, మందుల మీద మాత్రమే ఆధారపడి వుండదు. తినే పౌష్టికాహారం, మంచినీటి లభ్యత, వ్యక్తిగత, సామూహిక పరిశుభ్రతల మీద, పర్యావరణ నాణ్యత, అందే విద్య మీద ఆధారపడి వుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే 'సామాజిక నిర్ణాయకాల (సోషల్‌ డిటర్మినెంట్స్‌)' మీద ప్రజారోగ్యం ఆధారపడి వుంటుంది. ఇవన్నీ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద ఆధారపడి వున్నాయి. ఆరోగ్యానికి పేదరికం అడ్డొస్తుంది. ఇటువంటి ఆరోగ్యం అందరికీ అందాలంటే ప్రభుత్వ ఆర్థిక జోక్యం తప్పనిసరి. 'ప్రజారోగ్య స్థితిగతుల'పై చర్చ నిమిత్తం రెండవ వార్షిక నివేదికను డిసెంబర్‌, 2011లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 'అందరికీ ఆరోగ్యం' కలిగించేందుకు ప్రభుత్వం ఏంచేయాలో తెలుపుతూ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో వీటి ప్రధానాంశాలను, 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఆరోగ్య రంగంలో ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలను సంక్షిప్తంగా వివరిస్తూ మీముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
సంస్కరణలు ప్రారంభమై నప్పటి నుండీ అంతంతమాత్రం గానే వుంటున్న ప్రజారోగ్యవ్యవస్థ మరింత రోగగ్రస్థంగా మారి పోయింది. వైద్య ప్రయివేటీకరణ విధానాలే దీనికి కారణం. అతి తక్కువ స్థాయిలో ప్రభుత్వ ఖర్చు, నాసిరకం వైద్య సేవలు ప్రజారో గ్యాన్ని దిగజార్చాయి. రోగ నిరోధ కానికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రయివేటు వైద్యం మీద ఆధార పడాల్సిన దుస్థితి పెరిగిపోయింది. వైద్యానికి జేబులోంచి ఖర్చు పెట్టా ల్సినది అనూహ్యంగా పెరిగిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరోగ్య రంగం ప్రజలకు దూరమైంది. ఈ నేపథ్యంలో 2000లో ఏర్పడిన 'జనస్వాస్థ్య అభియాన్‌' (ప్రజారోగ్య ఉద్యమం) చొరవతో అంద రికీ ఆరోగ్యం కేంద్ర బిందువుగా చేసుకుని ఆరోగ్యశాఖ పని చేయాల్సి వచ్చింది. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో 'జాతీయ, గ్రామీణ ఆరోగ్య మిషన్‌' 2005 ఏప్రిల్‌ నుండి పనిచేయడం ప్రారంభించింది. మాటల్లో 'అందరికీ ఆరోగ్యం', 'ప్రజారోగ్యం' అంశాలను పాలకులు ఒప్పుకుంటు న్నప్పటికీ ఆచరణలో ప్రయివేటు సంస్థల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ పేద, మధ్యతరగతులకు వైద్య సౌకర్యాలను దూరం చేస్తున్నారు. మందుల ఖరీదు ఈ కాలంలో బాగా పెరిగిపోయింది. వీటన్నింటి ఫలితంగా అతిసార, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధులు, ఇన్‌ఫ్లుయింజా, మలేరియా, కలరాలాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. క్షయ (టిబి) వంటి వ్యాధులు పునరావృ తమవుతున్నాయి. అయితే, ప్రభుత్వ ప్రమేయంతో పోలియో, ధనుర్వాతం (టెట్‌నెస్‌), పొంగు (మీజిల్స్‌) వంటివి నిర్మూ లింపబడ్డాయి. మారుతున్న జీవనశైలి వల్ల మధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బులు, రక్తపోటు వంటి రోగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇదీ నేటి ఆరోగ్య చిత్రం.
ప్రయివేటు భారాలు..
ఆరోగ్యానికి జాతీయ స్థూల ఉత్పత్తిలో కనీసం ఐదు శాతం ఖర్చు చేయాలని అంతర్జాతీయంగా గుర్తించారు. ప్రణాళికా సంఘం ప్రకారం మనదేశంలో ఈ మేర ఖర్చవుతున్నప్పటికీ దీనిలో 78 శాతం ప్రయివేటుశక్తుల నుండే అందుతుంది. ముఖ్యంగా రోగగ్రస్థులు తమ సొంత జేబు నుండి 71 శాతం ఖర్చుపెడుతున్నారు. కేవలం 20 శాతం కేంద్ర ప్రభుత్వం, రెండు శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఫలితంగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు నిర్వీర్యమైపోయాయి. ప్రాణభీతితో ఆస్తుల్ని తెగనమ్మి లేక అప్పు చేసైనా పేదలు ప్రయివేటు వైద్యంమీద ఆధారపడాల్సి వస్తుంది. పట్టణ పేదల్లో, మధ్య తరగతుల్లో ఇదే స్థితి. ఒకసారి ఏ సభ్యుడైనా జబ్బుపడినప్పుడు ఆ కుటుంబాలు అప్పుల్లోపడి, పేదరికపు స్థాయికి దిగజారిపోతున్నాయి. ఇలా నష్టపోతున్న కుటుంబాలెన్నో.
అనారోగ్యం.. కొరతలతో..
ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన 11వ ప్రణాళిక ఆరోగ్యరంగం కొరతలతో, అనారోగ్యాలతో కునారిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యస్థాయి మరింత దిగజారింది. ఈ రాష్ట్రంలో సంస్కరణలను వేగవంతంగా అమలుచేయడమే దీనికి కారణం. రాష్ట్రంలో మానవుని జీవితకాలం 2002-06 మధ్య 64.4 సంవత్సరాలు కాగా, జాతీయ సగటు 63.5 సంవత్సరాలు. మన పక్కనే వున్న తమిళనాడులో ఇది 66.2 సంవత్సరాలు. వెయ్యి పుట్టుకలకు 2010లో 46 మంది శిశువులు రాష్ట్రంలో చనిపోగా, జాతీయ సగటు 47. తమిళనాడులో 24. వెయ్యి కాన్పులకు 2007-09 కాలంలో మాతృ మరణాలు 134. జాతీయ సగటు 212. తమిళనాడులో 97. మొత్తం జనాభా వార్షిక పెరుగుదల రాష్ట్రంలో 1.8 శాతం కాగా, జాతీయంగా ఇది 2.5 శాతం. తమిళనాడులో 1.7 శాతం. తలసరి ఆరోగ్య ఖర్చు 2008-09లో రాష్ట్రంలో రూ.1061 కాగా, జాతీయ స్థాయిలో ఇది రూ. 1,201. తమిళనాడులో ఇది రూ.1256. అయితే, రాష్ట్రంలో తలసరి ఆదాయం ఈ కాలంలో రూ. 27,362 కాగా, జాతీయంగా ఇది రూ.25,494. ఈ గణాంకాలన్నీ మన రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం తగ్గించిన ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. తమిళనాడు కన్నా ఆరోగ్యానికి కేరళ గరిష్టంగా ప్రాధాన్యత ఇస్తుంది. దీని ఆరోగ్య సూచికలు ఐరోపా సూచికలతో పోటీపడుతున్నాయి.
11వ ప్రణాళికలో...
ఆరోగ్య రంగానికి జాతీయ స్థూల వుత్పత్తిలో 2-3 శాతం కేటాయించాలని ప్రణాళికా లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వ్యయం చేసింది 1.1 శాతం మాత్రమే. కేటాయించిన నిధుల్లో ఖర్చు చేసింది 37 శాతం మాత్రమే. 'అందరికీ ఆరోగ్యం' కల్పించాలనే రాజకీయ సంకల్పం పాలకుల్లో కొరవడడమే దీనికి కారణం. ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరత కూడా తీవ్రంగా వుంది. 2010 ఆరోగ్య సర్వే ప్రకారం అవసరమైన వాటికన్నా 19,590 ఉపకేంద్రాలు, 4.252 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2,115 కేంద్ర ఆరోగ్య ఆసుపత్రులు తక్కువగా వున్నాయి. ఇదేవిధంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో 2,432 వైద్యుల పోస్టులు (11.3 శాతం), 11,361 నిపుణుల పోస్టులు (62.6 శాతం), 13,661 నర్సు పోస్టులు (24.7 శాతం), 7,655 ఫార్మాసిస్టులు (27 శాతం), 14,225 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు (50.4 శాతం) భర్తీ చేయకుండా ఖాళీగా వుంచారు. ఫలితంగా, ప్రజారోగ్య వ్యవస్థ కొరతలతో నిర్వీర్యమవుతుంది. దీరితో వైద్యానికి ప్రజలే ఖర్చు చేయాల్సిన స్థితి ఏర్పడింది. ప్రయివేటు, కార్పొరేట్ల వైద్యంపై ఆధారపడాల్సిన దుస్థితి నేటికీ కొనసాగుతోంది.
12వ ప్రణాళికలో...
అందరూ భరించగల, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో, విశ్వసనీయమైన ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రారంభమైన 'జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌' నిర్దేశించిన లక్ష్యాలను 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా నెరవేరదని ప్రణాళిక ప్రతిపాదనల్ని చూస్తే అర్థమవుతోంది.
నిధుల కేటాయింపు..
ఇది నిర్లక్ష్యం చేయబడుతోంది. వాస్తవిక దృష్టితో జాతీయ స్థూల ఉత్పత్తిలో 2017 (12వ పంచవర్ష ప్రణాళిక) నాటికి 2.5 శాతానికి, 13వ ప్రణాళిక నాటికి 3 శాతానికి పెంచుతూ, క్రమంగా ప్రభుత్వ ఆరోగ్య ఖర్చును 5 శాతం వరకూ పెంచాలని శ్రీనాథరెడ్డి నిపుణుల కమిటీ సూచించినప్పటికీ ఈ లక్ష్యాల్ని చేరే విధంగా ప్రభుత్వ ఆలోచన లు లేవు. పైగా, ప్రభుత్వం కేటాయించిన ఖర్చులో ప్రయివేటు, కార్పొ రేట్‌ వైద్యరంగాలు లాభం పొందేలా పథకాలు రూపొందించబడుతు న్నాయి. ముఖ్యంగా కేటాయించిన నిధులను ప్రభుత్వ వైద్యశాలల ద్వారానే ఖర్చు చేయాల్సిన అవసరం లేదనీ, ఈ నిధులతో ప్రయివేటు వైద్య సేవలను కొని, అందరికీ అందించవచ్చని12వ పంచవర్ష ప్రణా ళిక దిశా నిర్దేశ పత్రం స్పష్టంగా తెలుపుతుంది. ఫలితంగా, నిర్వీర స్థితిలో వున్న ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థ అలాగే కొనసాగుతుంది. రాష్ట్రంలో 'ఆరోగ్యశ్రీ' వైద్య అనుభవాల్నే చూస్తే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో లాభాల్ని పెంచే అనవసరపు శస్త్రచికిత్సలకు ప్రాధాన్యత లభిస్తుందనీ, దైనందిక జీవితంలో ప్రజల రోగాలకు అవసరమైన చికిత్స అందదనీ అర్థమవుతుంది. రాష్ట్రీయ బీమా ఆరోగ్య పథకం కింద ఎంపిక చేసిన రోగాలకే చికిత్సని అందించడంతో అసలు అవసరమైన ఆరోగ్యరక్షణకు, ముఖ్యంగా అంటురోగాలను నివారించే చికిత్స ప్రజలకు అందదు. ఇవే నిధులతో ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరిస్తే జవాబుదారీతనంతో కూడిన వైద్యం అవసరానికి అనుగుణంగా ప్రజలకు అందుతుంది.
నిర్వహణా చికిత్సా (మేనేజ్డ్‌ కేర్‌) విధానం..
దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. దీనికింద ఎంపిక చేసిన ఖరీదైన చికిత్సలకే నిధులు అందుతాయి. అధిక లాభాల్ని ఇచ్చే చికిత్సకే ప్రాధాన్యత లభిస్తుంది. వ్యాధి నివారణ, సాధారణ చికిత్సలు అలక్ష్యం చేయబడతాయి. చికిత్స ఖర్చు బీమా పరిమితిని దాటినపుడు రోగులే ఆ ఖర్చును భరించాలి. ఇది పేదలపై భారం మోపుతుంది.
ఈ పథకం కింద మొదటనే వైద్య సేవలను అందించగల ఆసు పత్రుల నెట్‌వర్క్‌ ప్రభుత్వం వద్ద నమోదై వుంటాయి. వీటిలో తమకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. ఒకసారి ఇలా ఎంచుకున్న తర్వాత ఏ వ్యక్తయినా ఒక సంవత్సరంపాటు ప్రాథమికచికిత్సతో సహా అన్ని రోగాలకు ఈ నెట్‌వర్క్‌ నుండే వైద్యాన్ని పొందుతాడు. ప్రభుత్వ వైద్య శాలలను కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ప్రభుత్వాసుపత్రుల్ని పటిష్టపరచకుండా ఇప్పటి స్థితిలో వీటిని ఎవరూ ఎంచుకోరు. అంటే, ఒక్క దెబ్బతో ఈ పథకం ద్వారా ప్రభుత్వా సుపత్రులు నిర్వీర్యం చేయబడుతున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్‌ వైద్యశాలలు వీటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. ప్రభుత్వాసుపత్రుల్ని నిర్వీర్యం చేసేందుకు ఇదొక కుట్రపూరిత విధానం. ఈ విషయంలో బ్రిటన్‌ లాంటి దేశాల అనుభవాల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎంతో ఖరీదుతో కూడిన అమెరికన్‌ నమూనా వైద్యాన్నే ఆచరిస్తుంది. ఇదంతా పేరాశ కలిగిన కార్పొరేట్‌లకు, ప్రైవేటు వైద్యశాలలకు లాభాల్ని కట్టబెట్టడానికే.
ఈ నెట్‌వర్క్‌ ద్వారా పొందగల సహాయానికి చికిత్స ఖర్చు అధికమైనపుడు పొందేందుకు 'టాప్‌-అప్‌ ప్రీమియం' (అధిక ప్రీమియం) చెల్లించాలి. ఇది తిరిగి ప్రజలపై అధిక భారాలను మోపుతుంది.

