Friday 17 October 2014

భారత్‌కు సొంత జిపిఎస్‌ వ్యవస్థ


- అందుకే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ప్రయోగం
- మూడు నావిగేషన్‌ ఉపగ్రహాలు సిద్ధం
- మరో నాలుగింటితో సంపూర్ణం
    ఇప్పుడు గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిష్టమ్‌(జిపిఎస్‌)- ఈ పదం తెలియని వారు లేరు. దారీతెన్ను తెలియని ఎడారిలో వదిలేసినా చేతిలోని సెల్‌ఫోన్‌లో జిపిఎస్‌ వ్యవస్థ ఉంటే చాలు....మన స్వస్థలానికి చేరిపోవచ్చు. అమెరికా ప్రయోగించిన ఉపగ్రహాల సహాయంతో ప్రపంచ దేశాలు జిపిఎస్‌ వ్యవస్థను వినియోగించుకుంటున్నాయి. అయితే భారత ఉప ఖండం కోసమే ప్రత్యేకంగా జిపిఎస్‌ వ్యవస్థను రూపొందించేందుకు నడుం బిగించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్‌ఆర్‌ఓ) - ఇస్రో. అందులో భాగమే బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత, గురువారం తెల్లవారు జామున 1.32 గంటలకు శ్రీహరికోట షార్‌ కేంద్రం నుంచి పిఎస్‌ఎల్‌వి-సి26 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ఉపగ్రహం.
భారత దేశానికి సొంతంగా జిపిఎస్‌ వ్యవస్థను రూపొందించడం కోసం ఇండియన్‌ రీజినల్‌ నావిగేషనల్‌ శాటిలైట్‌ సిష్టం(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)కు శ్రీకారం చుట్టింది. భారత ఉపఖండంపై స్థాన గుర్తింపు, గమనాన్ని సూచించేలా తయారు చేయనున్న ఈ వ్యవస్థ కోసం మొత్తం ఏడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాలను ప్రయోగించాలిని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎ(తొలి నావిగేషన్‌ ఉపగ్రహం) ఉపగ్రహాన్ని 2013 జులై 1న విజయవంతంగా ప్రయోగించారు. పిఎస్‌ఎల్‌వి-సి22 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1బిని పిఎస్‌ఎల్‌వి-సి24 ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఐదు నెలల తేడాతో గురువారం తెల్లవారి జామున మూడో నావిగేషన్‌ ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సిను కక్ష్యలోకి పంపిన ఇస్రో తన సత్తా ఏమిటో ప్రపంచ దేశాలకు చాటింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థ సంపూర్ణం కావాలంటే మరో నాలుగు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టాల్సివుంది. దీన్ని 2015 చివరి నాటికి పూర్తి చేయాలన్నది ఇస్రో లక్ష్యం. ఏడు ఉపగ్రహాలూ కక్ష్యలోకి వెళ్లిపోతే భారత్‌కు సొంత జిపిఎస్‌ వ్యవస్థ తయారవు తుంది. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎ, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1బి ఉపగ్రహాలు సంతృప్తికరంగా పని చేస్తున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎ, భారత నావిగేషన్‌ వ్యవస్థ దేశ సరి హద్దుల నుంచి 1500 కిలోమీటర్ల దాకా కూడా పని చేస్తుంది. ఇప్పుడు పంపుతున్న ఉపగ్రహాల జీవిత కాలం పదేళ్లుగా అంచనా వేసి ప్రయోగిస్తున్నారు. ఈ నావిగేషన్‌ వ్యవస్థ ద్వారా రెండు రకాల సేవలు అందించనున్నారు.
స్టాండర్డ్‌ పొజిషనింగ్‌ సర్వీస్‌ (ఎస్‌పిఎస్‌) దాన్ని ప్రజలందరికీ అందిస్తారు. అంటే ఇది జిపిఎస్‌ సేవలందిస్తుంది. ఇక రిస్ట్రిక్టెడ్‌ సర్వీస్‌ (ఆర్‌ఎస్‌) సేవలను అధీకృత వినియోగదారులకు మాత్రమే అందిస్తారు. ఈ నావిగేషన్‌ వ్యవస్థ నిర్వహణలో కర్ణాటక బైలాలులోని ఇండియన్‌ నావిగేషన్‌ సెంటర్‌ (ఐఎన్‌సి) కీలకంగా వ్యవహరిస్తుంది. అక్కడి నుంచే ఈ ఉపగ్రహాల నియంత్రణ, పర్యవేక్షణ జరుగుతుంది. నావిగేషన్‌ వ్యవస్థ విమానాలు, ఓడల రాకపోకలను తెలుసుకోడానికి ఉపయోగ పడుతుంది. ఉపద్ర వాలు సంభవించినపుడు సహాయక చర్యల్లో ఎస్‌పిఎస్‌ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. ఇంకా వాహన చోదకులు దార్లు తెలుసుకోడా నికి, అవసరమైన సందర్బాల్లో భూమికి సంబంధిం చిన మ్యాపులు రూపొందించడానికి దోహదపడుతుంది. మొబైల్‌ ఫోన్స్‌తో నావిగేషన్‌ వ్యవస్థ అనుసంధానమై ఇప్పటి జిపిఎస్‌లాగా సేవలిందిస్తుంది. నావిగేషన్‌ వ్యవస్థతో బహుముఖ ప్రయోజనాలు ఉండడంతో ఇస్రో దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేసే పనిలో ఉంది.

