Monday 12 May 2014

వేసవి 'పానీ'యాలు

         
  వేసవిలో శరీరానికి నీరు ఎక్కువ శాతం అవసరం. అందుకే నీటిని ఎక్కువగా తాగడం చాలా మంచిది. ఎక్కువగా నీటినే తీసుకోలేం కాబట్టి వేసవిలో దొరికే పండ్లను తీసుకోవడం ఉత్తమం. కర్బూజ, పుచ్చకాయ, ద్రాక్ష, నారింజ, కొబ్బరి బొండాలు జ్యూస్‌ల రూపంలో తీసుకోవచ్చు. కాని పండ్లను అలాగే తినడం వలన వాటిలో ఉండే పీచు పదార్ధం శరీరానికి ఎంతో మంచిది. కాని దాహాన్ని తీర్చుకోవడానికి ఎక్కువగా ద్రవపదార్ధాల వైపుకే మనసు మళ్ళుతుంది. అందుకే ఆరోగ్యాన్ని అందించే కొన్ని జ్యూస్‌లు ఇవిగో...
పుచ్చకాయ
           వేసవిలో తప్పకుండా తీసుకోవలసిన పండ్లలో పుచ్చకాయ ఒకటి. మనిషికి కావలసిన ఖనిజాలు, పోషకాలు, ఉప్పు, నీరు... ఒక గ్లాసు పుచ్చకాయ రసం ద్వారా అందుతాయి. డీ హైడ్రేషన్‌ను దరిచేరనివ్వదు. శరీరంలో చేరిన వ్యర్ధపదార్ధాలను బయటకు పంపిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి దివ్యౌషధం ఈ పుచ్చకాయ జ్యూస్‌.
పుచ్చకాయ ముక్కలకు జీలకర్ర, చాట్‌ మసాలా పొడులు, చిటికెడు ఉప్పు చేర్చుకొని గ్రైండ్‌ చేసుకోవాలి. చల్లగా తాగాలనుకుంటే ఐస్‌ ముక్కలను చేర్చుకోవచ్చు.
పుదీనా
           పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పుదీనాను తరుచుగా తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. చర్మ సంబంధిత రుగ్మతలకు మంచి మందు పుదీనా. అంతేకాదు, రక్తాన్ని శుద్దిచేసే గుణం పుదీనాలో ఉంది. అందుకే పుదీనా జ్యూస్‌ను తప్పని సరిగా తీసుకోవలసిందే.
పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి, వాటికి బెల్లం, జీలకర్ర పొడి, నల్లఉప్పు, కొన్ని నీళ్ళు చేర్చి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చివరగా నిమ్మరసం, కొన్ని ఐస్‌ క్యూబ్‌లను చేర్చుకోవచ్చు.
బీట్‌రూట్‌
         తరుచుగా నీరసంగా అనిపిస్తుందా... అయితే బీట్‌రూట్‌ జ్యూస్‌ చక్కని పరిష్కారం. విటమిన్‌ బి, సిలు పుష్కలంగా ఉన్న బీట్‌రూట్‌ రక్తపోటును తగిస్తుంది. బీట్‌రూట్‌ రసాన్ని కనీసం రెండు రోజుల కొకసారి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన చక్కెర అంది నీరసాన్ని తగ్గిస్తుంది.
    బీట్‌రూట్‌ జ్యూస్‌కు క్యారెట్‌, ఆపిల్‌లను ముక్కలను కూడా చేర్చుకోవచ్చు. వాటితో పాటు అల్లం, మిరియాల పొడి, ఉప్పు కలుపుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కావాలనుకుంటే ఐస్‌ కలుపుకోవచ్చు. అంతే చల్లచల్లని బీట్‌రూట్‌ జ్యూస్‌ రెడీ.
కర్బూజ
           తియ్యగా, మృదువుగా ఉండే పండు కర్బూజ. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఈ పండు వేసవి తాపానికి చక్కని పరిష్కారం. డీ హైడ్రేషన్‌ను దరిచేరనివ్వదు. ఎండలో ఎక్కువగా తిరిగే వారికి మంచి ఔషదం. రక్తపోటును తగ్గిస్తుంది. పీచు ఎక్కువగా ఉన్న కర్బూజ వేసవిలో వచ్చే నీరసాన్ని తగ్గించి శరీరానికి నూతనోత్సాహాన్ని ఇస్తుంది.
కర్బూజపై తోలును తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఈ ముక్కలను జ్యూసర్‌లో వేసి దానికి తేనె, పంచదార కలిపి బాగా గ్రైండ్‌ చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్‌ను గ్లాసులో పోసి దానికి నిమ్మరసం వేసి బాగా మిక్స్‌ చేసి కొన్ని ఐస్‌క్యూబ్‌లను వేసి తాగితే మెదడు చల్లబడుతుంది.

No comments:

Post a Comment