మందుల ఖర్చు..
ఆధునిక వైద్యంలో మందుల ఖర్చు చాలా ఎక్కువ. పేటెంట్లు, ఇతర కారణాల వల్ల చికిత్సలో మందుల ఖర్చు రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ఖర్చును తగ్గించడానికి కంపెనీల బ్రాండ్‌ పేర్లతో కాక, మందు అసలు పేరుతో పేటెంట్‌ గడువు తీరినవి 'జనరిక్స్‌' పేరుతో చౌకగా దొరుకుతున్నాయి. ఇప్పటికే ఇవి కొన్ని పెద్ద ప్రభుత్వాసుపత్రుల్లో దొరుకుతున్నాయి. కోరుకుంటున్న వారందరికీ ఇవి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎలాంటి వత్తిళ్లకూ ప్రభుత్వం లొంగకూడదు. జనరిక్‌ మందుల వాడకాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్‌ పేర్లతో కాక, జనరిక్‌ మందుల పేరుతోనే తయారీ లైసెన్సును ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. కానీ, దీనిని ప్రయివేటు మందుల కంపెనీలు, కొందరు రిప్రజెంటేటివ్స్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రజలకు అత్యవసరమైన జనరిక్‌ మందులను ప్రభుత్వమే తయారుచేయించాలి.

డాక్టర్‌ ఎస్‌.సురేష్‌
హెల్త్‌ సబ్‌కమిటీ కన్వీనర్‌,
జనవిజ్ఞాన వేదిక.

రొమ్ము క్యాన్సర్‌ పరిశోధనల్లో నితిన్‌ ముందడుగు..