Curtsey with: PRAJA SEKTHI DAILY 
నిశిరాత్రి నింగిలోకి

- ముచ్చటగా మూడడుగులు
- మిగిలింది నాలుగడుగులే...
- 2015 నాటికి సంపూర్ణ నావిగేషన్‌ సిస్టమ్‌ : ఇస్రో
      నిశిరాత్రి... బుధవారం అర్ధరాత్రి 1.32 నిమిషాల సమయం...దేశం మొత్తం గాఢనిద్రలో ఉన్నవేళ... అక్కడ మాత్రం ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ... కళ్లు చిట్లించి మరీ మరో విజయానికి చేరువవుతున్నామన్న ఆశతో చూస్తున్నారు. వారిలో మొక్కవోని విశ్వాసం కనిపించింది. చిమ్మచీకటి... కడలి అలల శబ్దం తప్ప మరొకటి విన్పించడం లేదు. అర్ధచంద్రాకార జాబిలమ్మ తొంగి చూస్తుండగా అక్కడి మాస్టర్‌ కంట్రోల్‌ రూం నుండి మైనస్‌ 8,7,6,5,4,3,2,1... ప్లస్‌ 1,2,3,4,5,6,7,8 అనగానే ఒక్కసారిగా కారు చీకట్లను చీల్చుకుంటూ పిఎస్‌ఎల్‌వి నింగివైపు దూసుకెళ్లింది. ఆ కాంతిపుంజం వెలుతురుతో అక్కడ అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరి సింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కు నమ్మకమైన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ హెవి కల్‌(పిఎస్‌ఎస్‌వి) ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)1సి ఉపగ్రహా న్ని దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షార్‌లోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ల్యాంచ్‌ ప్యాడ్‌ ఇందుకు వేదికగా నిలి చింది. పిఎస్‌ఎల్‌వి విజయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలి కితురాయి చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పిఎస్‌ఎల్‌విది 28వ ప్రయోగం. ఇప్పటికి 27 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు జరిగితే 26 విజయవంతమయ్యాయి. తొలి ప్రయోగం విఫలమైంది. రెండో ప్రయోగం నుండి విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌తో ఆ సంఖ్య 27కు చేరింది. ఇది శాస్త్ర సాంకేతిక రంగాల్లో సువర్ణక్షారాలతో లిఖించదగిన అంశం. భారత్‌ అవసరాల కోసం మొత్తం ఏడు నావిగేషన్‌ ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంది. మూడో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. 2015 నాటికి పూర్తి నావిగేషన్‌ ఉపగ్రహాల ప్రయోగాలను పూర్తి చేస్తామని ఇస్రో సగర్వంగా ప్రకటించింది.
సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) కేంద్రంగా ఎప్పుడు ప్రయోగం జరిగినా శ్రీహరికోట, సూళ్లూరుపేట ప్రాంతాల ప్రజలు ప్రయోగాన్ని వీక్షించడానికి తహతహలాడేవారు. ఈసారి ఆ అవకాశం లేదు. ఎందుకంటే ప్రయోగానికి అర్ధరాత్రి దాటాక ముహూర్తం నిర్ణయించడమే కారణం. ఇస్రో కుటుంబాలు, పిఎం కార్యాలయం మంత్రి జితేంద్రసింగ్‌, పాత్రికేయులు ప్రత్యక్ష సాక్షులుగా అర్ధరాత్రి 1.32 నిమిషాల సమయంలో పిఎస్‌ఎల్‌వి నింగిలోకి దూసుకెళ్లింది. విరజిమ్ముతున్న నిప్పుల వెలుతురుతో అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన రెండో ప్రయోగం ఇది. సరిగ్గా 1.32 నిమిషా లకు బయలుదేరిన పిఎస్‌ఎల్‌వి నాలుగు దశల్లో లక్ష్యాన్ని చేరింది. 20.20 సెకన్ల సమయంలో భూమికి దగ్గరగా 282.56 కిలోమీటర్లు, దూరంగా 20,670 కిలోమీటర్ల భూస్థిర కక్ష్యలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ఉపగ్రహాన్ని దిగ్విజ యంగా ప్రవేశపెట్టింది. ఇస్రో ఛైర్మన్‌ రాధక్రిష్ణన్‌ ప్రయోగం విజయవంతమై యిందని ప్రకటిం చారు. దాంతో మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు ఒకరినొకరు అలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. ఇప్పటి వరకు ఇస్రో రెండు నావిగేషన్‌ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. బుధవారం అర్ధరాత్రి జరిగింది మూడోది. నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌లో ఏడు ఉపగ్రహాలను ప్రయోగిస్తే దేశీయ అవసరాలకు సరిపోతుంది. కక్ష్యలోకి చేరిన వెంటనే ఉప గ్రహంలోని రెండో సోలార్‌ ప్యానల్స్‌ విచ్చుకున్నాయి. కర్నాటకలోని హసన్‌లోని ఉప గ్రహ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేసుకుంది. దేశంలోని 15 కేంద్రాల్లో ఏర్పాటుచేసిన గ్రౌండ్‌ సేష్టన్లకు అందుబాటులోకి వచ్చింది.
మరో నాలుగడుగులే...!
     భారత్‌ తన సొంత శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్‌ ఉపగ్రహాల   విజయపరంపర కొనసాగుతోంది. మూడు ప్రయోగాలు విజయం సాధించాయి. మరో నాలుగు నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగాలు పూర్తి చేస్తే ప్రస్తుతం దేశ అవసరాలకు సరిపోతుంది. ఇప్పటికే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా నుండి భారత్‌ తీసుకుంటోంది. అందుకోసం పెద్ద మొత్తం ఖర్చు చేస్తోంది. నౌకలు, విమానాలు, కార్లు, ఇతర వాహనాలకు దిక్సూచిగా నావిగేషన్‌ పని చేస్తోంది. మరో 45 రోజుల్లో మరో ప్రయోగం చేపడుతున్నట్లు ఇస్రో పేర్కొంది. 2015 నాటికి దేశ అవసరాలకు కావాల్సిన నావిగేషన్‌ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ ప్రకటించారు. ఈ ప్రయోగాన్ని పిఎం కార్యాలయం మంత్రి జితేంద్రసింగ్‌, ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌, మిషన్‌ డైరెక్టర్‌ కున్నికృష్ణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎంవిఎస్‌ ప్రసాద్‌, శాస్త్రవేత్తలు చంద్రదత్తన్‌, శివరామకృష్ణ పాల్గొన్నారు.
Curtsey with: PRAJA SEKTHI 

Saturday 4 October 2014

గుండె బాగుండాలంటే...

              మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. అది ఆరోగ్యంగా ఉండాలంటే దాని గురించిన అవగాహన ఉండాలి. గుండెకు సంబంధించిన వివిధ సమస్యలకు, గుండె జబ్బుకు తేడా తెలిసి ఉండాలి. ఎందుకంటే కొందరు గుండె దడగా ఉన్నా గుండె జబ్బేమోనని కంగారు పడుతుంటారు. సరైన అవగాహన ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు.
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. నేడు యువకుల్లో కూడా గుండె జబ్బులు రావడానికి ఇదే ప్రధాన కారణం. అందుకే గుండె జబ్బులు వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడం ఉత్తమం. వేటివల్ల గుండెకు ముప్పు ఉంటుందో వాటిని గుర్తించి, తగిన చికిత్స తీసుకోవాలి. జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొవ్వు ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు ఆరోగ్యకరమైనక జీవన విధానం అలవర్చుకోవాలి. ధూమపానం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండె జబ్బులకు ప్రధాన కారణమవుతున్నాయి.
లక్షణాలు
            కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఒక్కోసారి ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే గుండె జబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని కచ్చితంగా చెప్పలేం. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే నిర్ధారణకు రావాలి.
రెగ్యులర్‌ చెకప్‌
           నలభయ్యేళ్లు దాటినవారు రెగ్యులర్‌గా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందే జాగ్రత్తపడవచ్చు. ఇసిజి, 2 డి ఎకో, కొలెస్ట్రాల్‌, టిఎంటి పరీక్షల ద్వారా గుండె పనితీరు, జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి, చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
గుండె జబ్బు ఉంటే
            పరీక్షల్లో గుండె జబ్బు ఉందని తేలినట్లయితే, అప్పుడు మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సమస్య ఎక్కడుంది, ఎన్నిచోట్ల రక్త నాళాల్లో అడ్డంకులున్నాయి తదితర విషయాలు తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్‌ పరీక్ష అవసరం. ఒకటి లేక రెండు బ్లాక్‌లు ఉన్నట్లయితే యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. మూడు, అంతకంటే ఎక్కువబ్లాక్‌లు ఉన్నా, గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం (ఎల్‌ఎంసిఎ)లో సమస్య ఉన్నా బైపాస్‌ సర్జరీ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఔషధ పూరిత స్టెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించినట్లయితే స్టెంట్లల్లో మళ్లీ బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి. స్టెంట్‌లు వేసినా, బైపాస్‌ సర్జరీ జరిగినా మళ్లీ గుండె సమస్య తలెత్తకుండా ఉండటానికి తగిన మందులు వాడటం చాలా అవసరం. కొందరు ఆపరేషన్‌ జరిగింది కదా, ఇక ఏం పర్వాలేదు అని మందులు ఆపేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. రెగ్యులర్‌గా మందులు వాడుతూ, డైట్‌ కంట్రోల్‌ చేయాలి. వ్యాయామం చేయడం మరవద్దు.
జాగ్రత్తలు
         నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ అరగంటపాటు నడవడంవల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. దీంతోపాటు కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం, వేపుళ్లకు దూరంగా ఉండటం అవసరం. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మీ గుండె పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది.
- డా|| జి.సూర్య ప్రకాష్‌,
కార్డియాలజిస్టు, కేర్‌హాస్పటల్‌ ముషిరాబాద్‌, హైదరాబాద్‌
9866822286. 

