Thursday, 1 November 2012

చెట్ల మందులతో లింగ మార్పిడి సాధ్యమా?


ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
నాకు తెలిసిన ఒక రిటైర్డ్‌ ఉపాధ్యాయుని కుమార్తె ప్రభుత్వ డాక్టరు. ఆమెకు ఆడపిల్లలే సంతానంగా ఉన్న కారణంగా భర్త విడాకులిస్తానని బెదిరించాడు. తప్పక 'మగ సంతానం' కావాలని వేధించాడు. ఆమె డాక్టరైనా, ప్రచారంలో వున్న చెట్ల మందులు వాడి (గర్భిణీగా వున్న సమయంలో) నందున మగ సంతానం పొందినట్లు నా స్నేహితుడు చెప్పాడు. అక్కడక్కడ ఇలాంటి ప్రచారమే ఉంది. శాస్త్రీయంగా పురుష క్రోమోజోములే ఆడ లేక మగ శిశువు జననానికి కారణమైతే.. చెట్ల మందుల వాడకంతో వైద్యపరంగా శిశువు లైంగికతను ఇష్టమైనరీతిలో మార్చే అవకాశం ఉంటుందా? దయచేసి వివరించండి.
- కృష్ణయ్య, కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌జిల్లా
ఈ ప్రశ్నకు సమాధానమివ్వాలంటే వైజ్ఞానికపుటంశాలతో పాటు సామాజికపుటంశాల్ని స్పృశించాలి.
మొదటి విషయం:
ఆడవాళ్లకు ఆశించినంతమేరకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం వల్ల ప్రతి పురుష దురంహంకారీ తన భార్యను విడాకుల పేరుతో చీటికీ మాటికీ బెదిరిస్తుంటాడు. ఏమాత్రం ఎదురుతిరిగినా భౌతికదాడులు చేస్తారు. సామాజిక మార్పును కోరే శక్తులతో జతకలిసి పనిచేసిననాడే ఈ దురవస్థకు మనం చరమగీతం పాడగలం. అందుకోసం మహిళలు ఐక్యం కావాలి.
రెండో విషయం:
ఆమె డాక్టరైనా ఆమెకు శాస్త్రీయ దృక్పథం కొరవడడం వల్ల, కొంతమేరకు మూఢనమ్మకంలో ఉండడం వల్ల ఆవిధంగా చెట్లమందులు వాడితే తనకు మగసంతానం కలుగుతుందని నమ్మి, వాటిని సేవించింది. ఇలాంటి మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్న జన విజ్ఞానవేదిక వంటి సంస్థల్లో పనిచేయడమే ఈ సమస్యకు పరిష్కారం.
ఇక మూడవది:
ఓ శిశువు, ఆడనా లేక మగనా నిర్దేశించేది కేవలం పురుషుడు మాత్రమే. ఆడైనా మగైనా ప్రతి మనిషి కణంలోని కేంద్రకంలో 23 జతల (pairs)క్రోమోజోములుంటాయి. అందులో ఓ జత ఆ వ్యక్తి లైంగికత (sex) ను నిర్ధారిస్తుంది. అందులో ఉన్న జత రెండూ ఒకేవిధమైనవి అయితే ఆడ అనీ, వేర్వేరు అయితే మగ అనీ అంటారు. ఆడవారిలో ఉన్న సెక్స్‌ నిర్దేశిత క్రోమో జోము పేలికను X అనడం వల్ల ఆడవారిలో XX తరహా సెక్స్‌ క్రోమోజోము ఉంది. మగవారిలో ఉన్న జతను XY అంటాము. ఆ ఆడమనిషి యుక్త వయస్సులో ఉన్నపుడు తన అండకోశం (overies) లోని మామూలు XXకణం రెండు వేర్వేరు విడివిడి‘X’ లుగా ఉన్న బీజకణాల్ని ఇస్తుంది. ఇందులో ఒకటి మాత్రమే నిలుస్తుంది. అది ఆడవారి గర్భకోశానికి అంటుకొని ఉన్న అండనాళం (fallopian tube) లోకి జారుకుంటుంది. అదేవిధంగా మగ వారిలో వృషణం (testis) XY జీవకణం X ఉన్న బీజకణంగాను,Yఉన్న బీజకణంగానూ విడుదలవుతాయి. వీటినే శుక్రణాలు (sperm) అంటారు. అది సజీవంగా ఉన్న సమయంలో ఆమె