  Wed, 14 Nov 2012, IST  

               రొమ్ము క్యాన్సర్‌లో జీవకణ ప్రవర్తన నియంత్రణకు సంకేతాలను పంపే ప్రొటీన్‌ (మాంసకృత్తులు) అణు మార్గాన్ని కనుగొన్న 'నితిన్‌ తుమ్మ'కు '2012-ఇంటెల్‌ సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌' పోటీలో ప్రథమ గుర్తింపు లభించింది. ఇందుకుగాను లక్ష డాలర్ల బహుమతిని ఆయన గెలుచుకున్నారు. ఈ పరిశోధనతో క్యాన్సర్‌ నియంత్రణ మరింత పటిష్టంగా, అతికొద్ది నష్టాలతో చికిత్స సాధ్యమని భావిస్తున్నారు. దీనితో క్యాన్సర్‌ కణ విభజనలోని వేగాన్ని, వేగ నిరోధకాన్ని వేర్వేరు అంశాలుగా గుర్తించడం సాధ్యమవుతుందని 'యోగర్‌' అనే నిపుణుడు భావిస్తున్నారు. క్యాన్సర్‌ కణ విభజన నియంత్రణకు ఈ పరిశోధన ఎంతగానో దోహదపడుతుందని ఈయన అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిశోధనల్ని యోగర్‌ స్వయంగా ఎంతో కాలంగా కొనసాగిస్తున్నారు. నితిన్‌ ప్రయోగాలు చాలా ఉన్నతస్థాయికి చెందినవని ఆయన అంచనా వేశారు. ఈ అవార్డు ప్రత్యేకతను అర్థంచేసుకోవాలంటే గతంలో ఈ పోటీలో పాల్గొన్న ఆవిష్కరణలకు రెండు నోబుల్‌, 13 ఇతర ఉన్నత అవార్డులు లభించడమే తార్కాణం. నితిన్‌ పరిశోధనకు సంబంధించిన విశేషాలను వృక్ష రోగనిర్ధాక నిపుణులైన ఆయన తాతయ్య డాక్టర్‌ ఎం.సుగుణాకర్‌ రెడ్డి పై విధంగా వివరించారు. ఇంతకుముందు 2011లో 'సైటోక్రోం' అనే జీవ రసాయనిక నియంత్రణ విధానంపై నితిన్‌ పరిశోధనలు చేశారు. వీటి ద్వారా మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే మందు (మెట్‌ఫార్మిన్‌) కాలేయంలో జరిగే జీవప్రక్రియను అనుసరించి వుంటుందని గుర్తించారు. దీంతో దీర్ఘకాల క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించ డం సాధ్యమని, మెట్‌ఫార్మిన్‌లోని సూక్ష్మ ఆర్‌ఎన్‌ఎ మానవుల్లో కణిత ఏర్పడే జన్యువుల ప్రభావాల్ని నియంత్రిస్తుందని ఆయన గమ నించారు. ఎలుకల కాలేయంలోని జీవకణాలపై లేబరేటరీలో ఈయన చేసిన ప్రయోగాలలో దీన్ని గుర్తించారు. ఇంతకీ నితిన్‌ వయస్సు కేవలం 17 ఏళ్లే. ఈ వయస్సులో ఇంత అమోఘమైన మౌలిక పరిశోధనలు చేయడం అబ్బురపడే విషయం. పెద్దయ్యాక మరెన్నో మౌలిక పరిశోధనలు కొనసాగించడమే తన ఆకాంక్ష అంటున్నాడు నితిన్‌. ఈయన మన సంతతివాడేనంటే మనమంతా ఒకింత గర్వపడాల్సిందే..!

ఇంట్లో ఆరేయడం చేటు..!

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్    Wed, 14 Nov 2012, IST  

                మనకి రోజుకి బండెడు బట్టలు ఉతికి ఆరేయడం బాగా అలవాటు. వర్షాలు పడుతున్నా కూడా మనం బట్టలని ఉతకడం ఆపం. ఉతకడం ఆరోగ్యం కాపాడుకోవడానికే అయినా, తడి బట్టలని ఇంట్లో ఆరేయడం వల్ల ఆరోగ్యానికే చెడు అని తెలిసింది. తడి బట్టలు ఆరేసిన తరువాత గదిలో తేమ పెరిగిపోతుంది. ఆ తేమ అనేక సూక్ష్మక్రిములకు సానుకూలమైన వాతావరణం. తద్వారా మనకి ఆస్తమా వంటి అలర్జీ సంబంధ వ్యాధులు కలిగే ప్రమాదం అధికంగా వుంది. డ్రైయర్‌ని వాడటంగానీ, బాగా బట్టలని పిండి, గాలి తగిలే ప్రదేశంలో ఆరేయడంగానీ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరో పరిశోధనలో మురికిబట్టల్ని ఉంచడంకంటే తడిచిన బట్టలను ఇంట్లో ఆరేయడం వల్లనే ప్రమాదం అధికమని తేలింది.

వ్యాయామంతో గుండెకి రిపేరు..!

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్    Wed, 14 Nov 2012, IST  

                కాస్త అధిక మోతాదు వ్యాయామం చేస్తే గుండెలోని మూల (సెమ్‌) కణాలు ఉద్దీపన చెంది కొత్త హృదయ కండరాల అభివృద్ధికి తోడ్పడతాయని మొదటిసారిగా తెలిసింది. ఇప్పటికే కొన్నిరకాల రసాయనాలను ఇంజెక్ట్‌ చేసి హృదయ మూల కణాలను చైతన్యపరిచే ప్రక్రియలు జరుగుతున్నాయి. కానీ, మామూలు వ్యాయామంతో కూడా అవే ఫలితాలను పొందవచ్చని ఇప్పుడు తెలిసింది. తాజా పరిశోధనల ప్రకారం రోజూ అరగంట పాటు పరిగెట్టడం లేదా సైకిల్‌ తొక్కడం వంటి వ్యాయామాలు చేయడం ద్వారా సుమారు 60 శాతం హృదయ మూలకణాలను పెంపొందించవచ్చట. రెండువారాల వ్యాయామం తరువాత ఏడు శాతం గుండె కండరాలలో అభివృద్ధి కనిపించింది. వ్యాయామం వల్ల అనేక ఉపయోగాలలో ఇది తాజాగా చేరింది.

తగ్గిన ఓజోన్‌ రంధ్రం..!

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్    Wed, 14 Nov 2012, IST  

               ప్రతి సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాలలో దక్షిణ ధృవప్రాంతంలో భూమిని అతినీలలోహిత కిరణాల బారి నుండి రక్షించే ఓజోన్‌ పొర పలచబడుతుంది. ఆ పల్చబడిన భాగాన్ని మనం ఓజోన్‌ రంధ్రంగా పిలుస్తాం. గత సెప్టెంబర్‌లో ఆ రంధ్రం సుమారు 21 చదరపు కిలోమీటర్ల మేర ఏర్పడింది. ఇది 1990 నుండి ఏర్పడిన ఓజోన్‌ రంధ్రాల కన్నా అతి చిన్నదని తెలిసింది. క్లోరోఫ్లోరో కార్బన్‌ వంటి మానవ జనిత పదార్థాలు ఓజోన్‌ పొరను క్షీణింపజేస్తాయి. అతిశీతల వాతావరణం ఈ క్షీణతకు తోడ్పడుతుంది. కానీ, ఈ ఏడాది వాతావరణంలో మార్పులు అంటార్కిటికా ప్రాంతంలో వెచ్చని ఉష్ణోగ్రతలను కలిగించాయి. ఆ కారణంగా ఓజోన్‌ పొర క్షీణత కాస్త తగ్గిందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అనుకున్నపుడు మగ్గే కాయలు..!

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్    Wed, 14 Nov 2012, 

               పచ్చికాయలను తెచ్చి హానికరమైన రసాయనాలను చల్లి కృత్రిమంగా మగ్గబెట్టే (పండించే) పద్ధతి మనకు తెలిసిందే. ప్రస్తుతం మనకు లభ్యమవుతున్న అనేక పండ్లు సహజంగా పండినవి కాదు. ఆ విషయం వాటి రుచిలో తెలిసిపోతుంది. కానీ, తెలియని విషయం మాత్రం అవి కలిగించే హాని. ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో రకంగా కాయలని మగ్గబెట్టే ప్రక్రియ కనుగొన్నారు. ఒకరకమైన ప్రొటీన్‌ని మార్పు చేసి, పండ్లకు రంగునిచ్చే క్రియతో తగ్గించడమో లేక వేగవంతం చేయడమో కూడా చేయవచ్చట. ఈ విషయమై ఇంకా అన్ని వివరాలు తెలియనప్పటికీ, ఈ కొత్త ప్రక్రియ రైతులకు లాభసాటిగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. కాలానికి అనుగుణంగా కాయలను సహజంగానే మగ్గేలా చేయడమూ, లేక మగ్గడాన్ని కొంతకాలం వాయిదా వేయడం ద్వారా రైతులుి లాభాలు గడించవచ్చు. ఈ తాజా ప్రక్రియని త్వరలో పేటెంట్‌ చేస్తారట!

ముగ్గురి స్త్రీల ముద్దుల బిడ్డ..!

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్    Wed, 14 Nov 2012 

                ఒక సంచలన పరిశోధనలో ముగ్గురు వ్యక్తుల నుండి సేకరించిన డీఎన్‌ఏను ఉపయోగించి ఒక అండాన్ని, తద్వారా ఒక పిండాన్నీ విజయవంతంగా సృష్టించగలిగారు. ఒరిగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఇద్దరు స్త్రీల నుండి స్వీకరించిన డీఎన్‌ఏని మరో స్త్రీ అండంలోకి ప్రవేశపెట్టారు. ఆ అండాన్ని కృత్రిమంగా ఫలదీకరణ చేసి, పిండాన్ని సృష్టించగలిగారు. కొన్నిరకాల జన్యు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం వున్న సందర్భాలలో ఇటువంటి ప్రక్రియ ఉపయోగపడుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కానీ, ఇటువంటి పరిశోధనలు అనేక ఇతర సమస్యలను కలిగిస్తాయని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇంతకుముందు కూడా ఈ అంశం వాదోపవాదాలకి తెర లేపింది.

