Friday 17 October 2014

భారత్‌కు సొంత జిపిఎస్‌ వ్యవస్థ


- అందుకే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ప్రయోగం
- మూడు నావిగేషన్‌ ఉపగ్రహాలు సిద్ధం
- మరో నాలుగింటితో సంపూర్ణం
    ఇప్పుడు గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిష్టమ్‌(జిపిఎస్‌)- ఈ పదం తెలియని వారు లేరు. దారీతెన్ను తెలియని ఎడారిలో వదిలేసినా చేతిలోని సెల్‌ఫోన్‌లో జిపిఎస్‌ వ్యవస్థ ఉంటే చాలు....మన స్వస్థలానికి చేరిపోవచ్చు. అమెరికా ప్రయోగించిన ఉపగ్రహాల సహాయంతో ప్రపంచ దేశాలు జిపిఎస్‌ వ్యవస్థను వినియోగించుకుంటున్నాయి. అయితే భారత ఉప ఖండం కోసమే ప్రత్యేకంగా జిపిఎస్‌ వ్యవస్థను రూపొందించేందుకు నడుం బిగించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్‌ఆర్‌ఓ) - ఇస్రో. అందులో భాగమే బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత, గురువారం తెల్లవారు జామున 1.32 గంటలకు శ్రీహరికోట షార్‌ కేంద్రం నుంచి పిఎస్‌ఎల్‌వి-సి26 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ఉపగ్రహం.
భారత దేశానికి సొంతంగా జిపిఎస్‌ వ్యవస్థను రూపొందించడం కోసం ఇండియన్‌ రీజినల్‌ నావిగేషనల్‌ శాటిలైట్‌ సిష్టం(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)కు శ్రీకారం చుట్టింది. భారత ఉపఖండంపై స్థాన గుర్తింపు, గమనాన్ని సూచించేలా తయారు చేయనున్న ఈ వ్యవస్థ కోసం మొత్తం ఏడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాలను ప్రయోగించాలిని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎ(తొలి నావిగేషన్‌ ఉపగ్రహం) ఉపగ్రహాన్ని 2013 జులై 1న విజయవంతంగా ప్రయోగించారు. పిఎస్‌ఎల్‌వి-సి22 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1బిని పిఎస్‌ఎల్‌వి-సి24 ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఐదు నెలల తేడాతో గురువారం తెల్లవారి జామున మూడో నావిగేషన్‌ ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సిను కక్ష్యలోకి పంపిన ఇస్రో తన సత్తా ఏమిటో ప్రపంచ దేశాలకు చాటింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థ సంపూర్ణం కావాలంటే మరో నాలుగు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టాల్సివుంది. దీన్ని 2015 చివరి నాటికి పూర్తి చేయాలన్నది ఇస్రో లక్ష్యం. ఏడు ఉపగ్రహాలూ కక్ష్యలోకి వెళ్లిపోతే భారత్‌కు సొంత జిపిఎస్‌ వ్యవస్థ తయారవు తుంది. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎ, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1బి ఉపగ్రహాలు సంతృప్తికరంగా పని చేస్తున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎ, భారత నావిగేషన్‌ వ్యవస్థ దేశ సరి హద్దుల నుంచి 1500 కిలోమీటర్ల దాకా కూడా పని చేస్తుంది. ఇప్పుడు పంపుతున్న ఉపగ్రహాల జీవిత కాలం పదేళ్లుగా అంచనా వేసి ప్రయోగిస్తున్నారు. ఈ నావిగేషన్‌ వ్యవస్థ ద్వారా రెండు రకాల సేవలు అందించనున్నారు.
స్టాండర్డ్‌ పొజిషనింగ్‌ సర్వీస్‌ (ఎస్‌పిఎస్‌) దాన్ని ప్రజలందరికీ అందిస్తారు. అంటే ఇది జిపిఎస్‌ సేవలందిస్తుంది. ఇక రిస్ట్రిక్టెడ్‌ సర్వీస్‌ (ఆర్‌ఎస్‌) సేవలను అధీకృత వినియోగదారులకు మాత్రమే అందిస్తారు. ఈ నావిగేషన్‌ వ్యవస్థ నిర్వహణలో కర్ణాటక బైలాలులోని ఇండియన్‌ నావిగేషన్‌ సెంటర్‌ (ఐఎన్‌సి) కీలకంగా వ్యవహరిస్తుంది. అక్కడి నుంచే ఈ ఉపగ్రహాల నియంత్రణ, పర్యవేక్షణ జరుగుతుంది. నావిగేషన్‌ వ్యవస్థ విమానాలు, ఓడల రాకపోకలను తెలుసుకోడానికి ఉపయోగ పడుతుంది. ఉపద్ర వాలు సంభవించినపుడు సహాయక చర్యల్లో ఎస్‌పిఎస్‌ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. ఇంకా వాహన చోదకులు దార్లు తెలుసుకోడా నికి, అవసరమైన సందర్బాల్లో భూమికి సంబంధిం చిన మ్యాపులు రూపొందించడానికి దోహదపడుతుంది. మొబైల్‌ ఫోన్స్‌తో నావిగేషన్‌ వ్యవస్థ అనుసంధానమై ఇప్పటి జిపిఎస్‌లాగా సేవలిందిస్తుంది. నావిగేషన్‌ వ్యవస్థతో బహుముఖ ప్రయోజనాలు ఉండడంతో ఇస్రో దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేసే పనిలో ఉంది.

Curtsey with: PRAJA SEKTHI DAILY 

No comments:

Post a Comment