Monday, 12 May 2014

‘గాంధీ’కి సౌర వెలుగులు

‘గాంధీ’కి సౌర వెలుగులు
 గాంధీ ఆస్పత్రి, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో త్వరలో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇక్కడ చేపట్టిన సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి నెలాఖరులోగా విద్యుత్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. యుద్ధ ప్రాతిపధికన నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత నిర్మాణ సంస్థకు అధికారులు ఆదేశాలు జారీచేశారు.

 ప్రయోగాత్మకం..
 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోలార్ విద్యుత్ వినియోగం అందుబాటులోకి తేవాలని భావించిన ప్రభుత్వం రాష్ట్రంలో తొలిసారి గాంధీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా ప్లాంటు నిర్మాణానికి అంగీకారం తెలిపింది. 500 కేవీ గ్రిడ్ కనెక్టడ్ రూప్‌టాప్ సోలార్ సిస్టం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.3.90 కోట్ల నిధులు కేటాయించింది.

గుజరాత్ లాతూర్‌కు చెందిన ఆదిత్య గ్రీన్ ఎనర్జీ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ఇక్కడి ప్లాంటు విజయవంతమైతే ఉస్మానియా, పేట్లబురుజు, నీలోఫర్ ఆస్పత్రుల్లో కూడా ఇదే తరహాలో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో నెలకు సుమారు లక్ష యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌శాఖకు కోట్లలో బకాయి పడ్డారు. సరఫరాను నిలిపివేస్తామని విద్యుత్‌శాఖ  హెచ్చరించడంతో ఇటీవలే కొంతమొత్తం బకాయిలు చెల్లించారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఆస్పత్రికి విద్యుత్ సమస్య తీరిపోయినట్టే.