Courtesy  with: PRAJA SEKTHY DAILY

ఆరోగ్యానికి హాని... అజనమామోటో
                         గతంలో భోజనం చేయడమంటే కేవలం ఇంట్లో వంట చేసుకుని తినడమే. బైటినుంచి పదార్థాలు తెచ్చుకుని తినడమనేది చాలా అరుదుగా జరిగేది. కాని ప్రస్తుతం కాలం మారిపోయింది. ఏ ఇంట్లో చూసినా తినడానికి సిద్ధంగా ఉండే పదార్థాలు (రెడీ టు ఈట్‌) దర్శనమిస్తున్నాయి. అయితే దీనితోపాటు ప్రజల్లో కొంత చైతన్యం కూడా పెరిగింది. గుడ్డిగా ఏదిపడితే అది కొనుక్కుని తినే పరిస్థితిలో ప్రజలు లేరు. తాము తీసుకుంటున్న ఆహార పదార్థాలలో ఏఏ దినుసులు మిళితం చేసి తయారు చేశారనే విషయాన్ని ఆయా ప్యాకెట్ల లేబుల్స్‌పై చూస్తున్నారు. ఈ రకమైన చైతన్యం ఆహార పదార్థాలు రుచిగా ఉండేందుకు అందులో కలిపే అజినామోటోపై విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి.
                అజినామోటో శాస్త్రీయ నామం మోనోసోడియం గ్లూటమేట్‌. ప్యాకెట్లలో లభ్యమయ్యే అనేక రకాల ఆహార పదార్థాలలో దీనిని ఉపయోగిస్తున్నారు. తొలినాళ్లలో కేవలం చైనాకు చెందిన ఆహార పదార్థాలను తయారు చేయడంలో మాత్రమే దీనిని ఉపయోగించేవారు. కాని ప్రస్తుతం అన్ని రకాల ఆహారాల్లోనూ దీనిని వాడుతున్నారు.
               రెడీ టు ఈట్‌ పదార్థాల ప్యాకెట్లపై లేబుల్‌ను నిశితంగా పరిశీలిస్తే అందులో వాడిన దినుసుల జాబితాలో ఖచ్చితంగా అజినామోటో పేరు కూడా కనిపిస్తుంది. నూడుల్స్‌ వంటి పదార్థాల్లోనే కాకుండా చివరకు ఆలు చిప్స్‌ వంటి పదార్థాల్లో కూడా దీని వాడకం కనిపిస్తుంది.
జపాన్‌కు చెందిన అజినామోటో కార్ప్‌ దీనిని తొలిసారిగా 1909లో కనుగొన్నది. ఇది ఆహార పదార్థాలకు మరింత సువాసనాభరితంగా ఉండేట్లు చేస్తుంది. అంతేకాకుండా దీనికి అలవాటుపడేలా చేస్తుంది. అజినామోటో అతి తక్కువ ధరకే లభ్యం కావడమనేది ఆహర పదార్థాలు తయారు చేసే కంపెనీలకు ఒక వరంగా మారింది. దీనిని ఉపయోగించడం వారికి లాభాలను చేకూర్చిపెట్టింది. ప్రస్తుతం దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
అజినామోటో వల్ల కలిగే అనర్థాలను పరిశీలిద్దాం.
                    తలనొప్పి : మోనోసోడియం గ్లూటమేట్‌ ప్రధాన దుష్పరిణామం తలనొప్పి. అయితే ఇది చిన్న సమస్య మాత్రమే. ఈ తలనొప్పి నెమ్మదిగా మైగ్రేన్‌గా రూపాంతం చెంది తరువాత కాలంలో తీవ్ర సమస్యలకు కారణమయ్యే అవకాశాలున్నాయి. తలనొప్పి తీవ్రంగా రావడమే కాకుండా, పదేపదే వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
                నాడీ వ్యవస్థపై ప్రభావం : అజినామోటో వల్ల నాడీ మండల వ్యవస్థ దెబ్బ తింటుంది. నరాలు మొద్దుబారడం, చిటపటమంటున్నట్లు ఉండటం, ముఖంలోనూ, మెడ భాగంలోనూ మంటగా అనిపించడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. మత్తుగా ఉన్న భావన, బలహీనత కనిపిస్తాయి. నరాల క్షీణత కారణంగా సంభవించే పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌, హంటింగ్టన్స్‌, మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌ తదితర వ్యాధులు సోకడానికి అజినామోటో కారణమవుతుంది.
               గుండె జబ్బులు : గుండె కొట్టుకునే క్రమాన్ని అజినా మోటో దెబ్బ తీస్తుంది. ఛాతీ నొప్పి, హఠాత్తుగా గుండె వైఫల్యం చెందడం వంటి సమస్యలకు కారణమవుతుంది.
            మహిళలకు మంచిది కాదు : అజినామోటో వల్ల స్త్రీలలో వంధ్యత్వం కలిగే అవకాశాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గర్భిణీ స్త్రీలు అజినామోటో ఉన్న ఆహారాలను తీసుకోకూడదు. శిశువులకు అజినామోటో ఉన్న ఆహారాలను ఇవ్వకూడదు. ఇటువంటి హెచ్చరికలు ప్యాకెట్లపై ప్రచురించాలని వారు సూచిస్తున్నారు.
             ఇతర సమస్యలు : అధిక రక్తపోటు, ఉదరకోశ సంబంధ రుగ్మతలు, థైరాయిడ్‌ పనితీరు దెబ్బ తినడం, స్థూలకాయం, ఆస్తమా, టైప్‌ 2 మధుమేహం, హార్మోన్లలో అసమతుల్యత, ఆటిజం, ఎలర్జీలు మొదలైన అనేక సమస్యలకు అజినామోటో కూడా కారణమవుతున్నది.
Courtesy with: PRAJA SEKTHY DAILY