తన భర్తతో కలిసినపుడు భర్త నుంచి విడుదలైన లక్షలాది X శుక్రకణాలు,Y శుక్రకణాలు ఆమో యోని (vagina) ద్వారా గర్భకోశం దాటు కొని అండనాళాల్లో ఎదురుచూస్తున్న (X క్రోమోజో ములు గల) అండాన్ని ఆశ్రయిస్తాయి. అందులో ఒకటి మాత్రమే అండంలోనికి వెళ్‘X’శ్ణతో కలిసి జతకూడిన సంయుక్తకణాన్ని (Zygote) ఇస్తుంది. శుక్రంలో X బీజకణాలు,Y బీజకణాలు లక్షలాది గాను, సమానంగాను, దాదాపు ఒకేవిధమైన చలాకీ గాను ఉండడం వల్ల స్త్రీ బీజకణంలోకి వెళ్లే శుక్రకణం‘X’ కావచ్చు లేదా‘Y’కూడా కావచ్చు. ఈ రెంటికీ సమాన సంభావ్యత (Probability) ఉంది. వీటి కలయికే శిశువు లింగనిర్ధారణను చేస్తుంది. X X తరహా సంయుక్తకణం స్త్రీశిశువుగాను, XY తరహా సంయుక్త కణం పురుషశిశువుగాను అభివృద్ధి చెందుతారు. ఓ నాణేన్ని పైకి గిరాటేసి నపుడు అది 'బొమ్మ' పడ్డానికి, లేదా 'బొరుసు' పడ్డానికి సమాన అవకాశం ఉంది. ఇలా అప్రక్రటితంగా, కాకతాళీ యంగా జరిగే సంఘటనలను స్వతంత్ర మైన అనియంత్రిత ఘటనలు (independent and discrete acts)అంటారు. కాబట్టి X తో పురుష X శుక్ర కణం లేదాY శుక్రకణం ఏదైనా సమా న స్వతంత్రతో కలుస్తాయి. అయితే ఒకటే కలుస్తుంది. ఫలితంగా లైంగికత ఆవిధంగా నిర్దేశించబడుతుంది. అయితే ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. తన X కలుస్తుందా లేదా Y కలుస్తుందా అన్న నియంత్రణ పురుషుడు తన ఇష్టానుసారం నిర్ణయించడు.
ఇక నాల్గవది అతి ముఖ్యమైనది..
ఆడపిల్లలే సంతానంగా ఉంటే ఏమిటి బాధ? వారెందుకు సంతానంగా ఉండకూడదు. మా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడికి ముగ్గురు ఆడపిల్లలు. మరో ఇద్దరు రాష్ట్ర ఉపాధ్యక్షులకూ ఇద్దరేసి ఆడపిల్లలు. కొందరికి ఉన్నది ఒక బిడ్డే అయినా ఆమె ఆడబిడ్డ. ఆడపిల్లలు దేశానికి గర్వకారణం. మా ఆడపిల్లలు మాకు గర్వకారణం. ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికి చెప్పే పుక్కిటి నినాదాలు కావు. సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, ఆర్థికవేత్తలు సశాస్త్రీయంగా ఓ విషయం తేటతెల్లం చేశారు. ఈ సజీవ ఆధునిక ప్రపంచం లో జరుగుతున్న అభివృద్ధిలోను, చైతన్య అస్తిత్వంలోను ఇమిడి వున్న మానవ శ్రమలో 70 శాతం పైచిలుకు ఆడవారిదేనని వారు ఋజువు చేశారు. కాబట్టి ప్రపంచ రథచక్రాల్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను నడిపిస్తున్న ఆడవారికే మన మానవజాతి సమస్తం ఋణపడి ఉంది. అర్థంలేని చెట్ల మందులతో చేట్లు, తలపోట్లు.. అర్థం వున్న చెట్ల మందులతో సింగారింపులు, నిగారింపు లు రావచ్చేమోగానీ ఆడవారు తిన్నా మగవారు తిన్నా బిడ్డల లైంగికతను ఏ చెట్లూ నిర్దేశించవు. అలా భావించడం మీ స్నేహితుడికున్న అశాస్త్రీయం. ఆయనకు మీరు స్నే.....హితుడిగా హితవు చెప్పండి.

No comments:

Post a Comment