Wednesday 7 November 2012

వేడివి తింటే గొంతు దాటితే కాలవా?


  • ఎందుకని? - ఇందుకని!
వేడి పదార్థాలు నాలుకమీద పడితే నాలుక కాలుతున్నట్లు అనిపిస్తుంది. కానీ గొంతు దాటితే మళ్లీ ఏమీ అనిపించదు. కారణం ఏమిటి? - ఎ.చక్రవర్తి, ఏలూరు
ఓ మోస్తరు వేడిగా వున్న వస్తువుల విషయంలోనే మీరన్న తేడా కనిపిస్తుంది. కానీ బాగా వేడిగా ఆవిర్లు కమ్మే విధంగా ఉన్న ఆహారపదార్థాల్ని తిన్నప్పుడు నాలుక మీద పడితే విపరీతంగా కాలినట్లు అనిపించడం వల్ల వెంటనే ఊసేస్తాము. కానీ పొరపాటున ఊసేయకుండా మింగేస్తే గొంతు, ఆహారవాహిక (esophagus) దగ్గర కూడా ఆ వేడిగా ఉన్న భావన చల్లారదు.
ఓ మోస్తరు వేడిగా ఉన్న వస్తువును నోట్లో వేసుకున్నపుడు ఆ వేడికి నాలుకమీదున్న రుచి గుళికలు (taste buds) స్పర్శనాడులు (touch nerves) ప్రేరేపణకు గురవుతాయి. వెంటనే అవి మెదడుకు సంకేతాలు పంపడం వల్ల 'నోరు మండేలా వేడి ఉన్న' భావనను మెదడు నుండి పొందుతాము. మెదడులోని ఫలితాలే మన భావాలన్న విషయం మరవొద్దు. ఇలా వేడిగా ఉన్న వస్తువును అలాగే ఉంచుకోకుండా నోటిలో అటూయిటూ నాలుకతో నోటిలోనే కదిలిస్తాము. ఈ సందర్భంగా వేడి పదార్థాల్లో ఉన్న అధిక ఉష్ణం 'ఉష్ణగతిక శాస్త్ర శూన్య నియమం (zeroeth Law of Thermodynamics) ప్రకారం నోటిలోకి శోషించబడుతుంది. అంటే ఎంతో కొంతమేరకు నోటిలోని లాలాజలం (saliva), అంగిటి (palate), నాలుక, దవడలు, పళ్లు ఆ వేడిపదార్థాలలోని వేడిని గ్రహించి ఆ పదార్థాల వేడిని తగ్గించుతాయి. అటుపిమ్మట గొంతులోకి వెళ్లినపుడు ఆ పదార్థాలు అంత వేడిగా అనిపించవు. అంతేకాకుండా గొంతులోకి వెళ్లాక ఆహారపదార్థాలు అక్కడే కాసేపు నిలకడగా ఉండవు. వెనువెంటనే పెరిస్టాలిక్‌ కదలికల ద్వారా జఠరకోశం లేదా పొట్ట (stomach) లోకి చేరతాయి. కాబట్టి కొంతలో కొంత వేడిగానే ఉన్నా ఆ భావనను గ్రహించేంత సంధాన సమయం (interactive time) ఆహారవాహిక గోడల్లోని నాడులకు ఉండదు. పైగా నోటిలోను, చర్మం మీద ఉన్నంత అధికస్థాయిలో, సంఖ్యలో స్పర్శానాడులు ఆహారవాహికలో ఉండవు.
భూమి భ్రమణ, పరిభ్రమణాలు సాగిస్తుంది. విమానం భూమిని వదిలి పైకి ఎగిరినప్పుడు భూభ్రమణ, పరిభ్రమణాలు ఉంటాయి కదా? విమానయానం ఎలా సాగుతుంది?
కారులో కూర్చుంటేనే కారుతో పాటు మనం వెళ్తున్నట్లు, బర్రె మీద కూచున్న కాకి బర్రెతోపాటు వెళ్తున్నట్లు, బస్సుకు బయట మనముంటే బస్సే వెళ్తుందిగానీ మనం ఉన్నచోటే ఉంటాం కదా! అన్నట్లు అనుకున్నప్పుడే మీకొచ్చిన సందేహం ఓ ప్రశ్నలాగా మిగిలిపోతుంది. కేవలం ఓ వాహనంతో భౌతికస్పర్శ ఉంటేనే మనం వాహనంతోపాటు కదుల్తున్నట్టు భావించడం వాహనాల విషయంలో సబబేగానీ గాలిలో ఎగురుతున్న విమానం నేలవిడిచి సాము చేస్తున్నట్టు స్వతంత్రమైన వస్తువుగా భావించకూడదు. భౌతికంగా ఘనరూప నేలతో స్పర్శ లేకున్నా విమానం భూమి వాతావరణంతో స్పర్శలో ఉన్నట్టే. భూమ్మీద ఉన్న సముద్రాలలో ఉన్న ద్రవరూప నీటిమీద పడవ వెళ్తున్నప్పుడు భూమి భ్రమణ, పరిభ్రమణాలకూ సముద్రంలో నీటిమీద నావ ప్రయాణానికీ ఇదేవిధమైన సందేహం మీకు రాలేదు చూశారా. కేవలం కనిపించే వస్తువులతో వున్న పాదార్థిక బంధాన్నే మీరు పరిగణనలోకి తీసుకున్నారు. కనిపించని గాలి కూడా నేలలాగే, సముద్రపు నీరులాగే భూమికి సంబంధించిన పదార్థమని మరువకండి. గాలిని విడిచి విమానం సాము చేయలేదు. శూన్యం(vacuum) లో కేవలం రాకెట్లు వెళ్తాయిగానీ విమానాలు వెళ్లలేవు. విమానం కన్నా ముందు ఓ ఉదాహరణను తీసుకుందాం. మీరు సమవేగం (uniform velocity) తో వేగంగా వెళ్లే ఓ రైలు బోగీలో పై బెర్తుమీద ఉన్నారనుకుందాం. అపుడు ఉన్నట్టుండి మీ సెల్‌ఫోను జారిపడిందనుకుందాం. అపుడది కాసేపు గాల్లో ఉంది. రైలు మాత్రం ముందుకెళ్తూనే ఉంది. అంతమాత్రాన అది పక్కబోగీలో ఉన్న కింది బెర్తుమీద పడదు. మీ బోగీలోనే ఉన్న కింది బెర్తుమీద పడుతుంది. పొడవాటి తాటిచెట్టు మీద నుంచి ఉన్నఫళాన ఓ తాటికాయ ఊడిపడ్తుందనుకుందాం. కాసేపు అది భూమికి, చెట్టుకు సంబంధం లేకుండా గాల్లో ఉంది. ఈలోగా భూమి కొంత భ్రమణం, పరిభ్రమణం చేసింది. అంతమాత్రాన అది పక్కపొలంలో ఉన్న మామిడి చెట్టు కింద పడుకున్న మూలిగే నక్కపై పడదు. ఆ తాటిచెట్టు కిందే పడుతుంది. ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ భూమి కదలికతో పాటే ఉంటుంది. హెలికాప్టరు పైకి ఎగిరితే భూమ్యాకర్షణను అధిగమించడానికి మాత్రమే అది శక్తిని వినియోగించాలిగానీ అలాగే ఉంటే మరో ఊర్లోకి పోదు. భూమి ఆకర్షణ విమానం మీద, హెలికాప్టరు మీద, మీ సెల్లు ఫోనుమీద, తాటిపండు మీద లంబంగా పనిచేయడం వల్ల అవి గాల్లో ఉన్నా భూమితోపాటు అవీ కదుల్తూ ఉంటాయి. అలాకాకుండా విమానం మరోచోటికి వెళ్లాలంటే అదనపు శక్తిని వాడాలి.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (5)


