Thursday, 15 November 2012

పటాసులు మెరుపుల్ని, శబ్దాల్ని ఎలా ఇస్తాయి?

  • ఎందుకని? ఇందుకని!
దీపావళి రోజే ఈ ప్రశ్న పంపుతున్నాను. మతాబులు, తారాజువ్వలు, పటాసులు అలా కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపుల్ని, చెవులు గింగురుమనేలా శబ్దాలను ఎలా ఇస్తాయి?
- ఎ. అర్చన, ఫాతిమా బాలికల పాఠశాల, వరంగల్‌
దీపావళి రోజు, పండుగల రోజు, సంబరాలపుడు, క్రీడల ప్రారంభోత్సవాలు, ముగింపు ఉత్సవాల్లో మతాబులు, తారాజువ్వలు, పటాసులు పేల్చడం ఆనవాయితీ. ప్రపంచవ్యాప్తంగా ఈ సంప్రదాయం వివిధ పద్ధతుల్లో, వివిధ చట్ట పరిధుల్లో, వివిధ మోతాదుల్లో కొనసాగుతోంది. బాంబులు (పరమాణు బాంబులు కాదు సుమా!) కాకర పువ్వొత్తులు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, అగ్గిపుల్లలు, చేంతాళ్లు, మిలియన్లు మొదలైన పేర్లతో పిల్చినా మనం మాత్రం కాల్చే ప్రతిదాన్నీ మొత్తంగా 'మతాబులు' అని ఇకపై పిలుద్దాం. ఈ 'మతాబులు' వివిధ తీరుతెన్నులు, పని పద్ధతులు అన్నీ రసాయనిక ప్రక్రియలే (chemical processes). ప్రధానంగా ఇవి రసాయనిక వియోగ (decomposition) ప్రక్రియలు. క్రియాజనకాలు (reactants) ఘనస్థితి (solid stage) లో ఉండగా, క్రియాజన్యాల (products) లో కొన్నయినా వాయుస్థితిలో ఉంటాయి. అంతఃశక్తితో, ఎంతో వత్తిడితో గాలిలో కంపనాలు రావడం వల్ల చెవులు దద్దరిల్లేలా శబ్దాలు వస్తాయి. కాకరపువ్వులు, చేంతాళ్లు బాహాటం (open) గా ఉండడం వల్ల కేవలం మెరుపుల్ని, వేడిని ఇస్తాయిగాని శబ్దాల్ని ఎక్కువగా ఇవ్వవు. చిచ్చుబుడ్లలో పదార్థాల్ని ఒక క్రమపద్ధతిలో పేర్చడం వల్ల పేలకుండా కేవలం జువ్వల్లాగా ఈతచెట్టు శాఖల్లాగా విస్తరిస్తూ బయటపడేలా ఉత్పన్న పదార్థాలు విడుదలవుతాయి. ఇదే చిచ్చుబుడ్డికి శంఖాకారం (cone shape) బదులు స్తూపాకారం (cylindrical) గా చేసి తలకిందులుగా వెలిగిస్తే అది రాకెట్టు (తారాజువ్వ) లాగా న్యూటన్‌ 3వ గమనసూత్రం ఆధారంగా నింగిలోకి ఎగురుతుంది.
పర్‌ క్లోరేట్లు, నైట్రేట్లు, క్లోరేట్లు, అయొడేట్లు, నైట్రైట్లు, థయోసల్ఫేట్లు, సల్ఫోనేట్లు వంటి లవణ పదార్థాలకు తోడుగా వివిధ లోహాల చూర్ణాల్ని (metal powders), బొగ్గు పొడి (charcoal) ని, గంధకపు పొడి (sulfur powder) ని కలిపి మతాబుల్లో పెట్టి వేడిచేసినపుడు (నిప్పు అంటించడం అంటే ఇదే) క్రియాజనకాలు సుంఖల చర్యలో (chine reaction) పాల్గొని విపరీతమైన వేగంతో క్రియాజన్యాల్ని ఇస్తాయి. క్లోరైడులు, అయోడైడ్‌లు, లోహ ఆక్సైడ్‌లతో పాటు నైట్రోజన్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ వంటి వేడి వాయువుల్ని మెరిసే మధ్యస్థ ఉత్తేజ పదార్థాల్ని (reaction intermediates), కాలీకాలని వేడి క్రియాజనకాల రేణువులన్ని వెదజల్లడం వల్ల శబ్ధంతోపాటు, కాంతులు వస్తాయి. పదార్థాల్లో పొటాషియం ఉంటే ఊదారంగు, కోబాల్టు ఉంటే నీలంరంగు, అల్యూమినియం అంటే తెల్లని రంగు, కాల్షియం ఉంటే ముదురు ఎరుపురంగులు వస్తాయి.
ఎంతో ఖరీదైన అరుదైన లోహపు చూర్ణాల్ని, విషపూరితమైన లవణాలను విపరీతంగా వాడటం వల్ల శబ్ద కాలుష్యంతోపాటు వాయు కాలుష్యం ఈ మతాబులను పేల్చడం వల్ల వస్తుంది. మతాబుల్ని పేల్చడం (fireworks) అనే తంతు చాలామటుకు మతసంబంధ కార్యకలాపాలతో ముడిపడి వుండడం వల్ల మతాబులు చేసే వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని తక్కువ చేసి చూపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. పైగా ఈ తంతుకు ఒక కుహనా శాస్త్రీయ సమర్థన (pseudo scientific explanation) ను అంటగడుతున్నారు. మతాబులు పేల్చడం ద్వారా విడుదలయ్యే విషవాయువులతో దోమలు నశిస్తాయనీ, పంటలకు తెగుళ్లు కలిగించే కీటకాలు నశిస్తాయనీ వీరు సమర్థిస్తారు. అదే నిజమైతే వర్షాకాలం ముందరే ఈ పని చేయాలి. ఎందుకంటే ఎండాకాలంలో వాయు కాలుష్యం తొందరిగా సమసిపోతుంది. వర్షాకాలం అనంతరం వచ్చే దీపావళి, దసరా తదితర పర్వదినాల సందర్భంగా గాలిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు, నేల కూడా చెమ్మగా వుంటుంది. ఈ కాలుష్యపు ఫలితాలు కీటకాలతో పాటు మనుషులకు, సాధారణ జీవవైవిధ్యానికి హాని కలిగిస్తాయి.
ప్రతి సంవత్సరం వందలాది మంది బాలకార్మికుల్ని పొట్టన పెట్టుకుంటున్న మతాబుల వెనుక మతలబులు చాలానే ఉన్నాయి. ఆర్భాటాలకు, అహంభావాల ప్రదర్శనకు, ఆబగా ఆర్థిక పేరాశలకు కొలబద్ధలుగా ఉన్న మతాబుల పరిశ్రమల్ని కొన్ని దేశాలు నిషేధించాయి. పరిమిత స్థాయిలో సంబరాలను చాటుకోవడానికి మతాబుల్ని వాడడంలో కొంత సమర్థన ఉందనుకొన్నా 'అతి సర్వత్ర వర్జయేత్‌!'

No comments:

Post a Comment