 సోలార్ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను మల్టిపుల్ కనెక్టివిటీ ద్వారా సరఫరా చేస్తారు. ఎండలు అధికంగా ఉన్నప్పుడు సౌర విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వర్షాలు పడినా, ఆకాశం మబ్బుపట్టినా ఉత్పత్తి తగ్గుతుంది. ఈ సమయంలో విద్యుత్‌శాఖ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను వినియోగించుకుంటారు. సౌరవిద్యుత్ యూనిట్ ధరను రూ.5.50గా కేంద్రం నిర్ణయించింది. బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌పర్(బీఓటీ) పద్ధతిలో 25 ఏళ్లపాటు నిర్మాణ సంస్థ తీసుకుని తర్వాత ప్రభుత్వానికి అప్పగించేలా ఒప్పందం కుదిరింది.
అమ్మ... అన్ని రోజులూ అమ్మే!
             ''అమ్మ అంటే అంతులేని సొమ్మురా! అది ఏనాడూ తరగని భాగ్యమ్మురా!!' అన్నాడో కవి. అమ్మ అనురాగం గురించి పాటలూ కథనాలూ చాలానే ఉన్నాయి. అమ్మ అనే కమ్మని మాటలో మమతల మూటలకు లెక్కేలేదు. ప్రపంచంలో ఫలితం ఆశించకుండా చూపించే ప్రేమ ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమే. ఓ జీవిని భూమిపైకి తెచ్చే క్రమంలో తను మరో జన్మనెత్తుతుంది. ఆ తర్వాత అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికీ వెనుకాడని హృదయం అమ్మలోనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ భూమిపై అనేక జీవరాశుల్ని పరిశీలించినా మనకు వాటిల్లోనూ తల్లి ప్రేమ మాధుర్యం కనిపిస్తుంది. అంతటి అపరిమితమైనది అమ్మ ప్రేమ. అలాంటి అమ్మ ప్రేమ లేకపోతే మన మనుగడే ప్రశ్నగా మారేది. ఇంత అపూర్వమైన ప్రత్యేకత ఉన్న అమ్మ గురించి ఒకరోజు కేటాయించడం వాణిజ్య దృష్టి అయినా ఈ పండుగ గురించిన కథనాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ కథలోకి వెళితే..
       'మదర్స్‌ డే' అని ఓ ప్రత్యేకరోజు కేటాయించిన చరిత్ర ఈనాటిది కాదు. కొన్ని శతాబ్దాలకు పూర్వమే ఈ 'మదర్స్‌ డే'ను నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయని అంటున్నారు పరిశోధకులు. ఏదేమైనా ఈ 'మదర్స్‌ డే' సంస్కృతి మనది కాదు ఇది విదేశాల నుండి దిగుమతి అయిందే.
చరిత్ర చెప్పేది..
         ముఖ్యంగా గ్రీకులు దేవతలకే అమ్మగా కొలిచే 'రెహ'ను పూజిస్తూ ఉత్సవాలు చేసేవారు. తొలినాళ్ళలో క్రైస్తవులు కూడా ప్రతి నాల్గవ ఆదివారం జీసస్‌ తల్లి మేరీ గౌరవార్థం ఉత్సవాలు చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో ఆరోజును సెలవుదినంగా ప్రకటించడం జరిగింది. క్రమంగా దీన్ని 'మదరింగ్‌ హాలీడే'గా ప్రకటించారు. ఆ తర్వాత కాలంలో ఇంగ్లండ్‌కు చెందిన వలసవాదులు అమెరికాలో స్థిరపడిన తర్వాత తీరుబడిలేని కార్యకలాపాల్లో మునిగిపోయి, ఈ 'మదరింగ్‌ డే' ఆచారానికి స్వస్తి పలికారు. అయితే 1872లో జులియా వార్డ్‌ హౌవె శాంతికి చిహ్నంగా సంవత్సరంలో ఒకరోజును 'మాతృ దినం'గా పాటించడం ప్రారంభించారు. ఇది నేడు 'మదర్స్‌ డే'కి మూలమని చెప్పుకోవచ్చు.
కథనం..
         అన్నా ఎం జార్విస్‌ అనే ఫిలడెల్ఫియాలోని ఓ పాఠశాల టీచర్‌. ఈమె 1890లో తాను నివసిస్తున్న గ్రాఫ్టన్‌ నగరాన్ని వదిలి ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఆమె ఒంటరి పోరాటం ప్రారంభించారు. 1905లో తన తల్లిని ఖననం చేసిన స్మశానవాటికలో తల్లి సమాధి ఎదుటే ''చనిపోయిన లేదా జీవించి ఉన్న మాతృమూర్తుల పట్ల గౌరవంగా ఏడాదిలో ఒక రోజుని 'మదర్స్‌ డే'గా గుర్తింపు తీసుకు వస్తా'' అని అన్నా ప్రతిజ్ఞ చేశారు. ఆ క్రమంలో ఆమె 1907లో తన తల్లి అన్నే మరియా రీవిస్‌ జార్విస్‌ గౌరవార్థం జాతీయ 'తల్లుల దినాన్ని' నిర్వహించాలని ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనికోసం ఆమె తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. మొదట ఆమె బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు రాశారు. అనేక విజ్ఞప్తులు చేశారు. దీంతో ఆమె ఉద్యమానికి ప్రముఖ వర్తకులు, ప్రజాప్రతినిధులు మద్దతు లభించింది. చివరకు 'మదర్స్‌ డే' జరపడానికి ఏడాదిలో ఒక రోజును నిర్ణయించడానికి దారితీసింది. వెస్ట్‌ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి, తమ రాష్ట్రంలో 'మదర్‌ డే' అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ విధంగా చర్చిలో మొట్టమొదట 'మాతృ దినోత్సవం' అన్నా తల్లి గౌరవార్థం జరిగింది. అన్నా కష్టానికి నిజమైన ఫలితం 1914లో లభించింది. దేశాధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ ఏటా మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని 'అమ్మ దినోత్సవం'గా పేర్కొంటూ జాతీయ సెలవుదినంగా ప్రకటించారు.
అన్నా పట్టుదలతో అమల్లోకి వచ్చిన ఈ 'మదర్స్‌ డే' ఉత్తర్వులో ఒక విశేషం దాగి ఉంది. మొత్తం కుటుంబ శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది ఆమె ఆకాంక్ష. ప్రజారంగంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మహిళల్ని మాత్రమే గౌరవించుకునే రోజుగా కాకుండా కేవలం అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా 'మదర్స్‌ డే' జరుపుకోవడమే అందులోని విశిష్టత.
          క్రమంగా 'మాతృ దినోత్సవం' అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రపంచంలోని వివిధ దేశాలు 'మాతృ దినోత్సవాన్ని' వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తున్నాయి. కాకపోతే డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఇటలీ, టర్కీ, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాలు మాత్రం 'తల్లుల దినాన్ని' మేనెలలో వచ్చే రెండో ఆదివారం నాడు జరుపుకునేవి. 19వ శతాబ్దం వచ్చే సరికి 'మదరింగ్‌ సండే'ను జరుపుకోవడం దాదాపు నిలిచిపోయింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో వాణిజ్య సంస్థలు ఈ రోజును అమ్మకాలకు ప్రాధాన్యతను కలిగిన రోజుగా పరిగణించేవారు. ఇక నేటికాలానికి వస్తే 'మాతృ దినోత్సవం' అమెరికా, బ్రిటన్‌, మన భారతదేశం, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఇటలీ, టర్కీ, ఆస్ట్రేలియా, మెక్సికో, కెనడా, చైనా, జపాన్‌, బెల్జియం దేశాల్లో జరుపుకుంటున్నారు. తమ తల్లులపై ఉన్న ప్రేమను ప్రగాఢంగా ప్రకటించే రోజుగా ఈ రోజును జరుపుకోవడం కొనసాగుతోంది.
ఒక్క మాట..
         మార్కెట్‌ శక్తుల మాయాజాలంలో కొట్టుకుపోకుండా అమ్మను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా నిత్యం ప్రేమించండి! అమ్మ అంటే అంతులేని ప్రేమను ప్రకటించండి! అమ్మతో మాట్లాడేందుకు కాసేపు సమయం కేటాయించండి. ఆమెకు ఇష్టమైన రీతిలో నడుచుకోండి. అమ్మ లేని లోటు ఈ లోకంలో ఎవరూ తీర్చలేరు. అందుకే ఈ 'మదర్స్‌ డే' సందర్భంగా మాతృమూర్తులందరికీ వందనం.
వేసవి 'పానీ'యాలు