  • అశాస్త్రీయ ఆచారాలు 22
మధ్యలో మెరకగా ఉండి అన్ని దిక్కుల అంచుల్లో పల్లంగా ఉన్న భూమిని 'కూర్మపృష్ట భూమి'' అని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాంటి భూమిలో ఇల్లు కట్టుకుంటే వచ్చే ఫలితాన్ని రెండు గ్రంథాలు రెండు రకాలుగా పేర్కొంటున్నాయి.
శ్లో|| కూర్మపృష్టే భవేద్వాసో నిత్సోత్సాహ సుఖప్రదః
ధనధాన్యం భవేత్తస్య నిశ్చితం విపులం ధనం || అని జ్యోతిర్నిబంధనం'' పేర్కొంటోంది. అంటే ''కూర్మపృష్ట భూమిలో నివాసము ఉత్సాహాన్నీ, సుఖాన్నీ, ధనధాన్య సంపదనూ కలిగిస్తుంది'' అని అర్థం.
అయితే కూర్మపృష్ట నివాసాన్ని గూర్చి ''మయమతం'' ఇలా పేర్కొంటోంది.
శ్లో|| మధ్యోచ్చం వర్జయేద్వాసః పీడాచవధ బంధనే ||
అంటే, మధ్యభాగమున మెరకగా ఉండే భూమిలో అంటే కూర్మపృష్ట భూమిలో నివాసము విడువదగినది. అటువంటిచోట నివాసము పీడను, మరణాన్ని, బంధనాన్ని కలిగిస్తుంది'' అని అర్థం.
అలాగే స్థలంలో ఏ దిశలో మెరక లేక పల్లం ఉంటే ఏ ఫలితం వస్తుంది? దీనిని గూర్చి రెండు ప్రాచీన గ్రంథాలు రెండురకాలుగా పేర్కొంటున్నాయి.
''వాస్తు విద్య'' ప్రకారం తూర్పు మెరక, పడమర పల్లం ఉంటే శుభప్రదమట. కానీ ''శిల్పరత్నం''లో అలాంటి స్థలంలో నివసిస్తే పుత్రులు చనిపోతారని చెప్పబడింది. అలాగే, పశ్చిమం మెరక, ఆగేయం పల్లం ఉంటే విరోధాలు వస్తాయని ''వాస్తు విద్య'' చెబుతుంటే, ''శిల్పరత్నం'' పుత్ర లాభం కలుగుతుందని పేర్కొంటోంది.
మరొక్క విషయం - వర్షపు నీరు, ఇంటిలోని వాడుక నీరు గృహావరణపు వాయువ్య దిశ నుండి బైటికి వస్తే సుఖములు కల్గుతాయని ''వాస్తుసార సంగ్రహం'' పేర్కొంటుంటే, ఇంటి కన్యలకు హానియని ''కాలామృతం'' తెలియజేస్తుంది.
ఇక నవీన వాస్తువాదులలో మేల్పాడి రాఘవా చారి తన ''వాస్తు రాఘవీయం''లో ఇలా పేర్కొంటు న్నారు. ''తండ్రి కుమారునకు ఇవ్వలేని సంపదను, భార్యభర్తకు ఇవ్వలేని సుఖాన్ని, ప్రభుత్వం ప్రజలకు ఇవ్వలేని రక్షణను, మిత్రుడు మిత్రునకు చేయలేని సాయాన్ని వాస్తుశాస్త్రము ఒక గృహస్తునికి చేస్తుంది.''
అయితే ''వాస్తుశాస్త్ర వివేకము'' అనే గ్రంథంలో మధురా కృష్ణమూర్తి శాస్త్రి మరోవిధంగా చెబుతు న్నారు. ''ఇంట్లో ఏదో మార్పు చేసినంత మాత్రాన ధన, కనక, వస్తు, వాహన, పుత్ర, మిత్ర, కళత్రాదులందరూ సుఖముగా ఉంటారనే ప్రచారం నూటికి నూరుపాళ్ళు అపప్రచారం''.
ఇక ఒకే గ్రంథంలో పేర్కొనబడిన పరస్పర విరుద్ధ విషయాన్ని వివరిస్తాను విను.
''వాస్తు రాజవల్లభం''లో ఒకచోట
''శస్తే చంపక పాటలేచకదళీ జాతీతధాకేతకీ''
అని ఉంది. అంటే ''సంపెంగ, కలిగొట్టు, అరటి, జాజి, మొగలి వృక్షములున్న యెడల శ్రేయము'' అని అర్థం. అదే గ్రంథంలో మరోచోట
''దుష్టోభూత సమాశ్రితా పివిటపే
నోచ్చిత్యతే శక్తితః
తద్వద్బిల్వ శమీత్వశోక వకుళౌ పున్నాగసశ్చంపకౌ...''
అని ఉంది. అంటే ''మారేడు, జమ్మి, అశోక, పొగడ, సురపొన్న, సంపెంగ మొదలైన చెట్లు స్థలములో ఉన్న యెడల వాటిని పూర్తిగా వేళ్ళతో కూడ తీసివేయవలెను'' అని అర్థం.
ఇలా వాస్తువాదులు అనేకులు అనేకరకాలుగా చెప్పే అంశాలను, ఒకే వాస్తువాది రెండురకాలుగా చెప్పే అంశాలను కలిగిన విషయాన్ని 'శాస్త్రం' అని అంటామా? చెప్పు చంద్రమౌళీ?'' అని ప్రశ్నించాను.
''శాస్త్రం అనలేము కాంతారావు!'' అన్నాడు చంద్రమౌళి.
వాస్తు, శాస్త్రం కాదనేందుకు మరో ముఖ్యమైన రుజువు ఇస్తాను. విను.
''శ్లో|| పక్షేణ మాసేన ఋతుత్రయేణ సంవత్సరేణాపి ఫలం
విధత్తే ||''
అని విశ్వకర్మ ప్రకాశిక పేర్కొంటోంది. అంటే.. ''వాస్తు ఫలితము పదిహేనురోజులలోగాని, ఒక నెలలోగాని, ఆరునెలల్లోగాని, సంవత్సరంలోగాని సంభవిస్తుంది'' అని అర్థం. అలా ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని చెప్పడాన్ని శాస్త్రం అంటామా? ఉదాహరణకు ''నీరు వంద డిగ్రీల దగ్గర పూర్తిగా ఆవిరిగా మారుతుంది'' అని సైన్సు వివరిస్తోంది. అంతేకాని పది డిగ్రీల దగ్గరో, 20 డిగ్రీల దగ్గరో, 90 డిగ్రీల దగ్గరో నీరు ఆవిరవుతుందని ఎవరైనా అంటే శాస్త్ర ప్రపంచం దాన్ని సైన్సుగా అంగీకరిస్తుందా?''
''అంగీకరించదు.''
''మరి ఎప్పుడో ఒకప్పుడు ఫలితం లభిస్తుందని వాస్తువాదులు చెబితే, దాన్ని శాస్త్రం అని అంగీకరిద్దామా?''
''అంగీకరించం కాంతారావ్‌! అయితే నీవు చెప్పి నవన్నీ విన్న తర్వాత నాకొక విషయం తోస్తోంది'' అన్నాడు చంద్రమౌళి.
(ఆ వివరాలు
వచ్చేవారం)
''ఏమిటది?'' అడిగాను నేను.
''అసంబద్ధమైన అంశాలున్నాయనో, పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయనో, రుజువుకు అందని అంశాలున్నాయనో వివరించి వాస్తును శాస్త్రం కాదని మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ప్రజలలో వాస్తు పిచ్చిని వదిలించవచ్చు. కానీ వాళ్లల్లో వాస్తుపై నమ్మకం ఎందుకు కల్గింది? ఇంటి స్థలానికి ఈశాన్య మూల కొంచెం పెరగటానికీ, ఇంటి యజమాని సుఖాలకీ సంబంధం ఉంటుందంటే ఎందుకు నమ్ముతున్నారు? సుఖాలకీ, కష్టాలకీ కారణం తమ చుట్టూ ఉండే ప్రజల ఆలోచనలూ, తమను పాలించే ప్రభువుల విధానాలూ అని ఎందుకు విశ్వసించడం లేదు? ఎందుకంటే వారిలో కొన్ని వందల సంవత్సరాలుగా శాస్త్రీయ ఆలోచనా విధానం నశించింది. జ్ఞానవంతులనబడే వాళ్ళు అలాంటి ఆలోచనా విధానాన్ని నశింపజేశారు. ఈ పరిస్థితినే నూరేళ్ళ నాటి సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారు ఇలా వివరించారు. ఇదిగో ప్రస్తుతం ఆయన ఉపన్యాసాల గ్రంథాన్నే చదువుతున్నాను'' అంటూ తను తెచ్చుకున్న పుస్తకాన్ని తీసి చదవసాగాడు చంద్రమౌళి....
''స్వప్రయోజనపరులైన కొందరు సర్వజనులను మూఢత్వమున ముంచినారు. సత్య విద్యలన్నియు మూలబడినవి. అందుచేత పర్వతములకు, నదులకు బిడ్డలు పుట్టుట వారికి గొప్ప సత్యం. కల్లు సముద్రములు, నేతి సముద్రములు వారి భూగోళశాస్త్రం. సూర్యచంద్రులను 'పెద్దపాము' మింగుట వారి ఖగోళశాస్త్రం. స్వకాయ కష్టము విడిచి, ఇట్టి 'సత్యము'లను బోధించి, జీవించుట వారి కులవృత్తి. ఇట్టి జ్ఞానవంతులు తామే సర్వజ్ఞులమనుకొని, ఉన్న నాలుగు శాస్త్రములను తామే అభ్యసించి, ఇతరులను చదువనీయకపోవుట చేత, వారికి నిజమైన జ్ఞానాన్ని సంపాదించుటకుగానీ, వృద్ధి పొందించుటకుగానీ, జనులలో వ్యాపింపజేయుటకుగానీ అవకాశము లేకపోయినది'' (1894లో రాజమండ్రిలో చేసిన ఉపన్యాసము నుండి). ఇది చదివి చంద్రమౌళి చెప్పడం కొనసాగించాడు. ''కాబట్టి మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేయవలసినది, ప్రజలకు ఒక్కో అంశంలోని అశాస్త్రీయతను వివరిస్తూనే, వారిలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం. అదీ ముఖ్యంగా చిన్నపిల్లల మనస్సులలో. ఎందుకంటే వారు మొక్కలలాంటివారు, భావిభారత పౌరులు. ''మొక్కైవంగుతుందిగాని మానై వంగుతుందా?'' అనే సామెత నీకు తెలుసుగదా?'' అన్నాడు చంద్రమౌళి.
''నిజమే చంద్రమౌళీ! ఒక్కో మూఢనమ్మకం వెనుక ఉన్న అశాస్త్రీయతను వివరిస్తూనే, ''రుజువుపర్చలేని విషయాలను నమ్మకూడదు; ప్రతి సమస్య వెనుక ఉన్న వాస్తవిక కారణాల్ని గ్రహించాలి'' అనే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. అదే బాధ్యతగల ప్రతి పౌరుడి ముఖ్యకర్తవ్యం. ఈ విషయంలో నీవు చెప్పిన దానిని అంగీకరిస్తూనే ఒక చిన్న సవరణ చేస్తున్నాను'' అన్నాను.
''ఏమిటా సవరణ?'' ఆసక్తిగా అడిగాడు చంద్రమౌళి.
''నీవు మీ జన విజ్ఞానవేదిక వాళ్లు చేయవలసినది ప్రజలలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం'' అన్నావు. 'మీ' కి బదులు 'మనం' అను. అర్థమైందా? 'నీవు', 'మేము' కలిసి 'మనం' ప్రజలలో శాస్త్రీయ భావాలను పెంపొందిద్దాం. సరేనా?'' అన్నాను నవ్వుతూ.
''చాలా సంతోషంగా అంగీకరిస్తున్నాను'' అన్నాడు చంద్రమౌళి నవ్వుతూ.
''చాలా చాలా సంతోషం'' అన్నాను నేను కూడా నవ్వుతూ.
- కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక

పచ్చి 'శాకాలు' మనకి కావు..!

పచ్చి ఆకుకూరలూ, కూరగాయలూ తింటే బోలెడు ఆరోగ్యం అని చాలా మంది అంటుంటారు. ఇంకొందరు ఇంకాస్త ముందుకెళ్ళి అసలు పచ్చిపాలు, పచ్చి గింజలూ తినమని సలహా ఇస్తుంటారు. పైగా, ఇలా చేస్తే మన జీర్ణవ్యవస్థతో పాటు మన మెదడుకు కూడా మేలు జరుగుతుందని చెబుతారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. మనిషి పచ్చి ఆహారం తింటే రోజుకు తొమ్మిది గంటలు ఆహారం తింటూనే ఉండాలట. ఎందుకంటే అంతసేపు తింటేగానీ మన శరీరానికి అవసరమైన పోషకాలు అందవట. మనకి ముందుగా వచ్చిన మహా వాన రాలు- గొరిల్లాలు, చింపాంజీలూ ఎక్కువగా పచ్చి ఆహారంపైనే ఆధారపడతాయి. వాటి తరువాత వచ్చిన మన పూర్వీకులు వాటికంటే మూడింతలు ఎక్కువ మెదడులో నాడులు కలిగి వుండేవాళ్ళు. అందుకు కారణం వాళ్ళు ఆహారాన్ని ఉడకబెట్టడం (నిప్పుల మీద) నేర్చుకున్నారు. ఈ విషయాలు ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ప్రచురితమయ్యాయి. వట్టి పచ్చి కూరలే తింటే మెదడు పెరుగుదలకు తోడ్పడేంత కాలరీలు అందవని, పెరిగిన మెదడుకు ఉడికించిన ఆహారమే కారణమని ఈ పరిశోధకులు గమనించారు.

వర్ణం మారే స్వర్ణం..!


బంగారానికి దాని రంగు బట్టే విలువ అనుకునే రోజులు పోనున్నాయి. అందరూ 'చౌక లోహాల'కి రంగు కోసం బంగారంతో తాపడం చేయిస్తుంటే, సౌతాంప్టన్‌ యూనివర్శిటీలో బంగారానికే వేరే రంగు తాపడం వేయించే ప్రక్రియ కను గొన్నారు. బంగారపు ఉపరితలంపై చిన్న చిన్న బొడిపలను ఏర్పాటు చేయడం ద్వారా అది కాంతిని పరా వర్తనం చేసే విధానం మారి కొత్తరంగులో కనిపిస్తుందని అక్కడి పరిశోధకులు నిరూపించారు. కేవలం బంగారినికేకాక, వెండి, అల్యూమినియం వంటి ఇతర లోహాలకు కూడా ఈ ప్రక్రియ వర్తింపచేయవచ్చట. అప్పుడు రసాయనాల పూతలు అవసరం లేకుండా, లోహం విలువ తగ్గకుండా రంగు మార్చుకోవచ్చు.

ఎరుపే కాదు.. చెరుపు కూడా!


తాంబూలం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని ఒక నమ్మకం. పైగా మనం కొన్ని వందల రకాల పాన్‌ (కిళ్లీ) లను నమిలి పారేస్తాం. ఇప్పుడు జీర్ణశక్తి సంగతేమోగానీ, పాన్‌ వల్ల ఏకంగా నోటి కాన్సర్‌ వచ్చే ప్రమా దం మెండుగా ఉందని భావిస్తు న్నారు. పాన్‌లో పచ్చి వక్కలు, ఇతర సుగంధద్రవ్యాలు విరివిగా వాడతాం. అటువంటి వక్కలోనే మన జన్యు పదార్థాన్ని మార్చేసే గుణం ఉందని తెలిసింది. తద్వారా, క్యాన్సర్‌ రావచ్చు. వక్క పలుకలు మన డిఎన్‌ఎను ఆల్కలైట్‌ చేయడం ద్వారా ప్రమాదం కలిగిస్తాయని ఒక రసాయన పరిశోధకపత్రంలో ప్రచురించారు. ఆసియాలో ముఖ్యంగా చైనా, భారత్‌, పాకిస్తాన్‌లలో పాన్‌ తినే అలవాటు ఎక్కువ. అందువల్ల, వారు నోటి క్యాన్సర్‌ కలిగించే ఈ పాన్‌ని మితంగా వాడితే మంచిది.

నడకే పరమౌషధం..!

నడిచి వెళ్ళే దూరాలకి కూడా కార్లు, బైకులు వాడటం భారతీయులకు బాగా అలవాటు అని ఒక అధ్యయనంలో తేలింది. పదమూడు దేశాల ప్రజల్లో జరిపిన ఈ అధ్యయనంలో మనవాళ్లు కాస్త దూరాలకి కూడా వాహనాలు వాడుతున్నారని తేలింది. మనదేశంలోనే కాదుగానీ ప్రపంచ వ్యాప్తంగా మనుషుల్లో నడక అలవాటు తగ్గింది. చైనాలో నడక తగ్గడం వలన ఊబకాయం పెరిగిందని పరిశోధకులు గమనించారు. రోజూ కేవలం 15 నిమిషాలపాటు నడిస్తే రెండు, మూడేళ్ళ ఆయుష్షు పెరుగుతుందని అంచనా వేశారు. ఆయుష్షు పెరిగినా పెరగకపోయినా, ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం కదా! అందుకని, ఎలాగోలా కనీసం ఓ పావుగంట పాటన్నా చురుగ్గా నడిస్తే జీవితం చలాకీగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నడిస్తే, ఊబకాయం రాకుండా ఉండటమే కాదు. ఇబ్బంది పెట్టే షుగర్‌ వంటి సమస్యలు కూడా దరికి రావంటున్నారు.