         
  వేసవిలో శరీరానికి నీరు ఎక్కువ శాతం అవసరం. అందుకే నీటిని ఎక్కువగా తాగడం చాలా మంచిది. ఎక్కువగా నీటినే తీసుకోలేం కాబట్టి వేసవిలో దొరికే పండ్లను తీసుకోవడం ఉత్తమం. కర్బూజ, పుచ్చకాయ, ద్రాక్ష, నారింజ, కొబ్బరి బొండాలు జ్యూస్‌ల రూపంలో తీసుకోవచ్చు. కాని పండ్లను అలాగే తినడం వలన వాటిలో ఉండే పీచు పదార్ధం శరీరానికి ఎంతో మంచిది. కాని దాహాన్ని తీర్చుకోవడానికి ఎక్కువగా ద్రవపదార్ధాల వైపుకే మనసు మళ్ళుతుంది. అందుకే ఆరోగ్యాన్ని అందించే కొన్ని జ్యూస్‌లు ఇవిగో...
పుచ్చకాయ
           వేసవిలో తప్పకుండా తీసుకోవలసిన పండ్లలో పుచ్చకాయ ఒకటి. మనిషికి కావలసిన ఖనిజాలు, పోషకాలు, ఉప్పు, నీరు... ఒక గ్లాసు పుచ్చకాయ రసం ద్వారా అందుతాయి. డీ హైడ్రేషన్‌ను దరిచేరనివ్వదు. శరీరంలో చేరిన వ్యర్ధపదార్ధాలను బయటకు పంపిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి దివ్యౌషధం ఈ పుచ్చకాయ జ్యూస్‌.
పుచ్చకాయ ముక్కలకు జీలకర్ర, చాట్‌ మసాలా పొడులు, చిటికెడు ఉప్పు చేర్చుకొని గ్రైండ్‌ చేసుకోవాలి. చల్లగా తాగాలనుకుంటే ఐస్‌ ముక్కలను చేర్చుకోవచ్చు.
పుదీనా
           పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పుదీనాను తరుచుగా తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. చర్మ సంబంధిత రుగ్మతలకు మంచి మందు పుదీనా. అంతేకాదు, రక్తాన్ని శుద్దిచేసే గుణం పుదీనాలో ఉంది. అందుకే పుదీనా జ్యూస్‌ను తప్పని సరిగా తీసుకోవలసిందే.
పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి, వాటికి బెల్లం, జీలకర్ర పొడి, నల్లఉప్పు, కొన్ని నీళ్ళు చేర్చి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చివరగా నిమ్మరసం, కొన్ని ఐస్‌ క్యూబ్‌లను చేర్చుకోవచ్చు.
బీట్‌రూట్‌
         తరుచుగా నీరసంగా అనిపిస్తుందా... అయితే బీట్‌రూట్‌ జ్యూస్‌ చక్కని పరిష్కారం. విటమిన్‌ బి, సిలు పుష్కలంగా ఉన్న బీట్‌రూట్‌ రక్తపోటును తగిస్తుంది. బీట్‌రూట్‌ రసాన్ని కనీసం రెండు రోజుల కొకసారి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన చక్కెర అంది నీరసాన్ని తగ్గిస్తుంది.
    బీట్‌రూట్‌ జ్యూస్‌కు క్యారెట్‌, ఆపిల్‌లను ముక్కలను కూడా చేర్చుకోవచ్చు. వాటితో పాటు అల్లం, మిరియాల పొడి, ఉప్పు కలుపుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కావాలనుకుంటే ఐస్‌ కలుపుకోవచ్చు. అంతే చల్లచల్లని బీట్‌రూట్‌ జ్యూస్‌ రెడీ.
కర్బూజ
           తియ్యగా, మృదువుగా ఉండే పండు కర్బూజ. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఈ పండు వేసవి తాపానికి చక్కని పరిష్కారం. డీ హైడ్రేషన్‌ను దరిచేరనివ్వదు. ఎండలో ఎక్కువగా తిరిగే వారికి మంచి ఔషదం. రక్తపోటును తగ్గిస్తుంది. పీచు ఎక్కువగా ఉన్న కర్బూజ వేసవిలో వచ్చే నీరసాన్ని తగ్గించి శరీరానికి నూతనోత్సాహాన్ని ఇస్తుంది.
కర్బూజపై తోలును తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఈ ముక్కలను జ్యూసర్‌లో వేసి దానికి తేనె, పంచదార కలిపి బాగా గ్రైండ్‌ చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్‌ను గ్లాసులో పోసి దానికి నిమ్మరసం వేసి బాగా మిక్స్‌ చేసి కొన్ని ఐస్‌క్యూబ్‌లను వేసి తాగితే మెదడు చల్లబడుతుంది.