చేపల.. రొయ్యల పెంపకం.. ప్రయోజనాలు.. ప్రతిబంధకాలు



చేపలు, రొయ్యల పెంపకం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ముఖ్యమైంది. దీని వార్షిక సగటు అభివృద్ధి 10 శాతం పైగా వుంది. 1950-51లో కేవలం 7.5 లక్షల టన్నులుగా వున్న చేపల ఉత్పత్తి 2010-11 నాటికి 85 లక్షల టన్నులకు పైగా పెరిగింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో 5.7%, ఎగుమతుల్లో 5.3% ఈ రంగం నుండే సమకూరుతున్నాయి. వ్యవసాయోత్పత్తుల్లో వీటి విలువ 18 శాతం. జాతీయ వినియోగం వేగంగా పెరుగుతుంది. ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్‌ఎఓ), ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ఈ శతాబ్ధంలో చేపల, రొయ్యల కొరత పెరుగుతుంది. చేపల పెంపకాన్ని వరిసేద్య సమన్వయంతో చేపట్టే పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ఫలితాలు అనుకున్నట్లుగా అందుబాటులోకి తేగలిగితే మన ఆహారంలో చేపల వినియోగం ఎంతో మారిపోతుంది. అందువల్ల, ఈ రంగం పెరుగుదలకు మరెన్నో అవకాశాలు వున్నాయి. ఈ నెల 5-7 మధ్య విశాఖపట్టణంలో జరిగిన జాతీయ మత్స్యకారుల మహాసభల నేపథ్యంలో చేపల, రొయ్యల పెంపకంలో ఇమిడి వున్న కీలకాంశాలను మీ ముందుకు తెస్తుంది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.

చేపల, రొయ్యల పెంపకం విస్తరించడానికి మన దేశంలో ఎన్నో అవకాశాలు వున్నాయి. తీర ప్రాంతం 8,129 కి.మీ. పొడవునా వుంది. ఆక్వా కల్చర్‌కు నదుల సముద్ర సంగమ ప్రాంతం (ఎచ్యూరీస్‌) 39 లక్షల హెక్టార్లు, ఉప్పు భూములు 25.4 లక్షల హెక్టార్లు, మడ అడవులు ఐదు లక్షల హెక్టార్లు అనుకూలం. ఇదేకాక భూభాగం లో మరో 80 లక్షల హెక్టార్ల మేర ఆక్వా కల్చర్‌కు అనుకూలమైన ఉప్పు భూములు న్నాయి. వీటిలో జీవవైవిధ్యం ఎక్కువగా వుంది. ఇంత విస్తారంగా సముద్ర తీరప్రాం తం వున్నప్పటికీ మొత్తం చేపల ఉత్పత్తిలో సముద్ర చేపల వేట నుండి లభించేది 41% మాత్రమే. మిగతా చేపలు, రొయ్యలు కృత్రిమంగా పెంచబడుతున్నాయి.
మన దేశంలో చేపల్ని ఆహారంగా తీసుకునేవారు 56% మాత్రమే. వీరి తలసరి వార్షిక వినియోగం తొమ్మిది కిలోలు. ప్రపంచ జనాభా వార్షిక తలసరి వినియోగం 12 కిలోలు. దేశ జనాభా తలసరి ఆదాయం పెరుగుతున్న కొద్దీ అంతర్గతంగా చేపల గిరాకీ కూడా క్రమంగా పెరుగుతుంది. అందువల్ల వ్యవసాయోత్పత్తిలో చేపల రంగం ప్రాధాన్యత క్రమంగా పెరుగుతుంది.
గరిష్ట చేపల వేట..
సాంప్రదాయ పద్ధతిలో మత్స్యకారులు సముద్రంలో వేటాడిన కొద్దీ దొరికే చేపలు పెరిగేవి. ఈ దశలో సముద్రంలో వేటాడే చేపల కన్నా చేపల పునరుత్పత్తి చెందే సంఖ్య అధికంగా వుండేది. దీనివల్ల మత్స్యకార్మికులు చేపల సేకరణలో ఎప్పుడూ అసంతృప్తి చెందలేదు. ఈ చేపల సేకరణను పెంచేందుకు యాంత్రిక బోట్లను ప్రవేశపెట్టడంతో ప్రారంభంలో వీటి సేకరణ పెరిగింది. కానీ ఈ బోట్ల సంఖ్య బాగా పెరగడంతో చేపల పునరుత్పత్తిశక్తి సేకరణశక్తి కన్నా తక్కువస్థాయిలో ఉండటంవల్ల చేపల సేకరణ తగ్గింది. దీంతో సముద్ర చేపల ఉత్పత్తి అస్థిరంగా మారింది. ఇది భవిష్యత్తుకు ఒక ప్రమాద ఘంటిక.
సముద్ర చేపల పునరుత్పత్తి పెరుగుదలను సముద్రనీటి ప్రవాహం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ పొరలు, జీవావరణం, పర్యావరణాల తుల్యత ప్రభావితం చేస్తున్నాయి. అత్యంత సమర్ధవంతమైన సాంకేతికాలతో మానవుడు జోక్యం చేసుకోవడంతో (యాం త్రిక బోట్లు, ఇతర సాంకేతికాలు) చేపల సేకరణ సుస్థిర స్థాయికన్నా బాగా పడిపో యింది. కానీ, చేపల, ఇతర సముద్ర ఉత్పత్తులకు డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. ఇదే సమయంలో సముద్ర కాలుష్యం చేపల పునరుత్పత్తిని దెబ్బతీస్తుంది. దీనికి ప్రధా నంగా పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్య విషపదార్థాలు, మలమూత్రాల విడుదల కారకా లుగా వున్నాయి. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సముద్రంలో జీవవైవి ధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ లోటును పూడ్చుకొని, పెరుగుతున్న గిరాకీని తీర్చడానికి చేపల, రొయ్యల పెంపకానికి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పెంపుకు మన దేశంలో విస్తారమైన అవకాశాలున్నాయి. దీనికోసం మామూలుగా సేద్యానికి పనికిరాని భూముల్నే వినియోగిస్తున్నాం. చేపల పెంపకానికి అనువైన భూముల్లో కేవలం 15% వరకూ మాత్రమే ఇప్పుడు ఆక్వా కల్చర్‌కు ఉపయోగిస్తున్నాం. అంటే, ఆక్వా కల్చర్‌ను ఇంకా విస్తరించడానికి మంచి అవకాశాలున్నాయి.
పెరుగుతున్న అవసరాలు..
ఇప్పటికన్నా (2010-11) రొయ్యల తలసరి వినియోగం 2020 నాటికి 0.3 కిలోలు, అధిక విలువగల చేపల తలసరి వినియోగం 1.2 కిలోల మేర పెరుగుతుం దని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి ఇవి వరుసగా 0.5 నుండి 0.6 కిలోల వరకూ 1.5 కిలోల స్థాయికి పెరగవచ్చంటున్నారు. చేపల వినియోగం సంవత్సరం పొడుగుతూ ఒకే స్థాయిలో వుంటుంది. కానీ, లభ్యత ఒకే విధంగా వుండదు. హెచ్చు తగ్గులలో వుంటుంది. ముఖ్యంగా, సముద్రంలో వేట నిషేధకాలంలో చేపల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా అత్యల్ప ఉష్ణోగ్రత వల్ల చేపల ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల ఉత్పత్తి, డిమాండ్‌ మధ్య తేడా ల్ని తట్టుకోడానికి బఫర్‌ నిల్వలు, వీటికి అవసరమైన కోల్డ్‌ స్టోరేజి గోడౌన్లు అవసరం.
ఆటంకాలు..
రొయ్యల ఉత్పత్తి పరిమాణంలో తక్కువగా వున్నప్పుటికీ ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఎగుమతుల్లో వీటి పరిమాణం కేవలం 20 శాతమే అయినప్పటికీ వీటివల్ల వచ్చే ఆదాయం 40 శాతం. దీనికి విరుద్ధంగా చేపల ఎగుమతి 40 శాతం వున్న ప్పటికీ వచ్చే ఆదాయం 20 శాతం మాత్రమే. కానీ, రొయ్యలకు వస్తున్న జబ్బులు, ముఖ్యంగా 'వైట్‌స్పాట్‌ సిండ్రోమ్‌ (తెల్లమచ్చల వైరస్‌)' రొయ్యల పెంపకాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి రాగల అవకాశం 49 శాతం మేర వుంది. ''లూమినియస్‌ బ్యాక్టీరియల్‌'' వ్యాధుల వల్ల కూడా నష్టాలు అధికంగా వున్నాయి. ఇదే సమయంలో తగ్గిపోతున్న ధరలు 'టైగర్‌ రొయ్యల' పెంపకందార్లను నష్టపరిచాయి. ఫలితంగా వీటి పెంపకం మన రాష్ట్రంలో 60 వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిలిపేయడం జరిగింది. దీనికి బదులుగా కొత్తరకం 'వెన్నామి' రొయ్యల్ని ప్రవేశపెట్టారు. ఇపుడు ఈ రకం రొయ్యలను దాదాపు 34 వేల హెక్టార్లలో పెంచుతున్నారు.
రొయ్యల పెంపకంలో మేత ఖర్చు అధికంగా వుంటుంది. దీనిలో 'ఫిష్‌మీల్‌ (చేపల తో తయారయ్యే రొయ్యల మేత)' ఖరీదైంది. ఫిష్‌మీల్‌కు బదులు వృక్ష సంబంధమైన మాంసకృత్తులు వాడి ఆమేర ఖర్చును తగ్గిస్తున్నారు. చేపల, రొయ్యల ఎగుమతి కోసం ఒక రకం మీదే ఆధార పడకుండా కొత్తరకాల్ని ప్రవేశపెడుతూ ఇబ్బందుల్ని అధిగమిస్తున్నారు. ఇలా వచ్చిందే 'వెన్నామి' రొయ్య రకం. దీనితో పాటు పీతల్నీ, 'ఫిన్‌ఫిష్‌', 'సీబాస్‌'లను పెంచుతున్నారు. వీటి గుడ్లను, పిల్లలను నియంత్రిత వాతావరణంలో తేలిగ్గా ఉత్పత్తి చేయవచ్చు.
మానవ వనరులు.. ఆదాయం..
ఆక్వా కల్చర్‌ 90% చిన్నకమతాల్లోనే అవుతోంది. దీనిమీదే దాదాపు మూడుకోట్ల మంది జీవిస్తున్నారు. వీరు పేదలు. వీరు పెట్టుబడి, ఉత్పత్తికి, మార్కెటింగ్‌కి ఇబ్బం దులుపడుతున్నారు. వీటిని అధిగమించడానికి సామూహిక పెంపకాన్ని (గ్రూపు ఫామింగ్‌) ప్రోత్సహిస్తున్నారు. వీళ్లకు అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు, ఉత్పత్తి అమ్మకాలకు సమిష్టి సౌకర్యాల్ని కలగజేస్తున్నారు. ఈ విధమైన పెంపకాన్ని తమిళ నాడు, కేరళ, మన రాష్ట్రంలోనూ ఎన్‌బిడిఎఫ్‌ (నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఫిషరీ డెవలప్‌ మెంట్‌) సమన్వయం చేస్తుంది. ఉత్పత్తిని శుద్ధి చేయడానికి, అమ్మకానికి, కావల్సిన మౌలిక సౌకర్యాల్ని ఏర్పర్చడానికి ఈ బోర్డు సహాయం చేస్తుంది. ఇటీవల వినిమయ దారుడు చెల్లించే ధరలో ఉత్పత్తిదారుల వాటా క్రమంగా పెరుగుతుంది. ఇది సానుకూలాంశం.
చేపల ఉత్పత్తిలో కంటే శుద్ధి కార్యక్రమాల్లో ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి. కేవలం రొయ్యల పెంపకంలో 14 లక్షల కుటుంబాలకి ఉపాధి లభిస్తుంది. ఈ చేపల, రొయ్యల పెంపకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కానీ, మత్స్యకారుల జీవన స్థాయిలో మాత్రం ఎటువంటి మార్పూ రావడం లేదు. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ మత్స్యకారుల దగ్గర నైపుణ్యం పెరగకపోవడమే. పైగా వీరి వద్ద అవసరమైన వనరులు, ఉత్పత్తి సాధనాలు కూడా లేవు. మత్స్యకార సంఘాలు ఏర్పర్చినప్పటికీ ఇవి స్వార్థపరశక్తుల ఆధీనంలోనే పనిచేస్తున్నాయి. ఫలితంగా, చేపల వల్ల వచ్చే ఆదాయంలో మత్స్యకారులకు రావాల్సిన న్యాయమైన వాటా రావడం లేదు.

పోషక విలువలు..
చేపలు ఉత్తమపోషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనో యాసిడ్లు లభిస్తాయి.
చేపల రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి.
సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు, ఎముకల పెరుగుదలకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, విని యోగానికి విటమిన్‌ డి అవసరం. థయామిన్‌, నియోసిన్‌, రిబోఫ్లేమిన్‌ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్‌ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా వినియోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని (పరికెలు) ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌లు అధికంగా లభిస్తున్నాయి. కానీ, ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్‌ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్‌ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్‌ అత్యవసర ఎంజైమ్‌ల ఉత్పత్తికి, నిరోధకశక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం.

ఆంధ్రప్రదేశ్‌లో..
మన రాష్ట్రం చేపల ఉత్పత్తిలో ప్రథమ లేక ద్వితీయ స్థాయిలో కొనసాగుతుంది. 2010-11లో దాదాపు 14.5 లక్షల టన్నుల చేపలు-రొయ్యల ఉత్పత్తి అయిందని అంచనా. డెల్టా ప్రాంతంలో సాంద్ర చేపల పెంపకం ఈ అధికోత్పత్తికి తోడ్పడింది. దాదాపు 20 లక్షల మంది మత్స్యకారులకు, కార్మికులకు చేపల పెంపకమే జీవనాధారం.
మంచినీటి చేపలు, రొయ్యలు పెంచడానికి ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 2010 అంతానికి 64,545 ఎకరాల్లో చేపల పెంపకానికి రిజిష్టర్‌ చేయబడింది. చేపల సహకార సంఘాలకు సబ్సిడీతో చేప పిల్లల సరఫరా, ఇతర ప్రోత్సాహకాల ద్వారా అధికోత్పత్తి సాధ్యమైంది.
ఏప్రిల్‌-మే మాసాలలో సముద్ర చేపల పట్టడానికి నిషేధించిన సమయంలో ఉచిత ఆహార ధాన్యాలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మహిళా మత్స్య మిత్ర గ్రూపుల్లో దాదాపు 18వేల మత్స్యకార్మిక మహిళలు సభ్యులుగా ఉన్నారు.

మీకు తెలుసా..?
- అతి తక్కువ ఆహారాన్ని వినియోగిస్తూ చేపలు పెరుగుతాయి. మురుగునీరు, బురదలో కూడా పెరుగుతాయి.
- ప్రతి కిలో బరువు పెరుగుదలకు చేప కేవలం 1.1 కిలోల ఆహారాన్ని తీసుకుంటుంది. ఇదే మాంసం ఉత్పత్తికి కోడి 2.5 కిలోల ఆహారం అవసరం.
- నీటిలో నిలిచి వుంటూ నీటి ఉష్ణోగ్రతకు దగ్గరగా శరీర ఉష్ణోగ్రత ఉండడంతో చేపలు తక్కువ ఆహారంతోటే పెరుగుతాయి. ఇదే కోళ్ల విషయంలో అవి నిలుచుని, తిరుగుతూ శరీర ఉష్ణోగ్రతను పరిమితం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పెరుగుదలకు ఎక్కువ ఆహారాన్ని కోళ్లు తీసుకుంటాయి.
- తీర ప్రాంత అభివృద్ధి మండళ్ల పేరుతో పరిశ్రమలకు, ఓడరేవుల నిర్మాణానికి అనుమతులిస్తున్నారు. ఇది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తుంది. వీరు మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నెల్లూరు ప్రాంతంలో ఒకేచోట 27 థర్మల్‌ కేంద్రాల ఏర్పాటుకు అనుమతిచ్చారు. వీటివలన ఈ ప్రాంత జీవావరణం దెబ్బతింటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిశ్రమలు వ్యర్థాలను, వేడి నీటిని సముద్రంలోకి వదులుతాయి. దీనివల్ల సముద్ర జీవవైవిధ్యం దెబ్బతింటుంది. అంతిమంగా ఇవన్నీ కూడా చేపల ఉత్పత్తిని తగ్గిస్తాయి.
- 'కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ'- ఇది తీరప్రాంతంలో చేపల పెంపకాన్ని నియంత్రిస్తుంది.
- 'ఎంపెడా'- సాధికార సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ).
- 'సీబా'- ఉప్పునీటి చేపల, రొయ్యల పెంపక పరిశోధనా సంస్థ (సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ బ్రాకిష్‌ వాటర్‌ ఆక్వా కల్చర్‌).